కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రోమీయులకు రాసిన పత్రికలోని ముఖ్యాంశాలు

రోమీయులకు రాసిన పత్రికలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

రోమీయులకు రాసిన పత్రికలోని ముఖ్యాంశాలు

సా.శ. 56వ సంవత్సరంలో అపొస్తలుడైన పౌలు తన మూడవ మిషనరీ యాత్రలో ఉన్నప్పుడు కొరింథు పట్టణానికి వెళ్లాడు. రోమాలో ఉన్న యూదా క్రైస్తవులకూ యూదేతర క్రైస్తవులకూ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయని ఆయన తెలుసుకున్నాడు. క్రీస్తులో వారిని పూర్తిగా ఏకం చేయాలన్న ఉద్దేశంతో పౌలు ఈ పత్రికను రాసేందుకు చొరవ తీసుకున్నాడు.

రోమీయులకు రాసిన ఆ పత్రికలో, పౌలు మానవులు నీతిమంతులుగా ఎలా తీర్చబడతారనే విషయాన్నే కాకుండా అలాంటివారు ఎలా జీవించాలనే విషయాన్ని కూడా వివరించాడు. ఈ పత్రిక, దేవుని గురించి ఆయన వాక్యం గురించి మనకున్న జ్ఞానాన్ని అధికంచేస్తూ దేవుని కృప గురించి నొక్కి చెబుతుంది. అంతేకాక అది మన రక్షణ విషయంలో క్రీస్తు పాత్రను ఘనపరుస్తుంది.​—⁠హెబ్రీ. 4:⁠12.

ఎలా నీతిమంతులుగా తీర్చబడతారు?

(రోమా. 1:1-11:​36)

“అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు [దేవుని] కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు” అని పౌలు రాశాడు. అంతేకాక “ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు” అని కూడా పౌలు చెప్పాడు. (రోమా. 3:​23, 24, 28) “ఒక్క పుణ్య కార్యము” మీద విశ్వాసం ఉంచడం ద్వారా అటు అభిషిక్త క్రైస్తవులు ఇటు “వేరే గొఱ్ఱెల”కు చెందిన ‘గొప్పసమూహపువారు’ ‘నీతిమంతులుగా తీర్చబడవచ్చు.’ ఆ కారణంగా అభిషిక్త క్రైస్తవులు క్రీస్తుతోటి వారసులుగా పరలోకంలో జీవిస్తారు, గొప్పసమూహపువారు దేవుని స్నేహితులుగా ‘మహాశ్రమలను’ తప్పించుకోగలుగుతారు.​—⁠రోమా. 5:​18; ప్రక. 7:​9, 14; యోహా. 10:​16; యాకో. 2:​21-24; మత్త. 25:​46.

పౌలు “కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదుమా?” అని అడిగాడు. ఆ ప్రశ్నకు, “అదెన్నటికిని కూడదు” అని ఆయనే జవాబిచ్చాడు. “చావునిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు” అని పౌలు వివరించాడు. (రోమా. 6:​15, 16) “ఆత్మచేత శారీరక్రియలను చంపినయెడల జీవించెదరు” అని కూడా ఆయన అన్నాడు.​—⁠రోమా. 8:​13.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​24-32​—⁠ఇక్కడ వర్ణించబడిన నైతిక పతనం యూదులకు అన్వయిస్తుందా లేక అన్యులకు అన్వయిస్తుందా? ఆ వర్ణన రెండు గుంపులకు సరిపోతున్నా పౌలు ప్రాముఖ్యంగా ప్రాచీనకాల మతభ్రష్ట ఇశ్రాయేలీయుల గురించి ప్రస్తావిస్తున్నాడు. వారికి దేవుని న్యాయవిధులు తెలిసినా వారు ‘తమ మనస్సులో దేవునికి చోటియ్యలేదు’ లేదా దేవుని ఖచ్చితమైన జ్ఞానానికి అనుగుణంగా ప్రవర్తించలేదు. అందుకే వారు దోషులు.

3:​24, 25​—⁠విమోచన క్రయధనం చెల్లించబడకముందు అంటే ‘పూర్వము చేయబడిన పాపాలు’ “క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా” ఎలా క్షమించబడవచ్చు? సా.శ. 33లో హింసాకొయ్యపై యేసు మరణించినప్పుడు, ఆదికాండము 3:15లోని మెస్సీయకు సంబంధించిన మొదటి ప్రవచనం నెరవేరింది. (గల. 3:​13, 16) అయితే యెహోవా తాను ఆ ప్రవచనాన్ని చెప్పిన క్షణంలోనే విమోచన క్రయధనం చెల్లించబడినట్లు పరిగణించాడు. ఎందుకంటే ఆయన సంకల్పించింది నెరవేరకుండా ఏదీ ఆపలేదు. యేసుక్రీస్తు భవిష్యత్‌ బలి ఆధారంగా యెహోవా, ఆ వాగ్దానం మీద విశ్వాసముంచిన ఆదాము సంతతి వారి పాపాలను క్షమించగలిగాడు. విమోచన క్రయధనంవల్ల, క్రీస్తుకు పూర్వం మరణించినవారు కూడా పునరుత్థానం చేయబడే అవకాశం ఉంది.​—⁠అపొ. 24:​14, 15.

6:3-5​—⁠క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందడమంటే ఏమిటి, ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందడమంటే ఏమిటి? యెహోవా, క్రీస్తు అనుచరులను పరిశుద్ధాత్మతో అభిషేకించినప్పుడు, వారు సంఘానికి శిరస్సు అయిన యేసుతో ఐక్యమై క్రీస్తు శరీరమైన సంఘంలో సభ్యులౌతారు. (1 కొరిం. 12:​12, 13, 27; కొలొ. 1:​18) దానినే క్రీస్తుయేసులోనికి బాప్తిస్మం పొందడం అని చెప్పవచ్చు. అంతేకాక, అభిషిక్త క్రైస్తవులు త్యాగపూరితమైన జీవితాన్ని గడుపుతూ భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణను త్యజిస్తారు. కాబట్టి వారు “[క్రీస్తు] మరణములోనికి బాప్తిస్మము” పొందారు అని చెప్పవచ్చు. అయితే, వారి మరణానికి విమోచన క్రయధన విలువ లేనప్పటికీ, యేసు మరణంలాగే వారి మరణం కూడా బలి అర్పణే అని చెప్పవచ్చు. వారు చనిపోయి పరలోకానికి పునరుత్థానం చేయబడినప్పుడు క్రీస్తు మరణంలోనికి బాప్తిస్మం పొందడం ముగుస్తుంది.

7:​8-11​—⁠‘పాపం ఆజ్ఞను’ ఎలా ‘హేతువు చేసుకుంది’? పాపమంటే ఏమిటో ప్రజలు తెలుసుకొనేందుకు ధర్మశాస్త్రం సహాయం చేసింది. అలా వారు తాము పాపులమని తెలుసుకోగలిగారు. కాబట్టి తాము అనేకసార్లు పాపం చేశామని వారు గుర్తించారు. అలా గతంలోకన్నా ఇప్పుడు అనేకులు తాము పాపులమని గుర్తిస్తున్నారు. ఆ విధంగా, పాపం ఆజ్ఞను హేతువు చేసుకుందని చెప్పవచ్చు.

మనకు పాఠాలు:

1:​14, 15. రాజ్యసువార్తను ఉత్సాహంతో ప్రకటించడానికి మనకు అనేక కారణాలున్నాయి. ఒక కారణమేమిటంటే, యేసు రక్తంతో కొనబడిన ప్రజలకు మనం ఋణపడివున్నాం, అంతేకాక వారికి ఆధ్యాత్మికంగా సహాయం చేయాల్సిన బాధ్యత కూడా మనకుంది.

1:​18-20. దేవుని అదృశ్య లక్షణాలు సృష్టిలో కనిపిస్తున్నాయి కాబట్టి భక్తిహీనులు, అనీతిమంతులు “నిరుత్తరులై” ఉన్నారు లేదా వారు క్షమార్హులు కాదు.

2:​28; 3:​1, 2; 7:6, 7. పౌలు యూదులకు అవమానకరంగా అనిపించేలా మాట్లాడిన తర్వాత వారిని మెప్పించేలా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తీరు, సున్నితమైన అంశాలను నేర్పుతో నైపుణ్యంతో మాట్లాడే విషయంలో మనకు ఒక మాదిరిగా ఉంది.

3:⁠4. మానవులు దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి చెప్పినప్పుడు, మనం బైబిలు సందేశంపై నమ్మకం ఉంచుతూ, దేవుని చిత్తానికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా “దేవుడు సత్యవంతుడు” అని రుజువుచేస్తాం. రాజ్యప్రకటనా పనిలో, శిష్యులను చేసేపనిలో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా దేవుడు సత్యవంతుడని తెలుసుకోవడానికి ఇతరులకు మనం సహాయం చేయవచ్చు.

4:​9-12. అబ్రాహాము తన 99వ ఏట సున్నతి చేయించుకోవడానికి ఎంతోకాలం ముందే ఆయన విశ్వాసం మూలంగా దేవుడు ఆయనను నీతిమంతునిగా ఎంచాడు. (ఆది. 12:⁠4; 15:⁠6; 16:⁠3; 17:​1, 9, 10) అలా శక్తివంతమైన విధంగా, ఒక వ్యక్తి నీతిమంతునిగా ఎలా ఎంచబడవచ్చో దేవుడు చూపించాడు.

4:18. నిరీక్షణ విశ్వాసంలో ఒక ప్రాముఖ్యమైన భాగం, అంటే మన నిరీక్షణకు ఆధారం విశ్వాసమే.​—⁠హెబ్రీ. 11:⁠1.

5:​18, 19. పౌలు, యేసుకు ఆదాముకు మధ్య ఎలాంటి పోలిక ఉందో హేతుబద్ధంగా తెలియజేయడం ద్వారా ఒక వ్యక్తి ఎలా ‘అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వవచ్చో’ స్పష్టంగా, క్లుప్తంగా వివరించాడు. (మత్త. 20:​28) ఆయన ఉపయోగించిన క్లుప్తమైన హేతుబద్ధమైన చక్కని బోధనా పద్ధతులను మనం అనుకరించాలి.​—⁠1 కొరిం. 4:⁠17.

7:​23. చేతులు, కాళ్లు, నాలుక వంటి అవయవాలు ‘పాపనియమమునకు మనల్ని చెరపట్టి లోబరచుకోగలవు.’ కాబట్టి మనం వాటిని దుర్వినియోగం చేసుకోకుండా జాగ్రత్తపడాలి.

8:​26, 27. మనం దేనికోసం ప్రార్థించాలో తెలియనంతగా కలవరపెట్టే పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ‘ఆత్మ మనకోసం విజ్ఞాపన చేస్తుంది.’ అప్పుడు ‘ప్రార్థన ఆలకించువాడైన’ యెహోవా బైబిల్లో నమోదుచేయబడిన, మనలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్న వారి విన్నపాలను మన విన్నపాలుగా స్వీకరిస్తాడు.​—⁠కీర్త. 65:⁠2.

8:​38, 39. విపత్తులు, దుష్టాత్మలు, మానవ ప్రభుత్వాలు ఏవీ యెహోవా మనల్ని ప్రేమించకుండా ఆపుచేయలేవు, అలాగే అవి మనం ఆయనను ప్రేమించకుండా ఆపుచేయకూడదు.

9:​22-28; 11:1, 5, 17-26. ఇశ్రాయేలు పునఃస్థాపన గురించిన అనేక ప్రవచనాలు అభిషిక్త క్రైస్తవ సంఘం విషయంలో నెరవేరాయి. దానిలోని సభ్యులు “యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలో నుండియు” పిలవ​బడ్డారు.

10:​10, 13, 14. దేవునిపట్ల, పొరుగువారిపట్ల మనకున్న ప్రేమతో పాటు యెహోవాపట్ల, ఆయన వాగ్దానాలపట్ల మనకున్న బలమైన విశ్వాసం, క్రైస్తవ పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనేందుకు మనల్ని ప్రోత్సహించవచ్చు.

11:16-24, 33. ఎంత చక్కని సమతుల్యంతో ‘దేవుడు అనుగ్రహాన్ని కాఠిన్యాన్ని’ కనబరుస్తాడో కదా! అవును, “ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు.”​—⁠ద్వితీ. 32:⁠4.

నీతిమంతులుగా తీర్చబడేలా జీవించడం

(రోమా. 12:1-16:⁠27)

“కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి” అని పౌలు చెప్పాడు. (రోమా. 12:⁠1) “కాబట్టి,” విశ్వాసంవల్ల క్రైస్తవులు నీతిమంతులుగా తీర్చబడతారన్న వాస్తవం దృష్ట్యా, పౌలు తర్వాత చెబుతున్న అంశం, క్రైస్తవులకు తమ విషయంలో, ఇతరుల విషయంలో, ప్రభుత్వ అధికారుల విషయంలో ఉన్న అభిప్రాయాన్ని ప్రభావితం చేయాలి.

‘తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనకూడదు’ అని పౌలు రాశాడు. “మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను” అని ఆయన ప్రోత్సహించాడు. (రోమా. 12:​3, 9) అంతేకాక, “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ వలెను” అని ఆయన చెప్పాడు. (రోమా. 13:⁠1) మనస్సాక్షికి సంబంధించిన విషయాల్లో ‘ఒకరికొకరు తీర్పు తీర్చకూడదని’ ఆయన క్రైస్తవులను ప్రోత్సహించాడు.​—⁠రోమా. 14:​13.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

12:​20​—⁠మనం శత్రువు తలమీద ఎలా ‘నిప్పులు కుప్పగా పోస్తాం’? బైబిలు కాలాల్లో, ముడి ఖనిజాన్ని కొలిమిలో వేసి దానిపైనా క్రిందా నిప్పులు పేర్చేవారు. పైన వేడి పెరిగేకొద్దీ లోహం కరిగి మలినాలు తొలగించబడేవి. అలాగే శత్రువులోని కఠినత్వం కరిగి అతనిలోని మంచి లక్షణాలు బయటపడేలా, అతనిపట్ల దయాపూర్వకంగా ప్రవర్తించడం ద్వారా మనం అతని తలమీద నిప్పులు కుప్పగా పోస్తాం.

12:​21​—⁠మనం ‘మేలు చేత కీడును’ ఎలా ‘జయిస్తూ ఉంటాం’? ఒక విధానం ఏమిటంటే, యెహోవా మనకు అప్పగించిన రాజ్యసువార్త ప్రకటనా పని ఆయన సంతృప్తి మేరకు పూర్తయ్యేంత వరకూ మనం దానిలో ధైర్యంగా కొనసాగడం ద్వారా జయిస్తూ ఉంటాం.​—⁠మార్కు 13:⁠10.

13:​1​—⁠పై అధికారులు ఏ విధంగా ‘దేవునివల్ల నియమించబడ్డారు’? వారు దేవుని అనుమతితో పరిపాలిస్తున్నారు కాబట్టి వారు ‘దేవునివల్ల నియమించబడ్డారు.’ అంతేకాక కొన్ని సందర్భాల్లో, వారు పరిపాలిస్తారని దేవుడు ముందుగానే తెలుసుకున్నాడు. ఆ విషయం అనేకమంది పరిపాలకుల గురించి బైబిల్లో ప్రవచించబడిన దానినిబట్టి స్పష్టమౌతుంది.

మనకు పాఠాలు:

12:​17, 19. మనం స్వయంగా పగతీర్చుకోవడం అంటే న్యాయంగా యెహోవా మాత్రమే చేయవలసింది మనం చేసినట్లౌతుంది. “కీడుకు ప్రతి కీడు” చేయడంవల్ల మనం అహంకార స్వభావాన్ని చూపిస్తున్నట్లే అవుతుంది కదా!

14:​14, 15. మనం మన సహోదరులకు తినడానికి ఇచ్చే ఆహారం మూలంగా తాగడానికి ఇచ్చే పానీయం మూలంగా మనం వారిని బాధపెట్టకూడదు లేక అభ్యంతరపెట్టకూడదు.

14:17. దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండడం, ఒకరు ఏమి తింటారు ఏమి తినరు లేదా ఏమి తాగుతారు ఏమి తాగరు అనే దానిపై ముఖ్యంగా ఆధారపడి ఉండదు. బదులుగా అది నీతి, సమాధానం, ఆనందంపై ఆధారపడి ఉంటుంది.

15:⁠7. సత్యం తెలుసుకోవడానికి యధా​ర్థంగా ప్రయత్నించేవారందరినీ పక్షపాతం లేకుండా సంఘంలోకి ఆహ్వానించాలి, మనం కలుసుకునే వారందరికీ రాజ్య సువార్తను ప్రకటించాలి.

[31వ పేజీలోని చిత్రాలు]

విమోచన క్రయధనం చెల్లించబడకముందు చేయబడిన పాపాలకు యేసు చెల్లించిన విమోచనక్రయధనం వర్తిస్తుందా?