కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాయే మన “రక్షణకర్త”

యెహోవాయే మన “రక్షణకర్త”

యెహోవాయే మన “రక్షణకర్త”

“యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును.”​—⁠కీర్త. 37:⁠40.

సూర్యుని వెలుగువల్ల పడే నీడ ఒకే చోట ఉండదు. భూమి పరిభ్రమించేకొద్దీ దాని దిశ కూడా మారుతుంటుంది. కానీ భూమినీ, సూర్యుణ్ణి సృష్టించిన యెహోవా మారడు. (మలా. 3:⁠6) “ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు” అని బైబిలు చెబుతోంది. (యాకో. 1:​17) మనం పరీక్షలను, కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు యెహోవా గురించిన ఈ ప్రాథమిక సత్యం మనకు మరింత ఓదార్పును, బలాన్ని ఇస్తుంది. ఎందుకు?

2 బైబిలు కాలాల్లో యెహోవా తన సేవకులకు “రక్షణకర్త”గా ఉన్నాడని మనం ముందటి ఆర్టికల్‌లో గమనించాం. (కీర్త. 70:⁠5) ఆయనలో మార్పులేదు, తన మాట నిలబెట్టుకుంటాడు కాబట్టి ఆయన తమకు ‘సహాయుడై రక్షించును’ అని ఆయన ఆరాధకులు నమ్మవచ్చు. (కీర్త. 37:​40) మన కాలాల్లో తన సేవకులను యెహోవా ఎలా రక్షించాడు? ఆయన మనకు వ్యక్తిగతంగా ఎలా సహాయం చేయవచ్చు?

వ్యతిరేకుల నుండి రక్షణ

3 మన నుండి పూర్ణభక్తిని పొందేందుకు యెహోవా అర్హుడు. సాతాను యెహోవాసాక్షులపై ఎంత వ్యతిరేకత తీసుకొచ్చినా వారు యెహోవాను పూర్ణభక్తితో ఆరాధించడాన్ని ఆపలేడు. “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతివానికి నీవు నేరప్థాపన చేసెదవు” అని దేవుని వాక్యం హామీనిస్తోంది. (యెష. 54:​17) దేవుని ప్రజల ప్రకటనా పనిని ఆపుచేయడానికి వ్యతిరేకులు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. మనం రెండు ఉదాహరణలు పరిశీలిద్దాం.

4 యెహోవా సేవకుల ప్రకటనా పనిని ఆపుజేయాలనే ఉద్దేశంతో క్రైస్తవ మతనాయకులు 1918లో వారిమీద హింసను ప్రోత్సహించారు. అప్పట్లో ప్రపంచవ్యాప్త పనిని పర్యవేక్షిస్తున్న సహోదరుడు జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌తోపాటు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న మరికొందరిని అరెస్టు చేయాల్సిందిగా మే 7వ తారీఖున అమెరికా ప్రభుత్వం వారంటు జారీ చేసింది. అలా జరిగిన రెండు నెలల్లోపే సహోదరుడు రూథర్‌ఫర్డ్‌మీద, ఆయన సహచరులమీద అన్యాయంగా విద్రోహ చర్యలు చేపడుతున్నారనే ఆరోపణ మోపబడింది. వారికి అనేక సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది. వ్యతిరేకులు కోర్టుల సహకారంతో ప్రకటనా పనిని శాశ్వతంగా ఆపుజేయగలిగారా? లేదు.

5 “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు” అనే యెహోవా వాగ్దానం గుర్తుందా? ఊహించని రీతిలో పరిస్థితులు మారాయి. వారికి శిక్ష విధించబడిన తొమ్మిది నెలలకు అంటే 1919 మార్చి 26న బెయిలు మీద జైలు నుండి విడుదలయ్యారు. తర్వాతి సంవత్సరం అంటే 1920 మే 5న వారిమీద మోపబడిన ఆరోపణలు తొలగించబడ్డాయి. ఆ సహోదరులు తమకు దొరికిన స్వేచ్ఛను కృతనిశ్చయంతో రాజ్య ప్రకటనా పని చేసేందుకు ఉపయోగించుకున్నారు. దానివల్ల ఎలాంటి ఫలితాలొచ్చాయి? అప్పటి నుండి ఎంతో అభివృద్ధి జరిగింది. ఆ ఘనతంతా “రక్షణకర్త” అయిన యెహోవాకే చెందుతుంది.​—⁠1 కొరిం. 3:⁠7.

6 ఇప్పుడు రెండవ ఉదాహరణను చూద్దాం. జర్మనీ మొత్తంలో యెహోవాసాక్షుల జాడలేకుండా చేస్తానని 1934లో హిట్లర్‌ శపథం చేశాడు. ఆయనవి వట్టి మాటలు కావు. దేశవ్యాప్తంగా సహోదరులు ఆరెస్టు చేయబడ్డారు, అనేకమంది జైల్లో వేయబడ్డారు. వేలాదిమంది సాక్షులు బలయ్యారు. వందలాదిమంది సామూహిక నిర్బంధ శిబిరాల్లో చంపబడ్డారు. హిట్లర్‌ శపథం నెరవేరిందా? జర్మనీలో సువార్త ప్రకటనా పనంతటినీ ఆయన ఆపేయగలిగాడా? ఎంతమాత్రం ఆపలేకపోయాడు. హింస చెలరేగినప్పుడు మన సహోదరులు రహస్యంగా ప్రకటనా పనిని చేశారు. నాజీ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత స్వేచ్ఛ దొరకడంతో వారు ప్రకటనా పని కొనసాగించారు. ఇప్పుడు జర్మనీలో 1,65,000 కన్నా ఎక్కువమంది రాజ్య ప్రచారకులున్నారు. ఈ సందర్భంలో కూడా “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు” అనే తన వాగ్దానాన్ని “రక్షణకర్త” నిలబెట్టుకున్నాడు.

7 యెహోవా తన సేవకులు ఒక గుంపుగా సమూలంగా నాశనం చేయబడేందుకు ఎన్నడూ అనుమతించడని యెహోవాసాక్షుల ఆధునిక చరిత్ర రుజువు చేస్తోంది. (కీర్త. 116:​15) అయితే, యెహోవా మనల్ని వ్యక్తిగతంగా రక్షిస్తాడా? అదే నిజమైతే, ఎలా రక్షిస్తాడు?

దేవుడు మనల్ని భౌతికంగా రక్షిస్తాడా?

8 ప్రతీ వ్యక్తిని భౌతికంగా రక్షిస్తానని దేవుడు హామీనివ్వడం​లేదని మనకు తెలుసు. నెబుకద్నెజరు రాజు నిలబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించము అని చెప్పిన నమ్మకస్థులైన ముగ్గురు హెబ్రీయుల్లాగే మనం ఆలోచిస్తాం. దైవభక్తిగల ఆ ముగ్గురు యువకులు యెహోవా తమకు హాని జరగకుండా అద్భుతంగా రక్షిస్తాడని అనుకోలేదు. (దానియేలు 3:​17, 18 చదవండి.) అయితే, యెహోవా వారిని మండుతున్న అగ్నిగుండం నుండి రక్షించాడు. (దాని. 3:21-27) బైబిలు కాలాల్లో కూడా కేవలం కొన్ని సందర్భాల్లోనే దేవుడు తన సేవకులను అద్భుతంగా రక్షించాడు. యెహోవాకు నమ్మకమైన సేవకుల్లో అనేకమంది వ్యతిరేకుల చేతుల్లో మరణించారు.​—⁠హెబ్రీ. 11:35-37.

9 నేడు కూడా దేవుడు అలా రక్షిస్తాడా? “రక్షణకర్త”గా యెహోవా తన సేవకులను ప్రమాదకరమైన పరిస్థితుల నుండి తప్పక రక్షించగలడు. కొన్ని సందర్భాల్లో యెహోవాయే కాపాడాడని లేక కాపాడలేదని మనం ఖచ్చితంగా చెప్పగలమా? లేదు. అయినా, ఒక వ్యక్తి ప్రమాదాన్ని తప్పించుకున్నప్పుడు యెహోవా తనను కాపాడాడని అనుకోవచ్చు. వారి అభిప్రాయం తప్పని చెప్పడం అహంకారంతో మాట్లాడడమే అవుతుంది. అదే సమయంలో, వాస్తవికంగా ఆలోచించి నాజీ కాలంలో హింసవల్ల మరణించినట్లే అనేకమంది నమ్మకమైన క్రైస్తవులు హింసవల్ల మరణించారని మనం అంగీకరించాలి. మరికొందరు ‘అనూహ్యంగానూ కాలవశంచేత’ విపత్కర పరిస్థితుల్లో మరణించారు. (ప్రసం. 9:​11, NW) ‘అకాల మరణానికి గురైన నమ్మకస్థుల విషయంలో యెహోవా “రక్షణకర్త”గా వ్యవహరించలేదా’ అనే ప్రశ్న మనకు రావచ్చు. అలా అనుకోవాల్సిన అవసరంలేదు.

10 ఈ విషయం గురించి ఆలోచించండి: మానవజాతి సామాన్య సమాధియైన హేడిస్‌ లేదా “పాతాళముయొక్క [‘షియోల్‌,’ NW] వశము కాకుండ” ఎవరూ ‘తప్పించుకోలేరు’ కాబట్టి మరణించకుండా ఉండడం అసాధ్యం. (కీర్త. 89:​48) అయితే, యెహోవా విషయమేమిటి? నాజీ మారణ​హోమాన్ని తప్పించుకున్న ఒక సహోదరి అన్న మాటలను చూద్దాం. సామూహిక నిర్బంధ శిబిరంలో తమకు ఆత్మీయులైనవారు చనిపోయినప్పుడు, సాక్షియైన తన తల్లి తనను ఓదార్చడానికి ఒకసారి చెప్పిన మాటలను ఆమె గుర్తుచేసుకుంది: “మరణం శాశ్వతమైనదైతే, అది దేవునికన్నా శక్తివంతమైనదౌతుంది కదా?” మరణం అత్యంత శక్తిమంతుడైన జీవదాతకు ఏ విధంగానూ సాటిరాదు! (కీర్త. 36:⁠9) షియోల్‌ లేదా హేడిస్‌లో ఉన్నవారందరూ యెహోవాకు గుర్తున్నారు, వారిలో ప్రతీ ఒక్కరినీ ఆయన రక్షిస్తాడు.​—⁠లూకా 20:​37, 38; ప్రక. 20:11-14.

11 అంతవరకు, యెహోవా నమ్మకమైన తన ఆరాధకులకు నేరుగా సహాయం చేస్తాడు. ఆయన మనకు “రక్షణకర్తగా” వ్యవహరిస్తున్న మూడు మార్గాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

ఆధ్యాత్మికంగా రక్షిస్తున్నాడు

12 యెహోవా మనకు అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక రక్షణను ఇస్తున్నాడు. మనం నిజక్రైస్తవులము కాబట్టి మన ప్రస్తుత జీవితంకన్నా మరింత ప్రాముఖ్యమైనది మరొకటి ఉందని మనకు తెలుసు. అది యెహోవాతో మనకున్న సంబంధమే. (కీర్త. 25:​14; 63:⁠3) ఆ సంబంధమే గనుక లేకుంటే మన ప్రస్తుత జీవితానికి అర్థమూ ఉండదు, భవిష్యత్తు నిరీక్షణా ఉండదు.

13 సంతోషకరంగా, మనం ఆయనతో దగ్గరి సంబంధాన్ని కలిగివుండేందుకు కావాల్సిన సహాయాన్నంతా యెహోవా అందిస్తున్నాడు. మనకు సహాయం చేసేందుకు ఆయన తన వాక్యాన్ని, పరిశుద్ధాత్మను, ప్రపంచ​వ్యాప్త సంఘాన్ని ఇచ్చాడు. యెహోవా అనుగ్రహించిన ఈ ఏర్పాట్లను మనం ఎలా పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు? ఆయన వాక్యాన్ని క్రమంగా, శ్రద్ధగా అధ్యయనం చేయడంవల్ల మన విశ్వాసం, నిరీక్షణ బలపడతాయి. (రోమా. 15:⁠4) ఆయన పరిశుద్ధాత్మ కోసం యథార్థంగా ప్రార్థిస్తే ఆయనతో మన సంబంధాన్ని పాడుచేసే ఎలాంటి పనులు చేయకుండా ఉండేందుకు సహాయాన్ని పొందుతాం. (లూకా 11:​13) బైబిలు సాహిత్యాల ద్వారా, కూటాలు, సమావేశాల ద్వారా దాసుని తరగతి ఇస్తున్న నిర్దేశాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే మనకు “తగినవేళ” ఆధ్యాత్మిక ఆహారం దొరికి బలంగా ఉంటాం. (మత్త. 24:​45) ఆ ఏర్పాట్లు మనల్ని ఆధ్యాత్మికంగా రక్షించి దేవునికి దగ్గరగా ఉండేందుకు దోహదపడతాయి.​—⁠యాకో. 4:⁠8.

14 యెహోవా మనల్ని ఆధ్యాత్మికంగా రక్షిస్తాడనడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ముందటి ఆర్టికల్‌ ప్రారంభంలో ప్రస్తావించబడిన తల్లిదండ్రులను గుర్తుచేసుకోండి. తమ కూతురు థెరీసా కనిపించకుండా పోయిన కొన్ని రోజులకు ఆమె హత్య చేయబడిందనే విషాదకరమైన వార్త వారికి అందింది. * తండ్రి ఇలా గుర్తుచేసుకున్నాడు: “ఆమెను కాపాడమని నేను యెహోవాకు ప్రార్థించాను. ఆమె హత్య చేయబడిందని మాకు తెలిసినప్పుడు నా ప్రార్థనకు యెహోవా ఎందుకు జవాబు ఇవ్వలేదా అని నేను మొదట అనుకున్నాను. యెహోవా ప్రతీ ఒక్కరినీ అద్భుతంగా రక్షిస్తాననే హామీనివ్వలేదని నాకు తెలుసు. ఈ విషయంలో సరైన అవగాహన ఇవ్వమని నేను ఆయనకు ప్రార్థిస్తూనే ఉన్నాను. యెహోవా తన ప్రజలను ఆధ్యాత్మికంగా రక్షిస్తాడని అంటే ఆయనతో మన సంబంధాన్ని కాపాడుకోవడానికి కావల్సిన సహాయాన్ని అనుగ్రహిస్తాడని తెలుసుకొని నేను ఓదార్పు పొందాను. ఆధ్యాత్మిక రక్షణ ఎంతో ప్రాముఖ్యం, ఎందుకంటే అది ఉంటేనే మనం భవిష్యత్తులో నిరంతరం జీవించగలుగుతాం. యెహోవా థెరీసాను రక్షించాడనే చెప్పాలి, ఆమె తన మరణంవరకు ఆయనకు నమ్మకం సేవచేసింది. ఆమె భవిష్యత్తును ప్రేమగల మన తండ్రే నిర్ణయిస్తాడని తెలుసుకొని నేను నెమ్మదిపొందాను.”

అనారోగ్యంగా ఉన్నప్పుడు బలాన్నిస్తాడు

15 దావీదు ‘రోగశయ్యపై’ ఉన్నప్పుడు యెహోవా ఆయనకు ఎలా బలాన్నిచ్చాడో అలాగే మనకూ బలాన్నిస్తాడు. (కీర్త. 41:⁠3) మన కాలాల్లో యెహోవా అద్భుతంగా రోగాలను నయం చేయడం ద్వారా మనల్ని రక్షించకపోయినా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఎలా? చికిత్సా, మరితర విషయాల్లో జ్ఞానయుక్త మైన నిర్ణయాలు తీసుకునేందుకు ఆయన వాక్యంలోని సూత్రాలు మనకు సహాయం చేయగలవు. (సామె. 2:⁠6) మనకున్న అనారోగ్య సమస్య గురించి తెలియజేసే కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని ఆర్టికల్స్‌ నుండి సహాయకరమైన, పాటించదగ్గ సలహాలను పొందవచ్చు. మనకు ఏమైనాసరే ఆ సమస్యను ఎదుర్కొనేందుకూ మన యథార్థతను కాపాడుకునేందుకూ యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా “బలాధిక్యము” అనుగ్రహించవచ్చు. (2 కొరిం. 4:⁠7) అలాంటి సహాయం ఉన్నప్పుడు యెహోవాతో మనకున్న సంబంధంకన్నా మన ఆరోగ్యానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉండగలుగుతాం.

16 ముందటి ఆర్టికల్‌ ప్రారంభంలో ప్రస్తావించబడిన యువ సహోదరుని ఉదాహరణ తీసుకోండి. 1998లో ఆయనకు యమియోట్రాఫిక్‌ లాటెరల్‌ స్ల్కెరోసిస్‌ (ఎఎల్‌ఎస్‌) ఉందని వైద్య పరీక్షల్లో తేలింది, పక్షవాతంతో ఆయన శరీరమంతా చచ్చుబడిపోయింది. * ఆయన తన అనారోగ్య సమస్యను ఎలా ఎదుర్కోగలిగాడు? ఆయనిలా వివరించాడు: “చావు తప్ప ఇంకా ఏ విధంగానూ నాకు ఈ వ్యాధి నుండి విముక్తి కలగదా అని నాకు అనిపించినప్పుడు నేను బాధపడేవాణ్ణి, నిరాశనిస్పృహలకు గురయ్యేవాణ్ణి. నేను కృంగుదలకు లోనైనప్పుడు నాకు ప్రశాంతత, ఓపిక, సహనాలు అనుగ్రహించమని యెహోవాకు ప్రార్థిస్తాను. ఆ ప్రార్థనలకు యెహోవా జవాబిచ్చాడని నేను అనుకుంటున్నాను. మనస్సు ప్రశాంతంగా ఉండడంవల్ల ఓదార్పుకరమైన విషయాలను ఆలోచించగలుగుతున్నాను. నూతనలోకంలో నేను నడవగలిగినప్పుడు, రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించగలిగినప్పుడు, నా కుటుంబంతో మునుపటిలా మాట్లాడగలిగినప్పుడు నా జీవితం ఎలా ఉంటుందో ఊహించగలుగుతున్నాను. పక్షవాతంవల్ల వచ్చిన అసౌకర్యాలను, కష్టాలను ఓపికతో సహించగలుగుతున్నాను. సహనం ఉండడంవల్ల నేను నమ్మకంగా ఉంటూ, ఇతర విషయాల కన్నా ఆధ్యాత్మిక విషయాలకు ప్రాముఖ్యతనివ్వగలుగుతున్నాను. నా భావాలు కీర్తనకర్త అయిన దావీదులాగే ఉన్నాయి, ఎందుకంటే రోగశయ్య మీదున్నప్పుడు యెహోవా నన్ను బలపర్చాడని నేను అనుకుంటున్నాను.”​—⁠యెష. 35:​5, 6.

ఆహారాన్నిస్తాడు

17 యెహోవా మనకు అవసరమైనవి ఇస్తానని వాగ్దానం చేశాడు. (మత్తయి 6:​33, 34; హెబ్రీయులు 13:​5, 6 చదవండి.) అలాగని అద్భుతంగా మనకు కావాల్సినవి సమకూరుతాయని అనుకోకూడదు లేదా పని చేయడానికి తిరస్కరించకూడదు. (2 థెస్స. 3:​10) మనం దేవుని రాజ్యానికి మొదటి స్థానమిస్తూ, బ్రతుకు తెరువు కోసం పని చేయడానికి ఇష్టపడితే మనకు అవసరమైనవి సంపాదించుకునేందుకు యెహోవా సహాయం చేస్తాడని నమ్మవచ్చు అన్నదే యెహోవా చేసిన వాగ్దానానికున్న అర్థం. (1 థెస్స. 4:​10-12; 1 తిమో. 5:⁠8) మనం ఊహించని రీతుల్లో యెహోవా మనకు అవసరమైనవి అందించగలడు. బహుశా మన తోటి విశ్వాసితో సహాయం చేయించగలడు లేదా ఆ విశ్వాసి మనకు పని ఇచ్చేలా చూడగలడు.

18 ముందటి ఆర్టికల్‌ ప్రారంభంలో ప్రస్తావించబడిన ఒంటరి తల్లిని గుర్తుచేసుకోండి. ఆమె, వాళ్ల అమ్మాయి ఒక కొత్త ప్రదేశానికి తరలివెళ్లారు. అక్కడ ఆమెకు ఉద్యోగం దొరకడం కష్టమయ్యింది. “నేను ప్రతీ రోజు పొద్దున ప్రకటనా పనికి వెళ్లి మధ్యాహ్నాలు ఉద్యోగం కోసం వెదికేదాన్ని. నాకింకా గుర్తు, నేనొక రోజు పాలు కొనడానికని కొట్టుకు వెళ్లాను. కాసేపు అక్కడున్న కూరగాయలవైపు చూస్తూ నిలబడ్డాను. కానీ అవి కొనడానికి సరిపడా డబ్బు నా దగ్గర లేకపోయింది. జీవితంలో మొదటిసారి నాకు పట్టరానంత దుఃఖం కలిగింది. ఆ రోజు కొట్టునుండి తిరిగివచ్చాక మా ఇంటి పెరట్లో అన్ని రకాల కూరగాయలతో నిండిన బుట్టలుండడం చూశాను. మేము నెలల తరబడి వాడుకునేన్ని కూరగాయలు వాటిలో ఉన్నాయి. చెమర్చిన కళ్లతో యెహోవాకు ప్రార్థించి నా కృతజ్ఞతలు తెలియజేశాను.” సంఘంలోని ఒక సహోదరుడు తన తోటలో కూరగాయలు పండించేవాడు. ఆయనే ఆ రోజు వాళ్లింటికి కూరగాయలు తెచ్చాడని కొంతకాలానికి ఆమెకు తెలిసింది. ఆమె ఆయనకు రాసిన ఉత్తరంలో, “ఆ రోజు నేను మీకెంతగానో కృతజ్ఞతలు చెప్పాను. కానీ యెహోవా తన ప్రేమను మీ ద్వారా చూపించినందుకు ఆయనకు కూడ కృతజ్ఞతలు తెలియజేశాను.”​—⁠సామె. 19:⁠17.

19 యెహోవా బైబిలు కాలాల్లో చేసినదాన్నిబట్టి, ఇప్పుడు చేస్తున్నదాన్ని బట్టి ఆయన మనకు సహాయం చేస్తాడని మనం పూర్తిగా నమ్మవచ్చనే విషయం స్పష్టమౌతోంది. త్వరలో సాతాను లోకంపై మహాశ్రమలు వచ్చినప్పుడు మనకు యెహోవా సహాయం మరింత ఎక్కువగా అవసరమౌతుంది. అయినా యెహోవా సేవకులు పూర్తి నమ్మకంతో ఆయన సహాయం చేస్తాడని ఎదురుచూడవచ్చు. విడుదల సమీపించిందని గ్రహించి వారు ధైర్యంగా తమ తలలెత్తి ఆనందించగలుగుతారు. (లూకా 21:​28) అంతవరకు, మనకు ఎలాంటి పరీక్షలు ఎదురైనా మార్పులేని దేవుడైన యెహోవా ఖచ్చితంగా మన విషయంలో “రక్షణకర్తగా” ఉంటాడనే పూర్తి విశ్వాసంతో ఆయనపై నమ్మకముంచాలని తీర్మానించుకుందాం.

[అధస్సూచీలు]

^ పేరా 19 తేజరిల్లు! (ఆంగ్లం) జూలై 22, 2001, 19-23 పేజీల్లో ఉన్న “ఘోర విషాదాన్ని తాళుకోవడం” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 22 తేజరిల్లు! (ఆంగ్లం) జనవరి 2006, 25-29 పేజీల్లో ఉన్న “నా విశ్వాసంవల్ల ఎఎల్‌ఎస్‌ను తట్టుకొని జీవించగలుగుతున్నాను” అనే ఆర్టికల్‌ చూడండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

• అకాల మరణానికి గురైనవారిని యెహోవా ఎలా రక్షించగలడు?

• ఆధ్యాత్మిక రక్షణ ఎందుకు అత్యంత ప్రాముఖ్యం?

• యెహోవా మనకు అవసరమైనవి ఇస్తానని చేసిన వాగ్దానానికున్న అర్థమేమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. యెహోవాకు సంబంధించిన ఏ ప్రాథమిక సత్యం మనకు ఓదార్పును, బలాన్ని ఇస్తుంది?

3. యెహోవా సేవకుల ప్రకటనా పనిని వ్యతిరేకులు ఆపుజేయలేరని మనమెందుకు నమ్మవచ్చు?

4, 5. యెహోవా ప్రజలు 1918లో ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు, దాని ఫలితమేమిటి?

6, 7. (ఎ) నాజీ జర్మనీలో యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా ఎలాంటి హింసాకాండ చెలరేగింది, దాని పర్యవసానమేమిటి? (బి) యెహోవాసాక్షుల ఆధునిక చరిత్ర ఏమి రుజువుచేస్తోంది?

8, 9. (ఎ) ప్రతీ వ్యక్తిని భౌతికంగా రక్షిస్తానని దేవుడు హామీనివ్వడంలేదని మనకెలా తెలుసు? (బి) వాస్తవికంగా ఆలోచించి మనం దేనిని అంగీకరించాలి?

10, 11. మానవుడు మరణాన్ని ఎందుకు తప్పించుకోలేడు, అయితే ఆ విషయంలో యెహోవా ఏమి చేయగలడు?

12, 13. ఆధ్యాత్మిక రక్షణ ఎందుకు చాలా ప్రాముఖ్యం, యెహోవా మనకు దాన్ని ఎలా అనుగ్రహిస్తున్నాడు?

14. యెహోవా ఆధ్యాత్మికంగా రక్షిస్తాడనడానికి ఒక ఉదాహరణ చెప్పండి.

15. మనం అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు యెహోవా ఏయే విధాలుగా సహాయం చేయగలడు?

16. ఒక సహోదరుడు అనారోగ్యాన్ని ఎలా సహించగలిగాడు?

17. యెహోవా మనకోసం ఏమి చేస్తానని వాగ్దానం చేశాడు, దాని అర్థమేమిటి?

18. మనం అవసరంలో ఉన్నప్పుడు కావల్సినవి యెహోవా సమకూరుస్తాడనడానికి ఒక ఉదాహరణ చెప్పండి.

19. మహాశ్రమల కాలంలో యెహోవా సేవకులకు ఏ నమ్మకం ఉంటుంది, మనం ఇప్పుడు ఏమని తీర్మానించుకోవాలి?

[8వ పేజీలోని చిత్రం]

సహోదరుడు రూథర్‌ఫర్డ్‌, ఆయన సహచరులు 1918లో అరెస్టు చేయబడినా ఆ తర్వాత వారిపైనున్న ఆరోపణలన్నీ తొలగించబడి విడుదలచేయబడ్డారు

[10వ పేజీలోని చిత్రం]

‘రోగశయ్యపై’ యెహోవా మనకు బలాన్నివ్వగలడు