అంతం వచ్చినప్పుడు మీరు ఎక్కడుండాలి?
అంతం వచ్చినప్పుడు మీరు ఎక్కడుండాలి?
అర్మగిద్దోను సమయంలో యెహోవా ప్రస్తుత దుష్టవిధానాన్ని అంతం చేసినప్పుడు యథార్థవంతులకు ఏమవుతుంది? సామెతలు 2:21, 22 ఇలా జవాబిస్తోంది, “యథార్థవంతులు దేశమందు [‘భూమిపై,’ NW] నివసించుదురు, లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో [‘భూమిపై,’ NW] నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.”
అయితే లోపములేనివారు భూమిపై ఎలా నిలిచివుంటారు? వాళ్ళకు ఆశ్రయస్థానమేదైనా ఉంటుందా? అంతం వచ్చినప్పుడు యథార్థవంతులు ఎక్కడ ఉండాలి? తప్పించుకొని జీవించినవారి గురించిన నాలుగు లేఖన వృత్తాంతాలు ఈ విషయాలను తెలియజేస్తున్నాయి.
స్థలానికి ప్రాధాన్యత ఇవ్వబడిన సందర్భాలు
పితరులైన నోవహు, లోతు తప్పించబడడాన్ని గురించి 2 పేతురు 2:5-7లో ఇలా చదువుతాం, “[దేవుడు] పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.”
నోవహు జలప్రళయాన్ని ఎలా తప్పించుకున్నాడు? దేవుడు నోవహుకిలా చెప్పాడు, “సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము.” (ఆది. 6:13, 14) యెహోవా ఆజ్ఞాపించినట్లుగానే నోవహు ఓడను నిర్మించాడు. జలప్రళయం ప్రారంభమవడానికి ఏడురోజుల ముందు, జంతువులన్నింటినీ ఓడలోకి సమకూర్చి, కుటుంబంతో సహా దానిలోకి ప్రవేశించమని యెహోవా నోవహుకు ఆజ్ఞాపించాడు. ఏడవ దినమున ఓడ తలుపు మూసివేయబడింది, ఆ తర్వాత “నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను.” (ఆది. 7:1-4, 11, 12, 16) నోవహు, ఆయన కుటుంబం, “నీటిద్వారా రక్షణపొందిరి.” (1 పేతు. 3:19, 20) వాళ్ళు తప్పించబడాలంటే ఓడ లోపలే ఉండాలి. భూమి మీద వేరే ఏ స్థలంలోవున్నా వారు తప్పించుకునే అవకాశం లేదు.—ఆది. 7:19, 20.
లోతు విషయంలో ఇవ్వబడిన సూచనలు కాస్త వేరుగా ఉన్నాయి. ఆయన ఎక్కడ ఉండకూడదో ఇద్దరు దేవదూతలు ఆయనకు తెలియజేశారు. ఆ ఇద్దరు దేవదూతలు లోతుతో ఇలా చెప్పారు, “[సొదొమ] ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొని రమ్ము; మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి.” వారు ‘ఆ పర్వతానికి పారిపోవాలి.’—ఆది. 19:12, 13, 17.
నోవహు, లోతు అనుభవాలు, “భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను . . . తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు [‘యెహోవా,’ NW] సమర్థుడు” అని నిరూపిస్తున్నాయి. (2 పేతు. 2:9) ఈ రెండు సందర్భాల్లోనూ స్థలానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. నోవహు ఓడ లోపలికి వెళ్ళాలి, లోతు సొదొమ వెలుపలికి రావాలి. కానీ ఎప్పుడూ అలాగే జరుగుతుందా? యథార్థవంతులు ఎక్కడున్నా, వాళ్ళు వేరే స్థలానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా యెహోవా వారిని రక్షించగలడా? ఆ ప్రశ్నకు సమాధానం కోసం, తప్పించబడడానికి సంబంధించిన మరో రెండు వృత్తాంతాలను గమనించండి.
స్థలం ఎప్పుడూ ప్రాముఖ్యమైనదేనా?
మోషే కాలంలో యెహోవా పదవ తెగులు తీసుకువచ్చి ఐగుప్తును నాశనం చేయడానికి ముందు, పస్కా పశువు రక్తాన్ని ద్వారబంధపు పైకమ్మిమీద, రెండు నిలువు కమ్ముల మీద పూయమని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. ఎందుకలా చేయాలి? ఎందుకంటే ‘యెహోవా నిర్గ. 12:22, 23, 29.
ఐగుప్తీయులను హతము చేయడానికి దేశ సంచారము చేస్తూ, ద్వారబంధపు పైకమ్మిమీద రెండు నిలువు కమ్ములమీద ఉన్న రక్తాన్ని చూచి ఆ తలుపును దాటిపోయి, వారిని హతముచేయడానికి వారి ఇండ్లలోనికి సంహారకుని చొరనివ్వకుండా’ అలాచేయాలి. ఆ రాత్రే “సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను.” ఇశ్రాయేలీయుల్లోని తొలి సంతానం మాత్రం ఎక్కడికీ వెళ్ళనవసరం లేకుండానే తప్పించబడ్డారు.—యెరికో పట్టణంలో నివసిస్తున్న రాహాబు అనే వేశ్య విషయాన్ని కూడా పరిశీలించండి. ఇశ్రాయేలీయులు వాగ్దానదేశాన్ని జయించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాహాబు యెరికో పట్టణం నాశనం కాబోతోందని గ్రహించినప్పుడు, ముందుకు దూసుకువస్తున్న ఇశ్రాయేలీయులను చూసి పట్టణమంతా భయంతో కంపించిపోతోందని ఇద్దరు ఇశ్రాయేలు వేగులవారికి చెప్పింది. ఆమె ఆ వేగులవారిని దాచిపెట్టి, యెరికోను వాళ్ళు జయించినప్పుడు తననూ తన ఇంటివారినందరినీ కాపాడతామని వాగ్దానం చేయమని వారిని అడిగింది. ఆమె ఇంటివారినందరినీ పట్టణ ప్రాకారంపైవున్న ఆమె ఇంట్లోకి సమకూర్చాలని వేగులవారు రాహాబుకు చెప్పారు. ఇంట్లోనుండి బయటకు వస్తే పట్టణమంతటితోపాటు వాళ్ళు కూడా నాశనమైపోతారు. (యెహో. 2:8-13, 15, 18, 19) కానీ యెహోవా ఆ తర్వాత యెహోషువకు ‘ఆ పట్టణ ప్రాకారము కూలవలెను’ అని చెప్పాడు. (యెహో. 6:5) సురక్షితమైనదని వేగులవారు చెప్పిన స్థలమే ఆ తర్వాత ప్రమాదకరమైనదిగా కనిపించింది. రాహాబు, ఆమె ఇంటివారు ఎలా తప్పించబడతారు?
యెరికోను జయించే సమయం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు కేకలువేసి బూరలు ఊదారు. “ఆ బూరల ధ్వని వినినప్పుడు [ఇశ్రాయేలు] ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను” అని యెహోషువ 6:20 చెబుతోంది. ప్రాకారము కూలడాన్ని ఇక ఏ మానవులూ నియంత్రించలేరు. అయితే అద్భుతరీతిగా, పట్టణ ప్రాకారం కూలడం రాహాబు ఇంటిదగ్గర ఆగిపోయింది. యెహోషువ ఆ ఇద్దరు వేగుల వారికి ఇలా ఆజ్ఞాపించాడు, “ఆ వేశ్యయింటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగినవారినందరిని అక్కడనుండి తోడుకొని రండి.” (యెహో. 6:22) రాహాబు ఇంటివారందరూ తప్పించబడ్డారు.
ప్రాముఖ్యమైన విషయమేమిటి?
నోవహు, లోతు, మోషే కాలంనాటి ఇశ్రాయేలీయులు, రాహాబు తప్పించబడడం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ప్రస్తుత దుష్టవిధాన అంతం వచ్చినప్పుడు మనమెక్కడ ఉండాలనే విషయాన్ని నిశ్చయించుకోవడానికి ఈ వృత్తాంతాలు మనకెలా సహాయం చేస్తాయి?
నిజమే, నోవహు ఓడలోకి ప్రవేశించినందుకు తప్పించబడ్డాడు. కానీ ఆయన ఓడలో ఎందుకు ఉన్నాడు? ఆయన విశ్వాసం కలిగివుండి, విధేయత చూపించినందుకే కాదా? “నోవహు . . . దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను” అని బైబిలు చెబుతోంది. (ఆది. 6:22; హెబ్రీ. 11:7) మరి మన విషయమేమిటి? దేవుడు మనకు ఆజ్ఞాపించినవన్నీ మనం చేస్తున్నామా? అంతేగాక నోవహు ‘నీతిని ప్రకటించాడు.’ (2 పేతు. 2:5) మనం కూడా ఆయనలాగే, మన క్షేత్రంలో చాలామంది వినకపోయినా ఆసక్తిగా ప్రకటనాపనిలో పాల్గొంటున్నామా?
లోతు సొదొమ నుండి పారిపోవడం ద్వారా నాశనాన్ని తప్పించుకున్నాడు. ఆయన దేవుని దృష్టిలో నీతిమంతునిగా ఉన్నాడు కాబట్టే, సొదొమ గొమొర్రాల్లోని దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చూసి ఎంతో బాధపడ్డాడు కాబట్టే, ఆయన తప్పించబడ్డాడు. నేడు అంతటా వ్యాపించివున్న కామ వికారయుక్తమైన నడవడి చూసి మనం నిజంగా బాధపడుతున్నామా? లేక అది మనల్ని ఏ మాత్రం బాధించనంతగా మన మనస్సాక్షి మొద్దుబారిపోయిందా? ‘శాంతముగలవారమై, ఆయన దృష్టికి నిష్కళంకులముగా, నిందారహితులముగా’ ఉండడానికి మనం చేయగలిగినదంతా చేస్తున్నామా?—2 పేతు. 3:14.
ఐగుప్తులోని ఇశ్రాయేలీయులు, యెరికోలోని రాహాబు తమ తమ ఇళ్ళలో ఉండడం మూలంగానే తప్పించబడ్డారు. వాళ్ళకు విశ్వాసం, విధేయత అవసరమయ్యాయి. (హెబ్రీ. 11:28, 30, 31) ఐగుప్తులోని ఒక ఇంట్లో తర్వాత మరో ఇంట్లో “మహాఘోష పుట్ట[డం]” ప్రారంభం కాగానే ఇశ్రాయేలీయుల ప్రతీ కుటుంబం తమ మొదటి సంతానాన్ని ఎలా గమనిస్తూ ఉండివుంటారో ఊహించండి. (నిర్గ. 12:30) యెరికో ప్రాకారాలు కూలుతున్న శబ్దం అంతకంతకూ దగ్గరవుతుండగా రాహాబు తన ఇంటివారినందరినీ ఎలా అక్కున చేర్చుకొనివుంటుందో ఊహించండి. విధేయురాలై, ఆ ఇంటి లోపలే ఉండడానికి ఆమెకు నిజంగానే ఎంతో విశ్వాసం అవసరమైంది.
సాతాను దుష్టలోకం త్వరలోనే అంతమౌతుంది. యెహోవా భయంగొలిపే తన “ఉగ్రత దినమున” తన ప్రజలను ఎలా కాపాడతాడో మనకింకా తెలియదు. (జెఫ. 2:3) అయితే ఆ సమయంలో మనమెక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం తప్పించబడడం యెహోవా మీద మనకున్న విశ్వాసంపై, ఆయనకు మనం చూపించే విధేయతపై ఆధారపడివుంటుందని నిశ్చయత కలిగివుండవచ్చు. ఈలోగా మనం, మన “అంతఃపురములు” అని యెషయా ప్రవచనం పేర్కొంటున్నవాటి పట్ల సరైన దృక్పథాన్ని ఏర్పర్చుకోవాలి.
‘మీ అంతఃపురములలో ప్రవేశించుడి’
‘నా జనమా, వెళ్ళి మీ అంతఃపురములలో ప్రవేశించుడి. వెళ్ళి మీ తలుపులు వేసుకొనుడి. ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుడి’ అని యెషయా 26:20, 21 చెబుతోంది. ఈ ప్రవచనం, మాదీయ పారసీకులు బబులోనును జయించినప్పుడు, సా.శ.పూ. 539లో మొదటిసారి నెరవేరివుండవచ్చు. పారసీక దేశస్థుడైన కోరెషు బబులోనులోకి ప్రవేశించి, ప్రతీ ఒక్కరూ ఇంటిలోపలే ఉండాలని శాసించివుండవచ్చు, ఎందుకంటే బయట ఉన్నవారినందరినీ హతమార్చమని ఆయన సైనికులకు ఆజ్ఞాపించబడింది.
మన కాలంలో, ఈ ప్రవచనంలోని “అంతఃపురములకు” ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల 1,00,000 కన్నా ఎక్కువ సంఘాలకు సన్నిహిత సంబంధం ఉందని చెప్పవచ్చు. అలాంటి సంఘాలు మన జీవితంలో ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి. “మహాశ్రమల” సమయంలో కూడా అవి అదే పాత్ర నిర్వహిస్తాయి. (ప్రక. 7:14) “అంతఃపురములలోకి” వెళ్ళి “ఉగ్రత తీరిపోవువరకు” అక్కడే దాగియుండాలని దేవుని ప్రజలకు ఆజ్ఞాపించబడింది. మనం సంఘం పట్ల ఆరోగ్యదాయకమైన దృక్ఫథాన్ని ఏర్పర్చుకొని దాన్ని కాపాడుకోవడం, సంఘంతో సన్నిహితంగా సహవసించాలని గట్టిగా నిర్ణయించుకోవడం ఎంతో ఆవశ్యకం. పౌలు ఇచ్చిన ఈ ప్రోత్సాహాన్ని మనం మనసులో ఉంచుకోవాలి, “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట [మనం] చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.”—హెబ్రీ. 10:24, 25.
[7వ పేజీలోని చిత్రాలు]
గతంలో దేవుడు తన ప్రజలను తప్పించడం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
[8వ పేజీలోని చిత్రం]
మన కాలంలో “అంతఃపురములు” వేటిని సూచించవచ్చు?