కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సాధించగలిగే లక్ష్యాలను పెట్టుకుని సంతోషాన్ని పొందండి

సాధించగలిగే లక్ష్యాలను పెట్టుకుని సంతోషాన్ని పొందండి

సాధించగలిగే లక్ష్యాలను పెట్టుకుని సంతోషాన్ని పొందండి

“అయ్యో! నేనీసారి కూడా చెయ్యలేకపోయానే.” మీరు చెయ్యాలనుకున్నది చేయలేక ఎన్నోసార్లు ఇలా అనుకుని ఉంటారు. చిన్న పిల్లలున్న ఒక యవ్వన క్రైస్తవురాలు వారి ఆలనాపాలనా చూసుకోవాలి కాబట్టి క్రైస్తవ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనలేకపోతున్నానని బాధపడుతూ అలానే అనుకోవచ్చు. ఒక క్రైస్తవుడు తాను పెరిగిన వాతావరణాన్నిబట్టి సంఘంలో ఎక్కువగా పని చేయలేకపోతున్నానని అనుకుంటుండవచ్చు. వృద్ధురాలైన ఒక క్రైస్తవ సహోదరి చురుగ్గా తిరిగే శక్తిలేక మునుపటిలా సేవచేయలేకపోతున్నందుకు నిరాశపడుతుండవచ్చు. కుటుంబ పరిస్థితులను బట్టి యెహోవా సేవలో తాను అనుకున్నంత చేయలేకపోతున్న క్రిస్టియాన్‌ ఇలా అంది: “ఒక్కోసారి పయినీరు సేవ గురించిన ప్రసంగం వింటే చాలు, నాకు ఏడుపు వచ్చేస్తుంది.”

అలా అనిపించినప్పుడు మనమేమి చేయాలి? కొందరు క్రైస్తవులు ఎలా తమ పరిస్థితులను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా వ్యవహరించగలిగారు? మీ సామర్థ్యాలనుబట్టి లక్ష్యాలను పెట్టుకోవడం వల్ల మీరెలా ప్రయోజనం పొందుతారు?

సాధించగలిగే లక్ష్యాలను పెట్టుకోండి

అపొస్తలుడైన పౌలు మనమెలా ఆనందంగా ఉండవచ్చో చెబుతూ, “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును [‘మీరు అధికంగా ఆశించేవారు కాదని,’ NW] సకల జనులకు తెలియబడనియ్యుడి” అని చెప్పాడు. (ఫిలి. 4:4, 5) దేవుని సేవలో మరింత ఆనందాన్ని, తృప్తిని పొందాలంటే మనం మన శక్తి సామర్థ్యాలను, పరిస్థితులను అర్థం చేసుకుని వాటి ప్రకారం లక్ష్యాలను పెట్టుకోవాలి. ఎలాగైనా సరే ఫలాని పని చేయాలనుకుని మన సామర్థ్యానికి మించి కష్టపడితే, అనవసరంగా బాధపడాల్సివస్తుంది. అయితే, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుని, ప్రకటనా పనిలో చేయగలిగినంత చేయకపోవడానికి దాన్ని ఒక సాకుగా చేసుకోకుండా జాగ్రత్తపడాలి.

మన పరిస్థితులేవైనప్పటికీ, పూర్ణాత్మతో పూర్ణహృదయంతో తన సేవలో చేయగలిగినంత చేయాలని యెహోవా కోరుతున్నాడు. (కొలొ. 3:23, 24) అలా చేయకపోతే మనం మన సమర్పణకు తగ్గట్టుగా జీవిస్తున్నామని చెప్పలేం. (రోమా. 12:1) అంతేగాక యెహోవాకు మనస్ఫూర్తిగా సేవ చేయడం ద్వారా వచ్చే నిజమైన సంతృప్తిని ఆనందాన్ని, గొప్ప ఆశీర్వాదాలను దూరంచేసుకుంటాం.​—⁠సామె. 10:22.

ఇతరుల నుండి ‘అధికంగా ఆశించకపోవడం’ అని బైబిల్లో అనువదించబడిన వాక్యానికి ఇతరుల కష్టసుఖాలను ఆలోచించి ప్రవర్తించడమనే అర్థముంది. అంతేకాక అక్షరార్థంగా దానికి, ‘ఒకరి అభిప్రాయాలను సమ్మతించడం’ అని కూడా అర్థం. (యాకో. 3:17) అదేవిధంగా, మన విషయంలో కూడా నిక్కచ్చిగా ఉండకూడదనే అర్థం ఉంది. కాబట్టి మనం మన పరిస్థితులనుబట్టి ఎంతవరకు చేయగలం అనేది ఆలోచించాలి. మనం ఎక్కువగా ఆశించని​వారిగా ఉంటేనే అలా ఆలోచించగలుగుతాం. అలా చేయడం కష్టమా? కొందరికి అది కష్టమే. వారు వేరేవాళ్ల విషయంలో సానుభూతితో ఆలోచించినా తమ విషయం వచ్చేసరికి మాత్రం అలా ఆలోచించలేరు. ఉదాహరణకు, మన స్నేహితులెవరైనా తమ శక్తికి మించిన పనులు చేస్తూ అలసిపోతుంటే, వారు తమ జీవితాల్లో మార్పులు చేసుకోవడంవల్ల వచ్చే ప్రయోజనాల గురించి చెప్పమా? అదేవిధంగా, మనం కూడా మన దైనందిన జీవితంలో ఎప్పుడు మన శక్తిసామర్థ్యాలకు మించి పని చేస్తున్నామో గుర్తించగలగాలి.​—⁠సామె. 11:17.

పిల్లల నుండి ఎక్కువగా ఆశించే తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగినవారికి తమ పరిమితుల గురించి సరైన విధంగా ఆలోచించడం మరింత కష్టమనిపించవచ్చు. చిన్నప్పుడు తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి తమ శక్తికి మించిన పనులు చేయాల్సి వచ్చేదని కొందరు భావించారు. మన విషయంలో అదే నిజమైతే, యెహోవా కూడా మననుండి ఎక్కువగా ఆశిస్తాడనే తప్పుడు అభిప్రాయం ఉండవచ్చు. మనం మనస్ఫూర్తిగా సేవిస్తే యెహోవా మనల్ని ప్రేమిస్తాడు. ఆయనకు ‘మనము నిర్మింపబడిన రీతి తెలుసు, మనము మంటివారమని జ్ఞాపకము చేసికొనుచున్నాడు’ అని ఆయన వాక్యం హామీనిస్తోంది. (కీర్త. 103:14) మనకు పరిమితులున్నాయని ఆయనకు తెలుసు. పరిమితులున్నా మనం ఉత్సాహంగా సేవించినప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన సేవలో మనం ఖచ్చితంగా ఇంత చేయాలని యెహోవా దేవుడు ఆశించడని గుర్తుంచుకున్నప్పుడు, మనం మన పరిమితులను గుర్తించి శక్తికి మించి చేయాలని అనుకోము.​—⁠మీకా 6:8.

అయినా, తమ సామర్థ్యాలనుబట్టి లక్ష్యాలను పెట్టుకోవడం కొందరికి కష్టమనిపించవచ్చు. మీకూ అలాగే అనిపిస్తే మీ గురించి బాగా తెలిసిన అనుభవంగల క్రైస్తవునితో ఎందుకు మాట్లాడకూడదు? (సామె. 27:9) ఉదాహరణకు, మీరు క్రమ పయినీరు సేవ చేయాలనుకుంటున్నారని అనుకుందాం. అదో చక్కని లక్ష్యమే. కానీ దాన్ని సాధించడం కష్టమని మీకనిపిస్తోందా? మీరు జీవితంలో కొన్ని అనవసర విషయాలను ప్రక్కనపెట్టాల్సివుందేమో ఆలోచించండి. మీరు నమ్మే ఒక క్రైస్తవ స్నేహితుడు లేదా స్నేహితురాలు, మీకున్న అనేక కుటుంబ బాధ్యతలనుబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు క్రమ పయినీరు సేవ చేయగలరో లేదో నిర్ణయించుకోవడానికి సహాయం చేయవచ్చు. మీరు పయినీరు సేవ కోసం ఎక్కువ కృషి చేయగలరేమో ఆలోచించుకునేందుకు వారు సహాయం చేయవచ్చు. లేక పరిచర్యలో మరింత ఎక్కువ చేయడానికి దినచర్యలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో గ్రహించేందుకు సహాయం చేయవచ్చు. భార్య తన సామర్థ్యాలనుబట్టి ఎంతవరకు చేయగలదనే విషయాన్ని గుర్తించేందుకు భర్త కూడా ఆమెకు సహాయం చేయగలడు. ఉదాహరణకు, ఆమె ఫలాని నెల పరిచర్యలో ఎక్కువ సమయం గడపాలనుకుంటే, దానికి ముందు కొన్ని రోజులు చక్కగా విశ్రాంతి తీసుకొమ్మని ఆయన సలహా ఇవ్వొచ్చు. దానివల్ల ఆమె పునరుత్తేజంతో నెలంతా పరిచర్యలో సంతోషంగా పాల్గొనగలుగుతుంది.

మీరు చేయగలిగే వాటినే చేయండి

వయసు మీదపడడంవల్ల లేక అనారోగ్యంవల్ల మనం యెహోవా సేవలో ఎక్కువ చేయలేకపోతుంటాం. మీకు చిన్న పిల్లలుంటే సమయం, శక్తి అంతా వారిని చూసుకోవడానికే సరిపోతుంది కాబట్టి, సరిగ్గా వ్యక్తిగత అధ్యయనం చేయలేకపోతున్నామనీ సంఘ కూటాలనుండి ప్రయోజనం పొందలేకపోతున్నామనీ మీకనిపిస్తుండవచ్చు. అయితే, మీకున్న పరిమితుల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ చేయగలిగినవాటిని గుర్తించలేకపోతున్నారా?

ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఒక లేవీయుడు తీర్చడం సాధ్యం కాని ఒక కోరిక కోరాడు. ప్రతీ సంవత్సరం దేవాలయంలో రెండు వారాలు సేవచేసే గొప్ప అవకాశం ఆయనకుండేది. అయితే, ఆయన ఎప్పటికీ బలిపీఠం దగ్గరే ఉండిపోవాలని కోరుకున్నాడు. అది అభినందించదగినదే! (కీర్త. 84:1-3) అది తీరకపోయినా తనకున్న సేవాధిక్యతతో సంతృప్తిగా ఎలా ఉండగలిగాడు? దేవాలయ ఆవరణలో ఒక రోజు సేవచేయడం కూడా గొప్ప ఆశీర్వాదమేనని ఆయన గుర్తించాడు. (కీర్త. 84:4, 5, 10) అదేవిధంగా, మన పరిమితుల గురించే ఆలోచించే బదులు మనం ఏమి చేయగలమో గుర్తించడానికి, అది చేసే అవకాశం దొరికినందుకు కృతజ్ఞతతో ఉండడానికి ప్రయత్నించాలి.

కెనడాలో ఉండే నెర్లాండే అనే సహోదరి ఉదాహరణను చూడండి. ఆమెది చక్రాల కుర్చీలోనుండి కదల్లేని పరిస్థితి. దాంతో తాను పరిచర్యలో ఎక్కువగా పాల్గొనలేకపోతున్నాని బాధపడేది. అయితే ఇంటికి దగ్గర్లోనే ఉన్న పెద్ద షాపింగ్‌ సెంటర్‌లో ప్రకటించవచ్చని అనుకోవడం ద్వారా తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంది. “నేను షాపింగ్‌ సెంటర్‌కి దగ్గర్లో చక్రాల కుర్చీలో కూర్చుంటాను. ఎవరైనా కాస్త విశ్రాంతి తీసుకుందామని అక్కడున్న బెంచీమీద కూర్చుంటే వారికి సాక్ష్యమిస్తాను. అలా చేయడం నాకెంతో సంతోషాన్నిస్తుంది” అని ఆమె చెప్పింది. ప్రాముఖ్యమైన ఈ పద్ధతిని ఉపయోగించి పరిచర్య చేయడం నెర్లాండేకు ఎంతో సంతృప్తినిస్తుంది.

అవసరమైతే మార్పులు చేసుకోండి

ఓడ తెరచాపల్లోకి గాలి వీచినప్పుడు అది ముందుకు దూసుకెళ్తుంది. అయితే తుఫాను మొదలైనప్పుడు ఓడ నడిపే వ్యక్తి తెరచాపల దిశను మార్చాల్సివస్తుంది. ఆయన తుఫానునైతే ఆపలేడు కానీ తెరచాప దిశను మార్చడం ద్వారా ఓడను తన నియంత్రణలో ఉంచుకోగలడు. అలాగే మన జీవితంలో కూడా తుఫానులాంటి అననుకూల పరిస్థితులు రావచ్చు, వాటి విషయంలో మనమేమీ చేయలేం. కానీ మన శక్తి సామర్థ్యాలను సరైన విధంగా ఉపయోగించడం ద్వారా, మన ఆలోచనలను సరిచేసుకోవడం ద్వారా, మన భావోద్రేకాలను అదుపులో ఉంచుకోవడం ద్వారా మన జీవితాన్ని సాధ్యమైనంతవరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. మారిన మన పరిస్థితులను అర్థం చేసుకున్నప్పుడు మనం సంతృప్తిగా, సంతోషంగా దేవుణ్ణి సేవించగలుగుతాం.​—⁠సామె. 11:2.

కొన్ని సందర్భాల గురించి ఆలోచించండి. మనం త్వరగా అలసిపోతుంటాం అని తెలిసినప్పుడు, సాయంత్రం కూటాలకు హాజరయ్యే ఓపిక ఉండేలా ఉదయమంతా అలసట కలిగించే పనులు చేయకుండా ఉండడం మంచిది. అలాచేసినప్పుడు మనం సహోదర సహోదరీల సహవాసం నుండి పూర్తి ప్రయోజనం పొందగలుగుతాం. పిల్లల ఆరోగ్యం బాగాలేనందువల్ల తల్లి ఇంటింటి పరిచర్యలో పాల్గొనలేకపోతుండవచ్చు. అలాంటప్పుడు పిల్లలు నిద్రపోతున్న సమయంలో మరో సహోదరిని తన ఇంటికి పిలిచి ఆమెతోపాటు టెలిఫోన్‌ సాక్ష్యమివ్వడం ఆమెకు అనుకూలంగా ఉండొచ్చు.

సంఘ కూటాల్లో చర్చించబడే సమాచారమంతటినీ ముందుగానే అధ్యయనం చేయడానికి మీకు వీలుపడడంలేదా? అలాగైతే, మీరు ఎంతవరకు సిద్ధపడగలరో నిర్ణయించుకుని సాధ్యమైనంత చక్కగా సిద్ధపడండి. మనకున్న ప్రస్తుత లక్ష్యాలను మార్చుకోవడంవల్ల మనం చురుగ్గా, సంతోషంగా ఉండగలం.

మన లక్ష్యాలను మార్చుకోవడానికి పట్టుదల, కృషి అవసరమవచ్చు. ఫ్రాన్స్‌ దేశంలో ఉండే సర్జ్‌, ఆన్యీస్‌ అనే దంపతులు తమ భవిష్యత్‌ ప్రణాళికల్లో చాలా మార్పులు చేసుకోవాల్సివచ్చింది. “ఆన్యీస్‌ తల్లికాబోతోందన్న వార్త వినగానే మిషనరీలు కావాలన్న మా కల చెదిరిపోయింది” అని సర్జ్‌ చెప్పాడు. ఇప్పుడు వారికి తెలివైన ఇద్దరు ఆడపిల్లలున్నారు. తను, తన భార్య ఎలా ఒక కొత్త లక్ష్యాన్ని పెట్టుకోవాల్సివచ్చిందో సర్జ్‌ వివరిస్తూ, “మేము వేరే దేశానికి వెళ్లి సేవచేయలేం కాబట్టి మా దేశంలోనే ‘మిషనరీలుగా’ సేవచేయాలని నిర్ణయించుకుని వేరే భాష గుంపుతో సహవసిస్తున్నాం.” ఈ కొత్త లక్ష్యాన్ని పెట్టుకున్నందుకు వాళ్లకేమైనా ప్రయోజనాలు చేకూరాయా? “సంఘానికి మేము ఉపయోగపడుతున్నామనే సంతోషం మాకుంది” అని సర్జ్‌ చెప్పాడు.

ఫ్రాన్స్‌లో ఉంటున్న ఆడీల్‌ అనే సహోదరికి దాదాపు 70 ఏళ్లుంటాయి. ఆమె కీళ్లవ్యాధితో బాధపడుతోంది, కాబట్టి ఎక్కువసేపు నిలబడలేదు. ఆరోగ్య సమస్యలవల్ల తాను ఇంటింటి పరిచర్యకు వెళ్లలేకపోతున్నందుకు ఆమె నిరుత్సాహపడింది. అయినా పరిచర్య చేయడం మానలేదు. టెలిఫోన్‌ సాక్ష్యమివడం ద్వారా ఆమె పరిచర్యా విధానాన్ని మార్చుకుంది. “నేను అనుకున్నదానికన్నా ఇదెంతో సులభంగా ఉంది, నాకెంతో నచ్చింది” అని ఆమె అంటోంది. ఈ పరిచర్యా పద్ధతిని ఉపయోగించడం వల్ల ఆమె తిరిగి అదే ఉత్సాహంతో పనిచేయగలుగుతోంది.

సాధించగలిగే లక్ష్యాలను పెట్టుకోవడం వల్ల ఆశీర్వాదాలొస్తాయి

మన పరిమితుల గురించి సరైన విధంగా ఆలోచించడం వల్ల ఎన్నో బాధలు తప్పుతాయి. సాధించగలిగే లక్ష్యాలను పెట్టుకున్నప్పుడు, పరిమితులున్నా ఫలానిది సాధించామనే సంతృప్తి మనకుంటుంది. మనం సాధించగలిగే లక్ష్యం చిన్నదే అయినా దాన్నిబట్టి మనం సంతోషిస్తాం.​—⁠గల. 6:4.

మన సామర్థ్యాలనుబట్టి లక్ష్యాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా మనం ఇతర క్రైస్తవుల కష్టసుఖాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించేవారిగా తయారవుతాం. వారి పరిమితులేమిటో మనకు తెలుసు కాబట్టి వారు మనకోసం చేసే పనుల విషయంలో కృతజ్ఞత కనబరుస్తాం. మనకివ్వబడిన సహాయంపట్ల కృతజ్ఞత చూపించడం ద్వారా ఇతరులు కూడా సహకార స్ఫూర్తిని చూపించేలా, అవగాహనతో వ్యవహరించేలా ప్రోత్సహించినవారమవుతాం. (1 పేతు. 3:8) ప్రేమగల తండ్రిగా యెహోవా దేవుడు మనం చేయగలిగినదానికన్నా ఎక్కువ ఆశించడు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మన సామర్థ్యాన్నిబట్టి సాధించగలిగే లక్ష్యాలను పెట్టుకున్నప్పుడు యెహోవా సేవలో మనం చేసేవన్నీ మనకు సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి.

[29వ పేజీలోని బ్లర్బ్‌]

 వుని సేవలో మరింత ఆనందాన్ని తృప్తిని పొందాలంటే మనం మన శక్తి సామర్థ్యాలను, పరిస్థితులను అర్థం చేసుకుని వాటి ప్రకారం లక్ష్యాలను పెట్టుకోవాలి

[30వ పేజీలోని చిత్రం]

నెర్లాండే సహోదరి పరిచర్యలో తాను చేయగలిగినంత చేయడం ద్వారా సంతోషాన్ని పొందుతోంది

[31వ పేజీలోని చిత్రం]

“తెరచాపల దిశను మార్చడం” నేర్చుకోండి

[చిత్రసౌజన్యం]

© Wave Royalty Free/age fotostock

[32వ పేజీలోని చిత్రం]

సర్జ్‌, ఆన్యీస్‌లు కొత్త లక్ష్యాలను పెట్టుకోవడంవల్ల ప్రయోజనం పొందారు