కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు చెప్పింది చేస్తూ మీ మనస్తత్వాన్ని మెరుగుపర్చుకోండి

యేసు చెప్పింది చేస్తూ మీ మనస్తత్వాన్ని మెరుగుపర్చుకోండి

యేసు చెప్పింది చేస్తూ మీ మనస్తత్వాన్ని మెరుగుపర్చుకోండి

‘దేవుడు పంపినవాడు దేవుని మాటలే పలుకుతాడు.’​—⁠యోహా. 3:​33, 34.

ఇప్పుడున్న అతి పెద్ద వజ్రాల్లో ఒకటి స్టార్‌ ఆఫ్‌ ఆఫ్రికా. అది 530 క్యారెట్ల వజ్రం. అది నిజంగానే చాలా విలువైనది! అయితే, యేసు తన కొండమీది ప్రసంగంలో దానికన్నా ఎంతో విలువైన విషయాలు చెప్పాడు. అవి నిజంగా వజ్రాల్లాంటివే, ఎందుకంటే యేసు యెహోవా దేవుని మాటల్నే బోధించాడు. అందుకే, యేసు గురించి బైబిలు ఇలా చెబుతుంది: ‘దేవుడు పంపినవాడు దేవుని మాటలే పలుకును.’​—⁠యోహా. 3:​34-36.

2 యేసు ఆ ప్రసంగం ఇవ్వడానికి అరగంట కూడా పట్టివుండదు. అయినా ఆ ప్రసంగంలో 21 సార్లు 8 హెబ్రీ పుస్తకాల్లోని లేఖనాలను ప్రస్తావించాడు. కాబట్టి ఆయన “దేవుని మాటలే” చెప్పాడనడంలో సందేహం లేదు. దేవుని ప్రియకుమారుడు ఇచ్చిన అద్భుతమైన ఆ ప్రసంగంలోని కొన్ని అమూల్యమైన విషయాలను మన జీవితాల్లో ఎలా పాటించవచ్చో ఇప్పుడు చూద్దాం.

“మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము”

3 క్రైస్తవులమైన మనం దేవుడిచ్చే పరిశుద్ధాత్మ సహాయంతో సంతోషం, సమాధానం లాంటి గుణాలను అలవర్చుకుంటాం కాబట్టి సంతోషంగా, సమాధానపరులముగా ఉంటాం. (గల. 5:​22, 23) తన శిష్యులు సంతోషాన్ని, మనశ్శాంతిని పోగొట్టుకోవడం యేసుకు ఇష్టంలేదు. అందుకే ఆయన, మనసులో కోపాన్ని ఉంచుకుంటే ప్రాణానికే ముప్పు వస్తుందని హెచ్చరించాడు. (మత్తయి 5:​21, 22 చదవండి.) తర్వాత ఆయన, “నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము” అని చెప్పాడు.​—⁠మత్త. 5:​23, 24.

4 యేసు ఇక్కడ యెరూషలేము దేవాలయంలో అర్పించే అన్ని రకాల ‘అర్పణల’ గురించి మాట్లాడాడు. ఉదాహరణకు, అప్పట్లో ప్రజలు యెహోవా ఆరాధనలో భాగంగా జంతు బలులను అర్పించేవారు కాబట్టి అవి చాలా ప్రాముఖ్యమైనవి. అయితే యేసు అంతకన్నా ప్రాముఖ్యమైన విషయం గురించి అంటే దేవునికి అర్పణలు అర్పించే ముందు మనవల్ల నొచ్చుకున్న సహోదరునితో సమాధానపడడం గురించి మాట్లాడాడు.

5 మరి యేసు చెప్పినదాన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ఇతరులతో మన ప్రవర్తన సరిగా లేకపోతే మనం యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగివుండలేం. (1 యోహా. 4:20) పూర్వం, తమ తోటివారితో సరిగ్గా ప్రవర్తించనివారి అర్పణలకు దేవుడు విలువిచ్చేవాడు కాదు.​—⁠మీకా 6:​6-8 చదవండి.

మనం వినయం చూపించాలి

6 వినయం ఉంటేనే మనవల్ల నొచ్చుకున్న సహోదరునితో సమాధానపడగలం. వినయస్థులు, ఫలానిది చేసే హక్కు తమకుందని అనుకుంటూ తోటి విశ్వాసులతో వాదులాటకు దిగరు, గొడవలు పెట్టుకోరు. అలా చేస్తే సహోదరుల మధ్య సత్సంబంధాలుండవు. పూర్వం కొరింథు సంఘంలో కూడా సహోదురుల మధ్య అలాంటి పరిస్థితే నెలకొంది. దాని గురించి మాట్లాడుతూ అపొస్తలుడైన పౌలు ఆలోచింపజేసే ఈ మాటలన్నాడు: “ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా?”​—⁠1 కొరిం. 6:⁠7.

7 తప్పంతా అవతలివాళ్లదేనని మనం చేసింది సరైందని నిరూపించుకోవడానికే సహోదరుని దగ్గరకు వెళ్లాలని యేసు చెప్పలేదు. మన మధ్య తిరిగి సత్సంబంధాలు ఏర్పడాలనే ఉద్దేశంతోనే మనమక్కడకి వెళ్లాలి. సమాధానపడాలంటే మనం దాపరికం లేకుండా మనసువిప్పి మాట్లాడాలి. వాళ్ల మనసు నొచ్చుకుందనే విషయం మనం ఒప్పుకుంటున్నామని చెప్పాలి. మన పొరబాటు ఏమైనా ఉంటే క్షమించమని వినయంగా అడగాలి.

“నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల”

8 యేసు కొండమీది ప్రసంగంలో నైతిక విషయాలకు సంబంధించిన చక్కని సలహాలనిచ్చాడు. అపరిపూర్ణమైన మన శరీర అవయవాలు మనతో పాపం చేయించే ప్రమాదం ఉందని ఆయనకు తెలుసు. అందుకే యేసు, “నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో [‘గెహెన్నాలో,’ NW] పడవేయబడకుండ నీ అవయములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో [‘గెహెన్నాలో,’ NW] పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా” అని అన్నాడు.​—⁠మత్త. 5:​29, 30.

9 ఇక్కడ యేసు “కన్ను” అన్నప్పుడు దేన్నైనా తదేకంగా చూడడం గురించి మాట్లాడుతున్నాడు. అలాగే, “చెయ్యి” మనం చేసే పనులను సూచిస్తుంది. మనం జాగ్రత్తగా ఉండకపోతే అవి మనతో ‘అభ్యంతరకరమైన’ పనులు చేయిస్తాయి, మనల్ని దేవునితో నడవకుండా చేస్తాయి. (ఆది. 5:22; 6:⁠9) కన్ను లేదా చెయ్యి తీసివేయడం ఎంత కఠినమో మనకు తెలుసు. యెహోవాకు ఇష్టంలేని పనులు చేయాలనిపించినప్పుడు మనం అంత కఠినమైన చర్యలు తీసుకోవాలి.

10 మన కళ్ళు తదేకంగా చెడును చూడకుండా ఎలా అదుపుచేయగలం? “నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?” అని దైవభక్తిగల యోబు అన్నాడు. (యోబు 31:⁠1) యోబు వివాహితుడు. ఆయన నైతిక విషయాల్లో దేవుడు పెట్టిన నియమాలను మీరకూడదని తీర్మానించుకున్నాడు. మనం వివాహితులమైనా, కాకపోయినా మనం కూడా యోబులాగే ఉండాలి. లైంగిక విషయాల్లో పాపం చేయకుండా ఉండాలంటే మనం దేవుని పరిశుద్ధాత్మ నిర్దేశానుసారం నడుచుకోవాలి. అప్పుడు దేవుణ్ణి ప్రేమించే మనం పరిశుద్ధాత్మ సహాయంతో ఆశానిగ్రహాన్ని అలవర్చుకుని చెడుకు దూరంగా ఉంటాం.​—⁠గల. 5:​22-25.

11 లైంగిక విషయాల్లో పాపం చేయకుండా ఉండాలంటే మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘పుస్తకాల్లో, టీవీలో, ఇంటర్నెట్‌లో కనిపించే చెడు దృశ్యాలు, సమాచారం మీద నేను కోరిక పెంచుకుంటున్నానా?’ “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును” అని శిష్యుడైన యాకోబు చెప్పిన మాటలను కూడా మనం గుర్తుంచుకుందాం. (యాకో. 1:​14, 15) నిజానికి, దేవునికి సమర్పించుకున్న వారెవరైనా అవతలి వ్యక్తిని చెడు కోరికతో తదేకంగా ‘చూస్తూ’ ఉంటే, వారు తమ కళ్ళను పెరికిపడేసేంత ఖచ్చితమైన, కఠినమైన మార్పులు చేసుకోవాలి.​—⁠మత్తయి 5:​27, 28 చదవండి.

12 మనం చేతులతో చెడు పనులు చేస్తే దేవుని నైతిక ప్రమాణాలను మీరినట్లవుతుంది. కాబట్టి మనం నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండాలని తీర్మానించుకోవాలి. “భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహరాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి” అని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని మనం పాటించాలి. (కొలొ. 3:⁠5) ‘చంపివేయాలి’ అన్న పదం, చెడు కోరికలను తీసివేసుకోవడానికి మనం ఎంతటి కఠినమైన చర్యలు తీసుకోవాలో చూపిస్తుంది.

13 తన ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఒక వ్యక్తి కాలో చెయ్యో తీయించుకోవడానికైనా వెనుకాడడు. మనం చెడుగా ఆలోచిస్తే, చెడ్డ పనులు చేస్తే ఆధ్యాత్మికంగా మరణించే పరిస్థితి వస్తుంది. అలా జరగకూడదంటే మనం కూడా అలాంటి కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యం. మన ఆలోచనలు సరిగ్గావుండి, నైతిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో మనం పవిత్రంగా ఉంటేనే గెహెన్నాలో నిత్యనాశనాన్ని తప్పించుకోగలం.

14 మనకు ఆదాము నుండి పాపం, అపరిపూర్ణత వచ్చాయి కాబట్టి నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండాలంటే కృషి అవసరం. “ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను” అని పౌలు చెప్పాడు. (1 కొరిం. 9:27) కాబట్టి నైతిక విషయాల గురించి యేసు ఇచ్చిన ఉపదేశాన్ని మన జీవితాల్లో పాటిస్తూ ఉండాలని తీర్మానించుకుందాం. ఆయన మనకోసం ఇచ్చిన విమోచనా క్రయధనంపట్ల మనకు గౌరవం లేదని చూపించే పనులు ఎప్పటికీ చేయకుండా ఉందాం.​—⁠మత్త. 20:28; హెబ్రీ. 6:​4-6.

‘ఇవ్వడం’ అలవాటుచేసుకోండి

15 యేసు చెప్పింది చదివినప్పుడు, ఆయన గొప్ప మాదిరిని చూసినప్పుడు మనకు కూడా ఆయనలాగే ఇవ్వాలనిపిస్తుంది. ఆయన అపరిపూర్ణ మనుష్యుల కోసం ఎంతో త్యాగంచేసి ఈ భూమ్మీదకు వచ్చాడు. (2 కొరింథీయులు 8:9 చదవండి.) కొందరు ఆయనతోటి రాజ్య వారసులుగా పరలోకానికి వెళ్లి ధనవంతులయ్యేలా ఆయన పాపుల కోసం మనిషిగా పుట్టి తన ప్రాణాన్ని ఇవ్వడానికి పరలోకంలో తనకున్న గొప్ప స్థానాన్ని వదులుకున్నాడు. (రోమా. 8:​16, 17) అంతేకాదు, ఉదారంగా ఇవ్వాలని ప్రోత్సహిస్తూ యేసు ఇలా అన్నాడు:

16“ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును.” (లూకా 6:38) అప్పట్లో ప్రజలు మామూలుగా వేసుకునే బట్టలు కాకుండా పైన మరో పొడవాటి వస్త్రాన్ని వేసుకునేవారు. నడుముకు దట్టీ కట్టుకునేవారు. అవసరమైనప్పుడు ఆ వస్త్రాన్నే ఒక చెంగులా పట్టుకుని దానిలో ధాన్యం తీసుకెళ్లేవారు. అమ్మేవాళ్లు ఆ చెంగులోనే ధాన్యాన్ని పోసేవారు. ఇక్కడ యేసు ‘ఒడిలో కొలవడం’ అని అన్నప్పుడు దాని గురించే మాట్లాడాడు. అవసరంలో ఉన్నవారికి అప్పటికప్పుడు మనకు చేతనైనంత సహాయం చేస్తే, బహుశా మనకు అవసరం వచ్చినప్పుడు ఇతరులు కూడా అలాగే సహాయం చేసే అవకాశముంటుంది.​—⁠ప్రసం. 11:⁠2.

17 సంతోషంగా ఇచ్చేవారిని యెహోవా ప్రేమిస్తాడు, వారికి ప్రతిఫలం కూడా ఇస్తాడు. సంతోషంగా ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. యేసుక్రీస్తుపై “విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు” ఆయనను యెహోవా మనకోసం పంపించాడు. (యోహా. 3:16) “సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును . . . సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” అని పౌలు రాశాడు. (2 కొరిం. 9:​6, 7) సత్యారాధన కోసం మన సమయాన్ని, శక్తిని, డబ్బును వెచ్చిస్తే మనం సంతోషాన్ని, ఆశీర్వాదాలను పొందుతాం.​—⁠సామెతలు 19:17; లూకా 16:9 చదవండి.

“ముందర బూర ఊదింపవద్దు”

18“మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతికార్యము చేయకుండ జాగ్రతపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు.” (మత్త. 6:⁠1) “నీతికార్యము” అన్నప్పుడు యేసు ఇక్కడ దేవునికి ఇష్టమైన విధంగా జీవించడం గురించి మాట్లాడుతున్నాడు. అంటే దానర్థం ఇతరుల ముందు మనమెప్పుడూ దేవునికిష్టమైన పనులు చేయకూడదని కాదు, ఎందుకంటే ఆయనే తన శిష్యులతో ‘మనుష్యుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి’ అని చెప్పాడు. (మత్త. 5:​14-16) కానీ, మనం చేసేదేదైనా స్టేజీపై నటుల్లా “మనుష్యులకు కనబడవలెనని,” ఇతరులు మెచ్చుకోవాలని చేస్తే మన పరలోక తండ్రి మనకు “ఫలము” ఇవ్వడు. మనకలాంటి ఉద్దేశాలుంటే దేవునితో దగ్గరి సంబంధాన్ని కలిగివుండలేం, దేవుని రాజ్యంలో నిత్య ఆశీర్వాదాలను పొందలేం.

19 మన మనసు మంచిదైతే యేసు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తాం: “నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” (మత్త. 6:⁠2) “ధర్మము” చేయడం అంటే అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం. (యెషయా 58:​6, 7 చదవండి.) యేసు, ఆయన అపొస్తలులు కలిసి పేదలకు సహాయం చేయడానికి డబ్బు దాచిపెట్టేవారు. (యోహా. 12:​5-8; 13:29) పేదవాళ్లకు “ధర్మము” చేస్తున్నప్పుడు ఎవ్వరూ ముందర బూర ఊదించుకోరు కాబట్టి “బూర ఊదింపవద్దు” అన్నప్పడు యేసు దాన్ని అతిశయోక్తిగా చెప్పాడని అర్థమౌతోంది. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు యూదా పరిసయ్యుల్లా అందరికీ చెప్పుకోం. వాళ్లు తాము చేసిన దానధర్మాల గురించి “సమాజమందిరములలోను వీధులలోను” గొప్పలు చెప్పుకునేవారు కాబట్టి యేసు వారిని వేషధారులు అని పిలిచాడు. వాళ్లు “తమ ఫలమును పొందియున్నారు.” ఎలాగంటే, అప్పట్లో ప్రజలు వాళ్లను పొగిడేవారు, సమాజమందిరంలో బహుశా వాళ్లకు ముందు వరుసలో ప్రఖ్యాత రబ్బీల పక్కన కూర్చునే అవకాశం దొరికివుంటుంది. అంతకుమించి వాళ్ళకు ఇంకేమీ దొరకదు ఎందుకంటే యెహోవా వాళ్ళకు ఏమీ ఇవ్వడు. (మత్త. 23:⁠6) కానీ క్రీస్తు శిష్యులు ఎలా ప్రవర్తించాలి? యేసు వాళ్లకూ, మనకూ ఇలా చెప్పాడు:

20“నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.” (మత్త. 6:​3, 4) సాధారణంగా మనం ఏ పని చేసినా రెండు చేతులతో చేస్తాం. కాబట్టి కుడి చెయ్యి చేసేది ఎడమ చేతికి తెలియకూడదంటే మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు మనకు బాగా దగ్గరివాళ్లకు కూడా చెప్పకూడదు.

21 మనం చేసిన సహాయం గురించి గొప్పలు చెప్పుకోకుండా ఉంటే చేసిన “ధర్మము” రహస్యంగా ఉంటుంది. అప్పుడు “రహస్యమందు చూచు” మన తండ్రి మనకు ప్రతిఫలమిస్తాడు. పరలోకంలో నివసించే మన తండ్రి “రహస్యమందు” ఉంటాడు అంటే మన కళ్లకు కనిపించడు. (యోహా. 1:18) “రహస్యమందు చూచు” యెహోవా మనల్ని ఎన్నోవిధాలుగా ఆశీర్వదించి మనకు ప్రతిఫలమిస్తాడు. వాటిలో కొన్ని ఏమిటంటే, మనం ఆయనకు దగ్గరయ్యేలా సహాయం చేస్తాడు, మన పాపాలను క్షమిస్తాడు, మనకు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తాడు. (సామె. 3:32; యోహా. 17:3; ఎఫె. 1:⁠7) మనుష్యుల పొగడ్తలకన్నా అవెంతో గొప్ప వరాలు!

ఆ గొప్ప బోధలు నిజంగా ఎంతో విలువైనవి!

22 నిజంగానే కొండమీది ప్రసంగంలో ఎన్నో ఆధ్యాత్మిక వజ్రాలున్నాయి. ఒక్కో వజ్రానికి ఎన్నో ముఖాలున్నట్లే ఆయన చెప్పిన ఒక్కో విషయం మనకెన్నో సందర్భాల్లో సహాయం చేస్తుంది. సమస్యలతో నిండిపోయిన ఈ లోకంలో కూడా మనం సంతోషంగా ఉండడానికి సహాయపడే విలువైన విషయాలు ఆయన చెప్పాడు. అవును, మనం వాటికి విలువిచ్చి, వాటికి తగ్గట్టు మనం ఆలోచించే తీరును, మన జీవన విధానాన్ని మార్చుకుంటే సంతోషంగా ఉంటాం.

23 యేసు మాటలను “విని” వాటి ప్రకారం “చేయు” ప్రతీఒక్కరూ ఆశీర్వదించబడతారు. (మత్తయి 7:​24, 25 చదవండి.) కాబట్టి యేసు ఉపదేశాన్ని మన జీవితాల్లో పాటించాలని తీర్మానించుకుందాం. యేసు కొండమీది ప్రసంగంలో చెప్పిన మరికొన్ని విషయాల గురించి మనం మూడో ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.

మీరెలా జవాబిస్తారు?

• మనవల్ల నొచ్చుకున్న సహోదరునితో తిరిగి సమాధానపడడం ఎందుకు ప్రాముఖ్యం?

• మన “కుడికన్ను” మనతో అభ్యంతరకరమైన పనులు చేయించకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు?

• ఏ ఉద్దేశంతో ఇతరులకు మనం సహాయం చెయ్యాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. కొండమీది ప్రసంగంలో యేసు చెప్పిన విషయాలను వేటితో పోల్చవచ్చు? ఆయన ‘దేవుని మాటలనే’ చెప్పాడని మనమెలా చెప్పగలం?

3. మనసులో కోపం ఉంచుకుంటే ఏమి జరుగుతుందో చెప్పిన తర్వాత యేసు ఇంకా ఏమి చెయ్యాలని చెప్పాడు?

4, 5. (ఎ) మత్తయి 5:​23, 24లో యేసు ఏ “అర్పణల” గురించి మాట్లాడాడు? (బి) మనవల్ల నొచ్చుకున్న సహోదరునితో సమాధానపడడం ఎందుకంత ప్రాముఖ్యం?

6, 7. మనవల్ల నొచ్చుకున్న ఒక సహోదరునితో సమాధానపడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనమెందుకు వినయంగా ఉండాలి?

8. మత్తయి 5:​29, 30లోని యేసు మాటలను క్లుప్తంగా చెప్పండి.

9. మన “కన్ను” లేదా “చెయ్యి” మనతో ‘అభ్యంతరకరమైన’ పనులు ఎలా చేయిస్తాయి?

10, 11. మనం లైంగిక విషయాల్లో పాపం చేయకుండా ఎలా ఉండొచ్చు?

12. పౌలు ఇచ్చిన ఏ ఉపదేశం మనలోని చెడు కోరికలను తీసివేసుకోవడానికి సహాయం చేస్తుంది?

13, 14. చెడు ఆలోచనలను, చెడు పనులను మానుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

15, 16. (ఎ) ఇచ్చే విషయంలో యేసు ఎలా ఆదర్శవంతంగా ఉన్నాడు? (బి) లూకా 6:38లోని యేసు మాటలకు అర్థమేమిటి?

17. ఇచ్చే విషయంలో యెహోవా ఎలా ఒక చక్కని మాదిరినుంచాడు? ఏమి చేస్తే మనం సంతోషాన్ని పొందుతాం?

18. మన పరలోక తండ్రి మనకు ఎప్పుడు “ఫలము” ఇవ్వడు?

19, 20. (ఎ) ‘ధర్మం’ చేసేటప్పుడు “బూర ఊదింపవద్దు” అని యేసు ఎందుకు చెప్పాడు? (బి) కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియకూడదంటే అర్థమేమిటి?

21. “రహస్యమందు చూచు” దేవుడు మనకెలా ప్రతిఫలమిస్తాడు?

22, 23. మనమెందుకు యేసు బోధలకు విలువివ్వాలి?

[11వ పేజీలోని చిత్రం]

మనవల్ల నొచ్చుకున్న తోటివిశ్వాసితో ‘సమాధానపడడం’ ఎంతో మంచిది

[12, 13వ పేజీలోని చిత్రాలు]

సంతోషంగా ఇచ్చేవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు