కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శిష్యులను చేసే పనిలో ఆనందాన్ని పొందండి

శిష్యులను చేసే పనిలో ఆనందాన్ని పొందండి

శిష్యులను చేసే పనిలో ఆనందాన్ని పొందండి

‘మీరు వెళ్లి శిష్యులను చేయుడి.’​—⁠మత్త. 28:⁠19.

అమెరికాలో హిందీ భాషా గ్రూపుతో సేవచేస్తున్న ఒక సహోదరి ఇలా రాసింది: “నేను గత 11 వారాలుగా పాకిస్థాన్‌ నుండి వచ్చిన ఒక కుటుంబంతో అధ్యయనం చేస్తున్నాను. మేము స్నేహితులమయ్యామని వేరే చెప్పనక్కర్లేదు. వారు త్వరలో పాకిస్థాన్‌కు తిరిగివెళ్లిపోతున్నారనే విషయం గురించి ఆలోచిస్తేనే నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఒకవైపు వారి సహవాసాన్ని కోల్పోతాననే దుఃఖంతో మరోవైపు యెహోవా గురించి వారికి బోధిస్తున్నప్పుడు పొందిన ఆనందంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి.”

2 ఆ సహోదరిలాగే బైబిలు అధ్యయనం చేయడంవల్ల వచ్చే ఆనందాన్ని మీరు ఎప్పుడైనా చవిచూశారా? యేసు, మొదటి శతాబ్దంలోని ఆయన అనుచరులు శిష్యులను చేసే పనిలో ఎంతో ఆనందాన్ని పొందారు. తాను శిక్షణ ఇచ్చిన శిష్యులు సంతోషంగా తిరిగివచ్చి పరిచర్యలో తమకు ఎదురైన అనుభవాలు చెప్పినప్పుడు యేసు “పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందిం[చాడు].” (లూకా 10:​17-21) వారిలాగే నేడు చాలామంది శిష్యులను చేసే పనిలో ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. 2007లో కష్టపడి సంతోషంగా పనిచేసిన ప్రచారకులు సగటున ప్రతీ నెల 65 లక్షల కన్నా ఎక్కువ బైబిలు అధ్యయనాలను నిర్వహించడమే దానికి రుజువు!

3 అయితే, కొందరు ప్రచారకులు బైబిలు అధ్యయనాన్ని నిర్వహించడంవల్ల వచ్చే ఆనందాన్ని ఇప్పటివరకు చవిచూడలేదు. మరికొందరు ఇటీవలి సంవత్సరాల్లో బైబిలు అధ్యయనాలు నిర్వహించలేకపోయి ఉండవచ్చు. బైబిలు అధ్యయనాన్ని నిర్వహించడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు మనకు ఎలాంటి సవాళ్లు ఎదురుకావచ్చు? వాటిని మనం ఎలా అధిగమించవచ్చు? ‘కాబట్టి మీరు వెళ్లి శిష్యులను చేయుడి’ అని యేసు ఇచ్చిన ఆజ్ఞకు లోబడడానికి మనం శాయశక్తులా ప్రయత్నించినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలను పొందుతాం?​—⁠మత్త. 28:⁠19.

మన ఆనందానికి అడ్డంకిగా నిలవగల సవాళ్లు

4 ప్రపంచంలోని కొన్ని దేశాల్లో, ప్రజలు మన సాహిత్యాన్ని సంతోషంగా తీసుకొని మనతో బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడతారు. జాంబియాలో తాత్కాలికంగా సేవచేయడానికి వెళ్లిన ఆస్ట్రేలియాకు చెందిన ఒక జంట ఇలా రాశారు: “మేము విన్న కథనాలు నిజమే. ప్రకటనా పనికి జాంబియా పరదైసులాంటిది. వీధి సాక్ష్యం గురించైతే వేరే చెప్పనక్కర్లేదు! ప్రజలు మా దగ్గరికి వచ్చి మాట్లాడతారు, కొందరైతే ఫలానా సంచికలు కావాలని కోరతారు.” ఇటీవలి సంవత్సరంలో జాంబియా సహోదర సహోదరీలు 2,00,000 కన్నా ఎక్కువ బైబిలు అధ్యయనాలను నిర్వహించారు. అంటే సగటున ప్రతీ ప్రచారకుడు ఒకటికన్నా ఎక్కువ బైబిలు అధ్యయనాలు నిర్వహించారు.

5 అయితే, వేరే ప్రాంతాల్లోనైతే ప్రజలకు సాహిత్యాన్ని ఇవ్వడానికి, క్రమంగా బైబిలు అధ్యయనాలు నిర్వహించడానికి ప్రచారకులకు కష్టమనిపిస్తుండవచ్చు. ఎందుకు? సాధారణంగా, ప్రచారకులు ఒక ఇంటికి వెళ్లినప్పుడు ఆ ఇంట్లో ఎవరూ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా వారు మత సంబంధ విషయాలు మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. బహుశా వారు మతంపట్ల ఆసక్తిలేని కుటుంబంలో పెరిగివుంటారు లేదా అబద్ధ మతంలో కనిపించే వేషధారణనుబట్టి మతాలను వారు ద్వేషిస్తుండవచ్చు. చాలామంది దొంగ కాపరుల బారినపడి విసికి చెదిరిపోయారు. (మత్త. 9:​36) అలాంటివారు బైబిలు చర్చలకు దూరంగా ఉండాలనుకోవచ్చు.

6 కొంతమంది నమ్మకస్థులైన ప్రచారకులు తమ ఆనందాన్ని హరించివేయగల ఇతర సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వారు ఒకప్పుడు శిష్యులను చేసే పనిలో ఎంతో చురుగ్గా పాల్గొన్నప్పటికీ వారిప్పుడు అనారోగ్యం వల్లనో ముసలితనంలో వచ్చే పరిమితులవల్లనో ఎక్కువ చేయలేకపోతున్నారు. అంతేకాక, మనం స్వయంగా విధించుకునే కొన్ని పరిమితుల గురించి కూడ ఆలోచించండి. ఉదాహరణకు, బైబిలు అధ్యయనం నిర్వహించే సామర్థ్యం లేదని మీకు అనిపిస్తోందా? యెహోవా మోషేను ఫరో దగ్గరికి వెళ్లి మాట్లాడమని చెప్పినప్పుడు ఆయనకు అనిపించినట్లే మీకూ అనిపించవచ్చు. మోషే, “ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడినప్పటినుండియైనను, నేను మాట నేర్పరినికాను” అని చెప్పాడు. (నిర్గ. 4:​10) బైబిలు అధ్యయనం నిర్వహించే సామర్థ్యం మనలో లేదని మనకు అనిపించినప్పుడే మనం శిష్యులను చేసే పనిలో విఫలమైపోతామేమో అనే భయం మనలో పుట్టవచ్చు. మనకు సరిగ్గా బోధించడం చేతకాదు కాబట్టి ఎవరినీ సత్యంలోకి తీసుకురాలేమని ఆందోళనపడే అవకాశముంది. అలాంటి పరిస్థితి ఎదుర్కొనే బదులు అధ్యయనం నిర్వహించకపోవడమే మంచిది అని అనిపించవచ్చు. ఈ సవాళ్లన్నింటినీ మనం ఎలా ఎదుర్కోవచ్చు?

మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి

7 అలాంటి సవాళ్లు మీరు ఎదుర్కొంటున్నట్లయితే, మొదటిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. “హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.” (లూకా 6:​45) ఇతరుల బాగోగుల విషయంలో హృదయపూర్వక శ్రద్ధ ఉండడంవల్లనే యేసు పరిచర్యలో పాల్గొన్నాడు. ఉదాహరణకు, తోటి యూదులు దేవునికి దూరమయ్యారని గమనించి యేసు ‘వారిమీద కనికరపడ్డాడు’. ఆయన తన శిష్యులతో, ‘కోత విస్తారంగా ఉంది కాబట్టి, తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకోండి’ అని చెప్పాడు.​—⁠మత్త. 9:​36-38.

8 శిష్యులను చేసే పనిలో పాల్గొంటున్నప్పుడు, ఒకరు సమయం తీసుకొని మనతో బైబిలు అధ్యయనం చేయడంవల్ల మనం ఎంతగా ప్రయోజనం పొందామో ఒకసారి లోతుగా ఆలోచించడం మంచిది. మనం పరిచర్యలో కలుసుకునే ప్రజల గురించీ, ప్రకటించే సందేశం నుండి వారు పొందే ప్రయోజనం గురించీ ఆలోచించండి. ఒక స్త్రీ తన దేశంలో ఉన్న బ్రాంచి కార్యాలయానికి ఇలా రాసింది: “మా యింటికి వచ్చి నాకు బోధించే యెహోవాసాక్షులకు నేను ఎంతగా రుణపడివున్నానో మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను వారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ వారిని త్వరగా వెళ్లనివ్వనందుకు కొన్నిసార్లు నామీద విసుగొస్తుందని తెలుసు. అయినా వారు విసుక్కోకుండా ఉత్సాహంతో తాము నేర్చుకున్న విషయాలను ఓపికతో బోధిస్తారు. ఈ ప్రజలను కలుసుకునే అవకాశం నాకు దొరికినందుకు యెహోవాకు, యేసుకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.”

9 నిజమే, ప్రతీ ఒక్కరూ యేసు బోధలను అంగీకరించలేదు. (మత్త. 23:​37) కొందరు ఆయనను కొంతకాలం అనుసరించి ఆ తర్వాత ఆయన బోధలతో విభేదించి “మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.” (యోహా. 6:​66) అయితే, కొందరు అలా వెంబడించడం మానేసినా ఇతరులకు బోధించడంవల్ల ప్రయోజనంలేదని ఆయన అనుకోలేదు. ఆయన నాటిన అనేక విత్తనాలు ఎలాంటి ఫలాలు ఇవ్వకపోయినా తాను చేస్తున్న మంచి పనుల గురించే ఆలోచించాడు. పొలము తెల్లబారి కోతకు సిద్ధంగా ఉందని గమనించి ఆ పనిలో పాల్గొని ఎంతో ఆనందాన్ని పొందాడు. (యోహాను 4:​35, 36 చదవండి.) పొలంలో మొలకెత్తని భాగాన్ని చూసే బదులు ధాన్యమున్న భాగాన్నే చూశాడు. ఆయనలాగే మనమూ ఇవ్వబడిన క్షేత్రంలో మంచి ఫలమిచ్చే అవకాశమున్న దానిగురించే ఆలోచించవద్దా? మనం సానుకూల దృక్పథంతో ఎలా ఉండవచ్చో చూద్దాం.

పంటను కోసే ఉద్దేశంతో విత్తండి

10 పంటను కోసే ఉద్దేశంతో ఒక రైతు విత్తనాన్ని విత్తుతాడు. ఆయనలాగే మనం బైబిలు అధ్యయనాలు ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రకటించాలి. అయితే, మీరు క్రమంగా పరిచర్యలో పాల్గొంటున్నా కొంతమందే ఇళ్లలో ఉంటుండవచ్చు లేదా ఆసక్తి చూపించేవారిని మళ్లీ కలుసుకోలేకపోతుండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరేమి చేయవచ్చు? అలాంటప్పుడు మీరు నిరాశపడే అవకాశముంది. అలాగని ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం మానేయాలా? లేదు! ఎంతోకాలంగా ఉపయోగించబడుతున్న ఈ పద్ధతి ద్వారా ఇప్పటికీ చాలామంది సత్యం తెలుసుకుంటున్నారు.

11 అయితే, మీరు పరిచర్యలో ఆనందాన్ని కాపాడుకోవాలంటే మరింత ఎక్కువమంది ప్రజలను కలుసుకునేలా పరిచర్యలో వివిధ పద్ధతులను ఉపయోగించగలరేమో చూడండి. ఉదాహరణకు, వీధుల్లో లేదా ప్రజల ఉద్యోగ స్థలాల్లో ప్రకటించేందుకు మీరు ప్రయత్నించారా? టెలిఫోను ద్వారా లేదా మీరు ఇప్పటికే రాజ్య సందేశాన్ని ప్రకటించినవారి ఫోను నంబర్లు తీసుకోవడం ద్వారా వారితో దాని గురించి మరెక్కువగా మాట్లాడగలరేమో చూడండి. పట్టుదలతో పరిచర్యలో పాల్గొంటూ పరిస్థితికి అనుగుణంగా ప్రకటించడం ద్వారా రాజ్యసందేశాన్ని వినేవారిని కనుగొని మీ పరిచర్యలో ఆనందాన్ని పొందుతారు.

మతమంటే ఇష్టంలేనివారిని కలుసుకున్నప్పుడు

12 మీ ప్రాంతంలో మతమంటే ఇష్టంలేనివారు చాలామంది ఉంటే ఏమి చేయాలి? వారు ఇష్టపడే విషయాలను ప్రస్తావిస్తూ మీరు వారితో సంభాషణను ప్రారంభించగలరేమో ఆలోచించండి. అపొస్తలుడైన పౌలు కొరింథులోని తోటి విశ్వాసులకు ఇలా రాశాడు: ‘యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని.’ పౌలు ఏ ఉద్దేశంతో అలా అన్నాడు? “ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను” అని ఆయన అన్నాడు. (1 కొరిం. 9:​20-22) మనం కూడ ఆయనలాగే మన ప్రాంతంలో ప్రజలు ఇష్టపడే అంశాలను తెలుసుకోగలమేమో ఆలోచించండి. చాలామందికి మతమంటే ఇష్టంలేకపోయినా తమ కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలనుకుంటారు. జీవిత ఉద్దేశాన్ని కనుగొనడానికి కూడ వారు ప్రయత్నిస్తుండవచ్చు. కాబట్టి వారికి ఇష్టమైన విధంగా రాజ్య సందేశాన్ని ప్రకటించగలమేమో ఆలోచించండి.

13 మతమంటే ఇష్టంలేనివారు ఎక్కువమంది ఉన్న ప్రాంతాల్లో కూడ అనేకమంది ప్రచారకులు శిష్యులను చేసే పనిలో మరింత ఆనందాన్ని పొందుతున్నారు. ఎలా? వేరేభాషను నేర్చుకోవడం ద్వారా. 60వ పడిలో ఉన్న ఒక జంట తమ సంఘానికి ఇవ్వబడిన ప్రాంతంలో వేలాదిమంది చైనీస్‌ విద్యార్థులు, వారి కుటుంబాలు నివసిస్తున్నట్లు కనుగొన్నారు. “ఆ కారణంగా చైనీస్‌ భాషను నేర్చుకోవాలనిపించింది” అని ఆ భర్త చెప్పాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “అయితే, దాన్ని నేర్చుకోవాలంటే ప్రతీరోజు మేము కొంత సమయాన్ని కేటాయించాల్సివచ్చినా దానివల్ల మేము చైనా భాష మాట్లాడే ప్రజలతో ఎన్నో బైబిలు అధ్యయనాలను ప్రారంభించగలిగాం.”

14 మీరు ఓ కొత్త భాష నేర్చుకోలేకపోయినా, వేరే భాష మాట్లాడేవారు తారసపడినప్పుడు అన్ని దేశాల ప్రజలకు సువార్త అనే చిన్న పుస్తకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అంతేకాక, వారు మాట్లాడే భాషలో సాహిత్యాన్ని తీసుకొని వారికి ఇవ్వవచ్చు. నిజమే, మరో భాషకు, సంస్కృతికి చెందినవారితో మాట్లాడాలంటే ఎంతో సమయం పడుతుంది, ఎంతో కృషి చేయాల్సివస్తుంది. అయినా, “సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును” అని దేవుని వాక్యంలోవున్న సూత్రాన్ని గుర్తుంచుకోండి.​—⁠2 కొరిం. 9:⁠6.

సంసభ్యులందరి పాత్ర

15 అయితే, కేవలం ఒకరి కృషితోనే వ్యక్తులు శిష్యులైపోరు. దానిలో సంఘ సభ్యులందరి పాత్ర ఉంటుంది. ఎందుకు? “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” అని యేసు చెప్పాడు. (యోహా. 13:​35) అది నిజమే కదా? బైబిలు విద్యార్థులు కూటాలకు వచ్చినప్పుడు వారు సాధారణంగా అక్కడ కనిపించే ప్రేమనుబట్టి ముగ్ధులౌతారు. ఒక బైబిలు విద్యార్థి ఇలా రాసింది: “కూటాలకు హాజరవడం నాకు చాలా ఇష్టం. అక్కడికి వచ్చేవాళ్లు నాతో ఎంతో స్నేహంగా ఉంటారు!” తన శిష్యులయ్యేవారు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి రావచ్చని యేసు చెప్పాడు. (మత్తయి 10:​35-37 చదవండి.) అయితే, వారు సంఘంలో అనేకమంది ఆధ్యాత్మిక “అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను” పొందుతారనే హామీని ఆయనిచ్చాడు.​—⁠మార్కు 10:⁠30.

16 బైబిలు విద్యార్థులు ప్రగతి సాధించేందుకు ముఖ్యంగా వృద్ధులైన సహోదర సహోదరీలు ఎంతగానో తోడ్పడతారు. ఏ విధంగా? స్వయంగా వారు బైబిలు అధ్యయనాలను నిర్వహించే స్థితిలో లేకపోయినా కూటాల్లో వారిచ్చే ప్రోత్సాహకరమైన వ్యాఖ్యానాలు వినేవారి విశ్వాసాన్ని బలపరుస్తాయి. వారు ఎంతోకాలంగా చూపించిన “నీతి ప్రవర్తన” సంఘానికి వన్నె తీసుకొచ్చి యథార్థహృదయులను దేవుని సంస్థవైపు ఆకర్షిస్తుంది.​—⁠సామె. 16:⁠31.

భయాలను అధిగమించండి

17 బైబిలు అధ్యయనాన్ని నిర్వహించే సామర్థ్యం లేదని మీకనిపిస్తే ఏమి చేయవచ్చు? యెహోవా మోషేకు పరిశుద్ధాత్మను, తోడుగా ఆయన అన్నయైన అహరోనును ఇచ్చి సహాయం చేశాడన్నది గుర్తుచేసుకోండి. (నిర్గ. 4:​10-17) మన సాక్ష్యపు పనిలో దేవుని పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుందని యేసు హామీనిచ్చాడు. (అపొ. 1:⁠8) అంతేకాక, యేసు ప్రకటనా పనికి ఇద్దరిద్దరిని పంపించాడు. (లూకా 10:⁠1) కాబట్టి, బైబిలు అధ్యయనం నిర్వహించడం మీకు కష్టమనిపిస్తే జ్ఞానం కోసం పరిశుద్ధాత్మను ఇవ్వమని ప్రార్థించండి. అంతేకాక, మీలో ధైర్యాన్ని నింపగల ప్రచారకునితో లేదా ప్రచారకురాలితో కలిసి పనిచేయండి. అలా చేస్తే, వారి అనుభవం నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు. యెహోవా ఈ అసాధారణమైన పనికోసం సాధారణ ప్రజలను అంటే “లోకములో బలహీనులైనవారిని” ఏర్పరచుకున్నాడన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మన విశ్వాసం బలపడుతుంది.​—⁠1 కొరిం. 1:​26-29.

18 శిష్యులను చేసే పనిలో విఫలమైపోతామేమోననే భయాన్ని మనమెలా అధిగమించవచ్చు? శిష్యులను చేసే పని వంట వండడంలాంటిది కాదని గుర్తుంచుకోండి. ఎందుకంటే, వంట రుచిగా ఉండడం ఉండకపోవడం అనేది వండే వ్యక్తిపైనే పూర్తిగా ఆధారపడివుంటుంది. కానీ శిష్యులను చేసే పనిలో ముగ్గురి పాత్ర ఉంటుంది. యెహోవా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఆయన వ్యక్తిని తనవైపు ఆకర్షిస్తాడు. (యోహా. 6:​44) మనమూ, సంఘంలోని ఇతరులూ బోధనా కళను ఉపయోగించి విద్యార్థి ప్రగతి సాధించేలా సహాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. (2 తిమోతి 2:⁠15 చదవండి.) చివరిగా, ఆ విద్యార్థి తాను నేర్చుకున్నవాటి ప్రకారం జీవించాలి. (మత్త. 7:​24-27) ఒక విద్యార్థి బైబిలు అధ్యయనాన్ని మానేస్తే అది మనల్ని నిరాశపరచవచ్చు. బైబిలు విద్యార్థులు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తాం. కానీ చివరిగా ప్రతీ వ్యక్తి “తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.”​—⁠రోమా. 14:⁠11.

శిష్యులను చేసే పనివల్ల వచ్చే ఆశీర్వాదాలు

19 బైబిలు అధ్యయనాలు నిర్వహించడంవల్ల మనం దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వగలుగుతాం. అంతేకాక మన మనసుల్లో, హృదయాల్లో దేవుని వాక్యంలోని సత్యాలు ముద్రపడిపోతాయి. ఎందుకు? పయినీరుగా సేవచేస్తున్న బరాక్‌ ఇలా వివరిస్తున్నాడు: “బైబిలు అధ్యయనాలు నిర్వహించాలంటే ముందు మనం బైబిలును చక్కగా అధ్యయనం చేయాల్సివస్తుంది. ఇతరులకు సరైన విధంగా బోధించే ముందు నేను నా నమ్మకాలను బలపర్చుకోవాలని గ్రహించాను.”

20 ప్రస్తుతం మీకు ఒక బైబిలు అధ్యయనం లేకపోతే, మీరు దేవునికి చేసే సేవంతా వ్యర్థమని దాని భావమా? లేదు! తనను స్తుతించడానికి మనం చేసే ప్రయత్నాలను యెహోవా ఎంతో విలువైనవిగా ఎంచుతున్నాడు. ప్రకటనా పనిలో పాల్గొనేవారంతా “దేవుని జతపనివారు.” అయితే, మనం నాటిన విత్తనాన్ని దేవుడు ఎలా వృద్ధిచేస్తున్నాడో చూసినప్పుడు బైబిలు అధ్యయనం నిర్వహించడంలో మన ఆనందం రెట్టింపు అవుతుంది. (1 కొరిం. 3:​6, 9) పయినీరుగా సేవచేస్తున్న ఏమీ ఇలా చెప్పింది: “బైబిలు విద్యార్థి ప్రగతి సాధించడాన్ని మీరు చూసినప్పుడు ఆ వ్యక్తికి అద్భుతమైన బహుమానాన్ని ఇవ్వడానికి యెహోవా మిమ్మల్ని ఉపయోగిస్తున్నందుకు అంటే ఆయనను తెలుసుకొని నిత్యజీవాన్ని పొందే అవకాశాన్ని ఆ వ్యక్తికి ఇవ్వగలుగుతున్నందుకు యెహోవాపట్ల మీకు ఎంతో కృతజ్ఞతాభావం కలుగుతుంది.”

21 బైబిలు అధ్యయనాలు ఆరంభించి, వాటిని నిర్వహించడానికి శాయశక్తులా కృషిచేసినప్పుడు మనం ప్రస్తుతం దేవుని సేవ గురించే ఆలోచించగలుగుతాం. అంతేకాక నాశనాన్ని తప్పించుకొని నూతనలోకంలో ప్రవేశిస్తామనే మన నిరీక్షణా బలపడుతుంది. యెహోవా సహాయంతో మన సందేశాన్ని వినేవారు కూడ రక్షించబడేందుకు సహాయం చేయగలుగుతాం. (1 తిమోతి 4:⁠16 చదవండి.) దానివల్ల మనం ఎంత ఆనందిస్తాం!

మీకు జ్ఞాపకమున్నాయా?

• ఎలాంటి సవాళ్లవల్ల కొందరు బైబిలు అధ్యయనాలు నిర్వహించలేకపోతున్నారు?

• మన ప్రాంతంలో మతమంటే ఇష్టంలేనివారు చాలామంది ఉంటే ఏమి చేయవచ్చు?

• బైబిలు అధ్యయనాలు నిర్వహించడంవల్ల మనం ఎలాంటి ఆశీర్వాదాలను పొందుతాం?

[అధ్యయన ప్రశ్నలు]

1-3. (ఎ) బైబిలు అధ్యయనాలను నిర్వహించే అవకాశం దొరికినప్పుడు చాలామందికి ఏమనిపిస్తుంది? (బి) మనం ఏ ప్రశ్నల గురించి చర్చిస్తాం?

4, 5. (ఎ) ప్రపంచంలోని కొన్ని దేశాల్లో చాలామంది సువార్తకు ఎలా స్పందిస్తున్నారు? (బి) మరికొన్ని ప్రాంతాల్లో ప్రచారకులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు?

6. కొంతమందికి ఎలాంటి పరిమితులు ఉండవచ్చు?

7. యేసు పరిచర్యలో పాల్గొనడానికి కారణమేమిటి?

8. (ఎ) మనం దేని గురించి ఆలోచించడం మంచిది? (బి) ఒక బైబిలు విద్యార్థి చెప్పిన మాటల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

9. యేసు దేని గురించి ఆలోచించాడు, మనం ఆయనను ఎలా అనుకరించవచ్చు?

10, 11. పరిచర్యలో ఆనందాన్ని కాపాడుకోవడానికి మీరు ఏమి చేయవచ్చు?

12. మన ప్రాంతంలో మతమంటే ఇష్టంలేనివారు చాలామంది ఉంటే మనం ఏమి చేయవచ్చు?

13, 14. శిష్యులను చేసే పనిలో మనం మరింత ఆనందాన్ని ఎలా పొందవచ్చు?

15, 16. (ఎ) శిష్యులను చేసే పనిలో సంఘ సభ్యులందరి పాత్ర ఉందని ఎందుకు చెప్పవచ్చు? (బి) ఆ విషయంలో వృద్ధులు ఎలా తోడ్పడతారు?

17. బైబిలు అధ్యయనాన్ని నిర్వహించే సామర్థ్యం మనకు లేదని అనిపిస్తే ఏమి చేయవచ్చు?

18. శిష్యులను చేసే పనిలో విఫలమైపోతామేమోననే భయాన్ని మనమెలా అధిగమించవచ్చు?

19-21. (ఎ) బైబిలు అధ్యయనాలు నిర్వహించడంవల్ల మనం ఏ ప్రయోజనాలు పొందుతాం? (బి) ప్రకటనా పనిలో పాల్గొనేవారందరిని యెహోవా ఎలా ఎంచుతాడు?

[9వ పేజీలోని చిత్రాలు]

యథార్థహృదయులను కనుగొనేలా మీరు పరిచర్యలో వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారా?