కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇతరులకు బాధ్యతలను ఎందుకు అప్పగించాలి? ఎలా అప్పగించాలి?

ఇతరులకు బాధ్యతలను ఎందుకు అప్పగించాలి? ఎలా అప్పగించాలి?

ఇతరులకు బాధ్యతలను ఎందుకు అప్పగించాలి? ఎలా అప్పగించాలి?

వేరేవారికి బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు మొదలైంది కాదు. భూమి సృష్టించబడడానికి ఎంతో కాలం ముందే అది మొదలైంది. యెహోవా మొదట తన అద్వితీయ కుమారుణ్ణి సృష్టించాడు. ఆ తర్వాత తన కుమారుణ్ణి “ప్రధానశిల్పి”గా ఉపయోగించి విశ్వాన్ని సృష్టించాడు. (సామె. 8:22, 23, 30; యోహా. 1:3) దేవుడు మొదటి మానవ దంపతులను సృష్టించినప్పుడు, “భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి” అని వారితో చెప్పాడు. (ఆది. 1:28) ఏదెను తోటను విస్తరించి భూమంతటిని నింపే పనిని సృష్టికర్త మానవులకు అప్పగించాడు. మొదటి నుండి యెహోవా, ఆయన సేవకులూ బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తూ వచ్చారు.

బాధ్యతలను అప్పగించడం అంటే ఏమిటి? పెద్దలు సంఘంలో కొన్ని పనులను ఇతరులకు ఎందుకు అప్పగించాలి? ఎలా అప్పగించవచ్చు?

బాధ్యతలను అప్పగించడం అంటే ఏమిటి?

“బాధ్యతలను అప్పగించడం” అంటే “తన తరఫున పనిచేయమని ఎవరికైనా అధికారాన్ని ఇవ్వడం.” అంటే, అనుకున్న లక్ష్యాలను పూర్తిచేయడానికి వేరేవారిని కూడ కలుపుకోవడం. అలా కలుపుకోవాలంటే సహజంగానే బాధ్యతలను ఇతరులతో పంచుకోవాలి.

క్రైస్తవ సంఘంలో బాధ్యతలు అప్పగించబడినవారు తమకు ఇచ్చిన పనిని పూర్తిచేయాలి. అదే సమయంలో తమకు బాధ్యత అప్పగించిన వారిని సంప్రదిస్తూ పని ఎలా నడుస్తుందో ఎప్పటికప్పుడు తెలియజేయాలి. అయితే ఆ పనిని పూర్తిచేయాల్సిన బాధ్యత మాత్రం పని అప్పగించిన సహోదరునిదే. ఆ సహోదరుడు పని ఎలా సాగుతుందో ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన సలహాలు ఇవ్వాలి. అయినా, ‘మనం చేయగలిగిన పనిని వేరేవారికి ఎందుకు అప్పగించాలి?’ అని కొందరు అనుకుంటారు.

బాధ్యతలను ఎందుకు అప్పగించాలి?

యెహోవా తన అద్వితీయ కుమారుణ్ణి సృష్టించి, మిగతా సృష్టికార్యాలను చేసే బాధ్యతను తన కుమారునికి అప్పగించడం గురించి ఒక్కసారి ఆలోచించండి. “ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని . . . ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.” (కొలొ. 1:16) సృష్టికర్త ఒంటరిగా సృష్టికార్యాలను పూర్తి చేయగలిగేవాడే కానీ ఆ పనిని పూర్తిచేయడంలో ఉన్న ఆనందాన్ని ఆయన తన కుమారునితో పంచుకోవాలనుకున్నాడు. (సామె. 8:31) దీనివల్ల ఆ కుమారుడు తన తండ్రి లక్షణాలను మరింతగా తెలుసుకోగలిగాడు. మరో మాటలో చెప్పాలంటే, ఆ సమయాన్ని యెహోవా తన అద్వితీయ కుమారునికి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించాడు.

యేసుక్రీస్తు భూమ్మీదున్నప్పుడు తన తండ్రిలాగే ఇతరులకు బాధ్యతలను అప్పగించాడు. ఆయన వారికి మెల్లమెల్లగా శిక్షణ ఇచ్చాడు. యేసు ఒకసారి పన్నెండుమంది అపొస్తలులను, మరోసారి 70 మంది శిష్యులను ప్రకటనా పనిలో నాయకత్వం వహించేలా తనకన్నా ముందుగా పంపించాడు. (లూకా 9:1-6; 10:1-7) అలా వారు ముందుగా వెళ్లి బోధించడంవల్ల యేసు ఆ తర్వాత ఆ ప్రాంతాలకు వెళ్లి మరికొన్ని విషయాలు బోధించడం సులభమైంది. యేసు పరలోకానికి వెళ్లిన తర్వాత, తన దగ్గర శిక్షణపొందిన ఆ శిష్యులకు ప్రపంచవ్యాప్త ప్రకటనా పనితోపాటు మరికొన్ని బరువైన బాధ్యతలను అప్పగించాడు.—మత్త. 24:45-47; అపొ. 1:8.

ఆ తర్వాత బాధ్యతలను అప్పగించడం, శిక్షణ ఇవ్వడం క్రైస్తవ సంఘంలో సర్వసాధారణమైన విషయం అయ్యింది. అపొస్తలుడైన పౌలు తిమోతితో, “నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము” అని చెప్పాడు. (2 తిమో. 2:2) అనుభవజ్ఞులు ఇతరులకు శిక్షణనిస్తే వారు మరికొందరికి శిక్షణ ఇవ్వగలుగుతారు.

తనకు అప్పగించబడిన పనిలో కొంత పనిని ఇతరులకు ఇచ్చినప్పుడు ఓ పెద్ద బోధనా పనిలో, కాపరి పనిలో ఉన్న ఆనందాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. మానవులకు పరిమితులున్నాయి అనేది గుర్తించి, పెద్దలు సంఘ బాధ్యతలను ఇతరులతో పంచుకోవాలి. బైబిలు ఇలా చెబుతోంది: “వినయముగలవారియొద్ద [‘అణకువగలవారియొద్ద,’ NW] జ్ఞానమున్నది.” (సామె. 11:2) మన పరిమితులను మనం గుర్తించడమే అణకువ. ఎవరి సహాయం తీసుకోకుండా ప్రతీ పనీ చేయడానికి ప్రయత్నిస్తే అలసిపోతాం, కుటుంబంతో సమయాన్ని గడపలేం. కాబట్టి, బాధ్యతలను ఇతరులతో పంచుకోవడం తెలివైన పని. ఉదాహరణకు, ఓ సహోదరుడు పెద్దల సభ సమన్వయకర్తగా సేవచేస్తున్నాడనుకుందాం. సంఘ అకౌంట్స్‌ను ఆడిట్‌ చేయమని ఆయన ఇతర పెద్దలను కోరవచ్చు. దానివల్ల వారు సంఘ ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుంటారు.

ఇతరులకు పని అప్పగించడంవల్ల వారు కావాల్సిన నైపుణ్యాన్ని, అనుభవాన్ని సంపాదించుకుంటారు. అంతేకాక వారి సామర్థ్యాన్ని గమనించే అవకాశం కూడ లభిస్తుంది. పెద్దలు వివిధ సహోదరులకు వారి సామర్థ్యానికి తగిన పనులను అప్పగిస్తే పరిచర్య సేవకులుగా అర్హులయ్యే అవకాశమున్నవారిని ‘పరీక్షించే’ వీలుంటుంది.—1 తిమో. 3:10.

చివరగా, పెద్దలు ఇతరులకు పని అప్పగించడంవల్ల వారిపై తమకు నమ్మకం ఉందని చూపిస్తారు. పౌలు తిమోతితో కలిసి మిషనరీ సేవ చేయడం ద్వారా తిమోతికి శిక్షణను ఇచ్చాడు. దానివల్ల ఆ ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. పౌలు “విశ్వాసమునుబట్టి నా నిజమైన కుమారుడు” అని తిమోతిని పిలిచాడు. (1 తిమో. 1:2) అలాగే యెహోవా, యేసుతో కలిసి సృష్టిని చేయడంవల్ల వారి మధ్యవున్న సంబంధం బలపడింది. పెద్దలు కూడ ఇతరులకు పని అప్పగిస్తే వారి మధ్య స్నేహం బలపడుతుంది.

కొందరు ఎందుకు వెనకాడతారు?

ఇతరులకు పని అప్పగించడంవల్ల ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా కొంతమంది పెద్దలకు అలా చేయడం కష్టమనిపిస్తుంది. వారికి అలా అప్పగిస్తే తమ అధికారం ఎక్కడ తగ్గిపోతుందోనని వారు అనుకోవచ్చు. అన్నిపనులు తమ చెప్పుచేతల్లో జరగాలని అనుకోవచ్చు. కానీ, తనకన్నా గొప్ప కార్యాలు చేస్తారని తెలిసినా యేసు పరలోకానికి వెళ్లేముందు శిష్యులకు బరువైన బాధ్యతలను అప్పగించాడని గుర్తుంచుకోండి.—మత్త. 28:19, 20; యోహా. 14:12.

కొంతమంది పెద్దలు ఇతరులకు పనులు అప్పగించినప్పుడు సంతృప్తికరమైన ఫలితాలు వచ్చివుండవు కాబట్టి, ఇతరులకు అప్పగించే బదులు తామే ఆ పనిని త్వరగా, మెరుగ్గా చేయగలమని వారు అనుకోవచ్చు. కానీ పౌలు విషయమే తీసుకోండి. ఇతరులకు పనులను అప్పగించడంవల్ల ప్రయోజనం ఉందని తనకు తెలిసినా అన్ని సందర్భాల్లో తన దగ్గర శిక్షణ పొందుతున్నవారు తాను ఆశించినంతగా రాణించకపోవచ్చని కూడ ఆయన గుర్తించాడు. పౌలు తన మొదటి మిషనరీ యాత్రలో యౌవనస్థుడైన మార్కును తనతోపాటు తీసుకెళ్లి శిక్షణ ఇచ్చాడు. మార్కు మధ్యలోనే తనను వదిలి ఇంటికి వెళ్లిపోయినప్పుడు పౌలు ఎంతో నిరాశచెందాడు. (అపొ. 13:13; 15:37, 38) అలా జరిగిందని పౌలు ఇతరులకు శిక్షణ ఇవ్వడం మానుకోలేదు. మనం ముందు చూసినట్లు, ఆయన యువకుడైన తిమోతిని తనతో రమ్మన్నాడు. తిమోతి బరువైన బాధ్యతలను మోసేంత పరిణతి సాధించినప్పుడు పైవిచారణకర్తలను, పరిచర్య సేవకులను నియమించే అధికారాన్ని ఇచ్చి పౌలు ఆయనను ఎఫెసులో విడిచివెళ్లాడు.—1 తిమో. 1:3; 3:1-10, 12, 13; 5:22.

మన కాలంలోని పెద్దలు కూడ, ఓ సహోదరుడు ఇవ్వబడిన పనిని సరిగ్గా నేర్చుకోనంత మాత్రాన వేరేవారికి శిక్షణను ఇవ్వడం మానుకోకూడదు. ఇతరులమీద నమ్మకాన్ని పెంచుకొని వారికి శిక్షణ ఇవ్వడం తెలివైన పని. అలా చేయడం చాలా అవసరం కూడ. అయితే, ఇతరులకు బాధ్యతలను అప్పగిస్తున్నప్పుడు పెద్దలు దేన్ని గుర్తుంచుకోవాలి?

బాధ్యతలను ఎలా అప్పగించాలి?

ఎవరికైనా బాధ్యతలను అప్పగించాలనుకున్నప్పుడు వారికున్న అర్హతల గురించి ఆలోచించండి. యెరూషలేములో ఆహారాన్ని పంచే పనిని చూసుకునే అవసరం వచ్చినప్పుడు, అపొస్తలులు “ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను” ఎంపికచేశారు. (అపొ. 6:3) మీరు నమ్మకముంచలేని వారికి ఓ పని అప్పగిస్తే వారు ఆ పని చేయకపోవచ్చు. అందుకే మొదటి చిన్నచిన్న పనులు ఇవ్వండి. ఆ పనులను నమ్మకంగా చేస్తే, వారు మరికొన్ని బాధ్యతలు చేపట్టగలుగుతారు.

అది ఒక్కటే సరిపోదు. అందరి వ్యక్తిత్వాలు, సామర్థ్యాలు ఒకేలా ఉండవు. అనుభవం విషయంలోనూ అంతే. స్నేహపూరితంగా చిరునవ్వుతో పలకరించే సహోదరుడు అటెండెంట్‌గా రాణించవచ్చు. ప్రతీది పద్ధతి ప్రకారం చేసే వ్యక్తిని సంఘ కార్యదర్శికి సహాయకునిగా నియమించవచ్చు. కళాత్మకంగా ఆలోచించే సహోదరికి జ్ఞాపకార్థ ఆచరణకు పూలతో అలంకరించే బాధ్యత అప్పగించవచ్చు.

బాధ్యతలు అప్పగించే ముందు వారు ఏమి చేయాలో స్పష్టంగా వివరించండి. బాప్తిస్మమిచ్చు యోహాను యేసు దగ్గరికి తన శిష్యులను పంపించే ముందు, తాను ఏమి తెలుసుకోవాలనుకుంటున్నాడో, యేసును ఏమి అడిగి తెలుసుకోవాలో వివరించాడు. (లూకా 7:18-20) అయితే, అద్భుతంగా పంచిపెట్టిన ఆహారంలో మిగిలినదాన్ని పోగుచేయమని యేసు తన శిష్యులకు చెప్పాడే కానీ ఆ పనిని ఎలా చేయాలనేది వారి విజ్ఞతకే వదిలేశాడు. (యోహా. 6:12, 13) ఎంత వివరంగా చెప్పాలనేది అవతలి వ్యక్తికి ఇచ్చిన పనినిబట్టి, ఆయనకున్న అర్హతను బట్టి నిర్ణయించుకోవచ్చు. తాము ఎలాంటి ఫలితాలు సాధించాలో, ఎప్పుడెప్పుడు నివేదిక ఇవ్వాలో పని చేస్తున్న సహోదరునికీ, పని అప్పగించిన సహోదరునికీ ఇద్దరికీ తెలిసుండాలి. పనిచేస్తున్న వ్యక్తి విజ్ఞతకు ఎంతవరకు వదిలేయబడిందో వారిద్దరికీ తెలిసుండాలి. ఓ పనిని ఫలానా తేదీలోగా పూర్తిచేయాలంటే ఈ తేదీలోపు అయిపోవాలని చెప్పే బదులు ఇద్దరూ చర్చించుకొని ఓ అభిప్రాయానికి వస్తే పని చేయాలనే ఉత్సాహం కలుగుతుంది.

పని అప్పగించిన సహోదరునికి కావాల్సిన డబ్బును, పనిముట్లను ఇవ్వాలి. అవసరమైతే సహాయాన్ని అందించాలి. ఆ ఏర్పాట్ల గురించి ఇతరులకు తెలియజేయడం మంచిది. ఇతర శిష్యులు చూస్తుండగా యేసు పేతురుకు “పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు” అప్పగించాడు. (మత్త. 16:13-19) అలాగే కొన్నిసార్లు ఫలాని పని ఎవరు చేస్తున్నారో సంఘానికి తెలియజేయడం మంచిది.

అయితే, ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓ సహోదరునికి పని అప్పగించిన తర్వాత కూడ ఆ పనిని మీరే చేయడానికి ప్రయత్నిస్తే, “నాకు మీమీద నమ్మకంలేదు” అని చెప్పినట్లౌతుంది. కొన్నిసార్లు మీరు ఊహించినట్లు వారు చేయకపోవచ్చు. అయితే, బాధ్యత అప్పగించిన వ్యక్తికి కొంత స్వేచ్ఛ ఇస్తే ఆయనకు ధైర్యం, అనుభవం పెరుగుతాయి. అలాగని ఆయన ఆ పనిని ఎలా చేస్తున్నాడో పట్టించుకోకూడదని కాదు. యెహోవా సృష్టి కార్యాలను చేయడంలో తన కుమారునికి పని అప్పగించినా, ఆయన కూడ ఆ పనిలో పాలుపంచుకున్నాడు. ఆయన ప్రధానశిల్పితో, “మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము” అని చెప్పాడు. (ఆది. 1:26) కాబట్టి మీరు మీ మాటలతో, చేతలతో ఆ సహోదరుడు చేస్తున్న పనిలో చేయూతనివ్వండి. ఆయన చేస్తున్న కృషిని మెచ్చుకోండి. ఫలితం గురించి ఆయనతో క్లుప్తంగా చర్చిస్తే ఆయనను ప్రోత్సహించగలుగుతారు. ఆయన పని సరిగా చేయకపోతే మరికొన్ని సలహాలు ఇవ్వడానికి లేదా మరికొంత సహాయం చేయడానికి వెనకాడకండి. ఏదేమైనా, ఆ పనిని పూర్తి చేయాల్సిన బాధ్యత మాత్రం మీదేనని గుర్తుంచుకోండి.—లూకా 12:48.

నిజమైన శ్రద్ధ చూపించే పెద్దలు తమకు బాధ్యతలు అప్పగించడంవల్ల అనేకమంది ప్రయోజనం పొందారు. యెహోవా చేసినట్లే పెద్దలందరూ ఎందుకు బాధ్యతలను అప్పగించాలో, ఎలా అప్పగించాలో తెలుసుకోవాలి.

[29వ పేజీలోని బాక్సు]

బాధ్యతలు అప్పగించడంవల్ల

• పనిని పూర్తి చేయడంలో ఉన్న ఆనందాన్ని ఇతరులతో పంచుకోవచ్చు

• ఎక్కువ సాధించవచ్చు

• జ్ఞానం, అణకువ చూపించవచ్చు

• ఇతరులకు శిక్షణ ఇవ్వవచ్చు

• ఇతరుల మీద నమ్మకముందని చూపించవచ్చు

[30వ పేజీలోని బాక్సు]

బాధ్యతలు ఎలా అప్పగించాలి?

• పని కోసం సరైన వ్యక్తులను ఎంపిక చేసుకోండి

• స్పష్టంగా వివరించండి/సంభాషించండి

• ఏమి చేయాలో స్పష్టంగా వివరించండి

• అవసరమైనవి సమకూర్చండి

• పనిపట్ల శ్రద్ధ చూపించండి, వారిమీద మీకు నమ్మకం ఉందని చూపించండి

• ఆ పనిని పూర్తి చేసే బాధ్యతను తీసుకునేందుకు సిద్ధంగా ఉండండి

[31వ పేజీలోని చిత్రాలు]

ఇతరులకు ఓ పని ఇచ్చి అది ఎలా జరుగుతుందో చూడడమే పని అప్పగించడం