కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రెండు కాలాలకు మధ్య వారధిగా నిలిచిన “సముద్రపు కీర్తన” రాతప్రతి

రెండు కాలాలకు మధ్య వారధిగా నిలిచిన “సముద్రపు కీర్తన” రాతప్రతి

రెండు కాలాలకు మధ్య వారధిగా నిలిచిన “సముద్రపు కీర్తన” రాతప్రతి

గత సంవత్సరం 2007, మే 22న జెరూసలెంలో ఉన్న ఇజ్రాయిల్‌ మ్యూజియమ్‌లో ఏడు లేక ఎనిమిదవ శతాబ్దానికి చెందిన హెబ్రీ గ్రంథపు చుట్టలోని కొంతభాగం ప్రదర్శించబడింది. ఆ రాతప్రతిలో నిర్గమకాండము 13:19-16:1 వచనం వరకు ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం దగ్గర అద్భుతంగా రక్షించబడిన తర్వాత పాడిన విజయ గీతం కూడా దానిలో ఉంది. ఆ పాటను “సముద్రపు కీర్తన” అని కూడ పిలుస్తారు. ఆ గ్రంథపుచుట్టను ప్రదర్శించడంలో విశేషమేమిటి?

అది ఏ కాలంలో రాయబడిందో తెలుసుకుంటే దాని విశేషత అర్థమౌతుంది. మృత సముద్రంలో దొరికిన గ్రంథపు చుట్టలు సా.శ.పూ. మూడవ శతాబ్దం, సా.శ. మొదటి శతాబ్దం మధ్యకాలంలో రాయబడ్డాయి. దాదాపు 60 సంవత్సరాల క్రితం, అలెప్పో కోడెక్స్‌ రాతప్రతినే అత్యంత ప్రాచీన హెబ్రీ రాతప్రతిగా పరిగణించేవారు. అలెప్పో కోడెక్స్‌ రాతప్రతి సా.శ. 930లో రాయబడింది. సా.శ. మొదటి శతాబ్దానికీ, సా.శ. పదవ శతాబ్దానికీ మధ్యకాలంలో ఎన్నో వందల సంవత్సరాలు గడిచాయి. ఏవో కొన్ని చిన్నచిన్న భాగాలు తప్పితే, ఆ మధ్యకాలంలో రాయబడిన హెబ్రీ రాతపత్రులేవీ దొరకలేదు.

‘మృత సముద్రంలో దొరికిన గ్రంథపు చుట్టలు రాయబడిన కాలానికీ . . . అలెప్పో కోడెక్స్‌ రాయబడిన కాలానికీ మధ్యకాలంలో రాయబడిన ఏ రాతప్రతీ దొరకలేదు అని అనుకున్నప్పుడు సముద్రపు కీర్తన రాతప్రతి వెలుగులోకి వచ్చింది. అది రెండు కాలాల మధ్య వారధిగా నిలిచింది’ అని ఇజ్రాయిల్‌ మ్యూజియమ్‌ నిర్వాహకుడు జేమ్స్‌ ఎస్‌. స్నైడర్‌ చెప్పాడు. ఈ రాతప్రతేకాక ఇతర ప్రాచీన బైబిలు రాతప్రతులు, “ఆనాటినుండి నేటివరకు బైబిల్లో ఎలాంటి మార్పులు చేయబడలేదు అనడానికి చక్కని రుజువులుగా ఉన్నాయి” అని ఆయన అభిప్రాయపడ్డారు.

19వ శతాబ్దపు చివర్లో, ఈజిప్టులోని కైరో పట్టణంలో ఉన్న సమాజమందిరంలో అనేక రాతప్రతులు దొరికాయి. అప్పుడే ఇది కూడ దొరికిందని పురావస్తుశాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. చివరకు ఈ రాతప్రతి హెబ్రీ రాతప్రతుల్ని సేకరించే ఒక వ్యక్తి చేతుల్లోకి వచ్చింది. ఆయన దాన్ని 1977-79 ఆ ప్రాంతంలో నిపుణులకు చూపించినప్పుడే దాని విశేషత ఏమిటో తెలిసింది. వారు దానిమీద రసాయన పరీక్షలు జరిపి అది రాయబడిన తేదీని కనుక్కున్నారు. అధికారులు దాన్ని భద్రపరచి, ఈ మధ్యే ఇజ్రాయిల్‌ మ్యూజియమ్‌లో దాన్ని ప్రదర్శించారు.

ఇజ్రాయిల్‌ మ్యూజియమ్‌లో ష్రైన్‌ ఆఫ్‌ ద బుక్‌ అనే విభాగానికి, మృత సముద్రపు చుట్టలను భద్రపరిచే విభాగానికి అధికారియైన అడోల్ఫో రాయిట్‌మాన్‌ దీని విశేషత గురించి మాట్లాడుతూ, “మసోరేట్లు బైబిలును అనేక శతాబ్దాలపాటు ఎంతో నమ్మకంగా నకలు చేశారని సముద్రపు కీర్తన రాతప్రతి స్పష్టంచేస్తోంది. సముద్రపు కీర్తన ఓ ప్రత్యేకమైన శైలిలో రాయబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 7-8 శతాబ్దాల్లో అది ఏ శైలిలో ఉందో అది ఇప్పటికీ ఆ శైలిలోనే ఉంది” అని అన్నాడు.

బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యం. యెహోవా దేవుడే దాన్ని మన కాలంవరకు కాపాడుతూ వచ్చాడు. అంతేకాక, శాస్త్రులు ఎంతో జాగ్రత్తగా లేఖనాలను నకలు చేశారు. కాబట్టి నేడు మనం ఉపయోగించే బైబిల్లోని సమాచారం సరైనదేనని నిస్సందేహంగా నమ్మవచ్చు.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy of Israel Museum, Jerusalem