కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరన్ని సమయాల్లో యథార్థంగా ఉంటారా?

మీరన్ని సమయాల్లో యథార్థంగా ఉంటారా?

మీరన్ని సమయాల్లో యథార్థంగా ఉంటారా?

“మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.”​—⁠యోబు 27:⁠5.

మీరు ఇంటి ప్లాన్స్‌కి సంబంధించిన డిజైన్లు చూస్తున్నారని అనుకుందాం. వాటిలో ఒకటి మీకు నచ్చింది. ఆ ఇల్లు మీకూ మీ కుటుంబానికీ ఏయే విధాలుగా సరిపోతుందో ఊహించుకొని మీరు సంతోషిస్తారు. అయితే, మీరు ఆ ఇంటిని నిజంగా నిర్మించి, అందులోకి వెళ్లి, దాన్లో కొన్ని రోజులు ఉంటేనే ప్రయోజనం ఉంటుంది కానీ మీరు దాని కోసం ఎన్ని ప్లాన్స్‌ వేసినా, ఏయే విధాలుగా సరిపోతుందో అని ఎంత ఆలోచించినా లాభం ఉండదని మీకు అనిపించడం లేదా?

2 అదే విధంగా, యథార్థత చాలా ప్రాముఖ్యమైన లక్షణమనీ, అది మనకూ మన ఆత్మీయులకూ ఎంతో మేలు చేస్తుందని మనకనిపించవచ్చు. అయితే, యథార్థతను అలవర్చుకొని, అన్నిసమయాల్లో దాన్ని కనబరిస్తేనే ప్రయోజనం ఉంటుందిగానీ దానిపై సదభిప్రాయం కలిగివుంటే సరిపోదు. మన కాలంలో ఇల్లు కట్టడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. (లూకా 14:​28, 29) అలాగే యథార్థతను అలవర్చుకోవడానికి ఎంతో సమయం, కృషి అవసరం. కానీ అలా చేయడంవల్ల ప్రయోజనం ఉంది. ఇప్పుడు మనం మూడు ప్రశ్నలను పరిశీలిద్దాం: మనం యథార్థవంతులముగా ఎలా ఉండవచ్చు? ఈ లక్షణాన్ని మనం అన్ని సమయాల్లో ఎలా చూపించవచ్చు? ఒకవేళ ఒక వ్యక్తి తప్పుచేసి కొంతకాలంపాటు తన యథార్థతను కనబరచకపోతే అప్పుడేమి చేయాలి?

మనం యథార్థవంతులముగా ఎలా ఉండవచ్చు?

3 యథార్థతను కనబరిచే ప్రజలముగా ఉండాలో లేదో నిర్ణయించుకునే స్వేచ్ఛనిచ్చి యెహోవా మనల్ని ఘనపరుస్తున్నాడని మనం ముందటి ఆర్టికల్‌లో చూశాం. సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఈ విషయంలో యెహోవా మనకు ఏ సహాయం చేయకుండా విడిచిపెట్టలేదు. అమూల్యమైన ఈ లక్షణాన్ని ఎలా అలవర్చుకోవాలో ఆయన మనకు బోధిస్తున్నాడు. తన బోధనలకు అనుగుణంగా ప్రవర్తించడానికి కావాల్సిన సహాయం చేసేందుకు ఆయన మనకు తన పరిశుద్ధాత్మను ఉదారంగా ఇస్తున్నాడు. (లూకా 11:​13) అంతేకాక, యథార్థంగా ఉండేందుకు కృషిచేసేవారిని ఆయన ఆధ్యాత్మికంగా కూడా సంరక్షిస్తాడు.​—⁠సామె. 2:⁠7.

4 మనం యథార్థవంతులముగా ఉండేందుకు యెహోవా మనకు ఎలా శిక్షణనిచ్చాడు? ఆయన ప్రాముఖ్యంగా తన కుమారుణ్ణి భూమ్మీదకు పంపించడం ద్వారా శిక్షణనిచ్చాడు. యేసు ఎంత పరిపూర్ణంగా విధేయతను కనబరిచాడంటే, ఆయన ‘మరణము పొందునంతగా విధేయత చూపించాడు.’ (ఫిలి. 2:⁠8) ఆయన ఏమి చేసినా, తనకు ఎంత కష్టమనిపించినాసరే తన పరలోక తండ్రికి విధేయుడయ్యాడు. “నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక” అని యెహోవాకు ప్రార్థించాడు. (లూకా 22:​42) మనలో ప్రతీఒక్కరం ఇలా ఆలోచించాలి: ‘నేను కూడ ఆయనలాగే విధేయత చూపిస్తున్నానా?’ సదుద్దేశాలతో మనం విధేయతను కనబరచడం ద్వారా యథార్థవంతులముగా ఉండగలుగుతాం. విధేయతను కనబరచడం ఎంతో అవసరమైన కొన్ని సందర్భాలను పరిశీలిద్దాం.

5 ఒంటరిగా ఉన్నట్లు మనకు అనిపించినప్పుడు కూడ మనం యెహోవాకు విధేయత చూపించాలి. బహుశా తాను ఒంటరిగా ఉన్నప్పుడు యథార్థతను కనబరచాల్సిన అవసరం ఎంతో ఉందని కీర్తనకర్త అయిన దావీదు గుర్తించాడు. (కీర్తనలు 101:2 చదవండి.) దావీదు, రాజు కాబట్టి ఆయన చుట్టు ప్రజలుండేవారు. ఎన్నోసార్లు ఆయన చేసే పనులను ఆయన చుట్టూవున్న వేలాదిమంది గమనించి ఉంటారు. (కీర్తనలు 26:⁠12 పోల్చండి.) రాజుగా తన ప్రజలకు మంచి మాదిరిని ఉంచాలి కాబట్టి అలాంటి సమయాల్లో ఆయన యథార్థతను చూపించాలి. (ద్వితీ. 17:​18, 19) బహుశా, ‘తాను ఇంట్లో’ ఒంటరిగా ఉన్నప్పుడు కూడ యథార్థంగా ఉండాలని దావీదు తెలుసుకున్నాడు. అయితే మన విషయం ఏమిటి?

6 “నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను” అని దావీదు కీర్తనలు 101:3లో అన్నాడు. అన్ని సమయాల్లో ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు, దుష్కార్యాలను లేక పనికిమాలిన విషయాలను చూసే అవకాశాలు ఎన్నో వస్తుంటాయి. ఇంటర్‌నెట్‌ అన్నిచోట్ల అందుబాటులో ఉండడంవల్ల ఈ విషయంలో చాలామంది శోధనను ఎదుర్కొంటున్నారు. అనుచితమైన చివరకు అశ్లీలమైన దృశ్యాలను చూడాలనే ప్రలోభంలో కూడ వారు పడవచ్చు. అలాంటి దృశ్యాలను చూస్తే, దావీదుచేత ఆ మాటలను రాయించిన దేవునికి విధేయత చూపించినట్లౌతుందా? అశ్లీల చిత్రాలను చూడడంవల్ల హాని జరుగుతుంది, ఎందుకంటే అది చూసేవారిలో చెడు కోరికలను, దురాశలను పుట్టిస్తుంది. మనస్సాక్షిని పాడుచేస్తుంది, వివాహబంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. అంతేకాక, అది ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని కూడ దెబ్బతీస్తుంది.​—⁠సామె. 4:​23; 2 కొరిం. 7:⁠1; 1 థెస్స. 4:​3-5.

7 నిజమే, యెహోవా సేవకులు ఎప్పుడూ ఒంటరివారు కారు. ఎందుకంటే మన పరలోక తండ్రి ప్రేమతో మనల్ని చూస్తున్నాడు. (కీర్తనలు 11:4 చదవండి.) మీరు శోధనలకు లొంగకుండా ఉండడం చూసి ఆయన ఎంత సంతోషిస్తాడు! మీరు శోధనలకు లొంగకుండా ఉండడం ద్వారా మత్తయి 5:28లోని యేసు హెచ్చరికను లక్ష్యపెడతారు. ఏదేమైనా, మీరు తప్పుచేసేలా శోధించే చిత్రాలను చూడకూడదని నిశ్చయించుకోండి. అశ్లీల చిత్రాలను చూడడం లేదా అశ్లీల సాహిత్యాన్ని చదవడం వంటి సిగ్గుకరమైన పనులు చేయడానికి మీరు ఎంతో కాలంగా కాపాడుకుంటూ వచ్చిన యథార్థతను పణంగా పెట్టకండి!

8 అంతేకాక, మనం అవిశ్వాసుల మధ్య ఉన్నప్పుడు యెహోవాకు లోబడడం ద్వారా యథార్థవంతులముగా ఉండగలం. దానియేలు, ఆయన ముగ్గురు స్నేహితులను గురించి ఒకసారి ఆలోచించండి. వారు చిన్నవయసులోనే బబులోనుకు చెరగాకొనిపోబడ్డారు. అక్కడ, యెహోవా గురించి పెద్దగా తెలియనివారు లేక అసలు ఏమి తెలియనివారు వారి చుట్టూ ఉన్నారు. ఆ కారణంగా వారు దేవుని ధర్మశాస్త్రం నిషేధించినవాటిని తినాలని ఒత్తిడి చేయబడ్డారు. వాటిని తింటే తప్పేమీలేదని సర్దిపెట్టుకునివుండేవారే. అదీగాక, వీళ్లేమి చేస్తున్నారో వారి తల్లిదండ్రులు, పెద్దలు, యాజకులు చూడలేరు. కానీ ఎవరు చూడగలరు? యెహోవా చూడగలడు. అందుకే వారు ఎంత ఒత్తిడి ఎదురైనా, ప్రాణానికి ముప్పున్నా తమ నిర్ణయాన్ని మార్చుకోకుండా ఆయనకే లోబడ్డారు.​—⁠దాని. 1:​3-9.

9 ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువసాక్షులు వారి మాదిరిని అనుసరిస్తూ దేవుని ప్రమాణాలకు లోబడుతున్నారు. అంతేకాక తోటివారి నుండి వచ్చే హానికరమైన ఒత్తిడికి తలొగ్గడంలేదు. మాదకద్రవ్యాలు తీసుకోకుండా, దౌర్జన్యం చేయకుండా, బూతులు మాట్లాడకుండా, అనైతికతకు పాల్పడకుండా, మరితర చెడు పనులు చేయకుండా ఉన్నప్పుడు మీరు యెహోవాకు విధేయత చూపించడమేకాక, యథార్థతను కూడ కనబరిచినవారౌతారు. మీకు మేలు జరుగుతుంది, మీరు యెహోవాను, తోటి క్రైస్తవులను సంతోషపరుస్తారు.​—⁠కీర్త. 110:⁠3.

10 అబ్బాయిలు అమ్మాయిలతో, అమ్మాయిలు అబ్బాయిలతో వ్యవహరిస్తున్న సందర్భాల్లోనూ దేవునికి విధేయతను చూపించాలి. జారత్వానికి దూరంగా ఉండమని బైబిలు చెబుతుందని మనకు తెలుసు. అయితే ఒకానొక విషయంలో మనం ఇప్పుడు విధేయులముగా ఉన్నా తర్వాత అది చేయడంలో తప్పేమీలేదులే అని అనుకొనే స్థితికి దిగజారవచ్చు. ఉదాహరణకు, కొంతమంది యౌవనస్థులు ముఖరతి, ఆసన సంభోగము, ఒకరికొకరు హస్తప్రయోగం చేసుకోవడం వంటి కార్యాలు “లైంగిక సంభోగంతో” సమానంకాదనుకొని తాము చేసిన తప్పులను సమర్థించుకున్నారు. బైబిలు జారత్వం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు దానిలో చెడు ప్రవర్తనతో పాటు ఆ కార్యాలన్నీ వస్తాయని, వాటిలో పాల్గొంటే ఒక వ్యక్తి వెలివేయబడవచ్చనే విషయాన్ని వారు మరచిపోతారు లేదా దాన్ని పట్టించుకోరు. * అయితే, బాధాకరమైన విషయమేమిటంటే, యథార్థంగా ఉండాల్సిన అవసరాన్ని వారు గుర్తించరు. మనం ఎల్లప్పుడూ యథార్థంగా ఉండడానికి కృషిచేస్తున్నాం కాబట్టి మనం తప్పు చేసినందుకు సాకులు చెప్పం. పాపం చేస్తూనే అది శిక్షకు తగిన పాపం కాదనుకుని మనల్నిమనం మోసగించుకోవడానికి ప్రయత్నించం. మనం తప్పుచేస్తే మనకు సంఘంలో ఎలాంటి క్రమశిక్షణ దొరుకుతుందో అనే దాని గురించే ఆలోచించం. కానీ, యెహోవాను సంతోషపెట్టేందుకు ఏమి చేస్తే బాగుంటుందో, ఆయన మనోభావాలను బాధపెట్టకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఆలోచించాలి. శిక్షను తప్పించుకునేలా పాపానికి నడిపించే మార్గంలో ఎంతవరకు వెళ్లగలమని ఆలోచించే బదులు దానికి దూరంగా ఉండాలి, అంటే ‘జారత్వమునకు దూరముగా పారిపోవాలి.’ (1 కొరిం. 6:​18) అలా మనం నిజంగా యథార్థవంతులమని చూపిస్తాం.

మనం యథార్థతను ఎలా కాపాడుకోవచ్చు?

11 మనం విధేయులముగా ఉన్నప్పుడే యథార్థతను అలవర్చుకుంటాం. కాబట్టి యథార్థతను కాపాడుకోవాలంటే ఎల్లప్పుడూ విధేయతను కనబరచాలి. ఒకసారి విధేయులముగా ఉండడం పెద్దవిషయమేమీ కాదని మనకు అనిపించవచ్చు. కానీ అలా ప్రతీసారి విధేయతను కనబరుస్తూ ఉంటే యథార్థవంతులముగా నిరూపించుకుంటాం. ఉదాహరణకు, ఒక ఇటుకను మనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ ఒక్కొక్క ఇటుకను జాగ్రత్తగా పేర్చినప్పుడే ఒక మంచి ఇంటిని కట్టగలుగుతాం. అలాగే మనం ఎల్లప్పుడూ విధేయతను కనబరుస్తూ ఉంటే మనం యథార్థతను కాపాడుకోగలుగుతాం.​—⁠లూకా 16:⁠10.

12 కష్టాలను, అన్యాయాన్ని లేదా ఇతరులు చేసిన హానిని మనం సహించినప్పుడే మనం యథార్థంగా ఉన్నామో లేదో తెలుస్తుంది. బైబిల్లోని దావీదు ఉదాహరణను చూడండి. ఆయన యువకునిగా ఉన్నప్పుడు యెహోవా అధికారానికి ప్రతినిధిగా ఉండాల్సిన రాజునుండి వచ్చిన హింసను సహించాడు. సౌలు రాజు యెహోవా అనుగ్రహాన్ని కోల్పోయి దేవుడు ఇష్టపడ్డ దావీదు మీద ఎంతో ఈర్ష్యపడ్డాడు. అయినా సౌలు రాజుగా అధికారంలో కొంతకాలం కొనసాగడమేకాక దావీదును వెంటాడి వేధించడానికి ఇశ్రాయేలు సైన్యాన్ని ఉపయోగించాడు. యెహోవా ఆ అన్యాయాన్ని కొన్ని సంవత్సరాలు కొనసాగనిచ్చాడు. అలా కొనసాగనిచ్చినందుకు దావీదు దేవునిమీద కోపగించుకున్నాడా? అన్యాయాన్ని సహించాల్సిన అవసరం లేదని ఆయన అనుకున్నాడా? లేదు. ఆయన దేవుని అభిషిక్తునిగా ఉన్న సౌలుపట్ల చివరివరకూ ఎంతో గౌరవాన్ని చూపించాడు. తనకు సౌలును చంపే అవకాశం వచ్చినా అతనిమీద పగతీర్చుకోలేదు.​—⁠1 సమూ. 24:​2-7.

13 మనకు దావీదు ఎంత చక్కని మాదిరినుంచాడు! అపరిపూర్ణ మానవులతో కూడిన ప్రపంచవ్యాప్త సంఘంలో మనం భాగంగా ఉన్నాం. వారిలో ఎవరైనా మనతో అన్యాయంగా ప్రవర్తించవచ్చు లేదా అవిశ్వాసులుగా మారవచ్చు. అయితే యెహోవా ప్రజలను ఒక జనాంగంగా భ్రష్టుపట్టించడం సాధ్యంకాని కాలంలో మనం జీవిస్తున్నాం. (యెష. 54:​17) ఎవరైనా మనల్ని నిరాశపరచినప్పుడు లేదా బాధపెట్టినప్పుడు మనం ఏమి చేస్తాం? మనం మన తోటి విశ్వాసిమీద పగ పెంచుకుంటే దేవునిపట్ల మనకున్న యథార్థతను కోల్పోయే ప్రమాదముంది. ఇతరులు సరిగా ప్రవర్తించడం లేదని చెప్పి మనం ఎన్నడూ యెహోవామీద కోపగించుకోం లేదా మన విశ్వాసాన్ని విడిచిపెట్టం. (కీర్త. 119:​165) కష్టాలను కూడ సహించినప్పుడే మనం మన యథార్థతను చూపించగలుగుతాం.

14 ఇతరుల తప్పులు పట్టకుండా, లోపాలు వెతక్కుండా ఉండడం ద్వారా కూడ మన యథార్థతను కాపాడుకోగలుగుతాం. అంటే మనం యెహోవాకు విశ్వసనీయంగా ఉంటాం. మునుపెన్నడూ లేనివిధంగా ఆయన తన సేవకులను ఆశీర్వదిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా సత్యారాధన ముందుకు సాగుతోంది. (యెష. 2:​2-4) బైబిలు వచనానికి సంబంధించిన అవగాహనలో లేక సంస్థ కార్యనిర్వాహణ పద్ధతిలో మార్పు వచ్చినప్పుడు మనం వాటిని స్వీకరిస్తాం. ఆధ్యాత్మిక వెలుగు అంతకంతకూ పెరుగుతోందనడానికి ఉన్న రుజువులను చూసి మనం సంతోషిస్తున్నాం. (సామె. 4:​18) మార్పు ఎందుకు వచ్చిందో మనకు అర్థంకానప్పుడు దాన్ని అర్థంచేసుకునేందుకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థిస్తాం. అంతవరకు మనం విధేయతను చూపిస్తూ యథార్థంగా ఉంటాం.

ఎవరైనా తమ యథార్థతను కోల్పోతే ఏమి చేయాలి?

15 ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన ప్రశ్న కాదా? ముందటి ఆర్టికల్‌లో తెలుసుకున్నట్లు యథార్థత చాలా అవసరం. అది లేకపోతే యెహోవాతో మనకు మంచి సంబంధమూ ఉండదు, వాస్తవమైన ఏ నిరీక్షణా ఉండదు. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి: ఈ విశ్వంలో మీ యథార్థతను ఒకే ఒక వ్యక్తి తీసివేయగలరు. ఆ వ్యక్తి మీరే. ఆ విషయాన్ని గ్రహించిన యోబు, “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను” అని అన్నాడు. (యోబు 27:⁠5) మీకూ అలాంటి కృతనిశ్చయమే ఉంటే, మీరు యెహోవాతో మంచి సంబంధం కలిగివుంటే మీరు మీ యథార్థతను ఎన్నడూ ​విడిచిపెట్టరు.​—⁠యాకో. 4:⁠8.

16 అయినా, కొంతమంది తమ యథార్థతను నిలుపుకోలేరు. అపొస్తలుల కాలంలో జరిగినట్లే, కొందరు పదేపదే గంభీరమైన పాపాలను చేస్తారు. మీరు అలా చేస్తుంటే, మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లేనా? లేదు. మీరు ఏమి చేయవచ్చు? ముందుగా మనం ఏమి చేయకూడదో చూద్దాం. మనం చేసిన తప్పు తల్లిదండ్రులకు, తోటి క్రైస్తవులకు, పెద్దలకు తెలియకుండా ఉండాలనుకోవడం సహజమే. అయితే, “అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును” అని బైబిలు మనకు గుర్తుచేస్తోంది. (సామె. 28:​13) పాపాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నవారు పెద్ద తప్పు చేస్తున్నారు, ఎందుకంటే దేవునికి కనబడని విషయమంటూ ఏదీ లేదు. (హెబ్రీయులు 4:⁠13 చదవండి.) కొందరు పాపం చేస్తూనే యెహోవాను సేవిస్తున్నట్లు నటిస్తారు. అలా వారు ద్వందజీవితాన్ని గడపడానికి కూడ ప్రయత్నిస్తారు. అలా ద్వంద జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి యథార్థతను కోల్పోయినట్లే. గంభీరమైన పాపాలను కప్పిపుచ్చేవారి ఆరాధనను యెహోవా ఇష్టపడడు. బదులుగా అలాంటి వేషధారణ ఆయనకు కోపం తెప్పిస్తుంది.​—⁠సామె. 21:​27; యెష. 1:​11-16.

17 గంభీరమైన తప్పుచేశానని ఒక క్రైస్తవుడు గుర్తించినప్పుడు ఏమి చేయాలో బైబిలు స్పష్టంగా చెబుతోంది. ఆయన సంఘ పెద్దల సహాయాన్ని కోరాలి. గంభీరమైన ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడానికి యెహోవా పెద్దలను నియమించాడు. (యాకోబు 5:⁠14 చదవండి.) క్రమ శిక్షణ, దిద్దుబాటు దొరుకుతుందేమోననే భయంతో మీరు మీ ఆధ్యాత్మిక క్షేమంకోసం ప్రయాసపడడం మానకండి. ఇంజక్షన్‌ తీసుకుంటే లేక ఆపరేషన్‌ చేయించుకుంటే తాత్కాలికంగా నొప్పి ఉంటుందని తెలివిగల వారెవరైనా ప్రాణాంతక రోగాన్ని నయం చేయించుకోకుండా ఉంటారా?​—⁠యాకో. 5:⁠14.

18 ఆయన పూర్తిగా కోలుకునే అవకాశం ఉందా? ఒకసారి యథార్థతను కోల్పోతే తిరిగి పొందవచ్చా? దావీదు ఉదాహరణను మళ్లీ ఒకసారి చూద్దాం. ఆయన గంభీరమైన పాపం చేశాడు. ఆయన మరో వ్యక్తి భార్యను చూసి ఆశపడి, ఆమెతో వ్యభిచారం చేశాడు. నిర్దోషియైన ఆమె భర్తను చంపించాడు. ఆ సందర్భంలో దావీదును యథార్థవంతునిగా పరిగణించడం కష్టమే, కాదంటారా? ఇక ఆయన పరిస్థితి అంతేనా? దావీదుకు గద్దింపు అవసరమైంది, దాన్ని పొందాడు కూడ. అప్పుడు ఆయన నిజంగా పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి యెహోవా ఆయనమీద దయ చూపించాడు. ఆ గద్దింపువల్ల దావీదు తన తప్పు తెలుసుకొని దేవునికి చివరివరకు విధేయునిగా ఉన్నాడు. అలా ఆయన తన యథార్థతను తిరిగి పొందాడు. “నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును” అని సామెతలు 24:16లో ఉన్న మాటలు నిజమని చెప్పడానికి దావీదు జీవితం ఒక ఉదాహరణ. ఆ కారణంగా, దావీదు చనిపోయిన తర్వాత యెహోవా దేవుడు ఆయన గురించి సొలొమోనుతో ఏమి చెప్పాడో చూడండి. (1 రాజులు 9:4 చదవండి.) దేవుడు దావీదును యథార్థవంతునిగా గుర్తుచేసుకున్నాడు. పశ్చాత్తాపపడిన పాపుల గంభీరమైన పాపాలను కూడ యెహోవా కడిగివేయగలడు.​—⁠యెష. 1:⁠18.

19 అవును, దేవునిపట్ల ప్రేమతో ఆయనకు విధేయత చూపించడం ద్వారా మీరు యథార్థవంతులౌతారు. చివరి​వరకూ సహనాన్ని కనబర్చండి. మీరు ఒకవేళ గంభీరమైన పాపం చేస్తే హృదయపూర్వక పశ్చాత్తాపాన్ని చూపించండి. మన యథార్థత ఎంత అమూల్యమైనది! “నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను” అని దావీదు అన్నాడు. మనమూ అలాంటి కృతనిశ్చయాన్నే కలిగివుందాం.​—⁠కీర్త. 26:⁠11.

[అధస్సూచి]

మీరెలా జవాబిస్తారు?

• మీరు ఎలా యథార్థవంతులుగా ఉండవచ్చు?

• మీరు ఏయే విధాలుగా యథార్థతను కాపాడుకోగలరు?

• కోల్పోయిన యథార్థతను తిరిగి ఎలా పొందవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మనం దేన్ని అలవర్చుకోవాలి, మనం ఏ ప్రశ్నలను చర్చిస్తాం?

3, 4. (ఎ) యథార్థతను అలవర్చుకునేందుకు యెహోవా మనకు ఏయే విధాలుగా సహాయం చేస్తున్నాడు? (బి) యేసులా మనం యథార్థతను ఎలా అలవర్చుకోవచ్చు?

5, 6. (ఎ) మనల్ని ఇతరులు చూడనప్పుడు కూడ యథార్థత చూపించడం ప్రాముఖ్యమని దావీదు ఎలా నొక్కిచెప్పాడు? (బి) ఒంటరిగా ఉన్నప్పుడు క్రైస్తవులు యథార్థతకు సంబంధించిన ఏ శోధనలు ఎదుర్కొంటారు?

7. ఒంటరిగా ఉన్నప్పుడు యథార్థతను కనబరచడానికి ఏ సూత్రం మనకు సహాయం చేస్తుంది?

8, 9. (ఎ) దానియేలు, ఆయన స్నేహితులు యథార్థతకు సంబంధించి ఎలాంటి సవాలును ఎదుర్కొన్నారు? (బి) యువ క్రైస్తవులు యెహోవాను, తోటి క్రైస్తవులను ఎలా సంతోషపరచవచ్చు?

10. (ఎ) జారత్వం విషయంలో ఎలాంటి తప్పుడు అభిప్రాయంతో కొందరు యౌవనస్థులు తమకున్న యథార్థతను కోల్పోయారు? (బి) జారత్వం అనే ప్రమాదం విషయంలో జాగ్రత్తగా ఉండేందుకు యథార్థత మనకెలా సహాయం చేస్తుంది?

11. అన్ని సందర్భాల్లో విధేయులముగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? ఉదహరించండి.

12. అన్యాయం, ఇతరుల నుండి హాని ఎదురైనా యథార్థతను నిలుపుకునే విషయంలో దావీదు ఎలా మాదిరిని ఉంచాడు?

13. ఎవరైనా మనల్ని బాధపెడితే, కోపం తెప్పించేలా ప్రవర్తిస్తే మనం యథార్థతను ఎలా చూపించవచ్చు?

14. సంస్థాగత మార్పులు, లేఖనాలకు సంబంధించిన అవగాహనలో మార్పులు వచ్చినప్పుడు యథార్థవంతులు ఏమి చేస్తారు?

15. మీ యథార్థతను ఎవరు మాత్రమే తీసివేయగలరు?

16, 17. (ఎ) ఒక వ్యక్తి గంభీరమైన పాపం చేస్తే ఏమి చేయకూడదు? (బి) ఏమి చేయాలి?

18, 19. (ఎ) యథార్థతను తిరిగి పొందొచ్చని దావీదు ఉదాహరణ ఎలా చూపిస్తుంది? (బి) యథార్థత చూపించే విషయంలో మీరు ఏ కృతనిశ్చయంతో ఉన్నారు?

[8వ పేజీలోని బాక్సు]

‘ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను!’

ఐదు నెలల గర్భిణీ స్త్రీ తనపై ఒక తెలియని వ్యక్తి చూపించిన దయ, నిజాయితీని (లేదా యథార్థతను) మెచ్చుకుంటూ ఆ పై మాటలు అన్నది. ఆమె ఒక కాఫీ హోటల్‌కి వెళ్లింది, అక్కడి నుండి బయటికి వచ్చిన కొన్ని గంటలకి తన బ్యాగును ఆ హోటల్లోనే మరచిపోయినట్లు గుర్తించింది. ‘అంత డబ్బు పోగొట్టుకొనే సరికి నేను చాలా ఆందోళనపడ్డాను’ అని ఆమె ఆ తర్వాత ఓ స్థానిక వార్తాపత్రిక వాళ్లకు తెలిపింది. అయితే ఒక యౌవనస్థురాలికి ఆ బ్యాగు దొరికింది. వెంటనే ఆ బ్యాగు యజమాని కోసం ఆమె వెతకడం మొదలుపెట్టింది. బ్యాగు పోగొట్టుకున్న వ్యక్తి దొరక్కపోయే సరికి ఆమె దాన్ని పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించింది. పోలీసులు బ్యాగు పోగొట్టుకున్నదెవరో గుర్తించి, ఆ గర్భిణీ స్త్రీని పిలిపించారు. ‘ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను!’ అంటూ ఆమె తన కృతజ్ఞతను వ్యక్తం చేసింది. ఆ యౌవనస్థురాలు శ్రమతీసుకొని డబ్బు తిరిగి ఇచ్చేందుకు ఎందుకు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది? “తాను ఒక యెహోవాసాక్షిగా పెరిగినందువల్లే నిజాయితీ చూపించానని” ఆమె తెలిపినట్లు వార్తాపత్రిక నివేదించింది.

[9వ పేజీలోని చిత్రం]

పరీక్షలు ఎదురైనప్పుడు యౌవనస్థులు యథార్థతను చూపించగలరు

[10వ పేజీలోని చిత్రం]

దావీదు కొంతకాలంపాటు యథార్థతను కోల్పోయాడు, కానీ ఆయన దాన్ని తిరిగి పొందాడు