మిషనరీలు మిడతలతో పోల్చబడ్డారు
124వ గిలియడ్ తరగతి స్నాతకోత్సవం
మిషనరీలు మిడతలతో పోల్చబడ్డారు
ఆరు నెలలకొకసారి ద వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దానికి అమెరికాలోని బెతెల్ సభ్యులందరూ ఆహ్వానించబడతారు. ఈ సంవత్సరం మార్చి 8న 30 కన్నా ఎక్కువ దేశాల సహోదరులు బెతెల్ కుటుంబంతోపాటు గిలియడ్ స్కూల్ 124వ తరగతి స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ ప్రత్యేకమైన రోజున విద్యార్థులతోపాటు ఆ కార్యక్రమానికి హాజరైన 6,411 మంది కూడా ఎంతో ఆనందించారు.
పరిపాలక సభ సభ్యుడైన స్టీఫెన్ లెట్ కార్యక్రమానికి అధ్యక్షత వహించాడు. “యెహోవాకు చెందిన సూచనార్థక మిడతలతోపాటు ముందుకు దూసుకువెళ్లండి” అనే ప్రసంగంతో ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అభిషిక్త క్రైస్తవుల చిన్న గుంపు 1919లో ఆధ్యాత్మిక నిష్క్రియా స్థితినుండి తేరుకున్నారు. వారిని ప్రకటన 9:1-4 వచనాలు ఆకస్మాత్తుగా పనిచేయడం మొదలుపెట్టిన మిడతల దండుతో పోలుస్తున్నాయి. “వేరే గొఱ్ఱెల” గుంపుకు చెందిన విద్యార్థులు సూచనార్థక మిడతల దండుతో కలిసి పనిచేస్తున్నారని గుర్తుచేయబడింది.—యోహా. 10:16.
ఆ తర్వాత, అమెరికా బ్రాంచి కమిటీ సభ్యుడైన లాన్ షిల్లింగ్ “ఒకరికొకరు సహాయపడండి” అనే ప్రసంగాన్ని ఇచ్చాడు. మొదటి శతాబ్దంలో జీవించిన అకుల, ప్రిస్కిల్ల అనే దంపతుల ఉదాహరణ పేర్కొంటూ ఆయన ప్రసంగించాడు. (రోమా. 16:3, 4) గిలియడ్ తరగతికి మొత్తం 28 జంటలు హాజరయ్యాయి. వారు మిషనరీలుగా విజయం సాధించాలంటే తమ వివాహ బంధాన్ని పటిష్ఠంగా ఉంచుకోవాలని గుర్తుచేయబడింది. ప్రిస్కిల్లా పేరు లేకుండా అకుల పేరు బైబిల్లో ఎక్కడా ప్రస్తావించబడలేదు. కాబట్టి అపొస్తలుడైన పౌలూ, సంఘ సభ్యులూ వారిని ఒక జట్టుగానే చూసేవారు. అలాగే నేడు కూడా మిషనరీలు కలిసి పనిచేస్తూ, కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ, మిషనరీ సేవలో ఎదురయ్యే సమస్యలను కలిసి ఎదుర్కొంటూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.—ఆది. 2:18.
తర్వాత పరిపాలక సభ సభ్యుడైన గయ్ పీయర్స్ “యెహోవా మంచితనానికి ప్రతిస్పందించండి” అనే ప్రసంగం ఇచ్చాడు. మంచిగా ఉండడం అంటే చెడు చేయకుండా ఉండడం మాత్రమే కాదని ఆయన వివరించాడు. మంచివారు ఇతరుల ప్రయోజనార్థం మంచి పనులు చేస్తారు. యెహోవా దేవుడు అత్యుత్తమ స్థాయిలో మంచివాడు. దేవుని మంచితనం, ప్రేమ మనం ఇతరులకు మంచి చేసేలా పురికొల్పుతాయి. సహోదరుడు పీయర్స్ విద్యార్థులను మెచ్చుకుంటూ, “మీరు ఇప్పటివరకూ మంచి చేశారు. భవిష్యత్తులో కూడా యెహోవా మీకు ఏ నియామకాలిచ్చినా ఇతరులకు మంచి చేస్తూనే ఉండండి. అలా చేస్తూ దేవుని మంచితనానికి మీరు ఎల్లవేళలా ప్రతిస్పందిస్తారనే నమ్మకం మాకుంది” అని చెప్పి ప్రసంగం ముగించాడు.
గతంలో మిషనరీ సేవచేసి ఇటీవలి కాలంలో గిలియడ్ ఉపదేశకునిగా నియమించబడిన మైఖెల్ బర్నెట్, “దానిని మీ కన్నుల మధ్య లలాట పత్రికగా కట్టుకోండి” అనే తర్వాతి ప్రసంగాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు తమ కళ్ల మధ్య “లలాట పత్రిక” కట్టుకున్నారన్నట్లుగా, యెహోవా తమను ఐగుప్తునుండి అద్భుతంగా విడిపించడాన్ని గుర్తుంచుకోవాలి. (నిర్గ. 13:16) విద్యార్థులు తాము గిలియడ్ పాఠశాలలో నేర్చుకున్న అనేక అంశాలను కళ్ల మధ్య కట్టుకున్నారన్నట్లుగా గుర్తుంచుకోవాలని ఆయన ఉపదేశించాడు. తోటి మిషనరీల, ఇతరుల విషయంలో తమకున్న అపార్థాలను తొలగించుకుంటున్నప్పుడు వినయంగా, అణకువగా ఉంటూ బైబిలు సూత్రాలను అన్వయించుకోవాలని సహోదరుడు నొక్కిచెప్పాడు.—మత్త. 5:23, 24.
ఎంతోకాలంగా గిలియడ్ పాఠశాలలో ఉపదేశకునిగా పనిచేస్తున్న మార్క్ న్యూమర్ “ఇతరులు మీ గురించి ఎలాంటి పాట పాడతారు?” అనే ప్రసంగాన్ని ఇచ్చాడు. ప్రాచీన కాలాల్లో యుద్ధంలో గెలిచినప్పుడు విజయ గీతాలు ఆలపిస్తూ వేడుక చేసుకునేవారు. అలాంటి ఒక పాటలో, రూబేనీయులు, దానీయులు, ఆషేరీయులు కష్టపడేవారు కాదని, జెబూలూనీయులైతే స్వయంత్యాగ స్ఫూర్తిని చూపేవారని వెల్లడిచేయబడింది. (న్యాయా. 5:16-18) పాటలోని సాహిత్యంలాగే ప్రతీ క్రైస్తవుడు చేసే పనులు కూడా కొంతకాలానికి అందరికీ తెలిసిపోతాయి. ఒక వ్యక్తి దేవుని సేవను ఉత్సాహంగా చేస్తూ, దేవుని సంస్థ నుండి వచ్చే నిర్దేశానికి నమ్మకంగా కట్టుబడివుంటే యెహోవాకు సంతోషం కలుగుతుంది. ఆయన ఇతర సహోదరులకు మంచి మాదిరిగా కూడా ఉంటాడు. మనం మన క్రియలద్వారా రచించే సూచనార్థక పాటను సంఘంలోని ఇతరులు విన్నప్పుడు వారు కూడా మన మాదిరిని అనుసరించాలని కోరుకుంటారు.
గిలియడ్ శిక్షణలో భాగంగా 124వ తరగతి సభ్యులందరూ కలిసి ప్రకటనా పనిలో దాదాపు 3,000 గంటలు పనిచేశారు. థియోక్రెటిక్ స్కూల్స్ డిప్టార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న సామ్ రాబర్‌సన్ ఇచ్చిన “పరిశుద్ధాత్మ నిర్దేశానుసారంగా నడుచుకోండి” అనే ప్రసంగంలో విద్యార్థులు పరిచర్యలో తమకెదురైన అనుభవాలను చెప్పారు. కొన్ని అనుభవాలను పునర్నటించారు. వారు ప్రోత్సాహకరమైన అనుభవాలను చెప్పిన తర్వాత, అమెరికా బ్రాంచి కమీటీ సభ్యుడైన సహోదరుడు పాట్రిక్ లాఫ్రాంకా ఇప్పుడు వివిధ దేశాల్లో సేవచేస్తున్న గిలియడ్ పట్టభద్రులను ఇంటర్వ్యూ చేశాడు. వారు ఇచ్చిన ఆచరణాత్మక సలహాలను విద్యార్థులు ఎంతో ఇష్టపడ్డారు.
పరిపాలక సభ సభ్యుడైన ఆంథనీ మారిస్ “కనిపించేవి అనిత్యమని గుర్తుంచుకోండి” అనే చివరి ప్రసంగాన్ని ఇచ్చాడు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న తాత్కాలిక శ్రమల గురించే ఆలోచించే బదులు భవిష్యత్తులో యెహోవా అనుగ్రహించే ఆశీర్వాదాల గురించి ఆలోచించమని లేఖనాలు మనల్ని ఉపదేశిస్తున్నాయి. (2 కొరిం. 4:16-18) నేడు మనం కడు బీదరికం, అన్యాయం, అణచివేత, అనారోగ్యం, మరణం వంటివి చూస్తున్నాం. వాటిలో కొన్నింటిని మిషనరీలు ఎదుర్కోవాల్సిరావచ్చు. కానీ అవన్నీ తాత్కాలికమైనవని గుర్తుంచుకున్నప్పుడు మనం యెహోవాకు మొదటిస్థానాన్ని ఇస్తూ మంచి జరుగుతుందని ఎదురుచూడగలుగుతాం.
లెట్ సహోదరుడు ముగింపులో చెప్పిన విషయాలు పట్టభద్రులందరూ వేదికపై కూర్చొని విన్నారు. ఆ తర్వాత కార్యక్రమం ముగిసింది. “యెహోవా మన పక్కనుండగా మనం ఎల్లప్పుడూ యథార్థంగా ఉండగలుగుతాం” అని చెప్పి వారు తమ పోరాటంలో కొనసాగాలని ఆయన ప్రోత్సహించాడు. కొత్త మిషనరీలు మిడతల్లా యెహోవాకు విధేయులుగా ఉంటూ ఆయన సేవలో నిత్యం ఉత్సాహంగా, నమ్మకంగా కొనసాగాలని ఆయన ప్రోత్సహించాడు.
[30వ పేజీలోని బాక్సు]
తరగతి గణాంకాలు
విద్యార్థులు 7 దేశాల నుండి వచ్చారు
16 దేశాలకు పంపించబడ్డారు
56 మంది హాజరయ్యారు
వారి సగటు వయసు 33.8
సగటున 18.2 సంవత్సరాలు సత్యంలో ఉన్నారు
సగటున 13.8 సంవత్సరాలు పూర్తికాల సేవలో ఉన్నారు
[31వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 124వ తరగతి పట్టభద్రుల పేర్లు
ఈ క్రింద ఇవ్వబడిన లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి, పేర్లు ప్రతి వరుసలో ఎడమ వైపు నుండి కుడి వైపుకు పేర్కొనబడ్డాయి.
(1) నికల్సన్, టి.; మేన్, హెచ్.; సెంగే, వై.; స్నేవ్, ఎల్.; వానేగాన్, సి.; పో, ఎల్. (2) సాంటానా, ఎస్.; ఓ, కె.; లామాట్రా, సి.; విలియమ్స్, ఎన్.; అలెగ్జాండర్, ఎల్. (3) వుడ్జ్, బి.; స్టేంటన్ ఎల్.; హంట్లీ, ఇ.; అల్వారెజ్, జి.; క్రుస్, జె.; బెన్నెట్, జె. (4) విలియమ్‌సన్, ఎ.; గొంసాలెస్, ఎన్.; జురోస్కీ, జె.; డాహాండ్, ఐ.; మే, జె.; డైమీ, సి.; టవానర్, ఎల్. (5) లామాట్రా, డబ్ల్యూ.; హ్యారస్, ఎ.; వెల్జ్, సి.; రాజర్జ్, ఎస్.; డరాంట్, ఎమ్.; సెంగే, జె. (6) హంట్లీ, టి.; వానేగాస్, ఎ.; పో, ఎ.; సాంటానా, ఎమ్.; బెన్నెట్, ఎమ్.; టవానర్, డి.; ఓ, ఎమ్. (7) జురోస్కీ, ఎమ్.; రాజర్జ్, జి.; డైమీ, డి.; నికల్సన్ ఎల్.; అల్వారెజ్, సి.; స్నేప్, జె. (8) హ్యారస్, ఎమ్.; గొంసాలెస్, పి.; మేన్, ఎస్.; వుడ్జ్, ఎస్.; స్టేంటన్, బి.; విలియమ్‌సన్, డి.; డరాంట్, జె. (9) క్రుస్, పి.; డాహాండ్, బి.; విలియమ్స్, డి.; వెల్జ్, ఎస్.; అలెగ్జాండర్, డి.; మే, ఎమ్.
[32వ పేజీలోని చిత్రం]
గిలియడ్ పాఠశాల వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్‌లో ఉంది