కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పూర్ణహృదయంతో యథార్థతను కనబరుస్తూ ఉండండి

పూర్ణహృదయంతో యథార్థతను కనబరుస్తూ ఉండండి

పూర్ణహృదయంతో యథార్థతను కనబరుస్తూ ఉండండి

‘నేను నీ సత్యము ననుసరించి నడచుకొందును. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.’ ​—⁠కీర్త. 86:11.

జైల్లో ఉండాల్సి వచ్చినా లేదా హింస ఎదుర్కోవాల్సివచ్చినా కొంతమంది క్రైస్తవులు ఎన్నో సంవత్సరాలపాటు నమ్మకంగా ఉన్నారు. అయితే అలాంటివారే ఆ తర్వాత ధనవ్యామోహానికి ఎందుకు లొంగిపోతున్నారు? వారలా లొంగిపోవడానికి వారి హృదయమే అంటే వారి అసలు వ్యక్తిత్వమే కారణం. 86వ కీర్తన యథార్థతకూ ఏకదృష్టిగల హృదయానికి అంటే పూర్ణహృదయానికీ మధ్య​వున్న సంబంధాన్ని వివరిస్తోంది. “నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షింపుము” అని కీర్తనకర్త దావీదు ప్రార్థించాడు. అంతేకాక, “యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము” అని కూడా ఆయన ప్రార్థించాడు.​—⁠కీర్త. 86:2, 11.

2 మనం పూర్ణహృదయంతో యెహోవాను నమ్మకపోతే ఇతర విషయాలేకాక, మనం ఇష్టపడే ఏవైనా సత్యదేవునిపట్ల మన యథార్థతను సులభంగా బలహీనపరుస్తాయి. స్వార్థపూరిత కోరికలనేవి మనం నడుస్తున్న రోడ్డులో దాచిపెట్టబడిన మందుపాతరల్లాంటివి. మనం కష్ట పరిస్థితుల్లో యెహోవాకు నమ్మకంగా సేవచేసినా సాతాను ఉరులకు, శోధనలకు లొంగిపోయే ప్రమాదముంది. పరీక్షలు, శోధనలు రాకముందే అంటే ఇప్పుడే పూర్ణహృదయంతో యెహోవాపట్ల యథార్థతను పెంపొందించుకోవడం ఎంత ప్రాముఖ్యం! అందుకే, “అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” అని బైబిలు చెబుతోంది. (సామె. 4:23) ఈ విషయంలో, ఇశ్రాయేలు రాజైన యరొబాము దగ్గరికి యెహోవా పంపించిన యూదాకు చెందిన ప్రవక్త అనుభవం నుండి మనం ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు.

“నీకు బహుమతి ఇచ్చెదను”

3 ఈ సంఘటనను ఊహించుకోండి. ఇశ్రాయేలీయుల పది గోత్రాల ఉత్తర రాజ్యంలో దూడ ఆరాధనను మొదలుపెట్టిన యరొబాము రాజుకు దైవజనుడు కొంచెంసేపటి క్రితమే ఒక కఠినమైన తీర్పు సందేశాన్ని అందజేశాడు. రాజు కోపం కట్టలుతెంచుకుంది. ఆ సందేశకుణ్ణి పట్టుకోమని తన సేవకులకు ఆజ్ఞాపించాడు. అయితే, యెహోవా తన సేవకుణ్ణి విడువలేదు. రాజు కోపంతో చాచిన చెయ్యి వెంటనే అద్భుతమైన రీతిలో ఎండిపోయింది. అబద్ధారాధన కోసం ఉపయోగించబడిన బలిపీఠం బద్దలైంది. మరునిమిషంలో యరొబాము తన ప్రవర్తన మార్చుకొని, “నా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుము” అని దైవజనుణ్ణి బతిమాలాడు. ప్రవక్త ఆయన కోసం ప్రార్థించడంతో రాజు చెయ్యి బాగైంది.​—⁠1 రాజు. 13:1-6.

4 అప్పుడు యరొబాము, “నీవు నా యింటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చెదను” అని సత్యదేవుని ప్రవక్తతో అన్నాడు. (1 రాజు. 13:7) ఆ ప్రవక్త ఇప్పుడు ఏమి చేస్తాడు? ఆయన తీర్పుసందేశాన్ని అందజేసిన తర్వాత ఆయన రాజు ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడా? (కీర్త. 119:113) లేదా రాజు పశ్చాత్తాపపడినట్లు కనిపించినా ఆయన ఆహ్వానాన్ని తిరస్కరిస్తాడా? యరొబాము ధనవంతుడు కాబట్టి తన స్నేహితులకు విలువైన బహుమతులను ధారాళంగా ఇవ్వగలడు. ఆ దేవుని ప్రవక్త లోలోపల ధనాశను పెంచుకొని ఉంటే, ఆ రాజు బహుమానం పెద్ద శోధనగానే ఉండేది. అయితే, ‘అన్న పానములు పుచ్చుకొనవద్దు, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దు’ అని యెహోవా ఆయనకు ఆజ్ఞాపించాడు. అందుకే ఆయన ఇలా ఖచ్చితంగా జవాబిచ్చాడు: “నీ యింటిలో సగము నీవు నాకిచ్చినను నీతోకూడ నేను లోపలికి రాను; ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను.” అప్పుడు ఆయన మరో మార్గంలో బేతేలు నుండి వెళ్లిపోయాడు. (1 రాజు. 13:8-10) పూర్ణహృదయంతో యథార్థతను కనబరిచే విషయంలో ప్రవక్త నిర్ణయం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?​—⁠రోమా. 15:4.

ఉన్నవాటితో ‘తృప్తిపొందండి’

5 ధనవ్యామోహం మన యథార్థతను పరీక్షించలేదని మనకు అనిపించవచ్చు, కానీ నిజానికి అది పరీక్షిస్తుంది. మనకు నిజంగా అవసరమైనవి ఇస్తానని యెహోవా చేసిన వాగ్దానం మీద మనకు నమ్మకముందా? (మత్త. 6:33; హెబ్రీ. 13:5) మన జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చే కొన్ని వస్తువులను మనం ప్రస్తుతం కొనలేక​పోవచ్చు. అయినా ఎలాగైనా సరే వాటిని సంపాదించుకుని తీరాలని ప్రయాసపడే బదులు అవి లేకపోయినా సర్దుకుపోగలమా? (ఫిలిప్పీయులు 4:11-13 చదవండి.) ఇప్పుడు మనకు కావాల్సింది సంపాదించుకోవడానికి దైవపరిపాలన సంబంధమైన ఆధిక్యతలను వదులుకోవాలనుకుంటున్నామా? యెహోవాకు నమ్మకంగా సేవచేయడానికే మన జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నామా? ఈ ప్రశ్నలకు మనమిచ్చే జవాబులు దేవుణ్ణి పూర్ణహృదయంతో సేవిస్తున్నామో లేదో అనేదానిమీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది. మనమీ లోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొంది​యుందము” అని అపొస్తలుడైన పౌలు రాశాడు.​—⁠1 తిమో. 6:6-8.

6 ఉదాహరణకు, మన పైఅధికారి మంచి జీతంతోపాటు ఇతర ప్రయోజనాలున్న పదోన్నతిని ఇవ్వజూపవచ్చు. ఉద్యోగం కోసం వేరే దేశానికి లేదా ప్రాంతానికి వెళ్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని మనకు అనిపించవచ్చు. మొదట్లో యెహోవా ఆశీర్వాదంవల్లే ఆ అవకాశాలు వచ్చాయని మనకు అనిపించవచ్చు. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఏ ఉద్దేశంతో అలా చేయాలనుకుంటున్నామో ఆలోచించవద్దా? “నేను తీసుకునే నిర్ణయం యెహోవాతో నాకున్న సంబంధాన్ని బలపరుస్తుందా లేదా బలహీన​పరుస్తుందా?” అనేదాని గురించే ఆలోచించాలి.

7 సాతాను వ్యవస్థ ధనవ్యామోహాన్ని నిత్యం ప్రోత్సహిస్తోంది. (1 యోహాను 2:15, 16 చదవండి.) మన హృదయాలను కలుషితం చేయాలన్నదే అపవాది లక్ష్యం. అందుకే, ఐశ్వర్యాన్ని సంపాదించాలనే కోరిక మన హృదయాల్లో ఏ మాత్రం ఉన్నా దాన్ని వెంటనే గుర్తించి పూర్తిగా తీసివేయాలి. (ప్రక. 3:15-17) లోకరాజ్యాలన్నింటినీ సాతాను ఇవ్వజూపినప్పుడు దాన్ని తిరస్కరించడం యేసుకు ఏమాత్రం కష్టమనిపించలేదు. (మత్త. 4:8-10) ఆయన ఇలా హెచ్చరించాడు: “మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు.” (లూకా 12:15) మనం యెహోవాకు యథార్థంగా ఉన్నట్లయితే మనం మన స్వశక్తిని నమ్మకునే బదులు యెహోవాను నమ్ముకుంటాం.

ఒక ముసలి ప్రవక్త ‘అబద్ధమాడాడు’

8 యూదాకు తిరిగి వెళ్తున్న ఆ ప్రవక్త తన ప్రయాణాన్ని కొనసాగించివుంటే అంతా సవ్యంగా జరిగివుండేది. కానీ, కొంతసేపటికే ఆయన మరో పరీక్షను ఎదుర్కొన్నాడు. “బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను” అని బైబిలు చెబుతోంది. అతని కుమారులు వచ్చి ఆ రోజు జరిగిన సంఘటనలను వాళ్ల ‘తండ్రికి తెలియజేశారు.’ అది విన్న తర్వాత, తను వెళ్లి దైవజనుణ్ణి కలుసుకోవడానికి వెళ్లేందుకు గాడిదకు గంతకట్టమని కుమారులకు చెబుతాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆ ప్రవక్త ఒక వృక్షం క్రింద కూర్చొనివుండడాన్ని చూసి ఆయనతో, “నా యింటికి వచ్చి భోజనము చేయుము” అని కోరాడు. ఆ ప్రవక్త రానని చెప్పినప్పుడు ఆయన, “నేనును నీవంటి ప్రవక్తనే; మరియు దేవదూత యొకడు​—⁠యెహోవా చేత సెలవుపొంది అన్న పానములు పుచ్చుకొనుటకై అతని నీ యింటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెను” అని జవాబిచ్చాడు. అయితే ఆ వృద్ధ ప్రవక్త ‘అబద్ధమాడాడు’ అని లేఖనాలు చెబుతున్నాయి.​—⁠1 రాజు. 13:11-18.

9 ఆ వృద్ధ ప్రవక్త ఉద్దేశమేదైనా సరే, ఆయనైతే అబద్ధమాడాడు. ఆయన ఒకప్పుడు యెహోవాను నమ్మకంగా సేవించివుండవచ్చు. అయితే ఈ సందర్భంలో ఆయన ప్రవక్తను మోసగించాడు. అలాంటి ప్రవర్తనను లేఖనాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. (సామెతలు 3:32 చదవండి.) మోసగాళ్లు యెహోవాతో తమకున్న సంబంధాన్నే కాదు తరచూ ఇతరుల సంబంధాన్నికూడా పాడుచేస్తారు.

అతడు ఆ ముసలివానితో ‘మరలివెళ్లాడు’

10 యూదాకు చెందిన ప్రవక్త, ముసలి ప్రవక్త వేసిన ఎత్తు కనిపెట్టగలిగివుండాల్సింది. ‘యెహోవా దేవుడు కొత్త ఆదేశాలతో దేవదూతను నా దగ్గరికి కాకుండా వేరే వారిదగ్గరికి ఎందుకు పంపిస్తాడు?’ అని ఆలోచించివుండాల్సింది. అది నిజమో కాదో యెహోవానే అడిగివుండాల్సింది. కానీ ఆయనలా చేశాడని లేఖనాలు చెప్పడంలేదు. అయితే, “అతడు తిరిగి అతనితోకూడ [ముసలివానితో] మరలి పోయి అతని యింట అన్నపానములు పుచ్చుకొనెను.” ఆయనలా చేసినందుకు యెహోవా సంతోషించలేదు. మోసపోయిన ఆ ప్రవక్త తిరిగి యూదాకు వెళ్తున్నప్పుడు ఒక సింహము ఆయనను చంపేసింది. ప్రవక్తగా ఆయన జీవితానికి అదెంతటి విషాదకరమైన ముగింపు!​—⁠1 రాజు. 13:19-25. *

11 మరోవైపు, యరొబామును రాజుగా అభిషేకించేందుకు పంపించబడిన అహీయా ప్రవక్త ముసలితనంలో కూడా యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. అహీయా వృద్ధాప్యంలో అంధుడౌతాడు. ఒకానొక సందర్భంలో యరొబాము అనారోగ్యంతో ఉన్న వాళ్ళ అబ్బాయి బాగవుతాడో లేదో తెలుసుకోవడానికి తన భార్యను ఆయన దగ్గరకు పంపిస్తాడు. ఆ అబ్బాయి చనిపోతాడని అహీయా ధైర్యంగా ప్రవచించాడు. (1 రాజు. 14:1-18) అలా నమ్మకంగా ఉన్నందుకు అహీయా ఎన్నో ఆశీర్వాదాలు పొందాడు. వాటిలో దేవుని ప్రేరేపిత వాక్యం రాయబడడానికి పరోక్షంగా సహాయపడడం ఒకటి. ఆయన ఎలా సహాయపడ్డాడు? ఆ తర్వాత ఆయన రచించిన గ్రంథంలోని విషయాలను ఎజ్రా తాను రాసిన పుస్తకంలో ఉపయోగించుకోగలిగాడు.​—⁠2 దిన. 9:29.

12 ఆ యువప్రవక్త తిని త్రాగడానికి ముసలివాని ఇంటికి వెళ్లక ముందు యెహోవాను ఎందుకు అడగలేదో బైబిలు తెలియజేయడంలేదు. తను వినాలనుకున్నది ఆ ముసలివాడు చెప్పాడు కాబట్టి ఆయన యెహోవాను అడగలేదా? మనం ఈ వృత్తాంతం నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? యెహోవా నియమాలు సరైనవనే పూర్తి నమ్మకం మనకుండాలి. అంతేకాక, ఏదేమైనా వాటిని పాటించాలనే కృతనిశ్చయంతో మనం ఉండాలి.

13 కొందరు సలహా అడినప్పుడు తాము వినాలకున్నదే వింటారు. ఉదాహరణకు, ఒక ప్రచారకునికి ఉద్యోగావకాశం వచ్చిందనుకుందాం. కానీ ఆయన ఆ ఉద్యోగంలో చేరితే తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేడు, దైవపరిపాలనా కార్యకలాపాలకు ఎక్కువ సమయముండదు. ఈ విషయంలో ఆయన ఒక క్రైస్తవ పెద్దను సలహా అడగవచ్చు. ఆ సహోదరుడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏమి చేయాలో ఏమి చేయకూడదో చెప్పే స్థానంలో తాను లేనని ఆ పెద్ద మొదట చెప్పవచ్చు. తర్వాత ఆ ఉద్యోగంలో చేరితే వచ్చే ఆధ్యాత్మిక ప్రమాదాల గురించి చర్చించవచ్చు. ఈ సహోదరుడు పెద్ద ప్రారంభంలో చెప్పిన మాటలనే గుర్తుంచుకుంటాడా లేదా తర్వాత అన్న మాటల గురించి కూడా తీవ్రంగా ఆలోచిస్తాడా? ఆధ్యాత్మికంగా తనకు ఏది ప్రయోజనకరమో ఆ సహోదరుడే నిర్ణయించుకోవాలి.

14 మరో పరిస్థితిని గమనించండి. ఒక సహోదరి అవిశ్వాసియైన తన భర్తనుండి విడిపోయే విషయంలో ఒక సంఘ పెద్ద సలహాను అడగవచ్చు. నిస్సందేహంగా, విడిపోవాలో వద్దో ఆమే నిర్ణయించుకోవాలని ఆయన చెబుతాడు. ఆ తర్వాత ఈ విషయంలో బైబిలు ఉపదేశాన్ని ఆమెతో చర్చిస్తాడు. (1 కొరిం. 7:10-16) ఆ పెద్ద చెప్పే విషయాల గురించి ఆమె జాగ్రత్తగా ఆలోచిస్తుందా? లేదా తన భర్తను వదిలేయాలని ఆమె ముందే నిర్ణయించుకుందా? ఆమె నిర్ణయం తీసుకునే ముందు బైబిలు సలహా గురించి ప్రార్థనా​పూర్వకంగా ఆలోచించడం జ్ఞానయుక్తం.

వినయంగా ఉండండి

15 యూదాకు చెందిన ప్రవక్త చేసిన తప్పు నుండి మనమింకా ఏమి నేర్చుకోవచ్చు? సామెతలు 3:5 ఇలా చెబుతోంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.” ఆయన గతంలో యెహోవామీద నమ్మకముంచినట్లు ఈ సందర్భంలో కూడా నమ్మకముంచే బదులు ఆయన తన స్వబుద్ధిని నమ్ముకున్నాడు. ఆయన చేసిన తప్పువల్ల ఆయన తన ప్రాణాన్నే కాదు, దేవుని దృష్టిలో మంచి​పేరునూ పోగొట్టుకున్నాడు. యెహోవాను వినయంతో, నమ్మకంగా సేవించడానికున్న ప్రాముఖ్యతను ఈ అనుభవం ఎంత చక్కగా నొక్కిచెబుతుందో కదా!

16 మన హృదయంలోని స్వార్థపూరిత ఆలోచనలు మనల్ని తప్పుదారిపట్టించవచ్చు. “హృదయము అన్నిటి​కంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది.” (యిర్మీ. 17:9) మనం యెహోవాకు యథార్థంగా ఉండాలంటే గర్వం, స్వేచ్ఛా దృక్పథంతోపాటు పాతస్వభావాన్ని త్యజించడానికి మనం ఎల్లప్పుడూ ప్రయాసపడాలి. అంతేకాక, పవిత్రతతో యథార్థంగా ‘దేవుని పోలికగా సృజింపబడిన’ నవీనస్వభావాన్ని మనం ధరించుకోవాలి.​—⁠ఎఫెసీయులు 4:22-24 చదవండి.

17 “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది” అని సామెతలు 11:2 చెబుతోంది. వినయంతో యెహోవాను నమ్ముకుంటే మనం గంభీరమైన తప్పులు చేయం. ఉదాహరణకు, నిరుత్సాహంవల్ల మనం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. (సామె. 24:10) మనం పవిత్రసేవకు సంబంధించిన ఒక బాధ్యత ఎన్నో సంవత్సరాలుగా నిర్వర్తిస్తుండవచ్చు. దాంతో విసుగుచెంది ఇంతకాలం చేసింది చాలు, ఇకపై దాన్ని ఇతరులు నిర్వర్తించాల్సిన సమయం వచ్చిందని మనకనిపించవచ్చు. లేదా లోకంలోని ఇతరుల్లా మరింత “సాధారణ” జీవితాన్ని గడపాలని మనం కోరుకోవచ్చు. అయితే, దేవుని సేవలో ‘పోరాడడం’ లేదా తీవ్రంగా కృషిచేయడం ద్వారా, “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై” ఉండడం ద్వారా మన హృదయాన్ని కాపాడుకోవచ్చు.​—⁠లూకా 13:24; 1 కొరిం. 15:58.

18 కొన్నిసార్లు మనం కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చినప్పుడు ఏది సరైన నిర్ణయమో ఏది కాదో మనకు వెంటనే తెలియకపోవచ్చు. మనం స్వబుద్ధిని ఆధారం చేసుకొని నిర్ణయం తీసుకుంటామా? అలాంటి పరిస్థితుల్లో యెహోవా సహాయం కోరడం జ్ఞానయుక్తం. “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును” అని యాకోబు 1:5 చెబుతోంది. మనం మంచి నిర్ణయాలు తీసుకునేలా మన పరలోక తండ్రి మనకు కావాల్సిన పరిశుద్ధాత్మను ఇస్తాడు.​—⁠లూకా 11:9, 13 చదవండి.

యథార్థంగా ఉండాలనే కృతనిశ్చయంతో ఉండండి

19 సొలొమోను సత్యారాధన నుండి తొలిగిపోయిన తర్వాత గడిచిన కల్లోలిత సంవత్సరాల్లో దేవుని సేవకుల యథార్థత తీవ్రంగా పరీక్షించబడింది. నిజమే, అనేకమంది ఏదో విధంగా రాజీపడ్డారు. అయినా కొందరు యెహోవాకు యథార్థంగా ఉన్నారు.

20 ప్రతీరోజు మన యథార్థతను పరీక్షించే నిర్ణయాలు తీసుకోవాల్సిరావచ్చు. మనం కూడా నమ్మకంగా ఉండగలం. మనం ఎల్లప్పుడూ యెహోవాకు యథార్థంగా ఉందాం. మనం పూర్ణ హృదయంతో యెహోవాను సేవిస్తుండగా ఆయన తన భక్తులను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడనే పూర్తి నమ్మకంతో ఉందాం.​—⁠2 సమూ. 22:26.

[అధస్సూచి]

^ పేరా 16 ఆ ముసలి ప్రవక్తకు యెహోవాయే మరణదండన విధించాడో లేదో బైబిలు చెప్పడం లేదు.

మీరెలా జవాబిస్తారు?

• ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలనే కోరికను మనం మన హృదయంలోనుండి పూర్తిగా తీసివేయడం ఎందుకు ప్రాముఖ్యం?

• యెహోవాకు యథార్థంగా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

• దేవునికి యథార్థంగా ఉండడానికి మనకు వినయం ఎలా సహాయం చేస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) కీర్తనలు 86:2, 11 ప్రకారం, పరీక్షలు, శోధనలు ఎదురైనా యెహోవాకు నమ్మకంగా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? (బి) పూర్ణహృదయంతో యథార్థతను ఎప్పుడు పెంపొందించుకోవాలి?

3. దేవుని ప్రవక్త తెలియజేసిన తీర్పు సందేశాన్ని విని యరొబాము ఎలా స్పందించాడు?

4. (ఎ) రాజు బహుమానం ప్రవక్త యథార్థతను నిజంగా పరీక్షించిందని మనమెలా చెప్పవచ్చు? (బి) ప్రవక్త ఏమని జవాబిచ్చాడు?

5. ధనవ్యామోహం యథార్థతను ఎలా పరీక్షిస్తుంది?

6. ఇతరులు మనకు ఎలాంటి వాటిని ఇవ్వజూపవచ్చు, వాటిని స్వీకరించాలో లేదో నిర్ణయించుకునే ముందు మనం వేటి గురించి ఆలోచించాలి?

7. ఐశ్వర్యాన్ని సంపాదించాలనే కోరికను పూర్తిగా తీసివేయడం ఎందుకు ప్రాముఖ్యం?

8. దేవుని ప్రవక్త యథార్థత ఎలా పరీక్షించబడింది?

9. మోసగాళ్ల గురించి బైబిలు ఏమి చెబుతోంది, వారు ఎవరి సంబంధాన్ని కూడా పాడుచేస్తారు?

10. ముసలి ప్రవక్త ఇంటికి రమ్మని పిలిచినప్పుడు దేవుని ప్రవక్త ఏమి చేశాడు, దానివల్ల ఏమి జరిగింది?

11. అహీయా ఎలా ఒక మంచి మాదిరినుంచాడు?

12-14. (ఎ) యువ ప్రవక్తకు సంబంధించిన సంఘటన నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (బి) పెద్దలు ఇచ్చే బైబిలు సలహాను జాగ్రత్తగా ప్రార్థనపూర్వకంగా ఆలోచించడం ఎందుకు అవసరమో ఉదాహరించండి.

15. దేవుని ప్రవక్త చేసిన తప్పు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

16, 17. యెహోవాకు యథార్థంగా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

18. ఏ నిర్ణయం తీసుకోవాలో పాలుపోనప్పుడు మనమేమి చేయవచ్చు?

19, 20. మనం ఏ కృతనిశ్చయంతో ఉండాలి?

[9వ పేజీలోని చిత్రాలు]

శోధనలను ఎదిరించడం మీకు కష్టంగా ఉందా?

[10వ పేజీలోని చిత్రాలు]

బైబిలు ఆధారంగా ఇవ్వబడిన ఉపదేశాన్ని గురించి మీరు ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తారా?