కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మాకు తోడుగా ఉన్నాడనే ధైర్యంతో మేము భయపడలేదు

యెహోవా మాకు తోడుగా ఉన్నాడనే ధైర్యంతో మేము భయపడలేదు

యెహోవా మాకు తోడుగా ఉన్నాడనే ధైర్యంతో మేము భయపడలేదు

ఇజిప్షియా పెట్రీడీస్‌ చెప్పినది

సైప్రస్‌లోని సాక్షులందరూ 1972వ సంవత్సరంలో నేథన్‌ హెచ్‌. నార్‌ ఇచ్చిన ప్రత్యేక ప్రసంగాన్ని వినడానికి నికోషియాలో సమకూడారు. ఆయన అప్పటికే ఎంతోకాలంగా యెహోవాసాక్షుల పనిని పర్యవేక్షిస్తున్నాడు. నన్ను చూసిన వెంటనే గుర్తుపట్టి నన్ను నేను పరిచయం చేసుకోకముందే “ఈజిప్టు సంగతులేమిటి” అని అడిగాడు. నేను ఆయనను 20 సంవత్సరాల క్రితం ఈజిప్టులో మా సొంత ఊరైన అలెగ్జాండ్రియాలో కలిశాను.

నేను 1914 జనవరి 23న అలెగ్జాండ్రియాలో పుట్టాను. నలుగురు పిల్లల్లో నేనే పెద్దదాన్ని. మా ఇల్లు సముద్రానికి చాలా దగ్గరలో ఉండేది. ఒకప్పుడు సుందరంగా ఉన్న అలెగ్జాండ్రియా నగరంలో ఎన్నో దేశాల ప్రజలుండేవారు. అది చరిత్రకు, కళాత్మక నిర్మాణానికి పేరుగాంచింది. యూరోపియన్‌లు అరబ్బులతో కలుపుగోలుగా ఉండేవారు కాబట్టి చిన్నప్పుడు మేము మా మాతృభాషయైన గ్రీకుతోపాటు అరబిక్‌, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌ భాషలు కూడా నేర్చుకున్నాం.

చదువు పూర్తైన తర్వాత నాకు ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ హౌస్‌లో ఉద్యోగం దొరికింది. సంపన్నవంతులైన స్త్రీల కోసం చక్కని గౌన్లను డిజైన్‌చేసి కుట్టడం నాకెంతో మంచిగా అనిపించేది. నాకు భక్తి ఎక్కువ. బైబిలు చదివినప్పుడు అంతగా అర్థమయ్యేది కాదు, అయినా దాన్ని ఎంతో ఇష్టంగా చదివేదాన్ని.

1935 ఆ ప్రాంతంలో నేను థియోడాటస్‌ పెట్రీడీస్‌ను కలిశాను. ఆయన చాలా మంచివాడు. సైప్రస్‌ దేశస్థుడు. కుస్తీ పోటీల్లో పాల్గొనేవాడు. కానీ ఆయన చాక్లెట్లు, కేకుల వంటివి తయారు చేయడం కూడా నేర్చుకుని పెద్ద బేకరిలో పని చేసేవాడు. నల్లని జుట్టుతో కాస్త పొట్టిగా ఉండే నన్ను చూసి ఇష్టపడ్డాడు. తరచూ ఆయన మా కిటికీ ఎదురుగా నిలబడి గ్రీకులో ప్రేమ గీతాలు ఆలపించేవాడు. మేము 1940 జూన్‌ 30న పెళ్లిచేసుకున్నాం. మా జీవితం ఎంతో హాయిగా గడిచింది. మా అమ్మవాళ్ల ఇంటి కింది అంతస్థులోనే మేము ఉండేవాళ్లం. 1941లో మా పెద్దబ్బాయి జాన్‌ పుట్టాడు.

బైబిలు సత్యాలను నేర్చుకోవడం

థియోడాటస్‌ మతం విషయంలో కొంతకాలం కలవరపడ్డాడు. ఆయన బైబిలు గురించి సందేహాలు అడుగుతుండేవాడు. యెహోవాసాక్షులు ఆయనతో బైబిలు అధ్యయనం చేస్తున్నారని నాకు తెలీదు. ఒక రోజు నేను మా బాబుతో ఇంట్లో ఉన్నప్పుడు ఒకామె వచ్చి బైబిలు సందేశమున్న కార్డును నాకిచ్చింది. ఆమెను బాధపెట్టకూడదనే ఉద్దేశంతో దాన్ని తీసుకుని చదివాను. చదివిన తర్వాత ఆమె నాకు కొన్ని బైబిలు పుస్తకాలు ఇచ్చింది. అవి చూడగానే నాకెంతో ఆశ్చర్యమేసింది. ఎందుకంటే థియోడాటస్‌ అంతకముందు అవే పుస్తకాలను ఇంటికి తెచ్చారు.

“అరె నా దగ్గర కూడా ఇవే పుస్తకాలున్నాయే” అని చెప్పి లోపలికి రమ్మన్నాను. మా ఇంటికి వచ్చిన సహోదరి పేరు ఎలనీ నికొలౌ. ఆమె లోపలికి రాగానే ప్రశ్నల వర్షం కురిపించాను. ఆమె ఎంతో ఓపిగ్గా అన్నిటికీ బైబిలు నుండి సమాధానాలు చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడే నాకు బైబిల్లోని విషయాలు కొద్దికొద్దిగా అర్థమవసాగాయి. మాటల మధ్యలో ఎలనీ మావారి ఫొటో చూసి, “ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి నాకు తెలుసు” అని అంది. మావారు నాకు చెప్పకుండా క్రైస్తవ కూటాలకు వెళ్తున్నారని ఆమె చెబితే విని ఆశ్చర్యపోయాను. ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నేను, “మీరు పోయిన ఆదివారం ఎక్కడికో వెళ్లారు కదూ. అక్కడికే ఈ వారం నేను కూడా వస్తాను” అని అన్నాను.

నేను మొదటిసారి కూటానికి వెళ్లినప్పుడు అక్కడ దాదాపు పది మంది కూర్చుని మీకా పుస్తకంలోని విషయాలను చర్చిస్తున్నారు. నేనదంతా శ్రద్ధగా విని మనసులో దాచుకున్నాను. అప్పటినుండి మాతో బైబిలు అధ్యయనం చేయడానికి జార్జ్‌ పెట్రాకీ, కాటెరినీ దంపతులు ప్రతీ శుక్రవారం సాయంత్రం మా ఇంటికి వచ్చేవారు. మేము సాక్షులతో అధ్యయనం చేయడాన్ని మా నాన్న, తమ్ముడు, చెల్లి ఇష్టపడలేదు. మరో చెల్లెలు వ్యతిరేకించకపోయినా సాక్షి మాత్రం కాలేదు. అయితే అమ్మ బైబిలు సత్యాన్ని స్వీకరించింది. నేను, మావారు, అమ్మ యెహోవాకు చేసుకున్న సమర్పణకు సూచనగా 1942లో అలెగ్జాండ్రియాకు దగ్గర్లోని సముద్రంలో బాప్తిస్మం తీసుకున్నాం.

మా జీవితం ఛిన్నాభిన్నమయ్యింది

1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలై అంత​కంతకూ ఉద్ధృతమయ్యింది. 1940 ఆరంభానికల్లా జర్మనీకి చెందిన జెనరల్‌ ఎర్విన్‌ రొమ్మెల్‌ తన ట్యాంకర్‌ దళాలతో ఎల్‌ అలామేన్‌ వరకు వచ్చేసరికి, అలెగ్జాండ్రియా మొత్తం బ్రిటీష్‌ సైనికులతో నిండిపోయింది. అందుకే మేము నిలవుండే ఆహార పదార్థాలను పెద్ద మొత్తాల్లో తెచ్చిపెట్టుకున్నాం. థియోడాటస్‌ వాళ్ల యజమాని సూయజ్‌ కాలువ దగ్గర పోర్ట్‌ టాఫిక్‌ అనే నగరంలో ఒక కొత్త బేకరీ తెరిచాడు. మావారిని అక్కడ పనిచేయమనడంతో మేమందరం ఆ ప్రాంతానికి తరలివెళ్లాం. గ్రీకు భాష మాట్లాడే దంపతులు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. వారికి మా అడ్రసు తెలియకపోవడంతో ప్రతీ ఇంట్లో ప్రకటించి మరీ అడ్రసు కనుక్కున్నారు.

మేము పోర్ట్‌ టాఫిక్‌లో ఉండగా స్టావ్రోస్‌ కిప్రావోస్‌, యులా దంపతులతో, వారి పిల్లలైన టోటోస్‌, యోర్యాలతో బైబిలు అధ్యయనం చేశాం. వారు మాకు బాగా దగ్గరయ్యారు. స్టావ్రోస్‌కు అధ్యయనం చేయడం ఎంత ఇష్టమంటే, మేము వెళ్లాల్సిన ట్రైనులన్నీ వెళ్లిపోయి వాళ్ల దగ్గరే ఉండిపోయేలా ఇంట్లో గడియారాలన్నీ ఒక గంట వెనక్కి తిప్పి పెట్టేవాడు. మేము అర్థరాత్రివరకు చర్చించు​కునేవాళ్లం.

అక్కడ 18 నెలలుండిన తర్వాత, మా అమ్మ ఆరోగ్యం దెబ్బతినేసరికి అలెగ్జాండ్రియాకు తిరిగివచ్చాం. ఆమె చివరి​వరకు యెహోవాను నమ్మకంగా సేవిస్తూ 1947లో చనిపోయింది. ఈ సందర్భంలో కూడా యెహోవా మమ్మల్ని పరిణతి చెందిన క్రైస్తవ స్నేహితుల ప్రోత్సాహకరమైన సహవాసం ద్వారా బలపరిచాడు. మిషనరీ సేవకు వెళ్లే సహోదర సహోదరీలు ప్రయాణించే ఓడలు అలెగ్జాండ్రియాలో ఆగినప్పుడు వాళ్లను మా ఇంటికి తీసుకొచ్చి ఆతిథ్యమిచ్చేవాళ్లం.

కష్టసుఖాలు

1952లో మా చిన్నబ్బాయి జేమ్స్‌ పుట్టాడు. మా పిల్లల్ని సరైన ఆధ్యాత్మిక వాతావరణంలో పెంచడం ఎంత అవసరమో తల్లిదండ్రులుగా మేము గ్రహించాం. మా ఇంట్లో క్రమంగా కూటాలు జరిగే ఏర్పాటు చేశాం, పూర్తికాల సేవకులను మా ఇంటికి పిలుస్తూవుండేవాళ్లం. అందుకే మా పెద్ద కొడుకు జాన్‌ బైబిలు సత్యంపట్ల మక్కువను పెంచుకుని దాదాపు 16 సంవత్సరాలున్నప్పుడే పయినీరు సేవ చేపట్టాడు. అదే సమయంలో తన చదువు పూర్తి చేసుకోవడానికి రాత్రిబడికి వెళ్లేవాడు.

తర్వాత కొద్దికాలానికే మా​వారికి తీవ్రమైన గుండెజబ్బు ఉందని తెలిసింది. డాక్టర్లు ఆయనను బేకరీలో పనిచేయడం మానేయమని సలహా ఇచ్చారు. అప్పటికి మా రెండవ బాబుకు నాలుగేళ్ళే. మాకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. కానీ, “నీకు తోడైయున్నాను భయపడకుము” అని యెహోవా చేసిన వాగ్దానం మాకు ధైర్యాన్నిచ్చింది. (యెష. 41:9) 1956లో మేము పయినీరు సేవకు ఆహ్వానించబడినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాం, అప్పుడు మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి! మేము సూయజ్‌ కాలువ దగ్గరున్న ఇజ్‌మేలియా ప్రాంతానికి పంపించబడ్డాం. తర్వాతి సంవత్సరాల్లో ఈజిప్టులోని పరిస్థితులు అల్లకల్లోలంగా మారినప్పుడు క్రైస్తవ సహోదరులకు ప్రోత్సాహం అవసరమైంది.

1960లో మేము ఈజిప్టు వదిలి వెళ్లిపోవాల్సివచ్చింది. తలా ఒక సూటుకేసుతో మాత్రమే మేమందరం మావారి స్వస్థలమైన సైప్రస్‌ ద్వీపానికి వెళ్లాం. అప్పటికల్లా మావారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయి పనిచేయలేకపోయేవారు. అయితే మా కోసం ఓ క్రైస్తవ దంపతులు ఎంతో దయతో ఒక ఇల్లు ఇచ్చారు. రెండు సంవత్సరాల తర్వాత మావారు చనిపోయినప్పుడు నేనూ మా చిన్నబ్బాయి జేమ్స్‌ ఒంటరివాళ్లమైపోయాం. మాతో జాన్‌ కూడా సైప్రస్‌కు వచ్చాడు అయితే అప్పటికే వాడికి పెళ్లై, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి.

కష్టాల్లో యెహోవా మాకు తోడుగా ఉన్నాడు

అప్పుడు మమ్మల్ని స్టావ్రోస్‌ కైరీన్‌, డోరా దంపతులు వాళ్ల ఇంట్లో ఉండమని అడిగారు. మళ్లీ మమ్మల్ని అవసరంలో ఆదుకున్నందుకు నేను మోకాళ్లూని యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేశాను. (కీర్త. 145:16) స్టావ్రోస్‌, డోరాలు వాళ్లుంటున్న ఇంటిని అమ్మేసి, తమ ఇంటి కింద రాజ్య మందిరం ఉండేలా కొత్త ఇంటిని కట్టుకోవాలనుకున్నారు. దయతో మా కోసం కూడా రెండు గదులు కట్టించారు.

కొంతకాలానికి జేమ్స్‌కు కూడా పెళ్లైంది. వాళ్లిద్దరూ పిల్లలు పుట్టేంతవరకు పయినీరు సేవ చేశారు. వారికి నలుగురు పిల్లలు. 1972లో సహోదరుడు నార్‌ సందర్శనను నేను మరచిపోలేను! రెండు సంవత్సరాల తర్వాత 1974లో సైప్రస్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. * సాక్షులతో సహా చాలామంది తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సివచ్చింది. జాన్‌ కూడా తన భార్య, ముగ్గురు పిల్లలతో కెనడాకు వెళ్లిపోయాడు. కానీ సైప్రస్‌లో రాజ్య ప్రచారకులు ఎక్కువవడం చూసి మేమెంతో సంతోషించాం.

నాకు పింఛను వస్తున్నప్పటినుండి పరిచర్యలో ఎక్కువగా పాల్గొనగలిగాను. కానీ కొన్ని సంవత్సరాల క్రితం కొద్దిగా పక్షవాతం రావడంతో మా చిన్నబ్బాయి వాళ్లతో ఉండడానికి వెళ్లాను. నా ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఎన్నో వారాలు ఆస్పత్రిలో గడపాల్సివచ్చింది. ఆ తర్వాత నన్ను నర్సింగ్‌ హోమ్‌లో చేర్పించారు. ఎప్పుడూ నొప్పితో బాధపడుతూ ఉన్నా నర్సులకు, రోగులకు, అక్కడికి వచ్చేవారికి నేను సాక్ష్యమిస్తూనే ఉన్నాను. అంతేకాక ఎన్నో గంటలు ఒంటరిగా అధ్యయనం చేస్తూ గడుపుతున్నాను. సంఘంలోని సహోదరుల సహాయంతో దగ్గర్లో ఉన్న పుస్తక అధ్యయనానికి వెళ్లగలుగుతున్నాను.

జీవితపు చివరి దశలో ఓదార్పు

నేను, మావారు ఎవరికైతే సత్యం తెలుసుకోవడానికి సహాయం చేశామో, వాళ్ల గురించి విన్నప్పుడు నాకెంతో ఓదార్పు కలుగుతుంది. వాళ్ల పిల్లలు, మనవళ్లు మనవరాళ్లు ఎంతోమంది ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్‌, గ్రీస్‌, స్విట్జర్లాండ్‌లలో పూర్తికాల సేవచేస్తున్నారు. ఇప్పుడు మా పెద్దబ్బాయి, కోడలు వాళ్ల కొడుకుతో కెనడాలో ఉంటున్నారు. వాళ్ల పెద్ద కూతురు, ఆమె భర్త పయినీర్లు. వాళ్ల చిన్నకూతురు లిండా, ఆమె భర్త జాషువా స్నేవ్‌ 124వ గిలియడ్‌ తరగతికి ఆహ్వానించబడ్డారు.

జేమ్స్‌ తన భార్యతో ఇప్పుడు జర్మనీలో ఉంటున్నాడు. వాళ్ల పిల్లల్లో ఒక అబ్బాయి గ్రీస్‌లోని ఏథెన్స్‌ బెతెల్‌లో, మరో అబ్బాయి జర్మనీలోని సెల్టర్స్‌ బెతెల్‌లో సేవచేస్తున్నారు. ఇంకో కొడుకు, కూతురు, ఆమె భర్త జర్మనీలో పయినీరు సేవ చేస్తున్నారు.

మా అమ్మ, మావారు పునరుత్థానమై వచ్చాక వాళ్లకి చెప్పడానికి ఎన్నో విషయాలున్నాయి! తమ కుటుంబం కోసం ఒక మంచి స్వాస్థ్యాన్ని వదిలి వెళ్లినందుకు వారెంతో సంతోషపడతారు. *

[అధస్సూచీలు]

^ పేరా 21 తేజరిల్లు! (ఆంగ్లం) అక్టోబరు 22, 1974, 12-15 పేజీలు చూడండి.

^ పేరా 26 ఈ ఆర్టికల్‌ ప్రచురణ కోసం సిద్ధం చేయబడుతున్నప్పుడు సహోదరి పెట్రీడీస్‌ చనిపోయారు, అప్పుడామె వయసు 93.

[24వ పేజీలోని బ్లర్బ్‌]

ఈ సందర్భంలో కూడా యెహోవా మమ్మల్ని పరిణతి చెందిన క్రైస్తవ స్నేహితుల ప్రోత్సాహకరమైన సహవాసం ద్వారా బలపరిచాడు

[24వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

సైప్రస్‌

నికోషియా

మధ్యధరా సముద్రము

ఈజిప్టు

కైరో

అలెగ్జాండ్రియా

అల్‌ అలామేన్‌

ఇజ్‌మేలియా

సూయజ్‌

పోర్ట్‌ టాఫిక్‌

సూయజ్‌ కాలువ

[చిత్రసౌజన్యం]

Based on NASA/Visible Earth imagery

[23వ పేజీలోని చిత్రం]

1938లో మావారితో

[25వ పేజీలోని చిత్రం]

మా అబ్బాయి జేమ్స్‌, అతని భార్య

[25వ పేజీలోని చిత్రం]

మా అబ్బాయి జాన్‌, అతని భార్య