కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి ఆమోదకరమైన విధంగా ఆరాధించే విషయంలో యేసును అనుకరించండి

దేవునికి ఆమోదకరమైన విధంగా ఆరాధించే విషయంలో యేసును అనుకరించండి

దేవునికి ఆమోదకరమైన విధంగా ఆరాధించే విషయంలో యేసును అనుకరించండి

దేవుడు ప్రేమగా ‘ప్రతి జనములోని ప్రతి వంశములోని, ఆయా భాషలు మాటలాడు’ ప్రజలను తనను ఆరాధించమని ఆహ్వానిస్తున్నాడు. (ప్రక. 7:​9, 10; 15:​3, 4) ఆ ఆహ్వానాన్ని అంగీకరించేవారు “యెహోవా ప్రసన్నతను” చూడగలుగుతారు. (కీర్త. 27:⁠4; 90:​17) కీర్తనకర్తలాగే వారు ఎలుగెత్తి దేవుణ్ణి ఇలా సుత్తిస్తారు: “రండి నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము.”​—⁠కీర్త. 95:⁠7.

యెహోవా ఎంతగానో ఇష్టపడిన ఆరాధన

యేసు దేవుని ఏకైక కుమారుడు కాబట్టి ఆయనకు తన తండ్రి ఆలోచనా విధానం, సూత్రాలు, ప్రమాణాలు నేర్చుకొనేందుకు ఎన్నో అవకాశాలు దొరికాయి. కాబట్టి యెహోవాను ఎలా ఆరాధించాలో యేసు ఖచ్చితంగా ఇతరులకు చెప్పగలిగాడు. “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అని ఆయన చెప్పాడు.​—⁠యోహా. 1:​14; 14:⁠6.

తండ్రికి వినయంగా లోబడడంలో యేసు పరిపూర్ణ మాదిరినుంచాడు. “నా అంతట నేనే యేమియు​చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాను” అని ఆయన అన్నాడు. “ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును” అని కూడ చెప్పాడు. (యోహా. 8:​28, 29) యేసు ఎలా తండ్రికి ఇష్టమైన రీతిలో ప్రవర్తించాడు?

యేసు తన జీవితాన్నే తండ్రి సేవకు అంకితం చేశాడు. నిజానికి దేవుణ్ణి ఆరాధించాలంటే అలాగే జీవితాన్ని అంకితం చేసుకోవాలి. యేసు తన తండ్రికి విధేయత చూపించడం ద్వారా, ఎన్ని కష్టాలెదురైనా ఆయన చిత్తాన్ని చేయడం ద్వారా ఆయనపట్ల తనకెంత ప్రేమ ఉందో చూపించాడు. (ఫిలి. 2:​7, 8) ఆయన శిష్యులను చేసే పనిలో ఎంతగా ప్రయాసపడ్డాడంటే విశ్వాసులు, అవిశ్వాసులు కూడ ఆయనను బోధకుడు అని పిలిచేవారు. అదే యేసు ఆరాధనలో ముఖ్య భాగంగా ఉండేది. (మత్త. 22:​23, 24; యోహా. 3:⁠2) అంతేకాదు యేసు ఇతరులకు సహాయం చేయడానికి ఎంతో సమయాన్ని, శక్తిని వెచ్చించాడు. ఆయన చూపించిన స్వయంత్యాగ స్వభావంవల్ల ఆయనకంటూ సమయం ఉండేది కాదు. అయినా ఇతరులకు సేవ చేయడానికి ఆయన ఇష్టపడేవాడు. (మత్త. 14:​13, 14; 20:​28) తీరిక లేకపోయినా తన పరలోక తండ్రికి ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ సమయం తీసుకునేవాడు. (లూకా 6:​12) యేసు చేసిన ఆరాధనను యెహోవా ఎంతో ఇష్టపడ్డాడు!

దేవునికి ఇష్టునిగా ఉండేందుకు ప్రయాసపడ్డాడు

యెహోవా తన కుమారుని ప్రవర్తనను గమనించి తన ఆమోదాన్ని తెలిపాడు. (మత్త. 17:⁠5) అయితే మరోవైపు అపవాదియైన సాతాను కూడ యేసు నమ్మకంగా జీవించడాన్ని గమనించాడు. అందుకే సాతాను ప్రత్యేకంగా యేసునే లక్ష్యంగా చేసుకున్నాడు. ఎందుకు? ఎందుకంటే అప్పటివరకు ఏ మానవుడూ దేవునికి పూర్తి విధేయతను చూపిస్తూ ఆయన కోరే విధంగా ఆరాధించలేదు. న్యాయంగా యెహోవాకే చెందాల్సిన ఆరాధనను యేసు ఆయనకివ్వకుండా ఆపాలని అపవాది కోరుకున్నాడు.​—⁠ప్రక. 4:​10, 11.

యేసును తప్పుదారి పట్టించడానికి సాతాను ఆయనకు ఆశ చూపే ప్రయత్నం చేశాడు. యేసును ‘ఎత్తయిన ఒక కొండమీదికి తీసుకెళ్లి, లోకరాజ్యములన్నిటిని, వాటి మహిమను చూపించాడు.’ “నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదను” అని చెప్పాడు. దానికి యేసు ఏమన్నాడు? “సాతానా, పొమ్ము​—⁠ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నది” అని జవాబిచ్చాడు. (మత్త. 4:8-10) పైకి కనిపించే లాభాల సంగతి అటుంచితే సాతానుకు ఒక్కసారైనా నమస్కరించడం విగ్రహారాధన చేసినట్లే అవుతుందని యేసు గ్రహించాడు. యెహోవాకు తప్ప మరింకెవరికీ కనీసం ఒక్క​సారైనా నమస్కరించడానికి ఆయన ఇష్టపడలేదు.

సాతాను మనకు కూడ లోకరాజ్యాలను, వాటిని మహిమను చూపించి తనను ఆరాధించమని అడగకపోవచ్చు. కానీ యథార్థ క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధించకుండా ఆపుచేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మనం వేరెవరినైనా, మరిదేనినైనా ఆరాధించాలని అపవాది కోరుకుంటున్నాడు.​—⁠2 కొరిం. 4:⁠4.

క్రీస్తుయేసు మరణంవరకు నమ్మకంగా ఉన్నాడు. దేవునికి యథార్థంగా ఉండడం ద్వారా యేసు వేరే ఏ మానవుడు ఘనపర్చనంతగా యెహోవాను ఘనపరిచాడు. నిజ క్రైస్తవులముగా నేడు మనం సృష్టికర్త ఆరాధనకే మన జీవితాల్లో మొదటి స్థానాన్ని ఇవ్వడం ద్వారా నమ్మకంగా జీవించిన యేసును అనుసరించడానికి ప్రయత్నిస్తాం. దేవునితో మనకున్న మంచి సంబంధమే మనకు అత్యంత విలువైనది.

దేవునికి ఇష్టమైన విధంగా ఆరాధించడంవల్ల వచ్చే ఆశీర్వాదాలు

దేవుని దృష్టిలో “పవిత్రమును నిష్కళంకమునైన” ఆరాధనను ప్రోత్సహించడంవల్ల ఎన్నో ఆశీర్వాదాలొస్తాయి. (యాకో. 1:​27) ఉదాహరణకు, నేడు మనం “స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు,” “సజ్జనద్వేషులు” అంతకంతకూ ఎక్కవవుతున్న కాలాల్లో జీవిస్తున్నాం. (2 తిమో. 3:1-5) అయితే దేవుని మందిరంలో లేక దేవుని సంఘంలో మనకు దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవిస్తూ ఆయనను ఆరాధించడానికి కృషిచేస్తున్న పవిత్రమైన ప్రజలతో సహవసించే మంచి అవకాశం ఉంది. (1 తిమో. 3:​15) అలా సహవసించడం మీకు ఊరటగా అనిపించడం లేదా?

ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా చూసుకోవడంవల్ల మనం మంచి మనస్సాక్షిని కూడ ఆశీర్వాదంగా పొందుతాం. దేవుని నీతియుక్త సూత్రాలను పాటిస్తూ, దేవుని నియమాలకు విరుద్ధంకాని కైసరు నియమాలకు లోబడుతూ ఉంటే మన మనస్సాక్షి ఎప్పటికీ నిర్మలంగానే ఉంటుంది.​—⁠మార్కు 12:​17; అపొ. 5:27-29.

దేవుణ్ణి పూర్ణాత్మతో ఆరాధించడంవల్ల వేరే ఆశీర్వాదాలను కూడ పొందుతాం. మనం మన ఇష్టప్రకారం కాకుండా దేవుని చిత్తం చేయడానికే ప్రాముఖ్యతనిస్తే మన జీవితం అర్థవంతంగా, సంతృప్తికరంగా మారుతుంది. “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము” అని అనే బదులు పరదైసు భూమిపై జీవిస్తామనే నిజమైన నిరీక్షణతో ఉంటాం.​—⁠1 కొరిం. 15:⁠32.

యెహోవా దృష్టిలో సత్ప్రవర్తనకలవారు “మహాశ్రమలనుండి” తప్పించుకుంటారని ప్రకటన పుస్తకం చెబుతోంది. “సింహాసనాసీనుడైనవాడు తానే తన గుడారము వారిమీద కప్పును” అని ఆ పుస్తకం చెబుతోంది. (ప్రక. 7:13-15) ఆ సింహాసనంమీద కూర్చున్నది మరెవరో కాదు, విశ్వంలోని అత్యంత మహిమాన్వితుడైన యెహోవా దేవుడే. ఆయన మిమ్మల్ని తన గుడారంలోకి అతిథులుగా రమ్మని పిలిచి, మీకు ఏ హానీ జరుగకుండా సంరక్షిస్తున్న సమయంలో పరిస్థితులు ఎంత ఆనందదాయకంగా ఉంటాయో ఊహించండి! ఇప్పుడు కూడ మనం కొంతమేరకు యెహోవా సంరక్షణను, కాపుదలను ​అనుభవించగలం.

అంతేకాదు దేవునికి ఇష్టమైన విధంగా ఆరాధించేవారు “జీవజలముల బుగ్గలయొద్దకు” నడిపించబడతారని అక్కడ వివరించబడింది. సేదదీర్పునిచ్చే ఆ ఊటలు, మనం నిత్యజీవితం పొందడానికి యెహోవా చేసే ఏర్పాట్లన్నిటినీ సూచిస్తున్నాయి. అవును క్రీస్తు విమోచన క్రయధనం ద్వారా దేవుడు “వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.” (ప్రక. 7:​17) మానవులు పరిపూర్ణులైనప్పుడు భూమిపై నిరంతం జీవించే నిరీక్షణ ఉన్నవారు చెప్పలేనంత ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు కూడ దేవుణ్ణి సంతోషంగా ఆరాధిస్తున్నవారు యెహోవాపట్ల ఉన్న హృదయపూర్వక కృతజ్ఞతతో పురికొల్పబడి ఉత్సాహంతో కేకలు వేస్తారు. పరలోకవాసులతోపాటు యెహోవాను ఆరాధిస్తూ వారిలా పాడతారు: “ప్రభువా, [యెహోవా] దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయ​విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరు.”​—⁠ప్రక. 15:​3, 4.

[27వ పేజీలోని చిత్రం]

సాతాను మన ఆరాధనను పొందేందుకు ఏమి ఇవ్వజూపుతున్నాడు?