కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఆసక్తితో” ఖచ్చితమైన జ్ఞానాన్ని పెంచుకోండి

“ఆసక్తితో” ఖచ్చితమైన జ్ఞానాన్ని పెంచుకోండి

“ఆసక్తితో” ఖచ్చితమైన జ్ఞానాన్ని పెంచుకోండి

యెహోవా దేవుని సేవకులందరూ ఆయన ఆమోదాన్ని కోరుకుంటారు. ఆయన ఆమోదాన్ని పొందాలనే ఉద్దేశంతో మనం మన విశ్వాసాన్ని పెంచుకోవడానికీ పవిత్రసేవలో ఉత్సాహంగా పాల్గొనడానికీ ఆసక్తి కనబరుస్తాం. అయితే, అపొస్తలుడైన పౌలు, తన కాలంలోని యూదుల్లో కొందరికి జరిగిన ప్రమాదమే మనకూ జరిగే అవకాశముందని చెబుతూ, ‘వారు దేవుని యందు ఆసక్తిగలవారు; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు’ అని అన్నాడు. (రోమా. 10:⁠2) యెహోవాపై విశ్వాసం చూపించడం గానీ, ఆయనకు చేసే ఆరాధన గానీ కేవలం ఆవేశంతో చేసేవిగా ఉండకూడదు. మనకు సృష్టికర్త గురించి ఆయన చిత్తం గురించి ఖచ్చితమైన జ్ఞానం అవసరం.

పౌలు మరో పత్రికలో, దేవునికి ఆమోదయోగ్యంగా ప్రవర్తించాలంటే ఆసక్తితో జ్ఞానం సంపాదించాలని చెప్పాడు. క్రీస్తు అనుచరులు ‘ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లు నడుచుకొనునట్లు’ ఆయన చిత్తమును గురించిన “సంపూర్ణజ్ఞానమును” గ్రహించాలని ప్రార్థించాడు. (కొలొ. 1:​9, 10) “సంపూర్ణజ్ఞానము” లేక ఖచ్చితమైన జ్ఞానం ఎందుకు అంత ప్రాముఖ్యం? ఆ జ్ఞానాన్ని ఎందుకు పెంచుకోవాలి?

అది విశ్వాసానికి ఎంతో అవసరం

బైబిల్లో దేవుని గురించి, ఆయన చిత్తం గురించి ఖచ్చితమైన జ్ఞానముంది. ఆ జ్ఞానం మన విశ్వాసానికి ఎంతో అవసరం. విశ్వసనీయమైన ఆ జ్ఞానమే లేకపోతే యెహోవాపై మనకున్న విశ్వాసం కొద్దిపాటి గాలికి కూడా కూలిపోయే పేకమేడలా ఉంటుంది. ‘దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మన మనస్సును మార్చుకొని నూతనపరచుకోవడం’ ద్వారా దేవునికి పవిత్రసేవ చేయమని పౌలు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. (రోమా. 12:​1, 2) అలా చేయాలంటే బైబిలును క్రమంగా అధ్యయనం చేయాలి.

పోలండ్‌లో క్రమ పయినీరు సేవ చేస్తున్న ఈవా, “నేను క్రమంగా బైబిలు అధ్యయనం చేయకపోతే యెహోవా గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని వృద్ధిచేసుకోలేను. క్రైస్తవ లక్షణాలను నేను త్వరగా కోల్పోతాను. యెహోవాపట్ల నాకున్న విశ్వాసం బలహీనపడి ఆయనతో నాకున్న సంబంధం చెడిపోవచ్చు” అని చెప్పింది. అలా మనకెప్పటికీ జరగకుండును గాక! యెహోవా గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని వృద్ధిచేసుకొని, ఆయన ఆమోదాన్ని పొందిన ఒక వ్యక్తి ఉదాహరణను చూడండి.

“నీ ధర్మశాస్త్రము నాకు ప్రియముగానున్నది”

యెహోవా ధర్మశాస్త్రము, శాసనాలు, ఆజ్ఞలు, కట్టడలు, న్యాయవిధులపట్ల కీర్తనకర్తకున్న మనోభావాలను 119వ కీర్తనగా పేర్కొనబడిన గీతం వ్యక్తంచేస్తుంది. కీర్తనకర్త ఇలా రాశాడు: “నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను . . . నీ శాసనములు నాకు సంతోషకరములు.” అంతేకాక, “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను” అని కూడా రాశాడు.​—⁠కీర్త. 119:​16, 24, 47, 48, 77, 97.

‘హర్షించడం’, ‘ధ్యానించడం’ అనే పదాలు దేవుని వాక్యాన్ని ధ్యానించేందుకు ఇష్టపడడాన్ని సూచిస్తుంది. దేవుని ధర్మశాస్త్రాన్ని కీర్తనకర్త ఎంతగా ప్రేమించాడో ఆ పదాలు నొక్కిచెబుతున్నాయి. ధర్మశాస్త్రంపట్ల కీర్తనకర్తకున్న ప్రేమ కేవలం భావావేశంవల్ల వచ్చిందికాదు. బదులుగా దేవుని ధర్మశాస్త్రాన్ని ‘ధ్యానించాలనీ,’ ఆయన వాక్యానికి సంబంధించి మరింత జ్ఞానాన్ని సంపాదించుకోవాలనీ ఆయన ఎంతగానో కోరుకున్నాడు. దేవుని గురించి, దేవుని చిత్తం గురించి సాధ్యమైనంత ఖచ్చితంగా తెలుసుకోవాలనే కోరిక ఆయనకుందని ఇది స్పష్టంచేస్తుంది.

దేవుని వాక్యాన్ని కీర్తనకర్త ఎంతగానో ఇష్టపడ్డాడని స్పష్టమౌతుంది. మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నేను కూడా కీర్తనకర్తలాగే దేవుని వాక్యాన్ని ఇష్టపడుతున్నానా? ప్రతీరోజు దేవుని వాక్యంలోని ఒక భాగం చదివి దాన్ని జాగ్రత్తగా పరిశీలించడానికి నేను ఇష్టపడుతున్నానా? నేను దేవుని వాక్యాన్ని శ్రద్ధగా, ప్రార్థనాపూర్వకంగా చదువుతున్నానా?’ మనం ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం చెప్పగలిగినంతవరకు, మనం “దేవుని విషయమైన” ఖచ్చితమైన “జ్ఞానమందు అభివృద్ధి పొందుచు[న్నాము]” అని చెప్పవచ్చు.

ఈవా ఇలా చెబుతుంది: “నేను వ్యక్తిగత అధ్యయనాన్ని మరింత చక్కగా చేసేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. ‘మంచి దేశమును చూడండి’ బ్రోషుర్‌ నా చేతికి వచ్చినప్పటి నుండి, నేను దాన్ని దాదాపు ప్రతీ అధ్యయనానికి ఉపయోగిస్తున్నాను. నాకు అవసరమైనప్పుడల్లా లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం), మరితర పరిశోధనా సాహిత్యాలను చూడడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను.”

వోయ్‌ఛెక్‌, మావ్గోజాటా దంపతుల ఉదాహరణను పరిశీలించండి, వారికి ఎన్నో కుటుంబ బాధ్యతలున్నాయి. వారు వ్యక్తిగత బైబిలు అధ్యయనానికి సమయాన్ని ఎలా కేటాయించగలుగుతున్నారు? వారిలా చెబుతున్నారు: “మేము సాధ్యమైనంతవరకు వ్యక్తిగతంగా బైబిలును చదవడానికి సమయం తీసుకుంటాం. ఆ తర్వాత, కుటుంబ అధ్యయనంలో, మా రోజువారి సంభాషణల్లో మేము ఇష్టపడిన లేదా మమ్మల్ని పురికొల్పిన అంశాలను చర్చించుకుంటాం.” లోతుగా వ్యక్తిగత అధ్యయనం చేయడంవల్ల వారు ఎంతో ఆనందిస్తున్నారు, ఖచ్చితమైన ‘జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతున్నారు.’

విశాల హృదయంతో అధ్యయనం చేయండి

“మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానము” సంపాదించాలన్నది దేవుని చిత్తమని క్రైస్తవులముగా మనం నమ్ముతాం. (1 తిమో. 2:​3, 4) బైబిలును చదివి దాన్ని ‘గ్రహించడానికి’ ప్రయాసపడడం ఎంత ప్రాముఖ్యమో అది నొక్కిచెబుతోంది. (మత్త. 15:​10) దానికోసం విశాల హృదయంతో చదవాలి. ప్రాచీన బెరయవాసులు పౌలు తమతో సువార్త ప్రకటించినప్పుడు అలాంటి వైఖరినే కనబరిచారు. బెరయవాసులు ‘ఆసక్తితో​ వాక్యమును అంగీకరించి, ఆయన చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.’​—⁠అపొ. 17:⁠11.

అనవసర విషయాల గురించి ఆలోచించకుండా ఆసక్తితో బైబిలును చదవడం ద్వారా మీరు బెరయవాసుల మాదిరిని అనుసరిస్తున్నారా? గతంలో ఒక క్రైస్తవునికి చదవడం ఇష్టం​లేకపోయినా బెరయవాసులను అనుకరించడానికి ఇప్పుడు ప్రయాసపడాలి. అంతేకాక, కొందరు వయసుపెరిగేకొద్ది చదవడం, అధ్యయనం చేయడం తగ్గిస్తారు, అయితే క్రైస్తవులు అలా చేయకూడదు. ఏ వయసువారైనా, అనవసర విషయాల గురించి ఆలోచించకుండా ఉండగలరు. మీరు చదువుతుండగా, ఇతరులతో పంచుకోగల సమాచారం కోసం ఆసక్తితో వెతకండి. ఉదాహరణకు, అధ్యయనం చేస్తున్నప్పుడు మీరు చదివిన లేదా తెలుసుకున్న విషయాన్ని మీ భాగస్వామితోనో, క్రైస్తవ స్నేహితునితోనో పంచుకోగలరేమో ఆలోచించండి. అలా చేస్తే అది మీ మనసులో, హృదయంలో నాటుకుపోతుంది. అదే సమయంలో అది ఇతరులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

అధ్యయనం చేసే విషయంలో, దేవుని ప్రాచీన సేవకుడైన ఎజ్రా మాదిరిని అనుసరించండి. ఆయన “యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించడానికి హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు.” (ఎజ్రా 7:​10, NW) మీరూ మీ హృదయాన్ని ఎలా సిద్ధపరచుకోగలరు? మీరు అధ్యయనానికి అనుకూలంగా ఉన్న పరిస్థితులను ఏర్పరచుకోండి. ఆ తర్వాత కూర్చొని నడిపింపు కోసం, జ్ఞానం కోసం యెహోవాకు ప్రార్థించండి. (యాకో. 1:⁠5) మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘ఈ అధ్యయనంలో నేను ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాను?’ మీరు చదువుతుండగా దానిలోని ముఖ్యాంశాలను గుర్తించడానికి ప్రయత్నించండి. మీరు వాటిని రాసుకోవచ్చు లేదా మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలనుకుంటున్న విషయాలను అండర్‌లైన్‌ చేసుకోవచ్చు. వాటిని పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు, నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, ఇతరులను ప్రోత్సహిస్తున్నప్పుడు ఎలా ఉపయోగించవచ్చో ఆలోచించండి. చివర్లో మీరు నేర్చుకున్న వాటిని క్లుప్తంగా సమీక్షించండి. అలా చేస్తే మీరు నేర్చుకున్నది మీకు గుర్తుంటుంది.

ఈవా తన బైబిలు అధ్యయనం గురించి ఇలా చెబుతోంది: “నేను బైబిలు చదువుతున్నప్పుడు క్రాస్‌ రెఫరెన్సులను, వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ను, సీడీ-రామ్‌లో దొరుకుతున్న వాచ్‌టవర్‌ లైబ్రరీని ఉపయోగిస్తాను. తెలుసుకున్న వాటిని పరిచర్యలో ఉపయోగించేందుకు నోట్సు రాసుకుంటాను.”

కొందరు చాలా సంవత్సరాలపాటు ఆధ్యాత్మిక విషయాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా ప్రయోజనం పొందారు. (సామె. 2:1-5) వారికి ఎన్నో బాధ్యతలున్నప్పటికీ, సమయాన్ని కేటాయించడం కష్టమైనప్పటికీ వారలా చేశారు. మీ పరిస్థితి కూడా అలాగే ఉంటే రోజువారీ కార్యక్రమాల్లో మీరు ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు?

సమయం ఎలా దొరుకుతుంది?

మీకిష్టమైన పనులు చేయడానికి సమయం తీసుకోవడం కష్టంకాదని బహుశా మీరు ఒప్పుకోవచ్చు. లోతుగా వ్యక్తిగత అధ్యయనం చేయడానికి బైబిలంతటినీ చదవడంవంటి వాస్తవిక లక్ష్యాలను పెట్టుకోవడం సహాయం చేస్తుందని చాలామంది గ్రహించారు. సుధీర్ఘ వంశావళులను, ప్రాచీన ఆలయానికి సంబంధించిన అన్ని వివరాలను, లేదా అర్థంచేసుకోవడానికి కష్టంగావుండి రోజువారీ జీవితానికి సంబంధంలేనట్లనిపించే ప్రవచనాలను చదవడం కష్టమనిపించవచ్చు. మీ లక్ష్యాన్ని చేరుకోడానికి మీ పరిస్థితికి తగిన చర్యలు తీసుకోండి. ఉదాహరణకు, కష్టంగా అనిపించిన బైబిలు భాగాన్ని పరిశీలించే ముందు దానికి సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని చదవవచ్చు లేదా అది మనకెలా వర్తిస్తుందో చూడవచ్చు. అలాంటి వివరాలు దాదాపు 50 భాషల్లో లభ్యమౌతున్న “ప్రతిలేఖనము దైవప్రేరేపితమును, ప్రయోజనకరమునై ఉన్నది” (ఆంగ్లం) అనే పుస్తకంలో కనుగొంటాం.

మీరు బైబిలు చదువుతున్నప్పుడు చదువుతున్న బైబిలు భాగాన్ని ఊహించుకుంటూ చదవడం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలా చేస్తే వ్యక్తులను, సంఘటనలను మీ మనసుల్లో చిత్రీకరించుకోగలరు. ఈ కొన్ని సలహాలను పాటించడం అధ్యయనాన్ని ఆహ్లాదకరంగానూ ఆశీర్వాదకరంగానూ చేయగలదు. అప్పుడు మీరు అధ్యయనం కోసం సమయాన్ని కేటాయించడానికి మరింత ఆసక్తి చూపిస్తారు. ప్రతీరోజూ బైబిలు చదవడాన్ని అలవాటు చేసుకోవడం తేలిక అవుతుంది.

పై సలహాలు బైబిలు అధ్యయనం చేయడానికి ఒక వ్యక్తికి సహాయం చేయవచ్చు. మరి కుటుంబంగా అధ్యయనం చేయడానికి తీరికలేకపోతే అప్పుడేమి చేయాలి? కుటుంబసభ్యులంతా కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు కుటుంబ బైబిలు అధ్యయనంవల్ల వచ్చే ప్రయోజనాలను ఎందుకు చర్చించుకోకూడదు? అలా చర్చించడంవల్ల కుటుంబ సభ్యులు మంచి సలహాలు చెప్పవచ్చు. బహుశా వారు బైబిల్లోని ఒక భాగాన్ని చర్చించేలా రోజూ లేదా వారంలో కొన్నిరోజులు ఉదయం కొంచెం ముందు లేస్తే బాగుంటుందని సలహా ఇవ్వవచ్చు. లేదా దినచర్యలో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందో వారు సూచించవచ్చు. ఉదాహరణకు, భోజనం చివర్లో కుటుంబమంతా కలిసి దిన వచనాన్ని చర్చించడం లేదా బైబిల్లోని ఒక భాగాన్ని చదవడం బాగుంటుందని కొన్ని కుటుంబాలు గుర్తించాయి. టేబుల్‌మీద నుండి పాత్రలు తీయకముందే లేదా ఎవరూ అక్కడినుండి వేరే పనుల కోసం వెళ్ళిపోకముందే పది పదిహేను నిమిషాలు లేఖనాలను లేదా ఆ వారంలో చదవాల్సిన బైబిలు భాగాల్ని చర్చించవచ్చు. మొదట్లో అలా చేయడం కష్టమనిపించినా కుటుంబ సభ్యులు దానికి అలవాటుపడి బైబిలు అధ్యయనాన్ని ఎంతో ఇష్టపడతారు.

వోయ్‌ఛెక్‌, మావ్గోజాటా దంపతులు తమ కుటుంబానికి ఏది సహాయం చేసిందో ఇలా చెప్పారు: “గతంలో అనవసర విషయాలకు మా సమయాన్ని వృథాచేసేవాళ్లం. ఈ-మెయిల్‌ చేసే సమయాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాం. మేము చూసే వినోదాన్ని కూడా తగ్గించి ఫలాని రోజు, ఫలాని సమయంలో లోతైన అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాం.” ఆ మార్పులు చేసుకున్నందుకు వారు బాధపడడం లేదు. అలాగే, మీ కుటుంబం కూడా బాధపడదు.

ఖచ్చితమైన జ్ఞానాన్ని వృద్ధిచేసుకోవడం మేలు చేస్తుంది

దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తే ‘ప్రతి సత్కార్యములో సఫలులవుతాం.’ (కొలొ. 1:9-12) మీరలా సఫలమౌతుండగా మీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపిస్తుంది. మీరు బైబిలు సత్యాలు గురించిన లోతైన అవగాహన ఉన్న అధ్యాత్మిక వ్యక్తిగా ప్రగతి సాధిస్తారు. బైబిలు జ్ఞానం తక్కువగా ఉన్నవారిలా కాక మరింత పరిణతితో నిర్ణయాలు తీసుకోగలుగుతారు, పరిణతితో సలహాలివ్వగలుగుతారు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మీరు యెహోవాకు మరింత దగ్గరౌతారు. మీరు ఆయన లక్షణాలను మరింతగా ఇష్టపడతారు. మీరెంతగా ఇష్టపడుతున్నారో మీరు ఆయన గురించి ఇతరులకు చెప్పడాన్నిబట్టి స్పష్టమౌతుంది.​—⁠1 తిమో. 4:​15; యాకో. 4:⁠8.

మీ వయసుతో అనుభవంతో సంబంధం లేకుండా దేవుని వాక్యాన్ని చదవడానికి, విశాల హృదయంతో దానిని లోతుగా అధ్యయనం చేయడానికి ఇష్టపడండి. యెహోవా మీ ప్రయత్నాలను మరచిపోడన్న నమ్మకంతో ఉండండి. (హెబ్రీ. 6:​10) ఆయన మీపై విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు.

[13వ పేజీలోని బాక్సు]

‘ఖచ్చితమైన జ్ఞానాన్ని వృద్ధిచేసుకున్నప్పుడు’ . . .

మన విశ్వాసం బలపడి, యెహోవాకు ఇష్టమైన విధంగా నడుచుకుంటాం.—⁠కొలొ. 1:​9, 10

వివేచనను ఉపయోగించి చక్కని నిర్ణయాలు తీసుకునేలా మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాం.​—⁠కీర్త. 119:⁠99

యెహోవాకు దగ్గరయ్యేలా ఇతరులకు సహాయం చేయడానికి మనం మరింత ఆనందిస్తాం.—⁠మత్త. 28:​19, 20

[14వ పేజీలోని చిత్రాలు]

అధ్యయనానికి అనుకూలమైన స్థలం కనుగొనడం కష్టమైనా దానిని కనుగొనడం మంచిది

[15వ పేజీలోని చిత్రం]

కొన్ని కుటుంబాలు భోజనమైన తర్వాత బైబిలు భాగాన్ని చదువుతాయి