కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వీలైనంత త్వరగా తిరిగివచ్చేందుకు వారికి సహాయం చేయండి!

వీలైనంత త్వరగా తిరిగివచ్చేందుకు వారికి సహాయం చేయండి!

వీలైనంత త్వరగా తిరిగివచ్చేందుకు వారికి సహాయం చేయండి!

“యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు.”​—⁠యోహా. 6:⁠68.

ఒక సందర్భంలో, యేసు బోధించిన ఒక విషయాన్ని జీర్ణించుకోలేక అనేకమంది శిష్యులు ఆయనను వెంబడించడం మానేశారు. “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?” అని ఆయన అపొస్తలులను అడిగినప్పుడు పేతురు, “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు” అని అన్నాడు. (యోహా. 6:​51-69) వారు ఎవరి దగ్గరికని వెళ్తారు? అప్పటి యూదా మతంలో “నిత్యజీవపు మాటలు” లేవు. అలాగే నేడు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోనులో కూడ ఆ మాటలు అస్సలు కనిపించడంలేదు. దేవుని మందకు దూరమైనా యెహోవాను సంతోషపెట్టాలనుకునేవారు “నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని” మందలోకి తిరిగిరావాలి.​—⁠రోమా. 13:⁠11.

2 ఇశ్రాయేలులోని తప్పిపోయిన గొర్రెలపట్ల యెహోవా శ్రద్ధ చూపించాడు. (యెహెజ్కేలు 34:​15, 16 చదవండి.) అలాగే, మందనుండి తప్పిపోయిన గొర్రెల్లాంటి​వారికి సహాయం చేసే బాధ్యత, చేయాలనే కోరిక పెద్దలకు ఉంది. సహాయం కోరే నిష్క్రియుడైన వ్యక్తితో అధ్యయనం చేయమని పెద్ద ఒక ప్రచారకుణ్ణి లేదా ప్రచారకురాలిని కోరవచ్చు. ఆ వ్యక్తి గంభీరమైన పాపం చేశాడని వారికి తెలిస్తే ఏమి చేయాలి? వారు న్యాయపరమైన లేదా ఆంతరంగిక విషయాల గురించి సలహా ఇచ్చే బదులు పెద్దలతో మాట్లాడమని చెప్పాలి. వారు పెద్దలతో మాట్లాడకపోతే ప్రచారకుడే పెద్దలకు ఆ విషయాన్ని తెలియజేయాలి.​—⁠లేవీ. 5:⁠1; గల. 6:⁠1.

3 ముందటి ఆర్టికల్‌లో 100 గొర్రెలున్న ఒక కాపరి గురించి యేసు చెప్పిన ఉపమానాన్ని మనం చూశాం. ఒక గొర్రె తప్పిపోతే ఆయన 99 గొర్రెలను వదిలేసి ఆ ఒక్క గొర్రె కోసం వెతకడానికి వెళ్లాడు. అది దొరికినప్పుడు ఆయన ఎంత సంతోషించి ఉంటాడు! (లూకా 15:​4-7) నిష్క్రియులైనవారు మందలోకి తిరిగివచ్చినప్పుడు మనం కూడ ఆ కాపరిలాగే సంతోషిస్తాం. వారు నిష్క్రియులైనప్పుడు పెద్దలు, సంఘంలోని మరితరులు వారిమీదున్న ప్రేమతో వారిని కలుసుకొని ఉంటారు. నిష్క్రియులైనవారు మందలోకి తిరిగివచ్చి దేవుని సహాయాన్ని, కాపుదలను, ఆశీర్వాదాన్ని పొందాలని వారు కోరుకుంటారు. (ద్వితీ. 33:​27; కీర్త. 91:​14; సామె. 10:​22) నిష్క్రియులైనవారికి సహాయం చేసే అవకాశం వారికి లభిస్తే వారేమి చేయవచ్చు?

4 యెహోవా తన గొర్రెలను ప్రేమిస్తున్నాడనీ, మనం చేయగలిగే దానికన్నా ఎక్కువగా మన నుండి ఆశించడనీ తప్పిపోయినవారికి దయతో వివరించి సంఘంలోకి తిరిగిరమ్మని ప్రోత్సహించవచ్చు. బైబిలు అధ్యయనం చేయాలని, కూటాలకు హాజరుకావాలని, రాజ్యసువార్త ప్రకటించాలని యెహోవా కోరుతున్నాడు. గలతీయులు 6:​2, 5 చదివి, క్రైస్తవులు ఒకరి భారాన్ని మరొకరు మోయడానికి సహాయం చేసుకోవచ్చు అంటే సుఖదుఃఖాల్లో ఒకరినొకరు ఆదరించుకోవచ్చు గానీ ఆధ్యాత్మిక విషయాల్లో “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను” అని వివరించవచ్చు. మన స్థానంలో మనకు బదులుగా ఇంకెవ్వరూ దేవునికి నమ్మకంగా ఉండలేరు.

‘ఐహికవిచారములనుబట్టి’ వెనుకబడిపోయారా?

5 నిష్క్రియులైన తోటి విశ్వాసులకు ఎలా సహాయం చేయాలో తెలుసుకోవాలంటే వారు మనసు విప్పి మాట్లాడుతున్నప్పుడు పెద్దలు, పరిణతిగల ఇతర ప్రచారకులు జాగ్రత్తగా వినాలి. ‘ఐహికవిచారములనుబట్టి’ ఒక జంట వెనుకబడిపోయి కూటాలకు రావడం మానేశారనుకుందాం. మీరు ఒక పెద్దగా వారిని సందర్శించడానికి వెళ్లాల్సివచ్చింది. (లూకా 21:​34) ఆర్థిక సమస్యలు వచ్చాయనో కుటుంబ బాధ్యతలు పెరిగాయనో వారు క్రమంగా క్రైస్తవ కార్యకలాపాల్లో వెనుకబడివుండవచ్చు. వీటన్నిటికీ దూరంగా ఉంటే బాగుంటుందని వారికి అనిపించవచ్చు. కానీ వారు వాటికి దూరంగా ఉండడంవల్ల ప్రయోజనముండదని వారికి మీరు చెప్పవచ్చు. (సామెతలు 18:1 చదవండి.) వారిని నొప్పించకుండా ఈ ప్రశ్నలు అడగవచ్చు: “మీరు కూటాలు మానేసినప్పటి నుండి సంతోషంగా ఉన్నారా? మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉందా? మీరు ఇప్పటికీ యెహోవా విషయంలో ఆనందిస్తూ బలాన్ని పొందుతున్నారా?”​—⁠నెహె. 8:⁠10.

6 నిష్క్రియులైనవారు అలాంటి ప్రశ్నల గురించి ఆలోచించినప్పుడు సంఘంతో సహవసించనందువల్ల తమ ఆధ్యాత్మికత, సంతోషం సన్నగిల్లాయని గ్రహించగలుగుతారు. (మత్త. 5:⁠3; హెబ్రీ. 10:​24, 25) ప్రకటనా పని చేయడంవల్ల పొందే ఆనందాన్ని ఇప్పుడు కోల్పోయారని గ్రహించేందుకు కూడ మీరు వారికి సహాయం చేయవచ్చు. (మత్త. 28:​19, 20) కాబట్టి, నిష్క్రియులు ఏమి చేస్తే బాగుంటుంది?

7 యేసు ఇలా చెప్పాడు: ‘మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉండకుండా జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకోవడానికి శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడి.’ (లూకా 21:​34-36) మంద నుండి తప్పిపోయినవారు ఒకప్పుడు సంతోషించినట్లే ఇప్పుడు సంతోషించాలనుకోవచ్చు. అలాంటప్పుడు వారిని పరిశుద్ధాత్మ కోసం, దేవుని సహాయం కోసం ప్రార్థించమని, దానికి అనుగుణంగా ప్రవర్తించమని ప్రోత్సహించవచ్చు.​—⁠లూకా 11:⁠13.

వారు అభ్యంతరపడ్డారా?

8 మానవ అసంపూర్ణతనుబట్టి భేదాభిప్రాయలు ఏర్పడి కొందరు అభ్యంతరపడవచ్చు. సంఘంలో మంచి పేరున్న ఓ వ్యక్తి బైబిలు సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు కొందరు అభ్యంతరపడివుండవచ్చు. ఆ కారణంగా వారు వెనుకబడిపోయివుంటే, యెహోవా ఎవ్వరినీ అభ్యంతరపెట్టడని పెద్ద వివరించవచ్చు. అలాంటప్పుడు దేవునితో, ఆయన ప్రజలతో ఎందుకు తెగదెంపులు చేసుకోవాలి? బదులుగా, ‘సర్వలోకమునకు తీర్పు తీర్చువానికి’ ఆ విషయం తెలుసనే నమ్మకంతో, తగినరీతిలో ఆయన దాన్ని చక్కదిద్దుతాడనే నమ్మకంతో వారు దేవుని సేవలో కొనసాగాలి కదా? (ఆది. 18:​25; కొలొ. 3:​23-25) ఒక వ్యక్తి కిందపడితే, ఆయన లేవడానికి ప్రయత్నించకుండా కావాలని అలాగే ఉండిపోడు కదా?

9 అప్పుడెప్పుడో తమను అభ్యంతరపెట్టిన విషయం ఇప్పుడు కొందరికి పెద్ద విషయంగా అనిపించకపోవచ్చని పెద్ద చెప్పవచ్చు. నిజానికి, తమను అభ్యంతరపెట్టిన పరిస్థితి ఇప్పుడు ఉండకపోవచ్చు. పెద్దలు సరిదిద్దినందుకు ఒక వ్యక్తి అభ్యంతరపడితే, ఆయన దాని గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించాలి. అప్పుడాయన తనది కూడ కొంత తప్పు ఉందనీ, పెద్దల మాటలనుబట్టి తాను అభ్యంతరపడాల్సిన అవసరంలేదనీ గ్రహించవచ్చు.​—⁠కీర్త. 119:​165; హెబ్రీ. 12:​5-13.

ఒక బోధ కారణంగా అభ్యంతరపడ్డారా?

10 ఒకానొక లేఖనాధారిత బోధ తప్పని అనిపించి కొందరు దేవుని మందను వదిలివెళ్లుండొచ్చు. ఐగుప్తు దాసత్వం నుండి విడుదలైన ఇశ్రాయేలీయులు దేవుడు తమ కోసం చేసిన ‘కార్యములను మరిచిపోయి ఆయన ఆలోచన కోసం కనిపెట్టలేదు.’ (కీర్త. 106:​13) “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” చక్కని ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తున్నాడని నిష్క్రియులైనవారికి గుర్తుచేయడం సహాయకరంగా ఉండవచ్చు. (మత్త. 24:​45) వారు ఆ దాసుని తరగతివల్లే సత్యాన్ని తెలుసుకున్నారు. మళ్లీ సత్యాన్ని అనుసరించాలనే కృతనిశ్చయాన్ని వారు ఎందుకు పెంచుకోకూడదు?​—⁠2 యోహా. 4.

11 ఒక పెద్ద దేవుని మందనుండి దూరమైనవారికి సహాయం చేస్తున్నప్పుడు, ఒక బోధ విషయంలో అభ్యంతరపడి యేసును వదిలి వెళ్లిపోయిన శిష్యుల ఉదాహరణ చెప్పవచ్చు. (యోహా. 6:​53, 66) యేసుకు, నమ్మకస్థులైన ఆయన శిష్యులకు దూరమైపోవడంవల్ల వారు ఆధ్యాత్మికతను, సంతోషాన్ని కోల్పోయారు. వారికి ఈ క్రైస్తవ సంఘంలో ఆధ్యాత్మిక ఆహారం దొరికినంత సమృద్ధిగా మరోచోట ఎక్కడైనా దొరికిందా? లేదు, అలాంటిది మరొకటి లేనేలేదు!

ఘోరమైన పాపం చేయడంవల్ల వెనుకబడ్డారా?

12 కొందరు ఘోరమైన పాపం చేసినందువల్ల ప్రకటించడం, కూటాలకు హాజరవడం మానేస్తారు. పెద్దల ముందు తమ తప్పు ఒప్పుకుంటే సంఘం నుండి బహిష్కరించబడతామేమో అని అనుకుంటారు. అయితే, లేఖనవిరుద్ధంగా చేస్తున్న పాపాన్ని మానేసి, నిజంగా పశ్చాత్తాపపడితే వారు సంఘం నుండి బహిష్కరించబడరు. (2 కొరిం. 7:​10, 11) బదులుగా, పెద్దలు వారిని తిరిగి సంఘంలోకి ఆహ్వానించి కావాల్సిన ఆధ్యాత్మిక సహాయం చేస్తారు.

13 మీరు పరిణతిగల ప్రచారకులైతే పెద్దలు మిమ్మల్ని నిష్క్రియులకు సహాయం చేయమని కోరవచ్చు. తాము ఘోరమైన పాపం చేశామని వారు మీకు చెబితే మీరేమి చేయాలి? మనం ముందు చూసినట్లు, ఆ పరిస్థితిని మీ చేతుల్లోకి తీసుకునే బదులు, పెద్దలకు తెలియజేయమని చెప్పవచ్చు. వారు అలా చేయడానికి ఇష్టపడకపోతే మీరు మాత్రం ఇలాంటి విషయాల్లో దేవుని నిర్దేశానుగుణంగా ప్రవర్తించండి. అలా చేయడం ద్వారా మీరు యెహోవా నామం గురించి, సంఘ ఆధ్యాత్మిక సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారని చూపిస్తారు. (లేవీయకాండము 5:1 చదవండి.) మందలోకి తిరిగివచ్చి, దేవుడు ఇష్టపడే రీతిలో జీవించాలనుకునేవారికి ఎలా సహాయం చేయాలో పెద్దలకు తెలుసు. పెద్దలు వారిని ప్రేమతో సరిదిద్దాల్సిరావచ్చు. (హెబ్రీ. 12:​7-11) తాము దేవునికి విరుద్ధంగా పాపం చేశామని ఒప్పుకొని, తప్పు చేయడం మానేసి, నిజంగా పశ్చాత్తాపపడితే పెద్దలు వారికి సహాయం చేస్తారు. అప్పుడు యెహోవా వారిని క్షమిస్తాడు.​—⁠యెష. 1:​18; 55:⁠7; యాకో. 5:​13-16.

కుమారుడు తిరిగివస్తే ఆనందం కలుగుతుంది

14 తప్పిపోయిన గొర్రెలకు సహాయం చేయడానికి నియమించబడినవారు లూకా 15:​11-24లో యేసు చెప్పిన ఉపమానం గురించి చెప్పవచ్చు. ఆ ఉపమానంలో చిన్న కుమారుడు విచ్చలవిడిగా జీవిస్తూ తన ఆస్తినంతా విలాసాలకు తగులబెట్టాడు. చివరకు ఆయనకు తాను గడుపుతున్న విచ్చలవిడి జీవితంమీద అసహ్యమేసింది. ఆయనకు ఆకలేసింది. ఇల్లు గుర్తుకురావడంతో తిరిగి ఇంటికెళ్లాలనుకున్నాడు. ఆయన అల్లంత దూరాన ఉండగానే తండ్రి తన కుమారుణ్ణి చూసి, పరుగెత్తుకొని వెళ్లి ఆయనను కౌగలించుకొని ఆనందంతో ముద్దుపెట్టుకున్నాడు. ఈ ఉపమానం గురించి ధ్యానిస్తే, మంద నుండి తప్పిపోయినవారు మందలోకి తిరిగిరావాలనుకోవచ్చు. ఈ లోకం త్వరలో నాశనంకానుంది కాబట్టి నిష్క్రియులు ఆలస్యం చేయకుండా తిరిగి ‘ఇంటికి రావాలి.’

15 సంఘం నుండి దూరమైన చాలామంది పరిస్థితి తప్పిపోయిన కుమారునిలా ఉండకపోవచ్చు. ఎలాగైతే లంగరు వేయని పడవ మెల్లమెల్లగా ఒడ్డుకు దూరంగా కొట్టుకొనిపోతుందో అలాగే కొందరు మెల్లమెల్లగా సంఘానికి దూరంగా కొట్టుకొనిపోతారు. మరికొందరు సమస్యల గురించి ఎంతగా ఆందోళన చెందుతారంటే వారు యెహోవాతో తమకున్న సంబంధాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇంకొందరు సంఘంలోని ఓ వ్యక్తి కారణంగా అభ్యంతరపడతారు లేదా ఒకానొక బోధ విషయంలో ఏకీభవించరు. కొందరు ఘోరమైన పాపం చేస్తారు. ఈ కారణాలనుబట్టి లేదా మరితర కారణాలనుబట్టి వారు నిష్క్రియులౌతారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఎలా సహాయం చేయవచ్చో పై పేరాల్లో తెలుసుకున్నాం. వాటిని ఉపయోగిస్తే ఆలస్యంకాకముందే వారు మందలోకి తిరిగివచ్చేందుకు మీరు సహాయం చేయగలుగుతారు.

‘నువ్వు ఇంటికి తిరిగిరావడం చూసి నాకెంతో సంతోషంగా ఉంది!’

16 ఒక క్రైస్తవ పెద్ద ఇలా అన్నాడు: “నిష్క్రియులైనవారిని కలుసుకునే విషయంలో మా పెద్దల సభకు ఎంతో శ్రద్ధ ఉంది. నాకు ఒక సహోదరుడు గుర్తొచ్చాడు. ఆయన సత్యంలోకి వచ్చేందుకు నేనే సహాయం చేశాను. ఆయన దాదాపు 25 ఏళ్లు నిష్క్రియునిగా ఉండి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాడని తెలిసి, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ఆయనకెలా సహాయం చేస్తుందో వివరించాను. కొంతకాలానికి ఆయన రాజ్య​మందిరానికి రావడం మొదలుపెట్టాడు. మందలోకి తిరిగి రావాలనే కోరిక ఆయనలో బలపడాలంటే బైబిలు అధ్యయనం చేయడం మంచిది అని చెప్పినప్పుడు ఆయన దానికి అంగీకరించాడు.”

17 ఆయన అసలు ఎందుకు నిష్క్రియుడయ్యాడు? అలా ఎందుకు అయ్యాడో ఆయనే చెప్పాడు: “నేను ఆధ్యాత్మిక విషయాల కన్నా ప్రాపంచిక విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం మొదలుపెట్టాను. ఆ తర్వాత బైబిలు చదవడం, పరిచర్యకు, కూటాలకు వెళ్లడం మానేశాను. నాకు తెలియకుండానే సంఘానికి దూరమయ్యాను. కానీ పెద్దలు వ్యక్తిగతంగా నామీద ఎంతో శ్రద్ధ చూపించి సంఘంలోకి తిరిగి వచ్చేందుకు సహాయం చేశారు.” ఆ సహోదరుడు బైబిలు అధ్యయనాన్ని అంగీకరించిన తర్వాత ఆయన సమస్యలు తగ్గాయి. “యెహోవా ప్రేమను, నిర్దేశాన్ని, ఆయన సంస్థ నిర్దేశాన్ని నా జీవితంలో కోల్పోయానని నేనప్పుడు గుర్తించాను” అని ఆయన చెప్పాడు.

18 ఈ సహోదరుడు కూటాలకు వచ్చినప్పుడు సంఘంలోని సహోదరులు ఎలా స్పందించారు? ఆయనిలా చెప్పాడు: “యేసు ఉపమానంలోని తప్పిపోయిన కుమారునికి అనిపించినట్లే నాకూ అనిపించింది. 30 ఏళ్లుగా సంఘంలో ఉన్న ఒక వృద్ధ సహోదరి యెహోవాను ఇంకా నమ్మకంగా సేవిస్తోంది. ఆమె నన్ను చూసి, ‘నువ్వు ఇంటికి తిరిగిరావడం నాకెంతో సంతోషంగా ఉంది!’ అన్నది. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి. నేను నిజంగానే ఇంటికి వచ్చానని నాకు అనిపించింది. ఆ పెద్దతోపాటు సంఘమంతా నాపట్ల ప్రేమా ఆప్యాయతలు, ఓపిక, శ్రద్ధ చూపించినందుకు వారికి నేనెంతో రుణపడివున్నాను. నేను మందలోకి తిరిగివచ్చేందుకు యెహోవాపట్ల, పొరుగువారిపట్ల వారికున్న ప్రేమ నాకెంతో సహాయం చేసింది.”

వెంటనే చర్య తీసుకోమని ప్రోత్సహించండి

19 మనం అంత్యదినాల్లో జీవిస్తున్నాం, ఈ లోక విధానం త్వరలో నాశనం కానుంది. కాబట్టి, కూటాలకు హాజరుకమ్మని, వెంటనే హాజరుకావడం మొదలుపెట్టమని వారిని ప్రోత్సహించండి. దేవునితో వారికున్న సంబంధాన్ని పాడుచేయాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు. అంతేకాక, సత్యారాధనను విడిచిపెడితే జీవిత ఒత్తిళ్ల నుండి ఉపశమనం లభిస్తుందని మనం అనుకునేలా మభ్యపెడుతున్నాడు. యేసు నమ్మకమైన శిష్యులుగా ఉంటేనే నిజమైన విశ్రాంతిని పొందుతామని వారిని మీరు ప్రోత్సహించవచ్చు.​—⁠మత్తయి 11:​28-30 చదవండి.

20 మనం చేయగలిగినదాన్ని మాత్రమే యెహోవా మన నుండి ఆశిస్తున్నాడని నిష్క్రియులకు గుర్తు​చేయండి. యేసు చనిపోయే కొంతకాలం ముందు లాజరు సహోదరి మరియ ఆయనను ఖరీదైన తైలంతో అభిషేకించినందుకు ఇతరులు ఆమెను విమర్శించారు. అప్పుడు యేసు, “ఈమె జోలికిపోకుడి . . . ఈమె తన శక్తికొలదిచే[సింది]” అని అన్నాడు. (మార్కు 14:​6-8) దేవాలయంలో కేవలం రెండు కాసులను వేసిన బీద విధవరాలిని యేసు మెచ్చుకున్నాడు. ఆమె కూడ తాను చేయగలిగింది చేసింది. (లూకా 21:​1-4) మనలో చాలామందిమి క్రైస్తవ కూటాలకు హాజరుకాగలం, రాజ్య ప్రకటనా పనిలో పాల్గొనగలం. ఇప్పుడు నిష్క్రియులైన చాలామంది యెహోవా సహాయంతో మనం చేయగలుగుతున్నదాన్ని చేయగలుగుతారు.

21 మంద నుండి తప్పిపోయిన గొర్రెల్లాంటివారు తమ సహోదరులను తిరిగి కలుసుకునేందుకు భయపడుతుంటే, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఇంటివాళ్లు ఎంతగా ఆనందించారో ఆయనకు గుర్తు​చేయవచ్చు. సంఘానికి ఎవరైనా తిరిగివస్తే కూడ అంతే ఆనందం కలుగుతుంది. అపవాదిని ఎదిరించి, దేవునికి దగ్గరయ్యేందుకు ఇప్పుడే చర్య తీసుకోమని వారిని ప్రోత్సహించండి.​—⁠యాకో. 4:​7, 8.

22 యెహోవా మందలోకి తిరిగివచ్చేవారిని సంఘ సభ్యులు ఆనందంతో ఆహ్వానిస్తారు. (విలా. 3:​40) నిష్క్రియులు గతంలో దేవుణ్ణి సేవించినప్పుడు ఎంతో ఆనందాన్ని పొందారు. వారు ఆలస్యం చేయకుండా మందలోకి తిరిగివస్తే భవిష్యత్తులో ఎన్నో ఆశీర్వాదాలను పొందుతారు!

మీరెలా జవాబిస్తారు?

• ఏదో కారణాన్నిబట్టి అభ్యంతరపడి, నిష్క్రియులైన క్రైస్తవులకు మీరెలా సహాయం చేయవచ్చు?

• ఒకానొక బోధ విషయంలో విభేదించడంవల్ల దేవుని మందను వదిలేసినవారితో మీరెలా మాట్లాడవచ్చు?

• సంఘంలోకి తిరిగివచ్చేందుకు భయపడేవారికి ఎలా సహాయం చేయవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. అనేకమంది శిష్యులు యేసును వెంబడించడం మానేసినప్పుడు పేతురు ఏమన్నాడు?

2. ఆంతరంగిక, న్యాయపరమైన విషయాలతో వ్యవహరిస్తున్నప్పుడు మనం ఏమి గుర్తుంచుకోవాలి?

3. నూరు గొర్రెలున్న ఒక కాపరి ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఏమి చేశాడు?

4. గలతీయులు 6:​2, 5 నుండి ఏమి తెలుస్తుంది?

5, 6. (ఎ) నిష్క్రియులైన తోటి విశ్వాసులు చెప్పే మాటలను జాగ్రత్తగా వినడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) దేవుని ప్రజలతో సహవసించకపోవడంవల్ల వారికి ఎలాంటి హాని జరిగిందో గ్రహించేందుకు మీరెలా సహాయం చేయవచ్చు?

7. మంద నుండి తప్పిపోయినవారిని ఏమి చేయాలని ప్రోత్సహించవచ్చు?

8, 9. అభ్యంతరపడిన వ్యక్తికి సహాయం చేసేందుకు ఒక పెద్ద ఎలా మాట్లాడవచ్చు?

10, 11. ఒక బైబిలు బోధను వేరుగా అర్థం చేసుకున్నవారికి సహాయం చేసేందుకు ఎలా మాట్లాడితే బాగుంటుంది?

12, 13. తాను ఘోరమైన పాపం చేశానని మంద నుండి తప్పిపోయిన వ్యక్తి ఒప్పుకుంటే ఆయనకు ఎలా సహాయం చేయవచ్చు?

14. తప్పిపోయిన కుమారుని గురించి యేసు చెప్పిన ఉపమానాన్ని మీ సొంత మాటల్లో వివరించండి.

15. కొందరు సంఘానికి దూరంగా ఎందుకు కొట్టుకొనిపోతారు?

16-18. (ఎ) ఎన్నో సంవత్సరాలు నిష్క్రియునిగా ఉన్న ఒక సహోదరునికి ఓ పెద్ద ఎలా సహాయం చేశాడు? (బి) ఆయన ఎందుకు నిష్క్రియుడయ్యాడు? ఆయనకు ఇతరులు ఎలా సహాయం చేశారు? ఆయన కూటాలకు వచ్చినప్పుడు సహోదరులు ఎలా స్పందించారు?

19, 20. వెంటనే మందలోకి తిరిగిరమ్మని నిష్క్రియులను ఎలా ప్రోత్సహించవచ్చు? దేవుడు మన నుండి ఎక్కువగా ఆశించడని మీరు వారికి ఎలా వివరించవచ్చు?

21, 22. యెహోవా మందలోకి తిరిగివచ్చేవారికి ఏమని భరోసా ఇవ్వాలి?

[13వ పేజీలోని చిత్రం]

నిష్క్రియులైన తోటి విశ్వాసులు మనసు విప్పి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి

[15వ పేజీలోని చిత్రం]

తప్పిపోయిన కుమారుని గురించి యేసు చెప్పిన ఉపమానాన్ని ధ్యానించడంవల్ల కొందరు మందలోకి తిరిగిరావాలనుకోవచ్చు