కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు చెప్పిన మాటలకు అనుగుణంగా మీరు ప్రార్థిస్తున్నారా?

యేసు చెప్పిన మాటలకు అనుగుణంగా మీరు ప్రార్థిస్తున్నారా?

యేసు చెప్పిన మాటలకు అనుగుణంగా మీరు ప్రార్థిస్తున్నారా?

“యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.” ​—⁠మత్త. 7:⁠28.

మనం దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు విని వాటికి అనుగుణంగా నడుచుకోవాలి. ఇతరుల్లా ఆయన మాట్లాడలేదు. అంతెందుకు, కొండమీది ప్రసంగంలో ఆయన బోధించిన తీరునుబట్టి ప్రజలు ఆశ్చర్యపోయారు!​—⁠మత్తయి 7:​28, 29 చదవండి.

2 అపరిపూర్ణ మానవ బోధలను ఉపయోగించి, విస్తారంగా మాట్లాడే శాస్త్రుల్లా యెహోవా దేవుని కుమారుడు బోధించలేదు. క్రీస్తు దేవుని మాటల్నే పలికాడు కాబట్టి, “అధికారముగల వానివలె” బోధించాడు. (యోహా. 12:50) యేసు కొండమీది ప్రసంగంలో తర్వాత చెప్పిన మాటలను పరిశీలించడంవల్ల మన ప్రార్థనలను ఎందుకు మార్చుకోవాలనిపిస్తుందో, అలా ఎందుకు మార్చుకోవాలో చూద్దాం.

వేషధారుల్లా ఎన్నడూ ప్రార్థించకండి

3 సత్యారాధనలో ప్రార్థనకు ఓ ప్రాముఖ్యమైన స్థానముంది, కాబట్టి మనం క్రమంగా యెహోవాకు ప్రార్థించాలి. అయితే కొండమీది ప్రసంగంలో యేసు చెప్పిన మాటలకు అనుగుణంగా మనం ప్రార్థించాలి. ఆయనిలా అన్నాడు: “మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారులవలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థనచేయుట వారికిష్టము; వారు తమ ఫలము [‘పూర్తిగా,’ NW] పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”​—⁠మత్త. 6:⁠5.

4 యేసు శిష్యులు ప్రార్థించేటప్పుడు వారు స్వనీతిపరులైన పరిసయ్యుల వంటి “వేషధారులను” అనుకరించకూడదు. ఆ పరిసయ్యులు ఇతరులకు కనిపించేలా భక్తిపరులమన్నట్లు నటించేవారు. (మత్త. 23:​13-32) వారికి “సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి” ప్రార్థించడం ఇష్టం. ఎందుకు? “మనుష్యులకు కనబడవలెనని” వారలా చేసేవారు. మొదటి శతాబ్దపు యూదులు వాడుక ప్రకారం దేవాలయంలో (దాదాపు ఉదయం తొమ్మిది గంటలకు, మధ్యాహ్నం మూడు గంటలకు) దహన బలులు అర్పించే సమయంలో సమాజంగా ప్రార్థించేవారు. చాలామంది యెరూషలేము నివాసులు దేవాలయ ఆవరణలోని ఆరాధకుల గుంపుతో కలిసి ప్రార్థించేవారు. నగరం వెలుపల నివసించే భక్తిపరులైన యూదులు సాధారణంగా రోజుకు రెండుసార్లు ‘సమాజ మందిరములలో నిలబడి’ ప్రార్థించేవారు.​—⁠లూకా 18:​11, 13 పోల్చండి.

5 పైన ప్రస్తావించబడిన ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఆలయ లేదా సమాజమందిర పరిసర ప్రాంతంలో చాలామంది ఉండరు. కాబట్టి, వారు ప్రార్థన జరుగుతున్న సమయాల్లో తాము ఉన్న ప్రాంతం నుండే ప్రార్థించే అవకాశముంది. కొంతమంది ఆ ప్రార్థనా సమయాల్లో “వీధుల మూలలలో” నిల్చొనేవారు. ఆ దారి గుండా వెళ్లే ‘మనుష్యులకు కనబడాలని’ వారలా చేసేవారు. వారు తమను మెచ్చుకోవాలని ఆ వేషధారులు “మాయవేషముగా దీర్ఘప్రార్థనలు” చేసేవారు. (లూకా 20:47) అలాంటి మనస్తత్వం మనకు ఉండకూడదు.

6 అలాంటి వేషధారులు ‘తమ ఫలమును పూర్తిగా పొందియున్నారు’ అని యేసు చెప్పాడు. వారు ఇతరుల నుండి గుర్తింపును, పొగడ్తను అధికంగా ఆశించారు. కాబట్టి, వారికి అవే దక్కుతాయి. పూర్తిగా వారుపొందే ఫలమదే, ఎందుకంటే వేషధారణతో వారు చేసే ప్రార్థనలకు యెహోవా జవాబివ్వడు. అయితే, ప్రార్థన గురించి యేసు ఇంకా చెప్పినట్లు, దేవుడు క్రీస్తు నిజ అనుచరుల ప్రార్థనలనే వింటాడు.

7“నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.” (మత్త. 6:⁠6) గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని ప్రార్థించమని యేసు చెప్పాడు కాబట్టి ఒక వ్యక్తి సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రార్థించకూడదని దానర్థం కాదు. ఇతరుల పొగడ్తల కోసం బహిరంగ ప్రార్థనలు చేయకూడదని దానర్థం. దేవుని ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ బహిరంగంగా ప్రార్థించే అవకాశం మనకు లభించినప్పుడు మనమీ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రార్థన గురించి యేసు చెప్పిన మరికొన్ని విషయాలను కూడా మనం పాటిద్దాం.

8“మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు.” (మత్త. 6:⁠7) ఇక్కడ, ప్రార్థనలో చెప్పినదానినే మళ్లీ మళ్లీ చెప్పకూడదనే విషయాన్ని యేసు చెప్పాడు. మనం హృదయపూర్వక విన్నపాల్ని, కృతజ్ఞతలను మళ్లీ మళ్లీ చెప్పకూడదని దానర్థం కాదు. తాను చనిపోయే ముందు రోజు రాత్రి గెత్సెమనే తోటలో యేసు, తన ప్రార్థనలో ‘పలికిన మాటలనే పలికాడు.’​—⁠మార్కు 14:​32-39.

9 పదాల్ని పదేపదే వల్లించే “అన్యజనుల” ప్రార్థనలను మనం అనుకరించకూడదు. వారు అనవసరమైన అనేక పదాలున్న ‘వ్యర్థమైన మాటలను’ కంఠస్థం చేసి, వాటినే మళ్లీ మళ్లీ వల్లిస్తారు. అబద్ధ దేవతకు “ఉదయము మొదలుకొని మధ్యాహానమువరకు​—⁠బయలా, మా ప్రార్థన వినమని” దాని ఆరాధకులు ఎంత వేడుకున్నా వారికి ఏ మేలూ జరగలేదు. (1 రాజు. 18:26) నేడు లక్షలాదిమంది తమ “మనవి వినబడునని” అనుకొని అనేక పదాలను పదేపదే వలిస్తూ ప్రార్థనలను చేస్తున్నారు. అయితే, అనేక “వ్యర్థమైన మాటలు” వల్లిస్తూ, ఎక్కువసేపు చేసే ప్రార్థనల్ని యెహోవా ఏ మాత్రం పట్టించుకోడని యేసు మాటలను బట్టి తెలుస్తుంది. యేసు ఇంకా ఇలా చెప్పాడు:

10“మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును.” (మత్త. 6:⁠8) చాలామంది యూదా మతనాయకులు ప్రార్థనలో అనేక పదాలను వల్లిస్తూ అన్యుల్లా ప్రార్థించేవారు. స్తుతి, కృతజ్ఞత, విన్నపాలతో చేసే హృదయపూర్వక ప్రార్థన సత్యారాధనలో ఒక ప్రాముఖ్యమైన భాగం. (ఫిలి. 4:⁠6) మన అవసరాలు దేవునికి తెలియాలంటే చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పడం అవసరమనుకొని పలికిన మాటల్నే పదేపదే వల్లించకూడదు. మనం ప్రార్థిస్తున్నప్పుడు ‘అడగక ముందే మనకు అక్కరగా ఉన్నవేవో తెలిసిన దేవునికి’ విన్నపం చేస్తున్నామనే విషయం మర్చిపోకూడదు.

11 దేవునికి ఇష్టంలేని ప్రార్థనల గురించి యేసు చెప్పిన మాటలు, పెద్ద పెద్ద మాటలతో వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రార్థిస్తే దేవుడు ముగ్ధుడు కాడనే విషయాన్ని మనకు గుర్తుచేయాలి. ఇతరులను ముగ్ధుల్ని చేసే విధంగా లేదా తాము “ఆమెన్‌” అనడానికి ఇంకా ఎంతసేపు పడుతుందా అని వారు అనుకునే విధంగా బహిరంగ ప్రార్థనలు చేయకూడదని కూడ మనం గ్రహించాలి. ప్రార్థనలో ప్రకటనలు చేయడం లేదా శ్రోతలను ఉపదేశించడం వంటివి కూడా కొండమీద ప్రసంగంలో యేసు చెప్పిన మాటలకు విరుద్ధం.

మనమెలా ప్రార్థించాలో యేసు బోధించాడు

12 ప్రార్థన చేసే అద్భుతమైన అవకాశాన్ని దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించడమే కాక, సరైన విధంగా ఎలా ప్రార్థించాలో కూడా యేసు తన శిష్యులకు నేర్పించాడు. (మత్తయి 6:​9-13 చదవండి.) పదేపదే వల్లించేందుకు ఈ మాదిరి ప్రార్థనను కంఠస్థం చేయకూడదు. దానిని మాదిరిగా తీసుకొని మనం ప్రార్థించాలి. ఉదాహరణకు, యేసు ఆరంభంలోనే “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అని చెప్పడం ద్వారా దేవునికి మొదటి స్థానమిచ్చాడు. (మత్త. 6:⁠9) యెహోవా భూమికి ఎంతో దూరానున్న ‘పరలోకంలో’ నివసించే మన సృష్టికర్త కాబట్టి ఆయనను మా తండ్రీ అని పిలవడం సరైనదే. (ద్వితీ. 32:6; 2 దిన. 6:21; అపొ. 17:​24, 28) మన తోటి విశ్వాసులకు కూడా దేవునితో దగ్గరి సంబంధం ఉందనే విషయాన్ని “మా” అనే బహువచనం మనకు గుర్తుచేయాలి. ఏదెను తోటలో తిరుగుబాటు జరిగినప్పటి నుండి తన నామంపై మోపబడిన నిందలను తొలగించి దాన్ని పరిశుద్ధపరచుకునేందుకు చర్య తీసుకోమని యెహోవాను విన్నవించుకోవడానికే మాదిరి ప్రార్థనలో యేసు “నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అనే వాక్యాన్ని ఉపయోగించాడు. ఆ ప్రార్థనకు జవాబుగా యెహోవా భూమ్మీదున్న దుష్టత్వాన్ని తొలగించి తననుతాను పరిశుద్ధపరచుకుంటాడు.​—⁠యెహె. 36:⁠23.

13“నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్త. 6:10) క్రీస్తు మరియు పునరుత్థానం చేయబడిన తన సహచరులైన “పరిశుద్ధుల” ఆధ్వర్యంలోని పరలోక మెస్సీయ ప్రభుత్వమే మాదిరి ప్రార్థనలోని దేవుని “రాజ్యము” అని మనం గుర్తుంచుకోవాలి. (దాని. 7:​13, 14, 18; యెష. 9:​6, 7) ఆ రాజ్యం “వచ్చుగాక” అని ప్రార్థించడం ద్వారా దైవపరిపాలనను వ్యతిరేకించే భూనివాసులందరిపై దేవుని రాజ్యం చర్యతీసుకోవాలని విన్నవించుకుంటాం. అది త్వరలోనే సంభవించి, భూవ్యాప్తంగా నీతి, శాంతి సౌభాగ్యాలతో కూడిన భూపరదైసు స్థాపించబడుతుంది. (కీర్త. 72:​1-15; దాని. 2:44; 2 పేతు. 3:13) పరలోకంలో నెరవేరుతున్న యెహోవా చిత్తం భూమ్మీద కూడా నెరవేరాలని అడగడం ద్వారా, ప్రాచీన కాలాల్లోలాగే నేడు కూడా దేవుడు తన వ్యతిరేకులను నిర్మూలించడంతోపాటు భూమిపట్ల తనకున్న ఉద్దేశాలను నెరవేర్చాలని విజ్ఞాపన చేస్తాం.​—⁠కీర్తన 83:​1, 2, 13-18.

14“మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.” (మత్త. 6:11; లూకా 11:⁠3) ఈ విన్నపం చేయడం ద్వారా మనకు “నేడు” కావాల్సిన ఆహారం ఇవ్వమని దేవుణ్ణి కోరతాం. మన అనుదిన అవసరాలను తీర్చే సామర్థ్యం దేవునికి ఉందనే విషయాన్ని మనం విశ్వసిస్తామని ఇది చూపిస్తుంది. ఇది, మనకు విస్తారంగా ఇవ్వమని చేసే విన్నపం కాదు. ఈ విన్నపం, “ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను” అని ఇశ్రాయేలీయులకు మన్నా విషయంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనకు గుర్తుచేయవచ్చు.​—⁠నిర్గ. 16:⁠4.

15 మాదిరి ప్రార్థనలోని తర్వాతి విన్నపం, మనం చేయాల్సిన ఒక విషయాన్ని తెలియజేస్తుంది. “మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము” అని యేసు చెప్పాడు. (మత్త. 6:12) ఇక్కడ “ఋణములు” అనే మాట ‘పాపములను’ సూచిస్తుందని లూకా సువార్త వివరిస్తోంది. (లూకా 11:⁠4) మనకు వ్యతిరేకంగా పాపం చేసినవారిని ‘క్షమించినప్పుడే’ యెహోవా మనల్ని క్షమిస్తాడని మనం ఆశించవచ్చు. (మత్తయి 6:​14, 15 చదవండి.) మనం అనేకసార్లు ఇతరులను క్షమించాలి.​—⁠ఎఫె. 4:32; కొలొ. 3:⁠13.

16“మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.” (మత్త. 6:13) యేసు మాదిరి ప్రార్థనలో పరస్పర సంబంధమున్న ఈ రెండు విన్నపాల్ని మనమెలా అర్థం చేసుకోవాలి? నిజమే, మనం పాపంచేసేలా యెహోవా మనల్ని శోధించడు. (యాకోబు 1:13 చదవండి.) ‘దుష్టుడైన’ సాతానే అసలైన “శోధకుడు.” (మత్త. 4:⁠3) అయితే దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తున్నాడు కాబట్టి ఆయనే వాటిని చేస్తున్నట్లు బైబిల్లో చెప్పబడింది. (రూతు 1:​20, 21; ప్రసం. 11:⁠5) కాబట్టి, ‘మమ్మును శోధనలోకి తేవద్దు’ అని ప్రార్థించడం ద్వారా, మనం దేవునికి అవిధేయులయ్యేందుకు శోధించబడినప్పుడు మనం దానికి లొంగిపోకుండా ఉండేందుకు సహాయం చేయమని యెహోవాను వేడుకుంటాం. చివరగా, “దుష్టునినుండి మమ్మును తప్పించుము” అని అడగడం ద్వారా మనపై విజయం సాధించేందుకు సాతానును అనుమతించవద్దని విన్నవించుకుంటాం. ‘సహించగలిగినదానికన్నా ఎక్కువగా దేవుడు మనల్ని శోధింపబడనియ్యడనే’ నమ్మకంతో మనం ఉండవచ్చు.​—⁠1 కొరింథీయులు 10:13 చదవండి.

‘అడుగుతూ, వెదుకుతూ, తట్టుతూ ఉండండి’

17 “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి” అని అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులను వేడుకున్నాడు. (రోమా. 12:12) యేసు కూడా అలాంటి ఆజ్ఞనే ఇచ్చాడు: ‘అడుగుతూ ఉండండి మీకియ్యబడును, వెదుకుతూ ఉండండి మీకు దొరకును, తట్టుతూ ఉండండి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.’ (మత్త. 7:​7, 8, NW) మనం దేవుని చిత్తానికి అనుగుణంగా దేనినైనా ‘అడుగుతూ’ ఉండవచ్చు. యేసు మాటలను సమర్థిస్తూ అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “ఆయనను [దేవునిని] బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.”​—⁠1 యోహా. 5:⁠14.

18 ‘అడుగుతూ, వెదుకుతూ ఉండండి’ అనే యేసు ఉపదేశాన్ని పాటించాలంటే మనం పట్టుదలతో హృదయపూర్వకంగా ప్రార్థించాలి. అంతేగాక, రాజ్యంలో ప్రవేశించి దానిలో ఆశీర్వాదాలు, ప్రయోజనాలు, ప్రతిఫలాలు పొందాలంటే మనం ‘తట్టుతూ ఉండాలి.’ కానీ, దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడని మనం నమ్మవచ్చా? యెహోవాకు విశ్వసనీయంగా ఉంటే మనం నమ్మవచ్చు, ఎందుకంటే “అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును” అని యేసు చెప్పాడు. యెహోవా సేవకులకు ఎదురైన అనేక అనుభవాలు దేవుడు నిజంగా “ప్రార్థన ఆలకించువాడు” అని రుజువు చేస్తున్నాయి.​—⁠కీర్త. 65:⁠2.

19 యేసు, తన పిల్లలకు మంచి ఈవులను ఇచ్చే ప్రేమగల తండ్రితో దేవుణ్ణి పోల్చాడు. యేసు కొండమీద ప్రసంగమిస్తున్నప్పుడు మీరు కూడా అక్కడ ఉండి ఆయన చెప్పిన ఈ మాటలను మీరు విన్నట్లు ఊహించుకోండి: “మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును.”​—⁠మత్త. 7:​9-11.

20 వారసత్వంగా వచ్చిన పాపం కారణంగా మానవ తండ్రి ఓ విధంగా ‘చెడ్డవాడైనప్పటికీ’ ఆయనకు తన పిల్లల పట్ల సహజంగానే ప్రేమ ఉంటుంది. ఆయన తన పిల్లలను మోసగించడు గానీ వారికి “మంచి యీవులను” ఇవ్వడానికి కృషి చేస్తాడు. అలాంటి వాత్సల్యంతోనే మన ప్రేమగల పరలోక తండ్రి తన పరిశుద్ధాత్మ వంటి “మంచి యీవులను” మనకు అనుగ్రహిస్తాడు. (లూకా 11:13) అది “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” దయచేసే యెహోవాకు ఇష్టమైన రీతిలో సేవ చేసేందుకు మనల్ని బలపరుస్తుంది.​—⁠యాకో. 1:⁠17.

యేసు బోధల నుండి ఎల్లప్పుడూ ప్రయోజనం పొందండి

21 కొండమీది ప్రసంగంలాంటిది చరిత్రలో మునుపెన్నడూ ఇవ్వబడలేదు. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు స్పష్టంగా వివరించబడిన ప్రసంగంగా అది పేరుగాంచింది. ఈ వరుస ఆర్టికల్స్‌లో వివరించబడినట్లుగా కొండమీది ప్రసంగంలోని ఉపదేశాన్ని అనుసరిస్తే మనమెంతో ప్రయోజనం పొందుతాం. యేసు మాటలు మన ప్రస్తుత జీవితాన్ని మెరుగుపర్చడమే కాక, సంతోషకరమైన భవిష్యత్తు విషయంలో నిరీక్షణనూ ఇస్తాయి.

22 ఈ ఆర్టికల్స్‌లో యేసు కొండమీది ప్రసంగంలోని అమూల్యమైన కొన్ని మాటలను మాత్రమే మనం పరిశీలించాం. ఆ ప్రసంగాన్ని విన్నవారు ‘ఆయన బోధకు ఆశ్చపడ్డారు’ అని అనడంలో వింతేమీ లేదు. (మత్త. 7:28) మహాగొప్ప బోధకుడైన యేసుక్రీస్తు బోధించిన అమూల్యమైన ఈ మాటలను, మరితర మాటలను మనం మన హృదయాల్లో, మనసుల్లో నింపుకున్నప్పుడు మనమూ వారిలాగే స్పందిస్తాం.

మీ జవాబులేమిటి?

• వేషధారణతో చేసే ప్రార్థనల గురించి యేసు ఏమి చెప్పాడు?

• మనం ప్రార్థిస్తున్నప్పుడు చెప్పిన మాటలనే మళ్లీ మళ్లీ ఎందుకు వల్లించకూడదు?

• యేసు నేర్పించిన మాదిరి ప్రార్థనలో ఏయే విన్నపాలున్నాయి?

• మనమెలా ‘అడుగుతూ, వెదుకుతూ, తట్టుతూ’ ఉండవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. యేసు బోధ విని ప్రజలు ఎందుకు ఆశ్చర్యపడ్డారు?

3. మత్తయి 6:5లో యేసు చెప్పిన మాటలను క్లుప్తంగా వివరించండి.

4-6. (ఎ) పరిసయ్యులు “సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి” ప్రార్థించడానికి ఎందుకు ఇష్టపడేవారు? (బి) అలాంటి వేషధారులు ఎలా ‘తమ ఫలమును పూర్తిగా పొందారు’?

7. “గదిలోకి వెళ్లి” ప్రార్థించమని ఇచ్చిన ఉపదేశానికి అర్థమేమిటి?

8. మత్తయి 6:7 ప్రకారం, మనం ఎలా ప్రార్థించకూడదు?

9, 10. మనం పలికిన మాటల్నే పదేపదే వల్లించకూడదంటే దానర్థమేమిటి?

11. బహిరంగంగా ప్రార్థించే అవకాశం మనకు లభించినప్పుడు మనమేమి గుర్తుంచుకోవాలి?

12. “నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అనే విన్నపానికున్న ప్రాముఖ్యతను మీరెలా వివరిస్తారు?

13. (ఎ) “నీ రాజ్యము వచ్చుగాక” అనే విన్నపం ఎలా నెరవేరుతుంది? (బి) భూమ్మీద దేవుని చిత్తం నెరవేరినప్పుడు ఏం జరుగుతుంది?

14. ‘మా అనుదినాహారము దయచేయుము’ అని కోరడం ఎందుకు సరైనదే?

15. “మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము” అనే విన్నపానికున్న అర్థమేమిటి?

16. శోధనల విషయంలో దుష్టునినుండి తప్పించుకునే విషయంలో చేయబడిన విన్నపాలను మనమెలా అర్థం చేసుకోవాలి?

17, 18. ‘అడుగుతూ, వెదుకుతూ, తట్టుతూ ఉండండి’ అనే మాటలకున్న అర్థమేమిటి?

19, 20. మత్తయి 7:​9-11లోని యేసు మాటల ప్రకారం యెహోవా ఎలా ఒక ప్రేమగల తండ్రిలా ఉన్నాడు?

21, 22. కొండమీది ప్రసంగానికున్న ప్రత్యేకతేమిటి? ఆ ప్రసంగంలోని యేసు మాటలను గురించి మీరేమి అనుకుంటున్నారు?

[15వ పేజీలోని చిత్రం]

తాము ప్రార్థిస్తున్నప్పుడు ఇతరులు తమను చూడాలనే, వినాలనే ఉద్దేశంతో ప్రార్థించిన వేషధారులను యేసు ఖండించాడు

[17వ పేజీలోని చిత్రం]

మన అనుదిన ఆహారం కోసం ప్రార్థించడం ఎందుకు సరైనదో మీకు తెలుసా?