కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ యథార్థతను చూసి యెహోవా సంతోషిస్తాడు

మీ యథార్థతను చూసి యెహోవా సంతోషిస్తాడు

మీ యథార్థతను చూసి యెహోవా సంతోషిస్తాడు

“నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.”​—⁠సామె. 27:⁠11.

యెహోవా తన నమ్మకమైన సేవకుడైన యోబు యథార్థతను పరీక్షించడానికి సాతానును అనుమతించాడు. దానివల్ల యోబు తన పశువులను, తన పిల్లలను, తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అయితే, సాతాను యోబునే కాక ఇతరులను కూడ మనసులో ఉంచుకొని ఆయన యథార్థతను ప్రశ్నించాడు. “చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా” అని సాతాను సవాలుచేశాడు. దానివల్ల రేగిన వివాదాంశం యోబుతో ఆగిపోలేదు, ఆయన మరణం తర్వాత కూడ అది కొనసాగుతూనే ఉంది.​—⁠యోబు 2:⁠4.

2 యోబు పరీక్షించబడిన దాదాపు 600 సంవత్సరాల తర్వాత సొలొమోను దైవ ప్రేరణతో ఇలా రాశాడు: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.” (సామె. 27:11) సొలొమోను కాలంలో కూడ సాతాను యెహోవాను సవాలు చేస్తూనే ఉన్నాడని దీన్నిబట్టి అర్థమౌతుంది. అంతేకాక, 1914లో దేవుని రాజ్యం స్థాపించబడిన కొంతకాలానికి సాతాను పరలోకం నుండి పడద్రోయబడ్డాడు. అప్పటినుండి అతడు దేవుని సేవకులను నిందిస్తూనే ఉన్నాడు. దీన్ని అపొస్తలుడైన యోహాను తనకు ఇవ్వబడిన ఒక దర్శనంలో చూశాడు. నిజమే, ఈ దుష్టవిధానపు అంత్యదినాల్లో కూడ సాతాను దేవుని సేవకుల యథార్థతను సవాలుచేస్తూనే ఉన్నాడు!​—⁠ప్రక. 12:⁠10.

3 యోబు గ్రంథం నుండి మనం నేర్చుకునే మూడు ప్రాముఖ్యమైన పాఠాలను ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటిగా, మానవుల నిజమైన శత్రువూ దేవుని ప్రజలను నిజానికి వ్యతిరేకిస్తున్నదీ అపవాదియైన సాతానేనని యోబుకు ఎదురైన పరీక్షల నుండి మనం తెలుసుకుంటాం. రెండవదిగా, ఎలాంటి పరీక్షలు ఎదురైనా మనకు దేవునితో దగ్గరి సంబంధం ఉన్నట్లయితే మన యథార్థతను కాపాడుకోగలుగుతాం. మూడవదిగా, శ్రమలవల్ల మనం ఏదో విధంగా పరీక్షించబడినప్పుడు దేవుడు యోబుకు సహాయం చేసినట్లే మనకూ సహాయం చేస్తాడు. మన కాలంలో యెహోవా తన వాక్యం ద్వారా, సంస్థ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేస్తున్నాడు.

అసలైన శత్రువును ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి

4 సాతాను ఉన్నాడని అనేకమంది నమ్మరు. ప్రపంచ పరిస్థితులనుబట్టి భయాందోళనలకు గురైనా వాటికి అపవాదియైన సాతానే కారణమని వారు గుర్తించరు. నిజమే, లోకంలోని అనేక కష్టాలకు చాలావరకు మానవులే కారణం. మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు తమ సృష్టికర్త నుండి స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. అప్పటినుండి ఆదాముహవ్వల వారసులు ఎంతో అవివేకంగా ప్రవర్తించారు. ఏదేమైనా, దేవునిమీద తిరుగుబాటు చేసేలా అపవాదే హవ్వను మోసగించాడు. అతడే తన చెప్పుచేతల్లో నడిచే ఒక లోక వ్యవస్థను అపరిపూర్ణతతో మరణిస్తున్న మానవుల మధ్య స్థాపించాడు. సాతాను “ఈ యుగ సంబంధమైన దేవత” కాబట్టి, మానవులు అతనిలాగే అహంకారం, వాదించే తత్వం, అసూయ, అత్యాశ, మోసం, తిరుగుబాటు ధోరణి వంటి లక్షణాలు కనబరుస్తున్నారు. (2 కొరిం. 4:4; 1 తిమో. 2:14; 3:6; యాకోబు 3:​14, 15 చదవండి.) అలాంటి లక్షణాలవల్ల రాజకీయ, మత సంబంధ కలహాలు, ద్వేషం, అవినీతి, క్రమరాహిత్యం వంటివి పెరిగి మానవులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.

5 యెహోవా సేవకులముగా మనకు ఎంత అమూల్యమైన జ్ఞానముంది! క్షీణిస్తున్న లోక పరిస్థితులకు మూలకారణం ఎవరో మనకు తెలుసు. కాబట్టి, మన అసలు శత్రువు ఎవరో ప్రజలకు తెలియజేసేందుకు పరిచర్యలో పాల్గొనాలని మనకు అనిపించడంలేదా? సత్యదేవుడైన యెహోవా పక్షాన నిలబడి సాతాను నాశనం చేయబడే విధానం గురించి, మానవుల కష్టాలను ఆయన తొలగించే విధానం గురించి ఇతరులకు వివరించేందుకు మనం సంతోషించడంలేదా?

6 లోకంలోని అనేక బాధలకే కాక దేవుని ప్రజలు అనుభవిస్తున్న వ్యతిరేకతకు కూడ సాతానే కారకుడు. అతడు మనల్ని పరీక్షించాలనే పట్టుదలతో ఉన్నాడు. అపొస్తలుడైన పేతురుతో యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను.” (లూకా 22:31) అలాగే, యేసు అడుగుజాడలను అనుసరించే మనలో ప్రతీ ఒక్కరమూ ఏదో ఒక విధమైన పరీక్షలను ఎదుర్కొంటాం. పేతురు అపవాదిని ‘ఎవరిని మ్రింగుదునా అని వెదకుతూ తిరిగే సింహంతో’ పోల్చాడు. పౌలు కూడ ఇలా అన్నాడు: “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు.”​—⁠1 పేతు. 5:8; 2 తిమో. 3:⁠12.

7 తోటి విశ్వాసులు శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు మనం అసలు శత్రువును గుర్తుంచుకుంటున్నామని ఎలా చూపించవచ్చు? అలాంటి సందర్భాల్లో, వారి నుండి దూరంగా వెళ్లేబదులు, నిజమైన స్నేహితునిలా యోబుతో మాట్లాడిన ఏలీహులాగే మనమూ ప్రవర్తిస్తాం. మనందరి శత్రువైన సాతానుతో వారు చేస్తున్న పోరాటంలో మనం వారికి చేయూతనిస్తాం. (సామె. 3:27; 1 థెస్స. 5:25) ఏదేమైనా యథార్థతను కాపాడుకునేలా వారికి సహాయం చేసి యెహోవాను సంతోషపెట్టడమే మన లక్ష్యం.

8 మొదట యోబు తన పశువులను కోల్పోయేలా సాతాను చేశాడు. ఆ పశువులు ఆయనకు ఎంతో విలువైనవి, బహుశా అవి ఆయన జీవనోపాధి కూడ అయుండొచ్చు. అంతేకాక, యోబు వాటిని ఆరాధన కోసం ఉపయోగించేవాడు. యోబు తన పిల్లలను పవిత్రపరచిన తర్వాత “తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని . . . అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.” (యోబు 1:​4, 5) ఆ విధంగా యోబు క్రమంగా యెహోవాకు జంతువులను అర్పించేవాడు. ఆయనకు పరీక్షలు మొదలయ్యేసరికి అలా చేయలేకపోయాడు. యెహోవాను ఘనపర్చడానికి ఆయన దగ్గర ఇక ఎలాంటి ‘ఆస్తి’ లేదు. (సామె. 3:⁠9) అయినా, ఆయన యెహోవాను తన పెదవులతో ఘనపర్చగలడు, ఆయన అలా చేశాడు కూడా!

యెహోవాతో దగ్గరి సంబంధాన్ని పెంపొందించుకోండి

9 మనకు డబ్బున్నా లేకపోయినా, యౌవనస్థులమైనా ముసలివారమైనా, ఆరోగ్యవంతులమైనా కాకపోయినా యెహోవాతో దగ్గరి సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు. మనం ఎలాంటి పరీక్షలను ఎదుర్కొంటున్నా దేవునితో దగ్గరి సంబంధం ఉన్నట్లయితే మన యథార్థతను కాపాడుకొని, యెహోవాను సంతోషపెట్టగలుగుతాం. సత్యం గురించి కాస్తంత జ్ఞానమున్నవారు కూడ ధైర్యంగా నిలబడి తమ యథార్థతను కాపాడుకోగలిగారు.

10 సహోదరి వ్యాలెంటీనా గోర్నోఫ్‌స్కయా ఉదాహరణ తీసుకోండి. తీవ్రమైన పరీక్షలు ఎదురైనా నమ్మకమైన యోబులాగే యథార్థతను కాపాడుకున్న రష్యాలోని అనేకమంది సాక్షుల్లో ఆమె కూడ ఒకరు. 1945లో ఒక సహోదరుడు ఆమెకు సాక్ష్యమిచ్చాడు, అప్పుడు ఆమెకు దాదాపు 20 ఏళ్లు. బైబిలు గురించి మాట్లాడడానికి ఆయన మళ్లీ రెండుసార్లు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ఆ సహోదరుణ్ణి ఆమె ఎప్పుడూ చూడలేదు. అయినా, వ్యాలెంటీనా తన పొరుగువారికి సాక్ష్యమివ్వడం మొదలుపెట్టింది. ఆ కారణంగా ఆమెను అరెస్టు చేసి ఎనిమిదేళ్లు క్యాంపు శిక్ష విధించారు. 1953లో ఆమెను విడుదలచేశారు. విడుదలైన వెంటనే ఆమె ప్రకటనా పనిని ప్రారంభించింది. దాంతో ఆమెను మరోసారి అరెస్టు చేసి జైళ్లో పెట్టారు. ఈసారి పదేళ్ల జైలు శిక్ష విధించారు. వారు ఆమెను ఒక క్యాంపులో అనేక సంవత్సరాలు ఉంచిన తర్వాత మరో క్యాంపుకు తీసుకువెళ్లారు. ఆ క్యాంపులో కొంతమంది సహోదరీలను ఆమె కలుసుకుంది, వారిదగ్గర బైబిలు ఉంది. ఓరోజు వారిలో ఒకరు ఆమెకు బైబిలు చూపించారు. దాన్ని చూసి ఆమె ఎంత పులకించిపోయిందో! ఆమె గతంలో అంటే 1945లో తనకు సాక్ష్యమిచ్చిన సహోదరుని దగ్గరే బైబిలు చూసింది. ఆ తర్వాత ఈ సహోదరీలను కలిసేంతవరకు మళ్లీ దాన్ని చూడలేదు!

11 వ్యాలెంటీనా 1967లో విడుదలచేయబడి యెహోవాకు చేసుకున్న సమర్పణను చివరకు నీటి బాప్తిస్మం ద్వారా తెలియజేయగలిగింది. 1969 వరకు, తనకు దొరికిన స్వేచ్ఛను పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనేందుకు ఉపయోగించింది. అయితే, ఆ సంవత్సరం ఆమె మళ్లీ అరెస్టు చేయబడింది. ఈసారి ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. అయినా, ఆమె ప్రకటనా పనిని ఆపలేదు. ఆమె 2001లో మరణించేంతవరకు సత్యం తెలుసుకునేలా 44 మందికి సహాయం చేసింది. మొత్తంకలిపి ఆమె తన జీవితంలో 21 ఏళ్లు జైళ్లలో, క్యాంపుల్లో గడిపింది. తన యథార్థత కాపాడుకోవడానికి ఆమె తన స్వేచ్ఛతోసహా అన్నిటినీ త్యాగం చేయడానికి సిద్ధపడింది. తన జీవితంలోని చివరి భాగంలో, ఆమె ఇలా అంది: “నాకు ఉండడానికంటూ ఓ ఇల్లు లేదు. నా దగ్గర ఆస్తి అంటూ ఏదైనా ఉందంటే అది నా సూట్కేసే. అయినా యెహోవా సేవలో సంతోషంగా, సంతృప్తిగా గడిపాను.” పరీక్షలు ఎదురైనప్పుడు మానవులు దేవునికి యథార్థంగా ఉండరని ఆరోపించిన సాతానుకు వ్యాలెంటీనా ఎంత శక్తివంతమైన తీరులో జవాబిచ్చింది! (యోబు 1:​9-11) వ్యాలెంటీనా యోహోవా హృదయం సంతోషపెట్టిందనీ, మరణంవరకు తనకు నమ్మకంగా ఉన్న ఆమెను, మరితరులను పునరుత్థానం ద్వారా తిరిగి బ్రతికించే సమయం కోసం యెహోవా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడని మనం నమ్మవచ్చు.​—⁠యోబు 14:⁠15.

12 మనం యెహోవాను ప్రేమిస్తున్నాం కాబట్టే ఆయనకు స్నేహితులముగా ఉన్నాం. ఆయన లక్షణాలను ఇష్టపడడంతోపాటు ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా జీవించేందుకు మనం చేయగలిగినదంతా చేస్తాం. అపవాది ఆరోపించినట్లు కాక, మనం యెహోవాను స్వచ్ఛందంగా, బేషరతుగా ప్రేమిస్తాం. ఆయనను మనం అలా హృదయపూర్వకంగా ప్రేమిస్తే పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు యథార్థతను కాపాడుకునేందుకు కావాల్సిన శక్తి పొందుతాం. యెహోవా మాత్రం, ‘తన భక్తుల ప్రవర్తనను కాచును.’​—⁠సామె. 2:8; కీర్త. 97:⁠10.

13 మనం ఎక్కువగా చేయలేమని మనకనిపించినా యెహోవాపట్ల మనకు ప్రేమ ఉంటే ఆయన నామాన్ని ఘనపరుస్తాం. ఆయన మనకున్న మంచి ఉద్దేశాలనే గమనిస్తాడు. మనం చేయాలనుకున్నదంతా చేయలేకపోతే, దాన్నిబట్టి ఆయన మనకు తీర్పుతీర్చడు. మనం ఏమి చేస్తున్నామన్నదే కాక ఎందుకు చేస్తున్నామన్నది కూడా ప్రాముఖ్యం. యోబు కష్టాలను సహిస్తూ ఎంతో దుఃఖాన్ని అనుభవించినా యెహోవా మార్గాలపట్ల ఆయనకున్న ప్రేమ గురించి తనను నిందించినవారితో చెప్పాడు. (యోబు 10:12; 28:28 చదవండి.) ఎలీఫజు, బిల్దదు, జోఫరులు తప్పుగా మాట్లాడారు కాబట్టి దేవుడు వారిని కోపగించుకున్నాడని యోబు గ్రంథంలోని చివరి అధ్యాయం చెబుతోంది. అదే సమయంలో, యోబును ‘నా సేవకుడు’ అని నాలుగుసార్లు సంబోధించి, తప్పుచేసిన ఆ ముగ్గురి కోసం ప్రార్థించమని నిర్దేశించడం ద్వారా యోబుపట్ల తన అనుగ్రహముందని యెహోవా చూపించాడు. (యోబు 42:​7-9) యెహోవా అనుగ్రహం మనమీద ఉండేలా మనమూ యోబులాగే ప్రవర్తిద్దాం.

యెహోవా తన నమ్మకమైన సేవకులకు సహాయం చేస్తున్నాడు

14 యోబు అపరిపూర్ణుడైనప్పటికీ తన యథార్థతను కాపాడుకున్నాడు. కొన్నిసార్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు ఆయన పరిస్థితిని తప్పుగా అర్థంచేసుకున్నాడు. ఉదాహరణకు, ఆయన యెహోవాతో ఇలా అన్నాడు: “నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తరమేమియు నియ్యకున్నావు . . . నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు.” అంతేకాక, యోబు తనను తాను సమర్థించుకోవడానికే అధిక ప్రాముఖ్యతనిచ్చాడు. ఎందుకంటే ఆయన “నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు?” ‘నేను బలత్కారము జరిగించలేదు, నా ప్రార్థన యథార్థంగా ఉంది’ అని అన్నాడు. (యోబు 10:7; 16:16; 30:​20, 21) యోబు అవధానాన్ని మళ్లించేలా ఎన్నో ప్రశ్నలు అడగడం ద్వారా యెహోవా ఆయనకు దయతో సహాయం చేశాడు. అంతేకాక, అలా ప్రశ్నలు అడగడం వల్ల దేవుడే సర్వోన్నతుడనీ, మానవులు ఆయనకు సాటిరారనీ యోబు గుర్తించగలిగాడు. యోబు దేవుని నిర్దేశాన్ని స్వీకరించి తనను తాను సరిదిద్దుకున్నాడు.​—⁠యోబు 40:8; 42:​2, 6 చదవండి.

15 నేడు కూడ యెహోవా తన సేవకులను దయతో సరిదిద్దుతున్నాడు. అంతేకాక ఆయన మనకోసం గొప్ప ప్రయోజనాలను చేకూర్చాడు. ఉదాహరణకు, యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి అర్పించి మన పాపాలు క్షమించబడేందుకు సహాయం చేశాడు. మనం అపరిపూర్ణులైనప్పటికీ ఆ బలివల్ల దేవునితో దగ్గరి సంబంధం కలిగివుండవచ్చు. (యాకో. 4:8; 1 యోహా. 2:⁠1) పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు మనం కూడ పరిశుద్ధాత్మ సహాయం కోసం, శక్తి కోసం ప్రార్థించవచ్చు. అంతేకాక, మన దగ్గర పూర్తి బైబిలు ఉంది. మనం దానిలోని విషయాలను చదివి ధ్యానిస్తే విశ్వాస పరీక్షలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటాం. అధ్యయనం చేయడంవల్ల మనం విశ్వసర్వాధిపత్యానికి, వ్యక్తిగత యథార్థతకు సంబంధించిన వివాదాంశాలను అర్థంచేసుకోగలుగుతాం.

16 అంతేకాక, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడి” మూలంగా యెహోవా ఆధ్యాత్మిక ఆహారాన్ని భూవ్యాప్తంగా ఉన్న మన సహోదరులకు ఇస్తున్నాడు, వారిలో ఒకరిగా ఉండడం ద్వారా మనం ఎంతో ప్రయోజనం పొందుతున్నాం. (మత్త. 24:​45-47) ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఘాలు దాదాపు 1,00,000 ఉన్నాయి. వాటిలో నిర్వహించబడే కూటాలు మనకు ఎదురుకాగల విశ్వాస పరీక్షలను సహించడానికి కావాల్సిన ఉపదేశాన్ని, శక్తిని ఇస్తాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకునేందుకు జర్మనీలో నివసిస్తున్న యెహోవాసాక్షి అయిన షీలా అనే టీనేజి అమ్మాయి ఉదాహరణ సహాయం చేస్తుంది.

17 ఒక రోజు పాఠశాలలో, క్లాసుకు టీచర్లు ఎవరూ రాలేదు. షీలా తోటి విద్యార్థులు వీజ బోర్డుతో (భవిష్యత్తు చూడడానికి ఉపయోగపడే లిపి ఫలకంతో) ఆడుకోవాలనుకున్నారు. ఆమె వెంటనే క్లాసును వదిలేసి వెళ్లిపోయింది. అలా చేసినందుకు ఆమె సంతోషించింది. ఎందుకంటే, ఆ బోర్డుతో ఆడుకుంటున్నప్పుడు దయ్యాలు అక్కడికి వచ్చినట్లు వారిలో కొందరికి అనిపించి, భయాభ్రాంతులకు లోనై అక్కడినుండి పారిపోయారని ఆమెకు ఆ తర్వాత తెలిసింది. అయితే, అలా క్లాసు రూమును వెంటనే వదిలేసి వెళ్లాలని షీలాకు ఎందుకు అనిపించింది? “ఇలా జరగడానికి కొద్దిరోజుల ముందు, వీజ బోర్డులవల్ల కలిగే ప్రమాదాల గురించి మేము రాజ్యమందిరంలో చర్చించాం కాబట్టి అలాంటి సందర్భాల్లో ఏమి చేయాలో నాకు తెలుసు. అంతేకాక, సామెతలు 27:11 చెబుతున్నట్లు నేను యెహోవాను సంతోషపెట్టాలనుకున్నాను” అని షీలా చెబుతోంది. కూటంలో ఆ విషయం చర్చించబడుతున్నప్పుడు షీలా అక్కడ ఉండి, జాగ్రత్తగా వినడంవల్ల ఎంత మేలు జరిగింది!

18 మనలో ప్రతీ ఒక్కరం దేవుని సంస్థ ఇస్తున్న నిర్దేశాన్ని ఎలప్పుడూ పాటించాలనే కృతనిశ్చయంతో ఉందాం. క్రమంగా కూటాలకు హాజరౌతూ, బైబిలు చదువుతూ, బైబిలు సాహిత్యాలను అధ్యయనం చేస్తూ, ప్రార్థిస్తూ, పరిణతిగల క్రైస్తవులతో సహవసిస్తూ ఉన్నట్లయితే మనకు కావాల్సిన నిర్దేశాన్ని, సహాయాన్ని పొందుతాం. మనం మన యథార్థతను కాపాడుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనం కాపాడుకుంటామనే నమ్మకం కూడా ఆయనకు ఉంది. యెహోవా నామాన్ని ఘనపరుస్తూ, మన యథార్థతను కాపాడుకుంటూ, యెహోవాను సంతోషపెట్టడం ఎంత గొప్ప అవకాశం!

మీకు జ్ఞాపకమున్నాయా?

• ఏ పరిస్థితులకు, పరీక్షలకు సాతాను కారకుడు?

• మన దగ్గరున్న అత్యంత అమూల్యమైన సంపద ఏమిటి?

• మనం ఎందుకు యెహోవాకు స్నేహితులముగా ఉన్నాం?

• నేడు యెహోవా మనకు ఏయే విధాలుగా సహాయం చేస్తున్నాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) సాతాను చేసిన ఏ సవాలు గురించి యోబు గ్రంథం వివరిస్తోంది? (బి) యోబు మరణించిన తర్వాత కూడ సాతాను యెహోవాను నిందిస్తూనే ఉన్నాడని మనకు ఎలా తెలుసు?

3. యోబు గ్రంథం నుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు?

4. ప్రస్తుత లోక పరిస్థితులకు అసలు కారకులు ఎవరు?

5. మనకున్న అమూల్యమైన జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలని కోరుకుంటాం?

6, 7. (ఎ) సత్యారాధకులు ఎదుర్కొంటున్న హింసకు అసలు కారకులు ఎవరు? (బి) ఏలీహు మాదిరిని మనమెలా అనుకరించవచ్చు?

8. యోబు యెహోవాను ఘనపర్చడాన్ని సాతాను ఎందుకు ఆపలేకపోయాడు?

9. మన దగ్గరున్న అతి అమూల్యమైన సంపద ఏమిటి?

10, 11. (ఎ) యథార్థతకు సంబంధించిన పరీక్షలకు మన సహోదరి ఎలా స్పందించింది? (బి) ఈ సహోదరి సాతానుకు ఏ శక్తివంతమైన జవాబిచ్చింది?

12. యెహోవాతో మనకున్న సంబంధంలో ప్రేమ ఎలాంటి పాత్ర పోషిస్తుంది?

13. మనం ఆయన కోసం చేసే సేవను యెహోవా ఎలా పరిగణిస్తాడు?

14. యోబు తన ఆలోచనను సరిదిద్దుకునేందుకు యెహోవా ఎలా సహాయం చేశాడు?

15, 16. నేడు తన సేవకులకు యెహోవా ఏయే విధాలుగా సహాయం చేస్తున్నాడు?

17. క్రైస్తవ కూటాలకు ఎల్లప్పుడూ హాజరుకావడం మంచిదని ఓ యౌవనస్థురాలి ఉదాహరణ ఎలా చూపిస్తోంది?

18. మీరు ఏమి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు?

[8వ పేజీలోని చిత్రం]

మీకున్న అమూల్యమైన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలని మీకు అనిపిస్తోందా?

[9వ పేజీలోని చిత్రం]

తమ యథార్థతను కాపాడుకునేందుకు తోటి ఆరాధకులకు మనం సహాయం చేయవచ్చు

[10వ పేజీలోని చిత్రం]

తన యథార్థతను కాపాడుకోవడానికి వ్యాలెంటీనా అన్నింటినీ త్యాగం చేయడానికి సిద్ధపడింది