కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కొరియాలో ఆధ్యాత్మిక అభివృద్ధిని చూశాను

కొరియాలో ఆధ్యాత్మిక అభివృద్ధిని చూశాను

కొరియాలో ఆధ్యాత్మిక అభివృద్ధిని చూశాను

మిల్టన్‌ హామిల్టన్‌ చెప్పినది

“మిషనరీల అవసరం తమ దేశంలో లేదని చెబుతూ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా ప్రభుత్వం మీ వీసాలను రద్దు చేసిందని చెప్పేందుకు విచారిస్తున్నాం. . . . పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని తాత్కాలికంగా జపాన్‌కు పంపిస్తున్నాం.”

పై సందేశాన్ని నేను నా భార్య అమెరికాలోని న్యూయార్క్‌లోవున్న బ్రూక్లిన్‌ నుండి 1954వ సంవత్సరాంతంలో అందుకున్నాం. ఆ సంవత్సర ఆరంభంలోనే మేము ఉత్తర న్యూయార్క్‌లో జరిగిన గిలియడ్‌ పాఠశాల 23వ తరగతిలో పట్టభద్రులమయ్యాం. మాకు ఉత్తరం అందేనాటికి తాత్కాలికంగా ఇండియానాలోని ఇండియానాపోలిస్‌లో సేవచేస్తున్నాం.

నేను, నా భార్య లిజ్‌ (అంతకుముందు లిజ్‌ సిమోక్‌), స్కూల్లో ఉన్నప్పుడు ఒకే తరగతిలో చదివాం. 1948లో మేము పెళ్లిచేసుకున్నాం. తను పూర్తికాల సేవ చేయడానికైతే ఇష్టపడింది కానీ, అమెరికాను విడిచి వేరే ప్రాంతానికి వెళ్లడానికి ఇష్టపడలేదు. అయితే, తన మనస్సు ఎందుకు మార్చుకుంది?

గిలియడ్‌ పాఠశాలకు వెళ్లాలనుకునేవారి కోసం ఏర్పాటు చేసిన కూటంలో నాతోపాటు కూర్చునేందుకు ఇష్టపడింది. ఆ కూటం 1953 వేసవికాలంలో న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఏర్పాటుచేయబడింది. దానికి హాజరైన తర్వాత మేమెంతగా ప్రోత్సహించబడ్డామంటే వెంటనే గిలియడ్‌ పాఠశాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం. ఆశ్చర్యకరంగా, మేము 1954 ఫిబ్రవరిలో జరిగే తరగతికి ఆహ్వానించబడ్డాం.

కొరియాలో మూడు సంవత్సరాలపాటు జరిగిన యుద్ధం 1953 వేసవికాలంలో ముగిసింది. దానివల్ల ఆ దేశం ధ్వంసమైంది. ఆ దేశ పరిస్థితి అలా ఉన్నా మమ్మల్ని అక్కడికి పంపించారు. ఉత్తరంలో చెప్పబడినట్లు, మేము మొదట జపాన్‌కు వెళ్లాం. 20 రోజుల సముద్రయానం చేసిన తర్వాత 1955 జనవరిలో మేము, మాతోపాటు ఆరుగురు మిషనరీలు కొరియా చేరుకున్నాం. ఓడరేవుకు మేము చేరుకునేసరికి ఉదయం 6 గంటలు అయింది. అప్పట్లో జపాన్‌ బ్రాంచిని పర్యవేక్షిస్తున్న లాయిడ్‌ బ్యారీ మమ్మల్ని కలుసుకోవడానికి అక్కడికి వచ్చారు. ఆ తర్వాత మేము యోకోహామాలోని మిషనరీ గృహానికి చేరుకున్నాం. చేరుకున్న రోజునే ప్రకటనా పని మొదలుపెట్టాం.

చివరకు కొరియా చేరుకున్నాం

కొంతకాలానికి, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా వెళ్లేందుకు మాకు విసాలు దొరికాయి. 1955 మార్చి 7న మా విమానం టోక్యోలోని హనేడా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి మూడు గంటల్లో సియోల్‌లోని యోయిడో విమానాశ్రయానికి చేరుకుంది. దాదాపు 200 మంది సాక్షులు మమ్మల్ని ఆహ్వానించారు. వాళ్లను చూసినప్పుడు మాకు ఆనందభాష్పాలు వచ్చాయి. అప్పట్లో కొరియా అంతటా 1,000 మంది సాక్షులే ఉండేవారు. ప్రాచ్యదేశాలవారందరూ ఒకేలా కనిపిస్తారని, ఒకేలా ప్రవర్తిస్తారని ఇతర పాశ్చాత్య​దేశాలవారిలాగే అంతవరకు మేమూ అనుకున్నాం. కానీ అది నిజంకాదని కొంతకాలానికే మాకర్థమైంది. వారి భాష, అక్షరాలు మాత్రమే కాదు, వారి వంట చేసే విధానాలు, వారు కనిపించేతీరు, వారి సాంప్రదాయ దుస్తులతోపాటు, గృహనిర్మాణ శైలి వంటి అనేక విషయాలు చాలా భిన్నంగా ఉంటాయి.

మొదట్లో భాష నేర్చుకోవడం మాకు చాలా కష్టమనిపించింది. కొరియా నేర్చుకోవడానికి సహాయం చేసే పుస్తకాలేవీ అప్పుడు అందుబాటులో లేవు. కేవలం ఆంగ్ల భాష ఉచ్ఛారణతో కొరియా భాషను సహజ శైలిలో మాట్లాడ​లేమనీ కొరియా అక్షరాలు నేర్చుకుంటేనే ఆ భాషలోని పదాలను సరిగ్గా ఉచ్ఛరించగలుగుతామనీ కొన్నిరోజులకే మాకు అర్థమైంది.

మేము ఆ భాష మాట్లాడుతున్నప్పుడు ఎన్నో తప్పులు చేశాం. ఉదాహరణకు, లిజ్‌ ఒక గృహస్థురాలిని బైబిలు ఉంటే తీసుకురమ్మని అడిగింది. ఆ గృహస్థురాలు మమ్మల్ని వింతగా చూసి లోపలికెళ్లి అగ్గిపెట్టె తీసుకొచ్చింది. ఎందుకంటే లిజ్‌ సంగ్‌క్యంగ్‌ (బైబిలు) తెమ్మని అడిగే బదులు సంగ్యంగ్‌ (అగ్గిపెట్టెల) తెమ్మని అడిగింది.

కొన్ని నెలల తర్వాత మిషనరీ గృహాన్ని స్థాపించడానికి సంస్థ మమ్మల్ని దక్షిణాన ఉన్న ఓడరేవు పట్టణమైన పుసాన్‌కు పంపించింది. మేము మా ఇద్దరి కోసం, మాతోపాటు పనిచేసేందుకు నియమించబడిన ఇద్దరు సహోదరీల కోసం మూడు చిన్నచిన్న గదులను అద్దెకు తీసుకోగలిగాం. ఆ గదుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే, నీళ్లు సరిగ్గా వచ్చేవి కావు, బాత్రూం కోసం నీళ్లు పట్టివుంచాల్సివచ్చేది. రాత్రివేళ మాత్రమే నీళ్లు రెండవ అంతస్థువరకు ఎక్కేంత జోరుగా వచ్చేవి. అందుకే నీళ్లను పాత్రల్లో పట్టివుంచడానికి వంతులవారిగా మేము తెల్లవారుజామున లేచేవాళ్ళం. తాగడానికి మేము నీళ్ళు కాయాల్సివచ్చేది లేదా క్లోరిన్‌ కలపాల్సివచ్చేది.

ఇతర సమస్యలు కూడ ఎదురయ్యాయి. విద్యుత్తు సరఫరా సరిగ్గా ఉండేది కాదు, కాబట్టి వాషింగ్‌ మెషిన్‌, ఇస్త్రీ పెట్టె ఉపయోగించలేకపోయేవాళ్లం. హాల్లోనే వంట వండుకునేవాళ్లం. వండుకోవడానికి మా దగ్గర కిరోసిన్‌ స్టవ్‌ మాత్రమే ఉండేది. కొరియాలో అందుబాటులో ఉన్నవాటితోనే వంటవండడం నేర్చుకొని వంతుల ప్రకారం వంట చేసేవాళ్లం. కొరియాకు వచ్చిన మూడు సంవత్సరాలకు నాకు నా భార్యకు హెపటైటిస్‌ సోకింది. అప్పట్లో చాలామంది మిషనరీలు ఈ వ్యాధి బారినపడ్డారు. మేము కోలు​కోవడానికి ఎన్నో నెలలు పట్టింది, ఇలా మరెన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాం.

అడ్డంకులను అధిగమించడానికి సహాయం చేశాం

గత 55 సంవత్సరాలుగా కొరియా రాజకీయ పరిస్థితి అస్థిరంగా ఉంది. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని నివారించేందుకు సరిహద్దుల్లో నిరాయుధీకరణ చేయబడిన ప్రాంతామే (DMZ, or demilitarized zone) కొరియా ద్వీపకల్పాన్ని రెండుగా విభజిస్తుంది. ఇది రిపబ్లిక్‌ అఫ్‌ కొరియా రాజధానియైన సియోల్‌కు ఉత్తరాన 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1971లో ఫ్రెడ్రిక్‌ ఫ్రాంజ్‌ బ్రుక్లిన్‌ ప్రధానకార్యాలయం నుండి కొరియాను సందర్శించడానికి వచ్చారు. నిరాయుధీకరణ చేయబడిన సరిహద్దు ప్రాంతానికి ఆయనను తీసుకెళ్లాను. ప్రపంచంలో అంత గట్టి బందోబస్తు ఉన్న ప్రాంతం మరెక్కడా కనిపించదు. ఎన్నో సంవత్సరాలుగా, ఐక్యరాజ్యసమితి అధికారులు ఆ రెండు ప్రభుత్వాల ప్రతినిధులను అక్కడ అనేకసార్లు కలుసుకున్నారు.

కొరియా ద్వీపకల్పంతో సహా, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు ఎలావున్నా మనమైతే అలాంటి విషయాల్లో తటస్థంగా ఉంటాం. (యోహా. 17:​14) ఆయుధాలు చేపట్టడానికి నిరాకరించడంవల్ల దాదాపు 13,000 మంది కొరియా సాక్షులు జైలు శిక్షను అనుభవించారు. వారి శిక్షా​కాలాన్ని కలిపితే 26,000 సంవత్సరాలౌతుంది. (2 కొరిం. 10:​3, 4) తాము ఈ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ దేశంలోని యువసాక్షులందరికీ తెలిసినా భయపడలేదు. అయితే, విచారకరంగా ఇక్కడి ప్రభుత్వం వారిని “నేరస్థులుగా” ముద్రవేసింది. తమ క్రైస్తవ తటస్థతను వదులుకోకపోవడమే వారు చేసిన ఏకైక “నేరం.”

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అంటే, 1944లో సైన్యంలో చేరేందుకు నిరాకరించినందుకు పెన్సిల్వేనియాలోని లువిస్బర్గ్‌లో ఉన్న అమెరికా సంస్కరణ జైల్లో నేను కూడ రెండున్నర సంవత్సరాలు శిక్ష అనుభవించాను. నాకన్నా కొరియా సహోదరులు జైల్లో ఎన్నో కష్టాలు అనుభవించారు. అయితే, వారు ఎలాంటి బాధలు అనుభవించారో నేను అర్థంచేసుకోగలను. కొరియాలో నాతోపాటు మిషనరీలుగా ఉన్న కొందరు అలాంటి కష్టాలే ఎదుర్కొన్నారని తెలుసుకొని చాలామంది ప్రోత్సాహం పొందారు.​—⁠యెష. 2:⁠4.

మాకొక సవాలు ఎదురైంది

మా తటస్థతకు సంబంధించిన ఒక సమస్య 1977లో ప్రారంభమైంది. కొరియా యువకులను సైన్యంలో చేరకుండా, ఆయుధాలను చేపట్టకుండా చేస్తున్నామని అధికారులు అనుకున్నారు. మిషనరీలు ఏ కారణంచేతనైనా దేశాన్ని విడిచివెళ్లాల్సివస్తే వారిని తిరిగి తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిషేధం 1977 నుండి 1987 వరకు కొనసాగింది. మేము ఆ సంవత్సరాల్లో కొరియాను విడిచిపెట్టివుంటే తిరిగి దేశంలోకి వచ్చేందుకు అనుమతి లభించి ఉండేదికాదు. అందుకే మేము ఆ సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంటికి వెళ్లలేదు.

క్రీస్తు అనుచరులముగా మేము ఎందుకు తటస్థంగా ఉంటామో వివరించడానికి అనేకసార్లు ప్రభుత్వాధికారులను కలిశాం. మేము బెదిరిపోవడంలేదని వారు గుర్తించి పదేళ్లుగా ఉన్న నిషేధాన్ని చివరకు ఎత్తివేశారు. ఆ సంవత్సరాల్లో అనారోగ్య సమస్యలవల్ల, మరితర కారణాలవల్ల కొందరు మిషనరీలు దేశాన్ని విడిచివెళ్లారు, కానీ మిగతావాళ్లం ఇక్కడే ఉండిపోయాం. అలా ఉండగలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాం.

1985 ఆ మధ్యకాలంలో, సైన్యంలో చేరొద్దని యువకులకు బోధిస్తున్నారనే నిందను వ్యతిరేకులు మన చట్టపరమైన కార్పొరేషన్‌ డైరెక్టర్లమీద వేశారు. దానితో ప్రభుత్వం మాలో ప్రతీ ఒక్కరినీ విచారణ చేసింది. 1987 జవవరి 22న మాపై వేయబడిన నిందలు నిరాధారమైనవని కోర్టు గుర్తించింది. దానివల్ల మేము భవిష్యత్తులో మళ్లీ అలాంటి సమస్య ఎదుర్కోలేదు.

దేవుడు మా పనిని ఆశీర్వదించాడు

సంవత్సరాలు గడిచేకొద్దీ కొరియాలో మా తటస్థత కారణంగా పరిచర్యలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. దానివల్ల పెద్ద సమావేశాలు జరుపుకోవడానికి అనువుగా స్థలాన్ని వెతకడం చాలా కష్టమయ్యింది. అందుకే, సహోదరులు చొరవతీసుకొని పుసాన్‌లో ఒక సమావేశ హాల్‌ను నిర్మించారు. అది ప్రాచ్య దేశంలోనే మొదటిది. 1976 ఏప్రిల్‌ 5వ తారీఖున, 1,300 మంది ముందు ఆ హాల్‌ ప్రతిష్ఠాపన ప్రసంగాన్నిచ్చే అవకాశం నాకు దొరికింది.

1950 నుండి వేలాదిమంది అమెరికా సైనికులు కొరియాకు పంపించబడ్డారు. వారిలో చాలామంది అమెరికాకు తిరిగివెళ్లిన తర్వాత సాక్షులయ్యారు, వారు ఇప్పటికీ చురుగ్గా సేవచేస్తున్నారు. మాకు తరచూ వారినుండి ఉత్తరాలు వస్తుంటాయి. యెహోవాను తెలుసుకునేలా వారికి సహాయం చేయడం మాకు లభించిన ఆశీర్వాదంగా భావిస్తున్నాం.

విచారకరంగా, 2006 సెప్టెంబరు 26వ తేదీన నా ప్రియ సహచరియైన లిజ్‌ మరణించింది. తను లేని లోటు నాకు ఎంతగానో కనిపిస్తుంది. తను ఇక్కడున్న 51 సంవత్సరాల్లో తనకు దొరికిన ఏ నియామకాన్నైనా సంతోషంగా చేసింది, ఏనాడూ ఫిర్యాదుచేయలేదు. ఎన్నడూ అమెరికాను విడిచిపెట్టకూడదనుకున్న తను అమెరికాకు తిరిగివెళ్తే బాగుంటుందని ఏనాడూ అనలేదు!

నేను ప్రస్తుతం కొరియా బెతెల్‌లో సేవచేస్తున్నాను. ఆరంభంలో బెతెల్‌ కుటుంబం వేళ్లమీద లెక్కపెట్టేంత చిన్నదిగా ఉండేది. ఇప్పుడైతే దానిలో దాదాపు 250 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం ఇక్కడ జరిగే పనిని ఏడుగురు సభ్యులున్న బ్రాంచి కమిటీ పర్యవేక్షిస్తోంది. వారిలో ఒక సభ్యునిగా నేను సేవచేస్తున్నాను.

మేము కొరియాకు వచ్చినప్పుడు ఇది నిరుపేద దేశం. కానీ ఇది ఇప్పుడు ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా పేరుగాంచింది. కొరియాలో ప్రస్తుతం 95,000 కన్నా ఎక్కువమంది సాక్షులున్నారు. వారిలో సుమారు 40 శాతంమంది క్రమ పయినీర్లుగానో సహాయ పయినీర్లుగానో సేవచేస్తున్నారు. ఈ కారణాలన్నింటిని బట్టి, ఇక్కడ దేవునికి సేవచేసే, ఆధ్యాత్మిక అభివృద్ధి చూసే అవకాశం దొరికినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.

[24వ పేజీలోని చిత్రం]

తోటి మిషనరీలతో కొరియా చేరుకోవడం

[24, 25వ పేజీలోని చిత్రం]

పుసాన్‌లో సేవచేయడం

[25వ పేజీలోని చిత్రం]

1971లో, నిరాయుధీకరణ చేయబడిన సరిహద్దువద్ద సహోదరుడు ఫ్రాంజ్‌తో తీసుకున్న చిత్రం

[26వ పేజీలోని చిత్రం]

లిజ్‌ చనిపోవడానికి కొంతకాలం ముందు తీసుకున్న ఫొటో

[26వ పేజీలోని చిత్రం]

నేను ఇప్పటికీ ఈ కొరియా బ్రాంచిలో బెతెల్‌ సభ్యునిగా సేవచేస్తున్నాను