కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రకటనా పనిలో పట్టుదలతో మీరు ఎలా కొనసాగవచ్చు

ప్రకటనా పనిలో పట్టుదలతో మీరు ఎలా కొనసాగవచ్చు

ప్రకటనా పనిలో పట్టుదలతో మీరు ఎలా కొనసాగవచ్చు

మీరెప్పుడైనా ప్రకటనా పనిని ఆపేయాలనిపించేంతగా అలసిపోయి నిరుత్సాహపడ్డారా? తీవ్రమైన వ్యతిరేకత, చింతలు, అనారోగ్యం, తోటివారి నుండి వచ్చే ఒత్తిడి లేదా ప్రకటనా పనిలో ప్రజలు సరిగ్గా స్పందించకపోవడం వంటివి పరిచర్యలో మన సహనాన్ని పరీక్షించవచ్చు. అయితే యేసు ఉదాహరణ గురించి ఆలోచించండి. ‘తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం’ ఆయన అతి తీవ్రమైన పరీక్షలను సహించాడు. (హెబ్రీ. 12:1, 2) దేవునిపై మోపబడిన నిందలు పూర్తి నిరాధారమైనవని నిరూపించడం ద్వారా యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తున్నాడని ఆయనకు తెలుసు.—సామె. 27:11.

పరిచర్యలో పట్టుదలతో కొనసాగడం ద్వారా మీరు కూడా యెహోవా హృదయాన్ని సంతోషపర్చవచ్చు. అయితే, కొన్ని ఆటంకాలు ప్రకటనా పనిలో మీ శక్తిని హరించివేస్తున్నట్లు మీకనిపిస్తే అప్పుడేమి చేయాలి? అనారోగ్యంతో, వృద్ధాప్యంతో బాధపడుతున్న క్రిస్టీనా ఇలా చెబుతోంది: “నేను చాలా తరచుగా అలసిపోయి నిరుత్సాహపడుతుంటాను. వృద్ధాప్యంతో వచ్చే అనారోగ్య సమస్యలు, అనుదిన చింతలు వంటివి నా ఉత్సాహాన్ని అప్పుడప్పుడు హరించివేస్తుంటాయి.” అలాంటి ఆటంకాలున్నా మీరు పరిచర్యలో పట్టుదలతో ఎలా కొనసాగవచ్చు?

ప్రవక్తలను అనుకరించండి

నమ్మకమైన రాజ్య ప్రచారకులు ప్రకటనా పనిలో పట్టుదలతో కొనసాగాలంటే, ప్రకటనా పనిపట్ల ప్రాచీన ప్రవక్తలు కనబరచిన వైఖరిని కనబరచడానికి కృషి చేయాలి. ఉదాహరణకు, యిర్మీయా గురించి ఆలోచించండి. ప్రవక్తగా సేవ చేయమని యెహోవా ఆయనకు చెప్పినప్పుడు మొదట సంకోచించాడు. కానీ, ఆయన యెహోవాపై పూర్తి నమ్మకముంచడాన్ని నేర్చుకున్నాడు కాబట్టి, దాదాపు 40 సంవత్సరాలపాటు ఆ కష్టమైన నియామకంలో పట్టుదలతో కొనసాగాడు.​—⁠యిర్మీ. 1:6; 20:​7-11.

హెన్రిక్‌ అనే సహోదరుడు యిర్మీయా మాదిరి నుండి ప్రోత్సాహం పొందాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నేను 70 ఏళ్ల కన్నా ఎక్కువ సంవత్సరాలు సేవ చేశాను. పరిచర్యలో ప్రజలు సరిగా ప్రతిస్పందించనప్పుడు, వ్యతిరేకించినప్పుడు లేదా వారు ఆసక్తి చూపించనప్పుడు కొన్నిసార్లు నేను నిరుత్సాహపడ్డాను. నాకలా అనిపించినప్పుడు యిర్మీయా మాదిరిని జ్ఞాపకం చేసుకుంటాను. యెహోవాపై ఆయనకున్న ప్రేమ, దేవునితో తనకున్న దగ్గరి సంబంధం వల్లనే ఆయన ప్రవక్తగా కొనసాగగలిగాడు.” (యిర్మీ. 1:17) రఫౌ అనే సహోదరుడు కూడా యిర్మీయా మాదిరి నుండే ప్రోత్సాహం పొందాడు. ఆయనిలా అంటున్నాడు: “యిర్మీయా తన గురించి, తన భావాల గురించి ఎక్కువగా ఆలోచించలేదు గానీ దేవునిపై పూర్తి నమ్మకముంచాడు. ఆయన వెళ్లిన ప్రతీచోటా ఎంత వ్యతిరేకత ఎదురైనా ఆయన ధైర్యంగా ముందుకు సాగాడు. నేను ఆ విషయాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తాను.”

పరిచర్యలో పట్టుదలతో కొనసాగడానికి ప్రవక్తయైన యెషయా మాదిరి కూడా చాలామందికి సహాయం చేస్తుంది. ఆ దేశ ప్రజలు యెషయా మాట వినరని దేవుడు ఆయనతో చెప్పాడు. “ఈ ప్రజల హృదయాలను మొద్దుబారిపోయేలా చెయ్యి. చెవులు కూడా మందమయ్యేలా చెయ్యి” అని యెహోవా చెప్పాడు. యెషయా అలా చేయడంలో విఫలమౌతాడా? దేవుని దృష్టిలో ఆయన విఫలం కాడు! ఆయన ప్రవక్తగా నియమించబడినప్పుడు, ఆయనిలా అన్నాడు: “ఇదిగో, నేను ఇక్కడ ఉన్నాను నన్ను పంపించు.” (యెష. 6:​8-10 పవిత్ర గ్రంథము, వ్యాఖ్యాన సహితం.) యెషయా పట్టుదలతో తన నియామకంలో కొనసాగాడు. ప్రకటనా పని చేయమనే ఆజ్ఞకు మీరూ అలాగే స్పందిస్తారా?

ప్రజలు సరిగ్గా ప్రతిస్పందించకపోయినా యెషయాలా పరిచర్యలో పట్టుదలతో కొనసాగాలంటే ప్రజలు సువార్తను వినని సందర్భాల గురించి మనం ఆలోచించకూడదు. రఫౌ నిరుత్సాహపడినప్పుడు తాను ఏమి చేస్తాడో చెబుతున్నాడు: “ప్రజల కఠిమైన మాటల గురించి ఆలోచించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. నా ప్రాంతంలోని ప్రజలకు ఏవిధంగానైనా ప్రతిస్పందించే హక్కు ఉంది.” అన్నా కూడా ఇలా అంటోంది: “పరిచర్యలో ఎదురైన చేదు అనుభవాల గురించీ లేక నిరుత్సాహకరమైన ప్రతిస్పందనల గురించీ నేను ఎక్కువగా ఆలోచించను. పరిచర్యకు వెళ్లేముందు దిన వచనాన్ని పరిశీలించి ప్రార్థన చేయడం ఈ విషయంలో నాకు సహాయం చేస్తుంది. అలా చేయడం వల్ల నిరుత్సాహపర్చే ఆలోచనలను త్వరగా మర్చిపోగలుగుతాను.”

ప్రవక్తయైన యెహెజ్కేలు బబులోను చెరలోవున్న తిరుగుబాటుదారులైన యూదుల మధ్య సేవచేశాడు. (యెహె. 2:⁠5) ఒకవేళ ప్రవక్త దేవుని వాక్యం ప్రకటించని కారణంగా దుష్టులు యెహోవా హెచ్చరికను వినకుండా చనిపోయి ఉంటే, వారి రక్తాపరాధం యెహెజ్కేలు మీదికి వచ్చి ఉండేది. అందుకే యెహోవా యెహెజ్కేలుతో ఇలా అన్నాడు: “అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.”​—⁠యెహె. 3:​17, 18.

హెన్రిక్‌ కూడా యెహెజ్కేలులా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాడు: ‘నేను ఇతరుల రక్తాపరాధం విషయంలో దోషిగా ఉండదల్చుకోలేదు. ఎంతో విలువైన మానవ జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి.’ (అపొ. 20:​26, 27) జిబిగ్‌న్యూ అనే సహోదరుడు కూడా అలాగే భావిస్తున్నాడు: “ఇతరులు ఏమనుకున్నా యెహెజ్కేలు ఆ పనిని కొనసాగించాల్సి వచ్చింది. ప్రకటనా పనిని యెహోవా ఎలా దృష్టిస్తున్నాడో నేనూ అలాగే దృష్టించడానికి ఆయన మాదిరి నాకు సహాయం చేస్తోంది.”

ఈ పనిలో మీరు ఒంటరిగా లేరు

ప్రకటనా పనిలో పాల్గొంటున్నప్పుడు మీరు ఒంటరిగా లేరు. “మేము దేవుని జతపనివారమై యున్నాము” అని అపొస్తలుడైన పౌలు చెప్పినట్లే మనమూ చెప్పవచ్చు. (1 కొరిం. 3:⁠9) అప్పుడప్పుడు నిరుత్సాహానికి గురౌతానని ఒప్పుకుంటూ క్రిస్టీనా ఇలా అంటోంది: “అందుకే నేను బలం కోసం యెహోవాను వేడుకుంటూ ఉంటాను. ఆయన ఎన్నడూ నన్ను నిరాశపరచడు.” అవును, పరిచర్యలో దేవుని పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం.​—⁠జెక. 4:⁠6.

మనం ప్రకటనా పని చేస్తున్నప్పుడు, ‘ఆత్మ ఫలంలో’ ఉన్న లక్షణాలను చూపించడానికి కూడా పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. దానివల్ల ఎన్ని ఆటంకాలు ఎదురైనా పరిచర్యను పట్టుదలతో కొనసాగించగలుగుతాం. హెన్రిక్‌ ఇలా చెబుతున్నాడు: “ప్రకటనా పనిలో పాల్గొనడంవల్ల నా వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకుంటున్నాను. త్వరగా నిరుత్సాహపడకుండా ఓపిగ్గా ప్రజల పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటున్నాను.” ఎన్ని ఆటంకాలు ఎదురైనా పరిచర్యలో పట్టుదలతో కొనసాగడంవల్ల మీరు మరింత ఎక్కువగా ఆత్మ ఫలాన్ని అలవర్చుకోగలుగుతారు.

యెహోవా తన దూతలను ఉపయోగించి ఈ ప్రత్యేకమైన పనిని నిర్దేశిస్తున్నాడు. (ప్రక. 14:⁠6) అలాంటి దేవదూతలు “కోట్లకొలదిగా” ఉన్నారని బైబిలు చెబుతోంది. (ప్రక. 5:11) యేసు నాయకత్వంలో వారు భూమ్మీదున్న దేవుని సేవకులకు సహాయం చేస్తున్నారు. మీరు పరిచర్యలో పాల్గొంటున్నప్పుడెల్లా దాన్ని గుర్తుంచుకుంటున్నారా?

“పరిచర్యలో దేవదూతలు మనతో ఉన్నారనే విషయాన్ని ధ్యానించినప్పుడు నేను ఎంతో ప్రోత్సాహం పొందుతాను. యెహోవా యేసుల పర్యవేక్షణలో వారిచ్చే సహాయాన్ని నేనెంతో విలువైనదిగా ఎంచుతాను” అని అన్నా చెబుతోంది. నమ్మకమైన దేవదూతలతో కలిసి పనిచేయడం ఎంత గొప్ప విషయం!

పరిచర్యను పట్టుదలతో కొనసాగించేందుకు మన తోటి ప్రచారకులతో కలిసి పనిచేయడం ఎలా సహాయం చేస్తుంది? వేలాదిమంది నమ్మకమైన సాక్షులతో కలిసి పనిచేసే గొప్ప అవకాశం మనకుంది. “ఇనుముచేత ఇనుము పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును” అన్న బైబిలు సామెత ఎంత సత్యమో ఇప్పటికే మీరు గ్రహించి ఉంటారు.​—⁠సామె. 27:⁠17.

పరిచర్యలో ఇతరులతో కలిసి పని చేయడం ద్వారా మనకు తెలియని మరింత మెరుగైన పద్ధతులను గమనించే మంచి అవకాశం మనకు దొరుకుతుంది. ఎల్జ్‌బీటా అనే సహోదరి ఇలా చెబుతోంది: “వివిధ ప్రచారకులతో కలిసి పనిచేయడంవల్ల నేను మన సహోదరసహోదరీలపట్ల, పరిచర్యలో కలిసే ప్రజలపట్ల ప్రేమను చూపించగలుగుతున్నాను.” ప్రకటనా పనిలో వివిధ ప్రచారకులతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నించండి. అది మీ పరిచర్యను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది.

మీ విషయంలో మీరు తగిన శ్రద్ధ తీసుకోండి

పరచర్యలో మన ఉత్సాహాన్ని కాపాడుకోవాలంటే మనం చక్కని ప్రణాళిక వేసుకోవాలి, క్రమంగా వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేయాలి, తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మరో మాటలో చెప్పాలంటే, మనం మన ఆధ్యాత్మిక ఆరోగ్యం విషయంలో, శారీరక ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

“శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు” అని బైబిలు చెబుతోంది. (సామె. 21:⁠5) 88 ఏళ్ల జిగ్‌ముంట్‌ అనే సహోదరుడు ఇలా చెబుతున్నాడు: “మంచి ప్రణాళిక వేసుకోవడం వల్ల నేను నా సేవను మరింత చేయగలుగుతున్నాను. సాక్ష్యపు పనిలో పాల్గొనేందుకు తగిన సమయం ఉండేలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుంటున్నాను.”

లేఖనాలకు సంబంధించిన లోతైన జ్ఞానం మనల్ని బలపరచి, ప్రకటనా పనికి సంసిద్ధులను చేస్తుంది. సజీవంగా ఉండడానికి భౌతిక ఆహారాన్ని ఎలాగైతే తీసుకుంటామో అలాగే ప్రకటనా పనిలో కొనసాగడానికి ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమంగా తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేస్తూ ఆధ్యాత్మిక ‘ఆహారాన్ని తగినవేళ’ తీసుకోవడంవల్ల పరిచర్యలో పాల్గొనేందుకు మనం బలం పొందుతాం.​—⁠మత్త. 24:​45-47.

ఎల్జ్‌బీటా తన పరిచర్యను మెరుగుపర్చుకోవడానికి తన జీవితంలో ప్రాముఖ్యమైన కొన్ని మార్పులను చేసుకుంది. ఆమె ఇలా అంటోంది: “నేను టీవీ చూసే సమయాన్ని చాలావరకు తగ్గించాను. దానివల్ల పరిచర్యకు సిద్ధపడేందుకు ఎంతో సమయం దొరుకుతుంది. నేను ప్రతీరోజు సాయంత్రం బైబిలు చదువుతున్నప్పుడు ప్రకటనా పనిలో నేను కలిసిన ప్రజల గురించి ఆలోచిస్తాను. వారికి సహాయపడగల లేఖనాల కోసం, ఆర్టికల్స్‌ కోసం వెదకుతాను.”

తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల మీరు హుషారుగా ఉంటూ సాధ్యమైనంత ఎక్కువగా పరిచర్యలో పాల్గొనగలుగుతారు. అయితే, వినోదం కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తే ప్రకటనా పనిలో మీరు చురుకుగా పాల్గొనలేకపోతారు. ఉత్సాహంగల ప్రచారకుడైన ఆంజే ఇలా చెప్పాడు: “తగిన విశ్రాంతి తీసుకోకపోతే చాలా అలిసిపోతాం. దానివల్ల మనం త్వరగా నిరుత్సాహపడే అవకాశం ఉంది. అందుకే సాధ్యమైనంత మట్టుకు నేను అలా జరగకుండా చూసుకుంటాను.”​—⁠ప్రసం. 4:⁠6.

మనం హృదయపూర్వకంగా ఎంత కృషిచేసినా కేవలం కొంతమంది మాత్రమే మనం ప్రకటించే సువార్తను వింటారు. అయితే, యెహోవా మనం చేసే పనిని ఎన్నడూ మరచిపోడు. (హెబ్రీ. 6:10) మనతో మాట్లాడడానికి చాలామంది ఇష్టపడకపోయినా మనం వాళ్లింటికి వెళ్లామనే విషయాన్ని వారు తర్వాత ఇతరులకు చెప్పవచ్చు. ప్రజలు ‘తమ మధ్య ప్రవక్త ఉన్నాడని తెలుసుకుంటారు’ అని యెహెజ్కేలు విషయంలో చెప్పబడినట్లే మన గురించీ చెప్పబడవచ్చు. (యెహె. 2:⁠4) మన ప్రకటనా పని అంత సులభమైనదేమీ కాదు, అయినా ఆ పనివల్ల మనమేకాక ఇతరులూ ప్రయోజనం పొందుతారు.

“ప్రకటనా పనిలో పాల్గొనడంవల్ల మనం నూతన వ్యక్తిత్వాన్ని ధరించుకొని దేవునిపట్ల, పొరుగువారిపట్ల ప్రేమ చూపించగలుగుతాం” అని జిగ్‌ముంట్‌ చెబుతున్నాడు. “ప్రాణాలను రక్షించే ఈ పనిలో పాల్గొనడం ఓ గొప్ప విషయం. ఈ స్థాయిలో లేదా ఇలాంటి పరిస్థితుల్లో ఈ పని మళ్లీ ఇక ఎన్నడూ జరగదు” అని ఆంజే అంటున్నాడు. పరిచర్యలో పట్టుదలతో కొనసాగడం ద్వారా మీరూ ఎన్నో ఆశీర్వాదాలను పొందవచ్చు.​—⁠2 కొరిం. 4:​1, 2.

[31వ పేజీలోని చిత్రాలు]

శారీరక, ఆధ్యాత్మిక అవసరాల విషయంలో జాగ్రత్త వహించడం ద్వారా మనం పరిచర్యలో పట్టుదలతో కొనసాగగలుగుతాం