యెహోవా మనందరి స్తుతి పొందేందుకు అర్హుడు
యెహోవా మనందరి స్తుతి పొందేందుకు అర్హుడు
‘ప్రజలారా, యెహోవాను స్తుతించండి.’—కీర్త. 111:1, NW.
“అల్లెలూయా!” ఈ మాట సాధారణంగా క్రైస్తవమత సామ్రాజ్యంలోని చర్చీల్లో వినిపిస్తుంది. కొంతమంది ప్రజలు తమ సంభాషణల్లో ఈ మాటను తరచూ ఉపయోగిస్తుంటారు. అయితే, ఆ పదం ఎంత పవిత్రమైనదో కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసు. అంతెందుకు ఆ పదాన్ని ఉపయోగించే చాలామంది దేవున్ని అవమానపరిచే విధంగా జీవిస్తున్నారు. (తీతు 1:16) “తమతో కలిసి యెహోవాను స్తుతించమని ప్రజల్ని ఆహ్వానించేందుకు ‘అల్లెలూయా’ అనే పదాన్ని వివిధ కీర్తనల రచయితలు ఉపయోగించారు” అని ఒక బైబిలు నిఘంటువు చెబుతోంది. నిజానికి, “అల్లెలూయా” అనే పదానికి “యెహోవాను స్తుతించుడి” అనే అర్థముందని చాలామంది బైబిలు విద్వాంసులు చెబుతున్నారు.
2 అందుకే, నూతనలోక అనువాదములో కీర్తన 111:1 ఇలా అనువదించబడింది: ‘ప్రజలారా, యెహోవాను స్తుతించండి.’ ప్రకటన 19:1-6లో ఈ మాటకు సంబంధించిన గ్రీకు పదం నాలుగుసార్లు కనిపిస్తుంది. ఆ మాట అబద్ధమతం నాశనమైందన్న సంతోషంతో చెప్పబడింది. అది జరిగినప్పుడు సత్యారాధకులు “అల్లెలూయా” అనే మాటను గౌరవపూర్వకంగా ఉపయోగించడానికి ప్రత్యేకమైన కారణం ఉంటుంది.
ఆయన గొప్ప కార్యాలు
3 మనందరి స్తుతి పొందడానికి యెహోవా ఎందుకు అర్హుడో చూపించే అనేక కారణాలను 111వ కీర్తనకర్త వివరిస్తున్నాడు. 1వ వచనం ఇలా చెబుతోంది: “యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.” నేటి యెహోవాసాక్షులకూ అలాగే అనిపిస్తుంది. మనం యెహోవాను స్తుతించడానికే స్థానిక కూటాల్లో, పెద్ద సమావేశాల్లో క్రమంగా సమకూడతాం.
4“యెహోవా క్రియలు గొప్పవి వాటియందు ఇష్టముగలవారందరు వాటిని విచారించుదురు.” (కీర్త. 111:2) “విచారించుదురు” అనే మాటను గమనించండి. ఒక గ్రంథం ప్రకారం, ఈ వచనం దేవుని కార్యాల గురించి “హృదయపూర్వకంగా, నిష్ఠగా ధ్యానించి అధ్యయనం చేసేవారికి” వర్తిస్తుంది. విశ్వాన్ని గమనిస్తే యెహోవా అద్భుతమైన ఉద్దేశంతో దాన్ని సృష్టించాడని తెలుస్తుంది. భూమ్మీద కావల్సినంత వేడి, కాంతి, రాత్రింబగళ్లు, రుతువులు, అలల ఆటుపోట్లు వంటివి ఉండేలా దేవుడు సూర్యుణ్ణి, భూమిని, చంద్రుణ్ణి, పొందికగా వాటి వాటి కక్ష్యల్లో ఉంచాడు.
5 సౌర కుటుంబంలో భూమి స్థానం గురించీ, చంద్రుని పరిపూర్ణమైన కక్ష్య, పరిమాణం, ద్రవ్యరాశి గురించీ శాస్త్రజ్ఞులు ఎన్నో విషయాలను కనుగొన్నారు. ఈ రెండు ఆకాశగ్రహాలు పొందికగా వాటివాటి కక్ష్యల్లో ఏర్పరచబడడంవల్ల, వాటి మధ్య ఉన్న సంబంధంవల్ల మన మనస్సును ఆహ్లాదపరిచేలా రుతువులు క్రమంగా మారుతుంటాయని
తెలుసుకున్నారు. అంతేకాక, విశ్వంలోని ప్రకృతి శక్తులు ఎలా జాగ్రత్తగా రూపొందించబడ్డాయనే దాని గురించి కూడా ఎంతో తెలుసుకున్నారు. అందుకే, “ద డిసైన్డ్ ‘జస్ట్ సొ’ యూనివర్స్” అనే ఆర్టికల్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఇలా రాశాడు: “గత 30 సంవత్సరాల్లో చాలామంది శాస్త్రజ్ఞులు, సృష్టి యాదృచ్ఛికంగా వచ్చిందని నమ్మడం కష్టమే అని ఒప్పుకుంటూ సృష్టి విషయంలో తమకున్న అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకున్నారో మనం అర్థం చేసుకోవడం పెద్ద సమస్యేమీ కాదు. ఎంతో నైపుణ్యంతో రూపొందించబడిన భూమి గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా దాన్ని తెలివిగల సృష్టికర్త సృష్టించాడని చూపించే రుజువులను కనుగొంటాం.”6 దేవుడు మానవుణ్ణి చేసిన విధానమే సృష్టిలోని మరో గొప్ప కార్యం. (కీర్త. 139:14) మానవులను సృష్టించినప్పుడు దేవుడు వారికి మెదడును, అవసరమైన అవయవాలున్న శరీరాన్ని, పనులు చేయడానికి కావాల్సిన శక్తిసామర్థ్యాలను ఇచ్చాడు. ఉదాహరణకు, మాట్లాడే, వినే, రాసే, చదివే సామర్థ్యాలు ఎంత అద్భుతమైనవో ఒకసారి ఆలోచించండి. చాలామందికి ఆ సామర్థ్యాలున్నాయి. అంతేకాక, మీరు నిటారుగా నిలబడగలిగే సామర్థ్యంతో అద్భుతంగా సృష్టించబడ్డారు. మీ శరీరం నిర్మించబడిన విధానం, శరీర అవయవాలు పనిచేసే తీరు, ఆహారాన్ని తీసుకొని దాన్ని శక్తిగా మార్చుకునే సామర్థ్యం వంటివి ఎంతగానో అబ్బురపరుస్తాయి. అంతేకాక, మీ మెదడు, జ్ఞానేంద్రియాలు పనిచేసేందుకు తోడ్పడే అద్భుతమైన నాడీవ్యవస్థతో పోలిస్తే అసలు శాస్త్రజ్ఞులు సాధించింది చాలా తక్కువ. నిజానికి, మానవులకు మెదడు, జ్ఞానేంద్రియాలు అనుగ్రహించబడ్డాయి కాబట్టే వారు ఎన్నో సాధించగలిగారు. అద్భుతంగా రూపొందించబడిన మీ చేతులకు ఉన్న పది వేళ్లలాంటి అందమైన, ఉపయోగకరమైన పరికరాన్ని ఎంతో శిక్షణ పొందిన సమర్థుడైన ఇంజనీర్ కూడా రూపొందించలేడు. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘దేవుడిచ్చిన చేతివేళ్లను నైపుణ్యంగా ఉపయోగించకుండా ఆకర్షణీయమైన కళాకృతులను, నిర్మాణ పనులను చేయగలమా?’
దేవుని గొప్ప కార్యాలు, ఆయన లక్షణాలు
7 బైబిలు చెబుతున్నట్లుగా మానవుల కోసం యెహోవా చేసిన గొప్ప కార్యాల్లో ఇతర ఆశ్చర్యకరమైన కార్యాలు కూడా ఉన్నాయి. వాటిలో బైబిలు ఒకటి. దానిలోని పుస్తకాలు అసాధారణ రీతిలో ఒకదానికొకటి పొందికగా ఉన్నాయి. అంతేకాక, ఇది ఇతర పుస్తకాల వంటిది కాదు, ఎందుకంటే ఇది ‘దైవావేశమువలన కలిగింది, ఉపదేశించడానికి ప్రయోజనకరమైనది.’ (2 తిమో. 3:16) ఉదాహరణకు, బైబిల్లోని మొదటి పుస్తకమైన ఆదికాండము, దేవుడు నోవహు కాలంలో భూమ్మీదున్న దుష్టత్వాన్ని ఎలా తీసివేశాడో వివరిస్తోంది. రెండవ పుస్తకమైన నిర్గమకాండము, దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడుదల చేసి తన దైవత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడో వివరిస్తోంది. కీర్తనకర్త ఆ సంఘటనలను మనసులో ఉంచుకొని ఈ మాటలు చెప్పివుంటాడు: “ఆయన [యెహోవా] కార్యము మహిమా ప్రభావములుగలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును. ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు.” (కీర్త. 111:3, 4) మీ జీవితకాలంలో మీరు చూసిన వాటితో సహా చరిత్రంతటిలో యెహోవా చేసిన కార్యాలన్నీ ఆయన ‘మహిమా, ప్రభావములకు’ జ్ఞాపకార్థసూచనగా ఉన్నాయని మీరు ఒప్పుకోరా?
8 నీతి, దయాదాక్షిణ్యాల వంటి యెహోవా అద్భుతమైన లక్షణాల గురించి కూడా కీర్తనకర్త నొక్కిచెబుతున్నాడనేది గమనించండి. పాపులైన మానవులు చాలా అరుదుగా నీతి కార్యాలు చేస్తుంటారని మీకు తెలుసు. సాధారణంగా వారు దురాశ, అసూయ, అహంకారంతోనే అవన్నీ చేస్తుంటారు. ఆర్థిక లాభం పొందడానికి, యుద్ధాలను ఉసిగొల్పడానికి మారణాయుధాలను ఉత్పత్తి చేస్తూ ఆ లక్షణాలు కనబరుస్తున్నారు. దానివల్ల అమాయకులైన లక్షలాదిమంది బాధితులను ఎన్నో కష్టాలకు, భయాందోళనకు గురౌతున్నారు. అంతేకాక, మానవులు చేసిన చాలా కార్యాలు, అణచివేతకు గురైన బీదవారికి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ విషయంలో పిరమిడ్‌లను నిర్మించడానికి దాసులను ఉపయోగించిన వైనాన్ని చాలామంది ఉదహరిస్తారు. అవి ముఖ్యంగా గర్విష్ఠులైన ఫరోల సమాధులుగా ఉపయోగించబడ్డాయి. ఇప్పటికీ మానవులు చేసే అనేక కార్యాలు ఇతరులను అణచివేతకు గురి చేయడమేకాక ‘భూమిని నశింపజేస్తున్నాయి.’—ప్రకటన 11:18 చదవండి.
9 యెహోవా కార్యాలు ఎంత భిన్నమైనవి! అవి ఎల్లప్పుడూ సరైనవే. పాపులైన మానవుల కోసం దయతో రక్షణ ఏర్పాటు చేయడం కూడా ఆయన కార్యమే. రోమా. 3:25, 26) అయితే, “ఆయన నీతి నిత్యము నిలుకడగా” ఉంటుంది. పాపులైన మానవులతో ఓపిగ్గా వ్యవహరించడం ద్వారా దేవుడు తన దయను చూపించాడు. కొన్నిసార్లు, తమ చెడు మార్గాలను విడిచిపెట్టి మంచి చేయమని ప్రజలను వేడుకోవడం ద్వారా దేవుడు వారిపట్ల ఎంతో దయను చూపించాడు.—యెహెజ్కేలు 18:25 చదవండి.
మానవులకు విమోచన ఏర్పాటు చేయడం ద్వారా దేవుడు ‘తన నీతిని కనబరిచాడు.’ (యెహోవా తన వాగ్దానాలకు కట్టుబడివుంటాడు
10“తనయందు భయభక్తులుగలవారికి ఆయన ఆహారమిచ్చి యున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును.” (కీర్త. 111:5) ఇక్కడ కీర్తనకర్త అబ్రాహాము నిబంధన గురించి ప్రస్తావిస్తుండవచ్చు. అబ్రాహాము సంతానం ఆశీర్వదించబడుతుందనీ వారు తమ శత్రువుల గవిని స్వాధీనం చేసుకుంటారనీ యెహోవా వాగ్దానం చేశాడు. (ఆది. 22:17, 18; కీర్త. 105:8, 9) ఆ వాగ్దాన మొదటి నెరవేర్పుగా అబ్రాహాము సంతానం ఇశ్రాయేలు జనాంగంగా రూపొందింది. ఆ జనాంగం ఎంతోకాలం ఐగుప్తులో దాసులుగా ఉన్నారు. అయితే, ఆ తర్వాత ‘దేవుడు అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొని’ వారిని దాసత్వం నుండి విడిపించాడు. (నిర్గ. 2:24) యెహోవా వారితో వ్యవహరించిన తీరునుబట్టి ఆయన ఎంత ఉదార స్వభావంగలవాడో తెలుస్తుంది. ఆయన వారిని పోషించడానికి భౌతిక ఆహారాన్ని, తన ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి కావాల్సిన నియమాలను ఇచ్చాడు. (ద్వితీ. 6:1-3; 8:4; నెహె. 9:21) ఆ తర్వాతి శతాబ్దాల్లో, తనతట్టు తిరగమని వేడుకునేందుకు దేవుడు ప్రవక్తలను పంపించినా వారు ఎన్నోసార్లు దేవునికి అవిధేయులయ్యారు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించిన 1,500కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి భూమ్మీదకు పంపించాడు. చాలామంది యూదులు యేసును తిరస్కరించి ఆయనను మరణానికి అప్పగించారు. అప్పుడు, యెహోవా ఒక కొత్త జనాంగాన్ని అంటే ఆధ్యాత్మిక జనాంగమైన ‘దేవుని ఇశ్రాయేలును’ ఏర్పాటు చేశాడు. క్రీస్తుతోపాటు వారు సూచనార్థకమైన అబ్రాహాము సంతానంగా ఏర్పడతారు. ఆ సంతానాన్ని ఉపయోగించి మానవులను ఆశీర్వదిస్తానని దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు.—గల. 3:16, 29; 6:16.
11 యెహోవా తన ‘నిబంధననూ’ దాని ద్వారా మానవులకు తాను ఇస్తానని వాగ్దానం చేసిన ఆశీర్వాదాలనూ ఇంకా ‘జ్ఞాపకం చేసుకుంటున్నాడు.’ నేడు, 400కన్నా ఎక్కువ భాషల్లో ఆయన ఆధ్యాత్మిక ఆహారాన్ని మెండుగా అనుగ్రహిస్తున్నాడు. అంతేగాక, “మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము” అనే మాటలకు అనుగుణంగా మన భౌతిక అవసరాల విషయంలో మనం చేసే ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు.—లూకా 11:3; కీర్త. 72:16, 17; యెష. 25:6-8.
యెహోవా అద్భుతమైన శక్తి
12“ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించియున్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడిచేసి యున్నాడు.” (కీర్త. 111:6) ఇశ్రాయేలు చరిత్రలో జరిగిన ఒక అసాధారణ సంఘటనను అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి అద్భుతమైన రీతిలో విడుదల చేయబడడాన్ని మనసులో ఉంచుకుని కీర్తనకర్త ఆ పైమాటలు అనివుంటాడు. యెహోవా ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోకి రప్పించినప్పుడు వారు యోర్దాను నదికి తూర్పు, పడమర వైపుల ఉన్న రాజ్యాలను జయించగలిగారు. (నెహెమ్యా 9:22-25 చదవండి.) అలా, యెహోవా ఇశ్రాయేలీయులకు ‘అన్యజనుల స్వాస్థ్యాన్ని’ ఇచ్చాడు. దేవుడు తన శక్తిని ఎంత గొప్పగా చూపించాడు!
13 అయితే, ఇశ్రాయేలీయుల కోసం యెహోవా ఎన్ని కార్యాలు చేసినా వారు మాత్రం దేవునికిగానీ తమ పూర్వికులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకుగానీ గౌరవం చూపించలేదని మనకు బాగా తెలుసు. వారు తమ దేశం నుండి తొలగించబడి బబులోను చెరకు కొనిపోబడేంతవరకు దేవునికి తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. (2 దిన. 36:15-17; నెహె. 9:28-30) కొందరు బైబిలు విద్వాంసులు చెబుతున్నట్లు, ఈ 111వ కీర్తనకర్త ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి విడుదల చేయబడిన తర్వాత జీవించివుంటే, యెహోవా చూపించిన యథార్థత, శక్తిని బట్టి ఆయనను స్తుతించేందుకు ఆ కీర్తనకర్తకు మరికొన్ని కారణాలుంటాయి. బానిసలను విడిచిపెట్టకూడదనే నియమాన్ని పాటించే బబులోను చేతిలో నుండి యూదులను విడిపించడం ద్వారా దేవుడు తన యథార్థతను, శక్తిని కనబరిచాడు.—యెష. 14:3, 4, 16, 17.
14 దాదాపు ఐదు శతాబ్దాల తర్వాత, పాపమరణాల దాసత్వం నుండి పశ్చాత్తాపపడే మానవులను విడిపించడం ద్వారా యెహోవా మరింత గొప్పగా తన శక్తిని ఉపయోగించాడు. (రోమా. 5:12) దానివల్ల, 1,44,000 మందికి క్రీస్తు ఆత్మాభిషిక్త అనుచరులయ్యే అవకాశం లభించింది. 1919లో, కొద్దిమందే ఉన్న అభిషిక్త శేషాన్ని అబద్ధమత చెర నుండి విడుదల చేయడానికి యెహోవా తన శక్తిని ఉపయోగించాడు. కేవలం దేవుని శక్తితోనే వారు ఈ అంత్యదినాల్లో ఎన్నో కార్యాలు చేయగలిగారు. వారు చనిపోయేంతవరకు నమ్మకంగా ఉంటే, పశ్చాత్తాపపడిన మానవులకు ప్రయోజనం చేకూరేలా యేసుక్రీస్తుతోపాటు పరలోకం నుండి వారు ఈ భూమిని పరిపాలిస్తారు. (ప్రక. 2:26, 27; 5:9, 10) అప్పుడు, వారు ప్రాచీన ఇశ్రాయేలీయులకన్నా మరింత గొప్పగా భూమిని స్వతంత్రించుకుంటారు.—మత్త. 5:5.
శాశ్వతమైన, నమ్మదగిన సూత్రాలు
15“ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి. ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి యున్నవి.” (కీర్త. 111:7, 8) ఇశ్రాయేలు జనాంగం కోసం ప్రాముఖ్యమైన పది ఆజ్ఞలు చెక్కబడిన రెండు రాతి పలకలు కూడా ‘[యెహోవా] చేతికార్యమే.’ (నిర్గ. 31:18) ఈ ఆజ్ఞలతో పాటు మోషే ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఇతర నియమాలన్నిటిలో శాశ్వతమైన, నమ్మదగిన సూత్రాలున్నాయి.
16 ఉదాహరణకు, ఆ రాతిపలకలమీద ఉన్న ఆజ్ఞల్లో ఒకటి ఇలా చెబుతుంది: “నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను.” అంతేకాక, యెహోవా ‘తనను ప్రేమించి తన ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణిస్తాడని’ కూడ అది చెబుతోంది. ఇంకా ఆ పలకల్లో అన్ని పరిస్థితులకు, అన్ని తరాలకు ఉపయోగపడే సూత్రాలు ఉన్నాయి. ఉదాహరణకు, అందులో “నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము,” “దొంగిలకూడదు” వంటి సూత్రాలే కాక, పరులకు చెందిన దేనినీ ఆశించకూడదనే అత్యంత జ్ఞానయుక్తమైన నియమం కూడా ఉంది.—నిర్గ. 20:5, 6, 12, 15, 17.
భయభక్తులుగొలిపే మన పరిశుద్ధుడైన విమోచకుడు
17“ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది [‘భయభక్తులు గొలిపేది,’ పవిత్రగ్రంథము, వ్యాఖ్యానసహితం].” (కీర్త. 111:9) ఈ సందర్భంలో కూడ, దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనకు కట్టుబడివున్నాడనే విషయం కీర్తనకర్త మనసులో ఉండివుంటుంది. ఆ నిబంధనకు అనుగుణంగానే, మొదట ప్రాచీన ఐగుప్తులో తన ప్రజలు దాసులుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత బబులోను చెరలో ఉన్నప్పుడు యెహోవా వారిని విడిచిపెట్టలేదు. ఆ రెండు సందర్భాల్లోనూ దేవుడు తన ప్రజలను విమోచించాడు లేదా విడుదల చేశాడు. కనీసం దేవుడు వారిని విమోచించిన ఆ రెండు సందర్భాలనైనా వారు గుర్తుంచుకొని దేవుని నామాన్ని పరిశుద్ధంగా ఎంచివుండాల్సింది.—నిర్గమకాండము 20:7; రోమీయులు 2:23, 24 చదవండి.
18 అంతేగాక, పాపమరణాల దాసత్వంలో ఏ నిరీక్షణా లేని పరిస్థితి నుండి నేటి నిజక్రైస్తవులను కూడా దేవుడు విడిపించాడు. మాదిరి ప్రార్థనలోని ఈ మొదటి అభ్యర్థనకు అనుగుణంగా జీవించడానికి శాయశక్తులా కృషి చేయాలి: “నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” (మత్త. 6:9) ఆ ఘనమైన నామము గురించి ధ్యానించడవల్ల మనలో దైవభయం కలగాలి. 111వ కీర్తనను రాసిన వ్యక్తికి దైవ భయం విషయంలో సరైన అభిప్రాయముంది. ఆయన ఇలా రాశాడు: “యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు [తన నియమాలు పాటించేవారందరు] మంచి వివేకము గలవారు.”—కీర్త. 111:10.
19 దైవభయం ఉంటే మనం చెడును అసహ్యించుకుంటాం. అంతేగాక, తర్వాతి ఆర్టికల్‌లో చూడబోతున్నట్లుగా 112వ కీర్తనలో చర్చించబడిన దేవుని చక్కని లక్షణాలను అలవర్చుకోవడానికి కూడా అది సహాయం చేస్తుంది. దేవుణ్ణి నిత్యం స్తుతించే అవకాశాన్ని ఆస్వాదించే లక్షలాదిమందిలో మనమూ ఉండాలంటే ఏమి చేయాలో ఆ కీర్తన వివరిస్తుంది. ఆయన మనందరి స్తుతి పొందేందుకు నిశ్చయంగా అర్హుడు. “ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.”—కీర్త. 111:10.
ధ్యానించాల్సిన ప్రశ్నలు
• మనందరి స్తుతి పొందేందుకు యెహోవా ఎందుకు అర్హుడు?
• యెహోవా కార్యాల్లో ఆయనకున్న ఏ లక్షణాలు కనిపిస్తున్నాయి?
• దేవుని పేరును ధరించే అవకాశాన్ని మీరెలా పరిగణిస్తున్నారు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. వివిధ కీర్తన రచయితలు ప్రజలను ఏమి చేయమని ఆహ్వానించారు? క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఆ మాట ఎలా ఉపయోగించబడింది?
3. మనం క్రమంగా సమకూడడానికిగల ప్రధాన కారణమేమిటి?
4. మానవులు దేవుని కార్యాలను ఎలా విచారించవచ్చు?
5. విశ్వం గురించి మానవులు తెలుసుకునేకొద్దీ ఏమి రుజువైంది?
6. దేవుడు మానవులను సృష్టించిన విధానం చూసి మీకేమనిపిస్తుంది?
7. బైబిలు యెహోవా చేసిన గొప్ప కార్యాల్లో ఒకటని మనమెందుకు పరిగణించాలి?
8, 9. (ఎ) మానవులు చేసిన అనేక కార్యాలతో పోలిస్తే దేవుని కార్యాలు ఏయే విధాలుగా భిన్నంగా ఉన్నాయి? (బి) మీకు ఇష్టమైన దేవుని లక్షణాలు ఏమిటి?
10. అబ్రాహాముతో చేసిన నిబంధనకు కట్టుబడివుండడంలో యెహోవా ఎలాంటి మాదిరినుంచాడు?
11. అబ్రాహాముతో చేసిన ‘నిబంధనను’ దేవుడు ఎలా ఇంకా ‘జ్ఞాపకం చేసుకుంటున్నాడు’?
12. ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఏ విధంగా ‘అన్యజనుల స్వాస్థ్యాన్ని’ ఇచ్చాడు?
13, 14. (ఎ) బబులోను విషయంలో దేవుడు తన శక్తిని ఉపయోగించిన ఏ సంఘటన కీర్తనకర్త మనసులో ఉండివుంటుంది? (బి) విడుదలకు సంబంధించి యెహోవా ఇంకా ఏ గొప్ప కార్యాలు చేశాడు?
15, 16. (ఎ) దేవుని చేతికార్యాల్లో ఏమేమి ఉన్నాయి? (బి) ప్రాచీన ఇశ్రాయేలుకు దేవుడు ఏ నియమాలిచ్చాడు?
17. దేవుని నామాన్ని పరిశుద్ధంగా ఎంచడానికి ఇశ్రాయేలీయులకు ఏ కారణాలున్నాయి?
18. దేవుని పేరును ధరించడం ఒక గొప్ప అవకాశమని మీకెందుకు అనిపిస్తుంది?
19. తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి చర్చిస్తాం?
[20వ పేజీలోని చిత్రం]
మనం యెహోవాను స్తుతించడానికే క్రమంగా సమకూడతాం
[23వ పేజీలోని చిత్రం]
యెహోవా ఇచ్చిన నియమాలన్నిటిలో శాశ్వతమైన, నమ్మదగిన సూత్రాలున్నాయి