కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అది ఫలిస్తుందో ఇది ఫలిస్తుందో మీకు తెలీదు!

అది ఫలిస్తుందో ఇది ఫలిస్తుందో మీకు తెలీదు!

అది ఫలిస్తుందో ఇది ఫలిస్తుందో మీకు తెలీదు!

“ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో . . . నీవెరుగవు.”​—⁠ప్రసం. 11:6.

రైతుకు ఓపిక ఉండాలి. (యాకో. 5:7) ఆయన విత్తనాలు విత్తిన తర్వాత అవి మొలకెత్తి పెరగడానికి ఓపిగ్గా ఎదురుచూడాలి. పరిస్థితులు అనుకూలంగా ఉంటే అవి మెల్లగా భూమిలోనుండి మొలకల రూపంలో బయటికి వస్తాయి. ఆ తర్వాత అవి మొక్కలుగా పెరిగి వెన్నులు వేస్తాయి. కొంతకాలానికి పొలం కోతకు సిద్ధమౌతుంది. అలా అద్భుతమైన రీతిలో విత్తనాలు పెరిగి మొక్కలుగా మారడాన్ని చూసినప్పుడు మనమెంత ఆశ్చర్యపోతాం! అంతేకాక, ఆ మొక్కలు పెరిగేలా చేసిన వ్యక్తి ఎవరో గుర్తించినప్పుడు ఆయన ముందు మన స్థానమేమిటో గ్రహించగలుగుతాం. మనం వాటికి క్రమంగా నీళ్లు పోస్తూ అవి చక్కగా పెరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోగలం కానీ వాటిని పెరిగేలా చేసేది మాత్రం దేవుడే.​—⁠1 కొరింథీయులు 3:6 పోల్చండి.

2 ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించబడినట్లుగా, యేసు రాజ్య ప్రకటనా పనిని రైతు విత్తనాలు విత్తడంతో పోల్చాడు. వివిధ రకాల నేలల గురించిన ఉపమానంలో, విత్తువాడు మంచి విత్తనాన్నే విత్తినా అది మొక్కగా పెరుగుతుందా లేదా అనేది వినే వ్యక్తి హృదయ స్థితినిబట్టి ఉంటుందని యేసు బోధించాడు. (మార్కు 4:3-9) విత్తువాడు నిద్రపోవడం గురించిన ఉపమానంలో, మొక్క ఎలా పెరుగుతుందో విత్తువానికి తెలియదనే విషయాన్ని బోధించాడు. ఎందుకంటే, మానవుల ప్రయత్నాలవల్ల అవి పెరగవుగాని దేవుని శక్తివల్లే అవి పెరుగుతాయి. (మార్కు 4:26-29) ఇప్పుడు మనం ఆవగింజ, పుల్లని పిండి, వల గురించి యేసు చెప్పిన మరో మూడు ఉపమానాలను పరిశీలిద్దాం. *

ఆవగింజ ఉపమానం

3 మార్కు సువార్త 4వ అధ్యాయంలోనే రాయబడిన ఆవగింజ ఉపమానంలో రెండు విషయాలు తెలియజేయబడ్డాయి. ఒకటి, రాజ్య సందేశాన్ని వినేవారి సంఖ్య ఎంతగానో పెరుగుతుందనే విషయం. రెండవది, ఆ సందేశాన్ని అంగీకరించేవారు సంరక్షించబడతారనే విషయం. యేసు ఇలా అన్నాడు: “దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? అది ఆవ​గింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమిమీదనున్న విత్తనములన్నిటికంటె చిన్నదే గాని, విత్తబడిన తరువాత అది మొలిచి యెదిగి కూర మొక్కలన్నిటికంటె పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు.”​—⁠మార్కు 4:30-32.

4 ‘దేవుని రాజ్యానికి’ సంబంధించిన అభివృద్ధి ఈ ఉపమానంలో వర్ణించబడింది. సా.శ. 33 పెంతెకొస్తు నుండి రాజ్య సందేశం అన్నిచోట్లా ప్రకటించబడడాన్నిబట్టి, క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందడాన్నిబట్టి ఆ మాటలు నెరవేరాయని తెలుస్తోంది. చిన్నగా ఉండే ఆవగింజను అతి చిన్నవాటిని సూచించడానికి ఉపయోగించవచ్చు. (లూకా 17:6 పోల్చండి.) అయితే, కొన్ని ఆవాల మొక్కలు బలమైన కొమ్మలతో 3-5 మీటర్ల ఎత్తు పెరగగలవు కాబట్టి వాటిని దాదాపు చెట్లుగానే పరిగణించవచ్చు.​—⁠మత్త. 13:31, 32.

5 సా.శ. 33లో దాదాపు 120 మంది శిష్యులు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు క్రైస్తవ సంఘం ప్రారంభించబడింది. అప్పట్లో అభివృద్ధి కొద్దిగానే ఉంది. అయితే, అనతికాలంలోనే ఈ సంఘంలో వేలాదిమంది విశ్వాసులు వచ్చి చేరారు. (అపొస్తలుల కార్యములు 2:41; 4:4; 5:28; 6:7; 12:24; 19:20 చదవండి.) మూడు దశాబ్దాల్లో కోత కోసేవారి సంఖ్య ఎంతగా పెరిగిందంటే, అపొస్తలుడైన పౌలు కొలస్సయిలోని సంఘానికి, సువార్త ‘ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి’ ప్రకటింప​బడింది అని రాయగలిగాడు. (కొలొ. 1:23) అది ఎంత అద్భుతమైన అభివృద్ధి!

6 పరలోకంలో దేవుని రాజ్యం 1914లో స్థాపించబడినప్పటి నుండి ఆవగింజ “చెట్టు” కొమ్మలు అనుకున్నదానికన్నా ఎక్కువగా విస్తరించాయి. యెషయా రాసిన ఈ ప్రవచనం అక్షరాలా నెరవేరడాన్ని దేవుని ప్రజలు చూశారు: “ఒంటరియైనవాడు వేయి​మందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును.” (యెష. 60:22) 20వ శతాబ్దపు ఆరంభంలో రాజ్య ప్రకటనా పనిని చేసిన అభిషిక్తుల చిన్న గుంపు, 2008కల్లా దాదాపు 230 దేశాల్లో సుమారు 70 లక్షలమంది ఆ పనిలో పాల్గొంటారని ఊహించ​లేదు. యేసు ఉపమానంలోని ఆవగింజ పెరిగినట్లే సంఘం ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందింది!

7 కానీ అభివృద్ధి అంతటితో ఆగిపోతుందా? లేదు. చివరకు భూమ్మీద ఉండే ప్రతీ ఒక్కరూ దేవుని రాజ్యానికి లోబడతారు. ఎందుకంటే, అప్పటికల్లా రాజ్యాన్ని వ్యతిరేకించేవారందరూ నాశనం చేయబడతారు. అది మానవ ప్రయత్నాలవల్ల కాదుగానీ సర్వాధిపతియైన యెహోవా భూవ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల జరుగుతుంది. (దానియేలు 2:34, 35 చదవండి.) అప్పుడు మనం యెషయా రాసిన మరో ప్రవచనం నెరవేరడాన్ని చూస్తాం: “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి యుండును.”​—⁠యెష. 11:9.

8 ఆ రాజ్యపు కొమ్మల నీడలో ఆకాశ పక్షులు నివసించ​గలుగుతాయని యేసు చెప్పాడు. వివిధ రకాల నేలలపై విత్తనాలు చల్లిన విత్తువాని ఉపమానంలోని పక్షుల్లా ఈ పక్షులు మంచి విత్తనాలను తినేసే రాజ్య శత్రువులను సూచించడం లేదు. (మార్కు 4:4) అయితే ఈ ఉపమానంలోని పక్షులు క్రైస్తవ సంఘంలో ఆశ్రయం పొందాలని కోరుకునే యథార్థ హృదయులను సూచిస్తున్నాయి. నేడు కూడా వీరు ఆధ్యాత్మికంగా హాని కలిగించే ఈ దుష్ట లోకపు అలవాట్లనుండి, అపవిత్ర ఆచారాలనుండి సంరక్షించబడుతున్నారు. (యెషయా 32:1, 2 పోల్చండి.) అలాగే యెహోవా మెస్సీయ రాజ్యాన్ని చెట్టుతో పోలుస్తూ ప్రవచనార్థకంగా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేశములోని యెత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్ఠమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులును దానిలో గూళ్లు కట్టుకొనును. దాని కొమ్మల నీడను అవి దాగును.”​—⁠యెహె. 17:23, 24.

పుల్లని పిండి ఉపమానం

9 అన్ని సందర్భాల్లోనూ అభివృద్ధి మానవులకు పైకి కనిపించదు. యేసు తర్వాతి ఉపమానంలో ఆ విషయాన్నే నొక్కిచెప్పాడు. ఆయనిలా అన్నాడు: “పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.” (మత్త. 13:33) పుల్లని పిండి దేనికి సూచనగా ఉంది? పుల్లని పిండికీ రాజ్య అభివృద్ధికీ మధ్య ఉన్న సంబంధమేమిటి?

10 బైబిల్లో పులిసిన పిండి సాధారణంగా పాపాన్ని సూచించడానికి ఉపయోగించబడింది. ప్రాచీన కొరింథు సంఘంలో ఒక పాపి చూపించిన చెడు ప్రభావాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అపొస్తలుడైన పౌలు పాపాన్ని పులిసిన పిండితో పోల్చాడు. (1 కొరిం. 5:6-8) మరి యేసు ఈ ఉపమానంలో చెడు విషయాన్ని సూచించడానికి పుల్లని పిండిని ప్రస్తావించాడా?

11 ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు మనం మూడు ప్రాముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ముందుగా, యెహోవా దేవుడు పస్కా పండుగ సమయంలో పులిసిన పిండితో చేసినవేవీ అర్పించకూడదని చెప్పినా ఇతర సమయాల్లో పులిసిన పిండి ఉన్న అర్పణలను అంగీకరించేవాడు. యెహోవా తనను మెండుగా ఆశీర్వదించినందుకు కృతజ్ఞతతో ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా కృతజ్ఞతార్పణా సమాధాన బలుల అర్పించడానికి పులిసిన పిండిని ఉపయోగించేవాడు. ఆ అర్పణలో భాగం వహించినందుకు అందరూ సంతోషించేవారు.​—⁠లేవీ. 7:11-15.

12 రెండవదిగా, లేఖనాల్లో ఒకదాన్ని ఒకానొక సందర్భంలో చెడు విషయాన్ని సూచించడానికి ఉపయోగిస్తే మరో సందర్భంలో దాన్నే మంచి విషయాన్ని సూచించడానికి ఉపయోగించివుండవచ్చు. ఉదాహరణకు, సాతాను సింహంలాగే ప్రమాదకరమైనవాడు, క్రూరుడు కాబట్టి 1 పేతురు 5:8లో సింహంతో పోల్చబడ్డాడు. అయితే, సింహం ధైర్యంగా న్యాయతీర్పు తీర్చడానికి ప్రతీకగా ఉపయోగించబడుతుంది కాబట్టి ప్రకటన 5:5లో యేసు “యూదాగోత్రపు సింహము” అని పిలువబడ్డాడు.

13 మూడవదిగా, యేసు తన ఉపమానంలో పుల్లని పిండి ముద్దనంతా పనికిరాకుండా చేసిందని చెప్పలేదు. సాధారణంగా రొట్టెలను ఎలా తయారుచేస్తారో ఆయన వివరించాడంతే. స్త్రీ కావాలనే ముద్దలో పుల్లని పిండిని కలిపింది, దానివల్ల మంచే జరిగింది. ఆ పుల్లని పిండి ముద్దలో దాచిపెట్టబడింది. కాబట్టి ఆ ముద్ద మొత్తం ఎలా పులిసిందో ఆమెకు తెలీదు. ఇది చదివినప్పుడు మనకు, విత్తనాలు చల్లి రాత్రులు నిద్రపోయిన వ్యక్తి గుర్తుకు​వస్తాడు. ఆయనకు ‘తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగిందని’ యేసు చెప్పాడు. (మార్కు 4:26, 27) ఒకరు ఎలా క్రీస్తు శిష్యులౌతారో పైకి కనిపించదనే విషయం ఎంత స్పష్టంగా వివరించబడింది! మనకు మొదట్లో అభివృద్ధి కనిపించకపోయినా అనతికాలంలో అది స్పష్టమౌతుంది.

14 మనకు అభివృద్ధి పైకి కనిపించకపోవడమే కాక అది భూవ్యాప్తంగా జరుగుతోంది. ఈ విషయం కూడా పుల్లని పిండి ఉపమానంలో వివరించబడింది. పుల్లని పిండి “మూడు కుంచముల” ముద్దనంతా పులిసేలా చేస్తుంది. (లూకా 13:21) అలాగే, శిష్యుల సంఖ్య ఎక్కువయ్యేందుకు తోడ్పడిన రాజ్య ప్రకటనా పని ఇప్పుడు “భూదిగంతముల వరకు” వ్యాపించింది. (అపొ. 1:8; మత్త. 24:14) అద్భుతమైన రీతిలో వ్యాప్తి చెందుతున్న ఈ రాజ్య ప్రకటనా పనిలో భాగం వహించడం ఎంత గొప్ప అవకాశం!

వల ఉపమానం

15 రాజ్యసందేశంపట్ల కొంత ఆసక్తితో కూటాలకు వస్తూ, సంఘంతో కొంతమేరకు సహవసిస్తూ క్రీస్తు శిష్యులమని చెప్పుకునేవారి సంఖ్యకన్నా వారు ఎంత​మేరకు నిజక్రైస్తవులుగా ఉన్నారన్నది మరింత ప్రాముఖ్యం. రాజ్య అభివృద్ధికి సంబంధించిన ఈ విషయాన్ని వల గురించిన తన తర్వాతి ఉపమానంలో యేసు వివరించాడు. “మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది” అని ఆయన చెప్పాడు.​—⁠మత్త. 13:47.

16 రాజ్య ప్రకటనా పనికి సూచనగా ఉన్న వలలో ఎన్నో రకాల చేపలు పడతాయి. యేసు ఇంకా ఇలా చెప్పాడు: “అది [వల] నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ​వాటిని బయట పారవేయుదురు. ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.”​—⁠మత్త. 13:48-50.

17 యేసు తాను మహిమతో వచ్చినప్పుడు గొర్రెలను, మేకలను అంతిమ తీర్పుతీరుస్తానని చెప్పాడు. మరి మనం పరిశీలిస్తున్న ఉపమానంలోని చేపలను వేరుచేయడం ఆ తీర్పునే సూచిస్తుందా? (మత్త. 25:31-33) లేదు. అంతిమ తీర్పనేది మహాశ్రమల కాలంలో యేసు మహిమతో వచ్చినప్పుడు జరుగుతుంది. అయితే ఉపమానంలోని వలలో పడ్డ చేపలు “యుగసమాప్తియందు” వేరుచేయబడతాయి. * మనం ఇప్పుడు ఆ యుగసమాప్తికాలంలోనే జీవిస్తున్నాం. దీని ముగింపులో మహాశ్రమలు ప్రారంభమౌతాయి. మరైతే వేరుచేసే పని ఇప్పుడెలా జరుగుతోంది?

18 మన కాలంలో మానవ సముద్రంలోనుండి అక్షరాలా లక్షల సంఖ్యలో సూచనార్థక చేపలు యెహోవా సంఘంలోకి ఆకర్షించబడుతున్నాయి. కొందరు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు, మరి​కొందరు కూటాలకు వస్తున్నారు. ఇంకా కొందరు బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ వాళ్లందరూ నిజ క్రైస్తవులేనా? వారు ‘దరికి’ లాగబడే అవకాశం ఉంది, అయితే “మంచి” వారే క్రైస్తవ సంఘాలను సూచిస్తున్న గంపల్లోకి వేయబడతారు. చెడ్డవి అంటే సరైన హృదయ స్థితి లేనివారు బయట పారవేయబడతారు. వారు చివరికి సూచనార్థక అగ్ని​గుండంలో పడవేయ​బడతారు అంటే నాశనం చేయబడతారు.

19 చెడ్డ చేపల్లాగే కొందరు ఒకప్పుడు యెహోవా​సాక్షులతో బైబిలు అధ్యయనం చేసి మానేశారు. క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టిన కొందరు తమ జీవితాల్లో నిజంగా యేసు శిష్యులుగా ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎన్నడూ కోరుకోలేదు. వారు యెహోవాను సేవించాలన్న నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు లేదా కొంతకాలం తర్వాత ఆయనను సేవించడం మానేశారు. * (యెహె. 33:32, 33) అయితే యెహోవా దేవుని అంతిమ తీర్పు దినం రాకముందే యథార్థహృదయులు తమంతట తామే గంపల్లాంటి సంఘాల్లోకి వచ్చి, ఎప్పటికీ సురక్షితమైన స్థలంలో ఉండడం చాలా ప్రాముఖ్యం.

20 విత్తనం పెరగడానికి సంబంధించిన యేసు ఉపమానాలను క్లుప్తంగా పరిశీలించడం ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం? మొదటిగా, ఆవగింజ పెరిగినట్లే భూమిపై రాజ్య సందేశాన్ని వినేవారి సంఖ్య ఎంతగానో పెరుగుతోంది. యెహోవా పని భూవ్యాప్తంగా జరగడాన్ని ఎవరూ ఆపలేరు! (యెష. 54:17) అంతేకాక, ‘చెట్టు నీడలో’ నివసించాలని వచ్చినవారు సాతాను అతడి దుష్టలోకం నుండి సంరక్షించబడుతున్నారు. రెండవదిగా, రాజ్యాభివృద్ధి కలుగజేసేవాడు దేవుడే. ముద్దలో దాచిపెట్టబడిన పుల్లని పిండి ముద్దనంత పులిసేలా చేసినట్లే అభివృద్ధి అన్ని సందర్భాల్లో వెంటనే పైకి కనిపించకపోయినా అది జరుగుతూనే ఉంటుంది. మూడవదిగా, సందేశానికి స్పందించినవారందరూ మంచిచేపలుగా ఉండలేదు. కొందరు యేసు ఉపమానంలోని చెడ్డచేపల్లా ఉన్నారు.

21 అయినా, యెహోవా ఎంతోమంది యథార్థహృదయులను ఆకర్షించడాన్ని మనం చూడగలగడం ఎంత ప్రోత్సాహకరమైన విషయమో కదా! (యోహా. 6:44) యెహోవా ప్రజలను ఆకర్షించబట్టే అనేక దేశాల్లో ఎంతో అభివృద్ధి జరుగుతోంది. ఆ ఘనత అంతా యెహోవా దేవునికే చెందుతుంది. ఆ అభివృద్ధిని మనం కళ్లారా చూస్తున్నాం కాబట్టి ఎన్నో శతాబ్దాల క్రితం రాయబడిన ఈ ఉపదేశానికి లోబడాలని అనుకుంటాం: “ఉదయమందు విత్తనమును విత్తుము, . . . అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు.”​—⁠ప్రసం. 11:6.

[అధస్సూచీలు]

^ పేరా 4 గతంలో కావలికోట జూన్‌ 15, 1992, 17-22 పేజీలు, కావలికోట (ఆంగ్లం) అక్టోబరు 1, 1975, 589-608 పేజీల్లో ఈ ఉపమానాలు వివరించబడ్డాయి, ఆ ఉపమానాల అవగాహనలో వచ్చిన మార్పులు ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడ్డాయి.

^ పేరా 22 మత్తయి 13:39-43 వచనాల్లో రాజ్య ప్రకటనా పనికి సంబంధించిన మరో అంశం ఉన్నా, ఆ ఉపమానం కూడా వల ఉపమానం నెరవేరే కాలంలోనే అంటే ‘యుగసమాప్తియందే’ నెరవేరుతుంది. ఈ కాలమంతటిలో విత్తే పని, కోతపని ఎలా కొనసాగుతాయో అలాగే సూచనార్థక చేపలను వేరుచేయడం కూడా కొనసాగుతుంది.​—⁠కావలికోట అక్టోబరు 15, 2000, 25-26 పేజీలు; అద్వితీయ సత్యదేవుణ్ణి ఆరాధించండి 178-181 పేజీలు, 8-11 పేరాలు.

^ పేరా 24 బైబిలు అధ్యయనం మానేసినవారందరిని, యెహోవాసాక్షులతో సహవసించడం మానేసిన వారందరిని దేవదూతలు చెడ్డ చేపలుగా పరిగణించి పడేశారని అర్థమా? లేదు. ఎవరైనా యెహోవా వైపు తిరిగాలని నిజంగా కోరుకుంటే దేవుడు అతణ్ణి తిరిగి చేర్చుకుంటాడు.​—⁠మలా. 3:7.

మీరెలా జవాబిస్తారు?

రాజ్య అభివృద్ధి సంబంధించి, సాతాను అతడి దుష్టలోకం నుండి సంరక్షించబడడానికి సంబంధించి యేసు చెప్పిన ఆవగింజ ఉపమానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

యేసు ఉపమానంలోని పుల్లని పిండి దేనికి సూచనగా ఉంది, రాజ్య అభివృద్ధికి సంబంధించిన ఏ అంశాన్ని ఆయన అందులో నొక్కిచెప్పాడు?

వల ఉపమానంలో రాజ్య అభివృద్ధికి సంబంధించిన ఏ అంశం వివరించబడింది?

మనమెప్పటికీ ‘గంపల్లోకి’ వేయబడినవారిలో ఒకరిగా ఉండాలంటే ఏమి చేయాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. మొక్కలు పెరగడాన్ని చూడడం ఆశ్చర్యాన్ని కలిగించడమేకాదు, మన స్థానమేమిటో గుర్తించేలా కూడా సహాయం చేస్తుందని ఎందుకు చెప్పవచ్చు?

2. ముందటి ఆర్టికల్‌లోని ఉపమానాల్లో, ఒక వ్యక్తి క్రీస్తు శిష్యుడవడానికి సంబంధించిన ఏ విషయాలను యేసు బోధించాడు?

3, 4. రాజ్య సందేశం గురించిన ఏ విషయాలు ఆవగింజ ఉపమానంలో తెలియజేయబడ్డాయి?

5. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘం ఎలాంటి అభివృద్ధిని చూసింది?

6, 7. (ఎ) 1914 నుండి ఎలాంటి అభివృద్ధి చోటుచేసుకుంది? (బి) భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి జరగనుంది?

8. (ఎ) యేసు ఉపమానంలోని పక్షులు ఎవరిని సూచిస్తున్నాయి? (బి) మనం ఇప్పుడు కూడా వేటినుండి సంరక్షించబడుతున్నాం?

9, 10. (ఎ) పుల్లని పిండి గురించిన ఉపమానంలో యేసు ఏ విషయాన్ని నొక్కిచెప్పాడు? (బి) బైబిల్లో సాధారణంగా పులిసిన పిండి దేన్ని సూచించడానికి ఉపయోగించబడింది, యేసు ఉపమానంలోని పుల్లని పిండికి సంబంధించిన ఏ ప్రశ్నను మనం పరిశీలించనున్నాం?

11. ప్రాచీన ఇశ్రాయేలులో పులిసిన పిండి ఎలా ఉపయోగించబడేది?

12. ఉపమానాలను ఉపయోగిస్తూ బైబిలు బోధించే విధానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

13. ఒకరు ఎలా శిష్యులౌతారనే విషయం గురించి యేసు చెప్పిన పుల్లని పిండి ఉపమానం ఏమి వివరిస్తోంది?

14. పుల్లని పిండి ముద్దనంతా పులిసేలా చేస్తుందనే విషయం ప్రకటనా పనికి సంబంధించిన ఏ విషయాన్ని ఉదాహరిస్తుంది?

15, 16. (ఎ) వల ఉపమానాన్ని సంక్షిప్తంగా వివరించండి. (బి) వల దేనికి సూచనగా ఉంది, రాజ్య అభివృద్ధికి సంబంధించిన ఏ విషయం ఈ ఉపమానంలో వివరించబడింది?

17. వల ఉపమానంలోని వేరుచేసే పని ఏ కాలంలో జరుగుతుంది?

18, 19. (ఎ) మన కాలంలో వేరుచేసే పని ఎలా జరుగుతోంది? (బి) యథార్థహృదయులు ఏ చర్య తీసుకోవాలి? (21వ పేజీలోని అధస్సూచి కూడ చూడండి.)

20, 21. (ఎ) విత్తనం పెరగడానికి సంబంధించిన యేసు ఉపమానాలను పరిశీలించడం ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం? (బి) మీరు ఏమి చేయాలని నిర్ణయించుకున్నారు?

[18వ పేజీలోని చిత్రాలు]

రాజ్య అభివృద్ధి గురించిన ఆవగింజ ఉపమానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

[19వ పేజీలోని చిత్రం]

పుల్లని పిండి ఉపమానం నుండి మనం ఏమి తెలుసుకోవచ్చు?

[21వ పేజీలోని చిత్రం]

మంచిచేపలను, చెడ్డచేపలను వేరుచేసే పని దేనిని సూచిస్తోంది?