కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనస్థులారా, మీ అభివృద్ధిని తేటగా కనబరచండి

యౌవనస్థులారా, మీ అభివృద్ధిని తేటగా కనబరచండి

యౌవనస్థులారా, మీ అభివృద్ధిని తేటగా కనబరచండి

“నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము.”—1 తిమో. 4:15.

1. యౌవనస్థులు ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు?

“యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము” అని ప్రాచీన ఇశ్రాయేలీయులకు జ్ఞానియైన సొలొమోను రాజు రాశాడు. (ప్రసం. 11:9) ఈ సందేశాన్ని యెహోవాయే సొలొమోనుతో రాయించాడు. మీరు యౌవనస్థులుగా ఉన్నప్పుడే కాక పెద్దవారైన తర్వాత కూడ సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే, సాధారణంగా, యువతీయువకులు తమ యౌవనకాలంలో చేసే తప్పులవల్ల భవిష్యత్తులో తమ సంతోషాన్ని దూరంచేసుకునే అవకాశముంది. నమ్మకస్థుడైన యోబు కూడ “బాల్యంలో చేసిన పాపాలవల్ల” ఎదురైన పరిణామాలనుబట్టి బాధపడ్డాడు. (యోబు 13:26) కౌమారదశలో, ఆ తర్వాత వచ్చే యౌవనకాలంలో ఒక యువక్రైస్తవుడు/రాలు తన జీవితానికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాల్సిరావచ్చు. దానివల్ల జీవితాంతం సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు.—ప్రసం. 11:10.

2. యౌవనస్థులు ఏ బైబిలు ఉపదేశాన్ని పాటించడంవల్ల గంభీరమైన తప్పులు చేయకుండా ఉండగలుగుతారు?

2 అయితే, యౌవనస్థులు మంచి వివేచనతో నిర్ణయాలు తీసుకోవాలి. కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని గమనించండి. ఆయన ఇలా రాశాడు: “మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక . . . పెద్దవారలై యుండుడి.” (1 కొరిం. 14:20) పెద్దవారిలా తర్కబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోమని ఇవ్వబడిన ఉపదేశాన్ని పాటిస్తే యౌవనస్థులు గంభీరమైన తప్పులు చేయకుండా ఉండగలుగుతారు.

3. పరిణతి సాధించాలంటే ఏమి చేయాలి?

3 మీరు యౌవనస్థులైతే పరిణతి సాధించేందుకు ప్రయాసపడాల్సిన అవసరముందని గుర్తుంచుకోండి. పౌలు తిమోతితో ఇలా అన్నాడు: “నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. . . . చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. . . . నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.” (1 తిమో. 4:12-15) క్రైస్తవ యౌవనస్థులు ప్రగతి సాధించి, తమ అభివృద్ధి ఇతరులకు తేటగా కనబరచాలి.

అభివృద్ధి సాధించడం అంటే ఏమిటి?

4. ఆధ్యాత్మిక అభివృద్ధి సాధిస్తూ ఉండాలంటే ఏమి చేయాలి?

4 అభివృద్ధి సాధించడం అంటే “ప్రగతి సాధించడం, వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడం” అని అర్థం. మాట్లాడే విధానం, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం, పవిత్రత వంటి వాటిలోనే కాక పరిచర్య చేసే విధానంలో కూడా ప్రగతి సాధించేందుకు కృషిచేయమని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు. అంతేకాక, తన జీవితాన్ని ఇతరులకు ఆదర్శవంతంగా ఉండేలా మలచుకునేందుకు తిమోతి కృషిచేయాలి, అంటే ఆయన ఆధ్యాత్మిక అభివృద్ధి సాధిస్తూ ఉండాలి.

5, 6. (ఎ) తిమోతి తన అభివృద్ధిని తేటగా కనబరచడం ఎప్పుడు మొదలుపెట్టాడు? (బి) అభివృద్ధి సాధించే విషయంలో నేటి యౌవనస్థులు తిమోతిని ఎలా అనుకరించవచ్చు?

5 పౌలు ఈ ఉపదేశాన్ని దాదాపు సా.శ. 61-64 మధ్యకాలంలో రాశాడు. అప్పటికే తిమోతి ఓ అనుభవంగల పెద్ద. ఆయన ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడం మొదలుపెట్టి ఎంతో కాలమైంది. సా.శ. 49 లేదా 50వ సంవత్సరంలో తిమోతికి బహుశా 20 ఏళ్లు ఉండివుండవచ్చు. ఆయన ఆధ్యాత్మిక ప్రగతిని ‘లుస్త్ర ఈకొనియలోని సహోదరులు’ చూశారు. వారి మధ్య ఆయన ‘మంచిపేరు’ సంపాదించుకున్నాడు. (అపొ. 16:1-5) తిమోతి మరికొన్ని నెలలు ప్రగతి సాధించడాన్ని చూసిన తర్వాత థెస్సలొనీకయులను ఓదార్చడానికి, స్థిరపర్చడానికి పౌలు తిమోతిని అక్కడికి పంపించాడు. (1 థెస్సలొనీకయులు 3:1-3, 6 చదవండి.) తిమోతి యువకునిగా ఉన్నప్పుడే తన అభివృద్ధి ఇతరులకు తేటగా కనిపించేలా ప్రగతి సాధించడం మొదలుపెట్టాడని దీన్నిబట్టి తెలుస్తుంది.

6 సంఘంలోని యౌవనస్థులారా, ఇప్పుడే అవసరమైన ఆధ్యాత్మిక లక్షణాలను పెంపొందించుకోవడానికి కృషిచేయండి. అలా చేసినప్పుడు క్రైస్తవులుగా మీరు సాధించిన ఆధ్యాత్మిక ప్రగతి, బైబిలు సత్యాలను బోధించే విషయంలో మీ సామర్థ్యం ఇతరులకు తేటగా కనిపిస్తుంది. యేసు పన్నెండేళ్ల వయసు నుండి ‘జ్ఞానంలో వర్ధిల్లుచుండెను.’ (లూకా 2:52) కాబట్టి, మీ జీవితంలో (1) సమస్యలు ఎదురైనప్పుడు, (2) పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు, (3) ‘మంచి పరిచారకుడయ్యేందుకు’ కృషిచేస్తున్నప్పుడు మీ అభివృద్ధి తేటగా కనిపించేలా ఎలా కృషిచేయవచ్చో చూద్దాం.—1 తిమో. 4:6.

‘స్వస్థబుద్ధితో’ సమస్యలను ఎదుర్కోండి

7. సమస్యలు యౌవనస్థులను ఎలా కృంగదీస్తాయి?

7 క్యారెల్‌ అనే 17 ఏళ్ల క్రైస్తవురాలు ఇలా చెప్పింది, “కొన్నిసార్లు భావోద్వేగపరంగా, శారీరకంగా, మానసికంగా ఎంతగా అలసిపోయేదాన్నంటే మరో రోజును చూడకూడదని అనిపించేది.” * ఆమె ఎందుకు అంతగా కృంగిపోయేది? క్యారెల్‌కు 10 ఏళ్లున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో వాళ్ల కుటుంబం ఛిన్నాభిన్నమైంది. బైబిల్లోని నైతిక ప్రమాణాలను ఉల్లంఘించే వాళ్ల అమ్మతో ఆమె ఉండాల్సివచ్చింది. క్యారెల్‌లాగే మీరూ పరిస్థితులు మారే అవకాశం చాలా తక్కువన్నట్లుగా కనిపించే అత్యంత వేదనకరమైన కొన్ని సమస్యలను ఎదుర్కొంటుండవచ్చు.

8. తిమోతి ఏయే సమస్యలతో సతమతమయ్యాడు?

8 ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్నప్పుడు తిమోతి కూడా తీవ్ర సమస్యలతో సతమతమయ్యాడు. ఉదాహరణకు, ఆయనకు కడుపు జబ్బు ఉండడంతో ‘తరచూ బలహీనుడయ్యేవాడు.’ (1 తిమో. 5:23) అపొస్తలుల అధికారాన్ని ప్రశ్నించినవారు కలుగజేస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు పౌలు ఆయనను కొరింథు సంఘానికి పంపించాడు. తిమోతి వారిమధ్య “నిర్భయుడై యుండునట్లు” ఆయనకు సహకరించమని పౌలు ఆ సంఘాన్ని వేడుకున్నాడు. (1 కొరిం. 4:17; 16:10, 11) దీన్నిబట్టి, తిమోతి బిడియస్థుడు, భయస్థుడు అయ్యుంటాడని తెలుస్తుంది.

9. స్వస్థబుద్ధి అంటే ఏమిటి? దానికీ పిరికితనానికీ మధ్య ఉన్న తేడా ఏమిటి?

9 తిమోతికి సహాయం చేసే ఉద్దేశంతో పౌలు కొంతకాలానికి ఆయనకు ఈ విషయాన్ని గుర్తుచేశాడు: “దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే [‘స్వస్థబుద్ధినే,’ NW] యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.” (2 తిమో. 1:7) ‘స్వస్థబుద్ధి’ పెంపొందించుకోవాలంటే సరైన విధంగా తర్కబద్ధంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అంతేకాక, పరిస్థితులు మీరు అనుకున్నట్లు లేకపోయినా వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. పరిణతి సాధించని యౌవనస్థులు తీవ్ర సమస్యలు ఎదురైనప్పుడు వాటిని మరచిపోవడానికి పిరికివారిలా ఎక్కువసేపు నిద్రపోతుంటారు లేదా టీవీ చూస్తుంటారు. మాదకద్రవ్యాలకు లేదా మద్యానికి బానిసలౌతారు, తరచూ పార్టీలకు వెళ్తుంటారు లేదా లైంగిక దుర్నీతికి పాల్పడతారు. అయితే క్రైస్తవులు “భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి . . . ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెను” అని ఉపదేశించబడ్డారు.—తీతు 2:12, 13.

10, 11. స్వస్థబుద్ధి ఉంటే మనం క్రైస్తవులముగా ఎలా పరిణతి సాధించగలం?

10 ‘యౌవనపురుషులు స్వస్థబుద్ధిగలవారై ఉండాలి’ అని బైబిలు ఉపదేశిస్తోంది. (తీతు 2:6) ఆ ఉపదేశాన్ని అనుసరించాలంటే మీకు సమస్యలు ఎదురైనప్పుడు దేవునికి ప్రార్థించి ఆయన ఇచ్చే శక్తిమీద ఆధారపడాలి. (1 పేతురు 4:7 చదవండి.) అలా “దేవుడు అనుగ్రహించు సామర్థ్యము” మీద మీరు పూర్తి నమ్మకాన్ని పెంచుకుంటారు.—1 పేతు. 4:11.

11 స్వస్థబుద్ధివల్ల, ప్రార్థనవల్ల క్యారెల్‌ తన సమస్యను సహించగలిగింది. ఆమె ఇలా చెబుతోంది: “మా అమ్మ అనైతిక జీవితం గడిపింది, ఆమెతో ఉంటూ పరిశుభ్రమైన జీవితాన్ని గడపడం నాకు చాలా కష్టమైంది. కానీ ప్రార్థనతో ఆ సమస్యను అధిగమించాను. యెహోవా నాతో ఉన్నాడని నాకు తెలుసు కాబట్టి నేను ఏమాత్రం భయపడలేదు.” సమస్యలు మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది మిమ్మల్ని బలపరుస్తాయని గుర్తుంచుకోండి. (కీర్త. 105:17-19; విలా. 3:27) మీకు ఏ సమస్య ఎదురైనా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా ‘ఆదుకుంటాడు.’—యెష. 41:9-10.

పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు

12. పెళ్లి చేసుకోవాలనుకునే క్రైస్తవుడు/రాలు సామెతలు 20:25లోని సూత్రాన్ని ఎందుకు పాటించాలి?

12 లేత వయసులో ఉన్న కొందరు యౌవనస్థులు దుఃఖం, ఒంటరితనం, చికాకు, ఇంటి సమస్యల నుండి తప్పించుకోవాలంటే పెళ్లే పరిష్కారమనుకొని తొందరపడి పెళ్లిచేసుకున్నారు. అయితే, వివాహ ప్రమాణాలు ఎంతో గంభీరమైనవి. బైబిలు కాలాల్లో కొందరు మొక్కుబడి చేసుకుంటే ఏమేమి చేయాల్సివుంటుందో జాగ్రత్తగా ఆలోచించకుండా తొందరపాటుతో దేవునికి మొక్కుబడి చేసుకున్నారు. (సామెతలు 20:25 చదవండి.) వివాహం చేసుకుంటే ఎలాంటి బాధ్యతలు వస్తాయో కొన్నిసార్లు లేత వయసులోవున్న యౌవనస్థులు గంభీరంగా ఆలోచించరు. తాము అనుకున్నదానికన్నా ఎక్కువ బాధ్యతలు నిర్వర్తించాల్సివస్తుందని వారు ఆ తర్వాత గ్రహిస్తారు.

13. కోర్ట్‌షిప్‌ చేయాలనుకునేవారు దేని గురించి ఆలోచించాలి? వారికి ఉపయోగపడే ఏ సలహాలు అందుబాటులో ఉన్నాయి?

13 మీరు పెళ్లిచేసుకునే ఉద్దేశంతో ఎవరితోనైనా స్నేహం చేయాలని (కోర్ట్‌షిప్‌ చేయాలని) నిర్ణయించుకునేముందు ఇలా ఆలోచించండి: ‘నేనెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను? వివాహ జీవితం నుండి నేనేమి ఆశిస్తున్నాను? ఈ క్రైస్తవుడు/రాలు నాకు తగిన వ్యక్తేనా? వివాహితునిగా/వివాహితురాలిగా నా బాధ్యతలను నిర్వర్తించడానికి నేను నిజంగా సిద్ధంగా ఉన్నానా?’ మీ పరిస్థితులను జాగ్రత్తగా ఆలోచించి బేరీజు వేసుకునేందుకు సహాయం చేసే సాహిత్యాలను “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ప్రచురించాడు. * (మత్త. 24:45-47) వాటిలో ఉన్న సమాచారాన్ని యెహోవా మీకు ఇస్తున్న సలహాగా పరిగణించండి. దానిలోని విషయాలను జాగ్రత్తగా చదివి అన్వయించుకోండి. ‘బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱములా, కంచరగాడిదలా’ మారకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తపడండి. (కీర్త. 32:8, 9) పెళ్లిచేసుకోవడంతో వచ్చే బాధ్యతల గురించిన మరింత అవగాహన పెంచుకోండి. మీరు కోర్ట్‌షిప్‌ చేయవచ్చని మీకు అనిపిస్తే ‘పవిత్రత విషయంలో మాదిరిగా’ ఉండాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.—1 తిమో. 4:12.

14. మీ వివాహ జీవితానికి ఆధ్యాత్మిక అభివృద్ధి ఎలా సహాయం చేస్తుంది?

14 ఆధ్యాత్మిక పరిణతి సాధించడంవల్ల ఓ వ్యక్తి పెళ్లైన తర్వాత కూడ సంతోషంగా ఉంటాడు. పరిణతి సాధించిన క్రైస్తవుడు ‘క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత’ పొందేందుకు కృషిచేస్తాడు. (ఎఫె. 4:11-14) ఆయన క్రీస్తులాంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకునేందుకు ప్రయాసపడతాడు. మన మాదిరికర్తగా “క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు.” (రోమా. 15:3) భార్యభర్తలిద్దరూ తమ స్వప్రయోజనాల గురించి కాక తమ జత అవసరాల గురించి ఆలోచించినప్పుడు కుటుంబ జీవితం సుఖసంతోషాలకు నెలవు అవుతుంది. (1 కొరిం. 10:24) అలాంటి కుటుంబంలో భర్త నిస్వార్థ ప్రేమ చూపిస్తాడు, యేసు తన శిరస్సుకు లోబడివున్నట్లు భార్య తన భర్తకు లోబడివుండాలని అనుకుంటుంది.—1 కొరిం. 11:3; ఎఫె. 5:25.

‘మీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించండి’

15, 16. పరిచర్యలో మీ అభివృద్ధిని ఎలా తేటగా కనబరచవచ్చు?

15 తిమోతికున్న ప్రాముఖ్యమైన పనిని వివరిస్తూ పౌలు ఇలా రాశాడు: ‘దేవునియెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము అని ఆనబెట్టి చెబుతున్నాను.’ అంతేకాక పౌలు, “సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము” అని కూడ చెప్పాడు. (2 తిమో. 4:1, 2, 5) ఈ పని చేయడానికి తిమోతి ‘విశ్వాస వాక్యములచేత’ పోషించబడాలి.—1 తిమోతి 4:6 చదవండి.

16 మీరు ‘విశ్వాస వాక్యములచేత’ ఎలా పోషించబడవచ్చు? పౌలు ఇలా రాశాడు: “చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. . . . వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.” (1 తిమో. 4:13, 15) ఆధ్యాత్మిక పరిణతి సాధించాలంటే శ్రద్ధతో వ్యక్తిగత అధ్యయనం చేయాలి. “సాధకము చేసికొనుము” అనే మాటకు ఓ పనిలో లీనమైపోవడం అని అర్థం. మీ అధ్యయన అలవాట్లు ఎలా ఉన్నాయి? “దేవుని మర్మములను” తెలుసుకోవడానికి మీరు కృషి చేస్తున్నారా? (1 కొరిం. 2:10) లేక వాటి విషయంలో మీ ప్రయత్నాలు అంతంతమాత్రంగానే ఉన్నాయా? చదివిన విషయాలు ధ్యానించినప్పుడు ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించేందుకు ప్రేరణ కలుగుతుంది.—సామెతలు 2:1-5 చదవండి.

17, 18. (ఎ) మీరు ఎలాంటి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి కృషి చేయాలి? (బి) తిమోతిలాంటి మనస్తత్వాన్ని అలవర్చుకోవడంవల్ల మీరు పరిచర్యలో ఎలాంటి మంచి ఫలితాలు సాధించవచ్చు?

17 మషేల్‌ అనే యువ పయినీరు ఇలా చెప్పింది: “పరిచర్యలో మంచి ఫలితాలు సాధించడానికి నేను క్రమంగా బైబిలు అధ్యయనం చేస్తున్నాను, కూటాలకు క్రమంగా హాజరౌతున్నాను. అలా చేయడంవల్ల నేను ఆధ్యాత్మికంగా ఎల్లప్పుడూ ప్రగతి సాధించగలుగుతున్నాను.” పయినీరు సేవచేయడంవల్ల పరిచర్యలో చక్కగా బైబిలును ఉపయోగించగలుగుతారు, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించగలుగుతారు. మంచి అధ్యయన అలవాట్లను పెంచుకొని క్రైస్తవ కూటాల్లో ఇతరులకు ఉపయోగపడే విధంగా వ్యాఖ్యానించడానికి కృషిచేయండి. ఆధ్యాత్మిక పరిణతి సాధించిన యౌవనస్థులుగా దైవపరిపాలనా పాఠశాలలో మీకివ్వబడిన సమాచారాన్ని ఉపయోగిస్తూ సంఘానికి ఉపయోగపడే విధంగా విద్యార్థి ప్రసంగాలను ఇచ్చేందుకు కృషి చేయండి.

18 ‘సువార్తికుని పనిచేయాలంటే’ పరిచర్యలో మరిన్ని ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలి, రక్షణ పొందేందుకు ఇతరులకు సహాయం చేయాలి. అలా చేయాలంటే ‘బోధనా కళను’ పెంపొందించుకోవాలి. (2 తిమో. 4:2, NW) తిమోతి పౌలుతో పనిచేయడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఆయనలాగే మీరూ పరిచర్యలో అనుభవజ్ఞులైన వారితో కలిసి పనిచేయడానికి ముందుగా ఏర్పాటు చేసుకుంటే వారు ఉపయోగించే బోధనా పద్ధతుల నుండి ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారు. (1 కొరిం. 4:17) పౌలు, తాను సహాయం చేసిన వ్యక్తుల గురించి ప్రస్తావిస్తూ వారు తనకు బహు ప్రియులయ్యారు కాబట్టి వారికి సువార్త ప్రకటించడమే కాక వారికి సహాయం చేయడానికి తన ‘ప్రాణాన్నే’ అంటే తన జీవితాన్నే ధారపోశానని చెప్పాడు. (1 థెస్స. 2:8) పరిచర్యలో పౌలు మాదిరిని అనుకరించాలంటే ఇతరులపట్ల నిజమైన శ్రద్ధ చూపించి ‘సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసిన’ తిమోతిలాంటి మనస్తత్వాన్ని మీరు అలవర్చుకోవాలి. (ఫిలిప్పీయులు 2:19-23 చదవండి.) ఆయనలాగే మీరూ పరిచర్యలో స్వయంత్యాగాన్ని చూపిస్తున్నారా?

ఆధ్యాత్మిక అభివృద్ధి నిజమైన సంతృప్తినిస్తుంది

19, 20. ఆధ్యాత్మిక అభివృద్ధి సాధిస్తే మనమెందుకు సంతోషిస్తాం?

19 ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలంటే ఎంతో కృషి చేయాలి. అయితే, ఓపికతో బోధనా సామర్థ్యాలను పెంపొందించుకొని సత్యాన్ని బోధించడం ద్వారా కొంతకాలానికి మీరు ‘అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగించే’ అవకాశాన్ని పొందుతారు. వారివల్ల మీకు ‘ఆనందము’ కలుగుతుంది లేదా వారు మీకు ‘అతిశయకిరీటమవుతారు.’ (2 కొరిం. 6:10; 1 థెస్స. 2:19) పూర్తికాల సేవచేస్తున్న ఫ్రెడ్‌, “ఇప్పుడు నేను ఇతరులకు సహాయం చేయడంలో ఇంతకుముందుకన్నా ఎక్కువ సమయం గడుపుతున్నాను. తీసుకోవడంకన్నా ఇవ్వడంలోనే ఎక్కువ ఆనందం ఉందనే మాట ముమ్మాటికి నిజం” అని చెబుతున్నాడు.

20 ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించడంవల్ల తాను పొందిన సంతోషం, సంతృప్తి గురించి డ్యాఫ్నీ అనే యువ పయినీరు ఇలా చెబుతోంది: “నేను యెహోవా గురించి ఎంత ఎక్కువగా తెలుసుకున్నానో అంత ఎక్కువగా ఆయనతో దగ్గరి సంబంధం పెంపొందించుకున్నాను. యెహోవాకు ఇష్టమైనవి చేయడానికి శాయశక్తులా కృషిచేసినప్పుడు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని పొందుతాం.” మీరు సాధిస్తున్న ఆధ్యాత్మిక అభివృద్ధిని మానవులు అన్ని సందర్భాల్లో గుర్తించకపోయినా యెహోవా దాన్ని ఎల్లప్పుడూ గుర్తిస్తాడు, దాన్ని విలువైనదిగా ఎంచుతాడు. (హెబ్రీ. 4:13) క్రైస్తవ యౌవనస్థులుగా మీరు నిస్సందేహంగా మన పరలోక తండ్రికి మహిమ, ఘనత తీసుకురాగలరు. మీ అభివృద్ధిని తేటగా కనబరచేందుకు మీరు మనస్ఫూర్తిగా కృషి చేస్తూ యెహోవా హృదయాన్ని ఎల్లప్పుడూ సంతోషపర్చండి.—సామెతలు 27:11.

[అధస్సూచీలు]

^ పేరా 7 కొన్ని పేర్లను మార్చాం.

^ పేరా 13 తేజరిల్లు! జూలై 7, 2007, 16వ పేజీలోని “ఈ వ్యక్తి నాకు తగిన వ్యక్తేనా?” అనే ఆర్టికల్‌ను, కావలికోట మే 15, 2001 సంచికలోని “వివాహ జతను ఎంపిక చేసుకోవడంలో దైవిక మార్గనిర్దేశం” అనే ఆర్టికల్‌ను, తేజరిల్లు! (ఆంగ్లం) సెప్టెంబరు 22, 1983 సంచికలోని “హౌ వైజ్‌ ఈజ్‌ ఎ టీనేజ్‌ మ్యారేజ్‌?” అనే ఆర్టికల్‌ను చూడండి.

మీరేమి నేర్చుకున్నారు?

• ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలంటే ఏమి చేయాలి?

• సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు

పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు

పరిచర్యలో

మీ ఆధ్యాత్మిక అభివృద్ధిని తేటగా ఎలా కనబరచవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

ప్రార్థనవల్ల మీరు సమస్యలను అధిగమించగలరు

[16వ పేజీలోని చిత్రం]

యౌవనస్థులైన ప్రచారకులు మంచి బోధనా పద్ధతులను ఎలా పెంపొందించుకోవచ్చు?