కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘సమాధానపడడానికి’ కృషిచేయండి

‘సమాధానపడడానికి’ కృషిచేయండి

‘సమాధానపడడానికి’ కృషిచేయండి

కొత్తగా వేసిన రోడ్డు పగుళ్లు లేకుండా ఉంటుంది. దాన్ని చూస్తే పాడైపోదేమో అనిపిస్తుంది. అయితే, రానురాను దానిపై పగుళ్లు ఏర్పడి, గుంటలు పడతాయి. ఆ రోడ్డు మీద ప్రజలు సురక్షితంగా ప్రయాణించాలన్నా, అది పూర్తిగా పాడవ్వకుండా ఉండాలన్నా ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేస్తుండాలి.

ఇతరులతో మనకున్న సంబంధాలు కూడా అలాగే అప్పుడప్పుడు పాడవుతుంటాయి. రోమా క్రైస్తవుల మధ్య కూడా అభిప్రాయభేదాలు ఉండేవని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఆయన “సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము” అని తోటి క్రైస్తవులకు ఉపదేశించాడు. (రోమా. 14:​13, 19) మనం ‘సమాధానం కలుగజేయువాటినే’ ఎందుకు ‘ఆసక్తితో అనుసరించాలి’? మనమెలా నిర్భయంగా, సమర్థంగా ఇతరులతో సమాధానపడడానికి కృషిచేయవచ్చు?

సమాధానపడడానికి ఎందుకు కృషిచేయాలి?

సరైన సమయంలో మరమ్మత్తులు చేయకపోతే చిన్నచిన్న పగుళ్లు కూడ పెద్దపెద్ద గుంటలుగామారి రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. అలాగే మనస్పర్థల్ని పరిష్కరించుకోకపోతే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. అపొస్తలుడైన యోహాను, “ఎవడైనను​—⁠నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు” అని రాశాడు. (1 యోహా. 4:​20) మనస్పర్థల్ని పరిష్కరించుకోకపోతే ఒక క్రైస్తవుడు చివరకు తన సహోదరుణ్ణే ద్వేషించే అవకాశం ఉంది.

ఇతరులతో సమాధానంగా మెలగకపోతే యెహోవా మనం చేసే ఆరాధనను అంగీకరించడని యేసుక్రీస్తు చెప్పాడు. యేసు “నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల, అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము” అని తన శిష్యులతో అన్నాడు. (మత్త. 5:​23, 24) కాబట్టి ముఖ్యంగా యెహోవా దేవుణ్ణి సంతోషపెట్టాలనే ఉద్దేశంతోనే సమాధానాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తాం. *

ఫిలిప్పీ సంఘంలో ఓసారి ఏమి జరిగిందో తెలుసుకుంటే కూడా మనం ఇతరులతో ఎందుకు సమాధానంగా ఉండాలో అర్థంచేసుకుంటాం. యువొదియ, సుంటుకే సహోదరీల మధ్య తలెత్తిన ఒక సమస్య సంఘ సమాధానాన్నే పాడుచేసేంత పెద్ద సమస్యగా మారింది. (ఫిలి. 4:​2, 3) మనస్పర్థలను పరిష్కరించుకోకపోతే మన మధ్య సమస్య ఉందని అందరికీ తెలిసిపోతుంది. సంఘంలో ప్రేమా ఐక్యతలను కాపాడాలనే కోరిక మనకుంటే, మనం తోటి సహోదరులతో సమాధానంగా ఉండడానికి కృషిచేస్తాం.

“సమాధానపరచువారు ధన్యులు” అని యేసు చెప్పాడు. (మత్త. 5:⁠9) సమాధానపడడానికి కృషి చేయడం సంతృప్తినిస్తుంది. అంతేకాక “సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము” కాబట్టి ఇతరులతో సమాధానంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. (సామె. 14:​30) అదే, మనసులో కోపముంచుకుంటే ఆరోగ్యం క్షీణించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.

మనలో చాలామంది సమాధానపడడం అవసరమని అభిప్రాయపడినప్పటికీ, మనస్పర్థల్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియకపోవచ్చు. ఇప్పుడు మనకు సహాయంచేయగల బైబిలు సలహాలను చూద్దాం.

ప్రశాంతంగా మాట్లాడుకుంటే సమాధానపడవచ్చు

రోడ్లపై చిన్నచిన్న గుంటలు పడినచోట్ల చాలావరకూ తారు, కంకర కలిపిన మిశ్రమం వేసి పూడుస్తారు. మన సహోదరులు చేసే చిన్నచిన్న పొరపాట్లను మనం అలాగే కప్పివేయగలమా? “ప్రేమ అనేక పాపములను కప్పును” అని అపొస్తలుడైన పేతురు రాశాడు. కాబట్టి, మనం క్షమించ​గలిగితే మనస్పర్థలను చాలావరకూ తొలగించుకోవచ్చు.​—⁠1 పేతు. 4:⁠8.

కొన్నిసార్లు సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందంటే దానిని పట్టించుకోకుండా ఉండలేం. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన వెంటనే ఏమి జరిగిందో చూడండి. “రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపువారును” యొర్దాను నది దాటక ముందు “ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే.” వారు ఆ బలిపీఠాన్ని విగ్రహారాధన కోసం కట్టారని ఇశ్రాయేలీయుల్లోని ఇతర గోత్రాలవారు పొరబడ్డారు. వాళ్లు దాన్ని చూస్తూ ఊరుకోలేక యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు.​—⁠యెహో. 22:​9-12.

వాళ్లప్పటికే తప్పు చేశారని స్పష్టంగా కనిపిస్తుంది. అకస్మాత్తుగా దాడిచేస్తే ప్రాణనష్టాన్ని చాలావరకు తగ్గించవచ్చని కొంతమంది ఇశ్రాయేలీయులు అనుకుని ఉండవచ్చు. యొర్దానుకు పశ్చిమానున్న గోత్రాలవారు మాత్రం అలా తొందరపడకుండా తమ సహోదరులతో సమస్య గురించి చర్చించడానికి కొంతమందిని పంపించారు. “నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని, ఇశ్రాయేలీయుల దేవునిమీద మీరేల తిరుగుబాటు చేయుచున్నారు?” అని వారిని అడిగారు. బలిపీఠాన్ని కట్టిన ఆ గోత్రాలవారు నిజానికి యెహోవాను ఆరాధించడం మానుకోలేదు. వాళ్లను అలా నిందించినప్పుడు వారెలా స్పందించివుంటారో మీరు ఊహించగలరా? అలా నిందించినవారిపై మాటలతో ఎదురుదాడికి దిగారా, లేదా వారితో అసలు మాట్లాడకూడదని అనుకున్నారా? నిందపాలైన ఆ గోత్రాలవారు యెహోవాను సేవించాలనే ఉద్దేశంతోనే బలిపీఠాన్ని కట్టామని ప్రశాంతంగా, స్పష్టంగా వివరించారు. వాళ్లు అలా ప్రవర్తించడంవల్ల యెహోవాతో తమ సంబంధాన్ని కాపాడుకున్నారు. ప్రాణనష్టం జరగకుండా ఆపగలిగారు. వారలా ప్రశాంతంగా మాట్లాడుకోవడంతో సమస్య పరిష్కారమై మనస్పర్థలు తొలగిపోయాయి.​—⁠యెహో. 22:​13-34.

ఇతర గోత్రాలవారు దాడి చేయాలో వద్దో నిర్ణయించుకునే ముందు రూబేనీయులతో, గాదీయులతో, మనష్షే అర్ధగోత్రపువారితో జ్ఞానయుక్తంగా సమస్య గురించి చర్చించారు. దేవుని వాక్యం, “ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును” అని చెబుతోంది. (ప్రసం. 7:⁠9) తీవ్ర బేధాభిప్రాయాలను పరిష్కరించుకోవాలంటే ప్రశాంతంగా, అరమరికలు లేకుండా చర్చించుకోవాలి అని బైబిలు చెబుతోంది. ఫలానివాళ్లు మనల్ని బాధపెట్టారని అనుకుని వారిమీద కోపంతో మాట్లాడడం మానేస్తే యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడా?

మరి మన సహోదరులెవరైనా వచ్చి మనం వాళ్లని బాధపెట్టామంటూ బహుశా మనల్ని తప్పు​పడితే మనమేమి చేస్తాం? “మృదువైన మాట క్రోధమును చల్లార్చును” అని బైబిలు చెబుతోంది. (సామె. 15:⁠1) నిందపాలైన ఆ ఇశ్రాయేలు గోత్రాలవారు మృదువుగానే అయినా స్పష్టంగా మాట్లాడి తమను తప్పుపట్టిన సహోదరుల కోపాన్ని చల్లార్చారు. ఏదైనా సమస్య గురించి మనం సహోదరుని దగ్గరకు వెళ్లినా, లేదా ఆయనే మన దగ్గరకు వచ్చినా ముందుగా మనమే, ‘తిరిగి నా సహోదరునితో సమాధానపడడానికి నేనేమి చేస్తే బాగుంటుంది?’ అని ఆలోచించాలి. అంటే మాట్లాడుతున్నప్పుడు ‘నేనెలాంటి పదాలను ఉపయోగిస్తే, ఏ స్వరంతో మాట్లాడితే, ఎలా ప్రవర్తిస్తే బాగుంటుంది’ అని ఆలోచించాలి.

ఆలోచించి మాట్లాడండి

మనం మన అభిప్రాయాలను బయటికి చెప్పాలనుకుంటామని యెహోవాకు తెలుసు. మనస్పర్థలను పరిష్కరించుకోకపోతే సాధారణంగా దాని గురించి ఇతరులకు చెప్పాలనిపిస్తుంది. మనసులో కోపం ఉన్నప్పుడు ఎదుటివారిని విమర్శించడం మొదలుపెడతాం. నాలుకను అదుపులో ఉంచుకోకపోతే ఏమి జరుగుతుందో చూపిస్తూ సామెతలు 11:⁠11 ‘భక్తిహీనుల మాటలు పట్టణమును బోర్లద్రోయును’ అని చెబుతోంది. అలాగే తోటి క్రైస్తవుల గురించి అనాలోచితంగా మాట్లాడితే పట్టణంలాంటి సంఘంలోని సమాధానం దెబ్బతింటుంది.

సమాధానపడడానికి కృషిచేయడం అంటే మన సహోదర సహోదరీల గురించి అసలు ఏమీ మాట్లాడకూడదని కాదు. అపొస్తలుడైన పౌలు, “దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి” అని తోటి విశ్వాసులను హెచ్చరించాడు. బదులుగా, ‘వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించుడి’ అని చెప్పాడు. (ఎఫె. 4:​29-32) మీ మాటలవల్ల లేదా ప్రవర్తనవల్ల నొచ్చుకున్న ఒక సహోదరుడు మీతో మాట్లాడడానికి వచ్చాడనుకుందాం. ఆయన మీ గురించి ఎప్పుడూ చెడ్డగా మాట్లాడనట్లైతే, ఆయనను క్షమాపణ అడిగి సమాధానపడడం కష్టంగా అనిపిస్తుందా? అలాగే మనకు కూడ ఇతరుల గురించి ఎప్పుడూ మంచిగా మాట్లాడతామనే పేరుంటే మనస్పర్థలను సులువుగా పరిష్కరించుకోవచ్చు.​—⁠లూకా 6:⁠31.

‘ఏకమనస్కులై’ దేవుణ్ణి సేవించండి

మనలోని పాప స్వభావాన్నిబట్టి మనల్ని బాధపెట్టే​వారికి దూరంగా ఉండాలనుకుంటాం. కానీ అలా చేయడం అంత మంచిది కాదు. (సామె. 18:⁠1) ఐక్యతతో యెహోవా నామాన్ని స్మరించేవారమైన మనం ‘ఏకమనస్కులుగా’ ఉండాలని నిర్ణయించుకుందాం.​—⁠జెఫ. 3:⁠9.

ఎవరో అమర్యాదగా మాట్లాడారనీ, ప్రవర్తించారనీ మనం స్వచ్ఛారాధనను వదిలిపెట్టకూడదు. యేసు తన ప్రాణాన్ని బలిగా ఇవ్వడం ద్వారా ఆలయంలో బలుల ఏర్పాటును తీసివేయబోయే కొన్నిరోజుల ముందు ఒక బీద విధవరాలు కానుకపెట్టలో ‘తనకు కలిగిన జీవనమంతయు వేయడాన్ని’ చూశాడు. ఈ సంఘటన జరుగకముందు దేవాలయంలో నాయకత్వం వహించే శాస్త్రులను కూడ ఆయన ఖండించాడు. ఆలయ ఏర్పాటు త్వరలోనే తీసివేయబడుతుందని తెలిసిన యేసు ఆమెను డబ్బు వేయవద్దని వారించాడా? లేదు. బదులుగా, అప్పట్లో యెహోవా సంఘానికి ఆమె నమ్మకంగా మద్దతునిచ్చినందుకు మెచ్చుకున్నాడు. (లూకా 21:​1-4) యెహోవా ఆరాధనకు మద్దతివ్వడం ఆమె బాధ్యత. ఇతరులు అన్యాయంగా జీవిస్తున్నంత మాత్రాన దేవుని ఆరాధనకు మద్దతివ్వడం మానకూడదు.

ఒక క్రైస్తవ సహోదరుడు లేదా సహోదరి సరిగా ప్రవర్తించలేదని, అన్యాయం చేశాడని మనకు అనిపించినప్పుడు మనమేమి చేస్తాం? వాళ్ల ప్రవర్తననుబట్టి మనం యెహోవాను పూర్ణ హృదయంతో సేవించడం మానేస్తామా? దేవుని సంఘంలో సమాధానం ఉండడం చాలా ప్రాముఖ్యం. మరి దాన్ని కాపాడడానికి, ధైర్యంగా మనస్పర్థలను పరిష్కరించుకోవడానికి మనం ప్రయత్నిస్తామా?

“శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి” అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (రోమా. 12:​18) అలా చేయాలని తీర్మానించుకుని ఎల్లప్పటికీ జీవమార్గంలో పయనిద్దాం.

[అధస్సూచి]

^ పేరా 6 మత్తయి 18:​15-17లోని యేసు ఉపదేశం గురించి కావలికోట అక్టోబరు 15, 1999, 17-22 పేజీలను చూడండి.

[17వ పేజీలోని చిత్రం]

యువొదియ, సుంటుకేలు సమాధానపడడానికి కృషిచేయాల్సివచ్చింది

[18వ పేజీలోని చిత్రం]

సమాధానపడడానికి ఎలాంటి పదాలను ఉపయోగిస్తే, ఏ స్వరంతో మాట్లాడితే, ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందని ఆలోచించండి