కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘యెహోవా దూత చుట్టూ కావలివుంది’

‘యెహోవా దూత చుట్టూ కావలివుంది’

‘యెహోవా దూత చుట్టూ కావలివుంది’

క్రిష్టబెల్‌ కనెల్‌ చెప్పినది

క్రిష్టఫర్‌ అడిగిన బైబిలు ప్రశ్నలకు జవాబు చెబుతూ మేము రాత్రి అయిపోయిందన్న సంగతే మరిచిపోయాం. అంతేకాక ఆయన కిటికీలోంచి బయటకు చూస్తున్నాడన్నదీ గమనించలేదు. చివరకు ఆయన మావంక చూసి “మీరు ఇప్పుడు వెళ్లడమే మంచిది” అని చెప్పి మా సైకిళ్ల వరకు వచ్చి మమ్మల్ని సాగనంపాడు. అంత ప్రమాదకరమైన దేన్ని ఆయన గమనించాడు?

క్రిష్టబెల్‌ ఆర్ల్‌ అనే నేను 1927లో ఇంగ్లాండులోని షఫీల్డ్‌లో పుట్టాను. రెండవ ప్రపంచ యుద్ధంలో మా ఇల్లు బాంబు పేలుళ్లో ధ్వంసం కావడంతో నన్ను మా అమ్మమ్మ దగ్గరకు పంపించారు. అక్కడే నేను పాఠశాల విద్యను ముగించుకున్నాను. నేను క్యాథలిక్‌ స్కూల్లో చదివాను. చెడుతనం, హింస ఇంతెక్కువగా ఎందుకు ఉన్నాయని అక్కడ పనిచేసే నన్‌లను అడుగుతూ ఉండేదాన్ని. వారుగానీ ఇతర మతాలవారు గానీ వాటికి సంతృప్తికరమైన జవాబులు ఇవ్వలేకపోయారు.

రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత నేను నర్సుగా శిక్షణపొంది పాడింగ్‌టన్‌ జనరల్‌ ఆసుపత్రిలో పనిచేయడానికి లండన్‌ వెళ్లాను. అక్కడ ఎంతో హింసను చూశాను. మా అన్న కొరియా యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లాడు. అలా వెళ్లిన కొద్దిరోజులకే ఆసుపత్రి బయట పెద్ద కొట్లాట జరగడాన్ని చూశాను. ఆ కొట్లాటలో దెబ్బతిన్న ఒక వ్యక్తి కంటి చూపు పోగొట్టుకున్నా ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. అప్పట్లో మాధ్యమాల ద్వారా దయ్యాలతో మాట్లాడడానికి జరిపే కూటాలకు మా అమ్మతోపాటు నేను వెళ్లేదాన్ని. అయినా దుష్టత్వం ఇంతెందుకుందో అర్థం చేసుకోలేకపోయాను.

బైబిలు అధ్యయనం చేయమని ప్రోత్సహించబడ్డాను

యెహోవాసాక్షి అయిన మా పెద్దన్న జాన్‌ ఒకరోజు మమ్మల్ని చూడ్డానికని వచ్చాడు. “ప్రపంచంలో ఇంత చెడు ఎందుకు ఉందో తెలుసా” అని ఆయన నన్ను అడిగాడు. తన బైబిలు తెరచి ప్రకటన 12:​7-12లోని మాటలను చదివి వినిపించాడు. అప్పుడు ప్రపంచంలో ఇంత చెడు ఉండడానికి సాతాను అతని దయ్యాలే కారణమని నేను తెలుసుకోగలిగాను. జాన్‌ సలహాను పాటించి వెంటనే బైబిలు అధ్యయనం ఆరంభించాను. అయితే, అప్పట్లో మనుష్యుల భయంవల్ల నేను బాప్తిస్మం తీసుకోలేదు.​—⁠సామె. 29:⁠25.

మా అక్క డోరథి కూడ యెహోవాసాక్షి అయ్యింది. న్యూయార్క్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశం (1953) ముగించుకొని తన కాబోయే భర్త బిల్‌ రాబర్ట్స్‌తో తిరిగి వచ్చినప్పుడు నేను బైబిలు అధ్యయనం చేశానని వారితో చెప్పాను. “నువ్వు లేఖనాలన్నీ పరిశీలించావా? పుస్తకంలో జవాబులను మార్క్‌ చేశావా?” అని బిల్‌ అడిగాడు. నేను అలా చేయలేదని చెప్పడంతో, “అంటే, నువ్వు అసలు అధ్యయనం చేయలేదన్నమాట! ఆ సహోదరిని కలిసి మళ్లీ అధ్యయనం చెయ్యి!” అని చెప్పాడు. దాదాపు ఆ సమయానికే దయ్యాలు నన్ను పీడించడం మొదలుపెట్టాయి. దయ్యాలనుండి నన్ను రక్షించి విడిపించమని దేవుణ్ణి వేడుకున్న రోజులు నాకింకా గుర్తున్నాయి.

స్కాట్లాండ్‌లో, ఐర్లాండ్‌లో పయినీరు సేవ

నేను 1954 జనవరి 16న బాప్తిస్మం తీసుకున్నాను. మే నెలలో నేను ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేయాల్సిన గడువుకాలం పూర్తి చేసిన తర్వాత జూన్‌లో పయినీరు సేవ మొదలుపెట్టాను. ఎనిమిది నెలల తర్వాత స్కాట్లాండ్‌లోని గ్రేంజ్‌మౌత్‌ నగరంలో ప్రత్యేక పయినీరుగా నియమించబడ్డాను. ఆ మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు దేవుని దూత ‘చుట్టూ కావలివుందని’ నేను గుర్తించాను.​—⁠కీర్త. 34:⁠7.

1956లో నన్ను ఐర్లాండ్‌కు పంపించారు. నాతోపాటు మరో ఇద్దరు సహోదరీలను గాల్‌వే అనే నగరానికి పంపించారు. మేము పరిచర్యకు వెళ్లిన మొదటి రోజే పాదిరీని కలిశాం. కొన్ని నిమిషాల తర్వాత, ఒక పోలీసు వచ్చి నన్ను, తోటి సహోదరిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. మా పేర్లూ చిరునామాలూ తీసుకొని వెంటనే పాదిరీకి ఫోను చేశాడు. “పాదిరీగారూ వాళ్లెక్కడుంటారో నాకు తెలుసు” అని ఆయన ఫోనులో చెబుతుండగా మేము విన్నాం. ఆ పోలీసును పంపించింది పాదిరే అని అప్పుడు మాకర్థమైంది. మాతో ఇల్లు ఖాళీ చేయించమని మా ఇంటి ఓనరుమీద ఒత్తిడి తీసుకురావడంతో బ్రాంచి కార్యాలయం మమ్మల్ని ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లమని నిర్దేశించింది. మేము రైల్వేస్టేషన్‌కు పది నిమిషాలు లేటుగా వెళ్లినా, రైలు అక్కడేవుంది. మేము రైలు ఎక్కామో లేదో చూడ్డానికి ఒక వ్యక్తి అక్కడే నిల్చొని ఉన్నాడు. ఇదంతా మేము గాల్‌వేకు వెళ్లిన మూడు వారాలకే జరిగింది!

మమ్మల్ని క్యాథలిక్‌ చర్చి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న లిమరిక్‌ అనే మరో నగరానికి పంపించారు. అక్కడ అల్లరిమూకలు గట్టిగా కేకలువేస్తూ మమ్మల్ని వెంబడించేవి. చాలామంది తలుపులు తెరవడానికి భయపడేవాళ్లు. అప్పటికే ఒక సంవత్సరం క్రితం ఆ నగరానికి దగ్గర్లోవున్న క్లూన్‌లారా అనే చిన్న పట్టణంలో ఒక సహోదరుణ్ణి కొట్టారు. అలాంటి ప్రాంతంలోనే మొదట్లో ప్రస్తావించిన క్రిష్టఫర్‌ను కలిశాం. ఆయన తనకున్న బైబిలు ప్రశ్నలను మాతో చర్చించడానికి మళ్లీ రమ్మన్నాడు. మేము ఆయన ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు ఒక పాదిరీ ఇంటిలోకి దూసుకొచ్చి మమ్మల్ని పంపేయమని క్రిష్టఫర్‌ను అడిగాడు. పాదిరీని నిలవరించి క్రిష్టఫర్‌ ఇలా అన్నాడు: “వీళ్లు నేను పిలిస్తే వచ్చారు, వచ్చేముందు తలుపు తట్టి మరీ లోనికి వచ్చారు. మిమ్మల్ని నేను పిలవలేదు సరికదా మీరు లోనికి వచ్చేముందు కనీసం తలుపైనా తట్టలేదు.” అలా అనేసరికి, కోపంతో ఆ పాదిరీ అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

కోపంతో మా మీద దాడి చేయడానికి ఆ పాదిరీ ఒక పెద్ద గుంపును కూడగట్టాడు. వాళ్లు మాకోసం క్రిష్టఫర్‌ ఇంటి బయట వేచివున్నారన్న సంగతే మాకు తెలియలేదు. కానీ ఆ విషయాన్ని గమనించిన క్రిష్టఫర్‌ పైన ప్రస్తావించినట్లుగా ప్రవర్తించాడు. వాళ్లు వెళ్లిపోయేంతవరకు మేము ఇంట్లోనే ఉండేటట్లు చూశాడు. క్రిష్టఫర్‌ ఆయన కుటుంబ సభ్యులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాల్సివచ్చిందనీ వారు అక్కడి నుండి ఇంగ్లాండుకు వెళ్లిపోయారనీ మాకు ఆ తర్వాత తెలిసింది.

గిలియడ్‌ పాఠశాలకు ఆహ్వానించబడ్డాను

1958లో న్యూయార్క్‌లో జరిగే దైవిక చిత్తం అనే అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యేందుకు నేను సిద్ధపడుతున్నాను. సరిగ్గా అప్పుడే గిలియడ్‌ పాఠశాల 33వ తరగతికి నేను ఆహ్వానించబడ్డాను. అయితే సమావేశం అయిన తర్వాత నేను ఇంటికి వెళ్లలేదు. ఎందుకంటే 1959లో గిలియడ్‌ పాఠశాల ప్రారంభమయ్యేంత వరకు నేను కెనడాలోని ఓంటారియో రాష్ట్రానికి చెందిన కాలింగ్‌వుడ్‌ పట్టణంలో సేవచేశాను. ఆ సమావేశంలో నేను ఎరిక్‌ కనెల్‌ను కలిశాను. ఆయన 1957లో సత్యం తెలుసుకుని, 1958లో పయినీరు సేవ ఆరంభించాడు. అసెంబ్లీ అయిన తర్వాత నేను కెనడాలో ఉన్నంతకాలం, గిలియడ్‌ పాఠశాల జరుగుతున్నంతకాలం ఆయన నాకు ప్రతీరోజూ ఉత్తరం రాసేవాడు. నేను గిలియడ్‌ పట్టభద్రురాలైన తర్వాత మా భవిష్యత్తు ఏమిటా అని ఆలోచించాను.

గిలియడ్‌ పాఠశాలకు హాజరవ్వడమే నా జీవితంలో జరిగిన అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన. మా అక్క డోరథి, మా బావ కూడ ఆ తరగతికే హాజరయ్యారు. వారిని పోర్చుగల్‌కు పంపించారు. అయితే నన్ను ఐర్లాండ్‌కు పంపిస్తారని ఊహించనేలేదు. అంతవరకూ నేను మా అక్కవాళ్లతో పాటు వెళ్తాననుకున్నాను కానీ వారితో పంపించకపోయేసరికి నేను చాలా నిరాశచెందాను. నేను ఏదైనా తప్పుచేసినందుకు అలా పంపిస్తున్నారా అని ఒక ఉపదేశకుణ్ణి అడిగాను. ఆయన “లేదు” “నువ్వూ, నీతోపాటు నియమించబడిన ఐలీన్‌ మెయోనీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు ఒప్పుకున్నారు,” అందులో ఐర్లాండ్‌ కూడ ఉంది అని ఆయన జవాబిచ్చాడు.

తిరిగి ఐర్లాండ్‌కు

1959 ఆగస్టులో నేను తిరిగి ఐర్లాండ్‌కు వెళ్లాను. అక్కడ నేను డ్యూన్‌ లవొగైర్‌ సంఘంతో పనిచేయడానికి నియమించబడ్డాను. ఆ సమయానికల్లా ఎరిక్‌ ఇంగ్లాండుకు తిరిగివచ్చాడు. నేను ఆయనకు చాలా దగ్గర్లోనే ఉంటున్నానని తెలుసుకొని సంతోషించాడు. తను కూడ మిషనరీ అవ్వాలనుకున్నాడు. అప్పట్లో ఐర్లాండ్‌కు మిషనరీలను పంపించేవారు కాబట్టి ఆయన అక్కడే పయినీరు సేవ చేస్తానని అన్నాడు. అలా తను డ్యూన్‌ లవొగైర్‌కు వచ్చాడు, 1961లో మేము పెళ్ళి చేసుకున్నాం.

ఆరు నెలల తర్వాత ఎరిక్‌ మోటర్‌బైక్‌ మీద వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదంలో ఆయన తలకు తీవ్రమైన గాయమయ్యింది. దాంతో తన ప్రాణాన్ని రక్షించడం కష్టమేనని డాక్టర్లు అనుకున్నారు. మూడు వారాలు ఆసుపత్రిలో ఉండి ఇంటికి తిరిగివచ్చిన తర్వాత ఆయన బాగయ్యేంతవరకు అంటే అయిదు నెలలు ఆయనను దగ్గరవుండి చూసుకున్నాను. ఆ సమయంలో పరిచర్యలో నేను చేయగలిగినదంతా చేశాను.

1965లో ఎనిమిదిమంది ప్రచారకులున్న స్లీగొ సంఘానికి మమ్మల్ని పంపించారు. ఇది వాయువ్య తీరంలోవున్న ఓడరేవు పట్టణం. మూడు సంవత్సరాల తర్వాత ఉత్తరాన చాలా దూరంలోవున్న లండన్‌డెరీ ప్రాంతంలోని మరో చిన్న సంఘానికి వెళ్లాం. ఓ రోజు, సేవ చేసి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు రోడ్డుకు అడ్డంగా ఇనుప తీగలు ఉండడాన్ని చూశాను. ఉత్తర ఐర్లాండ్‌లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. అల్లరిమూకలు కారులను తగులబెట్టాయి. అప్పటికే ప్రొటస్టెంటులని, క్యాథలిక్‌లని ఆ పట్టణం రెండు వర్గాలుగా విడిపోయింది. పట్టణంలో ఒక ప్రాంతంనుండి మరో ప్రాంతానికి వెళ్లడం ప్రమాదకరం అయింది.

కష్టాల్లో మా ప్రకటనా పని, మా జీవితం

అయితే పరిచర్య చేయడంవల్ల మేము ఎన్నో ప్రాంతాలకు వెళ్లగలిగాం. దేవదూతలు మా చుట్టూ కావలివున్నారని మరోసారి మాకు అనిపించింది. ఘర్షణలు జరుగుతున్నాయని తెలిస్తే ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి పరిస్థితులు సర్దుమణిగినప్పుడు తిరిగి వెళ్లేవాళ్లం. ఓసారి మా ఇంటికి దగ్గర్లో ఘర్షణలు జరిగినప్పుడు ఒక పెయింట్‌ షాపు తగలబడి అక్కడనుండి నిప్పురవ్వలు వచ్చి మా కిటికీదిమ్మపై పడ్డాయి. దాంతో మా ఇల్లు ఎక్కడ తగలబడిపోతుందోనన్న భయంతో మాకు అసలు నిద్రే పట్టలేదు. అయితే, 1970లో మేము బెల్‌ఫాస్ట్‌ నగరానికి తరలివెళ్లాం. కానీ మా పాత ఇంటి దగ్గర ఉన్న పెయింట్‌ షాపు మరోసారి ఒక పెట్రోల్‌ బాంబు వల్ల తగలబడిందనీ దానివల్ల మేము ఇంతకుముందు ఉన్న ఇల్లు కూడ తగలబడిపోయిందని తెలుసుకున్నాం.

ఒకసారి నేనూ, మరో సహోదరీ కలిసి ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు ఒక ఇంటి కిటికీదిమ్మపై వింతైన ఆకారంలోవున్న పైపుముక్క కనిపించింది. అది పట్టించుకోకుండా మేము ముందుకెళ్లాం. కొద్దిసేపటికి మేము చూసిన ఆ పైపు ముక్క పేలింది. బాంబు పేలుడికి బయటకు వచ్చి గుమికూడిన జనాలు ఆ బాంబు పెట్టింది మేమేనని అనుకున్నారు. సరిగ్గా అప్పుడే ఆ ప్రాంతంలో ఉంటున్న ఒక సహోదరి మమ్మల్ని తన ఇంట్లోకి పిలిచింది. దాంతో ఆ బాంబు పేలుడుకూ మాకూ ఏ సంబంధం లేదని అక్కడున్న ప్రజలకు అర్థమైంది.

1971లో ఒక సహోదరిని కలవడానికి లండన్‌డెరీకి తిరిగివెళ్లాం. మేము వచ్చిన రోడ్డు, దాటి వచ్చిన చెక్‌ పాయింట్‌ గురించి చెప్పినప్పుడు ఆ సహోదరి “చెక్‌ పాయింట్‌ దగ్గర ఎవరూ లేరా?” అని అడిగింది. “ఉన్నారు, గానీ మమ్మల్ని ఏమనలేదు” అని మేము చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె ఎందుకు ఆశ్చర్యపోయిందంటే కొద్దిరోజుల క్రితం అక్కడ ఒక డాక్టరునూ ఒక పోలీసునూ బలవంతంగా ఈడ్చుకెళ్లి కాల్చి చంపేశారు.

1972లో మేము కోర్క్‌ అనే పట్టణానికి వెళ్లాం. ఆ తర్వాత నాస్‌ అనే పట్టణానికీ ఆర్క్‌లొ అనే ఓడరేవు పట్టణానికీ సేవచేయడానికి వెళ్లాం. చివరకు మమ్మల్ని 1987లో కాసిల్‌బార్‌ అనే పట్టణానికి నియమించారు. మేము ప్రస్తుతం అక్కడే ఉంటున్నాం. ఇక్కడ ఒక రాజ్యమందిరం కట్టే అవకాశం లభించినందుకు మేమెంతో సంతోషించాం. 1999లో ఎరిక్‌ ఆరోగ్యం చాలా క్షీణించింది. అయినా యెహోవా సహాయంతో, సంఘం ప్రేమతో ఇచ్చిన మద్దతుతో మరోసారి నేను ఆ పరిస్థితిని తాళుకోగలిగాను, ఆయన ఆరోగ్యం కుదుటపడేంతవరకు ఆయన్ని చూసుకోగలిగాను.

ఎరిక్‌, నేనూ పయినీరు పాఠశాలకు రెండుసార్లు హాజరయ్యాం. తను ఇప్పటికీ సంఘ పెద్దగా పనిచేస్తున్నాడు. నేను కీళ్లవాపుతో చాలా బాధపడ్తున్నాను. అదేకాక నా మోకాళ్ల, తుంట్ల ఎముకలు ఆపరేషన్‌ చేసి మార్చారు. నేను మతపరమైన వ్యతిరేకతను ఎంతో ఎదుర్కోవాల్సివచ్చినా, సమాజంలో, రాజకీయ వ్యవస్థలో తీవ్రమైన సమస్యలు తలెత్తిన కాలంలో జీవించాల్సి వచ్చినా వాటన్నిటికంటే కారు నడపడాన్ని ఆపేయడమే నాకు చాలా కష్టమనిపించింది. ఎందుకంటే నేను వెళ్లాలనుకునే చోటికి వెళ్లలేకపోయేదాన్ని. సంఘ సభ్యులు ఆసరాగా నిలబడి నాకెంతో సహాయం చేశారు. ఇప్పుడు నేను చేతికర్ర సహాయంతో నడుస్తున్నాను. దూరం వెళ్లాలంటే బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిలును ఉపయోగిస్తాను.

ప్రత్యేక పయినీర్లముగా మేము సేవ చేసిన సంవత్సరాలను కలిపితే అవి 100కన్నా ఎక్కువ సంవత్సరాలే అవుతుంది. వాటిలో 98 సంవత్సరాలు ఐర్లాండ్‌లోనే గడిపాం. మేము ముసలివాళ్లమయ్యామనే సాకుతో ఈ సేవను ఆపదలచుకోలేదు. మేము అద్భుతాలు జరగాలని ఆశించడంలేదు కానీ యెహోవాపట్ల భయభక్తులు కలిగివుంటూ ఆయనను నమ్మకంగా సేవించేవారి ‘చుట్టూ’ ఆయన శక్తివంతమైన దూతలు ‘కావలివున్నారని’ నమ్ముతున్నాం.