కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవా నా బలం”

“యెహోవా నా బలం”

“యెహోవా నా బలం”

జోన్‌ కొవిల్‌ చెప్పినది

నేను 1925 జూలైలో ఇంగ్లాండ్‌లోని హడ్డర్స్‌ఫీల్డ్‌ పట్టణంలో పుట్టాను. మా అమ్మానాన్నలకు నేను ఒక్కగానొక్క కూతుర్ని. నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది. మా నాన్న, “బయటి గాలి తగిలితే చాలు నీ ఆరోగ్యం దెబ్బతింటుంది” అని అనేవారు. ఆయన మాటల్లో నిజం లేకపోలేదు!

నాచిన్నతనంలో పాదిరీలు తరచూ శాంతికోసం ప్రార్థించేవారు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం మొదలవగానే విజయం కోసం ప్రార్థించారు. అది చూసి నేనెంతో కలవరపడ్డాను, నాకెన్నో అనుమానాలు వచ్చాయి. అప్పుడే మా ఇంటికి ఆనీ రాట్‌క్లిఫ్‌ వచ్చింది, అప్పట్లో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె ఒక్కత్తే యెహోవాసాక్షి.

సత్యం నేర్చుకోవడం

ఆనీ మాకు సాల్వేషన్‌ (ఆంగ్లం) పుస్తకాన్ని ఇచ్చి, మా అమ్మను వాళ్లింట్లో జరిగే బైబిలు చర్చకు రమ్మని పిలిచింది. * మా అమ్మ నన్ను కూడ రమ్మంది. నేను మొదటిసారి వెళ్లినప్పుడు జరిగిన చర్చ నాకు ఇప్పటికీ గుర్తుంది. అక్కడ విమోచన క్రయధనం గురించి చర్చించారు. ఆశ్చర్యమేమిటంటే అది వింటున్నప్పుడు నాకస్సలు విసుగనిపించలేదు. అక్కడ నేనెన్నో ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్నాను. తర్వాతి వారం మేము మళ్లీ వెళ్లాం. అప్పుడు అంత్యదినాల గురించి యేసు చెప్పిన ప్రవచనాన్ని వివరించారు. లోకం ఎంతగా పాడయ్యిందో చూసిన మేము, సాక్షులు చెప్పింది సత్యం అని వెంటనే గుర్తించాం. అదే రోజున వారు మమ్మల్ని రాజ్యమందిరానికి రమ్మని పిలిచారు.

రాజ్యమందిరంలో నేను జాయ్స్‌ బార్బర్‌ను (ఇప్పుడు ఎలిస్‌), మరికొంతమంది యౌవన పయినీర్లను కలిశాను. ఇప్పుడు జాయ్స్‌ తన భర్త పీటర్‌తో కలిసి లండన్‌ బెతెల్‌లో సేవచేస్తోంది. వాళ్లను చూశాక అందరూ అలాగే పయినీరు సేవ చేస్తారేమో అనుకున్నాను. అందుకే, అప్పటికి నేనింకా స్కూలుకు వెళ్తున్నా ప్రతీ నెల 60 గంటలు పరిచర్య చేయడం మొదలుపెట్టాను.

ఐదు నెలల తర్వాత అంటే 1940 ఫిబ్రవరి 11న మా అమ్మా నేనూ బ్రాడ్‌ఫోర్డ్‌లో జరిగిన ప్రాంతీయ సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నాం. మేము కొత్తగా ఎంచుకున్న మతం విషయంలో మా నాన్న అభ్యంతరం చెప్పకపోయినా సత్యాన్ని మాత్రం స్వీకరించలేదు. నేను బాప్తిస్మం తీసుకునే సమయానికి వీధి మలుపుల్లో సాక్ష్యమిచ్చే పద్ధతిని ప్రారంభించారు. నేను కూడ పత్రికల బ్యాగుతో, ప్లకార్డ్‌లతో (భుజాలపై తగిలించుకునే ప్రకటనా బోర్డు) సాక్ష్యమివ్వడానికి వెళ్లాను. ఒక శనివారం నన్ను బజారులో రద్దీగా ఉండే చోట ప్రకటించమన్నారు. నాకింకా మనుష్యుల భయం పోలేదు. ఆ భయంతో నాకు మా స్కూలు పిల్లలందరూ నా ముందు నుంచి వెళ్తున్నారేమో అనిపించింది!

1940లో మా సంఘాన్ని రెండుగా చెయ్యాల్సివచ్చింది. దాంతో నేనొక సంఘంలో, నా తోటి వయసు​వారంతా మరో సంఘంలో ఉండిపోయారు. నేను సంఘ పైవిచారణకర్తతో దాని గురించి చెబితే, ఆయన “నీకు స్నేహితులు కావాలంటే నువ్వు ప్రకటనా పని చేసి కొత్త స్నేహితులను వెతుక్కో” అని అన్నాడు. నేను అలాగే చేశాను. కొన్ని రోజుల్లోనే ఎల్సీ నోబుల్‌ని కలిశాను. ఆమె సత్యాన్ని స్వీకరించి నాకు చిరకాల స్నేహితురాలయ్యింది.

పయినీరు సేవ, దానితో వచ్చిన ఆశీర్వాదాలు

స్కూలు చదువు పూర్తైన తర్వాత నేను ఒక అకౌంటెంట్‌ దగ్గర పని చేశాను. అయితే, పూర్తికాల సేవకులు పరిచర్యలో ఎంత ఆనందాన్ని పొందుతున్నారో చూసేకొద్దీ నాకూ పయినీరు సేవ చేయాలనే కోరిక పెరిగింది. 1945 మే నుండి ప్రత్యేక పయినీరుగా సేవ చేసే ఆధిక్యతను పొందాను. నా పయినీరు సేవ మొదటి రోజంతా కుండపోతగా వర్షం కురిసింది. అయినా ప్రకటనా పనికి వెళ్లడం నాకెంత ఆనందాన్నిచ్చిందంటే నాకు వర్షం కురుస్తుందన్న ధ్యాసే లేకపోయింది. మామూలుగా అయితే బయటి గాలి తగిలితేనే పాడయ్యే నా ఆరోగ్యం, ప్రతీరోజు బయటకు వెళ్లడంవల్ల, సైకిలు త్రొక్కడంవల్ల ఎంతగానో మెరుగుపడింది. నా బరువు ఎప్పుడూ 42 కేజీలకు మించింది లేదు. కానీ అంత బలహీనంగా ఉన్నా నేనెప్పుడు పయినీరు సేవను మానలేదు. ఈ సంవత్సరాలన్నిటిలో “యెహోవా నా బలం” అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.​—⁠కీర్త. 28:7 ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

ప్రత్యేక పయినీరునైన నన్ను కొత్త సంఘాలు ప్రారంభించడం కోసం సాక్షులు లేని పట్టణాలకు పంపించారు. మొదటి మూడేళ్లు ఇంగ్లాండ్‌లో, తర్వాతి మూడేళ్లు ఐర్లాండ్‌లో సేవచేశాను. ఐర్లాండ్‌లోని లిస్బర్న్‌లో ఉన్నప్పుడు నేను ఒక వ్యక్తితో అధ్యయనం చేశాను. ఆయన ప్రొటస్టెంట్‌ చర్చిలో పాస్టరుకు సహాయకునిగా పనిచేసేవాడు. బైబిల్లోని ప్రాథమిక విషయాలను నేర్చుకున్నప్పుడు ఆయన వాటిని చర్చి సభ్యులకు బోధించేవాడు. కొందరు ఆయనలా చేస్తున్నాడని చర్చి అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్లు ఆయనను నిలదీశారు. తను ఇంతకాలం తప్పులు బోధిస్తున్నానని చర్చి సభ్యులకు చెప్పడం తన క్రైస్తవ బాధ్యతగా భావిస్తున్నానని ఆయన వాళ్లతో అన్నాడు. ఆయన కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించినా తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని చనిపోయేంతవరకు నమ్మకంగా సేవచేశాడు.

ఐర్లాండ్‌లో నేను సేవచేసిన రెండవ ప్రాంతం లార్న్‌ పట్టణం. నా తోటి పయినీరు సహోదరి 1950లో న్యూయార్క్‌లో జరిగిన “థియోక్రెసీస్‌ ఇంక్రీస్‌” సమావేశానికి వెళ్లడంతో నేను ఆరు వారాలపాటు అక్కడ ఒంటరిగా ఉండాల్సొచ్చింది. ఆమె లేనన్ని రోజులు ఎంతో భారంగా గడిచాయి. సమావేశానికి ఎంతగానో వెళ్లాలనున్నా వెళ్లలేని పరిస్థితి. అయితే అదే సమయంలో నాకు ప్రకటనా పనిలో ఎన్నో ప్రోత్సాహకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఎవరి దగ్గరి నుండో మన ప్రచురణ తీసుకున్న ఓ వృద్ధుణ్ణి కలిశాను. ఆయన దాన్ని ఎన్నిసార్లు చదివాడంటే ఆయనకది కంఠతా వచ్చేసింది. ఆయన, వాళ్ల కొడుకూ కూతురు సత్యాన్ని స్వీకరించారు.

గిలియడ్‌ పాఠశాలలో శిక్షణ

న్యూయార్క్‌లోని సౌత్‌ లాన్సింగ్‌లో జరిగిన 17వ గిలియడ్‌ తరగతికి నేను, నాతోపాటు ఇంగ్లాండ్‌లోని పదిమంది ఇతర పయినీర్లు 1951లో ఆహ్వానించబడ్డాం. ఆ నెలల్లో మాకు దొరికిన బైబిలు ఉపదేశాన్నిబట్టి నేనెంతో ఆనందించాను! అప్పట్లో సహోదరీలకు స్థానిక సంఘాల్లోని పరిచర్య పాఠశాలలో ప్రసంగాలు ఇచ్చేవారు కాదు. కానీ గిలియడ్‌ తరగతిలో మాత్రం మాకు ప్రసంగాలు, నివేదికలు ఇచ్చే నియామకాలుండేవి. మేము చాలా కంగారుపడ్డాం! నేను మొదటి ప్రసంగం ఇచ్చినంతసేపు నోట్సు పట్టుకున్న చెయ్యి వణుకుతూనే ఉంది. ఉపదేశకుడైన మాక్స్‌వెల్‌ ఫ్రెండ్‌ నవ్వుతూ నాతో, “మంచి ప్రసంగీకులందరూ ప్రసంగ ప్రారంభంలో కంగారుపడతారు. అది సహజమే. కానీ మీరైతే చివరివరకు కంగారుపడుతూనే ఉన్నారు” అని అన్నాడు. కొంతకాలానికి మేము తరగతిలో అందరిముందు ప్రసంగాలివ్వడంలో మెరుగుపడ్డాం. నెలలు నిమిషాల్లా గడిచిపోయాయి. మా శిక్షణ పూర్తై పట్టభద్రులందరూ వేర్వేరు దేశాలకు పంపించబడ్డారు. నన్ను థాయ్‌లాండ్‌కు పంపించారు.

“చిరునవ్వుల దేశం”

నాతోపాటు థాయ్‌లాండ్‌కు ఆస్ట్రిడ్‌ ఆండర్‌సన్‌ను పంపించారు. ఆమెను నాతో పంపడం నిజంగా యెహోవా ఆశీర్వాదమే! సరుకులు తీసుకెళ్లే ఓడలో ప్రయాణమై రాజధాని అయిన బ్యాంకాక్‌కు చేరుకోవడానికి మాకు ఏడువారాలు పట్టింది. ఆ పట్టణం నిండా కిటకిటలాడే మార్కెట్లున్నాయి. అది ప్రజలు ప్రయాణానికి ఉపయోగించే కాలువలతో నిండివుంది. 1952లో అక్కడ 150కన్నా తక్కువ రాజ్య ప్రచారకులు ఉండేవారు.

మేము మొదటిసారి థాయ్‌ భాషలో కావలికోటను చూసినప్పుడు ‘ఇంత కష్టమైన భాషను ఎలా నేర్చుకోవాలా’ అని అనుకున్నాం. పదాలను సరైన స్వరస్థాయితో పలకడం పెద్ద సవాలుగా ఉండేది. ఉదాహరణకు, ఖాయు అనే పదాన్ని ముందు స్వరస్థాయి పెంచి తర్వాత తగ్గించి పలికితే “బియ్యం” అనే అర్థం వస్తుంది. అదే తగ్గు స్వరంతో పలికితే “వార్త” అనే అర్థం వస్తుంది. మేము ప్రకటనా పనికి వెళ్లినప్పుడు మొదట్లో ప్రజలకు “నేను మీ కోసం మంచి వార్తను తీసుకొచ్చాను” అని చెప్పే బదులు “నేను మీ కోసం మంచి బియ్యాన్ని తీసుకొచ్చాను” అని చెప్పేవాళ్లం. అలా ఎన్నో పొరపాట్లు చేసిన తర్వాత మేము క్రమంగా ఆ భాషను నేర్చుకున్నాం.

థాయ్‌ ప్రజలు స్నేహశీలురు. అందుకే ఆ దేశానికి “చిరునవ్వుల దేశం” అనే పేరుంది. మా మొదటి నియామకం ఖోరత్‌ పట్టణం (ఇప్పుడు నఖోన్‌ రాక్షసిమా). మేము అక్కడ రెండేళ్లు సేవచేశాక మమ్మల్ని చియాంగ్‌ మై పట్టణానికి పంపారు. థాయ్‌లాండ్‌లో ఎక్కువమంది బౌద్ధులు. వారికి బైబిల్లోని విషయాల గురించి అంతగా తెలీదు. ఖోరత్‌లో నేను ఓ పోస్టుమాస్టరుతో అధ్యయనం చేశాను. మేము పితరుడైన అబ్రాహాము గురించి మాట్లాడుతుంటే, ఆయన ముందెప్పుడో అబ్రాహాము గురించి విన్నాడు కాబట్టి ఉత్సాహంగా తలూపాడు. కానీ నేను చెబుతున్న అబ్రాహాము ఆయన అనుకున్న అబ్రాహాము ఒకరు కాదని అని వెంటనే తేలిపోయింది. ఎందుకంటే నేను ​అమెరికాకు మాజీ అధ్యక్షుడైన అబ్రాహామ్‌ లింకన్‌ గురించి మాట్లాడతున్నానని ఆయన అనుకున్నాడు.

యథార్థహృదయులైన థాయ్‌ ప్రజలకు బైబిలు విషయాలు నేర్పించడం మాకెంతో సంతోషాన్నిచ్చింది. వారు మాకు ఉన్నంతలో సంతోషంగా ఉండడాన్ని నేర్పించారు. అదో ప్రాముఖ్యమైన పాఠం ఎందుకంటే ఖోరత్‌లో ముందు మేమున్న మిషనరీ గృహంలో కరెంటు, నీటి సరఫరా లేదు. అలాంటి నియామకాల్లో మేము ‘సమృద్ధి కలిగివుండడం’ అంటే ఏమిటో ‘లేమిలో ఉండడం’ అంటే ఏమిటో నేర్చుకున్నాం. అపొస్తలుడైన పౌలులాగే మేము ‘బలపరచువానియందే సమస్తం చేయగలమని’ తెలుసుకున్నాం.

కొత్త వ్యక్తితో కొత్త నియామకంలో సేవచేయడం

నేను 1945లో లండన్‌కు వెళ్లాను. అక్కడ కొందరు పయినీర్లు, బెతెల్‌ సభ్యులతో కలిసి బ్రిటీష్‌ మ్యూజియమ్‌కు వెళ్లాను. మాతో ఆలెన్‌ కొవిల్‌ కూడ వచ్చాడు. ఆయన కొంతకాలం తర్వాత 11వ గిలియడ్‌ తరగతికి హాజరయ్యాడు. ఆయన ముందు ఫ్రాన్స్‌కు, తర్వాత బెల్జియంకు నియమించబడ్డాడు. * నేను థాయ్‌లాండ్‌లో మిషనరీగా సేవచేస్తున్నప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. నేను దానికి ఒప్పుకున్నాను.

మేము బెల్జియంలోని బ్రసెల్స్‌లో 1955 జూలై 9న పెళ్లి చేసుకున్నాం. మాకు పెళ్లైన తర్వాత సరదాగా పారిస్‌కు వెళ్లాలని కలలు కనేదాన్ని. అందుకే ఆలెన్‌ పెళ్లైన తర్వాతి వారం అక్కడ జరిగే సమావేశానికి హాజరయ్యేలా చక్కని ఏర్పాటు చేశాడు. అయితే, మేము అక్కడకు వెళ్లిన వెంటనే సమావేశంలో ప్రసంగాలన్నిటినీ అనువదించమని ఆలెన్‌ను అడిగారు. ప్రతీరోజు ఆయన తెల్లవారుజామునే వెళ్లిపోయేవాడు. ఇద్దరం కలిసి రాత్రికెప్పటికో లాడ్జ్‌కు చేరేవాళ్లం. నేను కోరుకున్నట్లే సరదాగా గడపడానికి పారిస్‌ అయితే వెళ్లాం కానీ ఆ రోజులన్నీ ఆలెన్‌ను అలా దూరం నుండే స్టేజీపై చూస్తు గడిపేశాను. అయినా నేనేమి బాధపడలేదు. నా భర్త సహోదర సహోదరీలకు సేవచేయడం చూసి సంతోషించాను. మా వివాహంలో యెహోవాకు ప్రథమ స్థానమిస్తే మేము చాలా సంతోషంగా ఉంటామనే నమ్మకం నాకెప్పుడూ ఉంది.

పెళ్లైన తర్వాత నేను కొత్త ప్రదేశానికి అంటే బెల్జియంకు నియమించబడ్డాను. నాకు బెల్జియం ఒక యుద్ధభూమిగా మాత్రమే తెలుసు. కానీ చాలామంది బెల్జియన్‌లు శాంతిని ప్రేమించేవారని కొన్ని రోజుల్లోనే అర్థమైంది. మిషనరీగా నేను ఆ దేశపు దక్షిణ ప్రాంతంలో మాట్లాడే ఫ్రెంచ్‌ భాషను నేర్చుకోవాల్సొచ్చింది.

బెల్జియంలో 1955లో 4,500 మంది ప్రచారకులు ఉండేవారు. నేను మావారితోపాటు దాదాపు 50 సంవత్సరాలు బెతెల్‌లో, ప్రయాణ సేవలో గడిపాను. ప్రయాణ సేవలోని మొదటి రెండున్నర సంవత్సరాలు మేము ఎండనక వాననక, కొండలు గుట్టలపైకి సైకిలుమీద ప్రయాణించేవాళ్లం. ఆ సేవలో ఉన్న సంవత్సరాల్లో మేము 2,000కన్నా ఎక్కువమంది సహోదరుల ఇళ్లలో గడిపాం. బలహీనంగా ఉన్నప్పటికీ తమ శక్తినంతా కూడగట్టుకుని యెహోవాను సేవించే సహోదర సహోదరీలను నేను తరచూ కలిసేదాన్ని. వారిని చూసి నేను కూడ యెహోవా సేవను విడిచిపెట్టకూడదని అనుకున్నాను. ప్రతీ సంఘ సందర్శన నుండి మేమెంతో ప్రోత్సాహాన్ని పొందేవాళ్లం. (రోమా. 1:​11, 12) ఆలెన్‌ నాకు జీవితమంతా తోడు​నీడగా ఉన్నాడు. ప్రసంగి 4:​9, 10లోని ఈ మాటల్లో ఎంతో నిజం ఉంది: “ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును.”

‘యెహోవా బలంతో’ ఆయనను సేవించడంవల్ల వచ్చిన ఆశీర్వాదాలు

ఎన్నో సంవత్సరాలు మేము ఇతరులు యెహోవాను సేవించేలా సహాయం చేసి ఎంతో ఆనందాన్ని పొందాం. మచ్చుకు ఒక సంఘటన చెబుతాను. మేము 1983లో ఆన్‌ట్వెర్ప్‌లోని ఫ్రెంచి భాషా సంఘాన్ని సందర్శించినప్పుడు ఒక సహోదరుని ఇంట్లో ఉన్నాం. మాతోపాటు జైరీ (ఇప్పుడు డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో) నుండి వచ్చిన బెన్జమిన్‌ బండివిలా అనే యౌవనస్థుడు కూడ వాళ్లింట్లోనే ఉన్నాడు. బెన్జమిన్‌ పైచదువుల కోసం బెల్జియంకు వచ్చాడు. ఆయన మాతో, “యెహోవా సేవకే పూర్తి జీవితాన్ని అంకితం చేసిన మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది” అన్నాడు. దానికి ఆలెన్‌, “నీకు మమ్మల్ని చూస్తే ఈర్ష్యగా ఉందంటూనే లోకంలో ఏదో సాధించాలని తాపత్రయపడుతున్నావు. నువ్వు ఇష్టపడే​దొకటి, నువ్వు చేసేది మరొకటి అని నీకు అనిపించడం లేదా?” అని అడిగాడు. అలా ఆలెన్‌ సూటిగా అడిగేసరికి బెన్జమిన్‌ తన జీవితాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆయన జైరీకి తిరిగి వెళ్లిన తర్వాత పయినీరు సేవ మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆయన అక్కడి బ్రాంచి కార్యాలయంలో బ్రాంచి కమీటీ సభ్యునిగా సేవచేస్తున్నాడు.

నా అన్నవాహికలో ఒక కంతి ఏర్పడితే 1999లో ఆపరేషన్‌ చేసి దాన్ని తీసేశారు. అప్పటినుండి నా బరువు 30 కేజీలకు తగ్గిపోయింది. నేనిప్పుడు బలహీన ‘మంటి ఘటంలా’ ఉన్నాను. అయినా యెహోవా నాకు ‘బలాధిక్యము’ ఇచ్చినందు నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞురాలిని. నాకు ఆపరేషన్‌ జరిగినా ఆలెన్‌తోపాటు ప్రయాణ సేవలో కొనసాగేలా ఆయనే సహాయం చేశాడు. (2 కొరిం. 4:⁠7) మార్చి 2004లో ఆలెన్‌ నిద్రలోనే కన్నుమూశాడు. నాకు ఆయనలేని లోటు ఎంతున్నా యెహోవా ఆయనను మరచిపోలేదన్న ఓదార్పు ఉంది.

నాకిప్పుడు 83 ఏళ్లు. 63 ఏళ్లు పూర్తికాల సేవ చేశాను. నేనిప్పటికీ పరిచర్యలో పాల్గొంటున్నాను, ఇంటిదగ్గర ఒక బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నాను, అవకాశం దొరికినప్పుడల్లా యెహోవా దేవుని అద్భుత సంకల్పాల గురించి మాట్లాడుతున్నాను. నేను 1945లో పయినీరు సేవ మొదలు​పెట్టి ఉండకపోతే ఇప్పటికి నా జీవితం ఎలా ఉండేదా అని కొన్నిసార్లు అనిపిస్తుంది. అప్పట్లో నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదనే కారణంతో నేను పయినీరు సేవ చేయలేనని అనగలిగేదాన్నే. కానీ నేను యౌవ్వనంలోనే పయినీరు సేవ మొదలుపెట్టగలిగినందుకు నేను దేవునికి ఋణపడివున్నాను. మనం యెహోవాకు మన జీవితాల్లో మొదటి స్థానాన్నిస్తే ఆయనే మన బలంగా ఉంటాడని నా సొంత అనుభవం నుండి తెలుసుకునే గొప్ప అవకాశం నాకు కలిగింది.

[అధస్సూచీలు]

^ పేరా 6 సాల్వేషన్‌ (ఆంగ్లం) 1939లో ప్రచురించబడింది. ఇప్పుడది ప్రచురించబడడం లేదు.

^ పేరా 22 సహోదరుడు కొవిల్‌ జీవిత కథ కావలికోట మార్చి 15, 1961లో ప్రచురించబడింది.

[18వ పేజీలోని చిత్రం]

నాతో మిషనరీ సేవ చేసిన ఆస్ట్రిడ్‌ ఆండర్‌సన్‌ (కుడివైపు)

[18వ పేజీలోని చిత్రం]

1956లో మేము ప్రయాణ సేవలో ఉన్నప్పుడు

[20వ పేజీలోని చిత్రం]

2000లో మావారితో