కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ‘దేవుని కృపవిషయంలో గృహనిర్వాహకులై’ ఉన్నారా?

మీరు ‘దేవుని కృపవిషయంలో గృహనిర్వాహకులై’ ఉన్నారా?

మీరు ‘దేవుని కృపవిషయంలో గృహనిర్వాహకులై’ ఉన్నారా?

“సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.”​—⁠రోమా. 12:⁠10.

నిరుత్సాహంతో ఉన్నప్పుడు లేదా కృంగిపోయినప్పుడు యెహోవా మనకు సహాయం చేస్తాడని దేవుని వాక్యం పదేపదే హామీనిస్తోంది. ఉదాహరణకు, ఓదార్పునిచ్చే ఈ మాటలను గమనించండి: “యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు.” “గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు.” (కీర్త. 145:​14; 147:⁠3) అంతేకాక, మన పరలోక తండ్రే స్వయంగా ఇలా చెప్పాడు: “నీ దేవుడనైన యెహోవానగు నేను​—⁠భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.”​—⁠యెష. 41:⁠13.

2 అయితే, పరలోకంలో నివసించే యెహోవా ఎలా ‘మన చేతిని పట్టుకోగలడు’? ఆయన మనోవేధనవల్ల ‘కృంగిపోయినవారిని’ ఎలా ‘లేవనెత్తుతాడు’ లేదా ప్రోత్సహిస్తాడు? యెహోవా అనేక విధాలుగా అలాంటి సహాయాన్ని ఇస్తాడు. ఉదాహరణకు, ఆయన తన పరిశుద్ధాత్మను అనుగ్రహించడం ద్వారా తన ప్రజలకు ‘బలాధిక్యమును’ ఇస్తాడు. (2 కొరిం. 4:⁠7; యోహా. 14:​16, 17) దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిల్లోని సందేశాన్నిబట్టి కూడ దేవుని సేవకులు ప్రోత్సహించబడతారు. (హెబ్రీ. 4:​12) యెహోవా మనల్ని బలపర్చే మరో విధానమేదైనా ఉందా? దానికి జవాబు పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంది.

‘దేవుడు నానావిధాలుగా తన కృప చూపిస్తాడు’

3 అపొస్తలుడైన పేతురు ఆత్మాభిషిక్త క్రైస్తవులను ఉద్దేశిస్తూ రాసిన పత్రికలో, వారు గొప్ప బహుమానాన్ని పొందనున్నారు కాబట్టి సంతోషంగా ఉండేందుకు వారికి ఎన్నో కారణాలున్నాయని చెప్పాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “అవసరమునుబట్టి నానావిధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.” (1 పేతు. 1:​1-6) ఆయన “నానావిధములైన” అనే పదాన్ని ఉపయోగించాడన్నది గమనించండి. దీన్నిబట్టి వారికి అనేక రకాల పరీక్షలు ఎదురౌతాయని తెలుస్తుంది. అయితే, పేతురు అలా చెప్పి ఊరుకోలేదు. అలా చేసి ఉంటే ఆయన సహోదరులు తాము ఆ పరీక్షలను సహించగలమో లేదో అని ఆందోళపడేవారు. కాబట్టి, ఆయన పరీక్షల గురించి చెప్పి ఊరుకునే బదులు, తమకు ఏ పరీక్ష ఎదురైనా అది ఎలాంటిదైనా దానిని సహించేందుకు యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చని పేర్కొన్నాడు. పేతురు తన పత్రిక చివరి భాగంలో “అన్నిటి అంతము” గురించి వివరిస్తూ ఈ భరోసా ఇచ్చాడు. ​—⁠1 పేతు. 4:⁠7.

4 పేతురు ఇలా చెప్పాడు: “దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.” (1 పేతు. 4:​10) పేతురు ఇక్కడ కూడ “నానావిధమైన” అనే పదాన్ని ఉపయోగించాడు. మరో మాటలో చెప్పాలంటే, ‘పరీక్షలు అనేక రూపాల్లో రావచ్చు. అయితే దేవుడు తన కృపను కూడ అనేక రూపాల్లో చూపిస్తాడు’ అని ఆయన చెప్పాడు. ఆ మాట మనకు ఎందుకు ఓదార్పునిస్తుంది? ఎలాంటి పరీక్ష ఎదురైనా దాన్ని సహించేందుకు కావాల్సిన కృపను దేవుడు మనకు ఎల్లప్పుడూ అనుగ్రహిస్తాడని దానర్థం. అయితే పేతురు మాటలనుబట్టి, అసలు యెహోవా తన కృపను మనకు ఎలా అనుగ్రహిస్తాడో గ్రహించారా? తోటి క్రైస్తవుల ద్వారా.

‘ఒకరికొకరు ఉపచారం చేసుకోండి’

5 క్రైస్తవ సంఘంలోని వారందరితో మాట్లాడుతూ పేతురు, “అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కుటమైన ప్రేమగలవారై యుండుడి” అని చెప్పిన తర్వాత “యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి” అని ప్రోత్సహించాడు. (1 పేతు. 4:​8, 10) కాబట్టి, సంఘంలోని ప్రతీ ఒక్కరూ తమ తోటి క్రైస్తవులను ప్రోత్సహించాలి. తనకు చెందిన అమూల్యమైన దాన్ని యెహోవా మనకు అప్పగించాడు. దాన్ని ఇతరులకు పంచిపెట్టే బాధ్యత మనపై ఉంది. ఇంతకీ, ఆయన మనకు ఏమి అప్పగించాడు? అది ఒక “కృపావరము” అని పేతురు చెబుతున్నాడు. ఆ కృపావరం ఏమిటి? దాన్ని ‘ఒకరికొకరు ఉపచారం చేసుకోవడానికి’ ఎలా ఉపయోగిస్తాం?

6 ‘శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనది’ అని దేవుని వాక్యం చెబుతోంది. (యాకో. 1:​17) కృపావరాలు అనుగ్రహించడం ద్వారా దేవుడు తన సేవకులపట్ల తన కృపను చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మే యెహోవా మనకు ఇచ్చిన అత్యుత్తమమైన కృపావరం. దానివల్ల మనం ఆయన ఇష్టపడే ప్రేమ, మంచితనం, సాత్వికం వంటి లక్షణాలను అలవర్చుకోగలుగుతాం. నిండు హృదయంతో తోటి విశ్వాసులపట్ల ఆప్యాయత చూపించి ఇష్టపూర్వకంగా వారికి కావాల్సిన సహాయం చేసేలా అవి తోడ్పడతాయి. పరిశుద్ధాత్మ సహాయంతో సరైన జ్ఞానవివేచనలను కూడ కృపావరాలుగా పొందుతాం. (1 కొరిం. 2:​10-16; గల. 5:​22, 23) నిజం చెప్పాలంటే, మనకున్న శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు అన్నీ తనను స్తుతించి, ఘనపర్చడానికి మన పరలోక తండ్రి ఇచ్చిన కృపావరాలే. మన సామర్థ్యాలను, లక్షణాలను ఉపయోగించి మన తోటి విశ్వాసులపట్ల తన కృపను చూపించే బాధ్యతను దేవుడు మనకిచ్చాడు.

‘ఉపచారం చేయడానికి’ ఎలా ఉపయోగించాలి?

7 మనకు అనుగ్రహించబడిన కృపావరాల గురించి చెబుతూ, “యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి” అని కూడ పేతురు చెప్పాడు. “కృపావరము పొందిన కొలది” అనే మాటలనుబట్టి లక్షణాలు, సామర్థ్యాలు అందరికీ ఒకే విధంగా ఇవ్వబడకపోవచ్చనీ, పరిమాణంలో అవి వ్యక్తికీ వ్యక్తికీ భిన్నంగా ఉండవచ్చనీ తెలుస్తుంది. అయినా, తమకు అనుగ్రహించబడిన కృపావరాన్ని ‘ఒకరికొకరు ఉపచారం చేసుకోవడానికి’ ఉపయోగించాలని ప్రతీ ఒక్కరూ ప్రోత్సహించబడ్డారు. అంతేకాక, ‘గృహనిర్వాహకులుగా’ కృపావరాన్ని ఉపయోగించాలనేది ఒక ఆజ్ఞ. కాబట్టి మనం ఇలా ఆలోచించాలి: ‘నాకు ఇవ్వబడిన కృపావరాలను నా తోటి విశ్వాసులను బలపర్చేందుకు ఉపయోగిస్తున్నానా?’ (1 తిమోతి 5:​9, 10 పోల్చండి.) ‘లేదా యెహోవా నాకు ఇచ్చిన సామర్థ్యాలను స్వప్రయోజనాల కోసం అంటే బహుశా ధనాన్ని కూడబెట్టుకోవడానికో సమాజంలో హోదాను సంపాదించుకోవడానికో ఉపయోగిస్తున్నానా?’ (1 కొరిం. 4:⁠7) మనం మన కృపావరాలను ‘ఒకరికొకరు ఉపచారం చేసుకోవడానికి’ ఉపయోగిస్తే యెహోవాను సంతోషపెట్టగలుగుతాం.​—⁠సామె. 19:​17; హెబ్రీయులు 13:⁠16 చదవండి.

8 మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏయే విధాలుగా ఒకరికొకరు ఉపచారం చేసుకున్నారో దేవుని వాక్యం చెబుతోంది. (రోమీయులు 15:​25, 26; 2 తిమోతి 1:​16-18 చదవండి.) నేడు కూడా నిజ క్రైస్తవులు తోటి విశ్వాసుల కోసం తమకు ఇవ్వబడిన కృపావరాన్ని ఉపయోగించమనే ఆజ్ఞను హృదయపూర్వకంగా పాటిస్తున్నారు. వారు ఆ ఆజ్ఞను ఎలా పాటిస్తున్నారో మనమిప్పుడు చూద్దాం.

9 చాలామంది సహోదరులు కూటాలకు సిద్ధపడడానికి ప్రతీనెల ఎన్నో గంటలు వెచ్చిస్తారు. తమ బైబిలు అధ్యయనంలో వారు నేర్చుకున్న విలువైన సమాచారాన్ని కూటాల్లో పంచుకున్నప్పుడు వారు వివేచనతో మాట్లాడే మాటలు పరీక్షలను సహించేందుకు సంఘంలోని వారందరినీ ప్రోత్సహిస్తాయి. (1 తిమో. 5:​17) అనేకమంది సహోదర సహోదరీలు తోటి విశ్వాసులపట్ల ఆప్యాయత, కనికరం చూపించే విషయంలో పేరుపొందారు. (రోమా. 12:​15, 16) కొందరు కృంగిపోయినవారిని క్రమంగా కలుసుకొని వారితో కలిసి ప్రార్థిస్తారు. (1 థెస్స. 5:​14) మరికొందరు ఒకానొక పరీక్షను ఎదుర్కొంటున్న తోటి విశ్వాసులకు ప్రోత్సాహకరమైన మాటలు రాయడానికి సమయం తీసుకుంటారు. ఇంకా కొందరు శారీరిక పరిమితులున్నవారిని కూటాలకు తీసుకువెళ్లేందుకు దయతో సహాయం చేస్తారు. వేలాదిమంది సాక్షులు విపత్తులు జరిగినప్పుడు సహాయక చర్యల్లో పాల్గొని నిరాశ్రయులైన తోటి విశ్వాసుల ఇళ్లను తిరిగి నిర్మించడంలో చేయూతనిస్తారు. ఈ ప్రేమగల సహోదర సహోదరీలు అనురాగంతో అవసరమైన సహాయం చేస్తారు. అలా వారి ద్వారా ‘దేవుడు నానావిధాలుగా తన కృపను చూపిస్తున్నాడు’.​—⁠1 పేతు. 4:⁠10.

ఏది చాలా ప్రాముఖ్యం?

10 తోటి విశ్వాసులకు ఉపచారం చేయడానికి దేవుడు తన సేవకులకు కృపావరాన్ని ఇవ్వడమే కాక ఇతరులతో పంచుకోవడానికి రాజ్య సందేశాన్ని కూడ ఇచ్చాడు. యెహోవాకు తాను చేసే సేవలో ఈ రెండు అంశాలు ఉన్నాయని అపొస్తలుడైన పౌలు గుర్తించాడు. ఎఫెసు సంఘంలోనివారికి ప్రయోజనం చేకూర్చే విధంగా తనకు అనుగ్రహించబడిన “దేవుని కృపవిషయమైన యేర్పాటు” లేదా గృహనిర్వాహకత్వం గురించి వారికి రాసిన ఉత్తరంలో ఆయన పేర్కొన్నాడు. (ఎఫె. 3:⁠2) అయితే, ‘సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడినవారము’ అని కూడ పౌలు చెప్పాడు. (1 థెస్స. 2:⁠4) దేవుని రాజ్య సువార్తికులముగా సేవచేసే పని అప్పగించబడిందని మనమూ పౌలులాగే గుర్తించాలి. సువార్త ప్రకటనా పనిలో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా నిర్విరామంగా సువార్త సేవ చేయడంలో పౌలు ఉంచిన మాదిరిని అనుకరించడానికి మనం కృషిచేస్తాం. (అపొ. 20:​20, 21; 1 కొరిం. 11:⁠1) రాజ్య సందేశాన్ని ప్రకటించడంవల్ల చాలామంది రక్షించబడతారని మనకు తెలుసు. అదే సమయంలో పౌలులాగే మనం తోటి విశ్వాసులకు ‘ఏదో ఒక ఆత్మసంబంధమైన కృపావరాన్ని ఇచ్చే’ అవకాశాల కోసం చూస్తాం.​—⁠రోమీయులు 1:​11, 12; 10:​13-15 చదవండి.

11 క్రైస్తవులు చేయాల్సిన ఈ రెండు పనుల్లో ఏది చాలా ప్రాముఖ్యమైనది? అది పక్షికి ఉండే రెండు రెక్కల్లో ఏది ప్రాముఖ్యమని అడిగినట్లు ఉంటుంది. జవాబు సుస్పష్టం. ఓ పక్షి సరిగ్గా ఎగరాలంటే దానికి రెండు రెక్కలూ అవసరం. అలాగే మనం క్రైస్తవులముగా దేవుడు ఆశిస్తున్నవన్నీ చేయాలంటే ఆయన సేవకు సంబంధించిన ఈ రెండింటినీ చేయాలి. కాబట్టి, సువార్త ప్రకటించమనీ, తోటి విశ్వాసులను బలపర్చమనీ మనకు ఇవ్వబడిన ఆజ్ఞలు ఒకదానికొకటి పొంతనలేనివని అనుకునే బదులు, అపొస్తలులైన పేతురు, పౌలుల్లాగే మనం వాటిని ఒకదానితో ఒకటి సంబంధం కలిగివున్న బాధ్యతలుగా పరిగణించాలి. ఆ రెండింటికీ ఎలా సంబంధముంది?

12 సువార్తికులముగా దేవుని రాజ్యానికి సంబంధించిన ఉత్సాహకరమైన సందేశంతో ఇతరుల హృదయాలను స్పృశించేందుకు మనకు ఏ బోధనా నైపుణ్యమున్నా దాన్ని ఉపయోగించడానికి కృషిచేస్తాం. అలా క్రీస్తు శిష్యులు అయ్యేందుకు వారికి సహాయం చేయాలనుకుంటాం. అంతేకాక, ప్రోత్సాహకరమైన మాటలద్వారా, అవసరమైన సహాయం చేయడం ద్వారా తోటి విశ్వాసులను ప్రోత్సహించేందుకు మనకున్న సామర్థ్యాలను, ఇతర కృపావరాలను ఉపయోగించడానికి కృషిచేస్తాం. ఆ విధంగా మన ద్వారా దేవుడు తన కృపను చూపిస్తాడు. (సామె. 3:​27; 12:​25) అలా వారిని ప్రోత్సహించడం ద్వారా క్రీస్తు శిష్యులుగా నిలిచివుండేందుకు వారికి సహాయం చేయాలనుకుంటాం. ప్రజలకు ప్రకటించడం ద్వారా, ‘ఒకరికొకరం ఉపచారం చేసుకోవడం’ ద్వారా యెహోవా చేతిలో పనిముట్లుగా ఉండే గొప్ప అవకాశం మనకు లభిస్తుంది.​—⁠గల. 6:⁠10.

“ఒకనియందొకడు అనురాగముగలవారై” ఉండండి

13 పౌలు తన తోటి విశ్వాసులను ఇలా ప్రోత్సహించాడు: “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమా. 12:​10) సహోదరులపట్ల అనురాగం లేక ఆప్యాయత ఉంటే మనం హృదయపూర్వకంగా దేవుని కృప విషయంలో గృహనిర్వాహకులముగా సేవచేస్తాం. ‘ఒకరికొకరం ఉపచారం చేసుకోకుండా’ సాతాను మనల్ని ఆపగలిగితే అతడు మన ఐక్యతను దెబ్బతీయగలడని మనం గుర్తిస్తాం. (కొలొ. 3:​14) మన ఐక్యత దెబ్బతింటే ప్రకటనా పనిలో ఉత్సాహంగా పాల్గొనలేకపోతాం. అలంకారికంగా చెప్పాలంటే, మనల్ని కింద పడేయడానికి మనకున్న రెండు రెక్కల్లో ఒక్కదానికి హానిచేస్తే చాలని సాతానుకు బాగా తెలుసు.

14 ‘ఒకరికొకరం ఉపచారం చేసుకోవడం’ వల్ల దేవుని కృప పొందేవారే కాక, దాన్ని ఇతరులపట్ల చూపించేవారు కూడ ప్రయోజనం పొందుతారు. (సామె. 11:​25) ఉదాహరణకు, అమెరికాలోని ఇల్లినోయిస్‌కు చెందిన రాయన్‌, రోనీ దంపతుల విషయమే తీసుకోండి. హరికేన్‌ కత్రీనావల్ల వందలాదిమంది సహోదరులు నిరాశ్రయులయ్యారని తెలుసుకున్నప్పుడు వారిపట్ల సహోదర ప్రేమతో వారు తమ ఉద్యోగాలను, ఇంటిని విడిచిపెట్టారు. పాత ట్రేయిలర్‌ ఒకదాన్ని కొని దాన్ని నివసించడానికి అనువుగా మార్చుకుని 1,400 కి.మీ. దూరంలో ఉన్న లౌసీయానా రాష్ట్రానికి వెళ్లారు. వారు ఏడాది కన్నా ఎక్కువరోజులు అక్కడ ఉండి సహోదరుల కోసం తమ సమయాన్ని, శక్తిసామర్థ్యాలను ధారపోశారు. “సహాయక చర్యల్లో పాల్గొనడంవల్ల నేను దేవునికి దగ్గరయ్యాను. యెహోవా తన ప్రజలను ఎంత బాగా చూసుకుంటాడో నేను కళ్లారా చూశాను” అని 29 ఏళ్ల రాయన్‌ చెప్పాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “నాకన్నా పెద్దవారితో పని చేయడం ద్వారా సహోదరులపట్ల ఎలా శ్రద్ధ తీసుకోవాలో నేర్చుకున్నాను. యెహోవా సంస్థలో యౌవనస్థులైన మేము చేయాల్సింది ఎంతో ఉందని కూడ నేర్చుకున్నాను.” 25 ఏళ్ల రోనీ ఇలా అంటోంది: “ఇతరులకు సహాయం చేయగలిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడూ పొందలేదు. ఈ అద్భుతమైన అనుభవం భవిష్యత్తులో నాకెన్నో ప్రయోజనాలు తెస్తుందని నాకు తెలుసు.”

15 సువార్తను ప్రకటించాలని, తోటి విశ్వాసులను ప్రోత్సహించాలని దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు లోబడడంవల్ల నిజంగానే మనందరం ఆశీర్వాదాలను అనుభవిస్తాం. మన సహాయాన్ని పొందేవారు ఆధ్యాత్మికంగా బలపడతారు. అదే సమయంలో ఇవ్వడంవల్ల మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం. (అపొ. 20:​35) సంఘంలోని ప్రతీ ఒక్కరూ ఇతరులపట్ల ప్రేమతో శ్రద్ధ కనబరుస్తారు కాబట్టి సంఘమంతా ప్రేమలో ఎదుగుతుంది. అంతేకాక, ఒకరిపట్ల ఒకరం చూపించే ప్రేమా ఆప్యాయతలనుబట్టి మనం నిజ క్రైస్తవులమని ఇతరులు తెలుసుకుంటారు. యేసు ఇలా చెప్పాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహా. 13:​35) అన్నింటికన్నా ప్రాముఖ్యంగా యెహోవా కోరుకున్నట్లే భూమ్మీది తన సేవకులు అవసరంలో ఉన్నవారిని బలపర్చినప్పుడు మన శ్రద్ధగల తండ్రియైన యెహోవా ఘనపర్చబడతాడు. కాబట్టి, ‘దేవుని కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులముగా ఉంటూ, ఒకరికొకరం ఉపచారం చేసుకునే’ విషయంలో మనకు ఇవ్వబడిన కృపావరాన్ని ఉపయోగించడానికి మనకు ఎన్ని కారణాలున్నాయి! మీరెల్లప్పుడూ అలా చేస్తారా?​—⁠హెబ్రీయులు 6:⁠10 చదవండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

• యెహోవా ఏయే విధాలుగా తన సేవకులను బలపరుస్తున్నాడు?

• మనకు ఏమి అప్పగించబడింది?

• మన తోటి విశ్వాసులకు ఎలా ఉపచారం చేయవచ్చు?

• ‘ఒకరికొకరం ఉపచారం చేసుకోవడంలో’ మనకున్న కృపావరాన్ని ఎల్లప్పుడూ ఉపయోగించడానికి మనల్ని ఏది ప్రోత్సహిస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. దేవుని వాక్యం మనకు ఏ హామీనిస్తోంది?

2. యెహోవా తన సేవకులకు ఎలా సహాయం చేస్తాడు?

3. (ఎ) అపొస్తలుడైన పేతురు పరీక్షల గురించి ఏమని చెప్పాడు? (బి) మొదటి పేతురు పత్రికలోని చివరి భాగంలో ఆయన ఏమి వివరించాడు?

4. మొదటి పేతురు 4:10లోని మాటలు మనకు ఎందుకు ఓదార్పునిస్తాయి?

5. (ఎ) ప్రతీ క్రైస్తవుడు ఏమి చేయాలి? (బి) మనకు ఏ ప్రశ్నలు వస్తాయి?

6. క్రైస్తవులకు అప్పగించబడిన కొన్ని కృపావరాలేమిటి?

7. (ఎ) “కృపావరము పొందిన కొలది” అనే మాటలనుబట్టి ఏమి అర్థమౌతుంది? (బి) మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి? ఎందుకు?

8, 9. (ఎ) ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు తమ తోటి విశ్వాసులకు ఎలా ఉపచారం చేస్తున్నారు? (బి) మీ సంఘంలోని సహోదర సహోదరీలు ఎలా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు?

10. (ఎ) దేవుని సేవకు సంబంధించి ఏ రెండింటిని చేయాలని పౌలు గుర్తించాడు? (బి) నేడు మనం పౌలును ఎలా అనుకరిస్తాం?

11. సువార్త ప్రకటించమని, మన సహోదరులను ప్రోత్సహించమని ఇవ్వబడిన ఆజ్ఞలను మనమెలా పరిగణించాలి?

12. యెహోవా చేతిలో పనిముట్లుగా ఉండాలంటే మనం ఏమి చేయాలి?

13. ‘ఒకరికొకరం ఉపచారం చేసుకోకుండా’ ఉంటే ఏమి జరుగుతుంది?

14. “ఒకరికొకరు ఉపచారం చేసుకోవడం” వల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు? ఒక ఉదాహరణ చెప్పండి.

15. దేవుని కృప విషయంలో గృహనిర్వాహకులముగా సేవచేస్తూ ఉండడానికి ఎలాంటి బలమైన కారణాలున్నాయి?

[13వ పేజీలోని చిత్రాలు]

మీకు ఇవ్వబడిన ‘కృపావరాన్ని’ ఇతరులకు ఉపచారం చేయడానికి ఉపయోగిస్తారా లేక మీ సొంత సంతోషానికి ఉపయోగిస్తారా?

[15వ పేజీలోని చిత్రాలు]

ఇతరులకు సువార్త ప్రకటిస్తాం, తోటి క్రైస్తవులకు సహాయం చేస్తాం

[16వ పేజీలోని చిత్రం]

సహాయక పనులు చేపట్టిన సహోదరుల స్వయంత్యాగ స్ఫూర్తిని మెచ్చుకోవాలి