కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వివాహంలో “మూడు పేటల త్రాడును” కాపాడుకోండి

వివాహంలో “మూడు పేటల త్రాడును” కాపాడుకోండి

వివాహంలో “మూడు పేటల త్రాడును” కాపాడుకోండి

“మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు.”​—⁠ప్రసం. 4:⁠12.

వృక్షాలను, జంతువులను సృష్టించిన తర్వాత యెహోవా దేవుడు మొదటి మానవుడైన ఆదామును సృష్టించాడు. ఆ తర్వాత ఆదాముకు గాఢనిద్రను కలుగజేసి ఆయన నిద్రించినప్పుడు ఆయన ప్రక్కటెముకల్లో ఒక దానితో ఆయనకు సాటియైన సహాయకారిని చేశాడు. ఆమెను చూసిన ఆదాము “నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము” అని అన్నాడు. (ఆది. 1:​27; 2:​18, 21-23) ఆదాముకు సరియైన జోడి హవ్వ అని యెహోవా అనుకొని వారిని బార్యభర్తలుగా చేసి వారిని ఆశీర్వదించాడు.​—⁠ఆది. 1:​28; 2:⁠24.

2 విచారకరంగా, కొంతకాలానికే దేవుడు స్థాపించిన వివాహ వ్యవస్థపై దాడి జరిగింది. ఎలా? సాతానుగా మారిన దుష్టాత్మ నిషేధించబడిన చెట్టు ఫలాన్ని తినేలా హవ్వను మోసగించాడు. వెనువెంటనే, ఆదాము కూడా తన భార్యతోపాటు అవిధేయుడయ్యాడు. అలా వారు యెహోవా పరిపాలనా హక్కును ధిక్కరించారు, ఆయనిచ్చే మంచి నిర్దేశాన్ని తిరస్కరించారు. (ఆది. 3:1-7) యెహోవా వారిని ​నిలదీసే సమయానికి ఆదాము హవ్వల సంబంధం దెబ్బతిన్నదన్నది స్పష్టమైంది. ఆదాము తన భార్యను నిందిస్తూ ఇలా అన్నాడు: “నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిని.”​—⁠ఆది. 3:11-13.

3 అప్పటినుండి ఎన్నో శతాబ్దాలుగా సాతాను వివాహాలను విచ్ఛిన్నం చేయడానికి అనేక కుయుక్తులను ఉపయోగిస్తున్నాడు. ఉదాహరణకు, వివాహం విషయంలో లేఖన విరుద్ధమైన దృక్పథాన్ని ప్రోత్సహించడానికి అతడు కొన్నిసార్లు మతనాయకులను ఉపయోగించాడు. ఆహారంలో ఉప్పు ఎక్కువవడం వంటి చిన్నచిన్న విషయాలకు కూడా తమ భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని అనుమతించడం ద్వారా యూదా మతనాయకుల్లో కొందరు దేవుని ప్రమాణాలను కించపరిచారు. కానీ యేసు ఇలా చెప్పాడు: “వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడు.”​—⁠మత్త. 19:⁠9.

4 అప్పటినుండి సాతాను వివాహాలను విచ్ఛిన్నం చేయడానికి ఎడతెగక ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మనం ఈ లోకంలో సలింగ సంయోగ వివాహాలు, స్త్రీపురుషులు పెళ్లి కాకుండానే కలిసి జీవించడం, చిన్న చిన్న విషయాలకు విడాకులు తీసుకోవడం వంటి వాటిని ఎక్కువగా చూస్తున్నాం. వీటన్నింటినిబట్టి చూస్తే వివాహ వ్యవస్థను అగౌరపరచడంలో అతడు ఎంతో సఫలమయ్యాడని అర్థమౌతోంది. (హెబ్రీయులు 13:4 చదవండి.) లోకంలో చాలామందికి వివాహం విషయంలో ఉన్న తప్పుడు దృక్పథాన్ని మనం అలవరచుకోకుండా ఉండడానికి క్రైస్తవులముగా మనం ఏమి చేయవచ్చు? సంతోషకరమైన, విజయవంతమైన వివాహ జీవితానికి కావాల్సిన కొన్ని లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మీ వివాహ జీవితంలో యెహోవాకు స్థానమివ్వండి

5 వివాహ జీవితం విజయవంతమవ్వాలంటే వారు తమ జీవితంలో యెహోవాకు స్థానమివ్వాలి. “మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు” అని ఆయన వాక్యం చెబుతోంది. (ప్రసం. 4:​12) ఇక్కడ “మూడు పేటల త్రాడు” అలంకార భావంలో ఉపయోగించబడింది. ఈ ఉపమానాన్ని వివాహ జీవితానికి అన్వయించినప్పుడు వివాహ బంధంలో రెండు పేటలు భార్యాభర్తలని మనం అనుకుంటే దానికి బలాన్ని చేకూర్చే మూడవ పేటగా యెహోవా దేవుడు ఉండాలి. దంపతులు దేవునికి స్థానమిచ్చినప్పుడు సమస్యలను అధిగమించేందుకు కావాల్సిన ఆధ్యాత్మిక బలాన్ని పొందడమేకాక తమ వివాహ జీవితంలో మరింత సంతోషం ​పొందగలుగుతారు.

6 తమ వివాహబంధం మూడు పేటల త్రాడులా ఉండాలంటే దంపతులు ఏమి చేయవచ్చు? కీర్తనకర్త దావీదు ఇలా పాడాడు: “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.” (కీర్త. 40:⁠8) దావీదులాగే దేవునిపట్ల మనకు ప్రేమ ఉంటే ఆయనను పూర్ణహృదయంతో ఆరాధించగలుగుతాం. ఆ విధంగా భార్యాభర్తలిరువురూ యెహోవాతో సన్నిహిత బంధాన్ని కలిగివుంటూ ఆయన చిత్తం చేయడానికి సంతోషిస్తారు. యెహోవాపట్ల తమ భాగస్వామికి ఉన్న ప్రేమను బలపరచడానికి కూడా వారు కృషిచేయాలి.​—⁠సామె. 27:⁠17.

7 దేవుని ధర్మశాస్త్రము నిజంగా మన ఆంతర్యములోవుంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమవంటి లక్షణాలను మనం కనబరచి వివాహబంధాన్ని పటిష్ఠపరచుకోగలుగుతాం. (1 కొరిం. 13:​13) సహోదరి సాండ్రాకు పెళ్లై 50 సంవత్సరాలవుతోంది, ఆమె ఇలా చెబుతోంది: “ఆయన బైబిలునుండి నిర్దేశం, సలహాలు ఇవ్వడం, నాకన్నా యెహోవాను ఎక్కువగా ప్రేమించడం నా భర్తలో నాకు ఎంతో నచ్చే విషయాలు.” భర్తలారా, మీ భార్యలు కూడా మీ గురించి అలాగే చెప్పేలా మీరు ప్రవర్తిస్తున్నారా?

8 దంపతులుగా మీరు, ఆధ్యాత్మిక విషయాలకూ క్రైస్తవ కార్యకలాపాలకూ మీ జీవితంలో ప్రథమ స్థానమిస్తున్నారా? అంతేకాక, యెహోవా సేవ చేయడంలో మీ భర్తను లేక భార్యను నిజంగా మీ భాగస్వామిగా పరిగణిస్తున్నారా? (ఆది. 2:​24) జ్ఞానియైన సొలొమోను ఇలా రాశాడు: “ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచిఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు.” (ప్రసం. 4:⁠9) యెహోవా ఆశీర్వాదాలుండే ప్రేమపూర్వక శాశ్వత బంధం అనే “మంచి ఫలము” పొందడానికి భార్యాభర్తలు కృషి చేయాలి.

9 వివాహ బంధంలో దేవునికి స్థానం ఉందా లేదా అనేది వారిరువురూ ఆయన చిత్తానికి అనుగుణంగా ప్రవర్తించడానికి కృషి చేస్తున్నారా లేదా అనే దానిని బట్టి తెలుస్తుంది. కుటుంబ శారీరక, ఆధ్యాత్మిక అవసరాలు తీర్చే బాధ్యత ముఖ్యంగా భర్తలదే. (1 తిమో. 5:⁠8) వారు భార్యల భావోద్వేగ అవసరాలను కూడా అర్థంచేసుకోవాలని ప్రోత్సహించబడుతున్నారు. కొలొస్సయులు 3:19లో ఇలా చదువుతాం: “భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి [‘ఆగ్రహాన్ని వెళ్లగ్రక్కకుడి,’ NW].” “ఆగ్రహాన్ని వెళ్లగ్రక్కడం” అంటే “సూటిపోటి మాటలు అనడం, చేయిచేసుకోవడం, ప్రేమా శ్రద్ధలు చూపించకపోవడం, అవసరాలు తీర్చకపోవడం, సంరక్షించకపోవడం, సహాయం చేయకపోవడమని అర్థం” అని ఒక బైబిలు విద్వాంసుడు వివరించాడు. క్రైస్తవ కుటుంబాల్లో అలాంటి ప్రవర్తన కనిపించకూడదు. భర్త తన శిరస్సత్వాన్ని ప్రేమపూర్వకంగా నిర్వర్తిస్తే ఆయనకు లోబడడం భార్యకు ​కష్టమనిపించదు.

10 తమ వివాహ జీవితాల్లో యెహోవాకు స్థానమివ్వాలనుకునే క్రైస్తవ భార్యలు దేవుని నియమాలను కూడా పాటించాలి. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు.” (ఎఫె. 5:​22, 23) దేవుని నుండి స్వతంత్రంగా ఉంటే నిరంతరం సంతోషంగా ఉండగలుగుతారనే అబద్ధాన్ని చెప్పి సాతాను హవ్వను మోసగించాడు. భార్యలు స్వేచ్ఛను కోరుకోవడం అనేక కుటుంబాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దైవభక్తిగల స్త్రీలైతే తమ భర్తలకు ఇష్టపూర్వకంగా లోబడివుంటారు. దేవుడు హవ్వను ఆదాముకు “సాటియైన సహాయకారిగా” ఇచ్చాడని వారు గుర్తుంచుకుంటారు. దేవుని దృష్టిలో అది ఒక గౌరవపూర్వకమైన స్థానం. (ఆది. 2:​18) దేవుడు తమకిచ్చిన స్థానాన్ని ఇష్టపూర్వకంగా అంగీకరించే క్రైస్తవ భార్యలు తమ భర్తలకు ‘కిరీటంగా’ ఉంటారు.​—⁠సామె. 12:⁠4.

11 దేవుని వాక్యాన్ని కలిసి చదవడం ద్వారా కూడా భార్యాభర్తలు వివాహబంధంలో దేవునికి స్థానం ఇవ్వగలుగుతారు. జెరల్డ్‌కు వివాహమై 55 సంవత్సరాలు అయింది. సంతోషకరంగా గడుస్తున్న తమ వివాహజీవితాన్ని గురించి ఇలా చెబుతున్నాడు: “వివాహ జీవితం విజయవంతం కావాలంటే బైబిలును కలిసి చదవడం, అధ్యయనం చేయడం చాలా ప్రాముఖ్యం. ఇద్దరూ కలిసి పనులను చేసినప్పుడు ముఖ్యంగా ఆధ్యాత్మిక పనులు కలిసి చేసినప్పుడు ఒకరికొకరు మరింత దగ్గరవడమే కాక యెహోవాకు కూడా దగ్గరవుతారు.” కలిసి అధ్యయనం చేయడంవల్ల యెహోవా ప్రమాణాలు వారి మనసుల్లో నాటుకుపోతాయి, యెహోవాతో వారికున్న సంబంధం బలపడుతుంది, ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తూ ఉండగలుగుతారు.

12 అంతేకాక, సజావుగా వివాహిత జీవితం సాగిస్తున్నవారు కలిసి ప్రార్థిస్తారు. తమకు ఎదురైన సమస్య గురించి భర్త ప్రార్థనలో ‘హృదయాన్ని కుమ్మరించినప్పుడు’ వివాహబంధం తప్పకుండా పటిష్ఠమవుతుంది. (కీర్త. 62:⁠8) ఉదాహరణకు, సలహా కోసం నిర్దేశం కోసం కలిసి సర్వశక్తిమంతునికి ప్రార్థించిన తర్వాత మీమధ్య ఏ బేధాభిప్రాయాలున్నా మరచిపోవడం ఎంత సులభమౌతుంది! (మత్త. 6:​14, 15) మీరు చేసిన ప్రార్థనకు అనుగుణంగా, మీరిరువురూ ‘ఒకరి నొకరు సహిస్తూ ఒకరి నొకరు క్షమించుకోవాలని’ తీర్మానించుకోవడం మంచిది. (కొలొ. 3:​13) మీరు ప్రార్థించినప్పుడు మీకు దేవునిపై నమ్మకముందని సూచిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. రాజైన దావీదు ఇలా చెప్పాడు: “సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి.” (కీర్త. 145:​15) మనం నిరీక్షణతో యెహోవాకు ప్రార్థించినప్పుడు ‘ఆయన మన గురించి చింతించుచున్నాడు’ అని తెలుసుకొని అంతగా ఆందోళనపడం.​—⁠1 పేతు. 5:⁠7.

13 సంఘ కూటాలకు హాజరవడం ద్వారా పరిచర్యలో కలిసి పనిచేయడం ద్వారా కూడా దంపతులు వివాహ జీవితంలో యెహోవాకు స్థానం ఇస్తారు. కుటుంబాలను విడదీయడానికి సాతాను ఉపయోగించే “తంత్రములను” ఎలా ఎదిరించాలో వారు కూటాల్లో నేర్చుకుంటారు. (ఎఫె. 6:​11) పరిచర్యలో క్రమంగా కలిసి పనిచేసే భార్యాభర్తలు ‘స్థిరులుగా, కదలనివారిగా’ ఉండడం నేర్చుకుంటారు.​—⁠ 1 కొరిం. 15:⁠58.

సమస్యలు తలెత్తినప్పుడు

14 పై సలహాలు మీకు కొత్తగా అనిపించకపోవచ్చు అయినా మీరు వాటిని మీ భాగస్వామితో నిర్మొహమాటంగా ఎందుకు చర్చించకూడదు? కొన్ని విషయాలకు మీరు మరింత శ్రద్ధ ఇవ్వాలేమో చూడండి. అయితే, తమ వివాహ జీవితంలో దేవునికి స్థానమిచ్చిన వారికి కూడా ‘శరీరసంబంధమైన శ్రమలు కలుగుతాయన్న’ విషయాన్ని బైబిలు అంగీకరిస్తుంది. (1 కొరిం. 7:​28) మానవ అపరిపూర్ణతవల్ల, అవినీతితో నిండిన ఈ లోకంలోని చెడు ప్రభావంవల్ల, సాతాను కుతంత్రాలవల్ల దేవుని యదార్థ సేవకులు కూడా వివాహ జీవితాల్లో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. (2 కొరిం. 2:​11) అలాంటి ఒత్తిడిని అధిగమించేందుకు యెహోవా మనకు సహాయంచేస్తాడు. అవును మనం వాటిని అధిగమించవచ్చు. యథార్థవంతుడైన యోబు తన పశువులను, సేవకులను, పిల్లలను పోగొట్టుకున్నాడు. అయినా, “ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు” అని బైబిలు తెలియజేస్తోంది.​—⁠యోబు 1:13-22.

15 కానీ యోబు భార్య మాత్రం “నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము” అని అంది. (యోబు 2:⁠9) దుర్ఘటనలు, మరితర కష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వ్యక్తులు బాధతో ఆలోచనారహితంగా మాట్లాడవచ్చు. “అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు” అని ఒక జ్ఞాని చెప్పాడు. (ప్రసం. 7:⁠7) కష్టాలు ఎదురైనప్పుడు లేక “అన్యాయం” జరిగినప్పుడు అవతలివ్యక్తి కోపంతో మాట్లాడితే మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వారిలాగే మీరూ కోపంతో మాట్లాడితే ఇద్దరిలో ఎవరో ఒకరు అనరానిమాట అనవచ్చు, దానితో పరిస్థితి విషమిస్తుంది. (కీర్తనలు 37:8 చదవండి.) చికాకుతో లేక నిరుత్సాహంతో మాట్లాడే ఎలాంటి ‘నిరర్థక మాటలనైనా’ పట్టించుకోకండి.​—⁠యోబు 6:⁠3.

16 దంపతులు ఒకరినుండి ఒకరు ఎక్కువగా ఆశించకూడదు. ఒకరు అవతలి వ్యక్తిలోని వింత వింత అలవాట్లను చూస్తే ‘నేను ఆయన్ని (లేక ఆమెను) మార్చుకోగలను’ అని అనుకోవచ్చు. మీరు ప్రేమతో ఓపిగ్గా సహాయం చేస్తే బహుశా వారిలో మంచి మార్పు తీసుకురాగలరు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఇతరుల్లోని చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపించేవారు తమ కంటిలో దూలాన్ని ఉంచుకొని సహోదరుని కంటిలోని నలుసుని చూడడానికి ప్రయత్నించేవారిలా ఉంటారని యేసు అన్నాడు. ఆయన మనల్ని ఇలా ప్రోత్సహించాడు: “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.” (మత్తయి 7:1-5 చదవండి.) దానర్థం పెద్దపెద్ద తప్పులను చూసిచూడనట్టు వదిలేయాలని కాదు. రాబర్ట్‌కు పెళ్లై దాదాపు 40 సంవత్సరాలౌతుంది. ఆయన ఇలా చెబుతున్నాడు: “ఒకరితో ఒకరు దాపరికం లేకుండా మాట్లాడుకొని అవతలివాళ్లు చెప్పే విషయాల్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే కొన్నిసార్లు ఇరువురూ తమలోని లోపాలను సరిదిద్దుకోగలుగుతారు.” అందుకే సమతుల్యాన్ని కలిగివుండండి. మీ భార్యలో లేక భర్తలో మీరు కోరుకొనే గుణాలు లేవని బాధపడే బదులు వారిలో ఇప్పుడు ఉన్న మంచి గుణాలను మెచ్చుకొని వాటినిబట్టి సంతోషించండి.​—⁠ప్రసం. 9:⁠9.

17 కుటుంబ పరిస్థితిల్లో మార్పులు వచ్చినప్పుడు కష్టాలు ఎదురుకావచ్చు. పిల్లలు ఉంటే దంపతులకు సమస్యలు రావచ్చు. భాగస్వామికి లేక పిల్లలకు తీవ్రంగా జబ్బు చేయవచ్చు. వృద్ధ తల్లిదండ్రులకు మరింత శ్రద్ధ చూపించాల్సిరావచ్చు. పిల్లలు పెద్దవారైన తర్వాత ఇంటిని విడిచి దూరంగా వెళ్లవచ్చు. సంఘంలో, సంస్థలో నియామకాలు ఇవ్వబడినప్పుడు పరిస్థితిలో మార్పులు రావచ్చు. ఈ మార్పులన్నిటివల్ల దాంపత్య జీవితంలో కొంత ఒత్తిడి, ఆందోళన చోటుచేసుకోవచ్చు.

18 వివాహ జీవితంలో ఎదురౌతున్న ఒత్తిడిని ఇక తట్టుకోలేనని మీకనిపిస్తే అప్పుడేమి చేయవచ్చు? (సామె. 24:​10) నిరుత్సాహపడకండి. దేవుని సేవకులు నిరుత్సాహపడి సత్యారాధనను విడిచిపెట్టాలనే సాతాను కోరుకుంటున్నాడు. ఒకవేళ దంపతులు అలా చేస్తే అతడు మరింత సంతోషిస్తాడు. కాబట్టి, మీ వివాహం మూడు పేటల త్రాడుగా ఉండేందుకు మీరు చేయగలిగినదంతా చేయండి. తీవ్ర పరీక్షల్లోనూ తమ యథార్థతను నిరూపించుకున్న అనేకమంది గురించి బైబిలు తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక సందర్భంలో దావీదు తన బాధనంతా యెహోవాకు ఇలా తెలియజేశాడు: “దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను . . . బాధించుచున్నారు.” (కీర్త. 56:1) “మనుష్యులు” మిమ్మల్ని బాధించినట్లు మీకు ఎప్పుడైనా అనిపించిందా? బాగా దగ్గరివారినుండో బయటివారినుండో ఒత్తిడి ఎదురౌతోందని మీకు అనిపిస్తే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. దావీదు సహించడానికి బలాన్ని పొందాడు, అలాగే మీరూ పొందవచ్చు. “నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను” అని దావీదు అన్నాడు.​—⁠కీర్త. 34:⁠4.

మరిన్ని ఆశీర్వాదాలు

19 ఈ అంత్యదినాల్లో భార్యాభర్తలు ‘ఒకనినొకరు ఆదరించి ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలి.’ ​(1 థెస్స. 5:​11) ఒక విషయం మరచిపోకండి, మనం స్వార్థంతోనే యెహోవాను సేవిస్తున్నామని సాతాను మనల్ని ఇప్పటికీ నిందిస్తున్నాడు. యెహోవాపట్ల మనం యథార్థతను కోల్పోయేలా చేయడానికి భార్యాభర్తల మధ్య బేధాభిప్రాయాలను సృష్టించడమే కాదు అతడు ఇతర పద్ధతులను కూడా ఉపయోగిస్తున్నాడు. సాతాను దాడులను మనం తప్పించుకోవాలంటే యెహోవాపై మనం పూర్తి నమ్మకముంచాలి. (సామె. 3:​5, 6) పౌలు ఇలా రాశాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”​—⁠ఫిలి. 4:⁠13.

20 వివాహ జీవితంలో దేవునికి స్థానమిచ్చినప్పుడు మనం అనేక ఆశీర్వాదాలు పొందుతాం. 51 సంవత్సరాల క్రితం పెళ్లైన జొయెల్‌ దంపతుల వైవాహిక జీవితం దానికొక ఉదాహరణ. ఆయన ఇలా చెప్పాడు: “నాకు ఇంత మంచి భార్యని ఇచ్చినందుకు, మేమింత సంతోషంగా ఉండగలుగుతున్నందుకు నేను ఎల్లప్పుడూ యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. నాకు తగ్గ భార్య దొరికింది.” వారు అంత అన్యోన్యంగా ఉండడానికి కారణమేమిటి? “మేము ఎల్లప్పుడూ ఒకరిపట్ల ఒకరం దయ, సహనం, ప్రేమ కనబరచడానికి ప్రయత్నిస్తాం” అని వారు చెప్పారు. ఈ విధానంలో ఎవరూ పూర్తిగా వాటిని చూపించలేరు. అయినా, మనం బైబిలు సూత్రాలను పాటించడానికి ప్రయాసపడుతూ మన వివాహ జీవితంలో యెహోవాకు స్థానమిద్దాం. అలా చేస్తే మన వివాహ జీవితం ‘మూడు పేటల త్రాడులా ఉండి త్వరగా తెగిపోదు.’​—⁠ప్రసం. 4:⁠12.

మీకు జ్ఞాపకమున్నాయా?

• వివాహ జీవితంలో దేవునికి స్థానమివ్వడం అంటే ఏమిటి?

• సమస్యలు ఎదురైనప్పుడు భార్యాభర్తలు ఏమి చేయాలి?

• ఒకరి వివాహ జీవితంలో దేవుడు ఉన్నాడో లేదో ఎలా తెలుసుకోగలం?

[అధ్యయన ప్రశ్నలు]

1. ఆదాము హవ్వల వివాహం ఎవరు చేశారు?

2. సాతాను ఆదాముహవ్వల మధ్య ఎలా చిచ్చుపెట్టాడు?

3. యూదుల్లో కొందరు ఎలాంటి తప్పుడు దృక్పథాన్ని అలవర్చుకున్నారు?

4. వివాహ వ్యవస్థ నేడెలా విచ్ఛిన్నమౌతోంది?

5. వివాహమనేది “మూడు పేటల త్రాడు” అనడంలో అర్థమేమిటి?

6, 7. (ఎ) తమ వివాహబంధంలో దేవునికి స్థానమివ్వాలంటే దంపతులు ఏమి చేయవచ్చు? (బి) ఒక సహోదరి తన భర్తలో తనకు ఏ విషయాలు నచ్చుతాయని చెప్పింది?

8. వివాహ జీవితంలో “మంచి ఫలము” పొందాలంటే ఏమి అవసరం?

9. (ఎ) భర్తలకు ఏ బాధ్యతలున్నాయి? (బి) కొలొస్సయులు 3:⁠19 ప్రకారం భర్తలు భార్యలను ఎలా చూసుకోవాలి?

10. క్రైస్తవ భార్యలు ఎలా ఉండాలి?

11. తమ వివాహబంధం విజయవంతం కావడానికి ఏది సహాయపడిందని ఒక సహోదరుడు చెప్పాడు?

12, 13. (ఎ) దంపతులు కలిసి ప్రార్థించడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) ఆధ్యాత్మికంగా ఇంకా ఏమి చేయడం వల్ల వివాహబంధం పటిష్ఠమవుతుంది?

14. ఏ విషయాలు దాంపత్య జీవితంలో ఒత్తిడిని కలిగించవచ్చు?

15. ఒత్తిడి ఉన్నప్పుడు ప్రజలు ఎలా మాట్లాడవచ్చు, అలాంటి పరిస్థితిలో అవతలివ్యక్తి ఎలా ప్రవర్తించాలి?

16. (ఎ) మత్తయి 7:​1-5లోని యేసు మాటలు వివాహ జీవితానికి ఎలా అన్వయిస్తాయి? (బి) వివాహ జీవితంలో భార్యాభర్తలు సమతుల్యంగా ఉండడం ఎందుకు చాలా అవసరం?

17, 18. కష్టాలు పెరిగినప్పుడు మనం ఎవరి సహాయం కోరవచ్చు?

19. సాతాను దాడులను మనం ఎలా తప్పించుకోవచ్చు?

20. వివాహ జీవితంలో యెహోవాకు స్థానమివ్వడం ద్వారా మనకెలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?

[18వ పేజీలోని చిత్రాలు]

కలిసి ప్రార్థించినప్పుడు దంపతులు సమస్యలను అధిగమించగలుగుతారు