కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషంగా ఉండడానికి యేసు చెప్పిన విషయాలెలా సహాయం చేస్తాయి?

సంతోషంగా ఉండడానికి యేసు చెప్పిన విషయాలెలా సహాయం చేస్తాయి?

సంతోషంగా ఉండడానికి యేసు చెప్పిన విషయాలెలా సహాయం చేస్తాయి?

‘యేసు ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి. అప్పుడాయన యీలాగు బోధింపసాగెను.’​—⁠మత్త. 5:​1, 2.

అది సా.శ. 31వ సంవత్సరం. యేసు పస్కా పండుగ జరుపుకోవడానికి గలిలయలో చేస్తున్న ప్రకటనా పనిని కొంతకాలంపాటు ఆపి యెరూషలేముకు వచ్చాడు. (యోహా. 5:⁠1) గలిలయకు తిరిగి వెళ్తున్నప్పుడు 12 మంది అపొస్తలులను ఎంపికచేసుకోవడానికి సహాయం చేయమని రాత్రంతా దేవునికి ప్రార్థించాడు. మరుసటి రోజు చాలామంది రోగులు స్వస్థత పొందడానికి యేసు దగ్గరకి వచ్చారు. అప్పుడు యేసు ఆ కొండమీద కూర్చుని తన శిష్యులకూ, అక్కడున్న మిగతావారికీ బోధించడం మొదలుపెట్టాడు.​—⁠మత్త. 4:​23–5:2; లూకా 6:​12-19.

2 దేవునితో మంచి సంబంధం ఉంటేనే మనం సంతోషంగా ఉండగలమని వివరిస్తూ ఆయన తన కొండమీది ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. (మత్తయి 5:​1-12 చదవండి.) ధన్యులు అన్న పదానికి సుఖంగా ఉన్నవారు లేదా సంతోషంగా ఉన్నవారు అనే అర్థాలున్నాయి. యేసు, సంతోషంగా ఉండడానికి తొమ్మిది కారణాలు వివరించాడు. వాటిని చదివినప్పుడు క్రైస్తవులు ఎందుకు సంతోషంగా ఉన్నారో మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన చెప్పిన మాటలు, 2000 సంవత్సరాల క్రితం సంతోషంగా ఉండడానికి ఎంత సహాయం చేశాయో ఇప్పటికీ అంతే సహాయం చేస్తాయి. వాటిని మనమిప్పుడు ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

‘తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించినవారు ధన్యులు’

3“ఆత్మవిషయమై దీనులైనవారు [‘తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించినవారు,’ NW] ధన్యులు; పరలోకరాజ్యము వారిది.” (మత్త. 5:⁠3) ‘ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించినవారు’ దేవునితో తమకు దగ్గర సంబంధం ఉండాలని, ఆయన కనికరం తమకు అవసరమని గ్రహిస్తారు.

4 ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించినవారు ధన్యులు ఎందుకంటే “పరలోకరాజ్యము వారిది.” యేసు తొలి శిష్యులు ఆయనే మెస్సీయ అని నమ్మినందుకు వారికి ఆయనతోపాటు పరలోక రాజ్యంలో పరిపాలించే అవకాశం దొరికింది. (లూకా 22:​28-30) మనం క్రీస్తుతో కలిసి పరలోక రాజ్యంలో పరిపాలించడానికి ఎదురుచూస్తున్నవారమైనా లేక ఆ రాజ్య పరిపాలనలో భూపరదైసుపై నిత్యం జీవించాలని కోరుకుంటున్నవారమైనా దేవునితో మనకు చక్కని సంబంధం అవసరమని, మనం ఆయన మీద ఆధారపడాల్సిన అవసరముందని గుర్తించినప్పుడే సంతోషంగా ఉంటాం.

5 తమకు దేవుని నడిపింపు, కనికరం అవసరమని అందరూ గుర్తించరు, ఎందుకంటే చాలామందికి దేవునిపై విశ్వాసం, పవిత్ర విషయాలంటే గౌరవం ఉండవు. (2 థెస్స. 3:​1, 2; హెబ్రీ. 12:16) ఆధ్యాత్మిక అవసరాలు తీరాలంటే బైబిలును శ్రద్ధగా చదవాలి, శిష్యులను చేసే పనిని ఉత్సాహంగా చేయాలి, కూటాలకు క్రమంగా హాజరవ్వాలి.​—⁠మత్త. 28:​19, 20; హెబ్రీ. 10:​23-25.

దుఃఖపడువారు “ధన్యులు”

6“దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.” (మత్త. 5:⁠4) “దుఃఖపడువారు” తమ ‘ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించినవారి’ లాంటివారే. వీళ్ళేదో తమ కష్టాలను చూసుకుని దుఃఖపడడంలేదు కానీ, తమ పాప స్థితిని చూసి, మనుష్యుల అపరిపూర్ణతవల్ల ఎదురవుతున్న సమస్యలను చూసి దుఃఖపడుతున్నారు. మరైతే, అలా దుఃఖపడేవారు ఎందుకు “ధన్యులు”? ఎందుకంటే వారు దేవునిమీద, క్రీస్తుమీద విశ్వాసముందని చేతల్లో చూపిస్తారు. అంతేకాదు, యెహోవాతో చక్కని సంబంధం ఉండడంవల్ల వారు ఓదార్పు పొందుతారు.​—⁠యోహా. 3:⁠36.

7 సాతాను లోకంలో విపరీతంగా పెరిగిపోతున్న అవినీతిని చూసి మనం కూడా దుఃఖిస్తున్నామా? ఈ లోకంలోని వాటిని మనమెలా చూడాలి? “లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే” అని అపొస్తలుడైన యోహాను రాశాడు. (1 యోహా. 2:16) “లౌకికాత్మ” అంటే దేవునికి దూరమైన ఈ సమాజంలోని చాలామంది ఆలోచించే తీరును చూసి మనం దేవుని సేవలో వెనుకబడిపోతున్నట్లు అనిపిస్తే మనమేం చేయాలి? అలా అనిపిస్తే మనం దానిగురించి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి, పెద్దల సహాయాన్ని కోరాలి. మనమెలాంటి సమస్యలతో బాధపడుతున్నా సరే యెహోవాకు దగ్గరవుతున్నకొద్దీ మనం “ఓదార్పు” పొందుతాం.​—⁠1 కొరిం. 2:12; కీర్త. 119:52; యాకో. 5:​14, 15.

“సాత్వికులు” ఎంత ధన్యులు!

8“సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” (మత్త. 5:⁠5) “సాత్వికం,” లేదా నమ్రత అంటే ఒక బలహీనతా కాదు, పైకి సాత్వికంగా ఉన్నట్లు నటించడమూ కాదు. (1 తిమో. 6:11) మనం సాత్వికులమైతే యెహోవా ఇష్టప్రకారం నడుచుకుంటూ, ఆయన చెప్పింది చేస్తూ నమ్రత చూపిస్తాం. తోటి విశ్వాసులతో, ఇతరులతో వ్యవహరించేతీరులో కూడా మనం సాత్వికులమో కాదో తెలుస్తుంది. అలాంటి నమ్రత చూపిస్తే మనం అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాకు తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నవాళ్లమౌతాం.​—⁠రోమీయులు 12:​17-19 చదవండి.

9 సాత్వికులు ఎందుకు ధన్యులు? ఎందుకంటే వాళ్ళు ‘భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు’ అని సాత్వికుడైన యేసు చెప్పాడు. భూమికి ఆయనే ప్రధాన వారసుడు. (కీర్త. 2:8; మత్త. 11:29; హెబ్రీ. 2:​8, 9) అయితే, ఆయనతోపాటు సాత్వికులైన “తోడి వారసులు” కూడా భూమిని స్వాస్థ్యంగా పొందుతారు. (రోమా. 8:​16, 17) సాత్వికులైన అనేకమంది ఇతరులు, యేసు పరిపాలనలో ఈ భూమిపై నిరంతరం జీవిస్తారు.​—⁠కీర్త. 37:​10, 11.

10 యేసులాగే మనం కూడా సాత్వికులుగా ఉండాలి. మనం ప్రతిదానికీ కోపగించుకుంటామా? మనకు జగడమాడే స్వభావం ఉందా? మనమలా ఉంటే ఎవరూ మనదగ్గరకు రావడానికి ఇష్టపడరు. సహోదరులకు ఈ స్వభావముంటే వారు సంఘంలో ఎలాంటి బాధ్యతలు పొందలేరు. (1 తిమో. 3:​1-3) “మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు . . . జగడమాడనివారును శాంతులునై యుండవలెను” అని క్రైస్తవులకు గుర్తుచేయమని పౌలు తీతుకు చెప్పాడు. (తీతు 3:​1-3) మనం శాంతంగా ఉంటే ఇతరులు ఎంతో సంతోషిస్తారు.

వారు “నీతికొరకు” ఆకలిదప్పులతో ఉంటారు

11“నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.” (మత్త. 5:⁠6) యేసు ఇక్కడ “నీతి” అన్నప్పుడు, దేవుని ఇష్టప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం సరైనది చేయడం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని నీతియుక్తమైన న్యాయవిధులను తెలుసుకోవాలనే ‘ఆశ కలిగింది, దానిచేత తన ప్రాణము క్షీణించుచున్నది’ అని కీర్తనకర్త చెప్పాడు. (కీర్త. 119:20) ఆకలితో ఉన్నప్పుడు ఆహారం కోసం తపించినంతగా మనం నీతికోసం తపిస్తామా?

12 నీతికోసం తపించేవారు ‘తృప్తిపరచబడతారు’ కాబట్టి వారు సంతోషంగా ఉంటారని యేసు చెప్పాడు. సా.శ. 33 పెంతెకొస్తు పండుగనాడు యెహోవా పరిశుద్ధాత్మ ‘నీతిని గూర్చి లోకాన్ని ఒప్పింపజేయడం’ మొదలుపెట్టినప్పటి నుండి నీతికోసం తపించేవారికి తృప్తిపడే అవకాశం దొరికింది. (యోహా. 16:⁠8) దేవుడు తన పరిశుద్ధాత్మతో మనుష్యుల్ని ప్రేరేపించి, “నీతియందు శిక్షచేయుటకు” ప్రయోజనకరంగా ఉండే క్రైస్తవ గ్రీకు లేఖనాలను రాయించాడు. (2 తిమో. 3:​16, 17) “దేవుడు తన పోలికలో సృజించిన” ‘నీతినిజాయితీ గల కొత్త స్వభావాన్ని ధరించుకోవడానికి’ ఆయన పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. (ఎఫె. 4:​24, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) తమ పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, యేసు విమోచన క్రయధనం ఆధారంగా క్షమించమని ప్రాధేయపడేవాళ్ళు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండగలరని తెలుసుకోవడం ఓదార్పుకరంగా లేదా?​—⁠రోమీయులు 3:​23, 24 చదవండి.

13 భూనిరీక్షణ ఉన్నవారు, నీతీన్యాయాలు వెల్లివిరిసే సమయంలో భూమ్మీద నిరంతర జీవితాన్ని పొందినప్పుడు వారు నీతికోసం పడుతున్న ఆకలిదప్పులు పూర్తిగా తీరిపోతాయి. అంతవరకు మనం యెహోవా నిర్ణయించిన సూత్రాల ప్రకారం జీవించాలని తీర్మానించుకుందాం. “[దేవుని] రాజ్యమును నీతిని మొదట వెదకుడి” అని యేసు చెప్పాడు. (మత్త. 6:33) అలా చేస్తే, మనకు దేవుని సేవలో చేతినిండా పని ఉంటుంది, దానివల్ల ఎంతో తృప్తి, సంతోషం పొందుతాం.​—⁠1 కొరిం. 15:⁠58.

“కనికరముగలవారు” ఎందుకు ధన్యులు?

14“కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.” (మత్త. 5:⁠7) “కనికరముగలవారు” ఇతరులపై జాలి, దయ చూపిస్తారు. యేసు ప్రజలమీద కనికరపడ్డాడు కాబట్టే వారిని అద్భుతంగా బాగుచేసి, బాధనుండి వారికి ఉపశమనం కలిగించాడు. (మత్త. 14:14) పశ్చాత్తాపపడేవారిని యెహోవా కనికరంతో క్షమించినట్లే, మనం కూడా మనల్ని బాధపెట్టినవారిని క్షమించినప్పుడు కనికరం చూపించినవారమవుతాం. (నిర్గ. 34:​6, 7; కీర్త. 103:10) అంతేకాదు, కష్టాల్లో ఉన్నవారితో దయగా మాట్లాడి, వారికి సహాయం చేసి మనం కనికరం చూపించవచ్చు. బైబిల్లోని సత్యాలను ఇతరులకు చెప్పడం కూడా కనికరం చూపించడానికి ఒక చక్కని మార్గం. యేసు ప్రజల్ని చూసి కనికరపడి ‘వారికి అనేక సంగతులను బోధించాడు.’​—⁠మార్కు 6:⁠34.

15 “కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు” అని యేసు చెప్పిన మాటలు నిజమని ఒప్పుకోవాలి. ఎందుకు? మనం కనికరం చూపిస్తే ఇతరులు కూడా మనకు కనికరం చూపిస్తారు. మనం కనికరం చూపిస్తే దేవుడు తీర్పు తీర్చేటప్పుడు మనం చూపించిన కనికరాన్నిబట్టి మనల్ని కఠినంగా తీర్పుతీర్చడు. (యాకో. 2:13) కనికరం చూపించేవాళ్ళనే దేవుడు క్షమిస్తాడు, వాళ్ళకు మాత్రమే నిత్యజీవాన్ని ఇస్తాడు.​—⁠మత్త. 6:⁠15.

“హృదయశుద్ధిగలవారు” ఎందుకు ధన్యులు?

16“హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.” (మత్త. 5:⁠8) మన హృదయం శుద్ధంగా లేదా పవిత్రంగా ఉంటే, అది ఇతరులతో మనకున్న సంబంధాల్లో, మన ఇష్టాల్లో, కోరికల్లో, ఉద్దేశాల్లో తెలుస్తుంది. మనం ‘పవిత్ర హృదయంతో ప్రేమ’ చూపిస్తాం. (1 తిమో. 1:⁠5) మన హృదయం పవిత్రంగా ఉంటుంది కాబట్టి మనం ‘దేవుణ్ణి చూస్తాము.’ అంటే యెహోవాను మనం కళ్ళారా చూస్తామని కాదు, ఎందుకంటే “ఏ నరుడును [దేవుణ్ణి] చూచి బ్రదుకడు” అని బైబిలు చెబుతోంది. (నిర్గ. 33:20) దేవుని లక్షణాలను యేసు తన జీవితంలో ఎంత చక్కగా చూపించాడంటే, “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పగలిగాడు. (యోహా. 14:​7-9) యెహోవా మనకు సహాయం చేసినప్పుడల్లా ఆయన ఆరాధకులమైన మనం భూమ్మీదున్నా ‘దేవుణ్ణి చూస్తాం.’ (యోబు 42:⁠5) అభిషిక్త క్రైస్తవులు భూమ్మీద ఉన్నప్పుడు దేవుని సహాయ హస్తాన్ని చూడడం మాత్రమే కాదుగానీ ఆత్మ శరీరులుగా పరలోకానికి పునరుత్థానం చేయబడినప్పుడు తమ పరలోక తండ్రిని నిజంగానే చూస్తారు.​—⁠1 యోహా. 3:⁠2.

17 హృదయం శుద్ధంగా ఉన్నవాళ్ళు నైతిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో పవిత్రంగా ఉంటారు కాబట్టి వారు యెహోవా దృష్టిలో అపవిత్రంగా ఉన్నవాటిపై మనస్సు నిలుపరు. (1 దిన. 28:9; యెష. 52:11) మన హృదయం శుద్ధంగా ఉంటే మన మాటలూ, చేతలూ పవిత్రంగా ఉంటాయి. ఏదో పైకి కనిపించాలని యెహోవా సేవ చేయం.

“సమాధానపరచువారు” దేవుని కుమారులవుతారు

18“సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.” (మత్త. 5:⁠9) వారివారి ప్రవర్తననుబట్టి ఎవరు ‘సమాధానపరచువారో’ తెలుస్తుంది. యేసు చెప్పినట్లు మనం సమాధానపరిచేవారిగా ఉంటే, ‘ఎవరికీ కీడుకు ప్రతికీడు చేయకుండా’ ఇతరులకు ‘ఎల్లప్పుడు మేలైనదాన్నే’ చేస్తూ ఉంటాం.​—⁠1 థెస్స. 5:⁠15.

19 మనం సమాధానపరిచేవారిగా ఉండాలంటే ఎంతో కృషి అవసరం. సమాధానపరుచువారు ఏ విధంగానూ ‘మిత్రభేదము చేయరు’ అంటే ఒకరిమధ్య ఒకరికి గొడవలు పెట్టరు. (సామె. 16:28) సమాధానపరులమైన మనం ‘అందరితో సమాధానంగా’ ఉండడానికి చేయగలిగిందంతా చేస్తాం.​—⁠హెబ్రీ. 12:⁠14.

20 సమాధానపరచువారు “దేవుని కుమారులనబడుదురు” కాబట్టి వారు ధన్యులు. నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులను యెహోవా దత్తత చేసుకున్నాడు కాబట్టి వారు “దేవుని కుమారులు.” వారు క్రీస్తు మీద విశ్వాసం ఉందని చూపిస్తున్నారు, “సమాధానములకు కర్తయగు దేవుణ్ణి” మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు కాబట్టి దేవుని పిల్లలుగా వారికిప్పటికే ఆయనతో దగ్గర సంబంధముంది. (2 కొరిం. 13:11; యోహా. 1:12) మరి సమాధానపరులైన “వేరే గొఱ్ఱెల” మాటేమిటి? వేయ్యేండ్ల పరిపాలనలో యేసు వారికి “నిత్యుడగు తండ్రి[గా]” ఉంటాడు, కానీ ఆ వెయ్యేండ్లు ముగిశాక ఆయన తన అధికారాన్నంతటినీ దేవునికి అప్పగిస్తాడు. అప్పుడు వేరే గొఱ్ఱెలు పూర్తి భావంలో దేవుని పిల్లలవుతారు.​—⁠యోహా. 10:16; యెష. 9:6; రోమా. 8:​20, 21; 1 కొరిం. 15:​27, 28.

21 ‘మనం ఆత్మననుసరించి జీవిస్తున్నట్లయితే’ మనం సమాధానపరులమని ఇతరులు వెంటనే గుర్తిస్తారు. మనం ‘ఒకరినొకరం వివాదానికి’ లాగము లేదా “ఒకరికొకరం కోపము రేపకుండా” ఉంటాం. (గల. 5:​22-26; పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) దానికి బదులు మనం “సమస్త మనుష్యులతో సమాధానముగా” ఉండడానికి కృషిచేస్తాం.​—⁠రోమా. 12:⁠18.

హింసింపబడినా ధన్యులే!

22“నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.” (మత్త. 5:10) ఈ విషయాన్నే ఇంకా వివరిస్తూ యేసు, “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి” అని చెప్పాడు.​—⁠మత్త. 5:​11, 12.

23 ప్రజలు పూర్వకాలంలో దేవుని ప్రవక్తల్ని హింసించినట్లే, తమను కూడా ‘నీతినిమిత్తం’ దూషిస్తారనీ, హింసిస్తారనీ, తమమీద అబద్ధాలు చెబుతారనీ క్రైస్తవులకు తెలుసు. అలాంటి శ్రమల్ని నమ్మకంగా సహిస్తే, యెహోవాను సంతోషపెడుతూ ఆయన్ని మహిమపరుస్తున్నామన్న సంతృప్తి మనకుంటుంది. (1 పేతు. 2:​19-21) అలాంటి కష్టాలు ఇప్పుడుగానీ, భవిష్యత్తులోగానీ యెహోవా సేవలో మనం పొందే ఆనందాన్ని ఏమాత్రం దోచుకోలేవు. అభిషిక్తులకు ఇప్పుడెన్ని కష్టాలొచ్చినా అవేవీ కూడా పరలోకంలో క్రీస్తుతోపాటు పరిపాలించడంలో వారికుండే ఆనందాన్ని హరించలేవు. అలాగే వేరే గొర్రెలు భూమ్మీద ఆ రాజ్య పౌరులుగా నిత్యం జీవించినప్పుడు పొందబోయే ఆనందాన్ని కూడా ఇప్పుడున్న కష్టాలు తగ్గించలేవు. అలాంటి ఆశీర్వాదాలు దేవునికి మనపై ప్రేమ, కృప, దయ ఉన్నాయని నమ్మడానికి నిలువెత్తు సాక్ష్యాలు.

24 కొండమీది ప్రసంగం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని తర్వాతి రెండు ఆర్టికల్స్‌లో చర్చించుకుందాం. యేసుక్రీస్తు చెప్పిన ఆ విషయాలను మన జీవితాల్లో ఎలా పాటించవచ్చో మనం వాటిల్లో నేర్చుకుందాం.

మీరెలా జవాబిస్తారు?

• ‘ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు’ ఎందుకు ధన్యులు?

• ‘సాత్వికులు’ ఎందుకు ధన్యులు?

• హింసింపబడినా క్రైస్తవులు ఎందుకు సంతోషంగా ఉంటారు?

• సంతోషంగా ఉండడానికి యేసు చెప్పిన కారణాల్లో మీకు ఏది బాగా నచ్చింది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) యేసు ఎలాంటి పరిస్థితుల్లో కొండమీది ప్రసంగాన్ని ఇచ్చాడు? (బి) ఆయన తన ప్రసంగాన్ని ఏ విషయంతో మొదలుపెట్టాడు?

3. మన ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించడమంటే ఏమిటి?

4, 5. (ఎ) తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించినవారు ఎందుకు సంతోషంగా ఉంటారు? (బి) మన ఆధ్యాత్మిక అవసరాలు తీరాలంటే ఏమిచేయాలి?

6. “దుఃఖపడువారు” ఎవరు? వారెందుకు “ధన్యులు”?

7. సాతాను లోకాన్ని మనమెలా చూడాలి?

8, 9. సాత్వికులుగా ఉండడమంటే ఏమిటి? సాత్వికులెందుకు ధన్యులు?

10. మనం సాత్వికులుగా ఉండకపోతే సంఘంలో ఏమి పొందలేం? ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉంటాయి?

11-13. (ఎ) నీతికోసం ఆకలిదప్పులతో ఉండడమంటే ఏమిటి? (బి) నీతికోసం తపించేవారు ఎలా ‘తృప్తిపరచబడతారు’?

14, 15. మనమెలా కనికరాన్ని చూపిస్తాం? “కనికరముగలవారు” ఎందుకు ధన్యులు?

16. హృదయం శుద్ధంగా ఉండడమంటే ఏమిటి? అలాంటి హృదయం ఉన్నవారు ‘దేవుణ్ణి’ ఎలా ‘చూస్తారు’?

17. హృదయం శుద్ధంగా ఉంటే మనమెలా ఉంటాం?

18, 19. ‘సమాధానపరిచేవారి’ ప్రవర్తన ఎలా ఉంటుంది?

20. ఇప్పుడు “దేవుని కుమారులు” ఎవరు? భవిష్యత్తులో ఇంకా ఎవరు దేవుని పిల్లలవుతారు?

21. మనం ‘ఆత్మననుసరించి జీవిస్తున్నట్లయితే’ ఎలా ప్రవర్తిస్తాం?

22-24. (ఎ) ‘నీతినిమిత్తం హింసింపబడేవారు’ ఎందుకు సంతోషంగా ఉంటారు? (బి) తర్వాతి రెండు ఆర్టికల్స్‌లో మనమేమి నేర్చుకుంటాం?

[7వ పేజీలోని చిత్రం]

యేసు చెప్పిన తొమ్మిది కారణాలు అప్పుడు సంతోషంగా ఉండడానికి ఎంత సహాయం చేశాయో ఇప్పటికీ అంతే సహాయం చేస్తాయి

[8వ పేజీలోని చిత్రం]

బైబిలు సత్యాలను ఇతరులకు చెప్పడం కనికరం చూపించడానికి ఒక చక్కని మార్గం