కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇత్తయి చూపించినట్లు యథార్థత చూపించండి

ఇత్తయి చూపించినట్లు యథార్థత చూపించండి

ఇత్తయి చూపించినట్లు యథార్థత చూపించండి

“ప్రభువా, [‘యెహోవా’ NW] దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు?” ఈ పాట దేవుని యథార్థతను గుర్తుచేస్తుంది, దీనిని ‘క్రూరమృగమును దాని ప్రతిమను జయించినవారు’ పరలోకంలో పాడారు. (ప్రక. 15:2-4) తన ఆరాధకులు ఈ కోరదగిన లక్షణాన్ని ప్రదర్శించడంలో తనను అనుకరించాలని యెహోవా కోరుకుంటున్నాడు.—ఎఫె. 4:24.

మరోవైపు అపవాదియైన సాతాను, దేవుని భూసేవకులను వారు ఆరాధిస్తున్న దేవుని ప్రేమనుండి దూరం చేయడానికి తాను చేయగలిగినదంతా చేస్తాడు. అయినప్పటికీ ఎంతో కఠినమైన పరిస్థితుల్లో కూడా చాలామంది దేవుని పట్ల తమ యథార్థతను కాపాడుకున్నారు. అలాంటి భక్తిని యెహోవా ఎంతో ఉన్నతమైనదిగా ఎంచుతున్నందుకు మనమెంత కృతజ్ఞత చూపించవచ్చో! వాస్తవానికి మనకిలా హామీ ఇవ్వబడింది, “యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడువడు.” (కీర్త. 37:28) మనం మన యథార్థతను కాపాడుకునేందుకు సహాయం చేయడానికి ఆయన తన వాక్యంలో చాలామంది యథార్థవంతులు చేసిన కార్యాల వృత్తాంతాన్ని రాయించివుంచాడు. అలాంటి వాటిలో ఒకటి గిత్తీయుడైన ఇత్తయి వృత్తాంతం.

“నివాసస్థలము కోరు పరదేశి”

ఇత్తయి ఫిలిష్తీయలోని ప్రముఖ పట్టణమైన గాతు నివాసి అయ్యుండవచ్చు, భారీకాయుడైన గొల్యాతు, ఇశ్రాయేలీయులకు భయంపుట్టించే ఇతర శత్రువులు ఆ పట్టణానికి చెందినవారే. దావీదు రాజుపై అబ్షాలోము తిరుగుబాటు చేసిన సమయానికి సంబంధించిన వృత్తాంతంలో అనుభవంగల యుద్ధశూరుడైన ఇత్తయి గురించిన ప్రస్తావన మొదటిసారి కనిపిస్తుంది. ఇత్తయి, ఆయనను అనుసరించిన 600 మంది ఫిలిష్తీయులు అప్పుడు యెరూషలేము పరిసరాల్లో పరవాసులుగా ఉన్నారు.

ఇత్తయి, ఆయన అనుచరుల పరిస్థితి దావీదుకు, తాను పరవాసిగా పారిపోతూ తానూ, తనతోపాటూ 600మంది ఇశ్రాయేలు యోధులు ఫిలిష్తీయ ప్రాంతానికి వచ్చి గాతు రాజైన ఆకీషు రాజ్యంలోకి ప్రవేశించిన రోజుల్ని జ్ఞాపకం చేసివుండవచ్చు. (1 సమూ. 27:2, 3) దావీదు కుమారుడైన అబ్షాలోము ఆయనపై తిరుగుబాటు చేసినప్పుడు ఇత్తయి, ఆయన మనుషులు ఏమి చేసే అవకాశముంది? వాళ్ళు అబ్షాలోము పక్షం వహిస్తారా, తటస్థంగా ఉంటారా లేక దావీదుకు, ఆయన మనుషులకు మద్దతిస్తారా?

దావీదు యెరూషలేము నుండి పారిపోతూ బెత్మెర్హాకు అనే స్థలంలో ఆగివున్న దృశ్యాన్ని ఊహించుకోండి, నూతనలోక అనువాదము (ఆంగ్లం)లో ఈ వచనానికున్న అధస్సూచి ప్రకారం, బెత్మెర్హాకు అనే పదానికి “దూరానున్న ఇల్లు” అనే భావముంది. ఇది కిద్రోనువాగును దాటకముందు, ఒలీవల కొండ దిశలో యెరూషలేములోని చివరి ఇల్లు అయ్యుండవచ్చు. (2 సమూ. 15:17) ఇక్కడ దావీదు తన సైన్యం బయలుదేరగా దానిని పునఃసమీక్షించాడు. ఆయనతోపాటు యథార్థవంతులైన ఇశ్రాయేలీయులే కాక కెరేతీయులు, పెలేతీయులు కూడా ఉన్నారు. అంతేగాక, గిత్తీయులందరూ కూడా ఆయనతో ఉన్నారు, వారే ఇత్తయి, ఆయన 600 మంది యోధులు.—2 సమూ. 15:18.

హృదయపూర్వకమైన తదనుభూతితో దావీదు ఇత్తయితో ఇలా అన్నాడు, “నీవు నివాసస్థలము కోరు పరదేశివై యున్నావు; నీవెందుకు మాతోకూడ వచ్చుచున్నావు? నీవు తిరిగి పోయి రాజున్న [బహుశా అబ్షాలోము కావచ్చు] స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతోకూడ ఈ తిరుగులాట యెందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము; [‘యెహోవా’ NW] కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక.”—2 సమూ. 15:19, 20.

ఇత్తయి నిశ్చలమైన యథార్థతను వెల్లడిచేస్తూ ఇలా సమాధానమిచ్చాడు, “నేను చచ్చినను బ్రదికినను, యెహోవా జీవముతోడు నా యేలినవాడవును రాజవునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా యేలినవాడవును రాజవునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందును.” (2 సమూ. 15:21) ఇది దావీదుకు తన ముత్తవ్వ అయిన రూతు పలికిన మాటలను జ్ఞాపకం చేసివుండవచ్చు. (రూతు 1:16, 17) ఇత్తయి పలికిన మాటలు దావీదు హృదయాన్ని స్పృశించడంతో ఆయన, ఇత్తయి తమతోపాటు కిద్రోను వాగుదాటి “రావచ్చు” అని చెప్పాడు. దానితో “గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరును అతని కుటుంబికులందరును సాగిపోయిరి.”—2 సమూ. 15:22.

“మనకు బోధ కలుగు నిమిత్తము”

“పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి” అని రోమీయులు 15:4 చెబుతోంది. కాబట్టి మనమిలా ప్రశ్నించుకోవడం మంచిది, ఇత్తయి ఉదాహరణ నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? ఆయన దావీదుపట్ల యథార్థంగా ఉండడానికి ఆయనను ఏది పురికొల్పివుండవచ్చో పరిశీలించండి. ఇత్తయి పరదేశి, ఫిలిష్తీయ నుండి పరవాసిగా వచ్చినవాడు అయినప్పటికీ ఆయన యెహోవాను సజీవుడైన దేవునిగా, దావీదును యెహోవా అభిషిక్తునిగా గుర్తించాడు. ఇత్తయి ఇశ్రాయేలీయులకు, ఫిలిష్తీయులకు మధ్యవున్న శత్రుత్వం తాను పక్షపాత వైఖరి చూపించేలా చేసేందుకు అనుమతించలేదు. ఆయన దావీదును, ఫిలిష్తీయ యోధుడైన గొల్యాతును, ఇత్తయి స్వంత ఊరువారైన ఇంకా చాలామందిని చంపిన వ్యక్తిగా మాత్రమే దృష్టించలేదు. (1 సమూ. 18:6, 7) ఇత్తయి దావీదును యెహోవాను ప్రేమించిన వ్యక్తిగా దృష్టించాడు, ఆయన దావీదు విశేషమైన లక్షణాలను గమనించాడనడంలో సందేహం లేదు. తత్ఫలితంగా దావీదు కూడా ఇత్తయిని ఎంతో గౌరవించాడు. అంతేకాదు, దావీదు అబ్షాలోము సైన్యంతో చేస్తున్న చివరి యుద్ధంలో తన సైన్యంలోని మూడవ వంతును “ఇత్తయి చేతిక్రింద” ఉంచాడు.—2 సమూ. 18:2.

మనం కూడా సాంస్కృతిక, జాతి, వర్గ బేధాలకు అలాగే వాటి మధ్యవున్న వివక్షకు, శత్రుత్వానికి ప్రాధాన్యతనివ్వకుండా ఇతరుల్లో ఉన్న మంచి లక్షణాలను గుర్తించడానికి కృషిచేయాలి. దావీదు ఇత్తయిల మధ్య ఏర్పడిన అనుబంధం, యెహోవా గురించి తెలుసుకోవడం, ఆయనను ప్రేమించడం అలాంటి అడ్డంకులను అధిగమించడానికి సహాయం చేయగలదని సోదాహరణంగా చూపిస్తుంది.

ఇత్తయి ఉదాహరణ గురించి ఆలోచించేటప్పుడు మనల్ని మనమిలా ప్రశ్నించుకోవచ్చు, ‘నేను గొప్ప దావీదైన క్రీస్తుయేసు పట్ల అలాంటి యథార్థతనే చూపిస్తానా? రాజ్య ప్రకటన, శిష్యులను చేసే పనిలో ఆసక్తిగా పాల్గొనడం ద్వారా నేను నా యథార్థతను చూపిస్తానా?’ (మత్త. 24:14; 28:19, 20) ‘నేను నా యథార్థతను నిరూపించుకోవడానికి ఏమేమి ఎదుర్కోవడానికి సుముఖంగా ఉన్నాను?’

కుటుంబ శిరస్సులు కూడా ఇత్తయి యథార్థతా ఉదాహరణను ధ్యానించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. దావీదు పట్ల ఇత్తయి చూపించిన యథార్థత, దేవుని అభిషిక్త రాజును అనుసరించాలనే ఆయన నిర్ణయం, ఆయన మనుషులపై కూడా ప్రభావాన్ని చూపించింది. అలాగే కుటుంబ శిరస్సులు సత్యారాధనకు మద్దతుగా తీసుకునే నిర్ణయాలు వారి కుటుంబాలపై ప్రభావాన్ని చూపిస్తాయి, అంతేగాక తాత్కాలికంగా కష్టాలు ఎదురవడానికి కూడా అవి కారణం కావచ్చు. అయినప్పటికీ యెహోవా “యథార్థవంతులయెడల యథార్థవంతు[ని]గా” ఉంటాడని మనకు హామీ ఇవ్వబడుతోంది.—కీర్త. 18:25.

అబ్షాలోముతో దావీదు యుద్ధం ముగిసిన తర్వాత లేఖనాలు ఇత్తయి గురించి ఇక ఏమీ చెప్పడం లేదు. దేవుని వాక్యంలో ఆయన గురించి ఉన్న క్లుప్త వృత్తాంతం, దావీదు జీవితంలోని కష్ట సమయంలో ఇత్తయి చూపించిన లక్షణాల గురించి ఎంతో తెలియజేస్తుంది. ఇత్తయి గురించి ప్రేరేపిత లేఖనాల్లో రాయబడివుండడం, యెహోవా అలాంటి యథార్థతను గుర్తిస్తాడని దానికి తగిన ప్రతిఫలాన్నిస్తాడని అనడానికి నిదర్శనం.—హెబ్రీ. 6:10.