కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలు—I

ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలు—I

యెహోవా వాక్యము సజీవమైనది

ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలు​—⁠I

వృద్ధ అపొస్తలుడైన యోహాను పత్మాసు ద్వీపంలో బంధీగా ఉన్నప్పుడు వరుసగా 16 దర్శనాలను పొందాడు. ఆయన ప్రభువు దినంలో అంటే 1914లో దేవుని రాజ్యం స్థాపించబడినప్పటి నుండి క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనాంతం వరకు యెహోవా దేవుడూ యేసుక్రీస్తూ చేయబోయే వాటిని చూశాడు. దాదాపు సా.శ. 96వ సంవత్సరంలో యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అందులో ఉత్తేజకరమైన ఈ దర్శనాలు ఉన్నాయి.

ప్రకటన 1:112:17లో ఉన్న ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఆ వచనాల్లో యోహాను పొందిన మొదటి ఏడు దర్శనాలు ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన విషయాలే కాక, భవిష్యత్తులో యెహోవా చర్య తీసుకునే విధానం కూడ ఈ దర్శనాల్లో ఉన్నాయి కాబట్టి మనం వాటి గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటాం. ఈ దర్శనాలను విశ్వాసంతో చదివేవారు ఓదార్పును, ప్రోత్సాహాన్ని పొందుతారు.

“గొఱ్ఱెపిల్ల” ఏడు ముద్రల్లో ఆరింటిని విప్పాడు

(ప్రక. 1:1–​7:​17)

మొదటిగా యోహాను మహిమాన్వితుడైన యేసుక్రీస్తును దర్శనంలో చూసిన తర్వాత ‘ఏడు సంఘాలకు పుస్తకంలో రాసి పంపాల్సిన’ అనేక సందేశాలను పొందాడు. (ప్రక. 1:​10, 11) ఆ తర్వాత ఆయన ఒక సింహాసనం వేయబడి ఉన్న దర్శనాన్ని చూశాడు. ఏడు ముద్రలు వేయబడిన ఒక గ్రంథపు చుట్ట సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేతిలో ఉంది. “యూదాగోత్రపు సింహము” లేదా ‘ఏడు కొమ్ములు ఏడు కన్నులుగల గొఱ్ఱెపిల్లే’ ‘ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు.’​—⁠ప్రక. 4:⁠2; 5:​1, 2, 5, 6.

“గొఱ్ఱెపిల్ల” వరుసగా మొదటి ఆరు ముద్రలను ఒకదాని తర్వాత మరొకటి విప్పినప్పుడు ఏమౌతుందో మూడవ దర్శనం తెలియజేస్తుంది. ఆరవ ముద్రను విప్పినప్పుడు పెద్ద భూకంపం కలగడమేకాక, ఉగ్రత మహాదినం సమీపించింది. (ప్రక. 6:​1, 12, 15-17) కానీ 1,44,000 మందిలో చివరివ్యక్తి ముద్రించబడేంత వరకు ‘నలుగురు దేవదూతలు భూమి నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండడాన్ని’ తర్వాతి దర్శనంలో యోహాను చూశాడు. అంతేకాక, “సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడ్డ” ముద్రింపబడని “ఒక గొప్పసమూహము”ను కూడ ఆయన చూశాడు.​—⁠ప్రక. 7:​1, 9.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:⁠4; 3:⁠1; 4:⁠5; 5:6​​—⁠‘ఏడు ఆత్మలు’ దేన్ని సూచిస్తుంది? ఏడు అనే సంఖ్య దేవుని దృష్టిలో సంపూర్ణతను సూచిస్తుంది. కాబట్టి ఈ ‘ఏడు సంఘాలకు’ ఇవ్వబడిన సందేశం ప్రపంచమంతటా 1,00,000కన్నా ఎక్కువ సంఘాల్లోవున్న దేవుని ప్రజలందరికీ కూడ వర్తిస్తుంది. (ప్రక. 1:​10, 11, 19, 20) యెహోవా తాను నెరవేర్చాలనుకుంటున్న దానికి అనుగుణంగా పరిశుద్ధాత్మను ఇస్తాడు కాబట్టి, ఈ ‘ఏడు ఆత్మలు’ అనే మాట ప్రవచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నవారికి ఆయన సంపూర్ణంగా అవగాహనను, ఆశీర్వాదాలను ఇవ్వడాన్ని సూచిస్తుంది. ప్రకటన గ్రంథం వరుసగా ఏడేడు విషయాలను చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ ఏడు అనే సంఖ్య సంపూర్ణతను సూచిస్తోంది. ఆ మాటకు అనుగుణంగానే ప్రకటన గ్రంథం ‘దేవుని పరిశుద్ధమర్మాన్ని’ ‘సమాప్తి చేస్తుంది’ లేక సంపూర్ణం చేస్తుంది.​—⁠ప్రక. 10:​7, NW.

1:​8, 18​​—⁠“అల్ఫాయు ఓమెగయు” “మొదటివాడను కడపటివాడను” అనే బిరుదులు ఎవరికి వర్తిస్తాయి? “అల్ఫాయు ఓమెగయు” అనే బిరుదులు యెహోవాకు వర్తిస్తాయి. ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయనకు ముందు ఏ దేవుడూ లేడు ఆయన తర్వాత ఏ దేవుడూ రాడు అనే విషయాన్ని అది నొక్కిచెబుతోంది. ఆయనే “ఆదియు అంతమునై యున్నా[డు].” (ప్రక. 21:⁠6; 22:​13) యెహోవా ముందు ఎవరూ లేరు ఆ తర్వాత ఎవరూ రారు కాబట్టి ప్రకటన 22:13లో “మొదటివాడను కడపటివాడను” అనే మాట యెహోవాకు వర్తిస్తున్నప్పటికీ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలోని సందర్భాన్నిబట్టి చూస్తే మొదటి అధ్యాయంలోవున్న మాటలు యేసుక్రీస్తుకు వర్తిస్తాయని తెలుస్తుంది. ఎందుకంటే అమర్త్యమైన ఆత్మ ప్రాణిగా పునరుత్థానం చేయబడినవారిలో యేసుక్రీస్తే మొదటివాడు. అంతేగాక యెహోవా స్వయంగా పునరుత్థానం చేసినవారిలో యేసే చివరివాడు.​—⁠కొలొ. 1:⁠18.

2:7​​—⁠“దేవుని పరదైసు” అనే మాట దేనిని సూచిస్తోంది? ఈ మాటలు అభిషిక్త క్రైస్తవులను ఉద్దేశించి రాయబడ్డాయి కాబట్టి ఇక్కడ ప్రస్తావించబడిన పరదైసు అనే మాట పరదైసులాంటి పరలోకాన్ని అంటే దేవుని సముఖాన్ని సూచిస్తుండవచ్చు. “జీవవృక్ష ఫలములు” తినే ఆశీర్వాదం అభిషిక్త క్రైస్తవులకు లభిస్తుంది. ఆ విధంగా వారు అమర్త్యతను పొందుతారు.​—⁠1 కొరిం. 15:⁠53.

3:7​​—⁠యేసు “దావీదు తాళపుచెవి”ని ఎప్పుడు పొందాడు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు? సా.శ. 29లో యేసు బాప్తిస్మం తీసుకున్నప్పడు దావీదు వంశంలోనుండి వచ్చిన రాజుగా అభిషేకించబడ్డాడు. అయితే, ఆయన సా.శ. 33లో పరలోకానికి అంటే దేవుని కుడిపార్శ్వానికి హెచ్చించబడేంత వరకు యేసు ఆ తాళపు చెవిని పొందలేదు. అక్కడ ఆయన దావీదు రాజ్యానికి సంబంధించిన వారసత్వ హక్కులన్నీ పొందాడు. అప్పటి నుండి యేసు రాజ్యానికి సంబంధించిన ఎన్నో అవకాశాలను, సేవాధిక్యతలను ఇతరులకు ఇచ్చేందుకు ఆ తాళపు చెవిని వాడుతున్నాడు. 1919లో “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” తరగతిని “తన యావదాస్తిమీద” నియమించడం ద్వారా యేసు వారి భుజాలమీద “దావీదు ఇంటితాళపు” చెవిని పెట్టాడు.​—⁠యెష. 22:​22; మత్త. 24:​45, 47.

3:​12​​—⁠యేసు ‘కొత్త పేరు’ ఏమిటి? యేసుకివ్వబడిన కొత్త అధికారాన్ని, కొత్త ఆధిక్యతలను ఈ పేరు సూచిస్తుంది. (ఫిలి. 2:​9-11) యేసుకు తెలిసినంతగా ఆ పేరు గురించి మరెవ్వరికీ తెలియకపోయినా పరలోకంలో తన నమ్మకమైన సహోదరులమీద తన పేరు రాస్తాడు, అలా వారు ఆయనకు సన్నిహితులౌతారు. (ప్రక. 19:​12) యెహోవా యేసుకిచ్చే ఆ ప్రత్యేకమైన ఆధిక్యతల్లో కొన్నింటిని వారు కూడ అనుభవిస్తారు.

మనకు పాఠాలు:

1:⁠3. సాతాను లోకానికి దేవుడు తీర్పు తీర్చే “సమయము సమీపించినది” కాబట్టి ప్రకటన గ్రంథంలోవున్న సందేశాన్ని జాగుచేయకుండా అర్థంచేసుకుని, చర్య తీసుకోవాలి.

3:​17, 18. ఆధ్యాత్మికంగా ధనవంతులము కావాలంటే “అగ్నిలో పుటమువేయబడిన బంగారమును” మనం యేసునుండి కొనుక్కోవాలి. అంటే మనం మరింత ఎక్కువగా సత్క్రియలు చేయడానికి కృషిచేయాలి. (1 తిమో. 6:​17-19) మనం క్రీస్తు అనుచరులమన్న గుర్తింపునిచ్చే “తెల్లని వస్త్రములను” కూడ ధరించుకోవాలి. ఆధ్యాత్మిక వివేచనను పొందడానికి “కన్నులకు కాటుకను” వాడాలి, అంటే కావలికోట పత్రికవంటి వాటిలో వచ్చే ఉపదేశాలను పాటించాలి.​—⁠ప్రక. 19:⁠8.

7:​13, 14. ఇరువది నలుగురు పెద్దలు పరలోక మహిమలో ఉన్న 1,44,000 మందిని సూచిస్తున్నారు. వారు అక్కడ రాజులుగానే కాక యాజకులుగా కూడా సేవచేస్తారు. ఈ 24మంది పెద్దలు, ప్రాచీన ఇశ్రాయేలులో రాజైన దావీదు 24 విభాగాలుగా వ్యవస్థీకరించిన యాజకులను సూచిస్తున్నారు. ఈ 24మంది పెద్దల్లో ఒకరు గొప్పసమూహపువారు ఎవరో యోహానుకు తెలియజేశాడు. కాబట్టి, అభిషిక్త క్రైస్తవుల పునరుత్థానం 1935కి కొంతకాలంముందే ప్రారంభమై ఉంటుంది. ఆ సమయంలోనే ప్రారంభమై ఉంటుందని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే అదే సంవత్సరంలో అసలు గొప్పసమూహపువారు ఎవరో భూమ్మీది దేవుని అభిషిక్త సేవకులకు తెలియజేయబడింది.​—⁠లూకా 22:​28-30; ప్రక. 4:⁠4; 7:⁠9.

ఏడవ ముద్రను విప్పినప్పుడు ఏడు బూరలు ఊదబడ్డాయి

(ప్రక. 8:1–​12:⁠17)

గొఱ్ఱెపిల్ల ఏడవ ముద్రను విప్పినప్పుడు, ఏడుగురు దేవదూతలకు ఏడు బూరలు ఇవ్వబడ్డాయి. వారిలో ఆరుగురు బూరలు ఊదినప్పుడు మానవజాతిలోని “మూడవ భాగము”నకు అంటే క్రైస్తవమత సామ్రాజ్యానికి తీర్పు సందేశాలు ప్రకటించబడ్డాయి. (ప్రక. 8:​1, 2, 7-12; 9:​15, 18) దీనినే యోహాను అయిదవ దర్శనంలో చూశాడు. తర్వాత ఇవ్వబడిన దర్శనంలో భాగంవహిస్తూ యోహాను చిన్న పుస్తకాన్ని తిని దేవాలయాన్ని కొలుస్తాడు. ఏడవ బూర ఊదినప్పుడు గొప్ప శబ్దాలు “ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను” అని ప్రకటించాయి.​—⁠ప్రక. 10:​10; 11:​1, 15.

ప్రకటన 11:​15, 17 వచనాలకు సంబంధించిన మరిన్ని వివరాలను ఏడవ దర్శనం ఇస్తుంది. ఈ దర్శనంలో ఒక గొప్ప సూచన పరలోకంలో కనబడింది. పరలోక స్త్రీ ఒక మగ శిశువును కన్నది. తర్వాత అపవాది పరలోకంనుండి పడద్రోయబడ్డాడు. సాతాను పరలోక స్త్రీమీద ఆగ్రహంతో “ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై” బయలుదేరతాడు.​—⁠ప్రక. 12:​1, 5, 9, 17.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

8:​1-5​—⁠పరలోకంలో ఎందుకు నిశ్శబ్దం ఏర్పడింది, ఆ తర్వాత ఏది భూమ్మీద పడవేయబడింది? భూమ్మీదున్న ‘పరిశుద్ధుల ప్రార్థనలు’ వినబడేలా పరలోకంలో సూచనార్థక నిశ్శబ్దం ఏర్పడింది. అది మొదటి ప్రపంచ యుద్ధ ముగింపులో జరిగింది. అన్యుజనుల కాలాల ముగింపులో పరలోకానికి వెళ్తామని చాలామంది అభిషిక్త క్రైస్తవులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అభిషిక్త క్రైస్తవులు యుద్ధం జరుగుతున్నప్పుడు కష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. వారప్పుడు నిర్దేశం కోసం ఎంతో పట్టుదలతో ప్రార్థించారు. వారి ప్రార్థనలకు జవాబుగా, ఒక దేవదూత సూచనార్థక నిప్పులను భూమ్మీద పడేశాడు, దానివల్ల పరిచర్యలో మరింతగా పాల్గొనేలా అభిషిక్త క్రైస్తవులు పురికొల్పబడ్డారు. వారు కొద్దిమందేవున్నా ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిని ఆరంభించారు. అది దేవుని రాజ్యాన్ని ప్రాముఖ్యమైన అంశంగా మార్చి, క్రైస్తవమత సామ్రాజ్యంలో తీవ్రమైన అలజడిని రేపింది. బైబిల్లోని ఉరుముల్లాంటి హెచ్చరికలు ఇవ్వబడ్డాయి, లేఖన సత్యాల మెరుపులు ప్రకటించబడ్డాయి. భూకంపం వచ్చినప్పుడు భవనాలు కదిలినట్లే అబద్ధమత సామ్రాజ్యపు పునాదులు కదిలాయి.

8:​6-​12; 9:​1, 13; 11:15​​—⁠ఏడుగురు దేవదూతలు తమ బూరలను ఊదడానికి ఎప్పుడు సిద్ధపడ్డారు, బూరల ధ్వనులు ఎప్పుడు, ఎలా ఊదబడ్డాయి? ఏడు బూరలు ఊదడానికి సిద్ధపడడంలో భాగంగా 1919 నుండి 1922 వరకు నూతనోత్తేజం పొందిన యోహాను తరగతివారికి నిర్దేశాలు ఇవ్వబడ్డాయి. అలా నూతనోత్తేజాన్ని పొందిన అభిషిక్త క్రైస్తవులు పరిచర్యను పునఃవ్యవస్థీకరించి, ప్రచురణా సౌకర్యాలను నిర్మించడంలో నిమగ్నమయ్యారు. (ప్రక. 12:​13, 14) దేవుని ప్రజలు దేవదూతల మద్దతుతో సాతాను లోకానికి యెహోవా తీర్పులను ధైర్యంగా ప్రకటించడాన్ని ఆ బూరల ధ్వనులు సూచిస్తున్నాయి. గమనార్హమైన విషయం ఏమిటంటే, ఆ ధ్వనులు 1922లో ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌లో జరిగిన సమావేశంలో మొదలై మహాశ్రమల వరకు కొనసాగుతాయి.

8:​13; 9:​12; 11:14​​—⁠చివరి మూడు బూర ధ్వనులు ‘శ్రమలను’ సూచిస్తున్నాయని ఎలా చెప్పవచ్చు? మొదటి నాలుగు బూర ధ్వనులు క్రైస్తవమత సామ్రాజ్యపు ఆధ్యాత్మిక మృతస్థితిని బహిర్గతం చేస్తున్నాయి. చివరి మూడు బూర ధ్వనులు నిర్దిష్ట సంఘటనలను వివరిస్తున్నాయి, కాబట్టి అవి శ్రమలను సూచిస్తున్నాయి. అయిదవ బూర ధ్వని 1919లో, దేవుని ప్రజలు నిష్క్రియాస్థితి అనే “అగాధము” నుండి విడుదల పొందడానికీ, వారు నిర్విరామంగా చేసిన ప్రకటనా పనికీ సంబంధించినది. వారు చేసిన ప్రకటనా పని క్రైస్తవమత సామ్రాజ్యానికి వేదనభరితమైన తెగులులా అనిపించింది. (ప్రక. 9:⁠1) ఆరవ బూర ధ్వని చరిత్రలోనే మహా గొప్ప గుర్రపురౌతుల సైన్యాన్ని, 1922లో ప్రారంభమైన ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిని సూచిస్తున్నాయి. చివరి బూర ధ్వని మెస్సీయ రాజ్య స్థాపనను సూచిస్తుంది.

మనకు పాఠాలు:

9:​10, 19. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ప్రచురించే సాహిత్యాల్లో వేదనకలిగించే ప్రామాణిక బైబిలు సమాచారం ఉంది. (మత్త. 24:​45) ఈ సందేశం “తేళ్లతోకలవంటి తోకలు కొండ్లు” ఉన్నమిడతల తోకలను, ‘పాముల్లాంటి తోకలు’ ఉన్న గుర్రపు రౌతుల సైన్యాన్ని సూచిస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఈ ప్రచురణలు, యెహోవా “దేవుని ప్రతిదండన దినము” గురించి హెచ్చరిస్తున్నాయి. (యెష. 61:⁠2) వాటిని మనం ఉత్సాహంతో, ధైర్యంతో ఇతరులకు పంచిపెడదాం.

9:​20, 21. క్రైస్తవేతర దేశాలుగా పేరుపొందిన దేశాల్లో నివసించే చాలామంది దీనులు మనం ప్రకటించే సందేశానికి బాగా స్పందించారు. అయితే, “మిగిలిన జనులు”గా ప్రస్తావించబడిన క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందని చాలామంది సామూహికంగా క్రైస్తవులుగా మారతారని మనం ఆశించడంలేదు. అయినా, మనం పరిచర్యలో పట్టుదలతో పనిచేస్తాం.

12:​15, 16. సాతాను వ్యవస్థలోని శక్తులు లేదా వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు, దేవుని ప్రజలు ఆరాధన స్వేచ్ఛను అనుభవించేలా సహాయం చేశాయి. 1940ల నుండి ఆ ప్రభుత్వాలు ‘ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన [హింస అనే] ప్రవాహమును మ్రింగేశాయి.’ నిజమే, యెహోవా తలచుకుంటే, తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభుత్వ అధికారులను కూడ ఉపయోగించుకోగలడు. అందుకే, “యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును” అని సామెతలు 21:1 చెబుతోంది. ఈ విషయం దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని బలపర్చాలి.