కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గొప్ప మోషేగా యేసు పాత్రను గుర్తించండి

గొప్ప మోషేగా యేసు పాత్రను గుర్తించండి

గొప్ప మోషేగా యేసు పాత్రను గుర్తించండి

“ప్రభువైన దేవుడు నావంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును . . . మీరాయన మాట వినవలెను.”​—⁠అపొ. 3:⁠22.

రెండువేల సంవత్సరాల క్రితం ఒక మగపిల్లవాడు జన్మించడం చూసి దేవదూతల సమూహం దేవుణ్ణి మహిమపరిచింది. కొంతమంది గొర్రెల కాపరులు దాన్ని విన్నారు. (లూకా 2:​8-14) ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై ముప్పై సంవత్సరాల వయసులో పరిచర్యను ఆరంభించాడు. మూడున్నర సంవత్సరాలే పరిచర్య చేసినా ఆయన చరిత్రనే మార్చేశాడు. 19వ శతాబ్దపు చరిత్రకారుడైన ఫిలిప్‌ షఫ్‌ ఆ యువకుని గురించి ఇలా రాశాడు: “తాను ఒక్క ముక్కా రాయకుండానే అనేకుల కలానికి పని చెప్పాడు. ఎన్నో ప్రసంగాలకు, ఉపన్యాసాలకు, చర్చలకు, సంపుటలకు, కళాత్మక కార్యాలకు, స్తుతి గీతాలకు కావాల్సినంత సమాచారాన్ని అందజేశాడు. ప్రాచీనకాలంలో, ఆధునిక కాలంలో పేరుగాంచిన గొప్ప వ్యక్తులెవ్వరూ ఈ విషయంలో ఆయనకు సాటిరారు.” ఆ గొప్ప యువకుడు ఎవరో కాదు, యేసుక్రీస్తే.

2 అపొస్తలుడైన యోహాను యేసు పరిచర్య గురించి రాస్తూ చివర్లో ఇలా చెప్పాడు: “యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.” (యోహా. 21:25) ఎన్నో ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగిన ఆ మూడున్నర సంవత్సరాల్లో యేసు చెప్పిన, చేసిన వాటిలో కొన్నింటిని మాత్రమే తాను రాయగలిగానని యోహానుకు తెలుసు. అయినా, ఆయన తన సువార్తలో రాసిన చారిత్రక విషయాలు ఎంతో విలువైనవి.

3 ప్రాముఖ్యమైన నాలుగు సువార్త వృత్తాంతాలతోపాటు బైబిల్లోని ఇతర పుస్తకాలు కూడా మన విశ్వాసాన్ని బలపర్చే విధంగా యేసు జీవితం గురించి వివరిస్తున్నాయి. ఉదాహరణకు, యేసు భూమ్మీదకు రాకముందు జీవించిన కొంతమంది విశ్వాసులు రాసిన బైబిలు వృత్తాంతాల్లో, దేవుని ఉద్దేశంలో యేసు పాత్రను మరింత ఎక్కువగా తెలుసుకునేందుకు సహాయపడే సమాచారం ఉంది. వాటిలో కొన్నింటిని మనమిప్పుడు చూద్దాం.

క్రీస్తుకు ముంగుర్తులుగా ఉన్న ప్రాచీనకాల విశ్వాసులు

4 అభిషిక్తుడిగా, నియమిత రాజుగా యేసుకు మోషే, దావీదు, సొలొమోనులు ముంగుర్తులుగా ఉన్నారని యోహానే కాక ఇతర మూడు సువార్త రచయితలు కూడా పేర్కొన్నారు. ఆ ప్రాచీనకాల సేవకులు యేసుకు ఎలా ముంగుర్తులుగా ఉన్నారు? ఈ వృత్తాంతాల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

5 క్లుప్తంగా చెప్పాలంటే, మోషే ఒక ప్రవక్త, మధ్యవర్తి, విమోచకుడు అని బైబిలు చెబుతోంది. మోషేలాగే యేసు కూడా ప్రవక్త, మధ్యవర్తి, విమోచకుడు. దావీదు ఒక కాపరి, ఇశ్రాయేలీయుల శత్రువులను జయించిన రాజు. యేసు కూడా కాపరి, జయిస్తున్న రాజు. (యెహె. 37:​24, 25) యెహోవాకు నమ్మకంగా ఉన్నంత కాలం, సొలొమోను రాజు జ్ఞానయుక్తంగా పరిపాలించాడు. ఆయన పరిపాలనలో ప్రజలు శాంతి సమాధానాలతో జీవించారు. (1 రాజు. 4:​25, 29) యేసు కూడా అత్యంత జ్ఞానవంతుడు. అంతేకాక “సమాధానకర్తయగు అధిపతి” అనే పేరు ఆయనకు ఉంది. (యెష. 9:⁠6) క్రీస్తుయేసు పోషించిన పాత్రకూ ఆ ముగ్గురు ప్రాచీన సేవకులు పోషించిన పాత్రలకూ పోలికలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయినా వారికన్నా దేవుని ఉద్దేశంలో యేసు పాత్రే ఎంతో గొప్పది. మొదట, మనం యేసును మోషేతో పోల్చి చూద్దాం. వారిద్దరి మధ్య ఉన్న పోలికలను తెలుసుకోవడం ద్వారా యేసు పాత్రను మరింత ఎక్కువగా ఎలా అర్థం చేసుకోగలమో పరిశీలిద్దాం.

మోషే యేసుకు ముంగుర్తుగా ఉన్నాడు

6 సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత, అపొస్తలుడైన పేతురు యేసు విషయంలో నెరవేరిన మోషే ప్రవచనాన్ని ప్రస్తావించాడు. అప్పుడు పేతురు దేవాలయంలో యూదుల సమూహం ఎదుట నిలబడివున్నాడు. పుట్టినప్పటి నుండి కుంటివాడైన ఓ వ్యక్తిని పేతురు యోహానులు బాగుచేసినప్పుడు ప్రజలు “విస్మయమొంది” జరిగింది చూడడానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. యెహోవా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ద్వారా పనిచేస్తుంది కాబట్టే ఈ ఆశ్చర్య కార్యం జరిగిందని పేతురు వివరించాడు. ఆ తర్వాత, హెబ్రీ లేఖనాల్లోని మాటలను ఉల్లేఖిస్తూ ఆయన ఇలా అన్నాడు: “మోషే యిట్లనెను​—⁠‘ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.’”​—⁠అపొ. 3:​11, 22, 23; ద్వితీయోపదేశకాండము 18:​15, 18, 19 చదవండి.

7 మోషే చెప్పిన ఆ మాటలు పేతురు శ్రోతలకు తెలిసేవుంటుంది. యూదులుగా వారికి మోషేపట్ల ఎంతో గౌరవం ఉంది. (ద్వితీ. 34:12) మోషేకన్నా గొప్ప ప్రవక్త రాకకోసం వారు ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ఆ ప్రవక్త మోషేలా దేవునిచేత అభిషేకించబడినవాడు మాత్రమే కాదుగానీ ఎంతోకాలం పూర్వమే వాగ్దానం చేయబడిన మెస్సీయ. ఆయన యెహోవా ‘దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు.’​—⁠లూకా 23:35; హెబ్రీ. 11:​24-26.

యేసుకు, మోషేకు మధ్యవున్న పోలికలు

8 కొన్ని విషయాల్లో, మోషే జీవితానికీ యేసు భూజీవితానికీ మధ్య పోలికలు ఉన్నాయి. ఉదాహరణకు, మోషే, యేసు ఇద్దరూ పసిబాలురుగా ఉన్నప్పుడు క్రూర పరిపాలకుడి చేతుల్లో చావును తప్పించుకున్నారు. (నిర్గ. 1:22–2:10; మత్త. 2:​7-14) అంతేకాక, వారిద్దరూ ‘ఐగుప్తునుండి పిలవబడ్డారు.’ ప్రవక్త అయిన హోషేయ ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తుదేశములోనుండి పిలిచితిని.” (హోషే. 11:⁠1) దేవునిచేత నియమించబడిన మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల చేయబడిన సమయం గురించి హోషేయ ఇక్కడ ప్రస్తావించాడు. (నిర్గ. 4:​22, 23; 12:​29-37) అయితే, హోషేయ చెప్పిన మాటలు, ఆ సంఘటనను మాత్రమే కాక భవిష్యత్తులో జరగబోయే సంఘటనను కూడా సూచిస్తున్నాయి. అవి, రాజైన హేరోదు మరణానంతరం యోసేపు, మరియలు యేసుతోపాటు ఐగుప్తును విడిచివెళ్లినప్పుడు నెరవేరిన ప్రవచనాన్ని సూచిస్తున్నాయి.​—⁠మత్త. 2:​15, 19-23.

9 మోషే, యేసు అద్భుతాలు చేసి తమకు దేవుని సహాయముందని చూపించారు. బైబిలు ప్రకారం, అద్భుతాలు చేసిన మొదటివ్యక్తి మోషేనే. (నిర్గ. 4:​1-9) ఉదాహరణకు, మోషే నీళ్లకు సంబంధించిన అద్భుతాలు చేశాడు. ఆయన తన కర్రను ఉపయోగించి నైలు నదిని, దాని చెరువులను రక్తంగా మార్చాడు, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు, ఎడారిలో బండ నుండి నీళ్లను రప్పించాడు. (నిర్గ. 7:​19-21; 14:21; 17:​5-7) యేసు కూడా నీళ్లకు సంబంధించిన అద్భుతాలు చేశాడు. పెళ్లి విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం ద్వారా ఆయన మొదటి అద్భుతం చేశాడు. (యోహా. 2:​1-11) తర్వాత, అల్లకల్లోలంగా మారిన గలిలయ సముద్రాన్ని నిమ్మళింపజేశాడు. మరో సందర్భంలో, ఆయన నీళ్లపై కూడా నడిచాడు! (మత్త. 8:​23-27; 14:​23-25) మోషేకూ గొప్ప మోషే అయిన యేసుకూ మధ్యవున్న మరికొన్ని పోలికలను 26వ పేజీలో చూడవచ్చు.

క్రీస్తును ప్రవక్తగా గుర్తించండి

10 భవిష్యత్తు గురించి చెప్పేవాడే ప్రవక్త అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రవక్త అదొక్కటే చేయడు. నిజమైన ప్రవక్త, యెహోవా దేవుని ప్రతినిధిగా ఆయన “గొప్పకార్యములను” ప్రకటిస్తాడు. (అపొ. 2:​11, 16, 17) అంతేకాక, ఆయన భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను, యెహోవా ఉద్దేశాలకు సంబంధించిన వివిధ అంశాలను, దేవుని తీర్పులను ప్రవచిస్తాడు. నిజానికి మోషే అలాంటి ప్రవక్తే. ఆయన ఐగుప్తుమీదికి వచ్చిన పది తెగుళ్ల గురించి ముందుగానే చెప్పాడు. సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్ర నిబంధనకు ప్రతినిధిగా కూడా ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగానికి దేవుని చిత్తాన్ని బోధించాడు. అయినా మోషేకన్నా గొప్ప ప్రవక్త రావాల్సిందే.

11 ఆ తర్వాత, సా.శ.పూ. మొదటి శతాబ్దంలో జెకర్యా తన కుమారుడైన యోహాను విషయంలో దేవుని ఉద్దేశాన్ని తెలియజేయడం ద్వారా ప్రవక్తగా పనిచేశాడు. (లూకా 1:76) ఆ కుమారుడే బాప్తిస్మమిచ్చు యోహాను అయ్యాడు. యూదులు ఎంతోకాలంగా మోషేకన్నా గొప్ప ప్రవక్త కోసం ఎదురుచూశారు. ఆ గొప్ప ప్రవక్త యేసుక్రీస్తేనని యోహాను ప్రకటించాడు. (యోహా. 1:​23-36) యేసు ప్రవక్తగా అనేక విషయాలను ప్రవచించాడు. ఉదాహరణకు, ఆయన తన మరణాన్ని గురించి, అంటే తానెలా చనిపోతాడు, ఎక్కడ చనిపోతాడు, ఎవరు చంపుతారు వంటి విషయాలను ముందే తెలియజేశాడు. (మత్త. 20:​17-19) తన శ్రోతలకు ఆశ్చర్యం కలిగించే విధంగా, యెరూషలేము దాని ఆలయంతోపాటు నాశనమౌతుందని కూడా ప్రవచించాడు. (మార్కు 13:​1, 2) అంతేకాక, మన కాలంలో జరిగే విషయాలనూ ఆయన ప్రవచించాడు.​—⁠మత్త. 24:​3-41.

12 యేసు ప్రవక్తగానే కాక ప్రచారకుడిగా, బోధకుడిగా పనిచేశాడు. ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆయనంత ధైర్యంగా మరెవ్వరూ ప్రకటించలేదు. (లూకా 4:​16-21, 43) బోధకుడిగా ఆయనకు ఎవ్వరూ సాటిరారు. “ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు” అని ఆయన బోధలు విన్న కొందరు చెప్పారు. (యోహా. 7:46) యేసు ఎంతో ఉత్సాహంగా సువార్త ప్రకటించాడు. రాజ్యంపట్ల తనకున్న ఆ ఉత్సాహంతోనే తన అనుచరులను ప్రోత్సహించాడు. ఆ విధంగా, మన కాలంవరకూ కొనసాగుతున్న ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి, బోధనా పనికి ఆయన పునాదివేశాడు. (మత్త. 28:​18-20; అపొ. 5:42) గత సంవత్సరం, దాదాపు డెబ్భై లక్షలమంది క్రీస్తు అనుచరులు సువార్త ప్రకటించడానికి, ఆసక్తిగలవారికి బైబిలు సత్యం బోధించడానికి ఇంచుమించు 150 కోట్ల గంటలు వెచ్చించారు. సాధ్యమైనంత ఎక్కువగా మీరు ఆ పనిలో పాల్గొంటున్నారా?

13 మోషేలాంటి ప్రవక్తను పుట్టిస్తానన్న ప్రవచనాన్ని యెహోవా నెరవేర్చాడనడంలో ఏ సందేహం లేదు. అది తెలుసుకున్న తర్వాత మీకు ఏమి చేయాలనిపిస్తుంది? అది భవిష్యత్తులో నెరవేరనున్న ప్రేరేపిత ప్రవచనాల విషయంలో మీ నమ్మకాన్ని మరింత బలపరుస్తోందా? మోషేకన్నా గొప్ప ప్రవక్తయైన యేసు ఉదాహరణను ధ్యానిస్తే దేవుడు తీసుకునే చర్యల విషయంలో ‘మెలకువగా ఉండి మత్తులముకాకుండా’ ఉండగలుగుతాం.​—⁠1 థెస్స. 5:​2, 6.

మధ్యవర్తిగా క్రీస్తు పాత్రను గౌరవించండి

14 మోషేలాగే యేసు కూడ మధ్యవర్తే. మధ్యవర్తి అంటే ఇరువర్గాల మధ్య వారధిగా వ్యవహరించే వ్యక్తి. యెహోవా ఇశ్రాయేలీయులతో ధర్మశాస్త్ర నిబంధన చేసినప్పుడు మోషేను మధ్యవర్తిగా ఉపయోగించాడు. యాకోబు కుమారులు దేవుని నియమాలకు లోబడివుంటే వారు దేవుని స్వకీయ సంపాద్యంగా, దేవుని సమాజంగా ఉండేవారు. (నిర్గ. 19:​3-8) ఆ నిబంధన సా.శ.పూ. 1513 నుండి సా.శ. మొదటి శతాబ్దం వరకు అమలులో ఉంది.

15 సా.శ. 33వ సంవత్సరంలో “దేవుని ఇశ్రాయేలు” అయిన నూతన ఇశ్రాయేలుతో యెహోవా మరింత శ్రేష్ఠమైన నిబంధన చేశాడు. వారు అభిషిక్త క్రైస్తవులతో కూడిన ప్రపంచవ్యాప్త సంఘంగా ఏర్పడ్డారు. (గల. 6:16) మోషే మధ్యవర్తిత్వంలో చేసిన నిబంధనలో దేవుడు రాతి పలకలమీద తన నియమాలను రాశాడు. దానికన్నా యేసు మధ్యవర్తిత్వంలో చేసిన నిబంధనే శ్రేష్ఠమైనది. ఎందుకంటే, క్రీస్తు ద్వారా చేసిన నిబంధనలో దేవుడు తన నియమాలను మానవ హృదయాలపై రాశాడు. (1 తిమోతి 2:5; హెబ్రీయులు 8:10 చదవండి.) కాబట్టి ‘దేవుని ఇశ్రాయేలే’ దేవుని స్వకీయ సంపాద్యము, మెస్సీయ రాజ్యంలో ‘ఫలమిస్తున్న జనాంగం.’ (మత్త. 21:43) ఆ ఆధ్యాత్మిక జనాంగంలోనివారు నూతన నిబంధనలో భాగస్థులుగా ఉన్నారు. అయితే వారు మాత్రమే దాన్నుండి ప్రయోజనం పొందరు. మరణించిన అనేకమందితోసహా లెక్కలేనంతమంది ఆ శ్రేష్ఠమైన నిబంధనవల్ల నిరంతర ఆశీర్వాదాలను పొందుతారు.

విమోచకుడిగా క్రీస్తు పాత్రను గౌరవించండి

16 ఇశ్రాయేలు సంతతిలోని కొందరు ఐగుప్తు నుండి బయటకు వచ్చేముందు రాత్రి తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. కొద్ది సేపట్లో, దేవుని దూత తొలి సంతానాన్ని హతం చేసుకుంటూ ఐగుప్తు దేశంలో సంచరించనుంది. ఇశ్రాయేలీయులు పస్కాపశువు రక్తాన్ని తీసుకొని తమ ఇంటి ద్వారబంధాల నిలువు కమ్ములమీద, పై కమ్మిమీద చల్లితే వారి తొలి సంతానం రక్షించబడుతుందని యెహోవా మోషేతో చెప్పాడు. (నిర్గ. 12:​1-13, 21-23) యెహోవా చెప్పినట్లే జరిగింది. ఆ తర్వాత ఆ జనాంగమంతా మరో తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. వారు ఎర్ర సముద్రానికీ, తరుముకొస్తున్న యుద్ధ రథాలకూ మధ్య చిక్కుకున్నారు. యెహోవా మోషేను ఉపయోగించి అద్భుతరీతిలో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మరోసారి ఇశ్రాయేలీయులను రక్షించాడు.​—⁠నిర్గ. 14:​13, 21.

17 ఆ రక్షణ కార్యాలు గొప్పవే అయినా, యేసు ద్వారా యెహోవా చేసిన రక్షణ కార్యాలు ఇంకా గొప్పవి. యేసు ద్వారానే విధేయులైన మానవులు పాపమనే దాసత్వం నుండి విడిపించబడతారు. (రోమా. 5:​12, 18) అది “నిత్యమైన విమోచన.” (హెబ్రీ. 9:​11, 12) యేసు పేరుకు “యెహోవాయే రక్షణ” అనే అర్థముంది. విమోచకుడిగా లేక రక్షకుడిగా యేసు మన గత పాపాల నుండి రక్షించాడు. అంతేకాక మనం మరింత సంతోషకరమైన భవిష్యత్తును ఆనందించే మార్గాన్నీ తెరిచాడు. పాపమనే దాసత్వం నుండి తన అనుచరులను విడిపించడం ద్వారా యేసు వారిని యెహోవా ఉగ్రతనుండి రక్షించి ఆయనతో ఒక మంచి సంబంధం కలిగివుండేలా చేశాడు.​—⁠మత్త. 1:⁠21.

18 అంతేకాక యేసు ఏర్పాటు చేసిన విమోచనవల్ల నియమిత సమయంలో, పాపంవల్ల వచ్చిన భయంకరమైన పరిణామాలు అంటే అనారోగ్యం, చివరకు మరణం తీసివేయబడతాయి. అదెలా ఉంటుందో మనసులో చిత్రీకరించుకోవడానికి యేసు యాయీరు అనే వ్యక్తి ఇంటికి వెళ్లినప్పుడు ఏమి జరిగిందో చూడండి. యాయీరు 12 ఏళ్ల కూతురు చనిపోయింది. అప్పుడు యేసు, “భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడును” అని ఆయనకు అభయమిచ్చాడు. (లూకా 8:​41, 42, 49, 50) ఆయన చెప్పినట్లే, చనిపోయిన ఆ బాలిక బ్రతికింది! ఆమె తల్లిదండ్రులు ఎంత సంతోషించివుంటారో మీరు ఊహించుకోగలరా? అలా ఊహించుకోగలిగితే, పునరుత్థానం జరిగినప్పుడు ‘సమాధులలో నున్నవారందరు యేసు శబ్దము విని బయటికి రావడం’ చూసి మనం ఎంతగా సంతోషిస్తామో మీరు అర్థం చేసుకోగలుగుతారు. (యోహా. 5:​28, 29) నిజంగానే యేసు మన రక్షకుడు, విమోచకుడు!​—⁠అపొస్తలుల కార్యములు 5:31 చదవండి; తీతు 1:​1-4; ప్రక. 7:⁠10.

19 యేసు రక్షణ కార్యాల నుండి ప్రయోజనం పొందేలా ప్రజలకు సహాయం చేయగలమని మనం తెలుసుకున్న తర్వాత ప్రకటనాపనిలో, బోధనాపనిలో భాగం వహించాలనే ప్రేరణను పొందుతాం. (యెష. 61:​1-3) అంతేకాక, గొప్ప మోషేగా యేసు పాత్ర గురించి ధ్యానిస్తే, ఆయన దుష్టులను నాశనం చేయడానికి వచ్చినప్పుడు తన అనుచరులను రక్షిస్తాడనే మన నమ్మకం మరింత బలపడుతుంది.​—⁠మత్త. 25:​31-34, 41, 46; ప్రక. 7:​9, 14.

20 అవును, యేసు మోషేకన్నా గొప్పవాడు. ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. అలాంటి కార్యాలను మోషే ఎన్నడూ చేసి ఉండేవాడు కాదు. ప్రవక్తగా యేసు పలికిన మాటలు, మధ్యవర్తిగా ఆయన చేసిన కార్యాలు మానవులందరినీ ప్రభావితం చేశాయి. విమోచకుడిగా యేసు మానవులకు తీసుకువచ్చే రక్షణ తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతమైనది. అయితే, ప్రాచీనకాల విశ్వాసుల నుండి యేసు గురించి ఇంకా ఎంతో తెలుసుకోవచ్చు. ఆయన ఎలా గొప్ప దావీదుగా, గొప్ప సొలొమోనుగా ఉన్నాడో తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తుంది.

మీరు వివరించగలరా?

యేసు ఎలా

• ఓ ప్రవక్తగా

• ఓ మధ్యవర్తిగా

• ఓ విమోచకుడిగా మోషేకన్నా గొప్పవాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1. చరిత్రను యేసుక్రీస్తు ఎలా ప్రభావితం చేశాడు?

2. యేసు గురించి, ఆయన పరిచర్య గురించి అపొస్తలుడైన యోహాను ఏమి చెప్పాడు?

3. దేవుని ఉద్దేశంలో యేసు పాత్ర గురించి మనం మరింత ఎక్కువగా ఎలా తెలుసుకోవచ్చు?

4, 5. ఎవరు యేసుకు ముంగుర్తులుగా ఉన్నారు? ఏ విధంగా?

6. యేసు చెప్పిన మాటలు ఖచ్చితంగా వినాలనే విషయాన్ని అపొస్తలుడైన పేతురు ఎలా వివరించాడు?

7. మోషేకన్నా గొప్ప ప్రవక్త గురించి పేతురు చెప్పిన మాటలను ఆయన శ్రోతలు అర్థం చేసుకొనివుంటారని ఎలా చెప్పవచ్చు?

8. యేసు జీవితానికీ మోషే జీవితానికీ మధ్యవున్న కొన్ని పోలికలు ఏమిటి?

9. (ఎ) మోషే, యేసు ఏ అద్భుతాలు చేశారు? (బి) యేసుకూ మోషేకూ మధ్యవున్న మరికొన్ని పోలికలు చెప్పండి. (26వ పేజీలోవున్న “యేసుకూ మోషేకూ మధ్యవున్న మరికొన్ని పోలికలు” అనే బాక్సును చూడండి.)

10. నిజమైన ప్రవక్తలు ఏయే పనులు చేస్తారు? మోషే కూడా నిజమైన ప్రవక్త అని ఎలా చెప్పవచ్చు?

11. మోషేకన్నా గొప్ప ప్రవక్తగా యేసు తన పాత్రను ఎలా నెరవేర్చాడు?

12. (ఎ) ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి యేసు ఎలా పునాదివేశాడు? (బి) యేసు మాదిరిని నేడు మనం ఎందుకు అనుకరిస్తాం?

13. ‘మెలకువగా ఉండాలంటే’ మనం ఏమి చేయాలి?

14. మోషే ఇశ్రాయేలీయులకూ దేవునికీ మధ్య ఏ విధంగా మధ్యవర్తిగా ఉన్నాడు?

15. యేసు ఏ విధంగా మోషేకన్నా శ్రేష్ఠమైన మధ్యవర్తి?

16. (ఎ) ఇశ్రాయేలీయులను రక్షించడానికి యెహోవా మోషేను ఏయే విధాలుగా ఉపయోగించుకున్నాడు? (బి) నిర్గమకాండము 14:13 ప్రకారం అసలు విమోచకుడు ఎవరు?

17, 18. ఏయే విధాలుగా యేసు మోషేకన్నా గొప్ప విమోచకుడు?

19, 20. (ఎ) గొప్ప మోషేగా యేసు పాత్ర గురించి ధ్యానిస్తే మనకు ఏమి చేయాలనిపిస్తుంది? (బి) తర్వాతి ఆర్టికల్‌ ఏయే విషయాలను వివరిస్తుంది?

[26వ పేజీలోని బాక్సు/చిత్రం]

యేసుకూ మోషేకూ మధ్యవున్న మరికొన్ని పోలికలు

◻ ఇద్దరూ యెహోవాకూ ఆయన ప్రజలకూ సేవచేయడానికి ఉన్నత స్థానాలను విడిచిపెట్టారు.​—⁠2 కొరిం. 8:9; ఫిలి. 2:​5-8; హెబ్రీ. 11:​24-26.

◻ ఇద్దరినీ యెహోవా నియమించాడు లేక అభిషేకించాడు.​—⁠మార్కు 14:​61, 62; యోహా. 4:​25, 26; హెబ్రీ. 11:​24-26.

◻ ఇద్దరూ యెహోవా నామానికి ప్రాతినిధ్యం వహించారు.​—⁠నిర్గ. 3:​13-16; యోహా. 5:43; 17:​4, 6, 26.

◻ ఇద్దరూ సాత్వికాన్ని కనబరిచారు.​—⁠సంఖ్యా. 12:3; మత్త. 11:​28-30.

◻ మోషే వేలాదిమందిని పోషించడంలో భాగం వహించాడు. యేసు వేలాదిమందికి జీవాహారంగా ఉన్నాడు.​—⁠నిర్గ. 16:12; యోహా. 6:​48-51.

◻ ఇద్దరూ న్యాయాధిపతులుగా, శాసనకర్తలుగా పనిచేశారు.​—⁠నిర్గ. 18:13; మలా. 4:4; యోహా. 5:​22, 23; 15:⁠10.

◻ ఇద్దరూ దేవుని ఇంటిమీద అధిపతులుగా నియమించబడ్డారు.​—⁠సంఖ్యా. 12:7; హెబ్రీ. 3:​2-6.

◻ ఇద్దరూ దేవుని నమ్మకమైన సాక్షులుగా పేర్కొనబడ్డారు.​—⁠హెబ్రీ. 11:​24-29; 12:1; ప్రక. 1:⁠5.

◻ మోషే, యేసు చనిపోయిన తర్వాత దేవుడు వాళ్ల శరీరాలను కనబడకుండా చేశాడు.​—⁠ద్వితీ. 34:​5, 6; లూకా 24:​1-3; అపొ. 2:31; 1 కొరిం. 15:50; యూదా 9