కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఇదే త్రోవ, దీనిలో నడవండి’

‘ఇదే త్రోవ, దీనిలో నడవండి’

‘ఇదే త్రోవ, దీనిలో నడవండి’

ఎమీలియా పీడర్‌సన్‌ జీవితకథను

రూత్‌ ఇ. పాపస్‌ చెప్పినది

మాఅమ్మ ఎమీలియా పీడర్‌సన్‌ 1878లో జన్మించింది. తను స్కూలు టీచరే అయినప్పటికీ దేవునికి దగ్గరయ్యేలా ప్రజలకు సహాయం చేస్తూ తన జీవితాన్ని గడపాలన్నదే ఆమె కోరిక. మా ఇల్లు అమెరికాలోని మిన్నెసొటా రాష్ట్రంలో ఉన్న జాస్పర్‌ అనే చిన్న పట్టణంలో ఉండేది. అమ్మకి క్రైస్తవ మిషనరీ అవ్వాలనే కోరిక ఉండేదనడానికి మా ఇంట్లోవున్న పెద్ద ట్రంకుపెట్టే రుజువు. తను మిషనరీగా సేవచేయాలనుకున్న చైనా దేశానికి తన సామానంతా తీసుకువెళ్లడానికి దాన్ని సంపాదించుకుంది. కానీ వాళ్ల అమ్మ చనిపోవడంతో తానే తన తోబుట్టువులను చూసుకోవాల్సివచ్చింది కాబట్టి తన లక్ష్యాలను మార్చుకుంది. 1907లో తను థియోడర్‌ హోలియన్‌ను పెళ్లిచేసుకుంది. వాళ్లకు పుట్టిన ఏడుగురు పిల్లల్లో నేనే చిన్నదాన్ని. 1925, డిసెంబరు 2న నేను పుట్టాను.

మా అమ్మకు బైబిలుకు సంబంధించిన అనేక సందేహాలు ఉండేవి. వాటికి జవాబులు కనుక్కోవాలని ఎంతగానో ప్రయత్నించింది. వాటిలో నరకం గురించిన బోధ ఒకటి. అది దుష్టులను యాతనపెట్టే స్థలమని బైబిల్లో ఎక్కడుందో తెలుసుకోవాలని తను లూథరన్‌ చర్చి నుండి వచ్చిన ఒక సూపర్వైజర్‌ను అడిగింది. బైబిలు ఏమి చెబుతుందో మనకు అవసరంలేదుగానీ, నరకం యాతనపెట్టే స్థలమని బోధించబడాల్సిందేనని ఆయన చెప్పాడు.

సత్యం తెలుసుకోవాలన్న అమ్మ కోరిక నెరవేరింది

1901వ సంవత్సరం ఆరంభంలో మా చిన్నమ్మ అయిన ఎమా, సంగీతం నేర్చుకోవడానికి మిన్నెసొటాలోని నార్త్‌ఫీల్డ్‌ నగరానికి వెళ్లింది. ఆమె అక్కడ సంగీతం మాస్టరు అయిన మిలియస్‌ క్రిస్టియన్‌సన్‌ ఇంట్లో ఉండేది. ఆయన భార్య ఒక బైబిలు విధ్యార్థి, అప్పట్లో యెహోవాసాక్షులు అలా పిలవబడేవారు. తనకు ఒక అక్కవుందనీ తాను బైబిలును భక్తితో ప్రతీరోజు చదువుతుంటుందనీ చిన్నమ్మ తన సంగీతం మాస్టారు భార్యతో చెప్పింది. కొద్ది రోజులకే ఆ సంగీతం మాస్టారు భార్య బైబిలు ప్రశ్నలకు జవాబిస్తూ మా అమ్మకు ఉత్తరం రాసింది.

ఒకరోజు, లోరా ఓట్‌హౌట్‌ అనే బైబిలు విద్యార్థి ప్రకటించడానికని దక్షిణ డకోటా రాష్ట్రంలోని స్యూ ఫాల్స్‌ నుండి రైలులో జాస్పర్‌కు వచ్చింది. తానిచ్చిన బైబిలు సాహిత్యాలను అమ్మ అధ్యయనం చేసింది. 1915 నుండి అమ్మ, లోరా ఇచ్చిన పత్రికలను ఇతరులకు ఇస్తూ తాను నేర్చుకున్న సత్యాలను వారికి బోధించడం మొదలుపెట్టింది.

1916లో, ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ సమావేశానికని ఐయోవా రాష్ట్రంలోని స్యూ సిటీకి వస్తున్నారని అమ్మ తెలుసుకుని తను కూడ హాజరవ్వాలనుకుంది. అప్పుటికే నా తోబుట్టువులు ఐదుగురు పుట్టారు. మార్వెన్‌ ఇంకా అయిదు నెలల పసివాడే. అయినా అందరినీ వెంటబెట్టుకుని రైలులో దాదాపు 160 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ సమావేశానికి హాజరైంది. తను రస్సెల్‌ ప్రసంగాలు విని, “ఫొటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌”ను చూడడమేకాక అదే సమావేశంలో బాప్తిస్మం కూడ తీసుకుంది. ఇంటికి వచ్చాక సమావేశం గురించి ఒక ఆర్టికల్‌ రాసింది, అది ఆ తర్వాత జాస్పర్‌ జర్నల్‌ అనే పత్రికలో ప్రచురించబడింది.

1922లో, ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌ వద్ద జరిగిన సమావేశానికి అమ్మ కూడ హాజరైంది. ఆ సమావేశానికి 18,000 మంది హాజరయ్యారు. ఆ సమావేశం తర్వాత అమ్మ దేవుని రాజ్యం గురించి ప్రకటించడం ఎన్నడూ మానలేదు. ‘ఇదే త్రోవ, దీనిలో నడవండి’ అనే ఉపదేశాన్ని పాటించాలని అమ్మ మాదిరి నుండి మేము నేర్చుకున్నాం.​—⁠యెష. 30:⁠21.

ఇతరులకు ప్రకటించడంవల్ల సత్ఫలితాలొచ్చాయి

1920ల తొలి సంవత్సరాల్లో అమ్మానాన్నలు జాస్పర్‌కు దగ్గర్లో ఉన్న ఇంటికి మారారు. నాన్న వ్యాపారం బాగా నడిచేది. పెద్ద కుటుంబాన్ని పోషించే బాధ్యత కూడ ఆయనమీద ఉండేది. అమ్మ చేసినంతగా నాన్న బైబిలు అధ్యయనం చేయలేదుకానీ ప్రకటన పనికైతే మద్దతునిచ్చేవాడు. అప్పట్లో పిల్‌గ్రిమ్‌లని పిలవబడే ప్రయాణ పైవిచారణకర్తలను కూడ మా ఇంట్లో ఉండనిచ్చేవాడు. వారు మా ఇంట్లో ప్రసంగాలు ఇస్తే దాదాపు వందమందితో మా హాలు, డైనింగ్‌ రూమ్‌, బెడ్‌ రూమ్‌ ఇలా అన్నిరూములు కిక్కిరిసిపోయేవి.

మా చిన్నమ్మ లెట్టీ తన పొరుగింటివారైన ఎడ్‌లార్సన్‌, అతని భార్య బైబిలు అధ్యయనం కావాలంటున్నారని ఫోను చేసి చెప్పింది, నాకప్పుడు ఏడేళ్లనుకుంటా. వాళ్లు బైబిలు సత్యాన్ని వెంటనే అంగీకరించడమేకాక తమ పొరుగింట్లో ఉండే ఎనిమిదిమంది పిల్లలుగల మార్తా వాన్‌ డాలన్‌ను కూడ అధ్యయనానికి ఆహ్వానించారు. మార్తా వాళ్ల కుటుంబమంతా సత్యంలోకి వచ్చారు. *

మా ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటున్న గోర్డన్‌ కామరుడ్‌ అనే ఒక యువకుడు మా నాన్నతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాడు. “యజమాని కూతుర్లు ఓ వింత మతానికి చెందినవారు, వారితో కాస్త జాగ్రత్తగా ఉండు” అని కొంతమంది గోర్డన్‌ను హెచ్చరించారు. అయినా ఆయన మాత్రం బైబిలు అధ్యయనాన్ని ఆరంభించి, అదే సత్యమని గుర్తించి మూడు నెలల తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు కూడ విశ్వాసులయ్యారు. అమ్మవాళ్లు, కామరుడ్‌వాళ్లు, వాన్‌ డాలన్‌వాళ్లు మంచి స్నేహితులయ్యారు.

సమావేశాలవల్ల ప్రోత్సహించబడ్డాం

సీడార్‌ పాయింట్‌ వద్ద జరిగిన సమావేశంవల్ల అమ్మ ఎంతగా ప్రోత్సాహించబడిందంటే తాను ఏ సమావేశాన్నీ మానకూడదని నిర్ణయించుకుంది. నా చిన్నతనంలో సమావేశాలకు వెళ్లాలంటే ఎంతో దూరం ప్రయాణించాల్సివచ్చేది. 1931లో ఒహాయోలోని కొలంబస్‌లో జరిగిన సమావేశాన్ని నేనెన్నడూ మరచిపోలేను. ఎందుకంటే ఆ సమావేశంలోనే యెహోవాసాక్షులు అనే పేరు స్వీకరించబడింది. (యెష. 43:​10-12) 1935లో వాషింగ్టన్‌ డి.సి.లో జరిగిన సమావేశాన్ని కూడ నేను మరచిపోలేను. దానిలో ప్రకటన గ్రంథంలోని “గొప్పసమూహము” ఎవరో వివరిస్తూ ఒక చారిత్రాత్మక ప్రసంగం ఇవ్వబడింది. (ప్రక. 7:⁠9) ఆ సమావేశంలో బాప్తిస్మం పొందిన 800 మందిలో మా అక్కలైన లిలియన్‌, యూనీస్‌లు కూడ ఉన్నారు.

మేము సమావేశాల కోసం వివిధ ప్రాంతాలకు అంటే 1937లో ఒహాయోలోని కొలంబస్‌కు, 1938లో వాషింగ్‌టన్‌లోని సీటల్‌కు, 1939లో న్యూయార్క్‌కు వెళ్లాం. మేమూ, వాన్‌ డాలన్‌వాళ్లూ, కామరుడ్‌వాళ్లూ మరితరులూ కలిసి ప్రయాణించేవాళ్లం. మార్గమధ్యంలో మేము అక్కడక్కడ బసచేసేవాళ్లం. యూనీస్‌ 1940లో లియో వాన్‌ డాలన్‌ను పెళ్లిచేసుకుంది. కొంతకాలానికి వాళ్లిద్దరూ పయినీర్లయ్యారు. లిలియన్‌ ఆ సంవత్సరంలోనే గోర్డన్‌ కామరుడ్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వాళ్లు కూడ పయినీర్లయ్యారు.

1941లో మిస్సౌరీలోని సెయింట్‌ లూయిస్‌లో జరిగిన సమావేశం ప్రత్యేకమైనది. ఆ సమావేశానికి హాజరైన వేలాదిమంది యౌవనస్థులకు ఆ సమావేశంలో విడుదలైన చిల్డ్రన్‌ అనే పుస్తకం ఇవ్వబడింది. ఆ సమావేశంలో నేనొక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. కొంతకాలానికి మా అన్న, వదినలైన మార్విన్‌, జోయిస్‌లతో కలిసి 1941 సెప్టెంబరు 1న పయినీరు సేవను ఆరంభించాను. అప్పడు నాకు 15 ఏళ్లు.

చాలామంది సహోదరులు వ్యవసాయదారులు కాబట్టి సమావేశానికి హాజరయ్యేందుకు అందరికీ వీలయ్యేది కాదు, ఎందుకంటే అప్పట్లో సరిగ్గా కోతకాలంలోనే సమావేశాలు జరిగేవి. తిరిగి వచ్చిన తర్వాత ఎవరైతే సమావేశానికి రాలేకపోయారో వారికోసం మా ఇంటి పెరట్లో సమావేశపు కార్యక్రమాలను చర్చించేవాళ్లం. ఆ చర్చా సమయాలను సంతోషంగా గడిపేవాళ్లం.

గిలియడ్‌ పాఠశాల, విదేశీ నియామకాలు

1943లో పయినీర్లకు మిషనరీ సేవలో శిక్షణ ఇవ్వడానికి గిలియడ్‌ పాఠశాల ప్రారంభించబడింది. మొదటి తరగతికి వాన్‌ డాలెన్‌ కుటుంబం నుండి ఆరుగురు అంటే ఎమిల్‌, ఆర్థర్‌, హోమర్‌, లియో, వాళ్ల నాన్న సహోదరుడి కుమారుడైన డోనాల్డ్‌, లియో భార్య అయిన మా అక్క యూనీస్‌లు హాజరయ్యారు. ఒకవైపు వారు మిషనరీ సేవకు వెళ్తున్నారనే సంతోషంతో మరోవైపు వారిని మళ్లీ ఎప్పుడు చూస్తామో అనే దుఃఖంతో వారికి వీడ్కోలు చెప్పాం. ఆ ఆరుగురూ పట్టభద్రులైన తర్వాత ప్యూర్టోరికోకు పంపించబడ్డారు. అప్పట్లో అక్కడ పట్టుమని పన్నెండుమంది సాక్షులు కూడ లేరు.

ఒక సంవత్సరం తర్వాత, లిలియన్‌ గోర్డన్‌లు, మార్విన్‌ జోయిస్‌లు గిలియడ్‌ పాఠశాల మూడవ తరగతికి హాజరయ్యారు. వాళ్లు కూడ ప్యూర్టోరికోకు పంపించబడ్డారు. ఆ తర్వాత, 1944 సెప్టెంబరు నెలలో నేను గిలియడ్‌ నాల్గవ తరగతికి హాజరయ్యాను, నాకప్పుడు 18 ఏళ్లు. 1945 ఫిబ్రవరిలో పట్టభద్రురాలైన తర్వాత నేను కూడ మా తోబుట్టువులున్న ప్యూర్టోరికోకు నియమించబడ్డాను. అక్కడకు వెళ్లిన తర్వాత నాకొక కొత్త అనుభవం ఎదురైంది. స్పానిష్‌ నేర్చుకోవడం కష్టమే అయినా కొంతకాలానికే మాలో కొంతమంది 20కన్నా ఎక్కువ బైబిలు అధ్యయనాలు నిర్వహించాం. యెహోవా మా పనిని ఆశీర్వదించాడు. ఇప్పుడు అక్కడ దాదాపు 25,000 మంది సాక్షులున్నారు!

మా కుటుంబానికి ఎదురైన విషాద సంటనలు

1950లో లియో, యూనీస్‌లకు మార్క్‌ అనే అబ్బాయి పుట్టిన తర్వాత వాళ్లు ప్యూర్టోరికోలోనే ఉండిపోయారు. 1952లో బంధువులను కలిసేందుకు సెలవులకు వెళ్దామని అనుకున్నారు. ఏప్రిల్‌ 11వ తారీఖున వాళ్లు విమానం ఎక్కారు. అయితే విషాదకరంగా వాళ్లు ప్రయాణిస్తున్న విమానం పైకి ఎగిరిన కొద్ది సేపటికే సముద్రంలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో లియో, యూనీస్‌లు చనిపోయారు. రెండేళ్ల పసివాడైన మార్క్‌ సముద్రంలో తేలుతూ కనిపించాడు. ప్రాణాలను దక్కించుకున్న ఒకతను మార్క్‌ను లైఫ్‌రాఫ్ట్‌ (విమానంలో ఉండే లైఫ్‌ బోట్‌లాంటిది) మీదకు తోసి కృత్రిమ శ్వాస ఇచ్చి బ్రతికించాడు. *

అయిదు సంవత్సరాల తర్వాత అంటే 1957 మార్చి 7న మా అమ్మనాన్నలు రాజ్యమందిరానికి వెళ్తున్నప్పుడు కారు టైరు పంక్చరైంది. కారును రోడ్డు ప్రక్కన పెట్టి టైరు మారుస్తున్నప్పుడు వేగంగా వెళ్తున్న ఒకకారు నాన్నను గుద్దడంతో నాన్న అక్కడికక్కడే మరణించాడు. నాన్నకు మంచి పేరు ఉండడంతో అంత్యక్రియలప్పుడు ఇచ్చే ప్రసంగానికి దాదాపు 600 మంది హాజరయ్యారు. అక్కడికి వచ్చినవారందరికి ఆ ప్రసంగం ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చింది.

కొత్త నియామకాలు

నాన్న చనిపోవడానికి కొంతకాలం ముందు నేను అర్జెంటీనాలో సేవ చేసే నియామకాన్ని పొందాను. 1957, ఆగస్టు నెలలో నేను ఆండీస్‌ పర్వతాల దిగువనున్న మెండోజా అనే పట్టణానికి చేరుకున్నాను. 1958లో, గిలియడ్‌ పాఠశాల 30వ తరగతిలో పట్టభద్రుడైన జార్జ్‌ పాపస్‌ అర్జెంటీనాకు నియమించబడ్డాడు. జార్జ్‌, నేను మంచి స్నేహితులమయ్యాం, ఆ తర్వాత 1960 ఏప్రిల్‌ నెలలో వివాహం చేసుకున్నాం. 1961లో మా అమ్మ చనిపోయింది. అప్పుడు ఆమెకు 83 ఏళ్లు. అమ్మ నమ్మకంగా సత్య మార్గంలో నడవడమేకాక అదే మార్గంలో నడిచేందుకు అనేకమందికి సహాయం చేసింది.

నేను, జార్జ్‌ పది సంవత్సరాలపాటు ఇతర మిషనరీలతో కలిసి వివిధ మిషనరీ గృహాల్లో సేవచేశాం. ఆ తర్వాత ఏడు సంవత్సరాలపాటు ప్రాంతీయ సేవలో గడిపాం. అనారోగ్యంతోవున్న మా కుటుంబ సభ్యులకు సహాయం చేసేందుకు 1975లో మేము అమెరికాకు తిరిగి వెళ్ళాం. 1980లో స్పానిష్‌ భాషా క్షేత్రంలో ప్రాంతీయ సేవ చేయమని మావారు ఆహ్వానించబడ్డారు. అప్పట్లో అమెరికాలో 600 స్పానిష్‌ భాషా సంఘాలు ఉండేవి. దాదాపు 26 సంవత్సరాలపాటు వాటిలో ఎన్నో సంఘాలను దర్శించాం. ఈ సంవత్సరాల్లో అవి 3,000 కన్నా ఎక్కువ సంఘాలుగా అభివృద్ధి చెందడాన్ని మేము చూశాం.

వారు ఆ ‘త్రోవలో’ నడిచారు

తన కుటుంబంలోని యౌవనస్థులు పూర్తికాల సేవను చేపట్టడాన్ని చూసి ఆనందించే అవకాశం కూడా అమ్మకు దొరికింది. ఉదాహరణకు, మా అక్క అయిన ఎస్తర్‌ కూతురు కారల్‌ 1953లో పయినీరు సేవ చేపట్టింది. ఆ తర్వాత ఆమె డెనాస్‌ ట్రంబోర్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటినుండి వారిద్దరూ పయినీరు సేవలో కొనసాగుతున్నారు. ఎస్తర్‌ మరో కూతురు లోయిస్‌, వెండెల్‌ జెన్సన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వారు గిలియడ్‌ పాఠశాల 41వ తరగతికి హాజరై నైజీరియాలో 15 సంవత్సరాలపాటు మిషనీరీలుగా సేవ చేశారు. విమాన ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన మార్కు విషయానికొస్తే, లియో చెల్లెలు రూత్‌ లా లోండ్‌, ఆమె భర్త కర్టీస్‌లు మార్కును దత్తతకు తీసుకొని పెంచారు. ఆ తర్వాత మార్కు, అతని భార్య లవోన్‌ ఎన్నో సంవత్సరాలు పయినీరు సేవ చేసి తమ నలుగురు పిల్లలను ఆధ్యాత్మిక ‘త్రోవలో’ పెంచారు.​—⁠యెష. 30:⁠21.

ప్రస్తుతం నా తోబుట్టువుల్లో 95 ఏళ్ల మా అన్నయ్య ఓర్లన్‌ మాత్రమే బ్రతికి ఉన్నాడు. ఆయనింకా యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నాడు. నేను, జార్జ్‌ సంతోషంగా పూర్తికాల సేవలో కొనసాగుతున్నాం.

అమ్మ వదిలేసి వెళ్లిన వస్తువులు

మా అమ్మ ఎంతో అపురూపంగా చూసుకున్న ఒక పెట్టె ఇప్పుడు నా దగ్గర ఉంది. అది మా నాన్న అమ్మకు ఇచ్చిన పెళ్ళి బహుమతి. ఆ పెట్టెలోని ఓ అరలో ఒక పాత స్క్రాప్‌ బుక్‌ (వార్తాపత్రిక వ్యాసాల, చిత్రాల కత్తిరింపులను అంటించే పుస్తకం) ఉంది. అప్పట్లో మా అమ్మ కొన్ని ఉత్తరాలూ, వార్తాపత్రికల్లో వ్యాసాలూ రాసింది. అవి మంచి సాక్షాన్నిచ్చాయి. అవే ఆ బుక్‌లో ఉన్నాయి. వాటిలో కొన్ని 1900ల తొలి సంవత్సరాలకు చెందినవి. ఆ పెట్టెలోనే, తన మిషనరీ పిల్లలు రాసిన ఉత్తరాలను జాగ్రత్తగా దాచిపెట్టింది. వాటిని పదే పదే చదవడమంటే నాకెంతో ఇష్టం! అమ్మ మాకు రాసిన ఉత్తరాలు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించాయి. అవి మాలో మంచి ఆలోచనలు నింపాయి. అమ్మ మిషనరీ కావాలనుకుంది. తన కోరికను తీర్చుకోలేకపోయినా, మిషనరీ సేవ విషయంలో ఉత్సాహాన్ని చూపించి తన తర్వాతి తరాలవారు మిషనరీ సేవ చేపట్టేలా ప్రోత్సహించింది. పరదైసు భూమిపై అమ్మ, నాన్నలతోపాటు మా కుటుంబ సభ్యులందరినీ కలుసుకునే రోజు కోసం నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను!​—⁠ప్రక. 21:​3, 4.

[అధస్సూచీలు]

^ పేరా 13 మార్తా కుమారుడైన ఎమిల్‌ హెచ్‌. వాన్‌ డాలన్‌ జీవిత కథ కోసం కావలికోట (ఆంగ్లం) జూన్‌ 15, 1983, 27-30 పేజీలు చూడండి.

^ పేరా 24 తేజరిల్లు! (ఆంగ్లం), జూన్‌ 22, 1952, 3-4 పేజీలు చూడండి.

[17వ పేజీలోని చిత్రం]

ఎమీలియా పీడర్సన్‌

[18వ పేజీలోని చిత్రం]

1916లో అమ్మ, నాన్న (నాన్న ఒళ్లో మార్విన్‌); కింద, ఎడమవైపు నుండి కుడివైపుకు: ఓర్లెన్‌, ఎస్తర్‌, లిలియన్‌, మిల్‌డ్రెడ్‌

[19వ పేజీలోని చిత్రం]

మరణించడానికి కొంతకాలం ముందు లియో, యూనీస్‌లు

[20వ పేజీలోని చిత్రం]

1950: పైన, కుడి నుండి ఎడమవైపుకు: ఎస్తర్‌, మిల్‌డ్రెడ్‌, లిలియన్‌, యూనీస్‌, రూత్‌; కింద: ఓర్లెన్‌, అమ్మానాన్నలు, మార్విన్‌

[20వ పేజీలోని చిత్రం]

2001లో ప్రాంతీయ సేవలో జార్జ్‌, రూత్‌ పాపస్‌