కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భర్తలారా, క్రీస్తు ప్రేమను అనుకరించండి!

భర్తలారా, క్రీస్తు ప్రేమను అనుకరించండి!

భర్తలారా, క్రీస్తు ప్రేమను అనుకరించండి!

తన భూజీవితంలోని చివరి రాత్రి తన నమ్మకమైన అపొస్తలులతో యేసు ఇలా చెప్పాడు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహా. 13:34, 35) అవును, నిజ క్రైస్తవులు ఒకరిపట్ల ఒకరు ప్రేమ చూపించాలి.

క్రైస్తవ భర్తలను ఉద్దేశించి అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.” (ఎఫె. 5:25) ఈ లేఖన ఉపదేశాన్ని ఒక క్రైస్తవ భర్త తన వైవాహిక జీవితంలో ఎలా పాటించవచ్చు? ముఖ్యంగా తన భార్య యెహోవా సమర్పిత సేవకురాలైతే దాన్ని ఎలా పాటించవచ్చు?

క్రీస్తు సంఘాన్ని సంరక్షించాడు

“పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. . . . ఆలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు” అని బైబిలు చెబుతోంది. (ఎఫె. 5:28, 29) యేసు తన శిష్యులపట్ల ప్రేమానురాగాలను చూపించి వారిని సంరక్షించాడు. వారు అపరిపూర్ణులైనప్పటికీ వారితో ఆయన మృదువుగా వ్యవహరిస్తూ దయ చూపించాడు. ‘మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టాలి’ అనే ఉద్దేశంతో తన శిష్యుల్లోవున్న మంచి లక్షణాలనే ఆయన చూశాడు.—ఎఫె. 5:25-27.

సంఘంపట్ల క్రీస్తు ప్రేమ చూపించినట్లే భర్త తన మాటల్లో చేతల్లో భార్యపట్ల తనకున్న ప్రేమను చూపించాలి. భర్త ప్రేమను ఎప్పుడూ పొందే భార్య తనను భర్త మంచిగా చూసుకుంటున్నాడని ఎంతో సంతోషిస్తుంది. అయితే, ఇంట్లో అన్ని సౌకర్యాలున్నా భర్త తనను పట్టించుకోకపోతే భార్య సంతోషంగా ఉండదు.

భర్త తన భార్యను సంరక్షిస్తున్నాడని ఎలా చూపించవచ్చు? అందరిలో ఉన్నప్పుడు, ఆమెను తగిన గౌరవంతో ఇతరులకు పరిచయం చేయాలి. ఇంటిని బాగా చూసుకుంటుందని అందరిముందు ఆమెను మెచ్చుకోవాలి. ఒకానొక ప్రాముఖ్యమైన విషయానికి సంబంధించి కుటుంబంగా మంచి ఫలితాలు సాధించడంలో భార్య ముఖ్య పాత్ర వహించినట్లైతే భర్త దాన్ని ఇతరులకు తెలియజేయడానికి వెనుకాడకూడదు. ఇద్దరే ఉన్నప్పుడు, భర్త ప్రేమను భార్య గుర్తిస్తుంది. ఆప్యాయంగా మృదువుగా స్పర్శిస్తూ, దగ్గరకు తీసుకొని, మెచ్చుకోలుగా మాట్లాడడం లాంటివి చిన్న చిన్న విషయాలే అయినా అవి ఆమె హృదయంలో చెరగని ముద్ర వేస్తాయి.

‘వారిని సహోదరులని పిలవడానికి ఆయన సిగ్గుపడలేదు

క్రీస్తుయేసు ‘వారిని [తన అభిషిక్త అనుచరులను] సహోదరులని పిలవడానికి సిగ్గుపడలేదు.’ (హెబ్రీ. 2:11, 12, 17) మీరు ఒక క్రైస్తవ భర్త అయితే మీ భార్య కూడా ఒక క్రైస్తవ సహోదరి అనీ, ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకునే ముందు బాప్తిస్మం తీసుకున్నా లేదా ఆ తర్వాత తీసుకున్నా ఆమె చేసిన వివాహ ప్రమాణాల కన్నా యెహోవాతో ఆమె చేసుకున్న సమర్పణే ప్రాముఖ్యమనీ గుర్తుంచుకోండి. అందుకే సంఘ కూటాల్లో వ్యాఖ్యానాలు అడిగేటప్పుడు కూటాన్ని నిర్వహించే సహోదరుడు మీ భార్యను “సిస్టర్‌ —” అని పిలుస్తాడు. ఆమె రాజ్య మందిరంలోనే కాక ఇంట్లో కూడా మీ సహోదరే. రాజ్య మందిరంలో వ్యవహరించినట్లే ఇంట్లో కూడా ఆమెతో మర్యాదగా దయతో వ్యవహరించడం ప్రాముఖ్యం.

సంఘంలో మీకు అదనపు బాధ్యతలు ఉండవచ్చు. అలాంటప్పుడు సంఘ బాధ్యతలకూ కుటుంబ బాధ్యతలకూ న్యాయం చేయడం కొన్నిసార్లు కష్టమనిపించవచ్చు. పెద్దలుగా, పరిచర్య సేవకులుగా మీరు ఒకరికొకరు సహకరించుకుంటూ సరైన విధంగా బాధ్యతలను ఇతరులకు అప్పగించినప్పుడు మీ అవసరం ఎక్కువ ఉన్న సహోదరికి అంటే మీ భార్యకు ఎక్కువ సమయం ఇవ్వగలుగుతారు. మీకు అప్పగించబడిన సంఘ బాధ్యతలను నిర్వర్తించడానికి ఇతర సహోదరులైతే ఉండొచ్చు. కానీ మీరు వివాహం చేసుకున్న మీ భార్యను చూసుకోవాల్సింది మీరేనని గుర్తుంచుకోండి.

అంతేకాక, మీరు మీ భార్యకు శిరస్సు. ‘ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు’ అని బైబిలు చెబుతోంది. (1 కొరిం. 11:3) ఈ శిరస్సత్వాన్ని మీరు ఎలా నిర్వర్తించాలి? పదేపదే ఈ లేఖనాన్ని ఎత్తి చూపుతూ గౌరవం కోరడం ద్వారా కాదు గానీ ప్రేమపూర్వకంగా దాన్ని నిర్వర్తించాలి. యేసుక్రీస్తు సంఘంతో వ్యవహరించినట్లే మీరు మీ భార్యతో వ్యవహరించడం ద్వారా మీరు మీ శిరస్సత్వాన్ని సరిగ్గా నిర్వర్తించవచ్చు.—1 పేతు. 2:21.

‘మీరు నా స్నేహితులు’

యేసు తన శిష్యులను స్నేహితులు అని పిలిచాడు. ఆయన వారితో ఇలా అన్నాడు: “దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.” (యోహా. 15:14, 15) యేసు, ఆయన శిష్యులు చక్కగా మాట్లాడుకునేవారు, కలిసి పనులు కూడా చేసేవారు. ‘యేసు, ఆయన శిష్యులు’ కానాలో జరిగిన వివాహానికి పిలవబడ్డారు. (యోహా. 2:2) గెత్సేమనే తోటలాంటి ప్రదేశాలకు వెళ్లడానికి వారు ఇష్టపడేవారు. ‘యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్లుచుండేవాడు’ అని బైబిలు చెబుతోంది.—యోహా. 18:2.

తన భర్తకు తానే అతి దగ్గరి స్నేహితురాలినని భార్యకు అనిపించాలి. భార్యాభర్తలైన మీరు జీవితాన్ని కలిసి ఆనందించడం ఎంత అవసరం! కలిసి దేవుణ్ణి సేవించండి. కలిసి బైబిలు అధ్యయనం చేయడంలోవున్న ఆనందాన్ని ఆస్వాదించండి. కలిసి సమయం గడపండి అంటే కలిసి నడవండి, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, కలిసి భోజనం చేయండి. దంపతుల్లా మాత్రమే ఉండకండి మంచి స్నేహితుల్లా మెలగండి.

ఆయన ‘వారిని అంతంవరకు ప్రేమించాడు’

యేసు ‘తన శిష్యులను అంతంవరకు ప్రేమించాడు.’ (యోహా. 13:1) ఈ విషయంలో కొందరు భర్తలు క్రీస్తును అనుకరించరు. అలాంటివారు ఇంకొక యౌవనస్థురాలిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ‘యౌవన కాలమందు పెళ్లి చేసుకున్న భార్యను’ కూడా విడిచిపెడతారు.—మలా. 2:14, 15.

విలీ లాంటివారు మాత్రం క్రీస్తును అనుకరిస్తారు. ఆయన భార్య ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకు ఆయన ఎన్నో సంవత్సరాలుగా సపర్యలు చేస్తున్నాడు. ఇలా సపర్యలు చేయడం గురించి ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన ఇలా చెబుతున్నాడు: “నా భార్యను దేవుడు నాకిచ్చిన బహుమతిగానే ఎల్లప్పుడూ భావిస్తాను. అందుకే ఆమెను అపురూపంగా చూసుకుంటున్నాను. అంతేకాక, 60 ఏళ్ల క్రితం కష్టసుఖాల్లో ఆమెకు తోడుగా ఉంటానని నేను ఆమెతో ప్రమాణం చేశాను. ఆ ప్రమాణాన్ని నేను ఎన్నడూ మరచిపోను.”

క్రైస్తవ భర్తలారా క్రీస్తు ప్రేమను అనుకరించండి. మీ సహోదరీ మీ స్నేహితురాలూ అయిన దైవభక్తిగల మీ భార్యను ప్రేమించండి.

[20వ పేజీలోని చిత్రం]

మీ భార్య మీకు అతి దగ్గరి స్నేహితురాలా?

[20వ పేజీలోని చిత్రం]

‘మీ భార్యను ఎల్లప్పుడూ ప్రేమించండి’