కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసులా ‘అపవాదిని ఎదిరించండి’

యేసులా ‘అపవాదిని ఎదిరించండి’

యేసులా ‘అపవాదిని ఎదిరించండి’

“అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.”​—⁠యాకో. 4:⁠7.

అపవాది తనను వ్యతిరేకిస్తాడని యేసుక్రీస్తుకు ముందే తెలుసు. దేవుడు సర్పంతో అన్న మాటలనుబట్టి ఆయనా విషయం తెలుసుకున్నాడు. నిజానికి ఆ సర్పాన్ని ఉపయోగించి మాట్లాడింది తిరుగుబాటుదారుడు, దుష్టుడు అయిన ఆత్మప్రాణి. అతణ్ణి ఉద్దేశించే దేవుడిలా అన్నాడు: “నీకును స్త్రీకిని [యెహోవా సంస్థలోని పరలోక భాగం] నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది [యేసు] నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.” (ఆది. 3:​14, 15; ప్రక. 12:⁠9) యేసు మడిమె మీద కొట్టబడతాడు అంటే ఆయన ఈ భూమ్మీద ఉన్నప్పుడు చంపబడతాడని అర్థం. కానీ ఆయన జీవితం అంతటితో ముగిసిపోలేదు. ఎందుకంటే యెహోవా ఆయనను పరలోకానికి పునరుత్థానం చేసి మహిమపరుస్తాడు. అయితే సర్పం తలమీద కొట్టబడుతుంది అంటే అపవాది కోలుకోలేనంతగా చావుదెబ్బ తింటాడు.​—⁠అపొస్తలుల కార్యములు 2:​31, 32; హెబ్రీయులు 2:⁠14 చదవండి.

2 యేసు భూమ్మీద ఉన్నప్పుడు తనకివ్వబడిన పనిని పూర్తిచేస్తాడని, అపవాదిని ఎదిరిస్తాడని యెహోవా పూర్తిగా నమ్మాడు. యెహోవాకు యేసుమీద ఎందుకంత నమ్మకం ఉంది? ఎందుకంటే ఆయన ఎన్నో యుగాల క్రితం యేసును పరలోకంలో సృష్టించి, ఆయనను ఎంతోకాలం గమనించాడు. “ప్రధానశిల్పి,” “సర్వసృష్టికి ఆదిసంభూతుడు” అయిన యేసు విధేయునిగా, నమ్మకస్థునిగా ఉంటాడని దేవునికి తెలుసు. (సామె. 8:​22-31; కొలొ. 1:​15) కాబట్టి తన అద్వితీయ కుమారుడు ఖచ్చితంగా విజయం సాధిస్తాడనే నమ్మకంతోనే దేవుడు యేసును భూమ్మీదకు పంపించాడు. ఆ నమ్మకంతోనే యేసు చనిపోయేంత​వరకు అపవాది ఆయనను శోధించేందుకు అనుమతించాడు.​—⁠యోహా. 3:⁠16.

యెహోవా తన సేవకులను సంరక్షిస్తాడు

3 యేసు అపవాదిని “లోకాధికారి” అని పిలిచాడు. తనలాగే తన శిష్యులు కూడ హింసించబడతారని వారిని హెచ్చరించాడు. (యోహా. 12:​31; 15:​20) నిజ క్రైస్తవులు యెహోవాను సేవిస్తారు, నీతిని ప్రకటిస్తారు కాబట్టి అపవాదియైన సాతాను అధీనంలో ఉన్న ఈ లోకం వారిని ద్వేషిస్తుంది. (మత్త. 24:⁠9; 1 యోహా. 5:​19) అపవాది ముఖ్యంగా క్రీస్తుతోపాటు పరలోక రాజ్యంలో పరిపాలించబోయే అభిషిక్త శేషాన్నే లక్ష్యంగా పెట్టుకున్నాడు. పరదైసు భూమ్మీద జీవించాలనుకుంటున్న అనేకమంది ఇతర సాక్షులను కూడ ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. “మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తోంది.​—⁠1 పేతు. 5:⁠8.

4 యెహోవా దేవుని సహాయసహకారాలు పొందుతున్న ఒక సంస్థగా మనం అపవాదిని సమర్థంగా ఎదిరిస్తున్నాం. దాన్ని రుజువుచేసే ఈ విషయాలను పరీశీలించండి. గత 100 సంవత్సరాల్లో కొంతమంది క్రూరులైన నియంతలు యెహోవాసాక్షులను రూపుమాపడానికి ప్రయత్నించారు. కానీ అలా జరగకపోగా మన సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,00,000కన్నా ఎక్కువ సంఘాల్లో దాదాపు 70,00,000 మంది సాక్షులున్నారు. యెహోవా సేవకులను హింసించిన ఆ నియంతలే ఇప్పుడు నామరూపాల్లేకుండా పోయారు!

5 ప్రాచీన ఇశ్రాయేలుకు దేవుడు ఇలా వాగ్దానం చేశాడు: “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు. న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతివానికి నీవు నేరప్థాపన చేసెదవు. యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము.” (యెష. 54:​11, 17) ఈ “అంత్యదినములలో” ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా ప్రజల విషయంలో కూడ ఆ వాగ్దానం నెరవేరుతోంది. (2 తిమో. 3:​1-5, 13) మనం ఇప్పటికీ అపవాదిని ఎదిరిస్తూనే ఉన్నాం. యెహోవా మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనల్ని సమూలంగా నాశనం చేసేందుకు అతడు ప్రయోగించే ఏ ఆయుధమూ పనిచేయదు.​—⁠కీర్త. 118:​6, 7.

6 త్వరలోనే ఈ దుష్ట విధానం నాశనమైనప్పుడు సాతాను పరిపాలనా వ్యవస్థకు సంబంధించినవన్నీ పూర్తిగా తుడిచివేయబడతాయి. దైవ ప్రేరణతో దానియేలు ప్రవక్త ఇలా ప్రవచించాడు: “ఆ రాజుల [ఇప్పుడున్న రాజుల] కాలములలో పరలోకమందున్న దేవుడు [పరలోకంలో] ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన [ఇప్పుడున్న] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” (దాని. 2:​44) అది జరిగినప్పుడు సాతాను పరిపాలన, అపరిపూర్ణ మానవుల పరిపాలన ఇక ఉండదు. అపవాది వ్యవస్థకు సంబంధించినవన్నీ పూర్తిగా నాశనం చేయబడతాయి. దేవుని రాజ్యాన్ని వ్యతిరేకించేవారెవరూ ఇక ఉండరు. అది ఈ భూమ్మీద నిత్యం పరిపాలిస్తుంది.​—⁠2 పేతురు 3:​7, 13 చదవండి.

7 యెహోవా తన సంస్థను కాపాడుతూ, ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. (కీర్తనలు 125:​1, 2 చదవండి.) మరి మన విషయమేమిటి? మనం కూడ యేసులాగే అపవాదిని సమర్థంగా ఎదిరించగలమని బైబిలు చెబుతోంది. నిజానికి సాతాను ఎంత హింసించినా భూనిరీక్షణగల ఒక “గొప్పసమూహము” ఈ లోకనాశనాన్ని తప్పించుకుంటుందని క్రీస్తునుండి పొందిన ప్రవచనంలో అపొస్తలుడైన యెహాను పేర్కొన్నాడు. వారు “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును [యేసుక్రీస్తుకు] మా రక్షణకై స్తోత్రమని” ఎలుగెత్తి పాడతారని లేఖనాలు చెబుతున్నాయి. (ప్రక. 7:​9-14) అభిషిక్త క్రైస్తవులు సాతానును జయిస్తారని కూడ దానిలో చెప్పబడింది. వారి సహచరులైన “వేరే గొఱ్ఱెలు” కూడ సమర్థంగా అపవాదిని ఎదిరిస్తారు. (యోహా. 10:​16; ప్రక. 12:​10, 11) అయితే, అలా చేయాలంటే మనం ఎంతో కృషిచేయాలి, ‘దుష్టుని నుండి తప్పించమని’ హృదయపూర్వకంగా ప్రార్థించాలి.​—⁠మత్త. 6:⁠13.

అపవాదిని ఎదిరించే విషయంలో అత్యుత్తమ మాదిరి

8 యేసుకు దేవునిపట్ల ఉన్న యథార్థతను పాడుచేయడానికి అపవాది ప్రయత్నించాడు. యేసును యెహోవాకు అవిధేయునిగా మార్చేందుకు సాతాను ఆయనను అరణ్యంలో శోధించాడు. అయితే సాతానును ఎదిరించే విషయంలో యేసు అత్యుత్తమ మాదిరినుంచాడు. నలభై దినాలు, నలభై రాత్రులు ఉపవాసమున్న తర్వాత యేసుకు బాగా ఆకలేసివుంటుంది. సాతాను యేసుతో, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము” అని సవాలుచేశాడు. అయితే యేసు, దేవుడు తనకిచ్చిన శక్తిని స్వార్థం కోసం ఉపయోగించనని చెబుతూ, “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నది” అని జవాబిచ్చాడు.​—⁠మత్త. 4:​1-4; ద్వితీ. 8:⁠3.

9 నేడు కూడ అపవాది యెహోవా సేవకుల్లో ఉండే సహజమైన కోరికలను ఆసరాగా తీసుకుని వారిని శోధించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ అనైతిక లోకంలో సర్వ​సామాన్యమైనవిగా పరిగణించబడుతున్న తుచ్ఛమైన లైంగిక కోరికలు మనలో కలుగకుండా చూసుకోవాలనే కృతనిశ్చయంతో ఉందాం. దేవుని వాక్యం ఖరాకండిగా ఇలా చెబుతోంది: “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను . . . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” (1 కొరిం. 6:​9, 10) కాబట్టి అనైతికంగా జీవిస్తూ, తమ పద్ధతులను మార్చుకోవడానికి ఇష్టపడని వారెవరూ దేవుని నూతనలోకంలోకి వెళ్లరు.

10 అరణ్యంలో యేసు ఎదుర్కొన్న మరో శోధన గురించి లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి​—⁠నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము​—⁠ఆయన నిన్నుగూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నది.” (మత్త. 4:​5, 6) ఒకవేళ యేసు అలా చేసివుంటే ఆయనే మెస్సీయ అని అద్భుత రీతిలో నిరూపించుకుని ఉండేవాడు. కానీ అలా చేయడం సరైనది కాదు, అలా చేస్తే గర్వంగా ప్రవర్తించినట్లే అవుతుంది. దేవుడు దాన్ని ఇష్టపడడు సరికదా సహాయం కూడ చేసివుండేవాడు కాదు. ఈసారి కూడ యేసు యెహోవాకు యథార్థంగా ఉంటూ లేఖనాలనుండి సాతానుకు జవాబిచ్చాడు. “ప్రభువైన నీ దేవుని [యెహోవాను] నీవు శోధింపవలదని” లేదా పరీక్షించకూడదని చెప్పాడు.​—⁠మత్త. 4:⁠7; ద్వితీ. 6:⁠16.

11 మనం యెహోవాను పరీక్షించేలా సాతాను మనల్ని శోధించవచ్చు. ఎలా? లోక ఆమోదాన్ని పొందడానికి ప్రయత్నించేలా సాతాను మనల్ని శోధించవచ్చు. ఈ లోక ప్రజల వస్త్రధారణను, కనబడే తీరును అనుకరించేలా, క్రైస్తవులకు తగని వినోదాన్ని చూసేలా ప్రోత్సహిస్తాడు. కానీ మనం బైబిలు చెప్పేది పట్టించుకోకుండా లోక ప్రజలను అనుకరించడంవల్ల చెడు పర్యవసానాలు ఎదుర్కోవాల్సివస్తే దూతలు మనల్ని రక్షిస్తారని అనుకోవచ్చా? దావీదు రాజు బత్షెబతో పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపపడినా దాని పర్యవసానాలను తప్పించుకోలేకపోయాడు. (2 సమూ. 12:​9-12) బహుశా మనం లోకంతో స్నేహం చేస్తే దేవుణ్ణి పరీక్షించే ప్రమాదముంది. అందుకే, యెహోవాకు ఇష్టంలేని పనులు చేసి ఆయనను పరీక్షించకుండా ఉందాం.​—⁠యాకోబు 4:⁠4; 1 యోహాను 2:​15-17 చదవండి.

12 అరణ్యంలో అపవాది యేసును మరోసారి శోధించాడు. అతడు యేసుకు రాజ్యాధికారాన్ని ఇవ్వజూపాడు. సాతాను యేసుకు భూమ్మీదున్న రాజ్యాలను, వాటి వైభవాన్ని చూపించి, “నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదను” అని చెప్పాడు. (మత్త. 4:​8, 9) యెహోవాకు చెందాల్సిన ఆరాధనను పొందడానికి, యేసు యథార్థతను పాడుచేయడానికి సాతాను ఎంతటి నీచానికి ఒడిగట్టాడు! ఒకప్పుడు నమ్మకంగా ఉన్న ఆ దూత ఇతరులు తనను ఆరాధించాలనే కోరికను పెంచుకుని అత్యాశతో పాపం చేశాడు. అలా వాడు ఇతరులను శోధించి హానిచేసే అపవాదియైన సాతానుగా మారాడు. (యాకో. 1:​14, 15) అయితే ఈ విషయంలో యేసుకు, సాతానుకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. తన పరలోక తండ్రికి నమ్మకంగా ఉండాలనే కృతనిశ్చయంతో యేసు, “సాతానా, పొమ్ము​—⁠ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను” అని అన్నాడు. అలా యేసు ఈసారి కూడ అపవాదిని ముక్కుసూటిగా ఖండిస్తూ అతణ్ణి ఎదిరించాడు. దేవుని కుమారుడు సాతాను లోకంలోని దేన్నీ ఆశించలేదు. ఆ దుష్టుణ్ణి ఆయన ఎప్పటికీ ఆరాధించడు కూడ!​—⁠మత్త. 4:​10; ద్వితీ. 6:​13; 10:⁠20.

“అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును”

13 సాతాను యేసుకు ఈ లోక రాజ్యాలన్నీ చూపించి ఇంతకుముందు ఏ మానవునికీ లేనంత గొప్ప అధికారం ఆయనకు ఇవ్వజూపాడు. యేసు వాటిని చూసి ఆశపడతాడని సాతాను అనుకున్నాడు. అవి తీసుకుంటే తనే భూమ్మీద అత్యంత శక్తివంతమైన రాజునవుతానని యేసుకు తప్పక అనిపిస్తుందని అనుకున్నాడు. ఇప్పుడు అపవాది మనకు రాజ్యాలను ఇవ్వజూపడు కానీ మనం చూసేవాటిద్వారా, వినేవాటిద్వారా, ఆలోచించే వాటిద్వారా మన మనసులను పాడుచేయడానికి ప్రయత్నిస్తాడు.

14 ఈ లోకం అపవాది వశంలో ఉంది. అందుకే సమాచార మాధ్యమాలు అతని గుప్పిట్లో ఉన్నాయి. కాబట్టి సహజంగానే ఈ లోకంలోని టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో, ఇంటర్నెట్‌లో, సంగీతంలో, పుస్తకాల్లో అనైతికత, దౌర్జన్యం ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాపారులు వాణిజ్య ప్రకటనల ద్వారా మనకు అవసరం లేని అనేక వస్తువులను కొనాలనే ఆశ పుట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కంటికి ఆకర్షణీయంగా, చెవులకు ఇంపుగా, మనసులను ఆకట్టుకునేవిగా ఉండే వస్తుసంపదలతో అపవాది మనల్ని శోధిస్తూనే ఉంటాడు. అయితే, బైబిలు సూత్రాలకు విరుద్ధంగా ఉన్నవాటిని చూడకుండా, వినకుండా, చదవకుండా ఉంటే మనం “సాతానా, పొమ్ము!” అని చెప్పినట్లే అవుతుంది. అప్పుడు యేసులా మనం నైతికంగా దిగజారిన సాతాను లోకాన్ని స్థిరంగా తిరస్కరించగలుగుతాం. స్కూల్లో, ఉద్యోగం చేసే చోట, ఇరుగుపొరుగువారికి, బంధువులకు మనం యెహోవాసాక్షులమనీ, క్రీస్తు అనుచరులమనీ ధైర్యంగా చెప్పుకోవడం ద్వారా కూడ సాతాను లోకంలో భాగంగా లేమని రుజువుచేస్తాం.​—⁠మార్కు 8:⁠38 చదవండి.

15 యేసుకు దేవునిపట్ల ఉన్న యథార్థతను పాడుచేయడానికి మూడోసారి ప్రయత్నించి విఫలమైన తర్వాత “అపవాది ఆయనను విడిచి” వెళ్లిపోయాడు. (మత్త. 4:​11) అయితే సాతాను యేసును అంతటితో వదిలేయాలనుకోలేదు. ఎందుకంటే అపవాది “ఆయనను పరీక్షించడం ముగించి మరో అవకాశం చిక్కేవరకు ఆయనను విడిచివెళ్లిపోయాడు” అని బైబిలు చెబుతోంది. (లూకా 4:​13, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) మనం సమర్థంగా అపవాదిని ఎదిరించినప్పుడు యెహోవాకు కృతజ్ఞతలు చెప్పాలి. అయితే, దేవుని సహాయం కోసం ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉండాలి ఎందుకంటే అపవాది మళ్లీ శోధించడానికి ప్రయత్నిస్తాడు. అతడు బహుశా మనం అనుకునే సమయంలో కాదుకానీ తనకు మరో అవకాశం దొరికేంతవరకు వేచివుంటాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉంటూ, ఎలాంటి పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చినా యెహోవా సేవలో కొనసాగడానికి సిద్ధంగా ఉండాలి.

16 అపవాదిని ఎదిరించాలంటే మనం విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన దేవుని పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి. అయితే దేవుడు దాన్ని తప్పుకుండా ఇస్తాడనే నమ్మకంతో మనం అడగాల్సివుంటుంది. మనం స్వశక్తితో చేయలేనివాటిని దాని సహాయంతో చేయగలుగుతాం. దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తాడనే హామీనిస్తూ యేసు తన అనుచరులతో, “[మీరు అపరిపూర్ణులు, దేవునితో పోలిస్తే] చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును” అని చెప్పాడు. (లూకా 11:​12, 13) పరిశుద్ధాత్మ కోసం మనం ఎల్లప్పుడూ యెహోవాకు ప్రార్థిస్తూ ఉందాం. మనం పట్టుదలతో అపవాదిని ఎదిరిస్తున్నప్పుడు అత్యంత శక్తివంతమైన పరిశుద్ధాత్మ సహాయం మనకుంటే మనం ఖచ్చితంగా విజయం సాధించగలుగుతాం. ‘అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులం’ కావాలంటే మనం ప్రతీరోజు పట్టుదలతో ప్రార్థించడంతోపాటు దేవుడిచ్చే ఆధ్యాత్మిక సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి.​—⁠ఎఫె. 6:​11-18.

17 అపవాదిని ఎదిరించడానికి యేసుకు మరో విషయం సహాయం చేసింది. అది మనకు కూడ సహాయం చేస్తుంది. “ఆయన [యేసు] తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీ. 12:​1, 2) యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తూ, ఆయన పవిత్ర నామాన్ని ఘనపరుస్తూ, మనం నిత్యజీవ నిరీక్షణను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే మనకూ అలాంటి ఆనందమే కలుగుతుంది. సాతాను, అతడికి సంబంధించిన సమస్తం పూర్తిగా నాశనం చేయబడి, ‘దీనులు భూమిని స్వతంత్రించుకొని బహు క్షేమము కలిగి సుఖించినప్పుడు’ మన ఆనందానికి అవధులే ఉండవు! (కీర్త. 37:​11) కాబట్టి యేసులా మీరు అపవాదిని ఎదిరిస్తూనే ఉండండి.​—⁠యాకోబు 4:​7, 8 చదవండి.

మీరెలా జవాబిస్తారు?

• యెహోవా తన ప్రజలను సంరక్షిస్తాడని ఎలా చెప్పగలం?

• సాతానును ఎదిరించే విషయంలో యేసు ఎలా ఒక మాదిరినుంచాడు?

• మీరు ఏయే విధాలుగా అపవాదిని ఎదిరించగలరు?

[అధ్యయన ప్రశ్నలు]

1. భూమ్మీద తనకు ఎదురయ్యే వ్యతిరేకత గురించి యేసుకు ఏ విషయాలు ముందే తెలుసు?

2. యేసు అపవాదిని పూర్తిగా ఎదిరించగలడని యెహోవా ఎందుకు నమ్మాడు?

3. అపవాది యెహోవా సేవకులను ఏమి చేయాలనుకుంటున్నాడు?

4. దేవుని ప్రజలు అపవాదిని సమర్థంగా ఎదిరించారని ఏవి రుజువు చేస్తున్నాయి?

5. యెహోవా సేవకుల విషయంలో యెషయా 54:⁠17 ఎలా నెరవేరింది?

6. అపవాది పరిపాలనకు ఏమి జరగనుందని దానియేలు ప్రవచనం మనకు తెలియజేస్తోంది?

7. యెహోవా సేవకుల్లో ప్రతీ ఒక్కరు అపవాదిని సమర్థంగా ఎదిరించగలరని ఎలా చెప్పవచ్చు?

8. అపవాది అరణ్యంలో యేసును మొదటిసారి ఎలా శోధించాడని బైబిలు చెబుతోంది? దానికి యేసు ఏమని జవాబిచ్చాడు?

9. మనలో సహజంగా ఉండే కోరికలను ఆసరాగా చేసుకుని అపవాది శోధించినప్పుడు మనం అతణ్ణి ఎందుకు ఎదిరించాలి?

10. యేసుకు దేవునిపట్ల ఉన్న యథార్థతను పాడుచేయడానికి అపవాది మరోసారి ఎలా శోధించాడని మత్తయి 4:​5, 6 చెబుతున్నాయి?

11. సాతాను మనల్ని ఎలా శోధించవచ్చు? దాని పర్యవసానాలు ఎలా ఉండవచ్చు?

12. మత్తయి 4:​8, 9లో ఏ శోధన గురించి రాయబడింది? దానికి దేవుని కుమారుడు ఎలా స్పందించాడు?

13, 14. (ఎ) యేసుకు లోక రాజ్యాలన్నీ చూపించి అపవాది ఏమి ఇవ్వజూపాడు? (బి) సాతాను ఎలా మన మనసుల్ని కలుషితం చేయడానికి ప్రయత్నిస్తాడు?

15. సాతానును ఎదిరిస్తున్నప్పుడు మనం ఎందుకు ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి?

16. యెహోవా మనకు శక్తివంతమైన దేన్ని ఇస్తాడు? మనం దాని కోసం ఎందుకు ప్రార్థించాలి?

17. యేసు ఎలాంటి ఆనందాన్ని గుర్తుంచుకుని అపవాదిని ఎదిరించగలిగాడు?

[29వ పేజీలోని చిత్రం]

లోకంతో స్నేహం చేస్తే మనం దేవునికి శత్రువులమవుతాం

[31వ పేజీలోని చిత్రం]

సాతాను లోక రాజ్యాలన్నిటినీ ఇవ్వజూపినప్పుడు యేసు వాటిని నిరాకరించాడు