కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా “కనుదృష్టి” అందరినీ పరిశీలిస్తోంది

యెహోవా “కనుదృష్టి” అందరినీ పరిశీలిస్తోంది

యెహోవా “కనుదృష్టి” అందరినీ పరిశీలిస్తోంది

‘యెహోవా కనుదృష్టి నరులను పరిశీలిస్తోంది.’​—⁠కీర్త. 11:⁠4.

మీపట్ల నిజంగా శ్రద్ధ చూపించేవారి గురించి మీరేమనుకుంటారు? మీ విషయంలో నిజాయితీగా తమ అభిప్రాయం చెప్పమని అడిగితే వారు నిజాయితీగానే తమ అభిప్రాయం చెబుతారు. మీకు అవసరమైనప్పుడు వారు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. మీకు దిద్దుబాటు అవసరమైనప్పుడు వారు దానిని ప్రేమపూర్వకంగా ఇస్తారు. (కీర్త. 141:⁠5; గల. 6:⁠1) అలాంటివారివైపు మీరు ఆకర్షించబడరా? యెహోవా, ఆయన కుమారుడు నిజంగా అలాంటి వారే. అంతేకాక, మీపట్ల వారికున్నంత శ్రద్ధ మరెవ్వరికీ లేదు, అలాగే వారి ఉద్దేశం పూర్తిగా నిస్వార్థమైనది; మీరు ‘వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునేందుకు’ సహాయం చేయడానికి వారిష్టపడుతున్నారు.​—⁠1 తిమో. 6:​18; ప్రక. 3:⁠19.

2 యెహోవాకు మనపై ఎంత శ్రద్ధవుందో చెబుతూ, కీర్తనకర్త దావీదు ఇలా అన్నాడు: “[యెహోవా] నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.” (కీర్త. 11:⁠4) దేవుడు మనల్ని కేవలం చూడడం లేదు, ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు అని దాన్నిబట్టి అర్థమౌతుంది. దావీదు ఇంకా ఇలా రాశాడు: “రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు.” (కీర్త. 17:⁠3) కాబట్టి, తనపై యెహోవాకు ఎంత శ్రద్ధవుందో దావీదుకు బాగా తెలుసు. పాపభరిత ఆలోచనల్ని లేదా చెడు ఆలోచనలను వృద్ధిచేసుకుంటే యెహోవాను నొప్పించి, ఆయన ఆగ్రహానికి గురౌతానని ఆయనకు తెలుసు. దావీదుకు యెహోవా నిజమైన వ్యక్తిగా ఉన్నట్లే మీకూ ఉన్నాడా?

యెహోవా హృదయాన్ని చూస్తాడు

3 యెహోవాకు మన అంతరంగం అంటే మన హృదయమెలా ఉందనేదే ప్రాముఖ్యం. (కీర్త. 19:​14; 26:⁠2) ప్రేమతో ఆయన చిన్నచిన్న తప్పిదాలపై దృష్టి నిలపడు. ఉదాహరణకు, అబ్రాహాము భార్య శారా, భౌతిక శరీరం ధరించి తనతో మాట్లాడుతున్న దూతకు అబద్ధం చెప్పినప్పుడు, ఆమె భయంతో, సిగ్గుపడి అలా చెప్పిందని ఆ దూత అర్థం చేసుకోగలిగాడు. అందుకే ఆయన ఆమెను సున్నితంగా మందలించాడు. (ఆది. 18:​12-15) పితరుడైన యోబు “దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు” మాట్లాడినా, ఆయనను సాతాను క్రూరంగా హింసించాడనే విషయాన్ని గుర్తుంచుకుని యెహోవా యోబును ఆశీర్వదించాడు. (యోబు 32:⁠2; 42:​12) అలాగే, సారెపతులో నివసించిన విధవరాలు ఏలీయాతో నిర్మొహమాటంగా మాట్లాడినా యెహోవా కోపగించుకోలేదు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి కోల్పోయిన ఆమె దుఃఖంతో నిండివున్నట్లు ఆయన అర్థం చేసుకున్నాడు.​—⁠1 రాజు. 17:​8-24.

4 యెహోవా హృదయాన్ని పరిశీలిస్తాడు కాబట్టే, ఆయన అవిశ్వాసులపట్ల కూడ దయ చూపించాడు. ఫిలిష్తీయ పట్టణమైన గెరారుకు రాజైన అబీమెలెకుతో ఆయన వ్యవహరించిన తీరును పరిశీలించండి. అబ్రాహాము, శారా దంపతులని గుర్తించని అబీమెలెకు శారాను తన భార్యగా చేసుకోవాలనుకుంటాడు. కానీ, అబీమెలెకు ఆమెను ముట్టుకునే ముందే, కలలో యెహోవా ఆయనకిలా చెప్పాడు: “అవును, యథార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు.”​—⁠ఆది. 20:​1-7.

5 అబద్ధ దేవతారాధకుడైన అబీమెలెకును యెహోవా నిశ్చయంగా శిక్షించివుండవచ్చు. అయితే ఈ సందర్భంలో ఆయన నిజాయితీగా ప్రవర్తించినట్లు దేవుడు గమనించాడు. యెహోవా దయతో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు. ఆయన క్షమాపణపొంది ‘బ్రదకాలంటే’ ఏమిచేయాలో ఆ రాజుకు చెప్పాడు. మీరలాంటి దేవుణ్ణే ఆరాధించాలని కోరుకోరా?

6 యేసు తన శిష్యుల్లోని మంచినే చూస్తూ వారి తప్పులను వెంటనే క్షమించడం ద్వారా తన తండ్రి మాదిరిని పరిపూర్ణంగా అనుకరించాడు. (మార్కు 10:​35-45; 14:​66-72; లూకా 22:​31, 32; యోహా. 15:​15) యేసు దృక్పథం యోహాను 3:17లో ఆయన పలికిన మాటలకు అనుగుణంగానే ఉంది. ఆయనిలా అన్నాడు: “లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.” అవును, యెహోవాకు, యేసుకు మనపట్ల ఎల్లప్పుడూ ప్రగాఢమైన ప్రేమవుంది. మనం జీవాన్ని పొందాలన్న వారి కోరికనుబట్టి వారికి మనపట్ల ప్రేమ ఉందనేది స్పష్టమౌతుంది. (యోబు 14:​15) యెహోవా మనల్ని ఎందుకు పరిశీలిస్తున్నాడో, మనల్ని ఆయనెలా దృష్టిస్తున్నాడో, తాను చూసినదానినిబట్టి ఆయనెలా చర్య తీసుకుంటాడో దీన్నిబట్టి అర్థమౌతుంది.​—⁠1 యోహాను 4:​8, 19 చదవండి.

ప్రేమతో పరిశీలిస్తాడు

7 కాబట్టి పాపం చేస్తే పట్టుకోవడానికి పరలోకం నుండి ఓ కంట కనిపెట్టే పోలీసుగా యెహోవాను ఊహించుకోవడమెంత తప్పో కదా! మనల్ని తప్పుపట్టాలని, నిందించాలని చూసేది సాతానే. (ప్రక. 12:​10) మనకు చెడు ఉద్దేశాలు లేకపోయినా అవి మనకున్నాయని ఆరోపించేదీ అతనే. (యోబు 1:​9-11; 2:​4, 5) దేవుని గురించి కీర్తనకర్త ఇలా రాశాడు: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” (కీర్త. 130:⁠3) ఎవ్వరూ నిలువలేరు! (ప్రసం. 7:​20) బదులుగా, తన ప్రియమైన పిల్లలకు హాని కలగకూడదనే అభిలాషతో వారిని కనిపెట్టిచూసే శ్రద్ధగల తల్లి/తండ్రిలా యెహోవా మనల్ని కనికరంతో, దయతో గమనిస్తున్నాడు. మనకుమనం హాని​తలపెట్టుకోకుండా ఉండేందుకు ఆయన తరచూ మన అపరిపూర్ణతలను, బలహీనతలను మన దృష్టికి తీసుకువస్తాడు.​—⁠కీర్త. 103:​10-14; మత్త. 26:⁠41.

8 లేఖనాల ద్వారా, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందించే ఆధ్యాత్మిక ఆహారం ద్వారా మనకు ఉపదేశాన్ని, క్రమశిక్షణను ఇస్తూ యెహోవా మనపట్ల తనకున్న ప్రేమను చూపిస్తున్నాడు. (మత్త. 24:​45; హెబ్రీ. 12:​5, 6) అలాగే క్రైస్తవ సంఘం ద్వారా, దానిలో ‘మనుష్యులకు అనుగ్రహించిన ఈవుల’ ద్వారా కూడ ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. (ఎఫె. 4:⁠8) అంతేకాక, తానిచ్చే వాత్సల్యపూరిత క్రమశిక్షణకు మనం ఎలా స్పందిస్తున్నామో గమనిస్తూ, మరింత సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కీర్తన 32:8 ఇలా చెబుతోంది: “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.” కాబట్టి, ఎల్లప్పుడూ యెహోవా మాటలకు చెవియొగ్గడం ఎంత ప్రాముఖ్యం! ఆయన మన ప్రేమగల బోధకుడు, తండ్రి అని గుర్తుంచుకొని ఆయన ముందు మనల్నిమనం తగ్గించుకోవాలి.​—⁠మత్తయి 18:4 చదవండి.

9 దీనికి భిన్నంగా, అహంకారం, విశ్వాసరాహిత్యం లేదా “పాపమువలన కలుగు భ్రమ” వల్ల మనమెన్నటికీ కఠినస్థులుగా మారకుండా ఉందాం. (హెబ్రీ. 3:​13; యాకో. 4:⁠6) ఒక వ్యక్తి దురాలోచనలను లేదా చెడు కోరికలను పెంపొందించుకున్నప్పుడు అతనిలో ఈ లక్షణాలు తరచూ కనిపిస్తాయి. అతను సముచితమైన లేఖన సలహాను నిరాకరించే స్థాయికి కూడ చేరుకోవచ్చు. చివరకు, అతడు దేవునికి శత్రువుగా మారిపోయేంతగా చెడు ప్రవర్తనకు అలవాటుపడిపోవచ్చు. అది ఎంత భయానకమైన పరిస్థితి! (సామె. 1:​22-31) ఆదాముహవ్వల ప్రథమ సంతానమైన కయీను విషయమే తీసుకోండి.

యెహోవా అన్నిటినీ గమనించి, దానికి అనుగుణంగా చర్య తీసుకుంటాడు

10 కయీను, హేబెలులు యెహోవాకు అర్పణలు తెచ్చినప్పుడు, ఆయన వారి అర్పణలనేకాక, వారి ఉద్దేశాన్ని కూడా గమనించాడు. వారి హృదయాన్ని దేవుడు పరిశీలించాడు. హేబెలు విశ్వాసంతో అర్పించాడు కాబట్టి ఆయన దాన్ని అంగీకరించాడు. ఏదో విధంగా విశ్వాసాన్ని కనబరచని కయీను అర్పణను తిరస్కరించాడు. (ఆది. 4:​4, 5; హెబ్రీ. 11:⁠4) కయీను, జరిగిన సంఘటన నుండి పాఠం నేర్చుకుని తన ప్రవర్తనను మార్చుకునే బదులు తన తమ్మునిపై కోపంతో రగిలిపోయాడు.​—⁠ఆది. 4:⁠6.

11 యెహోవా కయీను వైఖరి ప్రమాదకరంగా మారడాన్ని గమనించి, ఆయనతో అనునయంగా మాట్లాడి, ఆయన సత్క్రియచేస్తే తలెత్తుకునే అవకాశముందని సూచించాడు. కానీ విచారకరంగా కయీను తన సృష్టికర్త ఉపదేశాన్ని పెడచెవినబెట్టి తన తమ్ముణ్ణి హత్యచేశాడు. కయీను హృదయం సరిగా లేదనే విషయం, “నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని” దేవుడు అడిగిన ప్రశ్నకు ఆయనిచ్చిన తలబిరుసు సమాధానంలో మరింతగా కనిపిస్తుంది. కయీను ఎదురుతిరిగి మాట్లాడుతూ, “నేనెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా” అన్నాడు. (ఆది. 4:​7-9) హృదయమెంత మోసకరమైనది! దేవుడు స్వయంగా ఇచ్చిన సలహానే ధిక్కరించే స్థాయికి అది ఒక వ్యక్తిని తీసుకు​వెళ్లగలదు. (యిర్మీ. 17:⁠9) కాబట్టి మనమిలాంటి వృత్తాంతాల నుండి పాఠాలు నేర్చుకుని దురాలోచనలు, చెడు కోరికలు కలగకుండా వెంటనే చర్యతీసుకుందాం. (యాకోబు 1:​14, 15 చదవండి.) మనకు లేఖనాధార సలహా ఇవ్వబడినప్పుడు దాన్ని యెహోవా ప్రేమకు రుజువని దృష్టిస్తూ, కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరిద్దాం.

ఏ పాపమూ దాగదు

12 తమ తప్పును ఎవరూ చూడకపోతే, శిక్ష తప్పించుకోవచ్చని కొందరనుకుంటారు. (కీర్త. 19:​12) నిజానికి, రహస్యంగా చేయగల తప్పుంటూ ఏదీ లేదు. “మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.” (హెబ్రీ. 4:​13) యెహోవా మన అంతరంగ ఉద్దేశాలను పరిశీలించే న్యాయాధిపతి, అపరాధంపట్ల ఆయన మనోవైఖరి తన పరిపూర్ణ న్యాయానికి అద్దంపట్టేలా ఉంటుంది. ఆయన “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడు.” అయితే ‘బుద్ధిపూర్వకముగా పాపముచేసిన’ లేదా వక్రబుద్ధితో పన్నాగాలు పన్నే స్వభావం చూపిస్తూ పశ్చాత్తాపం చూపించనివారిని ఆయన ‘ఏమాత్రము నిర్దోషులుగా ఎంచడు.’ (నిర్గ. 34:​6, 7; హెబ్రీ. 10:​26) ఆకాను, అననీయ, సప్పీరాలతో యెహోవా వ్యవహరించిన తీరునుబట్టి అది తెలుస్తోంది.

13 దేవుని ఆజ్ఞకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆకాను యెరికో పట్టణపు దోపుడు సొమ్ము కాజేసి, తన గుడారంలో దాచిపెట్టాడు. ఆ దొంగతనంలో అతని కుటుంబ సభ్యులు కూడా భాగస్థులై ఉండవచ్చు. తన పాపం బహిర్గతమైనప్పుడు తానుచేసిన పని ఎంత ఘోరమైనదో ఆకాను గ్రహించాడు. ఎందుకంటే, అతనిలా అన్నాడు: ‘యెహోవాకు విరోధముగా నేను పాపము చేశాను.’ (యెహో. 7:​20) కయీనులాగే ఆకాను కూడా చెడు హృదయాన్ని వృద్ధిచేసుకున్నాడు. అకాను దురాశ కారణంగానే మోసకరంగా వ్యవహరించాడు. యెరికో పట్టణపు దోపుడు సొమ్ము యెహోవాది కాబట్టి, ఆకాను దేవుని సొమ్మునే దొంగిలించాడని చెప్పవచ్చు. ఆ కారణంగా అతడు, అతని కుటుంబ సభ్యులు మరణశిక్షను అనుభవించారు.​—⁠యెహో. 7:⁠25.

14 అననీయ అతని భార్య సప్పీరా యెరూషలేములోని తొలి క్రైస్తవ సంఘ సభ్యులు. సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత, దూరప్రాంతాల నుండి యెరూషలేముకు వచ్చి అక్కడే ఉండిపోయిన కొత్త విశ్వాసుల అవసరాలు తీర్చడానికి సామాన్య నిధి ఒకటి ఏర్పాటు చేయబడింది. ఆ నిధికి అందరూ స్వచ్ఛందంగా విరాళాలిచ్చేవారు. అననీయ దంపతులు తమ పొలం అమ్మి దానిలో కొంతభాగం విరాళంగా ఇచ్చారు. కానీ అతను పొలం అమ్మగావచ్చిన సొమ్మంతటినీ విరాళంగా ఇచ్చినట్లు నటించాడన్న విషయం ఆయన భార్యకూ బాగా తెలుసు. నిస్సందేహంగా, ఈ దంపతులు సంఘంలో తమకు ప్రత్యేక గౌరవం దక్కాలని కోరుకున్నారు. అయితే వారు మోసపూరితంగా ప్రవర్తించారు. యెహోవా ఆ మోసాన్ని అద్భుతరీతిలో అపొస్తలుడైన పేతురుకు వెల్లడిచేశాడు. అననీయ చేసిన మోసం విషయంలో ఆయనను పేతురు నిలదీశాడు. ఆ మరుక్షణమే అననీయ కుప్పకూలి మరణించాడు. ఆ తర్వాత మరి కొద్దిసేపటికే సప్పీరా కూడా మరణించింది.​—⁠అపొ. 5:​1-11.

15 అననీయ, సప్పీరాలు తాత్కాలిక బలహీనతవల్ల అలా చేయలేదు. అపొస్తలుల్ని మోసగించేందుకు వారు పథకంవేసి, అబద్ధం చెప్పారు. అంతకన్నా ఘోరమైన విషయమేమిటంటే, వారు ‘పరిశుద్ధాత్మతో, దేవునితో అబద్ధమాడారు.’ వేషధారుల నుండి సంఘాన్ని కాపాడేందుకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని యెహోవా తీసుకున్న చర్య స్పష్టంగా రుజువు చేసింది. అవును, “జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.”​—⁠హెబ్రీ. 10:⁠31.

అన్ని సమయాల్లో యథార్థతను కాపాడుకోండి

16 మనల్ని భ్రష్టుపట్టించి, దేవుని అనుగ్రహం కోల్పోయేలా చేయాలని సాతాను శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. (ప్రక. 12:​12, 17) లైంగిక దుర్నీతితో, దౌర్జన్యంతో నిండిన ఈ లోకంలో అపవాది దురుద్దేశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా నేడు అశ్లీల దృశ్యాలను సులభంగా చూడవచ్చు. సాతాను దాడులకు మనమెన్నటికీ లొంగకూడదు. బదులుగా, మన మనోభావాలు కూడా కీర్తనకర్త అయిన దావీదులాగే ఉండాలి. ఆయనిలా రాశాడు: “నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. . . . నా యింట యథార్థ హృదయముతో నడుచుకొందును.”​—⁠కీర్త. 101:⁠2.

17 గతంలో కొన్నిసార్లు చేసినట్లు యెహోవా నేడు ఘోరమైన పాపాన్ని, మోసపూరిత ప్రవర్తనను అద్భుతరీతిలో బయటపెట్టడంలేదు. అయినా, ఆయన అన్నిటినీ పరిశీలిస్తూ తగిన సమయంలో, తగిన రీతిలో రహస్య పాపాలను బయటపెడతాడు. పౌలు ఇలా అన్నాడు: “కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారివెంట వెళ్లుచున్నవి.” (1 తిమో. 5:​24) యెహోవా ప్రేమతోనే చెడు క్రియలను బయటపెడుతున్నాడు. ఆయన సంఘాన్ని ప్రేమిస్తూ, దాని స్వచ్ఛతను కాపాడాలని కోరుకుంటున్నాడు. అంతేకాక, పాపం చేసిన వ్యక్తి నిజంగా పశ్చాత్తాపపడితే ఆయన కనికరిస్తాడు. (సామె. 28:​13) కాబట్టి పూర్ణహృదయంతో దేవుణ్ణి సేవిస్తూ, చెడు ప్రభావాలన్నిటినీ తిరస్కరించేందుకు మనం కృషిచేద్దాం.

పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవిస్తూ ఉండండి

18 రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇలా అన్నాడు: “నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను, మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము.” (1 దిన. 28:⁠9) తన కుమారుడు దేవుణ్ణి కేవలం నమ్మితే సరిపోదని దావీదు అనుకున్నాడు. యెహోవాకు తన సేవకులపై ఎంతో శ్రద్ధ ఉందన్న విషయాన్ని సొలొమోను గ్రహించాలని ఆయన కోరుకున్నాడు. యెహోవాకు తన సేవకులపై ఎంతో శ్రద్ధ ఉందన్న విషయాన్ని మీరు గ్రహించారా?

19 సరైన మనోవైఖరిగల ప్రజలు తనకు దగ్గరౌతారని, తన ఇంపైన లక్షణాల గురించి తెలుసుకున్నప్పుడు వారు తనకు సన్నిహితులౌతారని యెహోవాకు తెలుసు. అందువల్ల, మనమాయన గురించి అద్భుత వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలనీ యెహోవా కోరుతున్నాడు. మనమెలా తెలుసుకోవచ్చు? ఆయన వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా, మనకాయన అనుగ్రహించే ఆశీర్వాదాలను చవిచూడడం ద్వారా మనం తెలుసుకోవచ్చు.​—⁠సామె. 10:​22; యోహా. 14:⁠9.

20 బైబిలు దేవుడిచ్చిన గ్రంథమని గుర్తించి దానిని ప్రతీరోజు చదువుతున్నారా? అందులోని విషయాల్ని అన్వయించుకునేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నారా? బైబిలు సూత్రాల ప్రకారం జీవించడంవల్ల కలిగే ప్రయోజనాన్ని మీరు గ్రహించారా? (కీర్తన 19:​7-11 చదవండి.) అలా గ్రహిస్తే యెహోవాపై మీకున్న విశ్వాసం, ఆయనపట్ల మీకున్న ప్రేమ అంతకంతకు ఎక్కువౌతుంది. అప్పుడు ఆయన మీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నంతగా మీకు దగ్గరౌతాడు. (యెష. 42:⁠6; యాకో. 4:⁠8) అవును, మీరు జీవమునకు పోవు ఇరుకు మార్గంలో పయనిస్తుండగా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆధ్యాత్మికంగా కాపాడుతూ మీపట్ల ఆయనకు ప్రేమ ఉందని చూపిస్తాడు.​—⁠కీర్త. 91:​1, 2; మత్త. 7:​13, 14.

మీరెలా జవాబిస్తారు?

• యెహోవా మనల్నెందుకు పరిశీలిస్తాడు?

• కొందరు ఏ కారణాన్నిబట్టి దేవునికి శత్రువులయ్యారు?

• యెహోవా మనకు నిజమైన వ్యక్తిగా ఉన్నాడని మనమెలా చూపించవచ్చు?

• పూర్ణ హృదయంతో మనమెలా యెహోవాను సేవిస్తూ ఉండవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. మనం ఎలాంటివారివైపు ఆకర్షించబడతాము?

2. తన సేవకులపై యెహోవాకు ఎంత శ్రద్ధవుంది?

3. మనకు అపరిపూర్ణతలున్నా యెహోవా ఎలా పరిస్థితులను బేరీజు వేసుకొని మనతో వ్యవహరిస్తాడు?

4, 5. అబీమెలెకుతో వ్యవహరించిన తీరులో యెహోవా ఎలా దయ చూపించాడు?

6. యేసు ఏయే విధాలుగా తన తండ్రిని అనుకరించాడు?

7. యెహోవా ఏ ఉద్దేశంతో మనల్ని పరిశీలిస్తాడు?

8. యెహోవా తన సేవకులకు ఎలా ఉపదేశాన్ని, క్రమశిక్షణను ఇస్తున్నాడు?

9. మనం ఏ లక్షణాలను అలవర్చుకోకూడదు, ఎందుకు?

10. కయీను అర్పణను యెహోవా ఎందుకు తిరస్కరించాడు, దానికి కయీను ఎలా స్పందించాడు?

11. కయీను మోసకరమైన హృదయాన్ని ఎలా కనబర్చాడు, అందులో మనకెలాంటి పాఠముంది?

12. తప్పుచేసినప్పుడు యెహోవా ఎలా స్పందిస్తాడు?

13. ఆకాను చెడు ఆలోచన చెడు చేయడానికి ఎలా ప్రేరేపించింది?

14, 15. అననీయ, సప్పీరాలను దేవుడెందుకు శిక్షించాడు, అందులో మనకే పాఠముంది?

16. (ఎ) దేవుని ప్రజలను భ్రష్టుపట్టించేందుకు సాతాను ఎలా ప్రయత్నిస్తున్నాడు? (బి) మీ ప్రాంతంలోని ప్రజలను భ్రష్టుపట్టించేందుకు అపవాది ఎలాంటి పద్ధతులను ఉపయోగిస్తున్నాడు?

17. (ఎ) యెహోవా రహస్య పాపాలను తగిన సమయంలో ఎందుకు బయటపెడతాడు? (బి) మనం ఏ కృతనిశ్చయంతో ఉండాలి?

18. తన కుమారుడు దేవునిపట్ల ఎలాంటి స్వభావంతో ఉండాలని దావీదు కోరుకున్నాడు?

19, 20. కీర్తన 19:​7-11 ప్రకారం దేవునికి సన్నిహితమయ్యేందుకు దావీదుకు ఏది సహాయం చేసింది, మనమెలా దావీదును అనుకరించవచ్చు?

[4వ పేజీలోని చిత్రం]

శ్రద్ధగల తల్లి/తండ్రిలా యెహోవా మనల్నెలా గమనిస్తున్నాడు?

[5వ పేజీలోని చిత్రం]

అననీయ దంపతుల ఉదాహరణ నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

[6వ పేజీలోని చిత్రం]

పూర్ణ హృదయంతో యెహోవానూ సేవిస్తూ ఉండేందుకు మనకేది సహాయం చేస్తుంది?