కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒంటరిగా ఉన్నా ఎలా సంతోషంగా ఉండవచ్చు?

ఒంటరిగా ఉన్నా ఎలా సంతోషంగా ఉండవచ్చు?

ఒంటరిగా ఉన్నా ఎలా సంతోషంగా ఉండవచ్చు?

“చివరికి పెళ్ళిచేసుకొని హాయిగా జీవించారు.” చాలా కథల ముగింపు అలాగే ఉంటుంది. పెళ్ళే సంతోషానికి పునాది అని ప్రణయాత్మక సినిమాల్లో, నవలల్లో కూడా చూపిస్తుంటారు. అంతేకాక, చాలా సంస్కృతుల్లో ఈడొచ్చినవాళ్ళని పెళ్ళిచేసుకోమని పెద్దలు తొందరపెడుతుంటారు. డెబ్బీ అనే సహోదరికి సుమారు 25 ఏళ్ళున్నప్పుడు ఇలా చెప్పింది, “ఆడపిల్లలకు పెళ్ళే సర్వస్వం అన్నట్టు ప్రజలు ప్రవర్తిస్తుంటారు. అసలు, పెళ్ళితోనే వాళ్ళ జీవితం మొదలవుతుందని అంటారు.”

అయితే, యెహోవావైపు నుంచి ఆలోచించేవాళ్ళకు అలాంటి అభిప్రాయాలుండవు. పూర్వం ఇశ్రాయేలీయుల్లో అందరూ పెళ్ళిచేసుకోవడం మామూలు విషయమే. కానీ అప్పుడు కూడా పెళ్ళి చేసుకోకుండా సంతోషంగా జీవించిన స్త్రీపురుషుల గురించి బైబిల్లో ఉంది. నేడూ, కొంతమంది క్రైస్తవులు పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. మరికొంతమంది పరిస్థితులనుబట్టి ఒంటరిగా ఉండిపోతున్నారు. ఏదేమైనా, క్రైస్తవులు ‘ఒంటరిగా ఉన్నా నేనెలా సంతోషంగా ఉండవచ్చు?’ అనే ప్రాముఖ్యమైన విషయం గురించి ఆలోచించాలి.

దేవుడు, యేసుకిచ్చిన బరువైన బాధ్యతల్ని పూర్తిచేయడానికి ఆయన పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయాడు. అది అర్థంచేసుకోదగ్గ విషయమే. అలాగే ఆయన శిష్యుల్లో కూడా కొందరు ఒంటరిగా జీవించడాన్ని ‘అంగీకరిస్తారని’ వారితో చెప్పాడు. (మత్త. 19:10-12) అంటే, ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండాలంటే అలాంటి జీవనవిధానాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలని యేసు మాటల అర్థం.

మరి, దేవుని సేవ ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకున్నవారికే యేసు మాటలు వర్తిస్తాయా? (1 కొరిం. 7:34, 35) అలా అనికాదు. పెళ్ళి చేసుకోవాలని ఉన్నా, తగిన జోడు దొరకనివారి విషయమే తీసుకోండి. 30వ పడిలో ఉన్నా పెళ్ళికాని సహోదరి అయిన ఆనా ఇలా చెప్పింది, “ఈమధ్యే యెహోవాసాక్షికాని ఒక తోటి ఉద్యోగి నన్ను పెళ్ళి చేసుకుంటానని అడిగాడు. అది విని నేనెంతో గొప్పగా ఫీలయ్యాను. కానీ నేను యెహోవాకు మరింత దగ్గరవ్వడానికి సహాయం చేసే వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వెంటనే తేరుకొని మనసు మార్చుకున్నాను.”

ఆనాలాగే “ప్రభువునందు” మాత్రమే పెళ్ళి చేసుకోవాలనే కోరిక ఉంటే, చాలామంది సహోదరీలు అవిశ్వాసులను పెళ్ళి చేసుకోకుండా ఉండగలుగుతారు. * (1 కొరిం. 7:39; 2 కొరిం. 6:14) దేవుని వాక్యంలోని మంచి సలహాను పాటిస్తూ వాళ్ళు తగిన సమయం వచ్చేవరకు ఒంటరి జీవితాన్ని అంగీకరిస్తారు. కానీ పెళ్ళి చేసుకోకపోయినా వాళ్ళెలా సంతోషంగా ఉండవచ్చు?

ఎలాంటి పరిస్థితిలోవున్నా దానిలోని మంచిని చూడండి

జీవితంలో మనమనుకున్నది జరగనప్పుడు, మంచిని చూసే స్వభావం మనకుంటే మనం నిరుత్సాహపడం. దీని గురించి చెబుతూ, 40వ పడిలో ఉన్నా ఇంకా పెళ్ళి చేసుకోని కార్మెన్‌ అనే సహోదరి, “నాకున్నదాన్నిబట్టి నేను సంతోషంగా ఉంటానుగానీ లేనివాటి గురించి కలలు కనను” అని అంది. మనకు కొన్ని కొన్నిసార్లు ఒంటరిగా, నిరుత్సాహంగా అనిపించవచ్చు. కానీ లోకంలో ఉన్న చాలామంది సహోదరులు కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారని తెలుసుకుంటే మనం ధైర్యంగా ముందుకు కొనసాగగలుగుతాం. ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉంటూ, సమస్యల్ని పరిష్కరించుకోవడానికి యెహోవా ఎంతోమందికి సహాయంచేశాడు.—1 పేతు. 5:9, 10.

చాలామంది క్రైస్తవ సహోదర సహోదరీలు ఒంటరిగా ఉంటూనే సంతోషంగా ఉండడమెలాగో తెలుసుకున్నారు. “మీరెలాంటి పరిస్థితుల్లో ఉన్నా దానిలో మంచిని చూడగలిగితే అదే మీ సంతోషానికి రహస్యం” అని 30వ పడిలో ఉన్న అవివాహిత సహోదరి ఎస్తర్‌ అంది. అలాగే సహోదరి కార్మెన్‌ ఇలా అంది, “పెళ్ళైనా, అవకపోయినా నేను దేవుని రాజ్య సేవకు మొదటి స్థానమిస్తే యెహోవా నాకు ఏ మేలు చేయకుండా మానడు అని నాకు తెలుసు. నా జీవితం నేను అనుకున్నట్టు లేకపోయినా నేను సంతోషంగానే ఉన్నాను, ఉంటాను కూడా.”—కీర్త. 84:11.

ఒంటరి జీవితాన్ని గడిపిన బైబిల్లోని వ్యక్తులు

యెఫ్తా కుమార్తె ఒంటరిగా ఉండాలనుకోలేదు. కానీ ఆమె తండ్రి చేసిన మొక్కుబడి వల్ల ఆమె యౌవనం నుండే దేవాలయంలో సేవచేయాల్సి వచ్చింది. అనుకోకుండా వచ్చిన ఈ మార్పువల్ల ఆమె జీవితాన్ని మార్చుకొని సహజంగా స్త్రీలకుండే కోరికలకు భిన్నంగా జీవించాల్సి వచ్చింది. తనకిక పెళ్ళేకాదు, పిల్లలు కూడా ఉండరు అని తెలుసుకున్నప్పుడు ఆమె రెండు నెలలు ప్రలాపించింది. అయినా, ఆ మార్పును మనస్ఫూర్తిగా అంగీకరించి తన శేష జీవితాన్ని దేవుని సేవలో గడిపింది. ఆమెను, ఆమె చేసిన త్యాగాన్ని ప్రశంసించడానికి ఇశ్రాయేలు స్త్రీలు ప్రతీ సంవత్సరం ఆమె దగ్గరకు వెళ్ళేవారు.—న్యాయా. 11:36-40.

యెషయా కాలంలో నపుంసకులు తమ పరిస్థితినిబట్టి బహుశా చాలా నిరుత్సాహపడి ఉంటారు. వాళ్లెందుకు నపుంసకులయ్యారో బైబిలు చెప్పడం లేదు. వాళ్ళలా ఉన్నందుకు ఇశ్రాయేలు సమాజంలో భాగం కాలేకపోయారు, అంతేకాదు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనలేకపోయారు. (ద్వితీ. 23:1) అయినా యెహోవా వారి బాధను అర్థంచేసుకుని వారు తన నిబంధనకు మనస్ఫూర్తిగా చూపిస్తున్న విధేయతను మెచ్చుకున్నాడు. వాళ్ళకు తన ఇంటిలో ‘ఒక భాగాన్ని, కొట్టివేయబడని నిత్యమైన పేరును’ ఇస్తానని చెప్పాడు. అంటే, నమ్మకంగా ఉన్న ఆ నపుంసకులకు యేసు మెస్సీయ పరిపాలనలో ఖచ్చితంగా నిత్య జీవితం దొరుకుతుంది. యెహోవా వాళ్ళను ఎప్పటికీ మరిచిపోడు.—యెష. 56:3-5.

యిర్మీయా పరిస్థితి పైన పేర్కొన్నవాళ్ళకు చాలా భిన్నంగా ఉంది. దేవుడు యిర్మీయాను ప్రవక్తగా నియమించిన తర్వాత, చుట్టూ ఉన్న ఉద్రిక్తమైన పరిస్థితులనుబట్టి, ఇవ్వబడిన బరువైన బాధ్యతలనుబట్టి పెళ్ళి చేసుకోవద్దని ఆజ్ఞాపించాడు. “ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొనకూడదు” అని యెహోవా చెప్పాడు. (యిర్మీ. 16:1-4) దేవుడలా అన్నప్పుడు యిర్మీయాకు ఎలా అనిపించిందో బైబిలు చెప్పడంలేదు కానీ ఆయనెప్పుడూ యెహోవా మాటలనుబట్టి ఆనందించేవాడు అని మాత్రం చెబుతోంది. (యిర్మీ. 15:16) కొన్ని సంవత్సరాల తర్వాత శత్రువులు భయంకరంగా యెరూషలేమును 18 నెలలపాటు ముట్టడించినప్పుడు, యెహోవా చెప్పినట్టు ఒంటరిగా ఉండడం ఎంత మేలు చేసిందో యిర్మీయా ఖచ్చితంగా అర్థంచేసుకొనివుంటాడు.—విలా. 4:4, 10.

సంతోషంగా ఉండడమెలా?

పైన ప్రస్తావించబడిన బైబిల్లోని వ్యక్తులు అవివాహితులు, అయినా యెహోవా వాళ్ళకు తోడైవుండడంతో వాళ్ళు ఆ సేవలో పూర్తిగా నిమగ్నులయ్యారు. అలాగే నేడు కూడా సరైన పనులు చేస్తూ ఎంతో సంతోషంగా ఉండవచ్చు. సువార్త ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉంటారని బైబిలు ప్రవచించింది. (కీర్త. 68:11) ఈ సైన్యంలో అవివాహిత సహోదరీలు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ పరిచర్య ఫలించడంతో చాలామందికి ఆధ్యాత్మిక కుమారులు, కుమార్తెలు దొరికారు.—మార్కు 10:29, 30; 1 థెస్స. 2:7, 8.

“పయినీరు సేవ చేయడంవల్ల నా జీవితాన్ని సరిగ్గా నిర్దేశించుకోగలుగుతున్నాను. నాకు పెళ్ళి కాలేదు కాబట్టి నేను ఎప్పుడూ ఏదోక పని చేస్తూ నా ఒంటరితనాన్ని కొంతవరకు మరచిపోగలుగుతున్నాను. నా పరిచర్యవల్ల ప్రజలు ప్రయోజనం పొందడాన్ని చూస్తున్నాను కాబట్టి ప్రతీరోజు నాకెంతో సంతృప్తిగా, ఎంతో ఆనందంగా ఉంటుంది” అని 14 సంవత్సరాలు పయినీరు సేవ చేసిన తర్వాత లోలి అనే అవివాహిత సహోదరి చెప్పింది.

చాలామంది సహోదరీలు కొత్త భాషను నేర్చుకుని వేరేభాష మాట్లాడే ప్రజలకు ప్రకటిస్తూ పరిచర్యను ఎక్కువగా చేస్తున్నారు. ముందు ప్రస్తావించబడిన ఆనాకు, ఫ్రెంచి మాట్లాడే ప్రజలను కలిసి వారికి సాక్ష్యమివ్వడమంటే ఎంతో ఇష్టం. ఆమె ఇలా అంటోంది, “నేనుండే పట్టణంలో వేలాదిమంది వేరే దేశస్థులు ఉన్నారు. వాళ్ళలో చాలామందితో మాట్లాడగలిగే వేరే భాష నేర్చుకోవడం వల్ల నాకొక కొత్త క్షేత్రం దొరికినట్లయింది. నా ప్రకటనా పని ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.”

పెళ్ళి కాని వాళ్ళకు ఎక్కువ బాధ్యతలు ఉండవు కాబట్టి అనేకమంది అవసరం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళి సేవచేస్తున్నారు. అలా చేసిన ఒక సహోదరి లిడియానా, ఆమె అవివాహిత, 30వ పడిలో ఉంది. ఆమె ఇలా చెబుతోంది, “మీరు ఎంత ఎక్కువగా యెహోవా సేవలో గడిపితే, అంత సులభంగా మంచి స్నేహితుల్ని సంపాదించుకుంటారు, ఇతరుల ప్రేమను పొందుతారని నా గట్టి నమ్మకం. వేర్వేరు నేపథ్యాల నుండి, దేశాల నుండి వచ్చినవాళ్ళలో మంచి స్నేహితులను సంపాదించుకున్నాను. అలాంటివాళ్ళు స్నేహితులుగా దొరికినందుకు నాకెంతో సంతోషంగా ఉంది.”

సువార్తికుడైన ఫిలిప్పు గురించి బైబిలు ప్రస్తావిస్తోంది. కన్యకలైన ఆయన నలుగురు కూతుళ్ళు ప్రవక్త్రినులుగా సేవచేసేవారు. (అపొ. 21:8, 9) వాళ్ళ నాన్నలాగే వాళ్లూ ఎంతో ఉత్సాహంగా పనిచేసివుంటారు. వాళ్ళు తమకున్న ప్రవచించే వరాన్ని కైసరయలో ఉన్న క్రైస్తవుల ప్రయోజనం కోసం ఉపయోగించారనే మనం అనుకోవచ్చు. (1 కొరిం. 14:1, 3) వాళ్ళలాగే నేడు అనేకమంది ఒంటరి సహోదరీలు క్రమంగా కూటాలకు హాజరవుతూ, కూటాల్లో భాగం వహిస్తూ ఇతరుల్ని ప్రోత్సహిస్తుంటారు.

మొదటి శతాబ్దంలో ఫిలిప్పీ సంఘానికి చెందిన లూదియ మరో మంచి ఉదాహరణ. ఆమె చూపించిన ఆతిథ్యాన్నిబట్టి బైబిలు ఆమెను మెచ్చుకుంటోంది. (అపొ. 16:14, 15, 40) లూదియ కన్యక లేదా విధవరాలు అయ్యుండొచ్చు. అయినా ఎంతో ఉదార స్వభావం ఉండడంవల్ల ఆమె పౌలు, సీల, లూకా వంటి ప్రయాణ పైవిచారణకర్తలతో సహవసించి ఎంతో ప్రయోజనం పొందింది. అలాంటి స్వభావం ఉంటే మనమూ ఆశీర్వాదాలను పొందుతాం.

ప్రేమను పొందాలనే కోరిక నెరవేరుతుంది

మీరెంత తీరిక లేకుండా సరైన పనులు చేస్తున్నా, ఇతరుల ప్రేమను పొందాలనే కోరిక మాత్రం తీరేది కాదు. మరి పెళ్ళికానివాళ్ళ విషయంలో ఆ కోరిక ఎలా తీరుతుంది? మనల్ని ప్రేమించడానికీ, బలపర్చడానికీ, ఆయనతో మాట్లాడుతుంటే వినడానికీ యెహోవా ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. దావీదు రాజు కూడా కొన్నిసార్లు తను ‘ఏకాకినని బాధపడుతూ’ ఉండేవాడు. కానీ సహాయం కోసం ఎప్పుడైనా యెహోవాను కోరవచ్చని ఆయనకు తెలుసు. (కీర్త. 25:16; 55:22) “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును” అని ఆయన రాశాడు. (కీర్త. 27:10) తన సేవకులందరూ తనకు దగ్గరవ్వాలని, తనకు మంచి స్నేహితులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు.—కీర్త. 25:14; యాకో. 2:23; 4:8.

అంతేకాదు, లోకంలో ఉన్న ఎంతోమంది సహోదర సహోదరీలను మనం మన తండ్రులుగా, తల్లులుగా, అన్నదమ్ముళ్ళుగా, అక్కచెల్లెళ్ళుగా చేసుకోవచ్చు. వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. అప్పుడు మనమెంతో సంతోషిస్తాం. (మత్త. 19:29; 1 పేతు. 2:17) “సత్క్రియలను ధర్మకార్యములను బహుగా” చేసిన దొర్కా మాదిరిని పాటిస్తూ చాలామంది ఒంటరి సహోదరీలు ఎంతో సంతోషాన్ని పొందుతున్నారు. (అపొ. 9:36, 39) లోలి ఇలా అంటోంది, “నేనెక్కడికెళ్ళినా, సంఘంలో నన్ను ప్రేమించి, బాధలో ఉంటే ఓదార్చే మంచి స్నేహితుల కోసం వెదుకుతాను. మామధ్య స్నేహం బలపడేలా వాళ్ళపట్ల నేను ప్రేమ, శ్రద్ధ చూపిస్తాను. నేనింతవరకు ఎనిమిది సంఘాల్లో సేవచేశాను. అన్నిచోట్లా మంచి స్నేహితులు దొరికారు. నాకు దొరికినవాళ్లంతా నా వయసువాళ్లేం కాదు. కొందరు అమ్మమ్మల్లాంటివాళ్ళైతే ఇంకొంతమంది టీనేజీ పిల్లలు.” ప్రతీ సంఘంలో ఆప్యాయతను, స్నేహితులను కోరుకునేవాళ్లుంటారు. వాళ్ళపట్ల మనం నిజమైన ప్రేమ, శ్రద్ధ చూపిస్తే వాళ్ళెంతో సంతోషిస్తారు. అంతేకాదు ప్రేమనందిస్తూ, ప్రేమ పొందాలనే మన కోరిక కూడా తీరుతుంది.—లూకా 6:38.

దేవుడు ఎన్నటికీ మరిచిపోడు

మనం కష్ట కాలాల్లో జీవిస్తున్నాం కాబట్టి క్రైస్తవులందరూ ఏదోకవిధంగా త్యాగాలు చేయాల్సి ఉంటుందని బైబిలు చెబుతోంది. (1 కొరిం. 7:29-31) ప్రభువునందే పెళ్ళిచేసుకోవాలనే దైవాజ్ఞకు కట్టుబడివుండాలని పెళ్ళిచేసుకోనివాళ్ళకు మనం ప్రత్యేక గౌరవాన్నిస్తూ వారి గురించి ఆలోచించాలి. (మత్త. 19:12) ఇంత గొప్ప త్యాగం చేశారన్నది నిజమే అయినా వాళ్ళు జీవితాన్ని సంతోషంగా గడపలేరన్నది మాత్రం నిజం కాదు.

“నేను యెహోవాకు దగ్గరగా ఉంటూ, ఆయనను సేవిస్తూ ఎంతో సంతృప్తిగా జీవిస్తున్నాను. పెళ్ళైన వాళ్ళలో కూడా సంతోషంగా ఉన్నవాళ్ళను, సంతోషంగా లేనివాళ్ళను చూశాను. కాబట్టి, నేను పెళ్ళి చేసుకుంటేనే సంతోషంగా ఉంటానన్నది నిజం కాదని తెలుసుకున్నాను” అని లిడియానా చెప్పింది. యేసు చెప్పినట్టుగా మనకున్నదాన్ని ఇతరులతో పంచుకోవడంలో, వాళ్ళకు సహాయంచేయడంలో సంతోషం ఉంది. క్రైస్తవులందరూ అలాగే చేస్తూ సంతోషంగా ఉండవచ్చు.—యోహా. 13:14-17; అపొ. 20:35.

మరి ముఖ్యంగా, యెహోవా చిత్తం చేయడానికి మనం ఎలాంటి త్యాగాలు చేసినా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అని తెలిసినప్పుడు మనకు కలిగే సంతోషం అమితమైనది. “మీరు చేసిన కార్యమును, . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు” అని బైబిలు మనకు హామీ ఇస్తోంది.—హెబ్రీ. 6:10.

[అధస్సూచి]

^ పేరా 6 ఈ ఆర్టికల్‌లో మేము ప్రత్యేకంగా క్రైస్తవ సహోదరీల గురించే మాట్లాడుతున్నా ఇందులోని విషయాలు సహోదరులకు కూడా వర్తిస్తాయి.

[25వ పేజీలోని బ్లర్బ్‌]

“నాకున్నదాన్నిబట్టి నేను సంతోషంగా ఉంటానుగానీ లేనివాటి గురించి కలలు కనను”—కార్మెన్‌

[26వ పేజీలోని చిత్రం]

అవసరం ఎక్కువగా ఉన్నచోట సేవచేస్తూ లోలి, లిడియానా ఎంతో సంతోషంగా ఉన్నారు

[27వ పేజీలోని చిత్రం]

తన సేవకులందరూ తనకు దగ్గరవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు