కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు యెహోవాను మరచిపోకూడదు

మీరు యెహోవాను మరచిపోకూడదు

మీరు యెహోవాను మరచిపోకూడదు

కొందరికి అది మొదటి అనుభవం కాదు. నది గర్భంగుండా తడవకుండా నడుచుకుంటూ వెళ్లడం చాలామంది ఇశ్రాయేలీయులకు అదే మొదటిసారి, అదే చివరిసారి. యొర్దాను నది ప్రవాహాన్ని యెహోవా ఆపాడు. లక్షలాదిమంది ఇశ్రాయేలీయులు దారిపొడుగునా ఒక పెద్ద సమూహంగా ఆరిన నేలపై ఆ నదిని దాటి వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. ‘యెహోవా ఇక్కడ చేసిన కార్యాన్ని మేమెప్పటికీ మరచిపోము’ అని 40 సంవత్సరాల క్రితం ఎర్ర సముద్రం దగ్గర వాళ్ల పూర్వీకులు అనుకున్నట్లే యొర్దాను నది దాటి వచ్చినవారూ అనుకొనివుంటారు.​—⁠యెహో. 3:​13-17.

అయితే, కొందరు ఇశ్రాయేలీయులు ‘తన కార్యాలను వెంటనే మరచిపోతారు’ అని యెహోవాకు తెలుసు. (కీర్త. 106:13) అందుకే నది మధ్యనుండి 12 రాళ్లను తీసుకువెళ్లి వాళ్లు మొదటిరోజు బసచేసే చోట వాటిని స్మారకచిహ్నంగా ఉంచమని యెహోవా ఇశ్రాయేలీయుల నాయకుడైన యెహోషువతో చెప్పాడు. “యీ రాళ్లు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును” అని యెహోషువ ఇశ్రాయేలీయులకు వివరించాడు. (యెహో. 4:​1-8) అలా జ్ఞాపకార్థంగా ఉంచబడిన రాళ్లు, యెహోవా చేసిన గొప్ప కార్యాలను వారికి గుర్తుచేయడమే కాక, ఆయనను ఎల్లప్పుడూ యథార్థంగా సేవించడం ఎందుకు ప్రాముఖ్యమో వారికి గుర్తుచేస్తాయి.

నేటి దేవుని ప్రజలకు దానినుండి నేర్చుకోవాల్సిన పాఠం ఏమైనా ఉందా? ఉంది. మనమూ యెహోవాను ఎన్నడూ మరచిపోకుండా ఆయనను ఎల్లప్పుడూ యథార్థంగా సేవించాలి. ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వబడిన ఇతర హెచ్చరికలు నేటి యెహోవా సేవకులకు కూడ వర్తిస్తాయి. మోషే చెప్పిన మాటల గురించి ఆలోచించండి. ‘ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా’ జాగ్రత్తపడమని ఆయన చెప్పాడు. (ద్వితీ. 8:11) యెహోవాను మరచిపోయినట్లయితే ఆయనకు అవిధేయులయ్యే అవకాశముందని దీన్నిబట్టి తెలుస్తుంది. మన కాలంలో కూడ అలా జరిగే ప్రమాదముంది. అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు రాసిన పత్రికలో, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ‘అవిధేయులయినట్లు’ అవిధేయులు కాకుండా జాగ్రత్తపడమని హెచ్చరించాడు.​—⁠హెబ్రీ. 4:​8-11.

మనం దేవుణ్ణి మరచిపోకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యమో తెలియజేసే ఇశ్రాయేలీయుల చరిత్రలోని కొన్ని సంఘటనలను చూద్దాం. అంతేకాక, యథార్థవంతులైన ఇద్దరు ఇశ్రాయేలీయుల జీవితాల్లో జరిగిన సంఘటనలు పట్టుదలతో, కృతజ్ఞతతో యెహోవాను సేవించడానికి మనకు ఎలా సహాయం చేస్తాయో చూద్దాం.

యెహోవాను జ్ఞాపకముంచుకునేందుకు కారణాలు

ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నంతకాలం యెహోవా వారిని ఎన్నడూ మరచిపోలేదు. ఆయన ‘అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు.’ (నిర్గ. 2:​23, 24) ఐగుప్తు దాసత్వంనుండి వారిని విడిపించడానికి ఆయన చేసినది వారు ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది.

యెహోవా తొమ్మిది తెగుళ్లతో ఐగుప్తు దేశాన్ని మొత్తాడు. ఫరో శకునగాండ్రు వాటిని ఆపడానికి ఏమీ చేయలేకపోయారు. అయినా ఫరో యెహోవాను ధిక్కరించి, ఇశ్రాయేలీయులను పంపించడానికి నిరాకరించాడు. (నిర్గ. 7:14–10:29) అయితే, పదో తెగులు ఆ గర్వ పాలకుడ్ని దేవునికి లోబడేలా చేసింది. (నిర్గ. 11:​1-10; 12:12) మోషే నాయకత్వం క్రింద ఇశ్రాయేలు జనాంగంతో పాటు అన్యజనులందరూ కలిపి దాదాపు 30,00,000 మంది ఐగుప్తును విడిచివెళ్లారు. (నిర్గ. 12:​37, 38) వారు ఎంతో దూరం వెళ్లకముందే ఫరో వాళ్లను తిరిగి రప్పించాలనుకున్నాడు. ఇశ్రాయేలీయులను మళ్లీ చెరపట్టమని ఫరో తన అశ్వికదళానికి ఆజ్ఞ ఇచ్చాడు. అప్పట్లో అదే భూమ్మీద శక్తివంతమైన సైన్యం. ఎర్ర సముద్రానికీ, పర్వత పై భాగానికీ మధ్యలోవున్న ప్రాంతానికి అంటే తప్పించుకోవడం ఇక సాధ్యం కాదనిపించే పీహహీరోతు అనే ప్రాంతానికి ఇశ్రాయేలీయులను తీసుకువెళ్లమని యెహోవా మోషేకు చెప్పాడు.​—⁠నిర్గ. 14:​1-9.

ఇశ్రాయేలీయులు ఉచ్చులో చిక్కుకున్నారనీ తన సైన్యం వారిని చెరపడుతుందనీ ఫరో అనుకున్నాడు. కానీ వారిరువురి మధ్యలో యెహోవా మేఘ స్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని నిలబెట్టడంవల్ల ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను వెంబడించలేకపోయారు. ఆ తర్వాత దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల ఏర్పడేలా చేశాడు. అప్పుడు దాదాపు 15 మీటర్ల ఎత్తులో నీళ్లు దారికి ఇరువైపులా గోడలా ఏర్పడ్డాయి. ఇశ్రాయేలీయులు ఆరిన నేలపై సముద్రాన్ని దాటారు. అప్పటికే సముద్ర తీరానికి చేరుకున్న ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయులు అవతలివైపుకు చేరుకోవడాన్ని చూశారు.​—⁠నిర్గ. 13:21; 14:​10-22.

తెలివిగల మరో నాయకుడైతే పరిస్థితిని గమనించి వెంబడించడం మానేసివుండేవాడే. కానీ ఫరో అలా చేయలేదు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఫరో, ఆరిన నేలపై వెళ్తున్న ఇశ్రాయేలీయులను వెంబడించమని తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. దాంతో సైన్యమంతా వారిని వెంబడించడం మొదలుపెట్టారు. కానీ ఇశ్రాయేలీయులను చేరుకోకముందే వారు ఆగిపోయారు. యెహోవా వారి రథచక్రాలు ఊడిపోయేలా చేయడంతో అవి ముందుకు కదలలేక ఆగిపోయాయి.​—⁠నిర్గ. 14:​23-25; 15:⁠9.

ఒకవైపు ఊడిపోయిన తమ రథచక్రాలతో ఐగుప్తీయులు పోరాడుతుంటే మరోవైపు ఇశ్రాయేలయులందరూ తూర్పుతీరానికి చేరుకున్నారు. మోషే ఎర్ర సముద్రంపై తన చేయి చాపినప్పుడు అప్పటివరకూ ఇరువైపుల గోడలావున్న నీళ్లను తిరిగి పొర్లేలా యెహోవా చేశాడు. లక్షల టన్నుల నీళ్లు ఫరోనూ అతని సైన్యాన్నీ ముంచివేశాయి. ఆ శత్రువుల్లో ఏ ఒక్కరూ మిగల్లేదు. ఇశ్రాయేలీయులు విడుదల పొందారు.​—⁠నిర్గ. 14:​26-28; కీర్త. 136:​13-15.

ఆ సంఘటన గురించిన వార్త విని చుట్టుప్రక్కల జనాంగాలు ఎంతోకాలం వరకు భయపడ్డారు. (నిర్గ. 15:​14-16) నలభై సంవత్సరాల తర్వాత యెరికోకు చెందిన రాహాబు ఇద్దరు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పింది: ‘మీవలన మాకు భయము పుట్టెను. మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్రసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో మేము విన్నాం.’ (యెహో. 2:​9, 10) యెహోవా తన ప్రజల్ని విడిపించిన తీరును అన్య జనాంగాలు కూడ మరచిపోలేదు. ఆయనను గుర్తుంచుకోవడానికి ఇశ్రాయేలీయులకు ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి.

‘కనుపాపవలె వారిని కాపాడాడు’

ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత, ఇశ్రాయేలీయులు ‘భయంకరమైన గొప్ప అరణ్యము’ అయిన సీనాయి ప్రాంతంలోకి ప్రవేశించారు. అంతమందికి ఆహారం అందుబాటులోలేని, ‘నీళ్లులేని ఎడారిలో’ వారు ప్రయాణిస్తున్నప్పుడు యెహోవా వారిని విడిచిపెట్టలేదు. “అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను [యెహోవా] వాని [ఇశ్రాయేలీయుల్ని] కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను” అని మోషే గుర్తుచేసుకున్నాడు. (ద్వితీ. 8:15; 32:10) దేవుడు వారిని ఎలా చూసుకున్నాడు?

యెహోవా వారి కోసం అద్భుతరీతిలో ‘ఆకాశం నుండి ఆహారాన్ని’ అంటే మన్నాను “అరణ్యపు భూమిమీద” కురిపించాడు. (నిర్గ. 16:​4, 14, 15, 35) అంతేకాక, యెహోవా వారికోసం ‘రాతిబండ’ నుండి నీళ్లు తెప్పించాడు. దేవుని ఆశీర్వాదం వారికి ఉండడంవల్ల అరణ్యంలో వారు గడిపిన 40 సంవత్సరాల్లో బట్టలు పాతబడలేదు, వారి కాళ్లు వాయలేదు. (ద్వితీ. 8:⁠4) తమకు కృతజ్ఞత ఉందని చూపించేందుకు వారు ఏమి చేయాలని యెహోవా కోరాడు? “అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువకయుండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండునట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము” అని మోషే ఇశ్రాయేలీయులతో చెప్పాడు. (ద్వితీ. 4:⁠9) ఒకవేళ యెహోవా రక్షణ కార్యాలను ఇశ్రాయేలీయులు కృతజ్ఞతతో జ్ఞాపకం ఉంచుకుంటే వారు ఆయనను ఎల్లప్పుడూ సేవిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడివుండేందుకు కృషి చేసి ఉండేవారు. అయితే, వారలా చేశారా?

మరచిపోవడం వల్ల కృతజ్ఞతలేనివారయ్యారు

మోషే ఇలా చెప్పాడు: ‘నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. దేవుణ్ణి మరచితివి.’ (ద్వితీ. 32:18) ఎర్ర సముద్రం దగ్గర యెహోవా చేసిన కార్యాలన్నీ, జనాంగం అరణ్యంలో జీవంతో ఉండడానికి ఆయన సమకూర్చినవన్నీ, ఆయన చేసిన ఇతర మంచి కార్యాలన్నిటినీ వారు ఎంతోకాలం గడవకముందే పట్టించుకోవడం మానేశారు లేదా మరచిపోయారు. వారంతా తిరుగుబాటుదారులయ్యారు.

ఒకానొక సందర్భంలో నీళ్లు దొరికే అవకాశం లేదనుకొని ఇశ్రాయేలీయులు మోషేను అవమానపరిచారు. (సంఖ్యా. 20:​2-5) వారిని సజీవంగా ఉంచిన మన్నా విషయంలో వారు ఇలా ఫిర్యాదు చేశారు: “చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనది.” (సంఖ్యా. 21:⁠5) యెహోవా నిర్ణయాలను ప్రశ్నించి మోషేను తమ నాయకునిగా తిరస్కరిస్తూ, ‘ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదము’ అని అన్నారు.​—⁠సంఖ్యా. 14:⁠3.

ఇశ్రాయేలీయులు తనకు అవిధేయులైనప్పుడు యెహోవాకు ఎలా అనిపించింది? ఆ సంఘటనలను గుర్తు చేసుకుంటూ కీర్తనకర్త ఇలా రాశాడు: “అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి. ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. మాటికిమాటికి వారు దేవుని శోధించిరి. మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచకక్రియలను వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.” (కీర్త. 78:​40-43) ఇశ్రాయేలీయులు తనను మరచిపోయినందుకు యెహోవా ఎంతగానో నొచ్చుకున్నాడు.

దేవుని మరచిపోని ఇద్దరు

అయితే, కొందరు ఇశ్రాయేలీయులు యెహోవాను మరచిపోలేదు. అలా మరచిపోని వారిలో యెహోషువ, కాలేబులు కూడా ఉన్నారు. అంతేకాక వారు కాదేషు బర్నేయ నుండి వాగ్దాన దేశాన్ని వేగు చూడడానికి పంపించబడిన పన్నెండుమందిలో ఉన్నారు. వారిలో పదిమంది చెడువార్తను తీసుకొచ్చారు, కానీ యెహోషువ, కాలేబులు మాత్రం ప్రజలతో ఇలా అన్నారు: ‘మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును; అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి.’ ప్రజలు ఆ మాటలు విన్నప్పుడు వారు యెహోషువ, కాలేబులను రాళ్లతో కొట్టి చంపాలని అనుకున్నారు. కానీ ఆ ఇద్దరు యెహోవాపై నమ్మకంతో తమ అభిప్రాయాన్ని మార్చుకోలేదు.​—⁠సంఖ్యా. 14:​6-10.

ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత కాలేబు యెహోషువతో ఇలా అన్నాడు: “దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలోనుండి నన్ను పంపినప్పుడు . . . ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. నాతోకూడ బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని.” (యెహో. 14:​6-8) దేవునిపై నమ్మకంతో యెహోషువ కాలేబులు ఎన్నో కష్టాలను సహించారు. తాము బ్రతికున్నంతకాలం యెహోవాను మరచిపోకూడదని నిర్ణయించుకున్నారు.

తన ప్రజలను సారవంతమైన దేశములోకి నడిపిస్తానని చేసిన వాగ్దానాన్ని యెహోవా నెరవేర్చాడని గుర్తించి యెహోషువ, కాలేబులు తమ కృతజ్ఞతను కూడా చూపించారు. తమను సజీవంగా ఉంచినందుకు ఇశ్రాయేలీయులు యెహోవాకు కృతజ్ఞత చూపించి ఉండాల్సింది. యెహోషువ ఇలా రాశాడు: “యెహోవా ప్రమాణముచేసి వారి పితరుల కిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయుల కప్పగించెను . . . యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను.” (యెహో. 21:​43, 44) కాలేబు, యెహోషువలా నేడు మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?

కృతజ్ఞతను చూపించండి

దైవభక్తిగల ఓ వ్యక్తి ఒకసారి ఇలా అన్నాడు: “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?” (కీర్త. 116:12) యెహోవా మనకు భౌతిక ఆశీర్వాదాలను, నడిపింపును ఇస్తున్నందుకు, భవిష్యత్తు కోసం ఆయన రక్షణ ఏర్పాట్లు చేసినందుకు మనం నిరంతరం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా ఆయనకు ఇంకా రుణపడే ఉంటాం. నిజానికి మనం ఎన్నడూ యెహోవా రుణాన్ని తీర్చుకోలేం. కానీ మనమందరం కృతజ్ఞతను కనబరచవచ్చు.

యెహోవా ఉపదేశంవల్ల మీరు సమస్యలను తప్పించుకోగలిగారా? దేవుడు క్షమిస్తాడని తెలుసుకోవడంవల్ల మీరు నిర్మలమైన మనస్సాక్షిని తిరిగి పొందగలిగారా? అలాంటి దేవుని కార్యాలవల్ల శాశ్వతకాల ప్రయోజనాలను మనం అనుభవిస్తాం కాబట్టి మీరు ఎల్లప్పుడు ఆయనకు కృతజ్ఞత చూపించాలి. 14 ఏళ్ల సాండ్రా అనే యువతి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంది. అయితే యెహోవా సహాయంతో వాటిని అధిగమించగలిగింది. ఆమె ఇలా అంటోంది: “నేను సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాను. ఆయన నాకు సహాయం చేసిన తీరు నన్నెంతో ముగ్ధురాల్ని చేసింది. ‘నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును’ అని సామెతలు 3:​5, 6లోవున్న వచనాన్ని మా నాన్న ఎందుకు చెబుతూ ఉండేవారో నాకిప్పుడు అర్థమైంది. యెహోవా నాకు ఇప్పటివరకు చేసినట్లే భవిష్యత్తులో కూడా అన్ని సందర్భాల్లో నాకు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను.”

సహించడం ద్వారా యెహోవాను మరచిపోలేదని చూపించండి

యెహోవాను మరచిపోకుండా ఉండేందుకు సహాయం చేసే మరొక లక్షణం గురించి బైబిలు ఇలా చెబుతోంది: “మీరు సంపూర్ణులును, అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునైయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.” (యాకో. 1:⁠4) ‘సంపూర్ణులుగా, అనూనాంగులుగా’ ఉండాలంటే ఏమి చేయాలి? యెహోవాపై నమ్మకంతో పరీక్షలను ఎదుర్కొనేందుకు, నిరుత్సాహపడకుండా కృతనిశ్చయంతో వాటిని సహించేందుకు కావాల్సిన లక్షణాలను పెంపొందించుకోవాలి. అలా సహనం చూపిస్తే విశ్వాస పరీక్షలు పూర్తయినప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. విశ్వాస పరీక్షలు శాశ్వతంగా ఉండవు.​—⁠1 కొరిం. 10:⁠13.

ఎంతో కాలంగా యెహోవాను నమ్మకంగా సేవిస్తున్న ఒక సహోదరుడు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డాడు. అయితే, ఆరోగ్య సమస్యల్ని సహించడానికి తనకు సహాయం చేసిన విషయాల గురించి చెబుతూ ఇలా అన్నాడు: “నేను ఏమి చేయాలనే దాని గురించి కాక యెహోవా ఏమి చేస్తున్నాడనే దాని గురించే ఆలోచించడానికి ప్రయత్నిస్తాను. సొంత అభీష్టాలకు ప్రాముఖ్యతనివ్వకుండా దేవుని ఉద్దేశాలకు ప్రాముఖ్యతనివ్వడమే యథార్థత. కష్టాలు ఎదురౌతున్నప్పుడు, ‘యెహోవా, ఈ సమస్యలు నాకే ఎందుకు రావాలి’ అని నేను అనను. అనుకోని సమస్యలు ఎదురైనా నేను యెహోవాను విడిచిపెట్టకుండా ఆయనను సేవిస్తూ ఉంటాను.”

నేడు నిజ క్రైస్తవులు యెహోవాను “ఆత్మతోను సత్యముతోను” ఆరాధిస్తున్నారు. (యోహా. 4:​23, 24) ఇశ్రాయేలు జనాంగం మరచిపోయినట్లు నిజ క్రైస్తవులు ఒక గుంపుగా యెహోవా దేవుణ్ణి ఎన్నడూ మరచిపోరు. మనం క్రైస్తవ సంఘంలో ఉన్నంతమాత్రాన మనం ఎల్లప్పడూ యథార్థంగా ఉంటామని ఏమీ లేదు. యెహోషువ, కాలేబులా మనలో ప్రతి ఒక్కరం కృతజ్ఞతను చూపిస్తూ యెహోవా సేవలో సహనంతో కొనసాగాలి. అలా చేయడానికి మనకు ఎన్నో కారణాలున్నాయి. ఎందుకంటే, కష్టమైన ఈ చివరి దినాల్లో మనలో ప్రతి ఒక్కరిపట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ చూపిస్తూ యెహోవా మనల్ని నడిపిస్తున్నాడు.

యెహోషువ స్మారకచిహ్నంగా నిలువబెట్టిన రాళ్లలా దేవుడు చేసిన రక్షణ కార్యాలు యెహోవా తన ప్రజల్ని విడిచిపెట్టడని మనకు హామీనిస్తున్నాయి. అందుకే, కీర్తనకర్త వ్యక్తం చేసిన భావాలనే మీరూ వ్యక్తం చేయాలని కోరుకుంటున్నాం. ఆయన ఇలా అన్నాడు: “యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.”​—⁠కీర్త. 77:​11, 12.

[7వ పేజీలోని చిత్రం]

మొత్తం జనాంగం ‘ఎడారిలో’ ప్రయాణించాల్సి వచ్చింది

[చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

[8వ పేజీలోని చిత్రం]

ఇశ్రాయేలీయులు కాదేషు బర్నేయలో ఉన్నప్పుడు వేగులవారు వాగ్దాన దేశానికి పంపించబడ్డారు

[చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

[9వ పేజీలోని చిత్రం]

ఎన్నో సంవత్సరాలు అరణ్యంలో గడిపిన తర్వాత సారవంతమైన వాగ్దాన దేశంలోకి ప్రవేశించినందుకు ఇశ్రాయేలీయులు ఎంతో కృతజ్ఞత కనబరచివుంటారు

[చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

[10వ పేజీలోని చిత్రం]

యెహోవా ఉద్దేశాల గురించే ఆలోచిస్తే ఎలాంటి పరీక్షలు ఎదురైనా వాటిని సహించగలుగుతాం