కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు యథార్థతను ఎందుకు నిలుపుకోవాలి?

మీరు యథార్థతను ఎందుకు నిలుపుకోవాలి?

మీరు యథార్థతను ఎందుకు నిలుపుకోవాలి?

‘యెహోవా, నా యథార్థతనుబట్టి నాకు న్యాయము తీర్చుము.’​—⁠కీర్త. 7:⁠8.

మీరు మూడు వేర్వేరు సన్నివేశాల గురించి ఆలోచించండి: ఒక అబ్బాయిని కొంతమంది తోటి విద్యార్థులు ఎగతాళి చేస్తున్నారు. బహుశా తమను తిట్టేంత లేదా కొట్టేంత కోపం తెప్పించేందుకు వాణ్ణి రెచ్చగొడుతున్నారు. ఆ అబ్బాయి వారిమీద తన కోపాన్ని వెళ్లగ్రక్కుతాడా లేక కోపాన్ని అణుచుకుని అక్కడ నుండి వెళ్లిపోతాడా? ఇంట్లో ఒంటరిగా ఉన్న పెళ్లైన వ్యక్తి ఇంటర్నెట్‌ చూస్తున్నాడు. దానిలో అశ్లీల దృశ్యాలున్న వెబ్‌సైట్‌కు సంబంధించిన ఒక వాణిజ్య ప్రకటన వస్తుంది. ఆయన ఆ వెబ్‌సైట్‌లో ఏముందో చూస్తాడా లేక దానిని చూడకూడదనుకుంటాడా? ఒక క్రైస్తవురాలు కొంతమంది సహోదరీలతో మాట్లాడుతోంది. కాసేపటికి వారు సంఘంలోని ఓ సహోదరి గురించి చెడుగా మాట్లాడుతూ చాడీలు చెప్పడం మొదలుపెడతారు. ఆమె కూడ వారితో కలిసి ఆ సహోదరి గురించి చెడుగా మాట్లాడుతుందా లేక ఆమె సంభాషణను మారుస్తుందా?

2 ఆ ముగ్గురి పరిస్థితులు వేర్వేరు అయినప్పటికీ, వారందరూ క్రైస్తవులుగా తమ యథార్థతను కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. సమస్యలు ఎదురైనప్పుడు, జీవితావసరాల కోసం పాటుపడుతున్నప్పుడు, జీవిత లక్ష్యాలను సాధించడానికి కృషిచేస్తున్నప్పుడు మీరు యెహోవాకు యథార్థంగా ఉండాలనుకుంటున్నారా? ప్రతీరోజు ప్రజలు ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. తమ రూపం గురించి, ఆరోగ్యం గురించి, జీవనోపాధి కోసం పడుతున్న పాట్ల గురించి, స్నేహంలో వచ్చిన అపార్థాల గురించి, బహుశా తమ ప్రేమ గురించి కూడ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి విషయాల గురించి మనమూ ఎక్కువగా ఆలోచిస్తుండవచ్చు. మన హృదయాన్ని పరిశోధిస్తున్నప్పుడు యెహోవా దేన్ని ఎక్కువగా గమనిస్తాడు? (కీర్త. 139:​23, 24) మన యథార్థతను.

3 “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇచ్చే యెహోవా దేవుడు మనలో ప్రతీ ఒక్కరికీ వివిధ వరాలనిచ్చాడు. (యాకో. 1:​17) ఆయన మనకు శరీరం, మనసు, ఆరోగ్యం, వివిధ సామర్థ్యాలు వంటివి ఎన్నో ఇచ్చాడు. (1 కొరిం. 4:⁠7) అయితే తనకు యథార్థంగా ఉండమని యెహోవా మనల్ని బలవంతం చేయడంలేదు. యథార్థంగా ఉండాలో లేదో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయన మనకిచ్చాడు. (ద్వితీ. 30:​19) కాబట్టి అసలు యథార్థంగా ఉండడం అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. అంతేకాక మనం యథార్థంగా ఉండడం ఎందుకు అంత ప్రాముఖ్యమో చూపించే మూడు కారణాలను పరిశీలిద్దాం.

యథార్థత అంటే ఏమిటి?

4 యథార్థత అంటే ఏమిటో చాలామందికి పెద్దగా తెలియక​పోవచ్చు. యథార్థత కనబరచాలంటే నిజాయితీగా ఉండాలి. అయితే నిజాయితీగా ఉంటేనే సరిపోదు. బైబిలు చెబుతున్నట్లు యథార్థంగా ఉండాలంటే నైతిక విషయాల్లో పరిశుభ్రంగా ఉంటూ, కళంకం లేకుండా కూడ ఉండాలి. “యథార్థతను” వర్ణించేందుకు హెబ్రీలో ఉపయోగించబడిన పదాలకు దోషంలేని, ఆరోగ్యవంతమైన, లేదా కళంకంలేని అనే మూల అర్థాలు ఉన్నాయి. యెహోవాకు అర్పించే బలులు ఎలా ఉండాలో వర్ణిస్తున్నప్పుడు వీటిలోని ఒక పదం ఉపయోగించబడింది. ఇశ్రాయేలీయుల కాలంలో అర్పించబడే జంతువుకు ఎలాంటి దోషమూ కళంకమూ లేకుంటేనే యెహోవా దాన్ని ఆమోదించేవాడు. (లేవీయకాండము 22:​19, 20 చదవండి.) తన నిర్దేశాన్ని ఉద్దేశపూర్వకంగా లోబడకుండా కుంటిదానిని, రోగంగలదానిని, గుడ్డిదానిని అర్పించినవారిని యెహోవా గద్దించాడు.​—⁠మలా. 1:​6-8.

5 సంపూర్ణమైన దాని కోసం వెతికి దాన్ని విలువైనదిగా ఎంచడం వింతేమీ కాదు. ఉదాహరణకు, పుస్తకాలను సేకరించే వ్యక్తికి, వెతగ్గా వెతగ్గా ఒక విలువైన పుస్తకం దొరికిందనుకుందాం. తీరా ఆయన ఆ పుస్తకాన్ని తెరిచి చూసేసరికి దానిలో ఎన్నో ముఖ్యమైన పేజీలు లేవు. అప్పుడు ఆయన ఏమి చేస్తాడు? నిరుత్సాహంతో దాన్ని తిరిగి అరలో పెట్టేయవచ్చు. మరొక ఉదాహరణను చూడండి. అలలతాకిడికి ఒడ్డుకు వచ్చిన గవ్వలను ఏరుకుంటూ బీచ్‌లో నడుస్తున్న ఒక స్త్రీని ఊహించుకోండి. సృష్టిలో ఉన్న వివిధరకాల ఈ అందమైన గవ్వలను చూసి ముగ్ధురాలైన ఆమె మధ్యమధ్యలో ప్రతీదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంది. అయితే ఆమె ఎలాంటి గవ్వలను ఏరుకుంటుంది? పగలని మంచి వాటినే ఏరుకుంటుంది. అలాగే, సంపూర్ణ యథార్థతను కనబరిచే ప్రజల కోసమే యెహోవా వెతుకుతున్నాడు.​—⁠2 దిన. 16:⁠9.

6 యథార్థంగా ఉండడమంటే పరిపూర్ణంగా ఉండాలేమో అని మీరు అనుకోవచ్చు. పాపం వల్ల, అపరిపూర్ణతవల్ల మనం ముఖ్యమైన కొన్ని పేజీలులేని పుస్తకంలాంటివారమనీ లేదా పగిలిన గవ్వల్లాంటివారమనీ మనకు అనిపించవచ్చు. అప్పుడప్పుడు మీకూ అలాగే అనిపిస్తుందా? అయితే సంపూర్ణ భావంలో మనం పరిపూర్ణంగా ఉండాలని యెహోవా కోరడం లేదనేది గుర్తుంచుకోండి. మనం చేయగలిగిన దానికన్నా ఎక్కువ ఆయన ఎన్నడూ ఆశించడు. * (కీర్త. 103:​14; యాకో. 3:⁠2) అయినా మనం యథార్థంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. అయితే పరిపూర్ణతకూ యథార్థతకూ మధ్య తేడా ఏమైనా ఉందా? ఉంది. దానిని అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ చూద్దాం. ఒక యౌవనస్థుడు తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే, ఆమె నుండి పరిపూర్ణతను ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. కానీ, తనను హృదయపూర్వకంగా ప్రేమించాలని అంటే తననే ప్రేమించాలని కోరుకోవడంలో తప్పులేదు. అదే విధంగా, యెహోవా దేవుడు “రోషముగల దేవుడు” అంటే తనను మాత్రమే ఆరాధించాలని కోరుకుంటున్నాడు. (నిర్గ. 20:⁠5) యెహోవా మననుండి పరిపూర్ణతను ఆశించడం లేదుగానీ తనను హృదయపూర్వకంగా ప్రేమించాలని, తనను మాత్రమే ఆరాధించాలని కోరుతున్నాడు.

7 శాస్త్రుల్లో ఒకరు వచ్చి ప్రధానమైన ఆజ్ఞ ఏమిటని అడిగినప్పుడు యేసు ఇచ్చిన జవాబు మనకు గుర్తుకురావచ్చు. (మార్కు 12:​28-30 చదవండి.) యేసు జవాబు ఇవ్వడంతోనే సరిపెట్టుకోలేదు, అలా జీవించాడు కూడా. పూర్ణ వివేకంతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణబలముతో యెహోవాను ప్రేమించే విషయంలో ఆయన శ్రేష్ఠమైన మాదిరిని ఉంచాడు. యథార్థత ఉందని మాటల్లో చెబితే సరిపోదుగానీ, సదుద్దేశంతో మంచి పనులు చేయడం ద్వారా దాన్ని కనబరచవచ్చని యేసు చూపించాడు. మనం యథార్థంగా ఉండాలంటే యేసు అడుగుజాడలను అనుసరించాలి.​​—⁠1 పేతు. 2:⁠21.

8 లేఖనానుసారంగా యథార్థత అంటే, యెహోవా దేవునికీ, ఆయన చిత్తానికీ, ఉద్దేశానికీ హృదయపూర్వకంగా అంకితమవ్వడమని అర్థం. మనం యథార్థతను కనబరచాలంటే అనుదిన జీవితంలో అన్నిటికన్నా ఎక్కువగా యెహోవాను సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. ఆయన ప్రాముఖ్యంగా ఎంచే విషయాలనే మనమూ ప్రాముఖ్యంగా ఎంచాలి. అలా చేయడం ఎందుకు ప్రాముఖ్యమో చూపించే మూడు కారణాలను చూద్దాం.

1. మన యథార్థత, యెహోవా సర్వాధిపత్యపు వివాదాంశం

9 మనం యథార్థతను చూపిస్తేనే యెహోవా సర్వాధిపత్యం నిరూపించబడుతుందని మనం అనుకోకూడదు. ఆయన సర్వాధిపత్యం న్యాయమైనది, నిత్యమూ ఉండేది, విశ్వవ్యాప్తంగా ఉండేది. ఎవరు ఏమి చెప్పినా, చేసినా యెహోవా సర్వాధిపత్యానికి మార్పు ఉండదు. అయితే, అటు పరలోకంలో, ఇటు భూమిపైన దేవుని సర్వాధిపత్యం ఎంతగానో నిందించబడింది. కాబట్టి దేవదూతలముందు, మానవులముందు ఆయన సర్వాధిపత్యం సరైనదని, న్యాయమైనదని, ప్రేమగలదని నిరూపించబడాలి. యెహోవాసాక్షులముగా మనం, వినడానికి సుముఖంగా ఉన్నవారితో యెహోవా సర్వాధిపత్యం గురించి చర్చించేందుకు ఇష్టపడతాం. యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తున్నామనీ, ఆయనను మన సర్వాధిపతిగా ఎంపిక చేసుకున్నామనీ మనం ఎలా చూపించవచ్చు? మనం యథార్థతను కనబరచడం ద్వారానే అలా చేయవచ్చు.

10 మీ యథార్థతకు దానితో ఎలాంటి సంబంధముందో పరిశీలించండి. నిజానికి, ఏ మానవుడూ దేవుని సర్వాధిపత్యానికి మద్దతు ఇవ్వడనీ లేదా నిస్వార్థంగా ఎవరూ ఆయనను ప్రేమించరని సాతాను నిందవేశాడు. కోటానుకోట్ల దేవదూతలముందు అపవాది యెహోవాతో, “చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా” అని అన్నాడు. (యోబు 2:⁠4) అతడు, నీతిమంతుడైన యోబుమీద మాత్రమే కాదుగానీ మానవులందరి మీద నిందవేశాడన్న విషయాన్ని గమనించండి. అందుకే, సాతానును ‘మన సహోదరులమీద నేరము మోపువాడు’ అని బైబిలు పిలుస్తుంది. (ప్రక. 12:​10) మీతోపాటు క్రైస్తవులందరూ దేవునికి యథార్థంగా ఉండరనే వాదనతో అతడు యెహోవాను ఎత్తిపొడుస్తున్నాడు. మీ ప్రాణాల్ని కాపాడుకోవడానికి మీరు యెహోవానైనా విడిచిపెడతారని సాతాను వాదిస్తున్నాడు. మీమీద మోపబడుతున్న అలాంటి నిందల విషయంలో మీకు ఏమనిపిస్తుంది? సాతాను అబద్ధికుడని రుజువుచేసే అవకాశం దొరకాలని మీకు అనిపించడం లేదా? యథార్థతను కనబరచడం ద్వారా మీరలా చేయవచ్చు.

11 కాబట్టి మీ యథార్థతను నిరూపించుకోవాలంటే ప్రవర్తించే తీరు విషయంలో, తీసుకునే నిర్ణయాల విషయంలో మీరు ప్రతీరోజు చాలా జాగ్రత్త వహించాలి. మనం ప్రారంభంలో చూసిన మూడు సన్నివేశాలను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ ముగ్గురూ తమ యథార్థతను ఎలా నిరూపించుకుంటారు? తోటి విద్యార్థులు ఎగతాళి చేస్తున్నప్పుడు వారిమీద ఎలాగైనా తన కోపాన్ని వెళ్లగ్రక్కాలని అనిపించవచ్చు. కానీ ఆ అబ్బాయి, “ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి​—⁠పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు [యెహోవా] చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది” అన్న హెచ్చరికను గుర్తుచేసుకొని అక్కడినుండి వెళ్లిపోతాడు. (రోమా. 12:​19) కంప్యూటర్‌లో ఇంటర్‌నెట్‌ చూస్తున్న వ్యక్తి లైంగిక కోరికలను కలిగించే దృశ్యాలు చూసే అవకాశం ఉన్నా “నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?” అని యోబు చెప్పిన మాటల్లోని సూత్రాన్ని గుర్తుచేసుకుంటాడు. (యోబు 31:⁠1) యోబులాగే, ఈ వ్యక్తి అశ్లీల దృశ్యాలు విషంతో సమానమని ఎంచి వాటికి దూరంగా ఉంటాడు. కొంతమంది సహోదరీలతో మాట్లాడుతున్న ఒక క్రైస్తవురాలు ఓ సహోదరి గురించి చాడీలు విన్నప్పుడు “తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను” అన్న నిర్దేశాన్ని గుర్తుతెచ్చుకుంటుంది. (రోమా. 15:⁠2) ఇతురుల్లాగే ఆమె కూడ చాడీలు చెబితే అది వారికి క్షేమాభివృద్ధికరంగా ఉండదు. ఆమె తన సహోదరి పేరు కూడ పాడుచేస్తుంది. అంతేకాక తన పరలోక తండ్రిని సంతోషపెట్టదు. కాబట్టి ఆమె తన నోటిని అదుపులో ఉంచుకొని సంభాషణను మారుస్తుంది.

12 తాము తీసుకున్న నిర్ణయాల ద్వారా ఆ ముగ్గురూ ‘యెహోవాయే తమ పరిపాలకుడనీ, ఈ విషయంలో ఆయనకు ఇష్టమైనదే చేస్తామని’ చూపించారు. మీరు కూడ ఎంపికలు చేస్తున్నప్పుడు, నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు యెహోవాను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? మీరలా చేసినప్పుడు “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును” అని సామెతలు 27:11లోని ప్రోత్సాహకరమైన మాటలకు అనుగుణంగా జీవించగలుగుతారు. దేవుని హృదయాన్ని సంతోషపెట్టడం ఎంత గొప్ప విషయం! మనం మన యథార్థతను కాపాడుకోవడానికి చేసే ప్రతీ ప్రయత్నం ఎంతో విలువైనది కాదా?

2. మన యథార్థతనుబట్టే యెహోవా మనకు తీర్పుతీరుస్తాడు

13 యథార్థంగా ఉండడం ద్వారా యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించగలుగుతామని మనం చూశాం. కాబట్టి, ఆయన మన యథార్థనుబట్టే మనకు తీర్పుతీరుస్తాడు. యోబు ఈ సత్యాన్ని గ్రహించాడు. (యోబు 31:​6,7 చదవండి.) యెహోవా మానవులందరినీ “న్యాయమైన త్రాసులో” తూస్తాడనీ, తన పరిపూర్ణ న్యాయాన్నిబట్టి మన యథార్థతను పరీక్షిస్తాడని యోబుకు తెలుసు. దావీదు కూడ యోబులాగే ఇలా చెప్పాడు: ‘యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతనుబట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. నీవు హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడవు.’ (కీర్త. 7:​8, 9) దేవుడు మన వ్యక్తిత్వాన్ని అంటే మన అలంకారార్థ “హృదయములను అంతరింద్రియములను” లోతుగా పరిశీలించగలడని మనకు తెలుసు. అయితే ఆయన దేన్ని పరిశీలిస్తున్నాడో మనం గుర్తుంచుకోవాలి. దావీదు చెప్పినట్లు, యెహోవా మన యథార్థతనుబట్టే తీర్పుతీరుస్తాడు.

14 యెహోవా కోటానుకోట్ల మానవ హృదయాలను పరిశోధిస్తున్నాడన్న విషయాన్ని ఒకసారి ఆలోచించండి. ​(1 దిన. 28:⁠9) ఆయన ఎంతమంది యథార్థవంతులను కనుగొంటాడు? కొద్దిమందినే! మన అపరిపూర్ణత కారణంగా మనం యథార్థతను కాపాడుకోలేమని అనుకోకూడదు. బదులుగా, మనకు అపరిపూర్ణతలున్నా, మనం యథార్థతను కాపాడుకోవడాన్ని యెహోవా గమనిస్తాడనే నమ్మకాన్ని దావీదు, యోబుల్లాగే మనమూ కలిగివుండడానికి తగిన కారణాలు ఉన్నాయి. పరిపూర్ణంగా ఉన్నంతమాత్రాన యథార్థంగా ఉంటామని ఏమీ లేదు అని గుర్తుంచుకోండి. ఎందుకంటే, భూమిపై జీవించిన ముగ్గురు పరిపూర్ణుల్లో ఇద్దరు అంటే ఆదాముహవ్వలు తమ యథార్థతను నిలుపుకోలేదు. అయితే లక్షలాదిమంది మానవులు అపరిపూర్ణులైనా తమ యథార్థతను నిలుపుకోగలిగారు. మీరూ నిలుపుకోగలరు.

3. భవిష్యత్‌ నిరీక్షణకు అది ఎంతో అవసరం

15 మన యథార్థతనుబట్టే యెహోవా మనకు తీర్పుతీరుస్తాడు కాబట్టి మన భవిష్యత్తు నిరీక్షణకు అది ఎంతో అవసరం. దావీదుకు ఆ విషయం తెలుసు. (కీర్తనలు 41:⁠12 చదవండి.) దేవుని అనుగ్రహం తనకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన నమ్మాడు. నేటి నిజ క్రైస్తవుల్లాగే దావీదు కూడ యెహోవా దేవుణ్ణి ఎల్లప్పుడూ సేవిస్తూ ఆయనకు దగ్గరవుతూ నిరంతరం జీవించాలని కోరుకున్నాడు. తన కోరిక నెరవేరాలంటే తాను యథార్థంగా ఉండాలన్న విషయం దావీదుకు తెలుసు. మనం యథార్థతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండగా యెహోవా కూడ మనకు సహాయం చేస్తాడు, బోధిస్తాడు, నిర్దేశిస్తాడు, ఆశీర్వదిస్తాడు.

16 మన అనుదిన జీవితంలో సంతోషంగా ఉండాలంటే నిరీక్షణ ఎంతో అవసరం. దానివల్ల కష్టసమయాల్లోనూ మనం ఆనందంగా ఉండగలం. అంతేకాక మన ఆలోచనా విధానం తప్పుదోవ పట్టకుండా అది ఉంచుతుంది. బైబిలు నిరీక్షణను శిరస్త్రాణంతో పోలుస్తోందని గుర్తుంచుకోండి. (1 థెస్స. 5:⁠8) యుద్ధంలో సైనికుని తలను శిరస్త్రాణం ఎలాగైతే కాపాడుతుందో అలాగే నశించిపోతున్న ఈ లోకంలో సాతాను ఉపయోగించే హానికరమైన, నిరాశావాద ఆలోచనల నుండి నిరీక్షణ మనల్ని కాపాడుతుంది. నిరీక్షణ లేకపోతే జీవితానికి అర్థముండదు. మనం ఎంతవరకూ యథార్థంగా ఉన్నామో, మన నిరీక్షణ ఎలా ఉందో నిజాయితీగా, జాగ్రత్తగా ఆలోచించాలి. యథార్థంగా ఉండడం ద్వారా మీరు యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తున్నారనీ, భవిష్యత్తు విషయంలో మీకున్న అద్భుతమైన నిరీక్షణను కాపాడుకుంటున్నారనీ గుర్తుంచుకోండి. మీరు ఎల్లప్పుడూ మీ యథార్థతను కాపాడుకుందురు గాక!

17 యథార్థత చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి దానికి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలను మనం పరిశీలించాలి. యథార్థతను మనం ఎలా అలవర్చుకోవచ్చు? ఆ లక్షణాన్ని ఎల్లప్పుడూ మనమెలా చూపించవచ్చు? ఒకవేళ ఒక వ్యక్తి తప్పుచేసి కొంతకాలంపాటు తన యథార్థతను కోల్పోతే అప్పుడేమి చేయవచ్చు? ఈ ప్రశ్నలకు తర్వాతి ఆర్టికల్‌ జవాబిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 9 ‘మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిపూర్ణంగా ఉండండి’ అని యేసు చెప్పాడు. (మత్త. 5:​48) అపరిపూర్ణ మానవులు సహితం కొంతమేరకు పరిపూర్ణంగా ఉండగలరని ఆయన అర్థంచేసుకున్నాడు. ఇతరులను హృదయపూర్వకంగా ప్రేమించాలన్న ఆజ్ఞను మనం పాటించినప్పుడే మనం దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం. అయితే యెహోవాలాంటి పరిపూర్ణుడు విశ్వంలోనే ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే సంపూర్ణ భావంలో పరిపూర్ణుడు. ఆయన విషయానికివస్తే, “యథార్థత” అంటే పరిపూర్ణత అనే అర్థం కూడ ఉంది.​—⁠ద్వితీ. 32:⁠4.

మీరెలా జవాబిస్తారు?

• యథార్థత అంటే ఏమిటి?

• యథార్థతకు సర్వాధిపత్యపు వివాదాంశంతో ఎలాంటి సంబంధం ఉంది?

• భవిష్యత్‌ నిరీక్షణకు యథార్థత ఎందుకు అవసరం?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. క్రైస్తవుల యథార్థతను పరీక్షించే కొన్ని పరిస్థితులు ఏమిటి?

3. యెహోవా మనకు ఏ స్వేచ్ఛను ఇచ్చాడు, ఈ ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

4. యథార్థంగా ఉండాలంటే ఎలా ప్రవర్తించాలి? జంతు బలుల విషయంలో యెహోవా ఇచ్చిన నియమం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

5, 6. (ఎ) సంపూర్ణమైన దాన్ని మనం విలువైనదిగా ఎంచుతామని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి? (బి) అపరిపూర్ణ మానవుల విషయానికొస్తే యథార్థంగా ఉండడమంటే పరిపూర్ణంగా ఉండాలని దానర్థమా? వివరించండి.

7, 8. (ఎ) యథార్థత విషయంలో యేసు ఎలాంటి మాదిరి ఉంచాడు? (బి) లేఖనానుసారంగా యథార్థత అంటే ఏమిటి?

9. మనం చూపించే యథార్థతకు, యెహోవా సర్వాధిపత్య వివాదాంశానికి మధ్య సంబంధముందని ఎలా చెప్పవచ్చు?

10. మానవుల యథార్థత విషయంలో సాతాను ఏ నింద వేశాడు? దాని విషయంలో మీరేమి చేయాలని అనుకుంటున్నారు?

11, 12. (ఎ) మనం ప్రతీరోజు తీసుకునే నిర్ణయాలకూ యథార్థతను నిరూపించుకోవడానికీ మధ్య సంబంధముందని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి? (బి) యథార్థత కనబరచడం ఎందుకు ఒక గొప్ప విషయం?

13. యెహోవా మన యథార్థతనుబట్టి మనకు తీర్పుతీరుస్తాడని యోబు, దావీదుల మాటలు ఎలా చూపిస్తున్నాయి?

14. అపరిపూర్ణులం, పాపులం కాబట్టి యథార్థత నిలుపుకోలేమని మనమెందుకు ఎప్పుడూ అనుకోకూడదు?

15. భవిష్యత్తు నిరీక్షణ కోసం యథార్థత ఎంతో అవసరమని దావీదు ఎలా చూపించాడు?

16, 17. (ఎ) యథార్థతను ఎల్లప్పుడూ చూపించాలనే కృత నిశ్చయంతో మీరు ఎందుకు ఉన్నారు? (బి) ఏ ప్రశ్నలకు తర్వాతి ఆర్టికల్‌ జవాబిస్తుంది?

[5వ పేజీలోని చిత్రాలు]

ప్రతీరోజు మన యథార్థత విషయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటాం