కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సేవకుడు ‘మన అతిక్రమక్రియలనుబట్టి గాయపరచబడ్డాడు’

యెహోవా సేవకుడు ‘మన అతిక్రమక్రియలనుబట్టి గాయపరచబడ్డాడు’

యెహోవా సేవకుడు ‘మన అతిక్రమక్రియలనుబట్టి గాయపరచబడ్డాడు’

“మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను . . . అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.”​—⁠యెష. 53:⁠5.

క్రీస్తు మరణాన్ని, ఆయన మరణ పునరుత్థానాలవల్ల లభించే ప్రయోజనాలను గుర్తు చేసుకోవడానికి క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినాన్ని ఆచరిస్తాం. యెహోవా సర్వాధిపత్యం సరైనదని రుజువు చేయబడుతుందనీ, ఆయన నామం పరిశుద్ధపరచబడుతుందనీ, ఆయన ఉద్దేశం నెరవేరడంతోపాటు మానవులు రక్షణ పొందుతారనీ అది గుర్తుచేస్తుంది. క్రీస్తు బలి గురించి, దానివల్ల వచ్చిన ప్రయోజనాల గురించి యెషయా 53:​3-12 వచనాల్లోని ప్రవచనాలు వివరించినంత స్పష్టంగా బైబిల్లోని మరే ఇతర వచనాలు వివరించడంలేదు. సేవకుడు పడే బాధల గురించే కాక, ఆయన మరణం గురించి, దానివల్ల ఆయన అభిషిక్త సహోదరులు, ఆయన “వేరే గొఱ్ఱెలు” పొందే ఆశీర్వాదాల గురించి యెషయా స్పష్టంగా వివరించాడు.​—⁠యోహా. 10:⁠16.

2 తాను ఏర్పరచుకున్న సేవకుడు తీవ్రంగా పరీక్షించబడినప్పటికీ నమ్మకంగా ఉంటాడని యేసు భూమ్మీదకు రావడానికి ఏడు శతాబ్దాల ముందే యెహోవా యెషయాను ప్రేరేపించి ప్రవచింపజేశాడు. తన కుమారుడు నమ్మకంగా ఉంటాడనే పూర్తి విశ్వాసం యెహోవాకు ఉందని అది రుజువుచేస్తుంది. మనం ఈ ప్రవచనం పరిశీలిస్తుండగా మన హృదయాలు కృతజ్ఞతతో నిండిపోతాయి, మన విశ్వాసం బలపడుతుంది.

‘తృణీకరించబడి’ ‘ఎన్నికచేయబడలేదు’

3యెషయా 53:3 చదవండి. మానవులను పాపమరణాలనుండి రక్షించేలా తన ప్రాణాన్ని ఇచ్చేందుకు ఈ అద్వితీయ కుమారుడు తన తండ్రితో కలిసి ఆనందంగా పనిచేసే గొప్ప అవకాశాన్ని వదులుకొని భూమ్మీదకు వచ్చాడు. అలా వచ్చేందుకు ఆయన ఎంత త్యాగం చేశాడో ఒక్కసారి ఊహించుకోండి. (ఫిలి. 2:​5-8) మోషే ధర్మశాస్త్రం ప్రకారం అర్పించబడిన జంతుబలులు యేసు బలికి కేవలం ఛాయగా ఉన్నాయి. వాటివల్ల సాధ్యంకాని నిజమైన పాపక్షమాపణ ఆయన బలివల్ల సాధ్యమౌతుంది. (హెబ్రీ. 10:​1-4) అలాంటప్పుడు కనీసం వాగ్దానం చేయబడిన మెస్సీయ కోసం ఎదురుచూస్తున్న యూదులైనా ఆయనను అంగీకరించి ఘనపర్చి ఉండాల్సింది కదా? (యోహా. 6:​14) అలా చేసేబదులు, యెషయా ప్రవచించినట్లు వారు క్రీస్తును ‘తృణీకరించి’ ఆయనను ‘ఎన్నికచేయలేదు’ లేదా పట్టించుకోలేదు. “ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు” అని అపొస్తలుడైన యోహాను రాశాడు. (యోహా. 1:​11) అపొస్తలుడైన పేతురు యూదులకు ఇలా చెప్పాడు: “మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరిం[చారు].”​—⁠అపొ. 3:​13, 14.

4 యేసు ‘వ్యాధిని అనుభవిస్తాడు’ అని కూడ యెషయా ప్రవచించాడు. యేసు పరిచర్యా కాలంలో కొన్నిసార్లు అలసిపోయాడు. కానీ, ఆయన అనారోగ్యంతో బాధపడ్డాడని బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. (యోహా. 4:⁠6) అయితే, ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు అనారోగ్యాలతో బాధపడుతుండడాన్ని ఆయన చూశాడు. వారిపై జాలిపడి చాలామందిని బాగుచేశాడు. (మార్కు 1:​32-34) అలా యేసు, “నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను” అనే ప్రవచనాన్ని నెరవేర్చాడు.​—⁠యెష. 53:⁠4; మత్త. 8:​16, 17.

‘దేవునివల్ల బాధింపబడినవాడిగా’

5యెషయా 53:4 చదవండి. యేసు ఎందుకు వేధనను అనుభవించి మరణించాడో ఆయన కాలంలో చాలామంది అర్థంచేసుకోలేదు. అసహ్యకరమైన వ్యాధితో మొత్తాడన్నట్లుగా దేవుడు ఆయనను శిక్షిస్తున్నాడని వారు అనుకున్నారు. (మత్త. 27:​38-44) యేసు దేవదూషణ చేశాడని యూదులు నిందవేశారు. (మార్కు 14:​61-64; యోహా. 10:​33) యేసు పాపి కాదని, దేవదూషకుడు కాదని మనకు తెలుసు. అయితే ఆయన తన తండ్రిని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవదూషణ చేశాడనే నిందతో చంపబడతాననే ఆలోచనే ఆ యెహోవా సేవకునికి మరింత వేధనను కలిగించివుంటుంది. అయినా, యెహోవా చిత్తానికి లోబడడానికే ఇష్టపడ్డాడు.​—⁠మత్త. 26:⁠39.

6 క్రీస్తు ‘దేవునివలన బాధింపడినవాడు’ అని ఇతరులు అనుకుంటారని యెషయా గ్రంథంలో ఒక చోట చెబుతోంది. అయితే, “అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను” అని ఆ గ్రంథంలోనే మరో చోట ఉండడం చూసి మనకు ఆశ్చర్యం కలుగవచ్చు. (యెష. 53:​10) “ఇదిగో . . . నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు” అని యెహోవాయే చెప్పాడు కాబట్టి, యెహోవా ఎలా ‘అతణ్ణి నలుగగొట్టడానికి ఇష్టపడతాడు’? (యెష. 42:⁠1) అది ఏవిధంగా యెహోవాకు ఆనందాన్నిచ్చింది?

7 ప్రవచనంలోని ఈ భాగాన్ని అర్థంచేసుకోవాలంటే, సాతాను యెహోవా సర్వాధిపత్యాన్ని సవాలు చేసినప్పుడు అటు పరలోకంలో, ఇటు భూమ్మీద ఉన్న దేవుని సేవకులు యథార్థంగా ఉండలేరనే నింద వేశాడన్నది గుర్తుంచుకోవాలి. (యోబు 1:​9-11; 2:​3-5) యేసు మరణం వరకు యథార్థంగా ఉండడం ద్వారా సాతాను సవాలుకు తిరుగులేని జవాబిచ్చాడు. యేసు శత్రువుల చేతిలో మరణించడానికి యెహోవా అనుమతించినప్పటికీ తాను ఏర్పర్చుకున్న సేవకుడు మరణించడాన్ని చూసి ఆయన ఖచ్చితంగా బాధపడివుంటాడు. అయితే తన కుమారుని సంపూర్ణ యథార్థతను చూసి యెహోవా ఎంతో సంతోషించాడు. (సామె. 27:​11) అంతేకాక, తన కుమారుడు మరణించడంవల్ల పశ్చాత్తాపపడిన మానవులు ప్రయోజనాలు పొందుతారు కాబట్టి, యెహోవా ఎంతో సంతోషించాడు.​—⁠లూకా 15:⁠7.

‘మన అతిక్రమక్రియలనుబట్టి గాయపరచబడెను’

8యెషయా 53:6 చదవండి. పాపభరితులైన మానవులు ఆదాము నుండి వచ్చిన అనారోగ్యం నుండి, మరణం నుండి విముక్తి పొందే మార్గం కోసం దారితప్పిన గొర్రెల్లాగే వెతికారు. (1 పేతు. 2:​25) ఆదాము నుండి వచ్చినవారు అపరిపూర్ణులు కాబట్టి, వారిలో ఏ ఒక్కరూ ఆదాము కోల్పోయినదాన్ని తిరిగి సంపాదించలేకపోయారు. (కీర్త. 49:⁠7) అయితే ఎంతో ప్రేమతో “యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను” అంటే తన ప్రియ కుమారుడూ, తాను ఏర్పరచుకున్న సేవకుడూ అయిన యేసుమీద మోపాడు. ‘మన అతిక్రమక్రియలనుబట్టి గాయపరచబడడానికి,’ ‘మన దోషములనుబట్టి నలుగగొట్టబడడానికి’ ఒప్పుకోవడం ద్వారా మన పాపాల్ని మ్రానుపై మోసి మన బదులు ఆయన మరణించాడు.

9 అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను.” ఆ తర్వాత యెషయా ప్రవచనాన్ని ఉల్లేఖిస్తూ “ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థతనొందితిరి” అని చెప్పాడు. (1 పేతు. 2:​21, 24; యెష. 53:⁠5) దానివల్ల పాపులు దేవునితో సమాధానపడగలిగారు, ఎందుకంటే పేతురు ఇంకా ఇలా చెప్పాడు: ‘మనల్ని దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో ఒక్కసారే చంపబడ్డాడు.’​—⁠1 పేతు. 3:⁠18.

‘వధకు తేబడిన గొర్రెపిల్ల’

10యెషయా 53:​7, 8 చదవండి. యేసు తన దగ్గరకు వస్తున్నప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను, “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని అన్నాడు. (యోహా. 1:​29) ‘అతడు వధకు తేబడిన గొర్రెపిల్ల’ అనే యెషయా మాటలను మనసులో ఉంచుకొని ఆయన యేసును గొర్రెపిల్ల అని పిలిచివుంటాడు. (యెష. 53:⁠7) “మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను” అని యెషయా ప్రవచించాడు. (యెష. 53:​12) ఆసక్తికరంగా, తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించిన రాత్రి, యేసు నమ్మకస్థులైన తన పదకొండు మంది శిష్యులకు ద్రాక్షారసము ఉన్న గిన్నెను ఇచ్చి, “ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము” అని వారితో అన్నాడు.​—⁠మత్త. 26:​27-29.

11 ఇస్సాకులాగే, యేసు కూడ యెహోవా చిత్తమనే బలిపీఠంమీద అర్పించబడేందుకు ఇష్టపడ్డాడు. (ఆది. 22:​1, 2, 9-13; హెబ్రీ. 10:​5-10) ఇస్సాకు బలిగా అర్పించబడేందుకు ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నప్పటికీ బలి అర్పించడానికి సిద్ధపడింది మాత్రం అబ్రాహామే. (హెబ్రీ. 11:​17) అలాగే, యేసు చనిపోవడానికి ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నా, విమోచన క్రయధనం ఎలా చెల్లించబడాలన్నది యెహోవాయే నిర్ణయించాడు. తన కుమారుణ్ణి బలిగా అర్పించడం ద్వారా తాను మానవులను ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపించాడు.

12 యేసు స్వయంగా ఇలా చెప్పాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహా. 3:​16) “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” అని అపొస్తలుడైన పౌలు కూడ రాశాడు. (రోమా. 5:⁠8) కాబట్టి, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినాన్ని ఆచరించడం ద్వారా మనం ఆయనను ఘనపర్చినప్పటికీ ఆ ఏర్పాటును గొప్ప అబ్రాహామైన యెహోవాయే చేశాడని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఆయన స్తుతించబడే విధంగా మనం జ్ఞాపకార్థ ఆచరణను ఆచరిస్తాం.

ఆ సేవకుడు ‘అనేకులను నిర్దోషులుగా’ చేస్తాడు

13యెషయా 53:​11, 12 చదవండి. యెహోవా తాను ఏర్పరచుకున్న సేవకుని గురించి ఇలా చెప్పాడు: “నీతిమంతుడైన నా సేవకుడు . . . అనేకులను నిర్దోషులుగా చేయును.” ఎలా? 12వ వచనం చివరి భాగంలో దానికి జవాబు కనిపిస్తుంది. ఆయన “తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను” అని అక్కడ రాయబడింది. ఆదాము నుండి వచ్చినవారంతా పాపులుగా, ‘తిరుగుబాటుచేసేవారిగా’ లేదా అతిక్రమము చేసేవారిగా పుట్టారు కాబట్టి వారు ‘పాపానికి జీతంగా’ మరణాన్ని పొందుతారు. (రోమా. 5:​12; 6:​23) అందుకే, యెహోవాకూ పాపులైన మానవులకూ మధ్య సమాధానం నెలకొల్పబడాలి. పాపులైన మానవుల కోసం యేసు ఎలా ‘విజ్ఞాపన’ చేస్తాడో యెషయా 53వ అధ్యాయం చక్కగా వివరిస్తోంది. అక్కడ, “సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది” అని రాయబడింది.​—⁠యెష. 53:⁠5.

14 మన పాపాలను మోసి, మన కోసం మరణించడం ద్వారా క్రీస్తు ‘అనేకులను నిర్దోషులనుగా’ చేశాడు. పౌలు ఇలా రాశాడు: “ఆయనయందు [క్రీస్తుయందు] సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొన వలెననియు తండ్రి అభీష్టమాయెను.”​—⁠కొలొ. 1:​19, 20.

15 ‘పరలోకమందున్నవి’ అనే మాట క్రీస్తు చిందించిన రక్తం ద్వారా యెహోవాతో సమాధానపడి క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలించడానికి పిలవబడిన అభిషిక్త క్రైస్తవులను సూచిస్తోంది. “పరలోకసంబంధమైన పిలుపులో పాలుపొందిన[వారు]” ‘జీవప్రదమైన నీతిమంతులుగా’ తీర్చబడ్డారు. (హెబ్రీ. 3:⁠1; రోమా. 5:​1, 18) అలా నీతిమంతులుగా తీర్చబడినప్పుడే యెహోవా వారిని ఆధ్యాత్మిక కుమారులుగా ఎంచుతాడు. క్రీస్తు రాజ్యంలో రాజులుగా, యాజకులుగా పరిపాలించడానికి పిలువబడిన ‘క్రీస్తు తోటివారసులమని’ పరిశుద్ధాత్మ వారికి సాక్ష్యమిస్తుంది. (రోమా. 8:​15-17; ప్రక. 5:​9, 10) వారు ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులైన “దేవుని ఇశ్రాయేలు”లో ఒకరై “క్రొత్త నిబంధన”లోకి తీసుకోబడతారు. (యిర్మీ. 31:​31-34; గల. 6:​16) కొత్త నిబంధనకు చెందినవారిగా వారు జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగం వహించగలుగుతారు. ఆ చిహ్నాల్లో ఒకటైన ఎర్రని ద్రాక్షారసమున్న గిన్నె గురించి యేసు ఇలా చెప్పాడు: “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన.”​—⁠లూకా 22:⁠20.

16 ‘భూలోకమందున్నవి’ అనే మాట భూమ్మీద నిరంతరం జీవించే అవకాశమున్న క్రీస్తు వేరే గొర్రెలను సూచిస్తోంది. యెహోవా ఏర్పరచుకున్న సేవకుడు వీరిని కూడ నిర్దోషులుగా లేదా నీతిమంతులుగా తీరుస్తాడు. వీరు క్రీస్తు విమోచనా క్రయధన బలిపట్ల విశ్వాసంతో ‘గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసుకున్నారు’ కాబట్టి, యెహోవా వీరిని ఆధ్యాత్మిక కుమారుల్లా కాక తన స్నేహితులుగా పరిగణించి నీతిమంతులుగా తీర్పుతీరుస్తాడు. దానివల్ల వీరికి “మహాశ్రమల” నుండి తప్పించుకునే అద్భుతమైన అవకాశం లభిస్తుంది. (ప్రక. 7:​9, 10, 14; యాకో. 2:​23) వీరు కొత్త నిబంధనలో భాగస్థులు కారు కాబట్టి, పరలోకంలో జీవించే నిరీక్షణ వీరికి ఉండదు. అందుకే ఈ వేరే గొర్రెలు జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగం వహించరు కానీ ఆ ఆచరణకు హాజరై దానిపట్ల తమకున్న గౌరవాన్ని చూపిస్తారు.

యెహోవాకు, ఆయన ప్రియమైన సేవకునికి కృతజ్ఞతలు

17 సేవకుని గురించి యెషయా గ్రంథంలోని ప్రవచనాలను అధ్యయనం చేయడం ద్వారా క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు మన మనసుల్ని సరైన విధంగా సిద్ధంచేసుకున్నాం. మనం “విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు” అత్యంత ఆసక్తితో చూడగలిగాం. (హెబ్రీ. 12:​1, 2) దేవుని కుమారుడు తిరుగుబాటుదారుడు కాదని తెలుసుకున్నాం. సాతానులా కాక, ఆయన యెహోవా దగ్గర నేర్చుకొని, యెహోవాను సర్వాధిపతియైన ప్రభువని గుర్తించడానికి ఇష్టపడ్డాడు. యేసు తన భూపరిచర్యా కాలంలో తాను ప్రకటించిన ప్రజలపట్ల కనికరపడి, అనేకమందిని భౌతికంగా, ఆధ్యాత్మికంగా బాగుచేశాడని మనం చూశాం. అలా ఆయన నూతనవిధానంలో ‘భూమ్మీద న్యాయం స్థాపించినప్పుడు’ మెస్సీయ రాజుగా ఏమి చేస్తాడో చూపించాడు. (యెష. 42:⁠4) “అన్యజనులకు వెలుగుగా” ఆయన రాజ్య ప్రకటనా పనిలో చూపించిన ఉత్సాహం ఆయన శిష్యులకు మాదిరిగా ఉంది. వారు కూడ భూమంతటా సువార్తను ఉత్సాహంగా ప్రకటించాలని అది గుర్తుచేస్తోంది.​—⁠యెష. 42:⁠7.

18 తన ప్రియ కుమారుడు శ్రమలను అనుభవించి మన కోసం మరణించేందుకు భూమ్మీదకు పంపించడం ద్వారా యెహోవా చేసిన గొప్ప త్యాగాన్ని మరింత అర్థం చేసుకునేందుకు కూడ యెషయా ప్రవచనాలు సహాయం చేస్తాయి. యెహోవా తన కుమారుడు శ్రమ అనుభవించడాన్ని చూసి ఆనందించలేదు కానీ మరణం వరకు పూర్తి యథార్థతను కనబరచడాన్ని చూసి ఆనందించాడు. యెహోవా సర్వాధిపత్యమే సరైందని నిరూపించడంలో భాగంగా సాతాను అబద్ధికుడని నిరూపించడానికీ, యెహోవా నామాన్ని పరిశుద్ధపరచడానికీ యేసు చేసినవన్నీ గుర్తించి, మనమూ యెహోవాలా ఆనందించాలి. అంతేకాక, క్రీస్తు మన పాపాలను మోసి మన కోసం మరణించాడు. అలా తన అభిషిక్త సహోదరులైన చిన్నమందకు, వేరేగొర్రెలకు యెహోవా ముందు నీతిమంతులుగా తీర్చబడే అవకాశం కల్పించాడు. క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనప్పుడు యెహోవాపట్ల, నమ్మకమైన ఆయన సేవకునిపట్ల మన హృదయాలు కృతజ్ఞతతో నిండిపోవును గాక!

పునఃసమీక్ష

• తన కుమారుణ్ణి ‘నలుగగొట్టడానికి’ యెహోవాకు ఏ భావంలో “ఇష్టమాయెను”?

• యేసు ఎలా ‘మన అతిక్రమక్రియలనుబట్టి గాయపరచబడ్డాడు’?

• ఆ సేవకుడు ఎలా ‘అనేకులను నిర్దోషులుగా’ చేస్తాడు?

• సేవకుని గురించిన ప్రవచనాలను అధ్యయనం చేయడం, జ్ఞాపకార్థ ఆచరణ కోసం మన మనసుల్ని, హృదయాల్ని సిద్ధంచేసుకోవడానికి ఎలా సహాయం చేసింది?

[అధ్యయన ప్రశ్నలు]

1. మనం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినాన్ని ఆచరిస్తున్నప్పుడు దేన్ని గుర్తుంచుకోవాలి? అలా చేయడానికి ఏ ప్రవచనం సహాయం చేస్తుంది?

2. యెషయా ప్రవచనం దేన్ని రుజువుచేస్తోంది? దాన్ని పరిశీలించడంవల్ల మనకు ఎలాంటి ప్రయోజనముంది?

3. యూదులు యేసును ఎందుకు అంగీకరించి ఉండాల్సింది? కానీ, వారు ఆయనతో ఎలా వ్యవహరించారు?

4. ప్రజల అనారోగ్యాలను యేసు ఎలా చూడగలిగాడు?

5. చాలామంది యూదులు యేసు ఏ కారణాలనుబట్టి మరణించాడని అనుకున్నారు? ఏది ఆయన వేధనను పెంచింది?

6, 7. యెహోవా ఎలా తన నమ్మకమైన సేవకుణ్ణి ‘నలుగగొట్టాడు’? దాన్ని చూసి దేవుడు ఎందుకు ‘ఇష్టపడ్డాడు’?

8, 9. (ఎ) యేసు ఎలా ‘మన అతిక్రమక్రియలనుబట్టి గాయపరచబడ్డాడు’? (బి) పేతురు ఈ విషయాన్ని ఎలా బలపర్చాడు?

10. (ఎ) బాప్తిస్మమిచ్చు యోహాను యేసును ఎలా వర్ణించాడు? (బి) ఆ వర్ణన సరైనదేనని ఎందుకు చెప్పవచ్చు?

11, 12. (ఎ) బలిగా అర్పించబడేందుకు ఇస్సాకు చూపించిన సుముఖత క్రీస్తు బలి గురించి ఏమి తెలియజేస్తోంది? (బి) మనం జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకుంటున్నప్పుడు గొప్ప అబ్రాహామైన యెహోవా విషయంలో ఏమి గుర్తుంచుకోవాలి?

13, 14. యెహోవా సేవకుడు ఎలా ‘అనేకులను నిర్దోషులనుగా’ చేశాడు?

15. (ఎ) ‘పరలోకమందున్నవి’ అని పౌలు చెప్పిన మాట ఎవరిని సూచిస్తోంది? (బి) జ్ఞాపకార్థ చిహ్నాల్లో ఎవరు మాత్రమే పాలుపంచుకోవచ్చు? ఎందుకు?

16. ‘భూలోకమందున్నవి’ అనే మాట ఎవరిని సూచిస్తోంది? వారు ఎలా యెహోవా ముందు నీతిమంతులుగా తీర్చబడతారు?

17. జ్ఞాపకార్థ ఆచరణ కోసం మన మనసుల్ని సిద్ధంచేసుకోవడానికి సేవకుని గురించి యెషయా గ్రంథంలోని ప్రవచనాల అధ్యయనం ఎలా సహాయం చేసింది?

18. యెషయా ప్రవచనాలు ఎందుకు యెహోవాపట్ల, ఆయన నమ్మకమైన సేవకునిపట్ల మన కృతజ్ఞతను పెంచుతున్నాయి?

[26వ పేజీలోని చిత్రం]

‘తృణీకరించబడి’ ‘ఎన్నికచేయబడలేదు’

[28వ పేజీలోని చిత్రం]

“మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను”

[29వ పేజీలోని చిత్రం]

“వేరే గొర్రెలు” జ్ఞాపకార్థ ఆచరణకు హాజరై దానిపట్ల తమకున్న గౌరవాన్ని చూపిస్తారు