కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇతరులను గౌరవించడంలో మీరు మాదిరిగా ఉన్నారా?

ఇతరులను గౌరవించడంలో మీరు మాదిరిగా ఉన్నారా?

ఇతరులను గౌరవించడంలో మీరు మాదిరిగా ఉన్నారా?

“ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.”​—⁠రోమా. 12:⁠10.

కొన్ని దేశాల్లో, చిన్న పిల్లలు పెద్దవారిపట్ల గౌరవం చూపించడానికి వారి ముందు మోకాళ్ళూనుతారు. అలా చేస్తే వారు పెద్దవారికన్నా పొడుగ్గా కనిపించరు. ఆ దేశాల్లో, పిల్లలు పెద్దవారికి వీపు చూపించడాన్ని కూడా అగౌరవంగా భావిస్తారు. ఒక్కో సంస్కృతిలో ఒక్కోవిధంగా గౌరవం చూపిస్తారు. అయితే అలా గౌరవం చూపించడం మనకు మోషే ధర్మశాస్త్రాన్ని గుర్తుచేస్తుంది. దానిలో ఈ ఆజ్ఞ ఉంది: ‘తల నెరసినవాని ఎదుట [గౌరవంతో] లేచి ముసలివాని ముఖమును ఘనపరచాలి.’ (లేవీ. 19:​32) విచారకరంగా, అనేక ప్రాంతాల్లో ప్రజలకు ఇతరులపట్ల గౌరవం కరువైంది. ఇతరులను అగౌరపరచడం సర్వసాధారమైపోయింది.

2 ఇతరులపట్ల గౌరవం చూపించడం ఎంతో ప్రాముఖ్యం అని దేవుని వాక్యం చెబుతోంది. ​యెహోవానూ యేసునూ ఘనపరచమని అది చెబుతోంది. (యోహా. 5:​23) కుటుంబ సభ్యులకు, తోటి విశ్వాసులకు, అలాగే సంఘం వెలుపల ఉన్నవారందరికి మరిముఖ్యంగా కొందరికి గౌరవం చూపించాలని కూడా మనం ఆజ్ఞాపించబడ్డాం. (రోమా. 12:​10; ఎఫె. 6:​1, 2; 1 పేతు. 2:​17) మనం ఏయే విధాలుగా యెహోవాను ఘనపరచాలి? మన క్రైస్తవ సహోదరసహోదరీలపట్ల మనమెలా ప్రగాఢ గౌరవాన్ని చూపించాలి? వీటితోపాటు మరికొన్ని ప్రశ్నలను మనమిప్పుడు చూద్దాం.

యెహోవాను ఆయన నామాన్ని ఘనపరచండి

3 యెహోవా నామానికి తగిన గౌరవం ఇవ్వడం అనేది ఆయనను ఘనపరచే ఒక ప్రాముఖ్యమైన విధానం. మనం ఆయన ‘తన నామము కోసం ఏర్పరచుకున్న ఒక జనం.’ (అపొ. 15:​14) సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని ప్రజలుగా ఉండడం నిజంగా ఒక గౌరవం. మీకా ప్రవక్త ఇలా చెప్పాడు: “సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.” (మీకా 4:⁠5) యెహోవాకు మంచి పేరు తెచ్చే విధంగా జీవించేందుకు ప్రయాసపడడం ద్వారా మనం ‘యెహోవా నామాన్ని స్మరించుకుంటాం.’ పౌలు రోమాలో ఉన్న క్రైస్తవులకు గుర్తుచేసినట్లు మనం ప్రకటించే సువార్త ప్రకారం జీవించకపోతే దేవుని పేరు ‘అవమానపరచబడుతుంది.’​—⁠రోమా. 2:​21-24.

4 ప్రకటనా పనిద్వారా కూడా మనం యెహోవాను ఘనపరుస్తాం. గతంలో యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని తనకు సాక్షులుగా చేసుకున్నాడు. కానీ వారు యెహోవా ప్రజలుగా ఉండలేకపోయారు. (యెష. 43:​1-12) వారు తరచూ యెహోవాపై తిరుగుబాటు చేసి “ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగిం[చారు].” (కీర్త. 78:​40, 41) చివరకు ఇశ్రాయేలు జనాంగం యెహోవా అనుగ్రహాన్ని పూర్తిగా కోల్పోయింది. అయితే నేడు మనకు యెహోవాకు సాక్షులుగా ఉండడానికి, ఆయన నామాన్ని ఇతరులకు ప్రకటించడానికి అవకాశం దొరికినందుకు ఎంతో కృతజ్ఞులం. ఆయనను మనం ప్రేమిస్తున్నాం, ఆయన నామం మహిమపరచబడాలని కోరుకుంటున్నాం కాబట్టి మనం అలా ప్రకటిస్తాం. మన పరలోక తండ్రి అయిన యెహోవా గురించి ఆయన సంకల్పాల గురించి తెలిసిన మనం ప్రకటించకుండా ఎలా ఉండగలం? “సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ” అని చెప్పిన అపొస్తలుడైన పౌలులాగే మనమూ భావిస్తాం.​—⁠1 కొరిం. 9:⁠16.

5 కీర్తనకర్త అయిన దావీదు ఇలా చెప్పాడు: “యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు.” (కీర్త. 9:​10) యెహోవాను తెలుసుకొని, ఆయన నామాన్ని ఘనపరచినప్పుడు ప్రాచీనకాల యథార్థ సేవకుల్లాగే మనమూ ఆయనమీద నమ్మకముంచుతాం. అలా నమ్మకముంచడం ద్వారా కూడా మనం ఆయనను ఘనపరుస్తాం. యెహోవామీద నమ్మకం ఉంచడానికీ ఆయనను ఘనపరచడానికీ మధ్యవున్న సంబంధాన్ని దేవుని వాక్యం ఎలా వివరిస్తుందో చూడండి. ఇశ్రాయేలీయులు తన మీద నమ్మకం చూపించనప్పుడు యెహోవా మోషేను ఇలా అడిగాడు: “ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారి మధ్యను చేసిన సూచక​క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక​యుందురు?” (సంఖ్యా. 14:​11) అయితే మనం శ్రమలు ఎదురైనా యెహోవా మనల్ని సంరక్షించి, సహాయం చేస్తాడని నమ్మడం ద్వారా ఆయనను ఘనపరుస్తాం.

6 యెహోవాను ఘనపర్చాలనే కోరిక హృదయంలో పుట్టాలని యేసు చెప్పాడు. నామమాత్రంగా ఆరాధిస్తున్నవారితో​ మాట్లాడుతూ యేసు, యెహోవా మాటల్ని ఇలా పేర్కొన్నాడు: “ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.” (మత్త. 15:​7-9) యెహోవాను మనం హృదయపూర్వకంగా ప్రేమిస్తేనే ఆయనను నిజంగా ఘనపరచగలుగుతాం. (1 యోహా. 5:⁠3) “నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును” అని యెహోవా చేసిన వాగ్దానాన్ని కూడా మనం గుర్తుంచుకుంటాం.​—⁠1 సమూ. 2:⁠30.

సంఘ పైవిచారణకర్తలు ఇతరులను గౌరవిస్తారు

7 అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులను ఇలా ఉద్బోధించాడు: “ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమా. 12:​10) సంఘంలో బాధ్యతాయుత స్థానాల్లోవున్న సహోదరులు, తమ కాపుదలలోవున్న వారిని గౌరవించడంలో మాదిరికరంగా ఉండాలి. ఆ విషయంలో వారు పౌలు మాదిరిని అనుసరించాలి. (1 థెస్సలొనీకయులు 2:​7, 8 చదవండి.) పౌలు తాను చేయడానికి ఇష్టపడనివాటిని ఇతరులు చేయమని ఎన్నడూ చెప్పడని ఆయన సందర్శించిన సంఘాల్లోని సహోదరులకు తెలుసు. పౌలు తోటి విశ్వాసులను గౌరవించాడు కాబట్టి వారి గౌరవాన్ని కూడ పొందాడు. ‘మీరు నన్ను పోలి నడుచుకోండి’ అని ఆయన ‘బతిమాలినప్పుడు’ ఆయన మంచి మాదిరిని చూసిన చాలామంది ఇష్టపూర్వకంగా ఆయనను అనుసరించి ఉంటారు.​—⁠1 కొరిం. 4:​15, 16.

8 బాధ్యతాయుత స్థానాల్లోవున్న సహోదరులు ఫలాని పని ఎందుకు చేయమని చెబుతున్నారో, ఫలాని నిర్దేశాన్ని ఎందుకు ఇస్తున్నారో వివరించడం ద్వారా కూడా తమ కాపుదలలోవున్నవారిని గౌరవిస్తారు. అలా చేయడం ద్వారా వారు యేసును అనుకరిస్తారు. ఉదాహరణకు, కోతకు పనివారి కోసం ప్రార్థించమని యేసు శిష్యులకు చెప్పినప్పుడు దానికిగల కారణం కూడా తెలియజేశాడు. ఆయన ఇలా అన్నాడు: “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి.” (మత్త. 9:​37, 38) అలాగే “మెలకువగా” ఉండమని తన శిష్యులకు చెప్పినప్పుడు ఆయన దానికి కారణం వివరిస్తూ, “కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు” అని అన్నాడు. (మత్త. 24:​42) తరచూ యేసు వారేమి చేయాలో చెప్పడమేకాదు ఎందుకు చేయాలో కూడా వివరించాడు. అలా ఆయన వారిని గౌరవించాడు. క్రైస్తవ పైవిచారణకర్తలకు ఆయనెంత చక్కని మాదిరి!

యెహోవా సంఘాన్నీ, దాని నిర్దేశాలను గౌరవించండి

9 యెహోవాను ఘనపరచాలంటే ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘంతోపాటు దాని ప్రతినిధులను కూడా గౌరవించాలి. నమ్మకమైన దాసుని తరగతి ఇచ్చే లేఖనాధార ఉపదేశాలను విని పాటించడం ద్వారా మనం యెహోవా సంఘానికి దాని నిర్దేశానికి గౌరవం చూపిస్తాం. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో నియమిత పైవిచారణకర్తలను అగౌరపరచినవారిని మందలించాల్సి ఉందని అపొస్తలుడైన యోహాను గుర్తించాడు. (3 యోహాను 9-11 చదవండి.) ఆ వ్యక్తులు పైవిచారణకర్తలనే కాక వారి బోధలనూ నిర్దేశాలనూ అగౌరవపరిచారని యోహాను మాటలు తెలియజేస్తున్నాయి. క్రైస్తవుల్లో అనేకులు వారిలా ప్రవర్తించలేదనేది సంతోషకరమైన విషయం. అపొస్తలులు బ్రతికి ఉన్నప్పుడు దాదాపు సహోదరులందరూ నాయకత్వం వహించిన​వారిపట్ల ఎంతో గౌరవాన్ని చూపించారు.​—⁠ఫిలి. 2:⁠12.

10 యేసు తన శిష్యులతో “మీరందరు సహోదరులు” అని చెప్పాడు. కాబట్టి క్రైస్తవ సంఘంలో నాయకత్వం వహించేవారంటూ ఎవరూ ఉండకూడదని కొందరు వాదిస్తారు. (మత్త. 23:⁠8) అయితే హెబ్రీ, గ్రీకు లేఖనాల్లో దేవుని నుండి అధికారం పొందిన వివిధ వ్యక్తుల ఉదాహరణలున్నాయి. ప్రాచీన హెబ్రీయుల కాలంలోని పితరుల, న్యాయాధిపతుల, రాజుల చరిత్ర చూస్తే యెహోవా దేవుడు మానవ ప్రతినిధుల ద్వారా నిర్దేశాన్ని ఇస్తాడనడానికి తగినన్ని రుజువులున్నాయి. ప్రజలు నియమిత వ్యక్తులపట్ల తగిన గౌరవం చూపించనప్పుడు యెహోవా వారిని శిక్షించాడు.​—⁠2 రాజు. 1:​2-17; 2:​19, 23, 24.

11 అలాగే మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడ అపొస్తలుల అధికారాన్ని అంగీకరించారు. (అపొ. 2:​42) ఉదాహరణకు, పౌలు సహోదరులకు నిర్దేశాలనిచ్చాడు. (1 కొరిం. 16:⁠1; 1 థెస్స. 4:⁠2) అయినా ఆయన తనకు నిర్దేశమిచ్చే అధికారం ఉన్నవారికి ఇష్టపూర్వకంగా లోబడ్డాడు. (అపొ. 15:​22; గల. 2:​9, 10) పౌలుకు క్రైస్తవ సంఘంలో నాయకత్వం వహిస్తున్నవారిపట్ల సరైన దృక్కోణం ఉండేది.

12 మనం దీని నుండి రెండు విషయాలను నేర్చుకోవచ్చు. మొదటిది, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” పరిపాలక సభ ద్వారా సంఘంలో సహోదరులను బాధ్యాతాయుత స్థానాల్లో నియమించడం లేఖనాధారితమే. అలా నియమించబడినవారి మీద నాయకత్వం వహించడానికి మరికొందరు నియమించబడతారు. (మత్త. 24:​45-47; 1 పేతు. 5:​1-3) రెండవది, నియమిత వ్యక్తులతోపాటు మనం అందరం మనపైన నాయకత్వం వహించేవారిని గౌరవించాలి. ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘంలో నాయకత్వం వహించేవారిమీద మనకు గౌరవం ఉందని మనం ఎలా చూపించవచ్చు?

ప్రయాణ పైవిచారణకర్తలపట్ల గౌరవం చూపించడం

13 పౌలు ఇలా చెప్పాడు: “సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి.” (1 థెస్స. 5:​12, 13) ప్రయాణ పైవిచారణకర్తలు కూడా ఖచ్చితంగా ‘ప్రయాసపడుతున్నారు,’ కాబట్టి వారిని మనం ‘మిక్కిలి ఘనంగా ఎంచుదాం.’ వారి ఉపదేశాన్ని, నిర్దేశాన్నీ హృదయపూర్వకంగా అంగీకరించడం ద్వారా మనం వారిని ఘనంగా ఎంచుతున్నామని చూపిస్తాం. “పైనుండివచ్చు జ్ఞానము” మనకుంటే, నమ్మకమైన దాసుని తరగతి ఇచ్చే నిర్దేశాన్ని వారు మనకు తెలియజేసినప్పుడు మనం ‘సులభంగా లోబడతాం.’​—⁠యాకో. 3:⁠17.

14 మనం ఇప్పటివరకూ చేస్తున్న పనులను వేరే విధంగా చేయమని వారు చెబితే అప్పుడేమి చేయాలి? వారు చెప్పింది విన్నప్పుడు “ఇక్కడ అలా చేయలేము” లేదా “వేరే సంఘంలో అలా చేయవచ్చేమో కానీ ఈ సంఘంలో అలా చేయలేం” అని మనకు అనిపించవచ్చు. అయినా వారికి ఎదురుచెప్పకుండా ఉండడం ద్వారా గౌరవం చూపించవచ్చు. వారి నిర్దేశానికి లోబడేందుకు కృషిచేస్తాం. సంఘం యెహోవాదనీ యేసు దానికి శిరస్సనీ మనం గుర్తుంచుకున్నప్పుడు అలా లోబడగలుగుతాం. ప్రయాణ పైవిచారణకర్త ఇచ్చే నిర్దేశాన్ని సంఘ సభ్యులు ఇష్టపూర్వకంగా అంగీకరించి, పాటించడం ద్వారా వారిని నిజంగా గౌరవిస్తున్నారని చూపిస్తారు. కొరింథులోని సహోదరులు తమ సంఘాన్ని సందర్శించిన పెద్ద అయిన తీతు ఇచ్చిన నిర్దేశానికి గౌరవంతో లోబడినందుకు అపొస్తలుడైన పౌలు వారిని మెచ్చుకున్నాడు. (2 కొరిం. 7:​13-16) అలాగే నేడు మనం ప్రయాణ పైవిచారణకర్తలు ఇచ్చే నిర్దేశాన్ని ఇష్టపూర్వకంగా పాటించినప్పుడు ప్రకటనా పనిలో మరింత ఆనందాన్ని పొందుతాం.​—⁠2 కొరింథీయులు 13:⁠11 చదవండి.

“అందరిని సన్మానించుడి”

15 పౌలు ఇలా రాశాడు: “వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యౌవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము.” (1 తిమో. 5:​1-3) క్రైస్తవ సంఘంలో ఉన్నవారందర్నీ గౌరవించమని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తోంది. మీకు సంఘంలో ఎవరితోనైనా బేధాభిప్రాయాలు ఏర్పడితే ఏమి చేస్తారు? మీరు మీ తోటి విశ్వాసిని గౌరవించాల్సిన బాధ్యతను విస్మరిస్తారా? లేక వారిలోని చక్కని క్రైస్తవ లక్షణాలను గుర్తించి మీ వైఖరిని మార్చుకుంటారా? ప్రత్యేకంగా నాయకత్వం వహిస్తున్నవారు “ప్రభువులైనట్టుండక” తమ సహోదరులను గౌరవిస్తూ ఉండాలి. (1 పేతు. 5:⁠3) సంఘ సభ్యుల మధ్య హృదయపూర్వక ప్రేమ కనిపించే క్రైస్తవ సంఘంలో గౌరవం చూపించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.​—⁠యోహాను 13:​34, 35 చదవండి.

16 నిజమే, మనం కేవలం క్రైస్తవ సంఘసభ్యులనే గౌరవించం. “మనకు సమయము దొరకినకొలది అందరి​యెడలను . . . మేలు చేయుదము” అని పౌలు తన కాలంలోని క్రైస్తవులకు రాశాడు. (గల. 6:​10) మన తోటి ఉద్యోగస్థులు లేదా విద్యార్థులు మనతో కఠినంగా ప్రవర్తిస్తే అలా చేయడం కష్టమనిపించవచ్చు. అలాంటప్పుడు మనం ఈ మాటలను గుర్తుంచుకోవాలి: “దుర్మార్గుల పట్ల కోపగించకుము.” (కీర్త. 37:​1, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఆ సలహాను పాటిస్తే మనం వ్యతిరేకులను కూడా గౌరవించగలుగుతాం. అలాగే ప్రకటిస్తున్నప్పుడు మనకు వినయం ఉన్నట్లయితే, అందరికీ “సాత్వికముతోను భయముతోను [‘ప్రగాఢ గౌరవంతో,’ NW]” సమాధానమివ్వగలుగుతాం. (1 పేతు. 3:​15) వారిపట్ల మనకు గౌరవముందని మనం కనబడే తీరునుబట్టి, దుస్తులనుబట్టి కూడా చూపించగలం.

17 సహోదరులతో, బయటవారితో వ్యవహరిస్తున్నప్పుడు మనం ఈ ఉపదేశాన్ని పాటించడానికి ప్రయత్నించాలి: “అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.”​—⁠1 పేతు. 2:⁠17.

మీరెలా జవాబిస్తారు?

యెహోవానూ

సంఘ పెద్దలనూ ప్రయాణ పైవిచారణకర్తలనూ

సంఘంలో ప్రతీ ఒక్కరినీ

మీరు సాక్ష్యమిచ్చేవారినీ

మీరు గౌరవిస్తున్నారని ఎలా చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. అనేక దేశాల్లో ఇప్పుడు ఏమి కరువైంది?

2. మనం ఎవర్ని గౌరవించాలని దేవుని వాక్యం చెబుతోంది?

3. యెహోవాను ఘనపరచడానికున్న ఒక ప్రాముఖ్యమైన విధానం ఏమిటి?

4. యెహోవాకు సాక్షులుగా ఉండే అవకాశం గురించి మీరెలా భావిస్తున్నారు?

5. యెహోవామీద నమ్మకముంచడానికీ ఆయనను ఘనపరచడానికీ మధ్య సంబంధం ఉందని ఎలా చెప్పవచ్చు?

6. యెహోవాను ఘనపరచడానికి ఏది మనల్ని ప్రేరేపిస్తుంది?

7. (ఎ) బాధ్యతాయుత స్థానాల్లోవున్న సహోదరులు తమ కాపుదలలోవున్నవారిని ఎందుకు గౌరవించాలి? (బి) పౌలు తన తోటి విశ్వాసులపట్ల ఎలా గౌరవం చూపించాడు?

8. (ఎ) యేసు తన శిష్యులను గౌరవించిన ప్రాముఖ్యమైన ఒక విధానం ఏమిటి? (బి) పైవిచారణకర్తలు యేసు మాదిరిని నేడెలా అనుకరించవచ్చు?

9. ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘంతోపాటు దాని ప్రతినిధులను గౌరవించడమంటే ఎవర్ని కూడా గౌరవించినట్లే అవుతుంది? వివరించండి.

10, 11. క్రైస్తవ సంఘంలో కొందరికి కొంతమేరకు అధికారం ఉండడం తప్పేమీ కాదని లేఖనాలనుండి వివరించండి.

12. నాయకత్వం గురించి బైబిలు ఉదాహరణల నుండి ఏ రెండు విషయాలు నేర్చుకుంటాం?

13. క్రైస్తవ సంఘపు ఆధునిక దిన ప్రతినిధులను మనమెలా ఘనంగా ఎంచవచ్చు?

14. ప్రయాణ పైవిచారణకర్తలపట్ల తమకు హృదయపూర్వక గౌరవం ఉందని సంఘ సభ్యులు ఎలా చూపించవచ్చు, దానివల్ల ఏమి పొందుతాం?

15. మన తోటి విశ్వాసులపట్ల ఎలా గౌరవం చూపించవచ్చు?

16, 17. (ఎ) మనం సాక్ష్యమిచ్చే వారినేకాక, వ్యతిరేకులను కూడా గౌరవించడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) మనం ఎలా ‘అందరిని సన్మానించవచ్చు’?

[23వ పేజీలోని చిత్రం]

మొదటి శతాబ్ద క్రై స్తవులు పరిపాలక సభ నాయకత్వాన్ని గౌరవించారు

[24వ పేజీలోని చిత్రం]

అన్ని దేశాల్లోనూ పెద్దలు పరిపాలక సభ నియమించిన ప్రయాణ పైవిచారణకర్తలను గౌరవిస్తారు