కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

లేవీయకాండము 3:16లో ‘మీరు క్రొవ్వును తినకూడదు’ అనే ఆజ్ఞ ఇవ్వబడింది. కానీ నెహెమ్యా 8:10లో “క్రొవ్విన మాంసము భక్షించుడి” అని యూదులకు చెప్పబడింది. అలాంటప్పుడు ఈ రెండు వచనాలను మనం ఎలాఅర్థంచేసుకోవచ్చు?

నెహెమ్యా 8:10లో “క్రొవ్విన మాంసము” అని, లేవీయకాండము 3:16లో “క్రొవ్వు” అని అనువదించబడిన ఈ పదాలకు మూల భాషలో వేర్వేరు అర్థాలున్నాయి. లేవీయకాండము 3:16లో “క్రొవ్వు” అనే పదానికి హెబ్రీ భాషలో కిలేవ్‌ అనే పదం ఉపయోగించబడింది. ఈ పదం జంతువుల క్రొవ్వును లేక మనుష్యుల క్రొవ్వును సూచిస్తుంది. (లేవీ. 3:⁠3; న్యాయా. 3:​22) 16వ వచనంలోని సందర్భాన్నిబట్టి చూస్తే ఇశ్రాయేలీయులు బలి అర్పించే జంతువుల ఆంత్రములను కప్పు క్రొవ్వును, రెండు మూత్ర గ్రంథులమీదున్న, డొక్కలపైనున్న క్రొవ్వును తినకూడదని ఆజ్ఞాపించబడ్డారు. ఎందుకంటే, ఆ “క్రొవ్వంతయు యెహోవాదే.” (లేవీ. 3:​14-16) కాబట్టి, వారు యెహోవాకు అర్పించాల్సిన జంతువుల క్రొవ్వు తినకూడదు.

మూల భాషలో మాష్‌మానీమ్‌ అనే పదం నెహెమ్యా 8:10లో “క్రొవ్విన మాంసము” అని అనువదించబడింది. హెబ్రీ లేఖనాల్లో ఈ ఒక్క చోట మాత్రమే ఈ పదం కనిపిస్తుంది. ఈ పదం, షామెన్‌ అనే క్రియా పదం నుండి వచ్చింది. దీనికి “లావుగా ఉండు, లావవ్వు” అనే అర్థాలున్నాయి. ఈ క్రియా పదానికి సంబంధించిన చాలా పదాలు, సమృద్ధి, సంక్షేమాలను సూచించడానికే ఉపయోగించబడి ఉండవచ్చు. (యెషయా 25:6 పోల్చండి.) ఈ క్రియా పదం నుండి వాడుకలోకి వచ్చిన అనేక పదాల్లో షీమెన్‌ అనే నామవాచకం ఒకటి. ఇది చాలా సందర్భాల్లో “నూనె” అని అనువదించబడింది. “ఒలీవ నూనె” అనే మాటలో కూడా ఈ పదం ఉపయోగించబడింది. (ద్వితీ. 8:⁠8; లేవీ. 24:⁠2) నెహెమ్యా 8:10లో ఉపయోగించబడిన మాష్‌మానీమ్‌ అనే పదం నూనె ఎక్కువగా ఉపయోగించి వండిన వంటకాన్ని సూచిస్తుండవచ్చు. అంతేగాక ఇది, జంతువులో ఉండే క్రొవ్వు భాగాన్ని కాదు గాని మాంసంలో సాధారణంగా అక్కడక్కడ ఉండే క్రొవ్వును కూడా సూచిస్తుండవచ్చు.

ఇశ్రాయేలీయులు జంతువులోవున్న క్రొవ్వును తినకూడదని ఆజ్ఞాపించబడ్డారు. అయితే, వారు నూనెతో వండిన మంచి రుచిగల ఆహారాన్ని తినవచ్చు. ఆ కాలంలో వారు కొన్ని పిండి పదార్థాలను జంతువుల క్రొవ్వుతో కాదుగానీ కూరగాయల నుండి తీసిన నూనెతో వండుకునేవారు. ఆ వంటకాలకు ఎక్కువగా ఒలీవ నూనెనే ఉపయోగించేవారు. (లేవీ. 2:⁠7) లేఖనములపై అంతర్దృష్టి వివరిస్తున్న ప్రకారం “క్రొవ్విన మాంసము” అనే పదం “చిక్కిపోయిన జంతుమాంసాన్ని కాదుగానీ బలిష్టమైన జంతుమాంసాన్ని, కూరగాయల నుండి తీయబడిన నూనెతో చేసిన నోరూరించే రుచిగలపదార్థాలను” సూచిస్తుంది.

ఏదేమైనప్పటికీ, క్రొవ్వును తినకూడదన్న ఆజ్ఞ ధర్మశాస్త్రానికి సంబంధించినదని క్రైస్తవులు గుర్తుంచుకోవాలి. జంతు బలులకు సంబంధించిన వాటితో పాటు ఏ ధర్మశాస్త్ర నియమాల కింద నేడు క్రైస్తవులు లేరు.​—⁠రోమా. 3:​20; 7:​4, 6; 10:⁠4; కొలొ. 2:​16, 17.