కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలు—II

ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలు—II

యెహోవా వాక్యము సజీవమైనది

ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలు​—⁠II

యెహోవా దేవుణ్ణి ఆరాధించేవారికీ ఆరాధించనివారికీ ఏమి జరగనుంది? సాతానూ అతని దయ్యాల గతి ఏమిటి? క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో విధేయులైన మానవులు ఏ ఆశీర్వాదాలను అనుభవిస్తారు? ఈ ప్రశ్నలకూ మరితర ప్రాముఖ్యమైన ప్రశ్నలకూ జవాబులు ప్రకటన 13:1–22:21లో ఉన్నాయి. * సా.శ. మొదటి శతాబ్దపు చివర్లో అపొస్తలుడైన యోహాను పొందిన 16 దర్శనాల్లో చివరి 9 దర్శనాలు ఈ అధ్యాయాల్లో ఉన్నాయి.

“ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు” అని యోహాను రాశాడు. (ప్రక. 1:3; 22:⁠7) ప్రకటన గ్రంథాన్ని చదివి, దాన్నుండి నేర్చుకున్నవాటి ప్రకారంగా నడిస్తే, అవసరమైన మార్పులు చేసుకొనేందుకు చర్య తీసుకునేలా అది మన హృదయాల్ని ప్రోత్సహిస్తుంది, దేవుని మీద ఆయన కుమారుడైన యేసుక్రీస్తుమీద మన విశ్వాసాన్ని పెంచుతుంది, భవిష్యత్తు గురించిన మన నిరీక్షణనూ బలపరుస్తుంది. *హెబ్రీ. 4:12.

దేవుని కోపముతో నిండిన ఏడు పాత్రలు కుమ్మరించబడ్డాయి

(ప్రక. 13:1–16:21)

‘జనములు కోపగించినందుకు నీకు [దేవునికి] కోపము వచ్చెను. భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నది’ అని ప్రకటన 11:18 చెబుతోంది. ఎనిమిదవ దర్శనం దేవునికి కోపం రావడానికిగల కారణాన్ని తెలియజేస్తూ, “పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము” చేసే పనిని వివరిస్తోంది.​—⁠ప్రక. 13:⁠1.

యోహాను తొమ్మిదవ దర్శనంలో ‘గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండడాన్నీ,’ ఆయనతోకూడ ‘నూట నలువది నాలుగు వేలమంది ఉండడాన్నీ’ చూశాడు. వారు “మనుష్యులలోనుండి కొనబడినవారు.” (ప్రక. 14:​1, 4) ఆ తర్వాత దేవదూతల ప్రకటనలు వెలువడ్డాయి. తర్వాతి దర్శనంలో యోహాను, “ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న యేడుగురు దూత[లను]” చూశాడు. సాతాను లోకంలోని వివిధ భాగాలమీద “దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను” కుమ్మరించమని యెహోవాయే స్వయంగా ఈ దూతలకు ఆజ్ఞాపించాడు. ఆ పాత్రల్లో దేవుడు అమలు చేయబోయే తీర్పులకు సంబంధించిన ప్రకటనలు, హెచ్చరికలు ఉన్నాయి. (ప్రక. 15:1; 16:⁠1) ఈ రెండు దర్శనాలు మూడవ శ్రమ, ఏడవ బూర ఊదబడడానికి సంబంధించిన మరికొన్ని తీర్పులను వివరిస్తున్నాయి.​—⁠ప్రక. 11:​14, 15.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

13:8​​—⁠“గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథము” అంటే ఏమిటి? ఇది ఒక సూచనార్థక గ్రంథం. పరలోకంలో యేసుక్రీస్తుతోపాటు పరిపాలించేవారి పేర్లు మాత్రమే ఈ గ్రంథంలో ఉంటాయి. భూమ్మీద మిగిలివున్న పరలోక నిరీక్షణగల అభిషిక్త క్రైస్తవుల పేర్లు కూడా దానిలో ఉన్నాయి.

13:​11-​13​​—⁠రెండు కొమ్ములుగల క్రూరమృగం ఘటసర్పములా ఎలా ప్రవర్తిస్తుంది? అది ఎలా ఆకాశమునుండి అగ్ని దిగివచ్చేలా చేస్తుంది? రెండు కొమ్ములుగల క్రూరమృగమైన ఆంగ్లో అమెరికన్‌ ప్రపంచాధిపత్యం తన అధికారానికి లోబడేలా ప్రజలను బలవంతపెట్టడానికి బెదిరింపులకు, ఒత్తిళ్లకు, హింసకు పాల్పడడం ద్వారా ఘటసర్పంలా మాట్లాడుతుంది. అది ఆకాశం నుండి అగ్ని దిగివచ్చేలా చేస్తుంది అంటే, 20వ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల్లో దుష్టశక్తులను ఓడించాననీ కమ్యూనిజంపై విజయం సాధించాననీ చెప్పుకోవడం ద్వారా అది నిజమైన ప్రవక్తనన్నట్లే నటిస్తుంది.

16:17​​—⁠ఏ “వాయుమండలము” మీద ఏడవ పాత్ర కుమ్మరింపబడింది? “వాయుమండలము [‘వాయువు,’ NW]” “అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి [ఆలోచనలకు]” అంటే సాతాను తలంపుకు సూచనగా ఉంది. సాతాను దుష్ట విధానమంతా ఈ విష వాయువును పీలుస్తుంది.​—⁠ఎఫె. 2:⁠2.

మనకు పాఠాలు:

13:​1-4, 18. మానవ ప్రభుత్వాల్ని సూచించే “క్రూరమృగము”, “సముద్రములోనుండి” పైకి వస్తుంది అంటే అల్లకల్లోలమైన జనముల మధ్య నుండి వస్తుంది. (యెష. 17:​12, 13; దాని. 7:​2-8, 17) సాతాను ఏర్పరచి, అధికారాన్నిచ్చిన ఈ మృగానికి 666 అనే సంఖ్య ఉంది. అది ఎంతో అసంపూర్ణమైనదని ఆ సంఖ్య సూచిస్తుంది. ఈ మృగం ఏమిటో తెలుసుకున్నప్పుడు సామాన్య ప్రజానికంలా అభిమానంతో దాన్ని వెంబడించకుండా లేక దాన్ని ఆరాధించకుండా ఉండగలుగుతాం.​—⁠యోహా. 12:31; 15:⁠19.

13:​16, 17. ‘క్రయ విక్రయాల’ వంటి రోజువారీ పనుల్లో మనకు కష్టాలు ఎదురైనా, క్రూరమృగం మన జీవితాలను లోబరుచుకోవడానికి చేసే ఒత్తిడికి తలొగ్గకుండా ఉండేందుకు జాగ్రత్తపడాలి. ‘క్రూరమృగపు ముద్రను చేతిమీదనైనా నొసటిమీదనైనా’ వేయించుకుంటే మనం చేసే పనులను లేదా మన ఆలోచనలను నియంత్రించేందుకు క్రూరమృగాన్ని అనుమతించినట్లౌతుంది.

14:​6, 7. దేవుని రాజ్యం స్థాపించబడినదన్న సువార్తను అత్యవసర భావంతో ప్రకటించాలని దేవదూతల ప్రకటనల నుండి మనం నేర్చుకుంటాం. యెహోవాపట్ల సరైన భయాన్ని పెంచుకొని, ఆయనను మహిమపరచేందుకు మనం మన బైబిలు విద్యార్థులకు సహాయం చేయాలి.

14:​14-​20. “భూమి పైరు కోయబడినప్పుడు” అంటే రక్షింపబడేవాళ్లను సమకూర్చడం పూర్తయినప్పుడు దేవదూత “భూమిమీద ఉన్న ద్రాక్షపండ్ల[ను]” “దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో” పడవేస్తాడు. అప్పుడు ఆ ద్రాక్షలు, అంటే మానవజాతిని పరిపాలిస్తున్న అవినీతికరమైన సాతాను దృశ్యమైన ప్రభుత్వాలు, వాటి చెడు ఫలాలు అనే “గెలల”తోపాటు శాశ్వతంగా నాశనం చేయబడతాయి. భూమ్మీద ఉన్న ద్రాక్షపండ్లు మన జీవితాలను, ఆలోచనలను నియంత్రించకూడదనే కృత నిశ్చయంతో మనం ఉండాలి.

16:​13-​16. భూరాజులు దేవుని కోపమనే ఏడు పాత్రల గురించి ఆలోచించే బదులు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు దయ్యాలు చేసే ప్రచారాన్ని “అపవిత్రాత్మలు [‘అపవిత్రమైన ప్రేరేపిత మాటలు,’ NW]” సూచిస్తున్నాయి.​—⁠మత్త. 24:​42, 44.

16:21. ఈ విధానాంతం సమీపిస్తుండగా, సాతాను దుష్ట విధానం మీద మరింత తీవ్రమైన తీర్పులు యెహోవా నుండి వెలువడవచ్చు, బహుశా వాటిని ఘనీభవించిన నీళ్లతో లేదా వడగండ్లతో పోల్చవచ్చు. అయినా, మానవుల్లో చాలామంది దేవుణ్ణి దూషిస్తూనే ఉంటారు.

జయించిన రాజు ఏలుతున్నాడు

(ప్రక. 17:1–​22:⁠21)

సాతాను దుష్టలోకంలో ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను ఒక ఏహ్యమైన భాగం. 11వ దర్శనం ఆమెను “ఎఱ్ఱని మృగముమీద కూర్చు[న్న]” “మహావేశ్య”గా లేదా అనైతిక స్త్రీగా వర్ణిస్తోంది. ఆమెను మోస్తున్న మృగపు ‘పది కొమ్ములే’ ఆమెను పూర్తిగా నాశనం చేస్తాయి. (ప్రక. 17:​1, 3, 5, 16) ఆ తర్వాతి దర్శనంలో, ఆ వేశ్యను “మహాపట్ట[ణంతో]” పోలుస్తూ అది పడిపోయిందనీ, వెంటనే ‘దానిని విడిచి రావాలని’ దేవుని ప్రజలకు ప్రకటన చేయబడింది. ఆ మహాపట్టణం కూలిపోవడాన్ని చూసి అనేకులు విలపిస్తారు. కానీ పరలోకంలో ‘గొఱ్ఱెపిల్ల వివాహం’ జరుగుతుంది కాబట్టి అక్కడ సంతోషం నెలకొని ఉంటుంది. (ప్రక. 18:​4, 9, 10, 15-19; 19:​6, 7) 13వ దర్శనం, “తెల్లని గుఱ్ఱం” మీద కూర్చున్న వ్యక్తి జనములతో యుద్ధం చేయడానికి బయలు దేరాడు అని వర్ణిస్తోంది. ఆయన సాతాను దుష్ట లోకాన్ని నాశనం చేస్తాడు.​—⁠ప్రక. 19:​11-16.

అయితే, ‘ఆదిసర్పమైన అపవాదియగు సాతానుకు’ ఏమి జరుగుతుంది? అతడు ఎప్పుడు ‘అగ్ని గుండములో పడవేయబడతాడు’? 14వ దర్శనంలో అనేక ఇతర విషయాలతోపాటు ఇది కూడా వివరించబడింది. (ప్రక. 20:​2, 10) చివరి రెండు దర్శనాలు, వెయ్యేండ్ల పరిపాలనలో జీవితం ఎలా ఉంటుందో క్లుప్తంగా చెబుతున్నాయి. “ప్రకటన” ముగుస్తుండగా యోహాను ‘రాజవీధిమధ్య ప్రవహిస్తున్న జీవజలముల నదిని’ చూశాడు. అంతేకాక “దప్పిగొనిన వాని[కి]” ఒక అద్భుతమైన ఆహ్వానం ఇవ్వబడింది.​—⁠ప్రక. 1:1; 22:​1, 2, 17.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

17:16; 18:​9, 10​—⁠తామే నాశనం చేసిన దాన్ని చూసి “భూరాజులు” ఎందుకు విలపిస్తారు? స్వార్థంతోనే వారలా విలపిస్తారు. మహాబబులోనును నాశనం చేసిన తర్వాత అది తమకు గతంలో ఎంతగా ఉపయోగపడిందో భూరాజులు గుర్తిస్తారు. వారు అన్యాయాలు చేసినా అవి మతపరంగా తప్పుకావన్నట్లు ప్రజలను మభ్యపెట్టింది. యౌవనస్థులను యుద్ధంలో భర్తీ చేయడానికి కూడ అది వారికి సహాయం చేసింది. అంతేకాక, ప్రజలను తన అధీనంలో ఉంచుకోవడంలో కూడ అది ప్రముఖ పాత్ర వహించింది.

19:12​—⁠వెల్లడిచేయబడని పేరు యేసుకు తప్ప మరింకెవ్వరికీ తెలియదని ఎలా చెప్పవచ్చు? యెషయా 9:6లో ప్రభువు దినంలో యేసు కలిగివుండే స్థానం గురించి, పోషించే కొన్ని ప్రత్యేకమైన పాత్రల గురించి తెలియజేయబడింది. అలాంటి ఆధిక్యతలను ఆ పేరు సూచిస్తుండొచ్చు. ఆయనకు ఇవ్వబడిన ఆధిక్యతలు ప్రత్యేకమైనవి, అలాంటి ఉన్నత స్థానంలో ఉండడం అంటే ఏమిటో ఆయన మాత్రమే అర్థం చేసుకోగలడు కాబట్టి ఈ పేరు ఆయనకు తప్ప మరింకెవ్వరికీ తెలియదు. అయితే, ఈ ఆధిక్యతల్లో కొన్నింటిని ఆయన తన పెండ్లి కుమార్తె తరగతి వారితో పంచుకోవడం ద్వారా తన ‘క్రొత్త పేరు వారిమీద రాస్తాడు.’​—⁠ప్రక. 3:⁠12.

19:14​—⁠హార్‌మెగిద్దోనులో యేసును వెంబడించే సేనలు ఎవరు? దేవుని యుద్ధంలో యేసును వెంబడించే ‘పరలోక సేనల్లో’ దేవదూతలు, ఇప్పటికే పరలోక బహుమానాన్ని అందుకున్న అభిషిక్తులు ఉంటారు.​—⁠మత్త. 25:​31, 32; ప్రక. 2:​26, 27.

20:​11-​15​—⁠“జీవగ్రంథము”లో ఎవరి పేర్లు రాయబడ్డాయి? నిత్యజీవం పొందడానికి అర్హులైనవారందరి పేర్లు అంటే అభిషిక్త క్రైస్తవుల పేర్లు, గొప్పసమూహానికి చెందినవారి పేర్లు, ‘నీతిమంతుల పునరుత్థానంలో’ వచ్చే దేవుని నమ్మకమైన సేవకుల పేర్లు ఆ గ్రంథంలో రాయబడ్డాయి. (అపొ. 24:​14, 15; ప్రక. 2:10; 7:⁠9) ‘అనీతిమంతుల పునరుత్థానంలో’ వచ్చేవారు వెయ్యేండ్ల కాలంలో విప్పబడే “గ్రంథములయందు వ్రాయబడిన” నిర్దేశాలకు అనుగుణంగా ప్రవర్తిస్తేనే వారి పేర్లు కూడ “జీవగ్రంథములో” రాయబడతాయి. అయితే, ఆ పేర్లు అక్కడ శాశ్వతకాలం ఉంటాయని ఏమీలేదు. అభిషిక్తులు మరణంవరకు తమ యథార్థతను కాపాడుకుంటేనే వారి పేర్లు శాశ్వతకాలం ఉంటాయి. (ప్రక. 3:⁠5) భూనిరీక్షణను పొందేవారు, వెయ్యేండ్ల పరిపాలనాంతంలో జరిగే చివరి పరీక్షలో నెగ్గితేనే వారి పేర్లూ తుడిచిపెట్టబడకుండా ఉంటాయి.​—⁠ప్రక. 20:​7, 8.

మనకు పాఠాలు:

17:​3, 5, 7, 16. ‘స్త్రీని గురించిన, దాని మోయుచున్న [ఎర్రని] క్రూరమృగమును గురించిన మర్మము’ అర్థంచేసుకోవడానికి “పైనుండివచ్చు జ్ఞానము” మనకు సహాయం చేస్తుంది. (యాకో. 3:17) ఈ సూచనార్థక క్రూరమృగం నానాజాతి సమితిగా ప్రారంభమై, ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిగా తిరిగి ప్రాణం పోసుకుంది. ఈ మర్మాన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం దేవుని రాజ్యం గురించిన సువార్తను, యెహోవా తీర్పు దినాన్ని ఉత్సాహంగా ప్రకటించడానికి ప్రోత్సహించబడవద్దా?

21:​1-6. దేవుని రాజ్య పరిపాలనలో వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలన్నీ తప్పక నేరవేరతాయనే పూర్తి నమ్మకంతో మనం ఉండొచ్చు. ఎందుకు? ఎందుకంటే ఆ ఆశీర్వాదాలు “సమాప్తమైనవి” అని చెప్పబడింది.

22:​1, 17. “జీవజలముల నది,” విధేయులైన మానవులను పాప మరణాల నుండి పునరుద్ధరించేందుకు యెహోవా చేసిన ఏర్పాట్లను సూచిస్తోంది. ఈ జలములో కొంతభాగం ఇప్పటికే అందుబాటులో ఉంది. వచ్చి ‘జీవజలమును ఉచితముగా పుచ్చుకోమన్న’ ఆహ్వానాన్ని కృతజ్ఞతతో అంగీకరించి దాన్ని ఇతరులకూ అందిద్దాం.

[అధస్సూచీలు]

^ పేరా 3 ప్రకటన 1:1–12:17 వరకున్న వచనాల్లోని ముఖ్యాంశాల కోసం కావలికోట జనవరి 15, 2009 సంచికలోని “ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలు​​—⁠I” చూడండి.

^ పేరా 4 వచనాలవారిగా ప్రకటన గ్రంథాన్ని పరిశీలించడానికి ప్రకటన​​—⁠దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకాన్ని చూడండి.

[5వ పేజీలోని చిత్రం]

దేవుని రాజ్య పరిపాలనలో విధేయులైన మానవులు ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలను అనుభవిస్తారు!