కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇదిగో! యెహోవా ప్రియమైన సేవకుడు

ఇదిగో! యెహోవా ప్రియమైన సేవకుడు

ఇదిగో! యెహోవా ప్రియమైన సేవకుడు

‘ఇదిగో నా ప్రాణమునకు ప్రియుడైన సేవకుడు.’​—⁠యెష. 42:⁠1.

యేసు మరణ జ్ఞాపకార్థ దినం సమీపిస్తుండగా దేవుని ప్రజలముగా మనం, ‘విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూడండి’ అని పౌలు ఇచ్చిన సలహాను పాటించాలని ప్రోత్సహించబడుతున్నాం. అంతేగాక, “మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి” అని కూడా పౌలు చెప్పాడు. (హెబ్రీ. 12:​1-3) క్రీస్తు చనిపోయేంతవరకు నమ్మకంగా జీవించాడు. ఆయన జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా అభిషిక్తులు, వేరేగొర్రెలు యెహోవాను నమ్మకంగా సేవిస్తూ ‘ప్రాణాలు విసుకక ఉండునట్లు’ చూసుకుంటారు.​—⁠గలతీయులు 6:9 పోల్చండి.

2 ప్రవక్తయైన యెషయాను ప్రేరేపించి యెహోవా తన ప్రియ కుమారునికి మాత్రమే వర్తించే అనేక ప్రవచనాలను రాయించాడు. అత్యంత ఆసక్తితో ‘విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూస్తూ’ నడవడానికి ఈ ప్రవచనాలు సహాయం చేస్తాయి. * ఆయన చూపించిన లక్షణాల గురించి, పడిన బాధల గురించి, ఆయన మన రాజుగా, విమోచకునిగా మహిమపర్చబడడం గురించి అవి తెలియజేస్తున్నాయి. ఈ ప్రవచనాలన్నీ ఏప్రిల్‌ 9, గురువారం రోజున జరుగబోయే యేసు జ్ఞాపకార్థ ఆచరణపై మనకున్న అవగాహనను పెంచుతాయి.

సేవకుడు ఎవరో తెలిసింది

3 ‘సేవకుడు’ అనే మాట యెషయా పుస్తకంలో చాలాసార్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు అది యెషయా ప్రవక్తను సూచిస్తోంది. (యెష. 20:⁠3; 44:​26) మరి కొన్నిసార్లు అది ఇశ్రాయేలు లేదా యాకోబు జనాంగాన్నంతటినీ సూచిస్తోంది. (యెష. 41:​8, 9; 44:​1, 2, 21) కానీ, యెషయా 42, 49, 50, 52, 53 అధ్యాయాల్లో సేవకుడి గురించి చెప్పబడిన అసాధారణ ప్రవచనాల విషయమేమిటి? ఈ అధ్యాయాల్లో చెప్పబడిన యెహోవా సేవకుడు ఎవరో క్రైస్తవ గ్రీకు లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, అపొస్తలుల కార్యముల పుస్తకంలో చెప్పబడిన ఐతియోపీయుడైన అధికారి ఈ ప్రవచనాల్లో ఒక దాన్ని చదువుతున్నాడు. ఆ సమయంలో ఆయనను వెళ్లి కలుసుకోమనీ ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించింది. యెషయా 53:​7, 8 వచనాలను చదివిన ఆ అధికారి ‘యెవనినిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుము’ అని ఫిలిప్పును అడిగాడు. యెషయా ప్రవక్త మెస్సీయ అయిన యేసును గురించి చెబుతున్నాడని ఫిలిప్పు వెంటనే ఆయనకు వివరించాడు.​—⁠అపొ. 8:​26-35.

4యెషయా 42:⁠6; 49:6 వచనాల్లో చెప్పబడినట్లు “శిశువైన యేసు” యెహోవాను ‘అన్యజనులకు బయలుపరచుటకు వెలుగుగా’ ఉంటాడనే విషయం ఆయన పసిబాలునిగా ఉన్నప్పుడే నీతిమంతుడైన సుమేయోను పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పాడు. (లూకా 2:​25-32) అంతేగాక, యేసు అప్పగించబడిన రాత్రి అవమానపర్చబడతాడని యెషయా 50:​6-9లో ముందుగానే చెప్పబడింది. (మత్త. 26:​67; లూకా 22:​63) సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత యేసే యెహోవా ‘సేవకుడు’ అని పేతురు స్పష్టం చేశాడు. (యెష. 52:​13; 53:​11; అపొస్తలుల కార్యములు 3:​13, 26 చదవండి.) మెస్సీయకు సంబంధించిన ఈ ప్రవచనాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

యెహోవా తన సేవకునికి శిక్షణనిచ్చాడు

5 సేవకుని గురించిన ఒకానొక యెషయా ప్రవచనంలో, దేవుని మొదటి కుమారుడు భూమ్మీదకు రాకముందు ఆయనకూ యెహోవాకూ మధ్యవున్న దగ్గరి సంబంధం వివరించబడింది. (యెషయా 50:​4-9 చదవండి.) యెహోవా తనకు శిక్షణనిస్తూ వచ్చాడని సేవకుడే స్వయంగా చెప్పాడు. “శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు” అని ఆయన అన్నాడు. (యెష. 50:⁠4) శిక్షణా కాలంలో యెహోవా సేవకుడు తన తండ్రి మాటలను విన్నాడు, ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. విధేయుడైన శిష్యుడిగా తయారయ్యాడు. విశ్వ సృష్టికర్త దగ్గర నేర్చుకోవడం ఎంత గొప్ప అవకాశం!

6 ఈ ప్రవచనంలో, సేవకుడు తన తండ్రి ‘సర్వాధికారియైన ప్రభువగు యెహోవా’ అని చెప్పాడు. దీన్నిబట్టి ఆయన యెహోవాయే విశ్వసర్వాధిపతి అనే సత్యాన్ని గుర్తించాడని తెలుస్తుంది. తాను తన తండ్రికి పూర్తిగా లోబడుతున్నానని తెలియజేస్తూ ఆయన ఇలా అన్నాడు: “[సర్వాధికారియైన] ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు, వినకుండ నేను తొలగిపోలేదు.” (యెష. 50:​5, NW) ఈ విశ్వాన్నీ మానవులనూ సృష్టిస్తున్నప్పుడు ఆయన యెహోవా ‘దగ్గర ప్రధానశిల్పిగా’ పనిచేశాడు. ఈ ‘ప్రధానశిల్పి’ ‘యెహోవా సముఖంలో ఎల్లప్పుడూ సంతోషించాడు.’ ‘ఆయన సృజించిన భూమినిబట్టి ఆనందించాడు. మానవకోటినిబట్టి ఎంతో సంతోషించాడు.’​—⁠సామె. 8:​22-31, పవిత్రగ్రంథము, వ్యాఖ్యాన సహితం.

7 సేవకుడైన యేసు ఈ శిక్షణ పొందడంవల్ల, మానవులపట్ల ప్రేమ ఉండడంవల్ల భూమ్మీదికి వచ్చినప్పుడు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోగలిగాడు. తీవ్ర హింసలు ఎదురైనప్పుడు కూడ ఆయన తన తండ్రి చిత్తం చేస్తూ ఉండడానికే ఇష్టపడ్డాడు. (కీర్త. 40:⁠8; మత్త. 26:​42; యోహా. 6:​38) భూమ్మీద ఆయనకు అనేక పరీక్షలు ఎదురయ్యాయి. అయినా తన తండ్రి ఆమోదం, మద్దతు తనకు ఉన్నాయని యేసు నమ్మాడు. యెషయా గ్రంథంలో ప్రవచించబడినట్లుగానే యేసు, “నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు. నాతో వ్యాజ్యెమాడువాడెవడు? ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును” అని చెప్పగలిగాడు. (యెష. 50:​8, 9) యెషయాలోని మరో ప్రవచనం చెబుతున్నట్లుగా నమ్మకస్థుడైన తన సేవకుని పరిచర్యంతటిలో యెహోవా సహాయం చేశాడు.

సేవకుని భూపరిచర్య

8 సా.శ. 29లో యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు జరిగిన సంఘటన గురించి బైబిలు ఇలా చెబుతోంది: ‘పరిశుద్ధాత్మ ఆయనమీదికి దిగివచ్చెను. అప్పుడు​—⁠నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.’ (లూకా 3:​21, 22) అలా యెషయా ప్రవచనంలో ప్రస్తావించబడిన ‘ఏర్పరచుకున్న’ సేవకుడెవరో యెహోవా స్పష్టం చేశాడు. (యెషయా 42:​1-7 చదవండి.) తన భూపరిచర్యా కాలంలో, యేసు ఈ ప్రవచనాన్ని అసాధారణ రీతిలో నెరవేర్చాడు. మత్తయి తన సువార్తలో యెషయా 42:​1-4లోని మాటలను ఉల్లేఖిస్తూ వాటిని యేసుకు అన్వయించాడు.​—⁠మత్త. 12:​15-21.

9 యుదా మతనాయకులు యూదుల్లోని సామాన్య ప్రజలను హీనంగా చూశారు. (యోహా. 7:​47-49) వారు ఎంత కఠినంగా వ్యవహరించారంటే ఆ ప్రజలను ‘నలిగిన రెల్లు’తో, ఆరిపోవడానికి సిద్ధంగావున్న ‘జనుపనార వత్తులతో’ పోల్చవచ్చు. అయితే, యేసు పేదవారిపట్ల, బాధలు అనుభవిస్తున్నవారిపట్ల కనికరాన్ని చూపించాడు. (మత్త. 9:​35, 36) అలాంటి వారికి ఆయన ప్రేమతో ఈ ఆహ్వానాన్ని ఇచ్చాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.” (మత్త. 11:​28) అంతేకాక, తప్పొప్పుల విషయంలో యెహోవా ప్రమాణాలను బోధించడం ద్వారా యేసు ‘న్యాయాన్ని కనబరిచాడు’. (యెష. 42:⁠3) దేవుని ధర్మశాస్త్రాన్ని కనికరంతో న్యాయంగా అన్వయించాలని కూడ ఆయన చూపించాడు. (మత్త. 23:​23) అంతేకాక, బీద ధనిక అనే భేదం లేకుండా ప్రకటించడం ద్వారా ఆయన న్యాయాన్ని కనబరిచాడు.​—⁠మత్త. 11:⁠5; లూకా 18:​18-23.

10 యెహోవా ‘ఏర్పరచుకున్న సేవకుడు’ ‘భూమ్మీద న్యాయాన్ని స్థాపిస్తాడు’ అని కూడ యెషయా గ్రంథం ప్రవచించింది. (యెష. 42:⁠4) త్వరలోనే యేసు మెస్సీయ రాజ్యానికి రాజుగా భూమిపైనున్న రాజకీయ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి దాని స్థానంలో తన నీతియుక్త పరిపాలనను స్థాపించినప్పుడు ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తాడు. అప్పుడు ఆయన “నీతి నివసించు” నూతనలోకాన్ని స్థాపిస్తాడు.​—⁠2 పేతు. 3:​13; దాని. 2:⁠44.

“వెలుగుగా”, “నిబంధనగా”

11యెషయా 42:6లోని ప్రవచనం చెప్పినట్లుగానే, యేసు “జనులకు వెలుగుగా” ఉన్నాడు. తన భూపరిచర్యలో ఆయన ముఖ్యంగా యూదులకు ఆధ్యాత్మిక వెలుగును ప్రసరించాడు. (మత్త. 15:​24; అపొ. 3:​26) అయితే, యేసు “నేను లోకమునకు వెలుగును” అని చెప్పాడు. (యోహా. 8:​12) ఆయన ఆధ్యాత్మిక విషయాలను బోధించడమే కాక, తన పరిపూర్ణ ప్రాణాన్ని మానవులకు విమోచనా క్రయధనంగా అర్పించడం ద్వారా ఇటు యూదులకు, అటు అన్యజనులకు వెలుగయ్యాడు. (మత్త. 20:​28) పునరుత్థానం చేయబడిన తర్వాత “భూదిగంతములవరకు” తనకు సాక్షులుగా ఉండమని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (అపొ. 1:⁠8) “జనులకు వెలుగుగా” అనే మాటలను పౌలు బర్నబాలు తమ పరిచర్యలో ఉల్లేఖించారు. వారు ఆ మాటలను తాము యూదేతరులకు చేస్తున్న ప్రకటనా పనికి అన్వయించుకున్నారు. (అపొ. 13:​46-48; యెషయా 49:6 పోల్చండి.) భూమ్మీద యేసు అభిషిక్త సహోదరులు, వారి సహచరులు సువార్త ప్రకటిస్తూ “జనులకు వెలుగు” అయిన యేసు పట్ల విశ్వాసముంచడానికి ప్రజలకు సహాయం చేస్తున్నారు కాబట్టి ఆ పని ఇప్పటికీ జరుగుతోంది.

12 ఆ ప్రవచనంలో, యెహోవా తాను ఏర్పరచుకున్న సేవకునితో ఇలా అన్నాడు: ‘నిన్ను కాపాడతాను. నిన్ను ప్రజల కోసం నిబంధనగా నియమిస్తాను.’ (యెష. 42:​6, 7) యేసును తన పరిచర్య చేయకుండా ఆపాలనీ, ఆయనను చంపాలనీ సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ చనిపోవాల్సిన సమయం వచ్చేంతవరకు యెహోవా ఆయనను కాపాడాడు. (మత్త. 2:​13; యోహా. 7:​30) ఆ తర్వాత యెహోవా ఆయనను పునరుత్థానం చేసి భూమ్మీదున్నవారికి ‘నిబంధన’గా లేక వాగ్దానంగా ఇచ్చాడు. దేవుని నమ్మకమైన సేవకుడు ఆధ్యాత్మిక చీకట్లోవున్నవారిని విడుదల చేస్తూ ఎల్లప్పుడూ “జనులకు వెలుగుగా” ఉంటాడని ఆ వాగ్దానం అభయాన్నిచ్చింది.​—⁠యెషయా 49:​8, 9 చదవండి. *

13 ఆ వాగ్దానం ప్రకారంగా, యెహోవా ఏర్పరచుకున్న సేవకుడు ‘గ్రుడ్డివారి కన్నులు తెరుస్తాడు, బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెస్తాడు, చీకటిలో నివసించువారిని వెలుపలికి తెస్తాడు.’ (యెష. 42:​6, 7) యేసు తన భూపరిచర్యలో అబద్ధ మత ఆచారాలు తప్పని నిరూపించి, రాజ్యసువార్తను ప్రకటించడం ద్వారా ఈ ప్రవచనాన్ని నెరవేర్చాడు. (మత్త. 15:⁠3; లూకా 8:⁠1) అలా తన శిష్యులైన యూదులను అబద్ధమతం నుండి విడిపించాడు. (యోహా. 8:​31, 32) అలాగే లక్షలాదిమంది అన్యులు కూడ సత్యాన్ని తెలుసుకునేందుకు ఆయన సహాయం చేశాడు. ఆయన తన అనుచరులకు, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అనే ఆజ్ఞనిచ్చి, ‘ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాననే’ అభయాన్నిచ్చాడు. (మత్త. 28:​19, 20) క్రీస్తుయేసు పరలోకం నుండి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనా పనిని పర్యవేక్షిస్తున్నాడు.

యెహోవా ‘సేవకుణ్ణి’ హెచ్చించాడు

14 తన సేవకుడైన మెస్సీయ గురించి మరో ప్రవచనంలో యెహోవా ఇలా చెప్పాడు: “ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును.” (యెష. 52:​13) తన కుమారుడు ఎంతో తీవ్రమైన పరీక్ష ఎదురైనా నమ్మకంగా ఉంటూ తన సర్వాధిపత్యానికి లొబడినందుకు యెహోవా ఆయనను హెచ్చించాడు.

15 యేసు గురించి అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారులమీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు.” (1 పేతు. 3:​22) అపొస్తలుడైన పౌలు కూడ ఇలా రాశాడు: “మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.”​—⁠ఫిలి. 2:​8-11.

16 యెహోవా యేసును 1914లో మరింతగా హెచ్చించాడు. మెస్సీయ రాజ్యానికి రాజుగా యెహోవా ఆయనను సింహాసనాసీనుడిగా చేసినప్పుడు యేసు “మహా ఘనుడుగా” హెచ్చించబడ్డాడు. (కీర్త. 2:⁠6; దాని. 7:​13, 14) అప్పటినుండి క్రీస్తు తన ‘శత్రువుల మధ్య పరిపాలన చేస్తున్నాడు.’ (కీర్త. 110:⁠2) మొదట ఆయన సాతానును, అతని దయ్యాలను భూమ్మీదకు పడద్రోయడం ద్వారా వారిపై విజయం సాధించాడు. (ప్రక. 12:​7-12) ఆ తర్వాత గొప్ప కోరెషుగా క్రీస్తు భూమ్మీదున్న తన అభిషిక్త సహోదరుల శేషాన్ని “మహా బబులోను” చెర నుండి విడిపించాడు. (ప్రక. 18:⁠2; యెష. 44:​28) ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనా పనికి క్రీస్తు నాయకత్వం వహిస్తున్నాడు. దానివల్ల తన అభిషిక్త సహోదరుల్లో ‘శేషించిన వారూ’ “చిన్నమంద”కు నమ్మకమైన సహచరులైన లక్షలాదిమంది ‘వేరే గొర్రెలూ’ సమకూర్చబడుతున్నారు.​—⁠ప్రక. 12:​17; యోహా. 10:​16; లూకా 12:⁠32.

17 యెషయా గ్రంథంలోని ఈ అసాధారణ ప్రవచనాలను అధ్యయనం చేయడంవల్ల మన రాజూ, విమోచకుడూ అయిన క్రీస్తుయేసు పట్ల మనకున్న కృతజ్ఞతా భావం నిజంగానే పెరిగింది. తన భూపరిచర్యంతటిలో తండ్రికి లోబడడం ద్వారా యేసు, భూమ్మీదకు రాకముందు తన తండ్రి దగ్గర శిక్షణపొందాడని చూపించాడు. తన సొంత పరిచర్య ద్వారా, ప్రకటనా పనిని ఇప్పటికీ పర్యవేక్షిస్తూ ఉండడం ద్వారా తాను “ప్రజలకు వెలుగు” అని యేసు చూపించాడు. సేవకుడైన మెస్సీయ బాధలను అనుభవించి మన మేలు కోసం తన ప్రాణాన్ని అర్పిస్తాడని మరో ప్రవచనం చెబుతుంది. దాని గురించి మనం తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం. యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణ సమీపిస్తుండగా మనం ఈ విషయాల్ని జాగ్రత్తగా ‘తలంచుకోవాలి’ లేక పరిశీలించాలి.​—⁠హెబ్రీ. 12:​1-3.

[అధస్సూచీలు]

^ పేరా 4 ఈ ప్రవచనాలు యెషయా 42:1-7; 49:1-12; 50:4-9; 52:13–53:12లో ఉన్నాయి.

^ పేరా 18 యెషయా 49:​1-12 వచనాల్లోని ప్రవచనాల వివరణ కోసం యెషయా ప్రవచనం​—⁠సర్వమానవాళికి వెలుగు సంపుటి II, 136-145 పేజీలు చూడండి.

పునఃసమీక్ష

• యెషయా ప్రవచనాల్లో ప్రస్తావించబడిన ‘సేవకుడు’ ఎవరు? అది మనకెలా తెలుసు?

• యెహోవా నుండి ఆ సేవకుడు ఎలాంటి శిక్షణ పొందాడు?

• యేసు ఎలా “జనులకు వెలుగుగా” ఉన్నాడు?

• సేవకుడు ఎలా హెచ్చించబడ్డాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యేసు మరణ జ్ఞాపకార్థ దినం సమీపిస్తుండగా యెహోవా ప్రజలు ఏమి చేయాలని ప్రోత్సహించబడుతున్నారు? ఎందుకు?

2. దేవుని కుమారునికి సంబంధించిన యెషయా ప్రవచనాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

3, 4. (ఎ) యెషయా పుస్తకంలో ‘సేవకుడు’ అనే మాట ఎవరెవర్ని సూచిస్తుంది? (బి) యెషయా 42, 49, 50, 52, 53 అధ్యాయాల్లో పేర్కొనబడిన సేవకుణ్ణి గుర్తించేందుకు బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

5. సేవకుడు ఎలాంటి శిక్షణ పొందాడు?

6. సేవకుడు తన తండ్రికి పూర్తిగా లోబడుతున్నాడని ఎలా చూపించాడు?

7. పరీక్షలు ఎదురైనప్పుడు తన తండ్రి సహాయం చేస్తాడనే నమ్మకం సేవకునికి ఉందని ఏది చూపిస్తుంది?

8. యెషయా 42:1లోని ‘ఏర్పరచుకున్న’ సేవకుడు యేసే అని ఏది రుజువుచేస్తుంది?

9, 10. (ఎ) యేసు తన భూపరిచర్యలో యెషయా 42:3లోని మాటలను ఎలా నెరవేర్చాడు? (బి)  క్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు ఎలా ‘న్యాయాన్ని కనబరిచాడు’? ఆయన ఎప్పుడు ‘భూమ్మీద న్యాయాన్ని స్థాపిస్తాడు’?

11. మొదటి శతాబ్దంలో యేసు ఎలా “జనులకు వెలుగు” అయ్యాడు? నేటికీ ఎలా వెలుగుగా ఉన్నాడు?

12. యెహోవా తన సేవకుణ్ణి ఎలా ‘ప్రజలకు ఒక నిబంధనగా’ ఇచ్చాడు?

13. యేసు ఏ విధంగా ‘చీకటిలో నివసించువారిని’ విడిపించాడు? ఆయన ఇప్పటికీ వారిని ఎలా విడిపిస్తున్నాడు?

14, 15. యెహోవా తన సేవకుణ్ణి ఎందుకు హెచ్చించాడు? ఎలా హెచ్చించాడు?

16. యేసు 1914లో “మహా ఘనుడుగా” ఎలా హెచ్చించబడ్డాడు? అప్పటి నుండి ఆయన ఏమి చేశాడు?

17. ‘సేవకుని’ గురించి యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలను అధ్యయనం చేయడం ద్వారా ఇప్పటివరకు మనమేమి నేర్చుకున్నాం?

[21వ పేజీలోని చిత్రం]

యెషయా గ్రంథంలో పేర్కొనబడిన ‘సేవకుడు’ మెస్సీయ అయిన యేసే అని ఫిలిప్పు స్పష్టపరిచాడు

[23వ పేజీలోని చిత్రం]

యెహోవా ఏర్పర్చుకున్న సేవకునిగా యేసు పేదవారిపట్ల, బాధలు అనుభవిస్తున్నవారిపట్ల కనికరాన్ని చూపించాడు

[24వ పేజీలోని చిత్రం]

యేసు తన తండ్రి చేత హెచ్చింపబడి మెస్సీయ రాజ్యానికి రాజుగా సింహాసనాసీనుడయ్యాడు