కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రాచీన కీల లిపి, బైబిలు

ప్రాచీన కీల లిపి, బైబిలు

ప్రాచీన కీల లిపి, బైబిలు

బాబెలు దగ్గర మానవ భాషలు తారుమారు అయిన తర్వాత వివిధ లిపులు ఉనికిలోకి వచ్చాయి. మెసొపొటేమియా ప్రాంతంలో నివసించిన సుమేరీయులు, బబులోనీయులు కీల లిపిని వాడేవారు. ఈ పదం “త్రిభుజ ఆకారంగల” అనే అర్ధాన్నిచ్చే లాటీన్‌ పదం నుండి తీసుకోబడింది. తడి మట్టి ముద్దపై పదునైన పుల్లలను ఉపయోగించి త్రికోణాకారంలో గుర్తులను వేసేవారు కాబట్టి ఆ లిపికి కీల లిపి అనే పేరువచ్చింది.

లేఖనాల్లో ప్రస్తావించబడిన వ్యక్తుల గురించి, సంఘటనల గురించి వివరించే కీల లిపి పలకలను పురావస్తు శాస్త్రజ్ఞులు వెలికి తీశారు. అయితే ఈ ప్రాచీన లిపి గురించి మనకేమి తెలుసు? బైబిలు ప్రామాణికమైనదని ఆ లిపి ఎలా నిరూపిస్తుంది?

చాలా కాలం నిలిచిన పలకలు

మెసొపొటేమీయులు మొదట్లో బొమ్మల రూపంలో రాసేవారని, ప్రతీ పదాన్ని లేదా విషయాన్ని సూచించేందుకు ఒక చిహ్నాన్ని లేదా చిత్రాన్ని గీసేవారని విద్వాంసులు నమ్ముతున్నారు. ఉదాహరణకు, మొదట్లో ఒక ఎద్దును సూచించడానికి ఎద్దు తలలా కనిపించే బొమ్మను గీసేవారు. వివరాలను భద్రపరచాల్సిన అవసరం పెరిగేకొద్ది కీల లిపి అభివృద్ధి చెందింది. “ఇప్పుడు పదాలనే కాక ఒక పదంలోని అక్షరాలను సూచించే గుర్తులు కూడ అభివృద్ధిలోకి వచ్చాయి, అనేక గుర్తులను కలిపి రాస్తే ఒక పదం తయారయ్యేది” అని ఎన్‌ఐవి ఆర్కియోలాజికల్‌ స్టడీ బైబిల్‌ చెబుతుంది. కొంతకాలానికి, “మాటలను, భాషలోని సంశ్లిష్టమైన వ్యాకరణాంశాలను, పదబంధాలను సరియైన విధంగా సూచించే” దాదాపు 200 గుర్తులు అభివృద్ధి చెందాయి.

అబ్రాహాము కాలానికల్లా అంటే దాదాపు సా.శ.పూ. 2000వ సంవత్సరానికల్లా కీల లిపి పూర్తిగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాతి 20 శతాబ్దాల్లో దాదాపు 15 భాషల్లో ఈ లిపిని వాడడం మొదలుపెట్టారు. వెలుగులోకి వచ్చిన కీల లిపి రాతల్లో 99 కన్నా ఎక్కువ శాతం మట్టి పలకలపై రాసినవే. గతించిన 150 సంవత్సరాల్లో ఊరు, యురక్‌, బబులోను, నిమ్రూదు, నిపూర్‌, ఆషూర్‌, నీనెవె, మారి, ఇబ్లా, యుగారిట్‌, అమర్నా పట్టణాల్లో అలాంటి పలకలు ఎన్నో దొరికాయి. ఆర్కియోలాజి ఓడిస్సీ ఇలా చెబుతుంది: “ఇప్పటికే దాదాపు పది నుండి ఇరవై లక్షల కీల లిపి పలకలు వెలికి తీయబడ్డాయనీ, ప్రతీ సంవత్సరం దాదాపు 25,000 కన్నా ఎక్కువ పలకలు దొరుకుతున్నాయనీ నిపుణులు అంచనా వేస్తున్నారు.”

వాటిని అనువదించే పెద్ద సవాలు ప్రపంచంలోని కీల లిపి విద్వాంసులందరి ముందు ఉంది. “ప్రస్తుతం అందుబాటులోవున్న కీల లిపి రాతల్లో కేవలం పదిశాతమే వారు కనీసం ఒక్కసారైన చదగలిగారని” ఒక అంచనానుబట్టి తెలుస్తుంది.

రెండుమూడు భాషల్లో సమాచారమున్న కీల లిపి పలకలు దొరకడంవల్ల దానిలోని సమాచారాన్ని అర్థం చేసుకోవడం సులభమైంది. కీల లిపి పలకల్లో ఉన్న సమాచారం వేర్వేరు భాషల్లో రాయబడినప్పటికీ వాటిలోని సమాచారం ఒక్కటే అని విద్వాంసులు గుర్తించారు. పరిపాలకుల పేర్లు, బిరుదులు, వంశావళులు, చివరకు స్వయంస్తుతి కోసం ఉపయోగించిన చిహ్నాలు ఆ పలకల్లో మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయని గుర్తించినప్పుడు ఆ భాషల్లోని సమాచారమంతా ఒక్కటే అనే ముగింపుకు వారు రాగలిగారు.

1850కల్లా విద్వాంసులు, కీల లిపిలోవున్న ప్రాచీన మధ్య ప్రాచ్య దేశపు వాడుక భాషయైన అక్కాడియా భాషను చదవగలిగారు. “ఈ అక్కాడియా భాషను అర్థం చేసుకున్న తర్వాతే మిగతా భాషలను ఎలా అర్థం చేసుకోవాలో తెలిసింది. దాని ఆధారంగా కీల లిపిలో ఉన్న మిగతా భాషలను అనువదించగలిగారు” అని ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. దీనిలోని సమాచారానికి లేఖనాలతో ఎలాంటి సంబంధం ఉంది?

బైబిలుతో ఏకీభవిస్తున్న రుజువులు

దావీదు యెరూషలేమును జయించేంతవరకు అంటే దాదాపు సా.శ.పూ. 1070 వరకు దాన్ని కనానీయులు పరిపాలించారని బైబిలు చెబుతోంది. (యెహో. 10:⁠1; 2 సమూ. 5:​4-9) కానీ కొందరు విద్వాంసులు దీనితో ఏకీభవించలేదు. అయితే 1887లో ఐగుప్తులోని అమర్నాలో ఓ పల్లెటూరు స్త్రీకి ఒక మట్టి పలక దొరికింది. కొంతకాలానికి అక్కడ దాదాపు 380 పలకలు దొరికాయి. వాటిలో ఐగుప్తు పరిపాలకులకూ (3వ ఆమెన్‌హోటెప్‌, ఆక్నాటన్‌) కనాను పరిపాలకులకూ మధ్య దౌత్య సంబంధాలకు సంబంధించిన సమాచారం ఉంది. వాటిలోని ఆరు ఉత్తరాలు యెరూషలేము పరిపాలకుడైన అబ్డీహీబా నుండి వచ్చినవే.

బిబ్లికల్‌ ఆర్కియాలజీ రివ్యూ అనే పత్రిక ఇలా చెబుతోంది: “యెరూషలేము ఓ పట్టణమే గానీ ఒక చిన్న ప్రదేశంకాదనీ, అబ్డీహీబా . . . యెరూషలేములో నివసిస్తూ ఆ పట్టణానికి అధిపతిగా వ్యవహరించాడనీ, 50 మంది ఐగుప్తు సైనికులు ఆ పట్టణంలో నియమించబడ్డారనీ అమర్నాలో దొరికిన పలకలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. వీటన్నిటినిబట్టి యెరూషలేము కొండమీదున్న చిన్న రాజ్యమని తెలుస్తుంది.” అదే పత్రిక తర్వాత ఇలా చెప్పింది: “అమర్నాలో దొరికిన ఉత్తరాల్నిబట్టి యెరూషలేము పట్టణం నిజంగానే ఉనికిలో ఉండేదని, అది ఆ కాలంలో ప్రఖ్యాతిగాంచిందని మనం పూర్తిగా నమ్మవచ్చు.”

అష్షూరీయుల, బబులోనీయుల పలకల్లో ఉన్న పేర్లు

మొదట అష్షూరీయులు, ఆ తర్వాత కొంతకాలానికి బబులోనీయులు మట్టిపలకలపైనే కాక, స్థూపాకార మట్టిదిమ్మలు, మట్టి పట్టకాలు, స్మారకచిహ్నాలు వంటి వాటిపైన కూడ తమ చరిత్రను రాసుకున్నారు. అందుకే, విద్వాంసులు అక్కాడియా కీల లిపి పలకలమీదున్న సమాచారాన్ని అర్థం చేసుకున్నప్పుడు వాటిలో అనేక బైబిలు పేర్లు ఉన్నట్లు గ్రహించారు.

ద బైబిల్‌ ఇన్‌ ద బ్రిటీష్‌ మ్యూజియమ్‌ ఇలా చెబుతోంది: ‘1870లో కొత్తగా ఏర్పడిన బిబ్లికల్‌ ఆర్కియాలజీ అనే సొసైటీని ఉద్దేశించి మాట్లాడినప్పుడు డా. సామ్యూల్‌ బిర్చ్‌ హెబ్రీ రాజులైన ఒమ్రీ, ఆహాబు, యెహూ, అజర్యా, మెనహేము, పెకహు, హోషేయ, యెహెజ్కేలు, మనష్షే, అష్షూరు రాజులైన [3వ] తిగ్లత్పిలేసెరు . . . సర్గోను, సన్హెరీబు, ఏసర్హద్దోను, ఆస్నప్పరు, సిరియన్లు అయిన బెన్హదాదు, హజాయేలు, రెజీను వంటివారి [పేర్లను కీల లిపి పలకలపై] గుర్తించగలిగాడు.’

ద బైబిల్‌ అండ్‌ రేడియోకార్బన్‌ డేటింగ్‌ అనే పుస్తకం బైబిల్లోవున్న ఇశ్రాయేలీయుల, యూదుల చరిత్రను ప్రాచీన కీల లిపి పలకలమీదున్న సమాచారంతో పోల్చిచూసింది. దాని ఫలితమేమిటి? “ఇతర దేశాల సమకాలీన చరిత్రల్లో 15 లేదా 16 మంది యూదా, ఇశ్రాయేలు రాజుల గురించిన వివరాలు ఇవ్వబడ్డాయి. వారి పేర్లు, వారు జీవించిన కాలాలు [బైబిలు పుస్తకమైన] రాజుల గ్రంథములో ఇవ్వబడిన వివరాలతో పొందికగా ఉన్నాయి. ఎవరినీ వదిలిపెట్టకుండా ప్రతీ రాజు పేరును ఆ పలకలపై ప్రస్తావించారు. విదేశీ పలకలపై కనిపించే ఆ పేర్లన్నీ రాజుల గ్రంథంలో ఉన్నాయి.”

1879లో కీల లిపిలో ఉన్న ప్రఖ్యాత కోరెషు స్థూపం వెలుగులోకి వచ్చింది. సా.శ.పూ. 539లో బబులోనును జయించిన తర్వాత కోరెషు చెరలో ఉన్నవారిని తిరిగి తమతమ దేశాలకు పంపించాలని తాను జారీచేసిన ఆజ్ఞను అమలుచేశాడని ఆ స్థూపం చెబుతోంది. దీని నుండి యూదులు కూడ ప్రయోజనం పొందారు. (ఎజ్రా 1:​1-4) బైబిల్లో పేర్కొనబడిన ఆ ఆజ్ఞ నిజంకాదని 19వ శతాబ్దంలో చాలామంది విద్వాంసులు వాదించారు. అయితే, కోరెషు స్థూపంతోసహా పారసీకుల కాలంలో దొరికిన కీల లిపి పలకలు బైబిల్లో ఉన్న సమాచారం ఖచ్చితమైనదని చూపించే అనేక రుజువులనిచ్చాయి.

1883లో భద్రపరచబడిన 700 కన్నా ఎక్కువ కీల లిపి పలకలు బబులోను సమీపంలోవున్న నిపూర్‌లో వెలుగులోకి వచ్చాయి. వాటిలో పేర్కొనబడిన 2,500 పేర్లలో 70 పేర్లు యూదులవేనని విద్వాంసులు గుర్తించారు. ఆ పలకల మీదున్న పేర్లు “ఒప్పందం కుదుర్చుకున్నవారి, మధ్యవర్తుల, సాక్య్షుల, పన్ను వసూలుచేసేవారి, రాజ్యాధికారుల పేర్లు” కావచ్చని చరిత్రకారుడైన ఎడ్విన్‌ యామౌచీ చెబుతున్నాడు. ఆ కాలంలో యూదులు బబులోనుకు దగ్గర్లో అలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్నారని చూపించే రుజువులు చాలా ప్రాముఖ్యం. బైబిల్లో ప్రవచించబడినట్లే అష్షూరు నుండి, బబులోను నుండి చెరలోవున్న ఇశ్రాయేలీయుల “శేషము” యూదాకు తిరిగివచ్చారు కానీ చాలామంది అక్కడే ఉండిపోయారన్న విషయాన్ని కూడ ఆ పలకలు రుజువుచేస్తున్నాయి.​—⁠యెష. 10:​21, 22.

సా.శ.పూ. మొదటి సహస్రాబ్దిలో, కీల లిపే కాక మామూలు లిపి కూడ వాడుకలో ఉండేది. అయితే, అష్షూరీయులు, బబులోనీయులు క్రమక్రమంగా కీల లిపిని వాడడం మానేసి మామూలు లిపిని వాడడం మొదలుపెట్టారు.

ఇంకా అధ్యయనం చేయాల్సిన వేలాది పలకలు మ్యూజియమ్‌లలో ఉన్నాయి. కానీ విద్వాంసులు ఇప్పటికే అధ్యయనం చేసిన పలకల్లో బైబిలు ప్రామాణికమైనదని చూపించే ఎన్నో రుజువులున్నాయి. ఇంకా అధ్యయనం చేయనివాటిలో ఎన్ని రుజువులున్నాయో ఎవరికి తెలుసు?

[21వ పేజీలోని చిత్రసౌజన్యం]

Photograph taken by courtesy of the British Museum