కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తీతుకు, ఫిలేమోనుకు, హెబ్రీయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

తీతుకు, ఫిలేమోనుకు, హెబ్రీయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

తీతుకు, ఫిలేమోనుకు, హెబ్రీయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

అపొస్తలుడైన పౌలు రోమాలో మొదటిసారి ఖైదు చేయబడి, సా.శ. 61లో విడుదలైన కొంతకాలానికి క్రేతు ద్వీపానికి వెళ్ళాడు. అక్కడి సంఘాల ఆధ్యాత్మిక పరిస్థితిని గమనించిన పౌలు ఆ సంఘాలను బలపరచడానికి తీతును అక్కడే ఉండమన్నాడు. తర్వాత పౌలు బహుశా మాసిదోనియ నుండి తీతుకు పత్రిక రాశాడు. అందులో తీతు చేయాల్సిన పనుల గురించి సూచనలివ్వడానికి, తానే ఆయనకు ఆ పనిని అప్పగించానని చూపించడానికి ఈ పత్రిక రాశాడు.

సా.శ. 61లో ఖైదు నుండి విడుదలవ్వడానికి కొద్దికాలం ముందు కొలొస్సయిలోని క్రైస్తవ సహోదరుడైన ఫిలేమోనుకు పౌలు ఒక పత్రిక రాశాడు. ఆయన తన స్నేహితుణ్ణి ఒక విషయం గురించి అర్థిస్తూ ఈ పత్రికను రాశాడు.

దాదాపు సా.శ. 61లో యూదయలో ఉన్న హెబ్రీ విశ్వాసులకు కూడా పౌలు ఒక పత్రిక రాశాడు. యూదా మత విధానంకన్నా క్రైస్తవత్వం ఉన్నతమైనదని చూపించడానికి దీన్ని రాశాడు. ఈ మూడు పత్రికల్లోనూ మనకు అవసరమైన మంచి సలహాలు ఉన్నాయి.​—⁠హెబ్రీ. 4:⁠12.

విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండండి

(తీతు 1:1-3:⁠15)

‘ప్రతి పట్టణములోను పెద్దలను నియమించడానికి’ అవసరమైన నిర్దేశాన్ని ఇచ్చిన తర్వాత “[అవిధేయులు] విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము” అని ఆయన తీతుకు రాశాడు. పౌలు క్రేతులో ఉన్న సంఘాలన్నిటినీ ‘భక్తిహీనతను విసర్జించి స్వస్థబుద్ధితో బ్రతుకమని’ ఉపదేశించాడు.​—⁠తీతు 1:​5, 10-13; 2:​12, 13.

క్రేతులో ఉన్న సహోదరులు విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండేలా సహాయం చేయడానికి పౌలు మరిన్ని సలహాలిచ్చాడు. ఆయన తీతును ‘అవివేక తర్కములకు ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములకు దూరముగా ఉండమని’ సలహా ఇచ్చాడు.​—⁠తీతు 3:⁠9.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​15​​—⁠“పవిత్రులకు అన్నియు పవిత్రము”గా ఎందుకు ఉంటాయి? “అపవిత్రులకును అవిశ్వాసులకును” ఎందుకు ఏదీ పవిత్రమైనదిగా ఉండదు? మనం జవాబు తెలుసుకోవాలంటే పౌలు ‘అన్ని’ అన్నప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో అలా అన్నాడో అర్థంచేసుకోవాలి. దేవుని వాక్యం సూటిగా ఖండించే విషయాలు గురించి కాదు గానీ ఒక విశ్వాసి తన మనస్సాక్షినిబట్టి తీసుకునే నిర్ణయాల గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని ప్రమాణాలకు అనుగుణంగా ఆలోచించేవారికి అలాంటి విషయాలు పవిత్రంగా ఉంటాయి. వక్రంగా ఆలోచించేవారికి, అపవిత్రమైన మనస్సాక్షి ఉన్నవారికి అవి అపవిత్రంగా ఉంటాయి. *

3:5​​—⁠అభిషిక్త క్రైస్తవులు ఎలా “స్నానము ద్వారా,” ‘పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగజేయుటద్వారా’ రక్షించబడ్డారు? వారు ‘స్నానము ద్వారా’ ఎలా ‘రక్షించబడ్డారంటే’ దేవుడు విమోచన క్రయధనపు విలువను ఉపయోగించి యేసు రక్తంతో వారికి స్నానం చేయించాడు లేదా పవిత్ర​పరిచాడు. దేవుని ఆత్మాభిషిక్త కుమారులుగా వారు “నూతన సృష్టి” అయ్యారు కాబట్టి ‘పరిశుద్ధాత్మ వారిలో నూతన స్వభావము కలుగజేసింది’ అని చెప్పవచ్చు.​—⁠2 కొరిం. 5:⁠17.

మనకు పాఠాలు:

1:​10-​13; 2:​15. క్రైస్తవ పైవిచారణకర్తలు సంఘంలోని తప్పులను ధైర్యంగా ఖండించాలి.

2:​3-5. మొదటి శతాబ్దంలోని వారిలాగే నేడు పరిణతి​చెందిన క్రైస్తవ సహోదరీలు ‘కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులు​గలవారై, మంచి ఉపదేశము చేయువారై’ ఉండాలి. ఆ విధంగా వారు సంఘంలోని ‘యౌవన స్త్రీలకు’ అందరి ముందు కాకుండా వ్యక్తిగతంగా చక్కని ఉపదేశాన్ని ఇవ్వగలరు.

3:​8, 14. ‘సత్క్రియలను శ్రద్ధగా చేయడంపై మనస్సుంచడం’ ‘మంచిది, ప్రయోజనకరమైనది’ ఎందుకంటే అలా చేయడం, దేవుని సేవలో ఫలవంతంగా ఉండడానికి, ఈ దుష్టలోకం నుండి వేరుగా ఉండడానికి మనకు సహాయం చేస్తుంది.

“ప్రేమనుబట్టి” వేడుకోవడం

(ఫిలే. 1-25)

‘ప్రేమా విశ్వాసాలు’ చూపించడంలో మాదిరిగా ఉన్నందుకు పౌలు ఫిలేమోనును మెచ్చుకున్నాడు. తోటి క్రైస్తవులు ఆయనవల్ల విశ్రాంతిని పొందినందుకు పౌలుకు “విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను.”​—⁠ఫిలే. 4, 5, 7.

పౌలు ఒనేసిము విషయంలో ఆజ్ఞాపిస్తున్నట్లు మాట్లాడివుంటే ఫిలేమోను ఇబ్బందిపడివుండేవాడు. కానీ అలా కాకుండా “ప్రేమనుబట్టి” వేడుకుంటున్నానని చెప్పడంలో పైవిచారణకర్తలందరికీ మంచి మాదిరినుంచాడు. “నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను” అని ఫిలేమోనుకు రాశాడు.​—⁠ఫిలే. 8, 9, 21.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

8-11, 18​​—⁠ముందునిష్‌ప్రయోజకుడిగాఉన్న ఒనేసిముప్రయోజకుడిగాఎలా మారాడు? దాసుడైన ఒనేసిము పనిచేయడానికి ఇష్టపడక కొలొస్సయిలో ఉన్న ఫిలేమోను ఇంటినుండి రోమాకు పారిపోయాడు. 1,400 కి.మీ. ప్రయాణించడానికి కావాల్సిన డబ్బులను కూడా అతడు తన యజమానినుండి దొంగిలించివుంటాడు. దానినిబట్టి అతడు ఫిలేమోనుకు నిష్‌ప్రయోజకుడయ్యాడు. అయితే రోమాలో పౌలు అతను క్రైస్తవుడయ్యేలా సహాయపడ్డాడు. దాసునిగా ‘నిష్‌ప్రయోజకుడైనవాడు’ అలా క్రైస్తవ సహోదరుడై ‘ప్రయోజకునిగా’ మారాడు.

15, 16​​—⁠ఒనేసిమును దాసత్వం నుండి విడుదల చేయమని పౌలు ఫిలేమోనుకు ఎందుకు చెప్పలేదు? ‘దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తును​గూర్చిన సంగతులు బోధించుచు ఉండాలనే’ బాధ్యతకే ఆయన ప్రాముఖ్యతనివ్వాలని కోరుకున్నాడు. కాబట్టి దాసత్వం వంటి సామాజిక విషయాల్లో ఆయన తలదూర్చకూడదని అనుకున్నాడు.​—⁠అపొ. 28:⁠31.

మనకు పాఠాలు:

2. సహోదరులు తన ఇంట్లో కూటాలు జరుపుకోవడానికి ఫిలేమోను ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నాడు. మనింట్లో క్షేత్రసేవా కూటాలు జరగడం గొప్ప విషయం.​—⁠రోమా. 16:⁠5; కొలొ. 4:⁠15.

4-7. ప్రేమా విశ్వాసాలు చూపించడంలో మంచి మాదిరులుగా ఉన్న తోటి విశ్వాసులను మెచ్చుకోవడానికి చొరవ తీసుకోవాలి.

15, 16. మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం అనవసరంగా ఆందోళనపడకూడదు. ఒనేసిము విషయంలో జరిగినట్లే దానివల్ల మంచి జరిగే అవకాశం ఉంది.

21. ఫిలేమోను, ఒనేసిమును క్షమించాలని పౌలు ఆశించాడు. అలాగే మనం కూడ మనల్ని నొప్పించిన సహోదరుణ్ణి క్షమించాలని దేవుడు ఆశిస్తున్నాడు.​—⁠మత్త. 6:⁠14.

“సంపూర్ణులమగుటకు సాగిపోదము”

(హెబ్రీ. 1:1-13:⁠25)

ధర్మశాస్త్రాన్ని పాటించడంకన్నా యేసు బలిపై విశ్వాసముంచడం ఉత్తమమని రుజువు చేయడానికి పౌలు క్రైస్తవత్వాన్ని స్థాపించిన వ్యక్తి గొప్పతనం, ఆయన యాజకత్వం, ఆయన బలి, కొత్త నిబంధన గురించి చెప్పాడు. (హెబ్రీ. 3:​1-3; 7:​1-3, 22; 8:⁠6; 9:​11-14, 25, 26) యూదులు పెట్టిన హింసలను తాళుకోవడానికి హెబ్రీ క్రైస్తవులకు పౌలు చెప్పిన విషయాలు ఖచ్చితంగా సహాయం చేసివుంటాయి. పౌలు తన తోటి హెబ్రీ విశ్వాసులను ‘సంపూర్ణులమగుటకు సాగిపొమ్ము’ అని ప్రొత్సహించాడు.​—⁠హెబ్రీ. 6:⁠1.

క్రైస్తవులకు విశ్వాసం ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము” అని పౌలు రాశాడు. ఆయన హెబ్రీయులను ప్రోత్సహిస్తూ, విశ్వాసంతో “మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము” అని అన్నాడు.​—⁠హెబ్రీ. 11:⁠6; 12:⁠1.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

2:​14, 15​​—⁠సాతానుకుమరణముయొక్క బలముఉంది అన్నప్పుడు అతడు ఎవరినైనా అకాల మరణానికి గురిచేయగలడని అర్థమా? దానర్థం అది కాదు. ఏదెనులో సాతాను దుష్ట ప్రవర్తనను మొదలుపెట్టినప్పటి నుండి అతడు పలికిన అబద్ధాలు మానవుల మరణానికి కారణమయ్యాయి. ఎందుకంటే అతను చెప్పింది విని ఆదాము తను పాపంచేయడమే కాక ఆ పాపమరణాలు తన సంతానానికి కూడా వచ్చేలా చేశాడు. (రోమా. 5:​12) అంతేకాక ఈ భూమిపై ఉన్న సాతాను ప్రతినిధులు యేసు విషయంలో చేసినట్లే దేవుని ఇతర సేవకులను కూడా చనిపోయేంత వరకు హింసిస్తున్నారు. అంతమాత్రాన ఎవర్ని కావాలంటే వారిని చంపే సామర్థ్యం సాతానుకు ఉందని దానర్థంకాదు. ఆ సామర్థ్యమే ఉంటే అతడు యెహోవా ఆరాధకులను ఎప్పుడో తుడిచిపెట్టేసుండేవాడే. యెహోవా తన ప్రజల్ని కాపాడతాడు, సాతాను వారిని సమూలంగా నాశనం చేయడానికి ఎప్పుడు అనుమతించడు. సాతాను దాడుల్లో మనలో కొందరు చనిపోడానికి దేవుడు అనుమతించినా మనకు కలిగిన నష్టాన్నంతటిని పూరిస్తాడన్న నమ్మకంతో ఉండొచ్చు.

4:​9-​11​​—⁠మనం ఎలాదేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాం’? దేవుడు ఆరు దినాలపాటు సృష్టి చేసిన తర్వాత భూమి, మానవుల విషయంలో తాను సంకల్పించింది తప్పకుండా నెరవేరుతుందనే నమ్మకంతో విశ్రాంతి తీసుకున్నాడు. (ఆది. 1:​28; 2:​2, 3) మనం నీతిమంతులం అని చూపించుకునే ప్రయత్నం మాని దేవుడు ఏర్పాటు చేసిన విమోచన క్రయధనంపై విశ్వాసం ఉంచితే మనం ‘ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాం.’ స్వార్థపూరిత కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించకుండా యెహోవాపై విశ్వాసముంచి, విధేయతతో ఆయన కుమారుణ్ణి అనుసరించినప్పుడు మనం ప్రతీరోజు విశ్రాంతి పొందేలా ఆశీర్వదించబడతాం.​—⁠మత్త. 11:​28-30.

11:​10, 13-​16​​—⁠అబ్రాహాము ఏ “పట్టణము” కోసం ఎదురుచూశాడు? ఆయన ఎదురుచూసిన పట్టణం అక్షరార్థమైనది కాదుగానీ సూచనార్థకమైనది. యేసుక్రీస్తుతోపాటు 1,44,000 మంది సహపరిపాలకులు ఉండే “పరలోక యెరూషలేము” గురించి ఆయన ఎదురుచూశాడు. పరలోకంలో మహిమాన్వితులైన ఈ సహపరిపాలకులు ‘నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం’ అని పిలువబడ్డారు. (హెబ్రీ. 12:​22; ప్రక. 14:⁠1; 21:⁠2) అబ్రాహాము దేవుని రాజ్యంలో జీవితం కోసం ఎదురుచూశాడు.

12:​1, 2​​—⁠‘తన ఎదుట ఉంచబడిన’ ఏ ‘ఆనందం కోసం యేసు సిలువను సహించాడు’? యెహోవా నామాన్ని పవిత్రపరచడం, దేవుని సర్వాధిపత్యం సరైనదని నిరూపించడం, తన విమోచన క్రయధనం ద్వారా మానవజాతిని మరణం నుండి విడిపించడం వంటివి తన పరిచర్య ద్వారా సాధిస్తున్నానన్న ఆనందం కోసమే ఆయన సహించాడు. మానవుల ప్రయోజనార్థం రాజుగా పరిపాలించే, ప్రధాన యాజకునిగా సేవించే బహుమానం కోసం ఆయన ఎదురు​చూశాడు.

13:20​​—⁠కొత్త నిబంధన ‘నిత్యమైనది’ అని ఎందుకు పిలువబడింది? దానికి మూడు కారణాలున్నాయి (1) దాని స్థానంలో మరొకటి రాదు, (2) దాని ఫలితాలు శాశ్వతకాలం ఉంటాయి, (3) హార్‌మెగిద్దోను తర్వాత కూడా “వేరే గొఱ్ఱెలు” కొత్త నిబంధన ఏర్పాటు ద్వారా ప్రయోజనం పొందుతారు.​—⁠యోహా. 10:⁠16.

మనకు పాఠాలు:

5:​14. మనం దేవుని వాక్యమైన బైబిలును శ్రద్ధగా అధ్యయనం చేస్తూ, దానినుండి నేర్చుకున్నవాటిని అన్వయించుకోవాలి. అలా చేస్తే తప్ప మనం ‘మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియాలను’ పొందలేము.​—⁠1 కొరిం. 2:⁠10.

6:​17-​19. దేవుని వాగ్దానం, ఆయన ప్రమాణానికి అనుగుణంగా మనం బలమైన నిరీక్షణ ఏర్పర్చుకున్నప్పుడు మనం సత్య మార్గం నుండి తప్పిపోము.

12:​3, 4. మనకు ఎదురయే చిన్నచిన్న శ్రమలవల్ల లేదా హింసలవల్ల ‘అలసట పడి ప్రాణము విసిగిపోయే’ బదులు మనం పరిణతి చెంది, శ్రమలను సహించడం నేర్చుకోవాలి. మనం “రక్తము కారునంతగా” అంటే చనిపోయేంతవరకూ తాళుకోవాలని తీర్మానించుకోవాలి.​—⁠హెబ్రీ. 10:​36-39.

12:​13-​15. ‘చేదైన వేరు’ అంటే సంఘంలో ఫలానా దాన్ని ఇలా చేయకూడదు అలా చేయకూడదని తప్పుపట్టే వారి మాటలు విని మనం ‘మన పాదములకు మార్గములను సరళము చేసికోకుండా’ ఉండకూడదు.

12:​26-28. దేవుడు ‘సృష్టించని’ ప్రస్తుత లోక​విధానం, దుష్ట ‘ఆకాశం’ ఉనికిలో లేకుండా కంపించబడతాయి. అది జరిగినప్పుడు ‘చలింపజేయబడనివి’ అంటే దేవుని రాజ్యం, దాని మద్దతుదార్లు మాత్రమే నిలిచి ఉంటారు. కాబట్టి మనం రాజ్యం గురించి ఉత్సాహంగా ప్రకటిస్తూ, దాని సూత్రాలకు అనుగుణంగా జీవించడం చాలా ప్రాముఖ్యం.

13:​7, 17. సంఘంలోని పైవిచారణకర్తలకు విధేయులై, లోబడివుండాలన్న ఉపదేశాన్ని మనం ఎల్లప్పుడూ మనసులో ఉంచుకున్నప్పుడు మనం వారికి సహకరిస్తాం.

[అధస్సూచి]