కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇంటింటి పరిచర్యలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం

ఇంటింటి పరిచర్యలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం

ఇంటింటి పరిచర్యలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం

‘ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమి.’ ​—⁠1 థెస్స. 2:2.

యిర్మీయా కూడా మనలాంటి వ్యక్తే. యెహోవా ఆయనను “జనములకు ప్రవక్తగా” నియమిస్తున్నానని చెప్పినప్పుడు ఆయన బాధతో, “అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదు” అని అన్నాడు. అయినా, యెహోవామీద నమ్మకంతో ఆయన ఆ నియామకాన్ని అంగీకరించాడు. (యిర్మీ. 1:4-10) యిర్మీయా 40 కన్నా ఎక్కువ సంవత్సరాలు ప్రజల ఉదాసీనతను, తిరస్కారాన్ని, అవమానాన్ని, దౌర్జన్యాన్ని ఎదుర్కోవాల్సివచ్చింది. (యిర్మీ. 20:1, 2) కొన్నిసార్లు ప్రకటనా పనిని ఆపేయాలని కూడ అనుకున్నాడు. అయినా, ప్రజలు అంతగా ఇష్టపడని ఆ సందేశాన్ని పట్టుదలతో ప్రకటించాడు. తన స్వశక్తితో చేయలేని పనిని దేవుని శక్తితో పూర్తిచేశాడు.​—⁠యిర్మీయా 20:7-9 చదవండి.

2 నేడు దేవుని సేవకుల్లో అనేకమందికి యిర్మీయాకు అనిపించినట్లే అనిపిస్తూవుంటుంది. ఇంటింటికి వెళ్లి ప్రకటించడం గురించి ఆలోచించినప్పుడు, మనలో కొంతమంది ‘అది నావల్ల కాదు’ అని అనుకొనివుంటారు. కానీ, సువార్త ప్రకటించడం యెహోవా చిత్తమని గుర్తించినప్పుడు మనం ఆ భయాన్ని పోగొట్టుకొని చురుకుగా ప్రకటించడం మొదలుపెట్టాం. అయినాసరే, కొంతకాలంపాటు ప్రకటనా పనిలో పాల్గొనలేని పరిస్థితులను మనలో చాలామందిమి ఎదుర్కొన్నాం. ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం ప్రారంభించి అంతంవరకు దానిలో కొనసాగడం కష్టమే.​—⁠మత్త. 24:13.

3 మీరు కొంతకాలంగా యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తూ, కూటాలకు హాజరవుతున్నా, ఇంటింటి పరిచర్యను ప్రారంభించడానికి సంకోచిస్తున్నారా? లేక మీరు బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులైతే, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం మీకు కష్టంగా ఉందా? అన్ని దేశాల్లోనూ సహోదరులు ఇంటింటి పరిచర్యలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తున్నారు. యెహోవా సహాయంతో మీరు కూడా అధిగమించగలరు.

ధైర్యాన్ని కూడగట్టుకోండి

4 ప్రపంచవ్యాప్త ప్రకటనా పని మానవశక్తితో, జ్ఞానంతో జరగడంలేదుగానీ దేవుని ఆత్మ సహాయంతో జరుగుతుందనేది మీరు ఖచ్చితంగా అంగీకరిస్తారు. (జెక. 4:6) ప్రతీ క్రైస్తవుడు కూడా దేవుని సహాయంతోనే ప్రకటనా పని చేస్తున్నాడు. (2 కొరిం. 4:7) అపొస్తలుడైన పౌలు ఉదాహరణను గమనించండి. తనను, తన తోటి మిషనరీను వ్యతిరేకులు శ్రమపెట్టిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా రాశాడు: “మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానముపొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమి.” (1 థెస్స. 2:2; అపొ. 16:22-24) సువార్తను ఉత్సాహంగా ప్రకటించిన పౌలులాంటి ప్రచారకుడే కొన్నిసార్లు ప్రకటించడానికి కష్టపడాల్సివచ్చిందని ఊహించడం కష్టమనిపించవచ్చు. కానీ మనందరిలాగే పౌలు ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి యెహోవామీద ఆధారపడాల్సివచ్చింది. (ఎఫెసీయులు 6:18-20 చదవండి.) మనం పౌలు ఉదాహరణను ఎలా అనుకరించవచ్చు?

5 మనం ప్రకటించడానికి కావాల్సిన ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి సహాయపడే ఒక అంశం ప్రార్థన. ఒక పయినీరు సహోదరి ఇలా చెప్పింది: “నేను ధైర్యంగా, ప్రజలకు సత్యంపట్ల ఆసక్తి కలిగించేవిధంగా మాట్లాడేలా, పరిచర్యలో ఆనందంపొందేలా సహాయం చేయమని ప్రార్థిస్తాను. నిజానికిది యెహోవా పనే గానీ మన పనికాదు కాబట్టి, ఆయన సహాయమే లేకపోతే మనమేమీ చేయలేం.” (1 థెస్స. 5:17) ధైర్యంగా ప్రకటనా పనిని చేయడానికి పరిశుద్ధాత్మ సహాయం కోసం మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ వేడుకోవాలి.​—⁠లూకా 11:9-13.

6 మనం ధైర్యంగా ప్రకటించడానికి సహాయం చేయగల మరో అంశాన్ని యెహెజ్కేలు గ్రంథం తెలియజేస్తుంది. యెహోవా ఒక దర్శనంలో రెండువైపులా “మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును” రాయబడిన ఒక గ్రంథపుచుట్టను యెహెజ్కేలుకు ఇచ్చి దాన్ని తినమని ఆదేశించాడు. “నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుము” అని ఆదేశించాడు. ఈ దర్శన భావమేమిటి? యెహెజ్కేలు తాను ప్రకటించనున్న సందేశాన్ని పూర్తిగా అర్థంచేసుకోవాలి. అది ఆయనలో భాగమైపోవాలి, అంటే ఆయన అంతరంగ భావాలను అది ప్రభావితం చేయాలి. ఆ ప్రవక్త ఇలా చెప్పాడు: “నేను దాని భక్షించితిని; అది నానోటికి తేనెవలె మధురముగా నుండెను.” దేవుని సందేశాన్ని ప్రజలకు ప్రకటించడం యెహెజ్కేలుకు తేనె అంత మధురంగా అనిపించింది. తనకు అప్పగించబడిన పనిలో భాగంగా ప్రజలు ఇష్టపడని సందేశాన్ని ప్రకటించాల్సివచ్చినా యెహోవాకు ప్రాతినిధ్యం వహించి ఆయనిచ్చిన పనిని పూర్తిచేయడాన్ని గౌరవప్రదమైన విషయంగా భావించాడు.​—⁠యెహెజ్కేలు 2:8-3:4, 7-9 చదవండి.

7 ఇప్పుడున్న దేవుని సేవకులకు ఈ దర్శనంలో ఒక అమూల్యమైన పాఠం ఉంది. ప్రజలు అన్ని సందర్భాల్లో మన పనిని మెచ్చుకోరు. యెహెజ్కేలులా మనం కూడా వారు ఇష్టపడని సందేశాన్ని ప్రకటించాలి. క్రైస్తవ పరిచర్యను దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశంగా ఎల్లప్పుడూ పరిగణించాలంటే మనం ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమంగా తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని పైపైన లేక అప్పుడప్పుడు చదివితే దానిని మనం పూర్తిగా అర్థం​చేసుకోలేం. మీరు బైబిలును మరింత క్రమంగా మరింత మెరుగ్గా చదివి, అధ్యయనం చేయగలరా? మీరు చదివినదాన్ని మరింత క్రమంగా ధ్యానించగలరా?​—⁠కీర్త. 1:2, 3.

బైబిలు చర్చలను ప్రారంభించండి

8 చాలామంది ప్రచారకులకు ఇంటింటి పరిచర్యలో సంభాషణ ప్రారంభించడమే చాలా కష్టమనిపిస్తుంది. నిజమే, కొన్ని ప్రాంతాల్లో సంభాషణ ప్రారంభించడం కష్టమే. ముందుగా ఆలోచించి పెట్టుకున్న కొన్ని మాటలతో ప్రారంభించి కిందవున్న బాక్సులో చెప్పబడినట్లు ఇంటి వ్యక్తికి కరపత్రం ఇచ్చి మాట్లాడడం కొంతమంది ప్రచారకులకు సులభమనిపిస్తుంది. * కరపత్రపు శీర్షికను లేక దానిలోని రంగురంగుల చిత్రాలను ఇంటి వ్యక్తి ఇష్టపడవచ్చు. ఆయన దాన్ని చూస్తున్నప్పుడు మనం వారి ఇంటికి ఎందుకు వచ్చామో క్లుప్తంగా చెప్పి ఒక ప్రశ్న అడగవచ్చు. కరపత్రాన్ని ఉపయోగించి మరో విధంగా కూడా సంభా​షణను ప్రారంభించవచ్చు, ఈ పద్ధతిలో ఇంటివ్యక్తికి మూడు నాలుగు కరపత్రాలను చూపించి, వాటిలో ఆయన ఏది చదవాలనుకుంటున్నారో అడగాలి. మనం కరపత్రాలను ఇంటివారికి ఇవ్వడం లేదా ప్రతీ ఇంట్లో దాన్ని ఉపయోగించడం మాత్రమే మన లక్ష్యంకాదుగానీ బైబిలు అధ్యయనాలు చేయాలనే ఉద్దేశంతో బైబిలు చర్చలు ప్రారంభించడమే మన లక్ష్యం.

9 మీరు ఏ పద్ధతిని ఉపయోగించినా, ఇంటింటి పరిచర్య కోసం బాగా సిద్ధపడితే ఎలాంటి భయంలేకుండా ఉత్సాహంగా దానిలో పాల్గొనగలుగుతారు. ఒక పయినీరు సహోదరుడు ఇలా చెప్పాడు: “నేను బాగా సిద్ధపడి వెళ్లినప్పుడు పరిచర్యను ఎంతో ఆనందిస్తాను. నేను ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని ఎదురుచూస్తుంటాను.” మరో పయినీరు సహోదరుడు ఇలా చెప్పాడు: “నేను ఇవ్వబోయే ప్రచురణలను ముందుగానే చదివినప్పుడు వాటిని పరిచర్యలో ఉపయోగించాలనే ఉత్సాహం నాలో ఉంటుంది.” మీరు చెప్పబోయే విషయాల గురించి ఆలోచించడంలో కొంత ప్రయోజనం ఉన్నా, చాలామంది దాన్ని గట్టిగా అభ్యసించడంవల్ల పరిచర్యలో చక్కగా పాల్గొనగలుగుతున్నారని తెలుసుకున్నారు. అలా చేయడం ద్వారా వారు యెహోవా సేవలో చేయగలిగినదంతా మనస్ఫూర్తిగా చేయగలుగుతున్నారు.​—⁠కొలొ. 3:23; 2 తిమో. 2:15.

10 క్షేత్రసేవా కూటాల్లో ప్రచారకులకు ఉపయోగపడే విషయాలు చర్చించబడితే మనం ఇంటింటి పరిచర్యలో మంచి ఫలితాలను సాధించి, దానిలో ఆనందాన్ని పొంద​గలుగుతాం. దినవచనం ప్రకటనా పని గురించే మాట్లాడుతుంటే, దానిని చదివి, క్లుప్తంగా చర్చించవచ్చు. అయితే, క్షేత్రసేవ కూటాన్ని నిర్వహించే సహోదరుడు తమ ప్రాంతంలో సులభంగా ఎలా సంభాషణ ప్రారంభించాలో చర్చించడానికి లేదా ప్రదర్శింపజేయడానికి, లేదంటే ఆ రోజు పరిచర్యలో ఉపయోగపడే విషయాలను చర్చించడానికి తగినంత సమయం తీసుకోవాలి. ఈ కూటానికి హాజరైనవారు మరింత సమర్థంగా సాక్ష్యమిచ్చేందుకు ఇది సహాయం చేస్తుంది. ఈ కూటాన్ని నిర్వహించే పెద్దలు, మరితరులు ముందుగానే బాగా సిద్ధపడడం ద్వారా పైన పేర్కొనబడిన వాటన్నిటినీ చేస్తూనే కూటాన్ని సమయానికి ముగించగలుగుతారు.​—⁠రోమా. 12:8.

వినడంవల్ల వచ్చే ప్రయోజనాలు

11 మనం కలుసుకునే ప్రజలతో బైబిలు చర్చలు ప్రారంభించి, సత్యంపట్ల వారికి ఆసక్తి కలిగించే విధంగా మాట్లాడాలంటే బాగా సిద్ధపడడం ఒక్కటే సరిపోదు, వారిపట్ల వ్యక్తిగత శ్రద్ధ కూడా కనబరచాలి. మనం వినే విధానం ద్వారా అలాంటి శ్రద్ధను చూపించవచ్చు. ఒక ప్రయాణ పైవిచారణకర్త ఇలా చెప్పాడు: “ప్రజలు చెప్పేది ఓపిగ్గా వినడానికి మనం ఆసక్తి చూపిస్తే వారు సువార్త వినడానికి ఇష్టపడతారు, అంతేకాక మనకు వారిపై శ్రద్ధ ఉందని చూపించడానికి అదొక చక్కని మార్గం.” సానుభూతితో వినడం ద్వారా అవతలి వ్యక్తి హృదయంలో ఏముందో తెలుసుకోగలుగుతాం. ఈ విషయాన్ని కింది అనుభవం ఉదాహరిస్తోంది.

12 ఫ్రాన్స్‌లోవున్న సెంట్‌ ఎట్నీలో ప్రచురించబడే లీ ప్రోగ్రీ అనే వార్తాపత్రికలో ఒక స్త్రీ రాసిన బహిరంగ లేఖ ముద్రించబడింది. తన మూడు నెలల పాపాయి చనిపోయి విషాదంలో మునిగిపోయిన తనను కలవడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారని చెబుతూ ఆ లేఖలో ఇలా రాసింది: “వారు యెహోవాసాక్షులు అని నేను వెంటనే గుర్తుపట్టి వారిని బాధపెట్టకుండా పంపించేయాలని అనుకున్నాను, కానీ వారు నాకు ఇవ్వాలనుకున్న బ్రోషుర్‌ను చూసి ఆగిపోయాను. అందులో దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు అనే విషయం వివరించబడివుంది. వారి వాదనలను తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే వారిని లోనికి రానిచ్చాను . . . వారు దాదాపు గంటసేపు నాతో మాట్లాడారు. వారు ఎంతో సానుభూతితో నేను చెప్పినదంతా విన్నారు. వారితో మాట్లాడడం నాకెంత మంచిగా అనిపించిందంటే వారు తిరిగి వస్తామని చెప్పినప్పుడు సరేనన్నాను.” (రోమా. 12:15, 16) కొంతకాలానికి, ఆమె బైబిలు అధ్యయనాన్ని అంగీకరించింది. ఆ సహోదరీలు తనను మొదట కలుసుకున్నప్పుడు వారు ఏమి చెప్పారో ఆమెకు గుర్తులేదు గానీ వారు ఎలా విన్నారన్నది గుర్తుందనే విషయం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు.

13 మనం సానుభూతితో విన్నప్పుడు, ప్రజలకు ఏ సమస్య ఉందో, వారికి రాజ్యానికి సంబంధించిన ఏ విషయం చెప్పి సహాయం చేయగలమో తెలుస్తుంది. దీనివల్ల మనం వారికి సువార్తను మరింత సమర్థంగా ప్రకటించగలుగుతాం. సాధారణంగా సమర్థులైన ప్రచారకులు శ్రద్ధగా వింటారనే విషయాన్ని మీరు గమనించేవుంటారు. (సామె. 20:5) వారు పరిచర్యలో కలుసుకునేవారిపట్ల నిజమైన శ్రద్ధను కనబరుస్తారు. వారు ప్రజల పేర్లు, అడ్రస్‌లతోపాటు వారి ఇష్టాయిష్టాల గురించి, అవసరాల గురించి కూడా రాసుకుంటారు. ఎవరైనా ఒకానొక విషయం గురించి ప్రశ్న అడిగితే వారు పరిశోధన చేసి, తెలుసుకున్న విషయాన్ని చెప్పడానికి వీలైనంత త్వరలో తిరిగివెళ్తారు. వారు అపొస్తలుడైన పౌలులాగే తాము కలుసుకునే వ్యక్తులనుబట్టి రాజ్యం సందేశానికి సంబంధించి తాము మాట్లాడాలనుకున్న విషయాన్ని మార్చుకుంటారు. (1 కొరింథీయులు 9:19-23 చదవండి.) మనం ప్రజలపట్ల అలా నిజమైన శ్రద్ధ చూపించినప్పుడు వారు సువార్త వినడానికి ఇష్టపడతారు, అంతేకాక మనం ‘దేవుడు కనబరచినలాంటి మహా వాత్సల్యాన్ని’ కనబరచగలుగుతాం.​—⁠లూకా 1:76-79.

ఆశావహ దృక్పథంతో ఉండండి

14 యెహోవా మనకు స్వేచ్ఛాచిత్తాన్ని ఇవ్వడం ద్వారా మనలో ప్రతీ ఒక్కరినీ విలువైనవారిగా ఎంచుతున్నాడు. ఆయన సర్వశక్తుడైన దేవుడే అయినా, తనను ఆరాధించమని ఎవరినీ బలవంతపెట్టడు. బదులుగా వారిని ప్రేమతో అభ్యర్థిస్తాడు. తాను చేసిన అద్భుతమైన ఏర్పాట్ల విషయంలో కృతజ్ఞత కనబరిచేవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. (రోమా. 2:4) దేవుని ప్రచారకులముగా మనం సాక్ష్యమిచ్చే ప్రతీసారి దయగల మన దేవుణ్ణి అనుకరించే విధంగా సువార్త ప్రకటించేందుకు సిద్ధంగా ఉండాలి. (2 కొరిం. 5:20, 21; 6:3-6) అలా సాక్ష్యమివ్వడానికి మనం మన ప్రాంతంలోని ప్రజలపట్ల ఆశావహ దృక్పథంతో ఉండాలి. ఇలా చేయడానికి మనకు ఏది సహాయం చేయగలదు?

15 ఎవరైనా రాజ్య సందేశాన్ని ఇష్టపడకపోతే అనవసరంగా ఆందోళనపడే బదులు యోగ్యులను కనుగొనడానికి ప్రాధాన్యతనివ్వమని యేసు తన అనుచరులకు ఉపదేశించాడు. (మత్తయి 10:11-15 చదవండి.) సాధించగలిగే చిన్నచిన్న లక్ష్యాలను పెట్టుకుంటే మనం ఆయన ఉపదేశించినట్లు చేయగలుగుతాం. ఒక సహోదరుడు తనను బంగారం కోసం అన్వేషించే వ్యక్తితో పోల్చుకున్నాడు. “ఈ రోజు నాకు ఖచ్చితంగా బంగారం దొరుకుతుంది” అనే దృక్పథంతో ఉంటాడు. మరో సహోదరుడు, “వారంలో ఆసక్తి చూపించే ఒక్క వ్యక్తినైనా కలుసుకొని, ఆయన ఆసక్తిని పెంచడానికి కొద్ది రోజుల్లో తిరిగి కలుసుకోవాలి” అనే లక్ష్యం పెట్టుకున్నాడు. కొందరు ప్రచారకులు సాధ్యమైతే కలిసిన ప్రతీవ్యక్తికి ఒక్క లేఖనమైనా చూపించడానికి ప్రయత్నిస్తారు. మీ పరిస్థితులనుబట్టి మీరు ఏ లక్ష్యాన్ని పెట్టుకోగలరు?

16 ఇంటింటి పరిచర్యలో మనం ఎంతవరకు విజయం సాధిస్తున్నామనేది మన ప్రాంతంలోని ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారు అనే దాన్నిబట్టి మాత్రమే చెప్పలేం. నిజమే, ప్రకటనాపని యథార్థహృదయుల రక్షణ విషయంలోనే కాదు ఇతర విషయాల్లో కూడా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. క్రైస్తవ పరిచర్యలో పాల్గొనడం ద్వారా యెహోవాపట్ల మనకు ఎంత ప్రేమ ఉందో చూపించగలుగుతాం. (1 యోహా. 5:3) మనపై రక్తాపరాధం రాకుండా చూసుకోగలుగుతాం. (అపొ. 20:26, 27) ‘దేవుడు తీర్పుతీర్చు గడియ వచ్చెను’ అని భక్తిహీనులను హెచ్చరించగలుగుతాం. (ప్రక. 14:6, 7) అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, సువార్త ప్రకటించడం ద్వారా యెహోవా నామం భూవ్యాప్తంగా స్తుతించబడుతోంది. (కీర్త. 113:3) కాబట్టి, ప్రజలు విన్నా వినకపోయినా, మనం రాజ్య సందేశాన్ని ప్రకటిస్తూనే ఉండాలి. నిజమే, సువార్త ప్రకటించడానికి మనం చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ యెహోవా విలువైనవిగా దృష్టిస్తున్నాడు.​—⁠రోమా. 10:13-15.

17 మనం చేస్తున్న ప్రకటనా పనిని నేడు చాలామంది నిర్లక్ష్యంచేస్తున్నా, త్వరలో వారు దాని ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. (మత్త. 24:37-39) యెహెజ్కేలు ప్రకటించిన తీర్పు సందేశాలు నెరవేరినప్పుడు, తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు జనాంగం ‘తమ మధ్య ప్రవక్త ఉన్నాడని తెలుసుకుంటారు’ అని యెహోవా ఆయనకు హామీనిచ్చాడు. (యెహె. 2:4) అలాగే, ఈ ప్రస్తుత విధానంమీద యెహోవా తన తీర్పులను అమలుచేసినప్పుడు, యెహోవాసాక్షులు అన్ని ప్రాంతాల్లో, ఇంటింటా ప్రకటించిన సందేశం సత్యదేవుడైన యెహోవా సందేశమనీ, సాక్షులు నిజంగానే ఆయన ప్రతినిధులుగా పనిచేశారనీ ప్రజలు అంగీకరించాల్సివస్తుంది. ఎంతో ప్రాముఖ్యమైన సంఘటనలు జరుగనున్న ఈ కాలంలో యెహోవా సేవకులముగా ఆయన సందేశాన్ని ప్రకటించడం మనకున్న ఎంత గొప్ప అవకాశం! మనం యెహోవా సహాయంతో, ఇంటింటి పరిచర్యలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ ఉందాం.

[అధస్సూచి]

^ పేరా 12 కొన్ని ప్రాంతాల్లో మన రాజ్య పరిచర్య మరో పద్ధతిని సిఫారసు చేయవచ్చు.

మీరెలా జవాబిస్తారు?

• మనం ప్రకటించడానికి ధైర్యాన్ని ఎలా కూడగట్టుకోవచ్చు?

• ఇంటింటి పరిచర్యలో బైబిలు చర్చలను ప్రారంభించడానికి మనకు ఏమి సహాయం చేయగలదు?

• మనం ఇతరులపట్ల నిజమైన శ్రద్ధ ఎలా కనబరచవచ్చు?

• మన ప్రాంతంలోని ప్రజలపట్ల ఆశావహ దృక్పథంతో ఉండడానికి మనకు ఏమి సహాయం చేయగలదు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యిర్మీయా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు, వాటిని ఆయన ఎలా అధిగమించగలిగాడు?

2, 3. యిర్మీయాలాగే నేడు దేవుని సేవకులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు?

4. ధైర్యంగా సువార్త ప్రకటించడానికి పౌలుకు ఏది సహాయం చేసింది?

5. మనం ప్రకటించేందుకు కావాల్సిన ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి సహాయపడే ఒక అంశమేమిటి?

6, 7. (ఎ) యెహెజ్కేలు ఏ దర్శనాన్ని పొందాడు, దాని భావమేమిటి? (బి) ఇప్పుడున్న దేవుని సేవకులు యెహెజ్కేలు దర్శనం నుండి ఏ పాఠాన్ని నేర్చుకోవచ్చు?

8. కొంతమంది రాజ్యప్రచారకులు ఇంటింటి పరిచర్యలో బైబిలు చర్చలను ప్రారంభించడానికి ఏ పద్ధతిని ఉపయోగించగలిగారు?

9. బాగా సిద్ధపడడం ఎందుకు ప్రాముఖ్యం?

10. క్షేత్రసేవా కూటాలను ప్రచారకులకు ప్రయోజనకరమైన, ఉపయోగకరమైన విధంగా నిర్వహించడానికి ఏమి చేయవచ్చు?

11, 12. సానుభూతితో వినడంవల్ల మనం ప్రజలకు సత్యంపట్ల ఆసక్తి కలిగించే విధంగా ఎలా ప్రకటించగలుగుతాం? ఉదాహరణలు చెప్పండి.

13. మనం కలుసుకునే వ్యక్తులనుబట్టి సువార్తకు సంబంధించి మనం మాట్లాడాలనుకుంటున్న విషయాన్ని ఎలా మార్చుకోవచ్చు?

14. మన పరిచర్యలో యెహోవా లక్షణాలను ఎలా కనబరచవచ్చు?

15. (ఎ) ప్రజలు రాజ్య సందేశాన్ని ఇష్టపడకపోతే ఏమి చేయాలని యేసు తన అపొస్తలులకు ఉపదేశించాడు? (బి) యోగ్యులను కనుగొనడానికి ప్రాధాన్యతనిచ్చేందుకు మనకు ఏమి సహాయం చేయగలదు?

16. మనం ప్రకటిస్తూ ఉండడానికి మనకు ఏ కారణాలు ఉన్నాయి?

17. త్వరలో ప్రజలు ఏమి గుర్తించాల్సివస్తుంది?

[9వ పేజీలోని బాక్సు/చిత్రం]

బైబిలు చర్చలను ప్రారంభించడానికి ఒక పద్ధతి

ప్రారంభంలో:

గృహస్థుడ్ని పలకరించిన తర్వాత, ఆయనకు ఒక కరపత్రాన్నిచ్చి, “ఈ ప్రాముఖ్యమైన అంశం గురించి ఒక మంచి విషయం చెప్పడానికి మీ ఇంటికి వచ్చాం” అని చెప్పండి.

లేదా మీరు కరపత్రాన్ని ఇచ్చి ఇలా చెప్పవచ్చు, “ఈ విషయం గురించి మీ అభిప్రాయం తెలుసుకోవాలని మీ ఇంటికి వచ్చాం.”

ఆయన కరపత్రాన్ని తీసుకుంటే:

వెంటనే, కరపత్రపు శీర్షిక విషయంలో ఆయన అభిప్రాయం ఏమిటో అడగండి.

ఆయన చెప్పేది జాగ్రత్తగా విని, ఆయన అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆయన తన అభిప్రాయాన్ని చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేయండి.

చర్చను కొనసాగించడానికి:

మీరు ఆయనతో మాట్లాడాలనుకుంటున్న విషయాన్ని ఆయన ఇష్టాయిష్టాలకు, అవసరాలకు అనుగుణంగా మార్చుకొని ఒకటి లేక అంతకన్నా ఎక్కువ లేఖనాలను చదివి చర్చించండి.

మీరు చెబుతున్నది ఆ వ్యక్తి ఇష్టపడితే, సాహిత్యాన్నిచ్చి, వీలైతే బైబిలు అధ్యయనం ఎలా చేస్తారో చూపించండి. వారిని మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి.