కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిత్యజీవం పొందేందుకు మీరు ఏమి త్యాగం చేస్తారు?

నిత్యజీవం పొందేందుకు మీరు ఏమి త్యాగం చేస్తారు?

నిత్యజీవం పొందేందుకు మీరు ఏమి త్యాగం చేస్తారు?

“ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?”​—⁠మత్త. 16:⁠26.

అపొస్తలుడైన పేతురు తాను విన్నది నమ్మలేకపోయాడు. తామెంతో ఇష్టపడే నాయకుడైన యేసుక్రీస్తు త్వరలో శ్రమలననుభవించి మరణిస్తానని “బహిరంగముగా” చెప్పాడు. దానికి పేతురు సదుద్దేశంతోనే “ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదు” అని యేసును గద్దించాడు. యేసు పేతురును వదిలి ఇతర శిష్యుల​వైపు తిరిగాడు. వారికి కూడా పేతురులాగే తప్పుడు అభిప్రాయాలు ఉండివుండవచ్చు. అప్పుడు ఆయన పేతురుతో, “సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావు” అని గద్దించాడు.​—⁠మార్కు 8:​32, 33; మత్త. 16:​21-23.

2 యేసు తనను ఎందుకలా గద్దించాడో ఆ తర్వాత అన్న మాటలనుండి పేతురుకు అర్థమైవుంటుంది. యేసు “తన శిష్యులను జనసమూహమును తనయొద్దకు పిలిచి” ఇలా అన్నాడు: “నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును.” (మార్కు 8:​34, 35) ఆ తర్వాత కొంతకాలానికే ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించనున్నాడు. తన శిష్యులూ తనలాగే దేవుని సేవ కోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన ఆశించాడు. వారలా చేస్తే, ఎన్నో ఆశీర్వాదాలను పొందుతారు.​—⁠మత్తయి 16:⁠27 చదవండి.

3 ఆ సందర్భంలోనే యేసు, “ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?” అనే రెండు ఆసక్తికరమైన ప్రశ్నలు వేశాడు. (మార్కు 8:​36, 37) మొదటిదానికి జవాబు అందరికీ తెలిసిందే. ఒక వ్యక్తి ఈ లోకాన్నంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం? ఒక వ్యక్తి తాను సంపాదించింది అనుభవించడానికి బ్రతికివుంటేనే కదా ప్రయోజనం. “మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?” అని యేసు అడిగిన రెండవ ప్రశ్న విన్న ప్రజలకు యోబు దినాల్లో సాతాను వేసిన నింద గుర్తుకువచ్చి ఉంటుంది: “తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.” (యోబు 2:⁠4) యెహోవాను ఆరాధించని కొంతమందికి సాతాను మాటలు సరైనవిగా అనిపించవచ్చు. అనేకమంది బ్రతికివుండడానికి ఏమి చేయడానికైనా, ఏ నైతిక సూత్రాన్ని ఉల్లంఘించడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే క్రైస్తవులు అలా ఆలోచించరు.

4 మనకు ఈ లోకంలో ఆయురారోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి యేసు భూమ్మీదకు రాలేదని మనకు తెలుసు. నూతన లోకంలో నిత్యమూ జీవించే అవకాశాన్ని మానవులకు కల్పించడానికి ఆయన వచ్చాడు. ఆ నిరీక్షణను మనం ఎంతో అమూల్యంగా ఎంచుతాం. (యోహా. 3:​16) యేసు అడిగిన మొదటి ప్రశ్నను క్రైస్తవులు ఇలా అర్థం చేసుకుంటారు: “ఈ లోకాన్నంతా సంపాదించి నిత్యజీవ నిరీక్షణను కోల్పోతే లాభమేంటి?” ఏమీ లాభం లేదు. (1 యోహా. 2:​15-17) యేసు అడిగిన రెండవ ప్రశ్నకు జవాబు చెప్పేందుకు మనం ఈ ప్రశ్నవేసుకోవాలి: “నూతనలోకంలో ఖచ్చితంగా ప్రవేశించేందుకు నేను ఎంతమేరకు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను?” ఆ నిరీక్షణను మనం ఎంత బలంగా నమ్ముతున్నామో మన జీవన విధానమే చూపిస్తుంది.​—⁠యోహాను 12:⁠25 పోల్చండి.

5 నిత్యజీవాన్ని సంపాదించుకోవచ్చని యేసు ఇక్కడ చెప్పడంలేదు. జీవం ఒక వరం, ఈ విధానంలో మనం కొద్దికాలమే జీవించినా అది కూడ ఒక వరమే. దాన్ని మనం కొనలేము సరికదా దాన్ని పొందడానికి ఏమీ చేయలేము. “తన్ను వెదకువారికి ఫలము దయచేయు” యెహోవామీద, ‘యేసుక్రీస్తుమీద విశ్వాసముంచడం’ ద్వారానే మనం నిత్యజీవమనే వరం పొందవచ్చు. (గల. 2:​16; హెబ్రీ. 11:⁠6) అయితే, ‘క్రియలు లేని విశ్వాసము మృతము’ కాబట్టి, మన విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించాలి. (యాకో. 2:​26) మనం యేసు ప్రశ్నలను మరింతగా ధ్యానిస్తున్నప్పుడు ఈ క్రింది ప్రశ్నల గురించి లోతుగా ఆలోచించడం మంచిది. మనకు విశ్వాసం ఉందని చూపించేందుకు ఈ విధానంలో ఎంతమేరకు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం? విశ్వాసం ఉందని చూపించేందుకు యెహోవా సేవలో ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నాం?

‘క్రీస్తు తన్ను తాను సంతోషపరచుకొనలేదు’

6 లోకం ఇవ్వజూపే సుఖభోగాలను ఆశించి వాటికోసం ప్రయాసపడే బదులు, యేసు ప్రాముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యతనిచ్చాడు. జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చే వస్తువులను సంపాదించుకోవాలనే శోధనలకు లొంగిపోలేదు. ఆయన దేవునికి లోబడుతూ త్యాగపూరితమైన జీవితాన్ని గడిపాడు. తనను తాను సంతోషపెట్టుకునే బదులు, ‘దేవునికి ఇష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును’ అని చెప్పాడు. (యోహా. 8:​29) దేవుణ్ణి సంతోషపెట్టేందుకు ఆయన ఎంతమేరకు త్యాగాలు చేశాడు?

7 ఒక సందర్భంలో యేసు తన శిష్యులతో, “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను” అని అన్నాడు. (మత్త. 20:​28) అంతకుముందు, తాను త్వరలో ‘తన ప్రాణాన్ని ఇవ్వాల్సి’ వస్తుందని తన శిష్యులను హెచ్చరించినప్పుడు పేతురు అలా జరుగకుండును గాక అని యేసును గద్దించాడు. అయినా యేసు వెనకడుగేయలేదు. ఆయన మానవజాతి కోసం తన పరిపూర్ణ మానవ ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా అర్పించాడు. ఆయన అలా నిస్వార్థంగా ప్రవర్తించినందుకు ఆయనకు మంచి భవిష్యత్తు దొరికింది. ఆయన పునరుత్థానం చేయబడి, “దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబ[డ్డాడు].” (అపొ. 2:​32, 33) ఆ విధంగా ఆయన మనకు మంచి మాదిరినుంచాడు.

8 రోమాలోని క్రైస్తవులకు తమనుతాము ‘సంతోషపరచుకోవద్దని’ ఉపదేశిస్తూ “క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు” అని అపొస్తలుడైన పౌలు గుర్తుచేశాడు. (రోమా. 15:​1-3) ఆయన ఇచ్చిన ఉపదేశాన్ని మనం ఎంతమేరకు అన్వయించుకుంటాం? క్రీస్తును అనుకరించడానికి మనం ఎంతమేరకు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం?

శ్రేష్ఠమైనది ఇవ్వాలని యెహోవా కోరుతున్నాడు

9 ప్రాచీన ఇశ్రాయేలులో, హెబ్రీ దాసులు ఏడవ ఏట లేదా సునాద సంవత్సరంలో విడుదల చేయబడాలని మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించబడింది. అయితే, దాసులు మరో నిర్ణయం కూడ తీసుకోవచ్చు. ఒక దాసుడు తన యజమానిని ప్రేమించి తన శేషజీవితాన్ని ఆయన ఇంట్లోనే దాసునిగా గడపాలని నిర్ణయించుకోవచ్చు. (ద్వితీయోపదేశకాండము 15:​12, 16, 17 చదవండి.) మనం దేవునికి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు కూడ అలాంటి నిర్ణయమే తీసుకుంటాం. మనం మనకు ఇష్టమైన విధంగా ప్రవర్తించే బదులు దేవుని చిత్తం చేయడానికి ఇష్టపూర్వకంగా అంగీకరిస్తాం. అలా చేయడం ద్వారా మనకు యెహోవాపట్ల ప్రగాఢమైన ప్రేమ ఉందనీ ఆయనను నిత్యమూ ఆరాధించాలనుకుంటున్నామనీ చూపిస్తాం.

10 మీరు ప్రస్తుతం యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తూ సువార్త ప్రకటిస్తూ క్రైస్తవ కూటాలకు హాజరౌతున్నట్లయితే మేము మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. మీరు త్వరలో యెహోవాకు సమర్పించుకోవాలని అనుకుంటారనీ, ఐతియోపీయుడు “నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమి?” అని ఫిలిప్పును అడిగినట్లే అడుగుతారనీ ఆశిస్తున్నాం. (అపొ. 8:​35, 36) ప్రాచీనకాల క్రైస్తవులకు దేవునితో ఎలాంటి సంబంధం ఉండేదో అలాంటి సంబంధమే మీకూ అప్పుడు ఉంటుంది, వారికి పౌలు ఇలా రాశాడు: “మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు.” (1 కొరిం. 6:​19, 20) మనకు పరలోక నిరీక్షణ ఉన్నా లేదా భూనిరీక్షణ ఉన్నా, మనం యెహోవాకు సమర్పించుకుంటే ఆయనే మన యజమాని. అలాంటప్పుడు స్వార్థపూరిత కోరికలను చంపుకొని “మనుష్యులకు దాసులు” కాకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యం! (1 కొరిం. 7:​23) యెహోవా మనల్ని తనకు ఇష్టమైన రీతిలో ఉపయోగించుకునేలా మనం యథార్థ సేవకులుగా ఉండడం నిజంగా అద్భుతమైన అవకాశం!

11 పౌలు తన తోటి విశ్వాసులను ఇలా ఉపదేశించాడు: “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి.” (రోమా. 12:⁠1) ఆ మాటలు విన్నప్పుడు యూదా క్రైస్తవులకు తాము యేసు శిష్యులు కాకముందు తమ ఆరాధనలో భాగంగా అర్పించిన అర్పణలు గుర్తొచ్చివుంటాయి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం యెహోవా బలిపీఠంమీద శ్రేష్ఠమైన జంతువులను అర్పించాలని వారికి తెలిసేవుంటుంది. లోపమున్నవి బలికి అంగీకరించబడేవికావు. (మలా. 1:​8, 13) మనం కూడ మన శరీరాలను ‘సజీవయాగంగా’ అర్పించినప్పుడు శ్రేష్ఠమైనది ఇవ్వాలి. మన కోరికలన్నీ తీరాక మిగిలినది యెహోవాకు ఇచ్చే బదులు శ్రేష్ఠమైనది ఆయనకు ఇస్తాం. దేవునికి సమర్పించుకున్నప్పుడు మనం హృదయపూర్వకంగా మన జీవితాలను అంటే మన శక్తిసామర్థ్యాలను, మన సంపదను ఆయనకు అర్పించుకుంటాం. (కొలొ. 3:​23) మన అనుదిన జీవితాల్లో యెహోవాకు ఎలా శ్రేష్ఠమైనది ఇవ్వవచ్చు?

సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించండి

12 యెహోవా సేవలో శ్రేష్ఠమైనది ఇవ్వాలంటే సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించాలి. (ఎఫెసీయులు 5:15, 16 చదవండి.) అలా చేయాలంటే మనకు ఆశానిగ్రహం అవసరం. లోక ప్రభావాలతోపాటు వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణతలవల్ల మనం మన ఆనందానికి స్వప్రయోజనాలకు సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడతాం. నిజమే, “ప్రతిదానికి సమయము కలదు.” (ప్రసం. 3:⁠1) విశ్రాంతి తీసుకోవడానికి, క్రైస్తవ బాధ్యతలను నెరవేర్చేలా ఉద్యోగం చేయడానికి సమయం ఉంది. అయితే, సమర్పిత క్రైస్తవుడు దేనికెంత సమయం కేటాయించాలో అంత కేటాయిస్తూ సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకుంటాడు.

13 పౌలు ఏథెన్సును సందర్శించినప్పుడు “ఏథెన్సు వారందరును, అక్కడ నివసించు పరదేశులు ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు” అని గమనించాడు. (అపొ. 17:​21) ఇప్పుడు కూడా చాలామంది వారిలాగే సమయాన్ని వృథాచేస్తారు. ఆధునిక కాలంలో టీవీ చూడడం, వీడియో గేములు ఆడడం, ఇంటర్నెట్‌ సైట్స్‌ చూడడంవంటి విషయాలకు సమయం వృథాచేస్తుంటారు. అలాంటి విషయాలు రోజురోజుకీ ఎక్కువౌతున్నాయి. వాటికే ఎక్కువ సమయం కేటాయిస్తే మనం ఆధ్యాత్మిక అవసరాలను నిర్లక్ష్యం చేసే ప్రమాదముంది. అప్పుడు “శ్రేష్ఠమైన కార్యములను” అంటే యెహోవా సేవకు సంబంధించిన పనులను చేయడానికి అసలు సమయంలేదని కూడ మనకు ​అనిపించవచ్చు.​—⁠ఫిలి. 1:​9, 10.

14 అందుకే, యెహోవా సమర్పిత సేవకులుగా మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి, ‘నేను ప్రతీరోజు బైబిలు పఠనానికి, ధ్యానించడానికి, ప్రార్థనకు సమయం కేటాయిస్తున్నానా?’ (కీర్త. 77:​12; 119:​97; 1 థెస్స. 5:​17) ‘కూటాలకు సిద్ధపడడానికి సమయం కేటాయిస్తున్నానా? కూటాల్లో వ్యాఖ్యానాలు ఇస్తూ ఇతరులను ప్రోత్సహిస్తున్నానా?’ (కీర్త. 122:⁠1; హెబ్రీ. 2:​11, 12) పౌలు అతని అనుచరులు యెహోవా ఇచ్చిన అధికారంతో ‘ధైర్యముగా మాటలాడుచు బహుకాలము గడపిరి’ అని బైబిలు చెబుతోంది. (అపొ. 14:⁠3) ప్రకటనా పనిలో ఎక్కువసేపు గడపడానికి, సాధ్యమైతే పయినీరు సేవ చేస్తూ “బహుకాలము” గడపడానికి కావాల్సిన సర్దుబాట్లు చేసుకోగలరా?​—⁠హెబ్రీయులు 13:⁠15 చదవండి.

15 అపొస్తలుడైన పౌలు, నమ్మకస్థులైన మరితరులు అంతియొకయలోని క్రైస్తవ సంఘాన్ని సందర్శించినప్పుడు అక్కడివారిని ప్రోత్సహించడానికి “శిష్యుల యొద్ద బహు​కాలము గడపిరి.” (అపొ. 14:​28) ప్రేమగల పెద్దలు నేడు కూడ అలాగే తమ సమయాన్ని ఎక్కువగా ఇతరులను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు. క్షేత్రసేవలో పాల్గొనడమేకాక పెద్దలు మందను కాయడానికి, తప్పిపోయిన గొర్రెలను వెదకడానికి, అనారోగ్యంతో ఉన్నవారిని ఆదరించడానికి, సంఘంలో తమకుండే ఎన్నో బాధ్యతలను నిర్వర్తించడానికి కూడ వారు కృషి చేస్తారు. మీరు బాప్తిస్మం తీసుకున్న సహోదరులైతే, అలాంటి అదనపు బాధ్యతలను పొందేలా కృషి చేయడానికి మీ పరిస్థితులు అనుకూలిస్తాయేమో చూసుకోండి.

16 మానవుల వల్ల జరిగే ప్రమాదాలవల్ల, ప్రకృతి విపత్తుల​వల్ల నష్టపోయినవారికి సహాయం చేసి చాలామంది ఎంతో సంతోషించారు. 60వ పడిలో ఉన్న ఒక సహోదరి విషయం తీసుకోండి. ఆమె బెతెల్‌లో సేవ చేస్తోంది. చాలాసార్లు ఆమె స్వచ్ఛందంగా ఎంతెంతో దూరం ప్రయాణించి వెళ్లి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె ఎందుకు తన సెలవు దినాలను అలా ఉపయోగించుకుంది? “నాకు ప్రత్యేక సామర్థ్యాలంటూ ఏవీ లేకపోయినా ఇతరులకు అవసరమైన సహాయం చేసే అవకాశం దొరకడం చాలా సంతోషాన్నిస్తుంది. ఎంతో ఆస్తి నష్టం జరిగిన సహోదర​సహోదరీల బలమైన విశ్వాసం చూసిన తర్వాత నా విశ్వాసమెంతో బలపడింది.” అంతేకాదు వేలాదిమంది సాక్షులు ప్రపంచవ్యాప్తంగా రాజ్యమందిరాల, అసెంబ్లీ హాళ్ల నిర్మాణంలో పనిచేస్తున్నారు. అలాంటి పనుల్లో భాగం వహించడం ద్వారా మనం నిస్వార్థంగా “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు” చేయగలుగుతాం.​—⁠గల. 6:⁠10.

“సదాకాలము మీతో కూడ ఉన్నాను”

17 దేవునికి దూరమైన మానవ సమాజం త్వరలోనే నాశనం​కానుంది. కానీ ఖచ్చితంగా ఎప్పుడు నాశనం కానుందో మనకు తెలీదు. అయితే, ‘కాలము సంకుచితమై’ ఉందని, ‘లోకపు నటన గతించుచున్నది’ అని మాత్రం మనకు తెలుసు. (1 కొరింథీయులు 7:​29-31 చదవండి.) కాబట్టి, “మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?” అన్న యేసు ప్రశ్న మరింత ప్రాముఖ్యంగా అనిపిస్తుంది. “వాస్తవమైన జీవమును” పొందడానికి యెహోవా మననుండి కోరే ఎలాంటి త్యాగాలనైనా చేస్తాం. (1 తిమో. 6:​18, 19) అవును, ‘తనను వెంబడించమని,’ ‘రాజ్యాన్ని మొదట వెదకమని’ యేసు ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరించడం ప్రాముఖ్యం.​—⁠మత్త. 6:​31-33; 24:⁠13.

18 యేసును వెంబడించడం అన్నిసందర్భాల్లో సులభమేమీ కాదు. అయితే యేసును వెంబడించడం వల్ల ఆయన హెచ్చరించినట్లు ఈ విధానంలో కొందరు తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే, యేసులాగే మనం కూడ కష్టాలు ‘దూరమవ్వాలని’ కోరుకోం. “నేను యుగ​సమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను” అని ఆయన తన మొదటి శతాబ్ద అభిషిక్త అనుచరులకు ఇచ్చిన అభయంపై మనకు నమ్మకముంది. (మత్త. 28:​20) కాబట్టి, మన సమయాన్ని, సామర్థ్యాలను సాధ్యమైనంత ఎక్కువగా పవిత్రసేవలో ఉపయోగిద్దాం. మనం అలా చేస్తుండగా యెహోవా మనల్ని మహాశ్రమల నుండి తప్పిస్తాడనే లేదా నూతనలోకంలో మనల్ని పునరుత్థానం చేస్తాడనే నమ్మకం మనకుందని చూపిస్తాం. (హెబ్రీ. 6:​10) అలా చేయడం ద్వారా మనం దేవుడిచ్చిన జీవమనే వరాన్ని ఎంతో గౌరవిస్తున్నామని చూపిస్తాం.

మీరెలా జవాబిస్తారు?

• దేవునికి, మానవులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉండే విషయంలో యేసు ఎలా చక్కని మాదిరినుంచాడు?

• ఒకరు ఎందుకు తననుతాను ఉపేక్షించుకోవాలి? ఎలా ఉపేక్షించుకుంటారు?

• ప్రాచీన ఇశ్రాయేలులో యెహోవా ఎలాంటి బలులను మాత్రమే అంగీకరించేవాడు? దానినుండి మనమేమి నేర్చుకుంటాం?

• సమయాన్ని మనమెలా జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యేసు పేతురు అన్న మాటలను ఎందుకు తిరస్కరించాడు?

2. నిజమైన శిష్యులు ఏమి చేయాలని యేసు చెప్పాడు?

3. (ఎ) యేసు తన శ్రోతలను ఏ ప్రశ్నలు అడిగాడు? (బి) యేసు అడిగిన రెండవ ప్రశ్న విన్న ప్రజలకు ఏమి గుర్తుకువచ్చి ఉంటుంది?

4. యేసు అడిగిన ప్రశ్నలు క్రైస్తవులకు ఎలాంటి లోతైన అర్థాన్ని కలిగివున్నాయి?

5. నిత్యజీవమనే వరాన్ని మనం ఎలా పొందవచ్చు?

6. యేసు దేనికి ప్రాధాన్యతనిచ్చాడు?

7, 8. (ఎ) యేసు ఏమి త్యాగం చేశాడు, ఆయన ఎలా ఆశీర్వదించబడ్డాడు? (బి) మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

9. ఒక క్రైస్తవుడు దేవునికి సమర్పించుకున్నప్పుడు నిజానికి ఏమి చేస్తాడు?

10. మనం దేవుని సొత్తు అని ఎలా చెప్పవచ్చు? దాన్ని గుర్తుంచుకొని మనం ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి?

11. క్రైస్తవులు దేనిని అర్పించాలని ప్రోత్సహించబడ్డారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం అర్పించబడిన బలుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

12, 13. యెహోవాకు శ్రేష్ఠమైనది ఇవ్వాలంటే మనమేమి చేయాలి?

14. మనం ఏ ప్రశ్నల గురించి దీర్ఘంగా ఆలోచించాలి?

15. పెద్దలు ఎలా తమ సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తారు?

16. మనం ఎలా “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు” చేయగలం?

17. నిత్యజీవాన్ని పొందేందుకు మీరు ఏ త్యాగాలు చేస్తారు?

18. మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు, ఎందుకు?

[26వ పేజీలోని చిత్రాలు]

యేసు ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టే పనులే చేశాడు

[28వ పేజీలోని చిత్రం]

యెహోవాపట్ల కృతజ్ఞతతో ఇశ్రాయేలీయులు సత్యారాధన కోసం శ్రేష్ఠమైనవి ఇచ్చారు

[29వ పేజీలోని చిత్రాలు]

మన సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించడం ద్వారా మనం దేవుణ్ణి సంతోషపెడతాం