కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన మేలు కోసమే యెహోవా మనల్ని గమనిస్తాడు

మన మేలు కోసమే యెహోవా మనల్ని గమనిస్తాడు

మన మేలు కోసమే యెహోవా మనల్ని గమనిస్తాడు

“తనయెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.”​—⁠2 దిన. 16:⁠9.

యెహోవా పరిపూర్ణ తండ్రి. ఆయనకు మన గురించి ఎంతగా తెలుసంటే, మన ‘ఆలోచనలు, సంకల్పాలు’ సహితం ఆయనకు తెలుసు. (1 దిన. 28:⁠9) అయితే కేవలం మనలో తప్పులు పట్టాలని ఆయన మనల్ని పరిశీలించడు. (కీర్త. 11:⁠4; 130:⁠3) బదులుగా, ఆయన తనతో మన సంబంధాన్ని లేదా నిత్యజీవం పొందే మన అవకాశాలను పాడుచేయగల వాటినుండి మనల్ని ప్రేమపూర్వకంగా కాపాడాలని కోరుకుంటున్నాడు.​—⁠కీర్త. 25:​8-10, 12, 13.

2 యెహోవా సర్వశక్తిమంతుడు, ఆయన అందరినీ పరిశీలిస్తున్నాడు. అందుకే, ఆయన తన యథార్థ సేవకులు ఎప్పుడు ప్రార్థనచేసినా వారికి సహాయం చేయగలడు, కష్టాల్లో ఉన్నప్పుడు వారికి మద్దతివ్వగలడు. “తనయెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది” అని 2 దినవృత్తాంతములు 16:9 చెబుతోంది. యథార్థమైన శుద్ధ హృదయంతో, నిష్కపటమైన ఉద్దేశంతో తనను సేవించేవారినే యెహోవా బలపరుస్తాడన్నది గమనించండి. మోసగాళ్లపై లేదా వేషధారులపై ఆయనలాంటి శ్రద్ధ చూపించడు.​—⁠యెహో. 7:​1, 20, 21, 25; సామె. 1:​23-33.

దేవునితో నడవండి

3 ఈ సువిశాల విశ్వానికి సృష్టికర్త, సూచనార్థక భావంలో మానవులను తనతో ఎలా నడవనిస్తాడో చాలామంది ఊహించుకోలేకపోతారు. కానీ, మానవులు తనతో నడవాలనే యెహోవా కోరుతున్నాడు. బైబిలు కాలాల్లో హనోకు, నోవహు ‘దేవునితో నడిచారు.’ (ఆది. 5:​24; 6:⁠9) మోషే ‘అదృశ్యుడైనవానిని చూస్తున్నట్లు స్థిరబుద్ధితో’ ముందుకుసాగాడు. (హెబ్రీ. 11:​27) రాజైన దావీదు కూడా వినయపూర్వకంగా తన పరలోకపు తండ్రితో నడిచాడు. ఆయనిలా అన్నాడు: “[యెహోవా] నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.”​—⁠కీర్త. 16:⁠8.

4 నిజమే, అక్షరార్థంగా మనం యెహోవా చెయ్యి పట్టుకుని ఆయనతో నడవలేం. కానీ, సూచనార్థకంగా నడవచ్చు. ఎలా? “నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను. నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు. నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు” అని కీర్తనకర్తయైన ఆసాపు రాశాడు. (కీర్త. 73:​23, 24) ఒక్కమాటలో చెప్పాలంటే, యెహోవా ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా అనుసరించినప్పుడు మనం ఆయనతో నడుస్తాం. ఆయన ఉపదేశం మనకు ముఖ్యంగా దేవుని వాక్యం ద్వారా, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా లభిస్తోంది.​—⁠మత్త. 24:​45; 2 తిమో. 3:⁠16.

5 తనతో నడిచేవారిని యెహోవా ఎంతో ఇష్టపడతాడు కాబట్టి, ఆయన ప్రేమగల తండ్రిగా వారిని పరిశీలిస్తూ, శ్రద్ధచూపిస్తూ, కాపాడుతూ, వారికి బోధిస్తుంటాడు. “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” అని దేవుడు చెబుతున్నాడు. (కీర్త. 32:⁠8) మీరిలా ప్రశ్నించుకోండి: ‘యెహోవా జ్ఞానాన్ని శ్రద్ధగా వింటూ, ఆయన ప్రేమతో నన్ను గమనిస్తున్నాడని తెలుసుకొని ఆయన చెయ్యిపట్టుకుని నడుస్తున్నట్లు ఊహించుకుంటున్నానా? నేను ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు ఆయన నాతో ఉన్నాడనేది గుర్తుంచుకుంటున్నానా? నేను తప్పు చేసినప్పుడు యెహోవా నన్ను దూరంగా ఉంచి నాతో కఠినంగా ప్రవర్తించే వ్యక్తిగా చూడక, పశ్చాత్తాపం చూపించేవారిని అక్కున చేర్చుకునే కృపగల తండ్రిగా నేనాయనను చూస్తున్నానా?’​—⁠కీర్త. 51:⁠17.

6 కొన్నిసార్లు, మనం తప్పు చేయకముందే యెహోవా మనకు సహాయం చేయవచ్చు. ఉదాహరణకు, మోసకరమైన మన హృదయం అనుచితమైన వాటిని కోరుతోందని ఆయన గమనించవచ్చు. (యిర్మీ. 17:⁠9) అలాంటి పరిస్థితిలో, మానవ తల్లిదండ్రులకన్నా ముందుగానే ఆయన చర్యతీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన “కనుదృష్టి” మన అంతరంగాన్ని, మనలోని తలంపుల్ని పసిగట్టగలదు. (కీర్త. 11:⁠4; 139:⁠4; యిర్మీ. 17:​10) ప్రవక్తయైన యిర్మీయా సహాయకుడు, సన్నిహిత స్నేహితుడైన బారూకు జీవితంలో ఒకానొక పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడెలా స్పందించాడో గమనించండి.

నిజమైన తండ్రిలా బారూకుకు సహాయం చేశాడు

7 బారూకు ప్రావీణ్యంగల శాస్త్రి, ఆయన యూదాపై యెహోవా తీర్పులను యిర్మీయాతోపాటు నమ్మకంగా ప్రకటించాడు. అది సులభమైన పనేమీకాదు. (యిర్మీ. 1:​18, 19) ఒకానొక సమయంలో, బహుశా ప్రముఖ కుటుంబానికి చెందిన బారూకు తనకోసం “గొప్పవాటిని” వెదకడం ఆరంభించాడు. ఆయన స్వార్థపూరిత లక్ష్యాలను లేదా ధనవంతుడు కావాలనే కోరికను పెంచుకోసాగాడు. ఏదేమైనా, బారూకు హృదయంలో ఈ ప్రమాదకర ఆలోచన బలపడడాన్ని యెహోవా గమనించాడు. యిర్మీయా ద్వారా మాట్లాడుతూ యెహోవా వెంటనే బారూకుతో ఇలా అన్నాడు: “కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను అని నీవనుకొనుచున్నావు.” ఆ పిమ్మట దేవుడాయనతో, “నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు” అని చెప్పాడు.​—⁠యిర్మీ. 45:​1-5.

8 యెహోవా బారూకుతో తాను చెప్పాల్సింది ఖచ్చితంగా చెప్పినా, యెహోవా కోపంతో కాదుగానీ ప్రేమగల నిజమైన తండ్రిలా మాట్లాడాడు. ఆయన కోరికలు చెడ్డవి లేదా మోసకరమైనవి కావని యెహోవాకు తెలుసు. అలాగే యెరూషలేము, యూదాలు కొంతకాలానికి నాశనం చేయబడనున్నాయి కాబట్టి, ఆ అపాయకర కాలంలో బారూకు తప్పుచేయకుండా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అందుకే, తన సేవకుడు వాస్తవాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో, తాను “సర్వశరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను” అని గుర్తుచేశాడు. అంతేకాక ఆయన జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తే తన ప్రాణాలు కాపాడుకోవచ్చని కూడ చెప్పాడు. (యిర్మీ. 45:⁠5) నిజానికి, దేవుడు బారూకుతో ‘బారూకూ, పరిస్థితిని అర్థంచేసుకో. త్వరలోనే యూదా, యెరూషలేములకు ఏమి సంభవిస్తుందో గుర్తుంచుకో. నమ్మకంగావుండి ప్రాణాలు దక్కించుకో! నేను నిన్ను కాపాడతాను’ అని చెప్పాడు. ఆయన తన ఆలోచనను సరిదిద్దుకుని, 17 సంవత్సరాల తర్వాత సంభవించిన యెరూషలేము నాశనాన్ని తప్పించుకోవడాన్నిబట్టి యెహోవా చెప్పిన ఆ మాటలను బారూకు గ్రహించాడని చెప్పవచ్చు.

9 బారూకు వృత్తాంతాన్ని ధ్యానిస్తుండగా, ఈ క్రింది ప్రశ్నల గురించి, లేఖనాల గురించి ఆలోచించండి: బారూకుతో దేవుడు వ్యవహరించిన విధానం నుండి యెహోవా గురించి, తన సేవకులపట్ల ఆయనకున్న మనోభావాల గురించి మనం ఏమి తెలుసుకోవచ్చు? (హెబ్రీయులు 12:9 చదవండి.) మనం అపాయకరమైన కాలాల్లో జీవిస్తున్నాం కాబట్టి, బారూకుకు దేవుడిచ్చిన ఉపదేశం నుండి, బారూకు ప్రతిస్పందించిన తీరు నుండి మనమేమి నేర్చుకోవచ్చు? యిర్మీయాలాగే, క్రైస్తవ పెద్దలు యెహోవా తన సేవకులపట్ల చూపించిన శ్రద్ధనెలా అనుకరించవచ్చు?​—⁠గలతీయులు 6:1 చదవండి.

కుమారుడు తన తండ్రి ప్రేమను అనుకరించాడు

10 క్రైస్తవ కాలాలకు పూర్వం, యెహోవా తన ప్రజలపట్ల తనకున్న ప్రేమను తన ప్రవక్తల ద్వారా, ఇతర నమ్మకమైన సేవకుల ద్వారా కనబర్చాడు. నేడు ఆయన తన ప్రేమను ముఖ్యంగా క్రైస్తవ సంఘ శిరస్సైన యేసుక్రీస్తు ద్వారా కనబరుస్తున్నాడు. (ఎఫె. 1:​22, 23) అందువల్ల ప్రకటన గ్రంథంలో యేసు, ‘ఏడు కన్నులున్న అంటే భూమియంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలున్న’ గొర్రెపిల్లగా వర్ణించ​బడ్డాడు. (ప్రక. 5:⁠6) అవును, దేవుని పరిశుద్ధాత్మ పూర్ణుడైన యేసుకు పరిపూర్ణ వివేచన ఉంది. అంతరంగంలో మనం ఎలాంటివారిమో ఆయన కూడా గమనిస్తున్నాడు, జరుగుతున్న ప్రతిదాన్ని ఆయన చూడగలడు.

11 ఎలాగైతే యెహోవా మనల్ని పోలీసులా ఓ కంట కనిపెడుతూ ఉండడో అలాగే యేసు కూడ పోలీసులా మనల్ని కనిపెడుతూ ఉండడు. ఆయన కూడా ప్రేమగల తండ్రిలాగే మనల్ని పరిశీలిస్తాడు. యేసుకున్న బిరుదుల్లో “నిత్యుడగు తండ్రి” అనే బిరుదు, తనపై విశ్వాసముంచే వారందరూ నిత్యజీవం పొందేందుకు ఆయన పోషించే పాత్రను మనకు గుర్తుచేస్తుంది. (యెష. 9:⁠6) అంతేకాక, క్రైస్తవ సంఘ శిరస్సుగా క్రీస్తు, అవసరమైన వారికి ఓదార్పును లేదా ఉపదేశాన్ని ఇచ్చేలా సహాయం చేసేందుకు ఇష్టపడే ఆధ్యాత్మిక పరిణతిగల క్రైస్తవులను, ముఖ్యంగా పెద్దలను పురికొల్పగలడు.​—⁠1 థెస్స. 5:​14; 2 తిమో. 4:​1, 2.

12 మందపట్ల క్రీస్తుకు ఎంతో శ్రద్ధవుందనే విషయం ఆసియా మైనర్‌లోని ఏడు సంఘాల పెద్దలకు ఆయన రాసిన ఉత్తారాల్లో కనిపిస్తుంది. (ప్రక. 2:1-3:​22) ఆ ఉత్తరాల్లో యేసు ప్రతీ సంఘంలో ఏమి జరుగుతుందో తనకు తెలుసనీ, తన అనుచరులపట్ల తనకెంతో శ్రద్ధవుందని సూచించాడు. ప్రకటనలోని ఆ దర్శనం “ప్రభువు దినమందు” నెరవేరుతోంది కాబట్టి నేడు అది మనకు ఎంతగానో అన్వయిస్తుంది. * (ప్రక. 1:​10) సంఘంలో ఆధ్యాత్మిక కాపరులుగా సేవచేసే పెద్దల ద్వారా క్రీస్తు తరచూ తన ప్రేమను కనబరుస్తున్నాడు. అవసరమైనప్పుడు ఓదార్పును, ప్రోత్సాహాన్ని లేదా ఉపదేశాన్ని ఇచ్చేందుకు ఆయన ‘మనుష్యులకు అనుగ్రహించబడిన ఈ ఈవులను’ పురికొల్పగలడు. (ఎఫె. 4:⁠8; అపొ. 20:​28; యెషయా 32:​1, 2 చదవండి.) యేసుకు మీపై వ్యక్తిగత శ్రద్ధ ఉందని వారి ప్రయత్నాలను చూసిన తర్వాత మీకు అనిపిస్తోందా?

సరైన సమయంలో సహాయం

13 మీరు ఎప్పుడైనా సహాయం కోసం తీవ్రంగా ప్రార్థించినప్పుడు ఆధ్యాత్మికంగా పరిణతిగల సహోదరుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రోత్సహించాడా? (యాకో. 5:​14-16) లేదా క్రైస్తవ కూటంలోని ప్రసంగం రూపంలో లేదా మన ప్రచురణల్లోని సమాచారం రూపంలో మీకు ఆ సహాయం దొరికిందా? యెహోవా తరచూ మన ప్రార్థనలకు అలా జవాబిస్తాడు. ఉదాహరణకు, ఒక పెద్ద ప్రసంగమిచ్చిన తర్వాత, ఆ ప్రసంగానికి కొద్ది​వారాల ముందు ఘోర అన్యాయాన్ని ఎదుర్కొన్న సహోదరి ఆయన దగ్గరకు వెళ్లింది. ఆమె తన సమస్య గురించి ఫిర్యాదు చేసే బదులు, ఆ ప్రసంగంలో ప్రస్తావించబడిన కొన్ని లేఖనాంశాల విషయంలో ఎంతో కృతజ్ఞతను తెలియజేసింది. ఆ లేఖనాలు ఆమె పరిస్థితికి సరిపోయాయి కాబట్టి ఆమె ఎంతో ఓదార్పు పొందింది. ఆ కూటానికి హాజరైనందుకు ఆమె ఎంతగా సంతోషించివుంటుందో!

14 ప్రార్థన ద్వారా సహాయం పొందిన ముగ్గురు ఖైదీల ఉదాహరణను పరిశీలించండి. వారు జైలులో ఉండగా బైబిలు సత్యం నేర్చుకుని బాప్తిస్మం తీసుకోని ప్రచారకులయ్యారు. ఒకానొక హింసాత్మక సంఘటన కారణంగా ఆ జైల్లోవున్న చాలామంది ఖైదీలకు అదనపు ఆంక్షలు విధించబడ్డాయి. దానితో జైల్లో తిరుగుబాటు మొదలైంది. మరుసటి రోజు అల్పాహారం తర్వాత, ఆ అంక్షలను తిరస్కరిస్తూ ఖైదీలు ప్లేట్లు తిరిగి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. బాప్తిస్మం తీసుకోని ఆ ముగ్గురు ప్రచారకులు ఇప్పుడు సందిగ్ధంలోపడ్డారు. వారు ఆ తిరుగుబాటులో చేరితే, రోమీయులు 13:1లోని యెహోవా ఉపదేశాన్ని ఉల్లంఘించినవారౌతారు. ఆ తిరుగుబాటులో చేరకపోతే, కోపోద్రిక్తులైన తోటి ఖైదీలు వారిని ఊరికే వదిలిపెట్టరు.

15 ఒకరినొకరు సంప్రదించుకునే అవకాశం లభించని ఆ ముగ్గురు జ్ఞానం కోసం దేవునికి ప్రార్థించారు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ ముగ్గురూ సరిగ్గా ఒకే పరిష్కారం గురించి ఆలోచించారు. అదేమిటంటే ఆ రోజు ఉదయం తాము అల్పాహారం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత జైలు సిబ్బంది ప్లేట్లు సేకరించడానికి వచ్చినప్పుడు, వాటిని తిరిగి ఇవ్వడానికి ఆ ముగ్గురి దగ్గర ప్లేట్లే లేవు. “ప్రార్థన ఆలకించువాడు” తమ దగ్గరే ఉన్నందుకు వారెంతగా సంతోషించారు!​—⁠కీర్త. 65:⁠2.

భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోవడం

16 యథార్థపరులు ఎక్కడ నివసిస్తున్నా వారిపట్ల యెహోవాకు శ్రద్ధవుంది అని చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనా పని మరో రుజువు. (ఆది. 18:​25) యెహోవా దేవదూతలను ఉపయోగించి సువార్త ఇంకనూ ప్రకటించబడని ప్రాంతాల్లో నివసిస్తున్న గొర్రెల్లాంటి ప్రజల దగ్గరకు కూడ తన సేవకులు వెళ్లేలా చేయగలడు. (ప్రక. 14:​6, 7) ఉదాహరణకు, మొదటి శతాబ్దంలో ఐతియొపీయ అధికారి దగ్గరకెళ్లి లేఖనాలను వివరించేలా దేవుడు తనదూత ద్వారా సువార్తికుడైన ఫిలిప్పును నడిపించాడు. దాని ఫలితమేమిటి? ఆ అధికారి సువార్తను అంగీకరించి, బాప్తిస్మం తీసుకొని యేసు అనుచరుడయ్యాడు. *​—⁠యోహా. 10:​14; అపొ. 8:​26-39.

17 ప్రస్తుత విధానపు అంతం సమీపిస్తుండగా, ప్రవచించ​బడిన “వేదనలు” కొనసాగుతాయి. (మత్త. 24:⁠8) ఉదాహరణకు, పెరుగుతున్న జనాభా అవసరాలనుబట్టి, తీవ్ర వాతావరణ పరిస్థితినిబట్టి లేదా ఆర్థిక అస్థిరతనుబట్టి ఆహార​పదార్ధాల ధరలు ఆకాశాన్ని అంటుకోవచ్చు. ఉద్యోగాలు దొరకడం మరింత కష్టంకావచ్చు, ఉద్యోగస్థులు తీవ్ర ఒత్తిడితో అనేక గంటలు పనిచేయాల్సి రావచ్చు. ఏమి జరిగినా, యెహోవా సేవకు ప్రథమస్థానమిస్తూ, తమ ‘కంటిని తేటగా’ ఉంచుకునే వారందరూ అతిగా చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు తమను ప్రేమిస్తున్నాడని, తమపట్ల శ్రద్ధ కనబరుస్తాడని వారికి తెలుసు. (మత్త. 6:​22-34) ఉదాహరణకు, సా.శ.పూ. 607లో యెరూషలేము ఘోరంగా నాశనమైనప్పుడు యెహోవా యిర్మీయాను ఎలా ఆదుకున్నాడో ఆలోచించండి.

18 బబులోనీయులు యెరూషలేమును చివరిసారి ముట్టడించినప్పుడు, యిర్మీయా బందీగృహశాలలో ఖైదు చేయబడ్డాడు. ఆయనకు ఆహారమెలా దొరికింది? ఆయన బందీగా లేకపోతే ఆహారం కోసం వెతుక్కొనేవాడు. కానీ ఆయనిప్పుడు తన చుట్టూవున్న వారిమీదే పూర్తిగా ఆధారపడాల్సివచ్చింది, వారిలో చాలామంది ఆయనను ద్వేషించినవారే! అయినా, యిర్మీయా మనష్యులను కాదుగానీ, తనను ఆదుకుంటానని వాగ్దానం చేసిన దేవుణ్ణే నమ్మాడు. మరి యెహోవా తన మాటను నిలబెట్టుకున్నాడా? అవును నిలబెట్టుకున్నాడు! “పట్టణములో రొట్టెలున్నంత వరకు . . . అనుదినము ఒక రొట్టె” యిర్మీయాకు అందేలా యెహోవా చూశాడు. (యిర్మీ. 37:​21) యిర్మీయా, బారూకు, ఎబెద్మెలెకుతోపాటు మరికొందరు కూడ ఆ కాలంలో ప్రబలిన కరవును, వ్యాధిని, మరణాన్ని తప్పించుకున్నారు.​—⁠యిర్మీ. 38:⁠2; 39:​15-18.

19 అవును, “ప్రభువు [యెహోవా] కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి.” (1 పేతు. 3:​12) మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని పరిశీలిస్తున్నాడనే వాస్తవాన్ని తెలుసుకొని మీరు సంతోషిస్తున్నారా? మీకు మేలు చేసేందుకే ఆయన కనుదృష్టి మీపై ఉందని తెలుసుకున్న తర్వాత మీరు భద్రంగా, సురక్షితంగా ఉన్నారని మీకు అనిపిస్తోందా? అలాగైతే, భవిష్యత్తులో ఏమి జరిగినా నిరంతరం దేవునితో నడవాలన్న కృతనిశ్చయంతో ఉండండి. ప్రేమగల తండ్రిగా యెహోవా తన యథార్థ సేవకులను ఎల్లప్పుడూ జాగ్రత్తగా గమనిస్తుంటాడనే నమ్మకంతో మనముండవచ్చు.​—⁠కీర్త. 32:⁠8; యెషయా 41:⁠13 చదవండి.

[అధస్సూచీలు]

^ పేరా 17 ఆ ఉత్తరాలు ప్రాథమికంగా క్రీస్తు అభిషిక్త సహోదరులకు అన్వయించినా, సూత్రప్రాయంగా అవి దేవుని సేవకులందరికీ అన్వయిస్తాయి.

^ పేరా 23 దేవుని నిర్దేశానికి సంబంధించిన మరో ఉదాహరణను అపొస్తలుల కార్యములు 16:​6-10లో చూడవచ్చు. ఆసియా, బితూనియల్లో ప్రకటించకుండా పౌలును ఆయన సహవాసుల్ని ‘పరిశుద్ధాత్మ ఆటంకపర్చడం’ గురించి మనమక్కడ చదువుతాం. బదులుగా వారు మాసిదోనియలో పనిచేయమని ఆదేశించబడ్డారు, అక్కడ చాలామంది వినయస్థులు వారి సువార్త పనికి స్పందించారు.

మీరు వివరించగలరా?

• ‘దేవునితో నడుస్తున్నామని’ మనమెలా చూపించవచ్చు?

• బారూకుపట్ల తనకు ప్రేమవుందని యెహోవా ఎలా చూపించాడు?

• క్రైస్తవ సంఘ శిరస్సుగా యేసు తన తండ్రి లక్షణాలనే ఎలా కనబరుస్తున్నాడు?

• ఈ అపాయకరమైన కాలాల్లో మనం దేవుణ్ణి నమ్ముతున్నామని ఏయే విధాలుగా చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యెహోవా మనల్నెందుకు పరిశీలిస్తాడు?

2. యెహోవా ఎలాంటివారిని బలపరుస్తాడు?

3, 4. ‘దేవునితో నడవడమంటే’ ఏమిటి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఏ బైబిలు ఉదాహరణలు మనకు సహాయం చేస్తాయి?

5. తన యథార్థ సేవకులను యెహోవా ఒక ప్రేమగల తండ్రిగా ఎలా గమనిస్తున్నాడు, ఆయనను మనం ఎలా చూడాలి?

6. మానవ తల్లిదండ్రులు చేయలేని దేన్ని యెహోవా చేయగలడు?

7, 8. (ఎ) బారూకు ఎవరు, ఆయన తన హృదయంలో ఎలాంటి అనుచిత కోరికను పెంచుకొనివుంటాడు? (బి) బారూకు విషయంలో యెహోవా ఎలా ఒక ప్రేమగల తండ్రిగా వ్యవహరించాడు?

9. పేరాలో ఇవ్వబడిన ప్రశ్నలకు మీరెలా జవాబిస్తారు?

10. క్రైస్తవ సంఘ శిరస్సుగా తన పనిని నిర్వహించేలా యేసుకు ఎలాంటి సామర్థ్యాలున్నాయి?

11. క్రీస్తు ఏ పాత్రను పోషిస్తాడు, తన తండ్రిలాగే ఆయన మనపట్ల ఎలాంటి మనోవైఖరిని కనబరుస్తున్నాడు?

12. (ఎ) ఆసియా మైనర్‌లోని ఏడు సంఘాలకు రాసిన ఉత్తరాల నుండి మనం యేసు గురించి ఏమి తెలుసుకోవచ్చు? (బి) దేవుని మందపట్ల క్రీస్తుకున్న మనోవైఖరినే పెద్దలెలా కనబరుస్తారు?

13-15. దేవుడు మన ప్రార్థనలకు ఎలా జవాబివ్వవచ్చు? ఉదాహరణలు చెప్పండి.

16. గొర్రెల్లాంటి ప్రజలపట్ల యెహోవాకు శ్రద్ధ ఉందని ప్రకటనా పని ఎలా చూపిస్తోంది?

17. భవిష్యత్తు గురించి మనమెందుకు అతిగా చింతించాల్సిన అవసరం లేదు?

18. యెరూషలేము ముట్టడివేయబడినప్పుడు యిర్మీయాపట్ల తన ప్రేమను యెహోవా ఎలా చూపించాడు?

19. మనం భవిష్యత్తును ఎదుర్కొంటుండగా ఏ కృతనిశ్చయంతో ఉండాలి?

[9వ పేజీలోని చిత్రాలు]

బారూకుతో యిర్మీయా వ్యవహరించినట్లే, నేడు క్రై స్తవ పెద్దలు యెహోవాలా మందపట్ల శ్రద్ధ కనబరుస్తారు

[10వ పేజీలోని చిత్రం]

సరైన సమయంలో యెహోవా ఎలా సహాయం చేయవచ్చు?