కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గౌరవపూర్వకంగా ప్రవర్తించడం ద్వారా యెహోవాను ఘనపరచండి

గౌరవపూర్వకంగా ప్రవర్తించడం ద్వారా యెహోవాను ఘనపరచండి

గౌరవపూర్వకంగా ప్రవర్తించడం ద్వారా యెహోవాను ఘనపరచండి

“ఆయన [యెహోవా] కార్యము మహిమా ప్రభావములుగలది.”​—⁠కీర్త. 111:3.

హుందాగా లేదా గౌరవపూర్వకంగా ఉండడమంటే ఏమిటో చెప్పమన్నప్పుడు పదేళ్ల మ్యాడసన్‌ “మంచి బట్టలేసుకోవడం” అని ఠక్కున జవాబిచ్చింది. దేవుడు ‘మహాత్మ్యమును ప్రభావమును ధరించివున్నాడు’ అని బైబిలు చెబుతుందన్న విషయం బహుశా ఆ అమ్మాయికి తెలిసుండకపోవచ్చు. (కీర్త. 104:1) హుందాగా ఉండడమంటే చక్కగా బట్టలేసుకోవడమని మనం కొన్నిసార్లు అనుకోవచ్చు. ఉదాహరణకు, క్రైస్తవ స్త్రీలు “అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించు[కోకూడదు]” అని అపొస్తలుడైన పౌలు ఆదేశించాడు. (1 తిమో. 2:9) యెహోవా “మహిమా ప్రభావములను” ఉన్నతపరిచేలా గౌరవపూర్వకంగా ప్రవర్తించాలంటే కేవలం మంచి దుస్తులు వేసుకోవడం మాత్రమే సరిపోదు.​—⁠కీర్త. 111:3.

2 బైబిల్లో, “గౌరవం” అనే మాటకు ఉపయోగించబడిన హెబ్రీ పదానికి “గౌరవప్రభావములు”, “ఘనత” అని కూడా అనువదించబడ్డాయి. “గౌరవం” అంటే నిజమైన యోగ్యత, పరువు, మన్నన, గొప్పతనం అని నిఘంటువులు నిర్వచిస్తున్నాయి. అధిక గౌరవం, మన్నన పొందే యోగ్యత యెహోవాకు తప్ప మరెవ్వరికీ లేదు. అందుకే ఆయనకు సమర్పించుకున్న సేవకులముగా మనం గౌరవపూర్వకంగా మాట్లాడాలి, ప్రవర్తించాలి. అయితే, మానవులకు గౌరవపూర్వకంగా ప్రవర్తించే సామర్థ్యముందని ఎందుకు చెప్పవచ్చు? యెహోవా మహిమా ప్రభావములు వేటిలో కనిపిస్తున్నాయి? దేవుని మహిమను గురించి తెలుసుకున్న తర్వాత మనమేమి చేయాలి? ఇతరులను గౌరవించే విషయంలో యేసుక్రీస్తు నుండి మనమేమి నేర్చుకోవచ్చు? దేవునిలాగే మనం ఎలా గౌరవపూర్వకంగా ప్రవర్తించవచ్చు?

గౌరవపూర్వకంగా ప్రవర్తించే సామర్థ్యం మనకు ఎలా వచ్చింది?

3 మానవులు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు కాబట్టి, మానవులందరికీ గౌరవపూర్వకంగా ప్రవర్తించే సామర్థ్యముంది. మొదటి మానవునికి భూమిని చూసుకునే బాధ్యతను అప్పగించడం ద్వారా యెహోవా ఆయనను ఘనపర్చాడు. (ఆది. 1:26, 27) మానవులు అపరిపూర్ణులైన తర్వాత కూడా భూమి విషయంలో వారికున్న బాధ్యతల గురించి యెహోవా వారికి మళ్లీ తెలియజేశాడు. అలా దేవుడు ఇప్పటికీ మానవులకు మహిమ అనే ‘కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు.’ (కీర్తనలు 8:5-9 చదవండి.) * దేవుడు మనల్ని ఘనపర్చాడు కాబట్టి మనం కూడా గౌరపూర్వకంగా ప్రతిస్పందించాలి అంటే యోహోవా మహోన్నత నామాన్ని పూజ్యభావంతో, గౌరవంతో స్తుతించాలి.

4 యెహోవా ప్రాముఖ్యంగా తనకు పవిత్ర సేవచేసే​వారిని ఎంతో ఘనపరుస్తాడు. దేవుడు హేబెలు అర్పణను అంగీకరించి కయీను అర్పణను తిరస్కరించడం ద్వారా హేబెలును ఘనపర్చాడు. (ఆది. 4:4, 5) తన తర్వాత ఇశ్రాయేలీయులపై నాయకుడు కాబోయే యెహోషువకు ‘తన ఘనతలో కొంత’ ఇవ్వమని మోషే ఆజ్ఞాపించబడ్డాడు. (సంఖ్యా. 27:20) దావీదు కుమారుడైన సొలొమోను గురించి బైబిలు ఇలా చెబుతోంది: “యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి యెదుటను బహుగా ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన యే రాజునకైనను కలుగని రాజ్యప్రభావమును అతని కనుగ్రహించెను.” (1 దిన. 29:25) దేవుడు తన ‘రాజ్యప్రభావము గురించి’ నమ్మకంగా ప్రకటించిన అభిషిక్త క్రైస్తవులు పునరుత్థానం చేయబడినప్పుడు వారిని ఎంతో అసాధారణంగా ఘనపరుస్తాడు. (కీర్త. 145:11-13) అంతకంతకూ పెరుగుతున్న యేసుకు చెందిన ‘వేరే గొఱ్ఱెలకు’ కూడా అలా యెహోవాను ఘనపరచడంలో ఆశీర్వాదకరమైన, గౌరవప్రదమైన పాత్ర ఉంది.​—⁠యోహా. 10:16.

యెహోవా మహిమా ప్రభావములు స్పష్టంగా కనిపిస్తున్నాయి

5 దేవుని గొప్పతనం ముందు మానవుడు ఎంత అల్పుడో తెలియజేసే ఒక పాటలో కీర్తనకర్త దావీదు ఇలా పాడాడు: “యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది.” (కీర్త. 8:1) “భూమ్యాకాశములను” సృజించక ముందటి నుండి భూమిని పరదైసుగా మార్చి మానవులను పరిపూర్ణులుగా చేయాలనే తన సంకల్పం అద్భుతంగా నెరవేరేంతవరకు అంటే యుగయుగములకు యెహోవా దేవుడే విశ్వంలోని అత్యంత మహోన్నతుడు, మహిమాన్వితుడు.​—⁠ఆది. 1:1; 1 కొరిం. 15:24-28; ప్రక. 21:1-5.

6 మెరుస్తున్న “రత్నాలు” పొదిగినట్లు శోభాయ​మానంగా ఉండే నక్షత్రాలతో నిండిన నిర్మలమైన ఆకాశాన్ని చూసినప్పుడు దైవభక్తిగల కీర్తనకర్త ఎంత పులకించిపోయుంటాడో కదా! దేవుడు ‘తెరను పరచినట్టు ఆకాశవిశాలమును’ ఎలా పరిచాడో చూసి ఆశ్చర్యపోయిన కీర్తనకర్త, ఆయనకున్న అద్భుతమైన సృజనాత్మక నైపుణ్యాన్నిబట్టి ఆయన మహాత్మ్యమును ప్రభావమును ధరించాడని వర్ణించాడు. (కీర్తనలు 104:1, 2 చదవండి.) అదృశ్యుడైన, సర్వశక్తుడైన సృష్టికర్త మహాత్మ్యము, ప్రభావం సృష్టిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

7 పాలపుంత నక్షత్రవీధినే తీసుకోండి. ఎన్నో నక్షత్రాలు, గ్రహాలు, సౌరకుటుంబాలు ఉన్న ఈ నక్షత్రవీధిలో, భూమి సముద్ర తీరంలో ఇసుకరేణువంత చిన్నగా కనిపిస్తుంది. అంతెందుకు, మన నక్షత్రవీధిలోనే 10,000 కోట్ల కన్నా ఎక్కువ నక్షత్రాలున్నాయి! మీరు సెకనుకు ఒకటి చొప్పున, 24 గంటలూ నక్షత్రాలను లెక్కపెట్టగలిగితే, 10,000 కోట్ల నక్షత్రాలను లెక్కపెట్టడానికి మీకు 3,000 కన్నా ఎక్కువ సంవత్సరాలే పడుతుంది.

8 పాలపుంత నక్షత్రవీధిలోనే 10,000 కోట్ల నక్షత్రాలున్నాయంటే, విశ్వంలో ఉన్న మిగతా నక్షత్రవీధుల్లో ఎన్ని నక్షత్రాలుంటాయో ఆలోచించండి. విశ్వంలో ఎంతలేదన్నా 5,000 కోట్లు నుండి 12,500 కోట్ల నక్షత్రవీధులుండొచ్చని ఖగోళశాస్త్రజ్ఞులు అంచనావేస్తున్నారు, వాటిలో పాలపుంత నక్షత్రవీధి ఒకటి మాత్రమే. అలాగైతే, విశ్వమంతటిలో ఎన్ని నక్షత్రాలున్నట్లు? అది మన ఊహకందనిది. అయినా, యెహోవా ‘నక్షత్రముల సంఖ్యను నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.’ (కీర్త. 147:4) యెహోవా అలాంటి మహాత్మ్యము, ప్రభావములను ధరించడాన్ని చూసినప్పుడు మీరు ఆయన గొప్ప నామాన్ని స్తుతించాలని మీకు అనిపించడంలేదా?

9 ఆకాశంలోని అద్భుత సృష్టికార్యాలను పరిశీలించిన తర్వాత ఇప్పుడు మనం ప్రతీరోజు తినే ఆహారం గురించి ఆలోచిద్దాం. యెహోవా ‘ఆకాశమును భూమిని సృజించినవాడే’ కాదు ‘ఆకలిగొనినవారికి ఆహారము దయచేయువాడు’ కూడ. (కీర్త. 146:6, 7) దేవుని “మహిమా ప్రభావములు” ఆయన అద్భుతమైన సృష్టిలోనే కాక, బ్రెడ్డు తయారుచేయడానికి అవసరమయ్యే పదార్థాలనిచ్చే మొక్కల్లో కూడా కనిపిస్తుంది. (కీర్తనలు 111:1-5 చదవండి.) ప్రాచీన కాలంలో ఇశ్రాయేలీయులకే కాక వేరే జనాంగాలకు కూడా, బ్రెడ్డే ముఖ్యాహారం. బ్రెడ్డు మామూలు ఆహారంగానే పరిగణించబడుతుంది. అయినా, సాధారణ పదార్థాలు రుచికరమైన బ్రెడ్డుగా మారడానికి తోడ్పడే రసాయన ప్రక్రియలు మాత్రం చాలా సంక్లిష్టమైనవి.

10 బైబిలు రాయబడుతున్న కాలంలో ఇశ్రాయేలీయులు బ్రెడ్డు తయారుచేయడానికి గోధుమ పిండిని లేక యవలు పిండిని, నీళ్లను ఉపయోగించేవారు. అది పులియడానికి కొన్నిసార్లు ఈస్ట్‌ లేక పులిపిండిని వాడేవారు. ఈ సాధారణ పదార్థాల మధ్య సంక్లిష్టమైన రసాయనిక చర్యలు జరిగి చివరకు అది బ్రెడ్డుగా ఎలా తయారౌతుందో ఇంతవరకు ఎవరికీ పూర్తిగా తెలియలేదు. అంతేకాక, బ్రెడ్డు మన శరీరంలో జీర్ణమయ్యే ప్రక్రియ ఆశ్చర్యపరిచే రీతిలో ఎంతో సంక్లిష్టంగా ఉంటుంది. “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి” అని కీర్తనకర్త పాడాడంటే అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. (కీర్త. 104:24) మీకు కూడా యెహోవాను స్తుతించాలని అనిపిస్తోందా?

దేవుని మహిమా ప్రభావములు తెలుసుకున్న తర్వాత మీరేమి చేయాలనుకుంటున్నారు?

11 రాత్రిపూట ఆకాశాన్ని చూసి అబ్బురపడడానికి మనం ఖగోళశాస్త్రజ్ఞులం కానవసరంలేదు, అలాగే బ్రెడ్డును ఆస్వాదించడానికి రసాయన శాస్త్రజ్ఞులం కానవసరం​లేదు. అయితే మన సృష్టికర్త గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన సృష్టి కార్యాల గురించి ధ్యానించేందుకు సమయం తీసుకోవాలి. అలా ధ్యానించిన తర్వాత మనం ఏమి చేయాలనుకుంటాం? యెహోవా ఇతర కార్యాల గురించి ధ్యానించిన తర్వాత మనం ఏమి చేయాలనుకుంటామో ఇప్పుడూ అదే చేయాలనుకుంటాం.

12 యెహోవా తన ప్రజల కోసం చేసిన గొప్ప కార్యాల గురించి దావీదు ఇలా పాడాడు: “మహోన్నతమైన నీ ప్రభావ​మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను.” (కీర్త. 145:5) అలా చేయాలంటే మనం బైబిలు అధ్యయనం చేస్తూ, దానిలోని విషయాలను ధ్యానించేందుకు సమయం తీసుకోవాలి. ధ్యానించడంవల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? దేవుని మహిమా ప్రభావముల విషయంలో మనకున్న అవగాహన పెరుగుతుంది. అప్పుడు మనం కూడా దావీదులాగే యెహోవాను ఇలా ఘనపరచగలుగుతాం: “నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను.” (కీర్త. 145:6) యెహోవాతో మనకున్న సంబంధం బలపడుతుంది, ఆయన గురించి ఇతరులకు ఉత్సాహంతో, కృతనిశ్చయంతో చెప్పాలనిపిస్తుంది. మీరు ఉత్సాహంగా సువార్త ప్రకటిస్తూ ప్రజలు యెహోవా దేవుని ఘనతను, మహిమా ప్రభావములను అర్థంచేసుకునేందుకు సహాయం చేస్తున్నారా?

గౌరవం చూపించడంలో యేసు, దేవుణ్ణి పరిపూర్ణంగా అనుకరించాడు

13 దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్తను ఉత్సాహంగా ప్రకటించి మహిమా ప్రభావములుగల తన పరలోక తండ్రిని ఘనపరిచాడు. యెహోవా తన అద్వితీయ కుమారునికి ‘ప్రభుత్వమును ఆధిపత్యాన్ని’ అనుగ్రహించి ఆయనను ప్రత్యేకంగా ఘనపరిచాడు. (దానియేలు 7:13, 14 చదవండి.) అయినా యేసు గర్వించలేదు. బదులుగా, ఆయన తన ప్రజల పరిమితులను అర్థం చేసుకొని వారిని గౌరవించే కనికరంగల పరిపాలకుడు. నియమిత రాజుగా యేసు తాను కలుసుకున్న ప్రజలతో, ముఖ్యంగా ఇతరులు తిరస్కరించి అసహ్యించుకునేవారితో ఎలా వ్యవహరించాడో తెలుసుకునేందుకు ఒక ఉదాహరణను చూద్దాం.

14 ప్రాచీన కాలాల్లో కుష్ఠరోగుల పరిస్థితి హృదయాన్ని కలచివేసే విధంగా ఉండేది, వారు క్రమక్రమంగా క్షీణించి మరణించేవారు. ఆ వ్యాధి మెల్లమెల్లగా రోగి శరీర భాగాలకు వ్యాపించేది. కుష్ఠరోగిని బాగుచేయడం చనిపోయిన వ్యక్తిని లేపడమంత కష్టంగా పరిగణించబడేది. (సంఖ్యా. 12:12; 2 రాజు. 5:7, 14) కుష్ఠరోగులు అపవిత్రులుగా నిర్ణయించబడేవారు, ప్రజలు వారిని అసహ్యించుకొని, సమాజం నుండి వెలివేసేవారు. వారు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు “అపవిత్రుడను అపవిత్రుడను” అని బిగ్గరగా అరవాల్సివచ్చేది. (లేవీ. 13:43-46) కుష్ఠరోగి చచ్చిన వ్యక్తితో సమానంగా పరిగణించబడేవాడు. యూదామతనాయకుల వృత్తాంతాల ప్రకారం, కుష్ఠరోగిని దాదాపు 1.7 మీటర్ల దూరంలోనే నిల్చోనిచ్చేవారు. ఒక కుష్ఠరోగి దూరంలో కనిపించినా ఒక మతనాయకుడు ఆయనను దూరంగా ఉంచడానికి రాళ్లు విసిరేవాడని వాటిలో నివేదించబడింది.

15 అయితే, ఒక కుష్ఠరోగి తనను బాగుచేయమంటూ యేసు దగ్గరికి వచ్చి వేడుకున్నప్పుడు యేసు ప్రతిస్పందించిన తీరు గమనార్హం. (మార్కు 1:40-42 చదవండి.) యేసు కుష్ఠరోగిని తన దగ్గరి నుండి వెళ్లిపొమ్మని చెప్పేబదులు, ఇతరులు తిరస్కరించిన ఆయనపట్ల కనికరం, గౌరవం చూపించాడు. యేసు ఆయనను ఉపశమనం అవసరమున్న దయనీయ పరిస్థితుల్లోవున్న వ్యక్తిగానే దృష్టించాడు. యేసు ఆయన పరిస్థితిని చూసి జాలిపడి కనికరంతో వెంటనే చర్య తీసుకున్నాడు. ఆయన తన చెయ్యిచాపి, ఆ కుష్ఠరోగిని ముట్టుకొని ఆయనను బాగుచేశాడు.

16 గౌరవం చూపించే విషయంలో యేసు తన తండ్రిని అనుకరించినట్లే ఆయన అనుచరులుగా మనం ఆయనను ఎలా అనుసరించవచ్చు? ఒకరి హోదా, ఆరోగ్యం, వయసు వంటివాటితో నిమిత్తం లేకుండా అందరికీ తగినంత ఘనత, గౌరవం ఇవ్వడం ఒక విధానం. (1 పేతు. 2:17) ప్రాముఖ్యంగా, బాధ్యతాయుతమైన స్థానంలోవున్నవారు అంటే భర్తలు, తల్లిదండ్రులు, క్రైస్తవ పెద్దలు తమ సంరక్షణలో ఉన్నవారిని గౌరవించి, వారు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేలా సహాయం చేయాలి. అది క్రైస్తవులందరి బాధ్యతని నొక్కిచెబుతూ బైబిలు ఇలా చెబుతోంది: “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.”​—⁠రోమా. 12:10.

దేవుణ్ణి గౌరవప్రదంగా ఆరాధించడం

17 యెహోవాను ఆరాధిస్తున్నప్పుడు మనం గౌరవప్రదంగా ప్రవర్తించడం మరింత ప్రాముఖ్యం. “నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము” అని ప్రసంగి 5:1 చెబుతోంది. పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు చెప్పులు తీసేయాల్సిందిగా మోషే, యెహోషువలకు ఆజ్ఞాపించబడింది. (నిర్గ. 3:5; యెహో. 5:15) గౌరవానికి లేదా పూజ్యభావానికి సూచనగా అలా చేయమని చెప్పబడ్డారు. ఇశ్రాయేలు యాజకులు “మానమును కప్పుకొనుటకు” నారలాగులను వేసుకోవాలని ఆదేశించబడ్డారు. (నిర్గ. 28:42, 43) అలా చేయడం, వారు బలిపీఠం దగ్గర సేవచేస్తున్నప్పుడు అసభ్యకరంగా కనిపించకుండా ఉండేందుకు దోహదపడింది. యాజకుని కుటుంబంలోని వారందరూ గౌరవప్రదంగా ప్రవర్తించే విషయంలో దేవుని ప్రమాణాన్ని అనుసరించాల్సివచ్చేది.

18 కాబట్టి, మనం యెహోవాను గౌరవప్రదంగా ఆరాధించడంలో భాగంగా ఇతరులను గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. అలా చేసినప్పుడే మనం ఇతరుల గౌరవాన్ని పొందగలం. మనం చూపించే గౌరవం వేషధారణగా లేక కేవలం పేరుకు మాత్రమే చూపించే విధంగా ఉండకూడదు. మనుష్యులకు కనిపించే విధంగా కాకుండా దేవునికి కనిపించే విధంగా అంటే హృదయపూర్వకంగా ఉండాలి. (1 సమూ. 16:7; సామె. 21:2) గౌరవం చూపించడమనేది మనలో ఒక భాగమై మన ప్రవర్తనను, మన వైఖరిని, ఇతరులతో మనకున్న సంబంధాన్ని ప్రభావితం చేయాలి. అంతేకాక మన గురించి మనకున్న అభిప్రాయాన్ని కూడా అది ప్రభావితం చేయాలి. మనం ఏమి మాట్లాడినా ఏమి చేసినా అన్ని సమయాల్లోనూ గౌరవాన్ని కనబరచాలి. మన ప్రవర్తనా, కనబడే తీరు విషయంలోనైతే మనం అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలను గుర్తుంచుకుంటాం: “మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక . . . దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.” (2 కొరిం. 6:3, 8) అలా మనం ‘మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరిస్తాం.’​—⁠తీతు 2:9.

దేవునిలాగే గౌరవాన్ని చూపిస్తూ ఉండండి

19 “క్రీస్తుకు రాయబారులైన” అభిషిక్త క్రైస్తవులు గౌరవాన్ని చూపిస్తారు. (2 కొరిం. 5:20) వారికి యథార్థంగా సహకరించే “వేరే గొఱ్ఱెలు” మెస్సీయ రాజ్యానికి గౌరవప్రదమైన ప్రతినిధులు. ఒక రాయబారి లేక ప్రతినిధి తన ప్రభుత్వం పక్షాన ధైర్యంగా, గౌరవపూర్వకంగా మాట్లాడతాడు. కాబట్టి, మనం దేవుని రాజ్యాన్ని సమర్థిస్తూ గౌరవపూర్వకంగా, ధైర్యంగా మాట్లాడాలి. (ఎఫె. 6:19, 20) మనం ఇతరులకు “సువర్తమానము” ప్రకటించడం ద్వారా మనం వారిపట్ల గౌరవం చూపిస్తున్నామని మీకనిపించడంలేదా?​—⁠యెష. 52:7.

20 దేవుని మహిమకు అనుగుణంగా ప్రవర్తించడం ద్వారా మనం దేవుణ్ణి ఘనపర్చాలని నిశ్చయించుకోవాలి. (1 పేతు. 2:12) మనం ఎల్లప్పుడూ ఆయనపట్ల, ఆయన ఆరాధనపట్ల, మన తోటి ఆరాధకులపట్ల ఎంతో గౌరవాన్ని చూపిద్దాం. మనం యెహోవాకు గౌరవపూర్వకంగా చేస్తున్న ఆరాధననుబట్టి మహిమా ప్రభామును ధరించిన ఆయన సంతోషించాలని కోరుకుందాం.

[అధస్సూచి]

^ పేరా 6 8వ కీర్తనలోని దావీదు మాటలు ప్రవచనార్థకంగా పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తుకు కూడా వర్తిస్తున్నాయి.​—⁠హెబ్రీ. 2:5-9.

మీరెలా జవాబిస్తారు?

• యెహోవా మహిమా ప్రభావములు అర్థంచేసుకున్న తర్వాత మనమేమి చేయాలనుకోవాలి?

• ఒకానొక కుష్ఠరోగితో యేసు వ్యవహరించిన తీరు నుండి ఇతరులకు గౌరవం చూపించే విషయంలో మనమేమి నేర్చుకోవచ్చు?

• మనం యెహోవాను గౌరవించడానికున్న మార్గాలేమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) “గౌరవం” అనే పదాన్ని నిర్వచించండి. (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలను చర్చించనున్నాం?

3, 4. (ఎ) దేవుడు మనల్ని ఘనపర్చాడు కాబట్టి మనం ఎలా స్పందించాలి? (బి) కీర్తనలు 8:5-9లోని మాటలు ప్రవచనార్థకంగా ఎవరికి వర్తిస్తున్నాయి? (అధస్సూచి చూడండి.) (సి) యెహోవా గతంలో ఎవరిని ఘనపర్చాడు?

5. యెహోవా మహిమ ఎంత గొప్పది?

6. యెహోవా మహాత్మ్యమును ప్రభావమును ధరించాడని కీర్తనకర్త ఎందుకు చెప్పాడు?

7, 8. ఆకాశంలో యెహోవా మహాత్మ్యము, ప్రభావములు ఎలా కనిపిస్తున్నాయి?

9, 10. బ్రెడ్డుకు సంబంధించిన ప్రక్రియలు మన సృష్టికర్త జ్ఞానాన్ని ఎలా ఘనపరుస్తున్నాయి?

11, 12. దేవుని సృష్టి కార్యాలను ధ్యానించడంవల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

13. (ఎ) దానియేలు 7:13, 14 ప్రకారంగా, యెహోవా తన కుమారునికి ఏమి అనుగ్రహించాడు? (బి) రాజుగా యేసు తన ప్రజలతో ఎలా వ్యవహరిస్తాడు?

14. ప్రాచీన ఇశ్రాయేలులో కుష్ఠరోగులు ఎలా పరిగణించబడేవారు?

15. యేసు ఒక కుష్ఠరోగితో ఎలా వ్యవహరించాడు?

16. యేసు ఇతరులతో వ్యవహరించిన విధానం నుండి మీరు ఏ పాఠం నేర్చుకున్నారు?

17. యెహోవాను ఆరాధిస్తున్నప్పుడు గౌరవప్రదంగా ప్రవర్తించే విషయంలో మనం లేఖనాల నుండి ఏమి నేర్చుకోవచ్చు?

18. యెహోవాకు గౌరవప్రదంగా ఆరాధించడంలో ఏమి ఇమిడివుంది?

19, 20. (ఎ) ఇతరులను గౌరవించే చక్కని మార్గమేమిటి? (బి) గౌరవం చూపించే విషయంలో మనం ఏమి నిశ్చయించుకోవాలి?

[12వ పేజీలోని చిత్రం]

యెహోవా హేబెలును ఎలా ఘనపర్చాడు?

[14వ పేజీలోని చిత్రం]

బ్రెడ్డుకు సంబంధించిన ప్రక్రియల్లో కూడా యెహోవా అద్భుత సృష్టి కనిపిస్తుంది

[15వ పేజీలోని చిత్రం]

ఒకానొక కుష్ఠరోగితో యేసు వ్యవహరించిన తీరు నుండి ఇతరులను గౌరవించే విషయంలో మీరేమి నేర్చుకున్నారు?

[16వ పేజీలోని చిత్రం]

యెహోవాను గౌరవప్రదంగా ఆరాధించాలంటే ఆయనపట్ల మనకు గౌరవముండాలి