కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హృదయపూర్వక ప్రార్థనకు యెహోవా జవాబిస్తున్నాడు

హృదయపూర్వక ప్రార్థనకు యెహోవా జవాబిస్తున్నాడు

హృదయపూర్వక ప్రార్థనకు యెహోవా జవాబిస్తున్నాడు

“యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.” ​—⁠కీర్త. 83:⁠18.

కొన్ని సంవత్సరాల క్రితం, తన ఇంటిదగ్గర జరిగిన విషాద సంఘటన గురించి విన్న ఓ స్త్రీ ఎంతో కలవరపడింది. క్యాథలిక్‌ కుటుంబంలో పుట్టిన ఆమె దేవుడు దాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసుకునేందుకు స్థానిక పాదిరి దగ్గరకు వెళ్లింది. అయితే ఆయన ఆమెతో మాట్లాడడానికి కూడ ఇష్టపడలేదు. అందుకే, ఆమె దేవునికి “నువ్వు ఎవరివో నాకు తెలియదు గానీ . . . నువ్వున్నావని నాకు తెలుసు. నీ గురించి తెలుసుకునేందుకు నాకు సహాయం చెయ్యి” అని ప్రార్థించింది. కొన్ని రోజుల తర్వాత, యెహోవాసాక్షులు ఆమెను కలుసుకొని ఆమెకు కావాల్సిన ఓదార్పును, ఆమె ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. వారు ఎన్నో విషయాలు బోధించి, దేవుని పేరు యెహోవా అని కూడా నేర్పించారు. అది తెలుసుకొని ఆమె ఎంతో సంతోషపడింది. “నేను ఈ దేవుని గురించి తెలుసుకోవాలనే చిన్నప్పటి నుండి ఆశపడ్డాను!” అని ఆమె చెప్పింది.

2 ఆమెలాగే చాలామంది దేవుని నామం గురించి తెలుసుకున్నప్పుడు సంతోషించారు. సాధారణంగా, బైబిల్లో కీర్తనలు 83:⁠18 చదువుతున్నప్పుడు వారు యెహోవా పేరు మొదటిసారి చూస్తారు. మన బైబిల్లో ఆ వచనం ఇలా ఉంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు​గాక.” అయితే, 83వ కీర్తన అసలు ఎందుకు రాయ​బడిందో మీరెప్పుడైనా ఆలోచించారా? యెహోవాయే సత్యదేవుడు అని ప్రతీ ఒక్కరూ ఒప్పుకునేలా ఏ సంఘటనలు జరుగుతాయి? నేడు మనం ఆ కీర్తననుండి ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? ఆ ప్రశ్నలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. *

యెహోవా ప్రజలపై కుట్ర

3 ఎనభై మూడవ కీర్తన పైవిలాసం చూస్తే, అది “ఆసాపు కీర్తన” అని తెలుస్తుంది. ఈ కీర్తనకర్త దావీదు రాజు పరిపాలనలో ప్రముఖ సంగీత విద్వాంసునిగా ఉన్న లేవీయుడైన ఆసాపు వంశీయుడుకావచ్చు. ఈ కీర్తనలో ఆయన, యెహోవా తన సర్వాధిపత్యాన్ని నిరూపించు​కునేలా, తన పేరు అందరికీ తెలిసేలా చర్య తీసుకోమని దేవుణ్ణి వేడుకున్నాడు. 83 కీర్తన సొలొమోను మరణించిన కొంతకాలానికి రచించబడివుండవచ్చు. అలా అనడానికి కారణమేమిటి? ఎందుకంటే, దావీదు, సొలొమోనుల పరిపాలనా కాలాల్లో తూరు రాజు ఇశ్రాయేలీయులతో స్నేహంగా ఉండేవాడు. ఈ కీర్తన రచించబడే సమయానికి తూరువాసులు ఇశ్రాయేలీయులకు విరోధులై శత్రువులతో చేతులు కలిపారు.

4 దేవుని ప్రజలను నాశనంచేయడానికి కుట్రపన్నిన పది జనాంగాలను కీర్తనకర్త పేర్కొన్నాడు. ఆ శత్రువులు ఇశ్రాయేలు చుట్టూ ఉండేవారు, వారు ‘గుడారపువాసులైన ఎదోమీయులు ఇష్మాయేలీయులు మోయాబీయులు హగ్రీయీలు గెబలువారు అమ్మోనీయులు అమాలేకీయులు ఫిలిష్తీయులు తూరు నివాసులు. వారితో అష్షూరు దేశస్థులు కూడా కలిశారు.’ (కీర్త. 83:​6-8) చరిత్రలో జరిగిన ఏ సంఘటన గురించి ఈ కీర్తన చెబుతోంది? యెహోషాపాతు పరిపాలనలో అమ్మోను, మోయాబు, శేయీరు మన్యవాసుల సంకీర్ణ సేన ఇశ్రాయేలుపై దాడిచేసిన సంఘటన గురించి చెబుతోందని కొందరు అంటారు. (2 దిన. 20:​1-26) ఇశ్రాయేలీయులు వారి చరిత్రంతటిలో ఇరుగుపొరుగు దేశాల నుండి ఎదుర్కొన్న వ్యతిరేకత గురించి ఈ కీర్తన మాట్లాడుతుందని మరికొందరు అనుకుంటున్నారు.

5 ఏదేమైనా, ఇశ్రాయేలీయులు ప్రమాదంలో ఉన్న​ప్పుడు యెహోవా దేవుడు ఈ కీర్తనను రాయించాడని మనకు తెలుస్తోంది. ఈ కీర్తన నేడు దేవుని సేవకులకు కూడ ప్రోత్సాహకరంగా ఉంది. ఎందుకంటే వారిని నాశనం చేయాలనే ఉద్దేశంతో శత్రువులు వారిపై నిత్యం దాడిచేస్తూనే ఉన్నారు. అంతేకాదు దేవుణ్ణి ఆత్మతో, సత్యంతో ఆరాధించేవారందరినీ నాశనం చేసేందుకు భవిష్యత్తులో మాగోగువాడైన గోగు చివరి దాడి చేయడానికి తన దళాలను సిద్ధపరచినప్పుడు కూడ ఆ కీర్తన మనల్ని ఖచ్చితంగా బలపరుస్తుంది.​యెహెజ్కేలు 38:​2, 8, 9, 16 చదవండి.

కీర్తనకర్త దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు?

6 కీర్తనకర్త తన భావాలను ఎలా వ్యక్తం చేస్తున్నాడో చూడండి: “దేవా, ఊరకుండకుము. దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరిచేయుచున్నారు. నిన్ను ద్వేషించువారు తల యెత్తి యున్నారు. నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్నుచున్నారు . . . ఏకమనస్సుతో వారు ఆలోచన చేసికొనియున్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు.”​—⁠కీర్త. 83:​1-3, 5.

7 కీర్తనకర్త దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు? ఆయన తన క్షేమం గురించి, తన కుటుంబ క్షేమం గురించి ఆందోళనపడివుంటాడు అనడంలో సందేహం లేదు. అయినా, యెహోవా నామంపై వస్తున్న అపకీర్తి గురించి, యెహోవా ప్రజలని పిలవబడిన జనాంగంపై వస్తున్న బెదిరింపుల గురించే ఆయన ప్రార్థించాడు. ఈ పాత లోకంలోని చివరిరోజుల్లో ఎదురయ్యే కష్టాలను సహిస్తుండగా మనం కూడా ఆయనలాగే యెహోవా నామానికే ఎక్కువ ప్రాముఖ్యతనిద్దాం.​—⁠మత్తయి 6:​9, 10 చదవండి.

8 ఇశ్రాయేలీయుల శత్రువులు, “ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండి” అని చెప్పుకున్నారని కీర్తన​కర్త రాశాడు. (కీర్త. 83:⁠4) దేవుడు ఎన్నుకున్న ప్రజలను ఆ జనంగాలు ఎంతగా ద్వేషించాయి! వారు కుట్రపన్నడానికి మరో కారణం కూడా ఉంది. వారు ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకోవాలని ఆశించి, “దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించుకొందము” అని గర్వంగా చెప్పుకున్నారు. (కీర్త. 83:​12) మన రోజుల్లో కూడా ఇలా జరుగుతోందా? అవును, జరుగుతోంది!

“నీ పవిత్ర నివాసస్థలం”

9 పూర్వం వాగ్దానదేశం దేవుని పవిత్ర నివాసస్థలమని పిలవబడేది. ఐగుప్తునుండి విడుదల చేయబడిన తర్వాత ఇశ్రాయేలీయులు పాడిన విజయగీతాన్ని గుర్తుచేసుకోండి: “నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు [‘పవిత్ర నివాసస్థలానికి,’ పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం] నడిపించితివి.” (నిర్గ. 15:​13) ఆ తర్వాత ఆ “నివాసస్థలం”లో యాజకులు సేవచేసే దేవాలయం, రాజధాని పట్టణమైన యెరూషలేము ఉండేవి. యెహోవా సింహాసనంపైన కూర్చున్న దావీదు వంశీయులు అక్కడినుండి పరిపాలించేవారు. (1 దిన. 29:​23) అందుకే, యేసు యెరూషలేమును “మహారాజు పట్టణము” అని పిలిచాడు.​—⁠మత్త. 5:⁠35.

10 మన కాలం విషయమేమిటి? సా.శ. 33లో “దేవుని ఇశ్రాయేలు” అనే కొత్త జనాంగం ఉనికిలోకి వచ్చింది. (గల. 6:​16) ఆ జనాంగం యేసుక్రీస్తు అభిషిక్త సహోదరులు. వారు దేవుని సాక్షులుగా ఉండడం ద్వారా శారీరక ఇశ్రాయేలీయులు చేయలేనిదాన్ని చేశారు. (యెష. 43:​10; 1 పేతు. 2:⁠9) “నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు” అని ప్రాచీన ఇశ్రాయేలుతో చేసిన వాగ్దానాన్నే యెహోవా వారికి కూడ చేశాడు. (2 కొరిం. 6:​16-18; లేవీ. 26:​11, 12) “దేవుని ఇశ్రాయేలు”లోని శేషించినవారితో యెహోవా 1919లో ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. వారు ఆ సమయంలో ఒక ‘దేశాన్ని’ స్వతంత్రించుకున్నారు. ఆ ‘దేశం’ ఆధ్యాత్మిక కార్యకలాపాలను సూచిస్తుంది. వాటిలో పాల్గొంటూ వారు ఆధ్యాత్మిక పరదైసును ఆస్వాదించారు. (యెష. 66:⁠8) 1930ల నుండి లక్షలాదిమంది “వేరే గొఱ్ఱెలు” కూడ వారితో కలిసి పనిచేస్తున్నారు. (యోహా. 10:​16) ఈ ఆధునిక క్రైస్తవులు ఆధ్యాత్మిక సమృద్ధితో సంతోషంగా ఉండడాన్నిబట్టి యెహోవా సర్వాధిపత్యమే సరైనదని బలంగా రుజువౌతుంది. (కీర్తనలు 91:​1, 2 చదవండి.) అది సాతానుకు ఎంతగా ఆగ్రహం కలిగిస్తుందో కదా?

11 ఈ అంత్యదినాలు ముగిసేవరకు అభిషిక్త శేషాన్ని, వారి సహచరులైన వేరేగొర్రెలను వ్యతిరేకించేందుకు సాతాను భూమ్మీదున్న తన ప్రతినిధులను ఉసిగొల్పుతున్నాడు. ఉదాహరణకు, నాజీ పరిపాలనలోని పశ్చిమ ఐరోపాలో, సోవియట్‌ యూనియన్‌లోని కమ్యూనిస్టు పరిపాలన కింద తూర్పు ఐరోపాలో సాక్షులు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అనేక ఇతర దేశాల్లో కూడ వారు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు, భవిష్యత్తులోనూ మరి ముఖ్యంగా మాగోగువాడైన గోగు చేసే చివరి దాడిలో వారు వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఆ దాడిలో వ్యతిరేకులు, గతంలోలాగే యెహోవా ప్రజల ఆస్తులను, వస్తువులను దురాశతో స్వాధీనం చేసుకోవచ్చు. అయితే, “యెహోవాసాక్షులు” అనే పేరు మళ్లీ వినిపించకూడదనే ఉద్దేశంతో ఒక సమూహంగా మనల్ని నాశనం చేసేందుకే సాతాను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉన్నాడు. తన సర్వాధిపత్యాన్ని ధిక్కరిస్తున్నవారిని యెహోవా ఏమి చేస్తాడు? కీర్తనకర్త మాటలను మళ్లీ పరిశీలించండి.

యెహోవా విజయం సాధిస్తాడనడానికి ఉదాహరణలు

12 శత్రు జనాంగాల పన్నాగాలను నిర్వీర్యం చేసే సామర్థ్యం యెహోవాకు ఉందని కీర్తనకర్త ఎంతగా నమ్మాడో చూడండి. ప్రాచీన మెగిద్దో పట్టణంలో ఇశ్రాయేలీయులు తమ శత్రువులపై సాధించిన రెండు అపూర్వ విజయాలను ఆయన వివరించాడు. ఆ పట్టణం పక్కనే అదే పేరుతో లోయ ప్రాంతం ఉండేది. ఈ పట్టణం ఆ లోయ ప్రాంతానికి ఎంతో ఎత్తులో ఉండేది. వేసవి​కాలంలో కిషోను వాగు ఎండిపోయినా ఆ లోయ ప్రాంతంలో అది పారే మార్గం కనిపిస్తుంది. శీతాకాలంలో వర్షాలు కురిసినప్పుడు ఆ వాగు నీటితో లోయంతా వరదమయమయ్యేది. అందుకే బహుశా ఆ నదిని “మెగిద్దో కాలువలు” అని కూడ పిలిచేవారు.​—⁠న్యాయా. 4:​13; 5:⁠19.

13 మెగిద్దో లోయ గుండా దాదాపు 15 కి.మీ. ప్రయాణిస్తే మోరే పర్వతం వస్తుంది. అక్కడ న్యాయాధిపతియైన గిద్యోను కాలంలో మిద్యానీయుల అమాలేకీయుల తూర్పువారి సంకీర్ణ దళాలు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి సమకూడాయి. (న్యాయా. 7:​1, 12) గిద్యోను దగ్గర కేవలం 300 మందే ఉన్నా యెహోవా సహాయంతో అంత పెద్ద శత్రు సైన్యాన్ని ఓడించాడు. ఎలా? దేవుని నిర్దేశానుసారం వారు కుండలలో దివిటీలు పెట్టుకొని రాత్రిపూట శత్రుశిబిరాన్ని చుట్టుముట్టారు. గిద్యోను సంకేతం ఇచ్చినప్పుడు ఆయన మనుష్యులు కుండలు పగులగొట్టి దివిటీలను బయటికి తీశారు. అదే సమయంలో వారు బూరలూది “యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము” అని కేకలువేశారు. దానితో శత్రువులు తికమకపడి ఒకరినొకరు చంపుకున్నారు. బ్రతికున్నవారు యొర్దాను నది దాటి అవతలివైపుకు పారిపోయారు. అప్పుడు ఇతర ఇశ్రాయేలీయులు కూడా వారితోపాటు శత్రువులను వెంటాడారు. మొత్తం 1,20,000 మంది శత్రువులు చంపబడ్డారు.​—⁠న్యాయా. 7:​19-25; 8:⁠10.

14 మోరే పర్వతానికి దాదాపు 6 కి.మీ. దూరంలో తాబోరు పర్వతం ఉంది. గతంలో న్యాయాధిపతియైన బారాకు హాసోరు రాజైన యాబీను సైన్యాన్ని ఎదుర్కొనేందుకు 10,000 మంది ఇశ్రాయేలీయులను సమకూర్చాడు. యాబీను సైన్యానికి సీసెరా సైన్యాధిపతిగా ఉండేవాడు. కనాను సైనికులకు 900 యుద్ధ రథాలుండేవి, ఆ రథ చక్రాలకు వాటితోపాటు తిరిగే ప్రాణాంతకమైన పెద్ద ఇరుసులుండేవి. ఎలాంటి యుద్ధ సామగ్రిలేని ఇశ్రాయేలీయులు తాబోరు పర్వతం దగ్గర సమకూడారు. ఇశ్రాయేలీయులను ఓడించగలమనే ధీమాతో సీసెరా సైన్యం లోయలోకి దిగింది. అప్పుడు ‘యెహోవా సీసెరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరిచాడు.’ బహుశా కుండపోతగా వర్షం కురిసి కీషోను వాగు పొంగిపొర్లడంతో రథాలు బురదలో కూరుకుపోయుండొచ్చు. అప్పుడు ఇశ్రాయేలీయులు కనాను సైనికులందరినీ చంపారు.​—⁠న్యాయా. 4:​13-16; 5:​19-21.

15 పూర్వం ఇశ్రాయేలీయులను నాశనం చేయడానికి ప్రయత్నించిన జనాంగాలకు బుద్ధిచెప్పినట్లే ఇప్పుడు కూడా బుద్ధిచెప్పమని కీర్తనకర్త యెహోవాను వేడుకున్నాడు. ఆయన ఇలా ప్రార్థించాడు: “మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము. వారు ఏన్దోరులో నశించిరి. భూమికి పెంట అయిరి.” (కీర్త. 83:​9, 10) గమనార్హ మైన విషయం ఏమిటంటే, దేవుడు సాతాను లోకంతో చేసే ఆఖరి యుద్ధం హార్‌మెగిద్దోను (అంటే “మెగిద్దో పర్వతం”) అని పిలవబడింది. ఆ పేరు విన్నప్పుడు మనకు మెగిద్దో దగ్గర జరిగిన అపూర్వ విజయాలు గుర్తుకొస్తాయి. ఆ యుద్ధాల్లో యెహోవా విజయం సాధించాడు కాబట్టి హార్‌మెగిద్దోనులో కూడ ఖచ్చితంగా విజయం సాధిస్తాడనే నమ్మకం మనకు కలుగుతుంది.​—⁠ప్రక. 16:​13-16.

యెహోవా సర్వాధిపత్యం సరైనదని నిరూపించబడాలని ప్రార్థించాలి

16 ఈ ‘అంత్యదినాల్లో’ తన ప్రజలను సమూలంగా నాశనం చేయడానికి శత్రువులు చేసిన ప్రయత్నాలన్నిటినీ యెహోవా వమ్ముచేశాడు. (2 తిమో. 3:⁠1) దానివల్ల వ్యతిరేకులు అవమానపరచబడ్డారు. వ్యతిరేకులకు అలా జరుగుతుందని కీర్తనలు 83:⁠16 ముందే చెప్పింది: “యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము.” అనేక దేశాల్లో యెహోవాసాక్షుల ప్రకటనా పనిని ఆపుచేయడానికి వ్యతిరేకులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఆ దేశాల్లో ఏకైక సత్యదేవుని ఆరాధకుల విశ్వసనీయతా సహనాలను యథార్థహృదయులు గమనించారు. వారిలో చాలామంది ‘యెహోవా నామం కోసం వెదికారు.’ ఒకప్పుడు యెహోవాసాక్షులు క్రూరంగా హింసించబడిన దేశాల్లో ఇప్పుడు యెహోవాను సంతోషంగా స్తుతిస్తున్న వేవేలకొలది సాక్షులున్నారు. అది యెహోవాకు ఎంత గొప్ప విజయం! ఆయన శత్రువులకు ఎంతటి అవమానం!​—⁠యిర్మీయా 1:⁠19 చదవండి.

17 వ్యతిరేకులు మనల్ని హింసించడం మానరని మనకు తెలుసు. అయినా, మనం సువార్త ప్రకటిస్తూనే ఉంటాం, చివరకు వ్యతిరేకులకు కూడ ప్రకటిస్తాం. (మత్త. 24:​14, 21) అయితే, త్వరలో వారికి పశ్చాత్తాపపడి రక్షణ​పొందే అవకాశం ఇక లభించదు. మానవులు రక్షించ​బడడంకన్నా యెహోవా నామం పరిశుద్ధపరచబడడం ఎంతో ప్రాముఖ్యం. (యెహెజ్కేలు 38:⁠23 చదవండి.) ప్రవచించబడినట్లుగా, దేవుని ప్రజలను నాశనంచేయడానికి దేశాలన్నీ సమకూడినప్పుడు మనం కీర్తనకర్త ప్రార్థనలోని ఈ మాటలను గుర్తుచేసుకుంటాం: “వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక వారు భ్రమసి నశించుదురు గాక.”​—⁠కీర్త. 83:⁠17.

18 పట్టుదలతో యెహోవా సర్వాధిపత్యాన్ని వ్యతిరేకించేవారు అవమానకరంగా నాశనంచేయబడతారు. “సువార్తకు లోబడనివారు” హార్‌మెగిద్దోనులో తీర్పుతీర్చబడతారు, అంటే “నిత్యనాశనమను దండన” పొందుతారని బైబిలు చెబుతోంది. (2 థెస్స. 1:​6-10) వారు నాశనం​చేయబడడం ద్వారా, యెహోవా ఆరాధకులు రక్షించబడడం ద్వారా యెహోవాయే సత్యదేవుడని తిరుగులేని విధంగా రుజువౌతుంది. నూతనలోకంలో కూడా ప్రజలు ఆ గొప్ప విజయాన్ని గుర్తుంచుకుంటారు. ‘నీతిమంతులు అనీతిమంతులు పునరుత్థానం’ చేయబడినప్పుడు యెహోవా గొప్ప కార్యం గురించి తెలుసుకుంటారు. (అపొ. 24:​14) యెహోవా సర్వాధిపత్యం కింద జీవించడం ఎంత జ్ఞానయుక్తమో గ్రహించడానికి కావాల్సినన్ని రుజువులను నూతనలోకంలో వారు చూస్తారు. వారిలో దీనులు యెహోవాయే సత్యదేవుడని వెంటనే గ్రహిస్తారు.

19 ప్రేమగల మన పరలోక తండ్రి నమ్మకస్థులైన తన ఆరాధకుల కోసం ఎంత అద్భుతమైన భవిష్యత్తును సిద్ధంచేశాడు! దేవుని శత్రువులు “నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక వారు భ్రమసి నశించుదురు గాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక” అని కీర్తనకర్త ప్రార్థించాడు. దానికి యెహోవా త్వరలోనే తిరుగులేని జవాబు ఇవ్వాలని మీకు ప్రార్థించాలనిపించడంలేదా?​—⁠కీర్త. 83:​17, 18.

[అధస్సూచి]

^ పేరా 4 మీరు ఈ ఆర్టికల్‌ను పరిశీలించే ముందు 83వ కీర్తనలో ఏముందో చదివి తెలుసుకుంటే మంచిది.

మీరు వివరించగలరా?

83వ కీర్తన రాయబడే సమయంలో ఇశ్రాయేలులో ఎలాంటి పరిస్థితులున్నాయి?

కీర్తనకర్త దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు?

సాతాను నేడు ఎవరిని శత్రువులుగా భావించి హింసిస్తున్నాడు?

కీర్తన 83:18లో కీర్తనకర్త చేసిన ప్రార్థనకు యెహోవా ఎలా తిరుగులేని విధంగా జవాబిస్తాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. దేవుని నామం తెలుసుకున్నప్పుడు చాలామందికి ఎలా అనిపించింది? ఏ ప్రశ్నలు తలెత్తవచ్చు?

3, 4. ఎవరు 83వ కీర్తనను రచించారు? ఇశ్రాయేలీయులకు ఎలాంటి ప్రమాదముందని ఆయన అక్కడ వివరించాడు?

5. నేడు క్రైస్తవులకు 83వ కీర్తన ఎలా సహాయం చేస్తుంది?

6, 7. (ఎ) 83వ కీర్తన ప్రారంభంలో కీర్తనకర్త దేని గురించి ప్రార్థించాడు? (బి) కీర్తనకర్త దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు?

8. ఇశ్రాయేలీయులపై జనాంగాలు ఎందుకు కుట్రపన్నాయి?

9, 10. (ఎ) పూర్వం దేనిని దేవుని పవిత్ర నివాసస్థలమని పిలిచేవారు? (బి) నేడు అభిషిక్త క్రైస్తవులు, “వేరే గొఱ్ఱెలు” ఎలాంటి ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారు?

11. దేవుని శత్రువులు ఎల్లప్పుడూ ఏమి చేయాలని ప్రయత్నిస్తున్నారు?

12-14. మెగిద్దో పట్టణం దగ్గర్లో ఇశ్రాయేలీయులు సాధించిన ఏ రెండు అపూర్వ విజయాల గురించి కీర్తనకర్త రాశాడు?

15. (ఎ) యెహోవా ఏమి చేయాలని కీర్తనకర్త ప్రార్థించాడు? (బి) దేవుని ఆఖరి యుద్ధం పేరు విన్నప్పుడు మనకు ఏమి గుర్తుకొస్తుంది?

16. నేడు వ్యతిరేకులు ఎలా ‘పూర్ణంగా అవమానించబడ్డారు’?

17. మానవులకు త్వరలో ఏ అవకాశం ఇక లభించదు? మనం త్వరలో ఏ మాటలను గుర్తుచేసుకుంటాం?

18, 19. (ఎ) యెహోవా సర్వాధిపత్యాన్ని మొండిగా వ్యతిరేకిస్తున్నవారికి ఏమౌతుంది? (బి) యెహోవా సర్వాధిపత్యం సరైనదని తిరుగులేని విధంగా నిరూపించబడే కాలం దగ్గరయ్యేకొద్దీ మీకు ఏమి చేయాలనిపిస్తుంది?

[15వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ప్రాచీన మెగిద్దో దగ్గర జరిగిన యుద్ధాలు మన భవిష్యత్తు గురించి ఏమి తెలియజేస్తున్నాయి?

కిషోను వాగు

హరోషెతు

కర్మెలు పర్వతం

యెజ్రెయేలు లోయ

మెగిద్దో

తానాకు

గిల్బోవ పర్వతం

హరోదు బావి

మోరే పర్వతం

ఏన్దోరు

తాబోరు పర్వతం

గలిలయ సముద్రం

యొర్దాను నది

[12వ పేజీలోని చిత్రం]

కీర్తనకర్త హృదయపూర్వకంగా ప్రార్థించడానికి కారణమేమిటి?